Showing posts with label మేఘసందేశం. Show all posts
Showing posts with label మేఘసందేశం. Show all posts

Wednesday, March 13, 2013

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా..


ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా.. ఏకాకిని నా ప్రియా..
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా..
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా.. ప్రియా.. ప్రియా..

ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ..


దారులన్నియు మూసె దశ దిశలు ముంచెత్తె..
నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ..
ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల..
తమస్వినీ గర్భకుహరాల..

లోకమంతా పాకినవి పగటి వెలుగులు..
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు.. రాకాసి చీకట్ల మూలుగులు..


ఎపుడు నీ పిలుపు వినబడదో అపుడు నా అడుగు పడదు.. 
ఎచటికో పైనమెరుగక ఎందుకో వైనమందక నా అడుగు పడదు..

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన కావ్యమౌను మరియు గానమౌను..
నేటి బాధ నన్ను మాటాడగానీని.. ప్రళయమట్లు వచ్చి పడియె పైని..


~~~~~~~~~~~~

ఏ విశేషమూ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతున్న ఓ మనిషి జీవితంలోకి అకస్మాత్తుగా ఓ ఇంతి ప్రత్యక్షమై అతనికే తెలియకుండా అతనిలో దాగున్న ఓ భావకవిని మేల్కొలిపింది. అంతలోనే అంతర్ధానమైపోయిన ఆమె వియోగంతో అతని వేదనలోంచి ఇదిగో ఈ విరహ కావ్యం జనించిందట. ప్రియురాలికై అతగాడు రచించిన ఆ కవితలన్నీటిని ఏర్చి కూర్చి మేఘసందేశం అనే ఖండకావ్యంలా అచ్చు వేయించారట.

అయ్యా కవి గారూ.. మీ కావ్యం గురించి చెప్పండి అని అడిగితే నా ప్రేయసి వల్లనే ఇది ప్రాణం పోసుకొంది కావున నా అప్రాప్త మనోహరికే ఈ కావ్యం అంకితం అని ఇలా చెప్పారుట.

~~~~~~~~~~~~

అది ఒకానొక మలు సందె ఎదుట..
గౌతమీ నది ఇరు దరులొరసి మింటి చాయలను నెమరు వేసుకొనుచు సాగినది..
అపుడు.. అపుడే.... కలిగె నాకొక్క దివ్యానుభూతి.. కలిగె నాకొక్క దివ్యానుభూతి..

శూన్యాకాశము వలె చైతన్యలవము లేని బ్రతుకు దారుల
శోభానన్యంబు ఒక శంపాలత కన్యక తొలివలపు వోలె కాంతులు నించెన్..

అంతరాంతరమున వింత కాంతి నిండి..
ఊహలకు రెక్కలొచ్చి.. ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె..
అలతి కవితలు వెలువడే..
అంతలోన.....
కనుమొరగిచనెమెరపు చీకటులు మిగిలె..
అపుడు ఎలుగెత్తి పిలిచినాను..
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను.. రోదించినాను..
వెదకి వెదకి వేసారితి.. వెర్రినైతి..


ఆశలు రాలి ధూళి పడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము వ్రేల్చినప్పుడు..
వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశము రక్తబిందువులలో రచియించితి నేను.. 
మేఘసందేశము రూపు దాల్చినది నేడు.. ఇది ఏమి మహా కవిత్వమో!

~~~~~~~~~~~~
అంతటి వియోగ బాధ అనుభవించాక కొన్నాళ్ళకి మళ్ళీ ఆ ప్రేమికులిద్దరూ కలుసుకున్నారట. లోకమంతటికీ వారి అనుబంధం ఓ ప్రశ్నార్థకంలా మిగిలిపోయినా వారిరువురూ మాత్రం ఈ లోకాన్ని పూర్తిగా త్యజించి చివరిదాకా తమదైన భావప్రపంచంలో సంపూర్ణంగా జీవించారుట. ఒకే ఆత్మలా జీవించిన వారిరువురూ ఒక్కసారే జంటగా ప్రాణం విడిచారుట.

పూవు తావి వలె పదము భావము వలె కలిసిపోయిన అరుదు జంటలకు ఒక్కటే ప్రాణనాడి..
తనువులు వేరైన గాని బ్రతుకులో మృతిలో ఎడబాటు లేదు..


~~~~~~~~~~~~

ఈ కథేంటో గుర్తొచ్చేసిందా ? :-)
1983
లో దాసరి నారాయణరావు గారి స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'మేఘ సందేశం' సినిమా కథ. ఈ సినిమాలో అద్భుతమైన పాటలతో పాటు అందమైన పద్యాలు కూడా ఉన్నాయి. పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ఈ పద్యాలన్నీ సినిమాలో సందర్భానుసారంగా ఏసుదాస్ గారి గళంలో మరింత మధురంగా వినిపిస్తాయి.

