Showing posts with label కొత్త కోయిల స్వరాలు. Show all posts
Showing posts with label కొత్త కోయిల స్వరాలు. Show all posts

Wednesday, December 12, 2012

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..


మనం ఎప్పుడైనా ఎవరికైనా కోపం తెప్పించాం అనుకోండి. అబ్బా.. అంటే ఊర్లో వాళ్ళందరికీ కాదులెండి.. మనల్ని అమితంగా ప్రేమించే వాళ్ళూ, మనం ప్రేమించే వాళ్ళూ అయిన మన ఇంట్లో వాళ్ళో, ప్రాణ స్నేహితులో.. ఇలాంటి వాళ్లకి ఎప్పుడైనా కోపం తెప్పించామనుకోండి. అప్పుడా కోపం పోగొట్టాల్సిన బాధ్యత కూడా మనదే కదా.. అప్పుడేం చేస్తాం? ఎలాగోలా బతిమాలో బామాలో వాళ్ళ అలక తీర్చడానికి ప్రయత్నిస్తాం. ముందు "నువ్వు బంగారు కొండవి, వజ్రాల తునకవి, వరాల మూటవి.." అని బోల్డు పొగిడేస్తాం. అవన్నీ ఉత్తి పొగడ్తలు అని తెలుస్తున్నా వాళ్ళ కోపం పోగొట్టడానికి మనం పడుతున్న తాపత్రయం చూసి  కోపమొచ్చిన వాళ్ళకి కూడా కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. కానీ అప్పుడే కోపం మాత్రం పోదు. ఇంకా మొహం అలా ఉమ్మ్.. అని పెట్టుకు చూస్తుంటారు బింకంగా. అప్పుడేం చేస్తాం మరింక.. ఉహూ.. ఇలా పొగడ్తలతో కాదని చెప్పి నిజంగా వాళ్ళు మనకెంత అపురూపమో, వాళ్ళ మీద మనకెంత ప్రేముందో, వాళ్ళు దూరం అయితే మనకి ఎంత బాధ అవుతుందో చెప్పడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాం. మనం ఎలాంటి మాటల్లో చెప్పినా సరే మాటల వెనకున్న నిజమైన ప్రేమలోని ఆప్యాయపు తడి వాళ్ళని తాకుతుంది. నిజాయితీగానే వాళ్ళ కోసం బెంగపడుతున్నామని, బోల్డు ప్రేమగా బతిమాలుతున్నామని గ్రహించి మనం దిగులు పడుతూ ఉంటే ఇంక చూడలేక కోపమంతా కరిగించేసి కిలకిలా నవ్వేస్తారు. ఇంకేముంది.. అప్పుడింక కథ సుఖాంతమే కదా! :-)

సరిగ్గా ఇలాంటి సన్నివేశం ప్రేమలో ఉన్న జంటకి వస్తే వాళ్ళిద్దరి మధ్యన జరిగే మాటల్ని అందమైన పాటలా రాస్తే ఇదిగో పాటలా ఉంటుందన్నమాట. పాట తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకూ నాకూ డాష్ డాష్' అనే సినిమాలోది. సినిమా పేరు కొంచెం తేడాగా ఉంది గానీ పాట మాత్రం బాగుంటుంది. సినిమా గురించి నాకస్సలేం తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఒకోసారి కొన్ని పాటలు విన్నప్పుడు చాలా నచ్చుతాయి. పొరపాటున సినిమానో, వీడియోలో చూసామంటే అప్పటి దాకా పాట మీద ఉన్న ఇష్టం కూడా పోయే ప్రమాదం ఉంది. అంత భయపెట్టేస్తాయి మరి. అంచేత సినిమా చూసే ధైర్యం చెయ్యలేను మరి. కానీ, మీకు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాలని ఉంటే మాత్రం సినిమా గురించి రాజ్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి. :-)

సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన యశ్వంత్ నాగ్ ఇందులో కొన్ని పాటలు కూడా పాడాడు. పాట మాత్రం నరేష్ అయ్యర్, చిన్మయి చాలా చక్కగా పాడారు. రాసిందెవరో మాత్రం తెలీలేదు. సినిమా పాటల సాహిత్యం అంతా సాయి ఆనంద్, బాలాజీ అనే ముగ్గురు రాసారట. వాళ్ళ ముగ్గురిలో పాట ఎవరు రాసారో తెలీదు మరి.
సినిమా జోలికి వెళ్ళకుండా కేవలం పాటలు మాత్రం విని చూడండి. నచ్చే అవకాశం ఉంది.. "నువ్వే నేనననా. నేనే నీవననా..", "ప్రాణం అని తలచి.." అనే రెండు పాటలు కూడా బాగుంటాయి.