గోదారొడ్డున సూర్యోదయాన్ని రెండే వాక్యాల్లో ఎంతందంగా వర్ణించారో చూడండి.

ఉదయగిరి పైన అదిగొ గగనాన కదలె దినరాజు తేరు..
ఒదిగి చిరుగాలి నిదుర తెర జారి కదలె గోదారి నీరు.. కదలె గోదారి నీరు..

కవిహృదయం గురించి... 

శోకమొకటియె కాదు సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ..
కరుణ ఒకటియే కాదు రసము జీవితమున..
కవికి వలయు ఎన్నో వివిధానుభూతులు ఎడద నిండా..


నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై..
నా మన్కియే పూవులున్ కాయల్ పండ్లును నిండు నందనముగా నైనన్.. 
వ్యథావేదనల్ మాయంబై సుఖశాంత జీవనము సంప్రాప్తించి పూర్ణుండనై..
వ్రాయంజాలుదు మానవానుభవదివ్యత్కావ్య సందోహమున్..


~~~~~~~~~~~~

ఆడియోలో విన్న అన్నీ పద్యాలు నేను చూసిన డీవీడీ లో లేవు. కథానుసారం కావాలని వదిలేసారో లేకపోతే ఆ డీవీడీలో లేవో తెలియదు. అలతి అలతి పదాల్లో ఒదిగిన అందమైన కవిత్వం ఏసుదాస్ గారి మధుర గళంలో వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది.


Wednesday, January 11, 2012

నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ!


నా స్వామీ..
నిన్నే నా తనుమనఃప్రాణాల్లో నింపుకుని, నీ మీదే ధ్యాస నిలిపి, సదా నిన్నే స్మరిస్తూ నీ రాక కోసమై ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను కన్నులారా చూడగలిగే మధుర క్షణం ఎప్పుడొస్తుందోనని వేయి కన్నులతో నిరీక్షించే నాకు నువ్వు అరుదెంచే ఆ అపురూప ఘడియేదో కాస్తంత ముందుగా తెలిసుంటే ఈ మందిరాన్ని ఇలా ఉంచేదాన్నా స్వామీ!
సుందర సుమధుర సుగంధ పుష్పాలెన్నిటినో తెచ్చి నీకు స్వాగతం పలుకుతూ పూలదారిని సిద్ధం చేద్దును కదా! నా ఇంటి వాకిట నీ పాదపూజకై నియోగించబడిన పారిజాతాలపైన క్షణమైనా నిలిచే నీ అడుగుల గురుతులే నాకు అమూల్యం కదా!
బ్రతుకంతా నీ నిరీక్షణలోనే గడుపుతూ ఎంతగా ఎదురుచూసినా ఎదుటకి రావు.. నీ తలపుల తాకిడికి బరువెక్కిన కనురెప్పలు అలా అరక్షణం సేపు ఆదమరుపుగా కన్నంటుకున్న క్షణాన్నే వచ్చి వెనువెంటనే మాయమైపోతావు. తక్షణం నే తెలివి తెచ్చుకుని కలలో కాదు ఇలలోనే నా కళ్ళెదురుగానే నా స్వామివి నువ్వు సాక్షాత్కారించావని గ్రహించి.. ఎన్నటికీ నీ సాంగత్యాన్ని నాకు అనుగ్రహించమని, మన ఈ కలయికని శాశ్వతం చెయ్యమని అర్థిస్తూ నిన్ను నా చెంతనే నిలపడానికనైనా సరే నా ప్రేమతో నిన్ను క్షణమైనా బంధించలేని అశక్తురాలను స్వామీ!
కాస్త ముందు తెలిసెనా ప్రభూ.. నువ్వు నన్ను చేరే మధుర క్షణమిదనీ..!

అసలు ఎంత అపురూపమైన భావన.. ఎంత అందమైన వ్యక్తీకరణ కదూ! ఇంతందమైన దేవులపల్లి వారి కవిత్వానికి రమేష్ నాయుడు గారి సుస్వర సంగీతమూ, సుశీల గారి అమృత గళం జోడైతే మరిహ చెప్పేదేముంది.. అలా ఆ పాట వింటూంటే మన మనసులో స్వర్గలోకపు పరిమళాన్ని నింపుతూ పారిజాతాల వాన కురిసినట్టుంటుంది. ఒకటీ, పదీ, వంద సార్లు విన్నాగానీ విన్న ప్రతీసారీ అదే తన్మయత్వంలో పడిపోతుంటాన్నేను.

1983
లో దాసరి నారాయణ రావు గారి స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'మేఘ సందేశం' సినిమాలోని 'ముందు తెలిసెనా ప్రభూ..' అనే పల్లవితో సాగే పాట ఇది. ఈ సినిమాలో ఆకాశ దేశాన, ఆకులో ఆకునై రెండు పాటలు తప్ప మిగతావి ఎప్పుడూ వినలేదు నేను. ఒక ఆర్నెల్ల క్రితమనుకుంటాను మొదటిసారి ఈ సినిమాలోని పాటలన్నీ విన్నాను. అప్పటి నుంచీ దాదాపు ప్రతీ రోజూ ఈ పాటలు వింటూనే ఉన్నా.. మరీ ముఖ్యంగా ఈ పాటైతే మళ్ళీ మళ్ళీ ఇప్పటికి ఎన్ని వందలసార్లు విన్నానో.. ఇంకా ఇంకా వింటూనే ఉన్నా!