నేను చెప్తున్న పాట సాహిత్యం ఇదే..

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..
నా కన్నుల్లో బొమ్మవి నువ్వు.. నా గుండెల్లో తోడువి నువ్వు..
నాలో ఉన్నది ప్రతి అణువూ నీ ప్రేమా..
నా పెదవుల్లో మాటవు నువ్వు.. నా అడుగుల్లో నడకవు నువ్వు..
నీలో నాలో ఉన్నది ఒకటే ప్రేమా..

నిన్ను చూస్తూ ఉంటే చాలు.. చిన్నబోవా మందారాలు..
వెన్నెలంతా మూట కడితే నువ్వే అంటాను..
చేతిలోనే చెయ్యే వేసి నీడలా నువ్వుంటే చాలు..
ఇంతలాగా వెంటపడుతూ పొగడొద్దంటాను..
నీ నీలి కళ్ళే నీలాకాశం అంటున్నా.. కలనైనా నిన్ను వదిలి ఒంటరిగా లేను..
లోకమంతా నన్నే కాదని అనుకున్నా.. నా లోకమే ఇక నీవని నిన్నే చేరనా..
మంచువో మత్తువో.. ఎదను వదలదు నీ ధ్యాస..
హాయివో మాయవో.. మనసు కదలదు నువ్వు లేక..
మంత్రమేసావిలా....

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..

నీటిలో చిరు ముత్యం లాగా.. నేలపై తొలి పచ్చిక లాగా..
నువ్విలా నా పక్కన ఉంటే ఎంతో ఆనందం..
రామచిలుకకి గోరింకల్లే.. తార పక్కన చంద్రుడి మల్లే..
ఇద్దరం ఒకటైపోతే ఇంకెంతో అందం..
నీ కళ్ళతోనే లోకం మొత్తం చూస్తున్నా.. ప్రతి నిమిషం నీతో గడిపేస్తూ ఉన్నా..
నీ మాటలోనే తియ్యని భాషే వింటున్నా.. కలవరించి నీ పేరే జపమే చేస్తున్నా..
ఊపిరే నీదిలే.. నన్ను కాదని అనకెపుడూ..
ప్రాణమే లేదులే.. నువ్వు జంటగ లేనప్పుడు..
నూరేళ్ళు సాగేందుకూ....

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..

Monday, December 27, 2010

నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు..

మెలోడీస్ ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఇప్పుడు కొత్తగా వస్తున్న తెలుగు సినిమా పాటలు నచ్చడం అరుదుగా జరిగే విషయం. ఈ మధ్యన కొత్తగా విన్న ఒక మంచి పాటని గురించే ఇప్పుడు చెప్తున్నా! ఈ పాట మంచు విష్ణు, తాప్సీ నటించిన 'వస్తాడు నా రాజు' అనే సినిమాలో పాట. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించగా, మణిశర్మ సంగీత దర్శకత్వంలో సాకేత్, సైంధవి పాడారు. పాటలో సంగీతం, సాహిత్యం, స్వరాలూ అన్నీ కూడా మృదువుగా, మంద్రంగా సాగుతూ కొబ్బరాకు మీది నుంచి వచ్చే సన్నటి గాలి తెమ్మెర మాదిరి అలా అలా మెల్లగా తాకినట్టు అనిపిస్తుంది. మొదటిసారి వినగానే నచ్చేసింది నాకీ పాట.

నాకైతే ఈ పాట అంత ఆకర్షణీయంగా వినిపించడానికి సైంధవి గొంతే కారణం అనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరులాగానే స్వరంలో కూడా కాస్తంత ప్రత్యేకంగా వినిపించే మాధుర్యమేదో ఉందనిపిస్తుంది నాకు. తను పాడిన పాటలు నాకు తెలిసినివి కొన్నే అయినా, దాదాపు అన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. ఉదాహరణకి ఇదే సినిమాలో 'కలగనే వేళ' అనే పాట, ఆవకాయ్ బిర్యాని సినిమాలో 'మామిడి కొమ్మకి' పాట, శశిరేఖాపరిణయం సినిమాలో 'ఏదో ఏదో' అనే రెండు చిన్న పాటలూ, ఆవారా అనే తమిళ డబ్బింగ్ సినిమాలో 'అరెరే వానా', పరుగు సినిమాలో 'ఎలగెలగా' అనే పాట..ఇలాంటివన్నమాట! పాటలో రెండో చరణం పాడిన సాకేత్ కూడా చాలా సున్నితంగా పాడాడు.

సాహిత్యం గమనిస్తూ పాట సందర్భం గురించి ఊహిస్తే.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకరి మనసులో ప్రేమ ఇంకొకరికి చెప్పుకోకుండా ఉండిపోయి, తరవాత ఒకరికొకరు దూరమయ్యాక తలపుల్లో కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్కుంటూ ఒకరినొకరు చూడాలని తపిస్తూ పాడుకునే పాటలా అనిపిస్తోంది. అలా ఇద్దరూ పాడుకుంటూ.. పాట అయిపోయేసరికి వారిద్దరి మధ్యనున్న దూరాన్ని యిట్టే కరిగించేస్తూ అబ్బాయి వచ్చి అమ్మాయి కళ్ళెదుట ప్రత్యక్షమౌతాడేమోనని నేను ఊహిస్తున్నా! ;) ఈ పాటని ఎలా చిత్రీకరించి ఉంటారో తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే!

పాట మొత్తంలోకీ 'ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..' అని వచ్చేప్పుడు నాకు భలే నచ్చేసింది. మీరూ ఓసారి విని చూడండి. మెలోడీస్ ని ఇష్టపడే వారు తప్పకుండా ఓసారి విని చూడాల్సిన పాట! :)

అమ్మాయి:
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..
ఎక్కడ నేనున్నా నా పక్కనే ఉంటావు... పక్కన ఉంటూనే నన్ను ఒంటరి చేశావు...
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..

ఎన్నో అనుకున్నా.. ఏదీ నీతో అనలేదే!
ఏవో కలలు గన్నా.. నీతో పంచుకోలేదే!
సమయం కొనసాగదే.. హృదయం కదలాడదే నువు నువ్వు లేకుంటే..
మనసేమో పదే పదే నీతో జ్ఞాపకాలనే గురుతుకు తెస్తుందే..
ప్రాణం నలిగినా ప్రేమకు ఇకపై ఆశలన్నీ నీ మీదే..
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..
అబ్బాయి:
ప్రేమ.. తొలిప్రేమ.. నీ చిరునామా ఏదంటూ...
నిన్నే వెదుకుతున్నా... నువ్వే దారి చూపించు...
కసిరే నడిరాతిరి ఎటుగా నిను దాచినా చేరగలేనా!
లోకం నలువైపులా ఆపే గిరి గీసినా దూసుకురాలేనా!
జతగా నడిచినా నిన్నటి అడుగే నీకోసం వస్తున్నా!
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..

Friday, July 09, 2010

శుభప్రదం - సుస్వర రాగరంజితం!

చాలా చాలా రోజుల తరవాత కొత్త సినిమా పాటలన్నీ వినగానే తెగ నచ్చేసాయి నాకు. అది కూడా భాష పరంగా, సంగీత పరంగా, సాహిత్య పరంగా, గాత్ర పరంగా.. ఇలా అన్నీ రకాలుగా హాయిగా అనిపించింది వింటుంటే. అలా పాటలు వింటూ వింటూ నా మనసుకి అనిపించిన భావాలని మీతో పంచుకుంటూ.. మిమ్మల్ని కాస్తంత ఊరించి ..మీరు కూడా వినేలా చేద్దామనే నా యీ ప్రయత్నం. అచ్చ తెలుగు పదాలు సుస్పష్టంగా, తియ్యగా పలుకుతూ, చక్కటి భావంతో నిండిన తెలుగు పాటలంటే మీకు ఆసక్తి ఉంటే యీ పోస్టు చదవండి. :-)