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా..
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే..
సుందర మందార కుంద సుమదళములు పరువనా..
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై..
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును..
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ..
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు..
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు..
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ..
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి..
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా..
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
కృష్ణశాస్త్రి గారి పేరు వినగానే భావకవిత్వం గుర్తొస్తుంది. ఎప్పుడో కాలేజీలో ఏదో తెలుగు పాఠంలో ఆయన కవిత ఒకటి చూడటం తప్పించి ఆయన కవిత్వంతో నాకు ఎక్కువ పరిచయం లేదు. మొదటిసారి ఈ సినిమా పాటలన్నీ వరసగా విన్నప్పుడు అన్నీటి కన్నా నన్ను ఎక్కువ ఆకర్షించిందీ, ఆకట్టుకుంది దేవులపల్లి వారు రాసిన పాటలే. అసలెంత చిక్కటి భావగాఢత, అంతే లాలిత్యం, అంతే అందమైన పదబంధాలు.. ఆస్వాదించడం, అనుభవించడం తప్ప మాటల్లో ఇదీ అని చెప్పడానికి రాదేమో అన్నంత అందమైన అనుభూతి!
నేను నిన్నెంత ప్రేమిస్తున్నప్పటికీ, ఆరాధిస్తున్నప్పటికీ... నువ్విలా వచ్చి అలా మాయమైనా సరే.. నన్ను విడిచి కదలకుండా నీ పాదాలని బంధించి ఉంచే ప్రయత్నం చెయ్యలేను స్వామీ!
సాధారణంగా ప్రేమ ఎక్కువైపోయి మనం ప్రేమించిన వారిని హృదయంతో బంధించడం అన్నది ఎప్పుడూ చూసేదే కదా! అలా కాకుండా ఎంత ప్రేమ కొద్దీ అయినా సరే ఎటువంటి బంధనాలు కలిగించకుండా అంత స్వేచ్ఛని ఇవ్వడం (పోనీ స్వేచ్ఛని హరించకుండా ఉండటం అనుకుందాం) అంటే.. ఆ భావనని అసలు ప్రేమనే కంటే ఆరాధన అనాలేమో! ఎంతటి స్వేచ్ఛాప్రియత్వం కదా!
ఆ ప్రేమలో ఎంత సున్నితత్వం, ఆరాధన ఉన్నాయో చూసారా... నువ్వొచ్చేదాకా నీ గురించి తలచుకుంటూ ఎదురు చూస్తానే తప్ప నిన్ను రమ్మని పిలువలేను.. నా కోసం నువ్విచ్చిందే అందుకుంటాను తప్ప నాకై నేనేమీ నిన్ను అడగను ప్రభూ! అందుకే ప్రేమతోనైనా సరే బంధించాలి అన్న ఆలోచన తనకి రాదేమో అసలు! ఎంత నిస్వార్థమైన ప్రేమ! ఎంతటి మహోన్నతమైన ప్రణయారాధన కదా!
అసలు అన్నీటికంటే నాకు బోల్డు ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే కృష్ణ శాస్త్రి గారు స్త్రీ హృదయాన్ని ఊహించి లేదా అర్థం చేసుకుని ఇంతందంగా అక్షరాల్లో పెట్టగలగడం.. ఆయన్ని పొగడటానికి ఎన్ని పదాలైనా సరిపోవేమో.. నిజంగా అద్భుతం! అసలు నిజంగా అలా ప్రేమించగలిగే వాళ్ళు, తనలో అంత ప్రేమని కలిగించగలిగేవాళ్ళు ఎవరైనా ఉంటే.. వాళ్ళెంత ధన్యులో కదా.. బహుశా కృష్ణ శాస్త్రి గారు అంతేనేమో! ;)కానీ, ఇంకోటి కూడా అనిపిస్తుంది. ఒక వేళ అలా ఎవరైనా ఉన్నా బహుశా వాళ్ళూ, వాళ్ళ ప్రేమ ఈ ప్రపంచానికి అర్థం కాదేమో, పిచ్చిలా అనిపిస్తుందేమో.. అచ్చం ఈ సినిమా కథలోలాగా! :)
ఇంకా ఈ సినిమాలోని మిగిలిన పాటల గురించి, సినిమా గురించి మరోసారెప్పుడైనా చెప్పుకుందాం.. అందాకా ఈ పాటని ఆస్వాదించండి. :)