'
కళాతపస్వి' కె. విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన 'శుభప్రదం' అనే సినిమా రాబోతోంది. 'అల్లరి' నరేష్, మంజరి నటించిన యీ సినిమా పాటలు ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. నేను మాట్లాడుతోంది యీ సినిమా గురించే. ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా చెవులకి ఇంపుగా అనిపించే శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు మణిశర్మ గారు. పాటలన్నీ కూడా సందర్భోచితంగా రాసుంటారని నాకనిపించింది. పాటలన్నీటిలో కూడా కేవలం సంగీత సాహిత్యాలకే కాకుండా భాషాప్రయోగానికీ, సంప్రదాయానికీ కూడా పెద్ద పీట వేసారని నాకనిపించింది. ప్రతీ పాట, ప్రతీ వాక్యం, ప్రతీ పదం.. ఇలా ప్రతీ చోటా విశ్వనాథ్ గారు కనిపించారు నాకైతే! :-)



యీ పాట మొదలవగానే చెవిలో తేనె పోసినట్టు మన బాలు గారి స్వరం వినిపిస్తుంది "మౌనమే చెబుతోంది.. నీ మౌనమే చెబుతోంది.. మాట నీ మాటున దాగుందో.." అంటూ. అనడం వెనకాల అల్లరితో నిండిన కొంటె నవ్వు సన్నగా వినిపిస్తుంటే.. అబ్బ ఎంత బాగుందో వినడానికి. :-) నిజంగా బాలు గారు గంధర్వుడే.. అలా కాకపోతే ఎన్నేళ్ళయినా గొంతులో తియ్యదనం కొంచెమైనా తగ్గకుండా ఎలా ఉంటుంది!? చాలా రోజుల తరవాత బాలు గారి గొంతులో ప్రేమ గీతం వినడం కూడా కారణమేనేమో.. చాలా హాయిగా అనిపిస్తుంది యీ పాట వింటుంటే. ఆయనకి ధీటుగా "మౌనమే చెబుతోందా.. నా మౌనమే చెబుతోందా.. మాట నా మాటున దాగుందో.." అంటూ భలే గారంగా పాడింది ప్రణవి.
యువరచయిత అనంత్ శ్రీరామ్ రాసిన యీ పాట సాహిత్యం చాలా బాగుంది. మచ్చుకి కొన్ని వాక్యాలు చూపిస్తున్నా!
"వేసే ప్రతీ అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ..
పలికే ప్రతి పలుకు భాషకి చెబుతోంది.. శ్వాస చెప్పే ప్రేమ భాష్యం వినమంటూ..
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది.. ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని.."



కార్తీక్, సునీత పాడిన ఇంకో యుగళ గీతం "నీ నవ్వే కడదాకా నా కలిమి.. యీ నువ్వే కొసదాకా నా బలిమి" అంటూ సాగుతుంది. పైన పాటలాగే యీ పాటలో కూడా గాత్రంతోనే భావం పలికించారు. ఎంతలా అంటే.. పాట వింటుంటే అప్రయత్నంగానే మన ఊహల్లోకి వాళ్ళ మోము వచ్చేస్తుంది.
మాటలు కోటలు దాటిస్తూ, మాటల గారడీతో మురిపించి మైమరపించే చెలికాడిని ముద్దుగా విసుక్కుందాం అన్నట్టు మాట అంటూనే.. అంతలోనే ఎందుకో కనీసం నిన్ను కోప్పడదామన్నా కోపమే రాదు అంటుంది అమ్మాయి. అదెలాగంటే... ఇదిగో ఇలాంటి మాటలతో...
"తిమ్మిని బమ్మిని చేసే తెలివికి లేదే లేమి... నీ కొంటెతనానికి నాక్కొంచెమైనా కోపం రాదేమీ!"
"హబ్బా... కాలికి వేస్తే మెడకేసే తమ ఇచ్చకాలకేమి... గడుసుదనానికి కొంచెమైనా నాక్కోపం రాదేమీ!"
How romantic కదా! సిరివెన్నెల గారు అమ్మాయి, అబ్బాయి మనసుల్లోకి దూరిపోయి చూసి వచ్చినట్టే రాశారు యీ పాటని ;-)



ముద్దుల కృష్ణుడి మీద రాసిన "తప్పట్లోయ్.. తాళాలోయ్" అంటూ సాగే యీ పాట చైత్ర పాడింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంలో కృష్ణుడు మరింత ముద్దుగా కనిపిస్తాడు. మచ్చుకి రెండు పంక్తులు చూడండి.
"నలుదిక్కుల చీకటినంతా.. తన మేనిలో దాచిన వింతా.. కడువిందుగా వెలుగులు చిందెను మా కన్నుల్లో..
ఆనంద ముకుందుని చేత అంతర్యము అణువణువంతా మధునందనమాయెను తన్మయ తారంగంలో.."
కృష్ణయ్యని ప్రేమించే వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుందీ పాట. :-)



"యేలో యేలో యేలాల..." అనే పాట బాలు గారు, శంకర్ మహదేవన్ గారు కలిసి పాడారంటే ఎంత వీనుల విందుగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాశారు యీ పాటని.
"ఆవునైన అమ్మా.. అని కొలిచే నేల... జీవుడిలో దేవుడిని సూసే నేల.." అంటూ మన వేదభూమి, మాతృభూమి గురించి సాగుతుంది యీ పాట.
" జీవికైనా సుస్వరం వినాలనే కోరికగా ఉంటే... వేదభూమిలో అణువణువూ నాదమయం, యీ నాదభూమిలో ప్రతి తనువూ రాగమయం.." అంటూ బాలు గారు ఎంత తియ్యగా పాడారో!
"నిను పెంచిన భూమి నిత్యం అనునిత్యం తను కోరేదొకటే.. లోకాః సమస్తాః సుఖినోభవంతు.." అంటూ ముగిసే యీ పాట వింటుంటే నాకు 'స్వర్ణకమలం' పాటలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా 'అందెల రవళికి' పాటలో వచ్చే గురుబ్రహ్మ శ్లోకం, అలాగే 'శివ పూజకి చివురించిన' పాటలో చివరలో వచ్చే 'స్వధర్మే నిధనం శ్రేయః' శ్లోకం గుర్తొచ్చింది. :-)



మన కర్మభూమి గొప్పతనం గురించి పైన పాట చెప్తే... ఇప్పటి యువత రాస్తున్న నేటి చరిత్రని గురించి "ఓరిమి చాలమ్మా భూమాతా.." అనే యీ పాట వినిపిస్తుంది. సిరివెన్నెల గారు ప్రస్తుత పరిస్థితి కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే ఇలా అయితే మన భవిత ఏంటని నిలదీస్తారు యీ పాటలో. రీటా పాడిన యీ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. :-( యీ పాట నుంచి మచ్చుకి కొన్ని వాక్యాలు..
"వికృత క్రీడల వింత వినోదం.. రక్కసి కేకల రణం నినాదం.. మెదడుకి చెదబట్టిన ఉన్మాదం.. బడి నేర్పినదీ చెడు పాఠం..ఏం చేస్తున్నది యువత.. ఏం చూస్తున్నది మానవతా.."
"సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రీ.. ప్రశ్నించని గాంధారి అయితే ప్రతి తల్లీ.. ఎవ్వరు నడపాలి ఈనాటి యువతరాన్ని..."



" అంబాపరాకు దేవీపరాకు" అనే చిన్న పాట శాస్త్రీయ నృత్యం కోసం పాడిన పాటలా నాకు అనిపించింది. రచయిత పేరేమీ వేయకుండా సంప్రదాయ సాహిత్యం అని వేశారు. యీ పాట హాయిగా తాళం వేసుకుంటూ వినచ్చు. మనకి వస్తే పదం కూడా కదపచ్చు ;-)

"బైలెల్లే బైలెల్లే పల్లకీ.." అనే యీ పాట మల్లికార్జున్, విజయలక్ష్మి, మాళవిక పాడారు. రామ్ భట్ల రాసిన యీ పాట భక్తిరసంతో నింపిన పాట. ఇది కూడా బాగానే ఉంది. యీ పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ వినగానే నాకు "ఆ అంటే అమలాపురం" గుర్తొచ్చింది.jelir



మొత్తం మీద యీ పాటలంత అందంగా, ఆహ్లాదంగా సినిమా కూడా ఉండి ఉంటుందని నేను ఆశిస్తూ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా!