Showing posts with label హ్హ హ్హ.. హ్హా... Show all posts
Showing posts with label హ్హ హ్హ.. హ్హా... Show all posts

Tuesday, January 24, 2012

మాయదారిపురం గోల్డ్ లోన్

"అబ్బబ్బా.. పిల్లల్ని స్కూలుకి రెడీ చెయ్యాలంటే గంటసేపు కష్టపడాల్సి వస్తోంది.."
"
అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే రెండు నిమిషాల్లోనే తీసేస్కోవచ్చు.."

"
చాలా ఆకలేస్తోంది.. బాబూ ఒక చికెన్ బిర్యాని పార్సెల్.."
"
కనీసం అరగంట వెయిట్ చెయ్యాలండీ.."
"
అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే క్షణాల్లో రెడీ.."

"
హబ్బా.. హైదరాబాద్ ట్రాఫిక్లో పార్కింగ్ వెతుక్కోవాలంటే రెండు గంటలు పడుతుంది.."
"
అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే అయిదే నిమిషాలు.."

"
ఓహ్.. ఈ షాప్ కి సండే సెలవంట.. మూసేసి ఉంది.."
"
అదే మాయదారిపురం స్టోర్ అయితే ఆదివారం కూడా నిమిషాల్లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.."

**************

ఏంటీ.. ఈ పిల్లకి ఉన్నట్టుండి పిచ్చేక్కిందేమో పాపం అని కంగారు పడుతున్నారా.. ఇంకా పరిస్థితులు అందాకా రాలేదు గానీ విషయం ఏంటో వివరంగా చెప్తానుండండి.
నేను పైన చెప్పినవన్నీ ఒక బంగారం తాకట్టు దుకాణానికి సంబంధించిన రేడియో ప్రకటనలు..
అంటే వాళ్ళ ఉద్దేశ్యం.. తిండి, పిల్లలు లాంటి వాటన్నీటి కన్నా గోల్డ్ లోన్ తీస్కోడం ఈజీ కాబట్టి మీకవసరం ఉన్నా లేకపోయినా అర్జెంటుగా వచ్చి తీసేస్కోండి అనా.. లేకపోతే పనీ పాటా చేస్కోడం కష్టం.. గోల్డ్ లోన్ తీస్కోడం సులువు.. అందుకని ఆ పని చెయ్యండనా??
అసలు మీకేమన్నా అర్థమైందా ఈ ప్రకటనల సారాంశం ఏంటో.. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీకెవరికైనా ఈ క్రియేటివిటీలో లాజిక్కు అర్థమైతే దయ చేసి నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి..

నేను వంట పనో, ఇంటి పనో చేస్తున్నప్పుడు హైదరాబాద్ FM రేడియో వింటూ ఉంటాను అప్పుడప్పుడూ. అయిదు నిమిషాలకోసారి వచ్చే వీళ్ళ ప్రకటనలు వినీ వినీ నాలో దాగున్న సృజనాత్మకత వెర్రి తలలు వేసి ఆశువుగా వీళ్ళ కోసం మరి కొన్ని ప్రకటనలు సూచించాలనిపిస్తోంది..

"
అన్నం తినడం వేస్టు.. గోల్డ్ లోన్ తీస్కోడం బెస్టు.."
"
స్నానం చెయ్యడానికి పావుగంట.. గోల్డ్ లోన్ కి రెండే నిమిషాలు.."
"
పరీక్షలు రాయడానికి మూడు గంటలు.. గోల్డ్ లోన్ కి ఐదే నిమిషాలు.."
"
ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం.."

ఎలా ఉన్నాయి స్లోగన్స్.. వాళ్ళ తాహతుకి తగ్గట్టు ఉన్నాయంటారా? మీకింకా బెటర్ అయిడియాలు వస్తే చెప్పండి.. ఎంచక్కా మాయదారిపురం గోల్డ్ లోన్ వాళ్ళు వాడేసుకుని ఇంకా జనాల్ని చావగొట్టేస్తారు.. sengihnampakgigi

సరే సరే.. ఇప్పుడు నాకు ఆకలేస్తోంది.. మా కెఫేటీరియాలో లంచ్ కోసం పది నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అయినా మాయదారిపురం గోల్డ్ లోన్ ఉండగా అంతసేపు ఎదురు చూడాల్సిన ఖర్మ నాకేం పట్టింది చెప్పండి. అందుకని నేను అన్నం తినడం మానేసి అర్జెంటుగా వెళ్ళి మాయదారిపురం గోల్డ్ లోన్ తీసుకుని వస్తాను. jelir

Friday, May 20, 2011

ఒక బ్లాగు మీ జీవితాన్నే మార్చేస్తుంది!

సభకు నమస్కారం! అంటే, బ్లాగులూ బజ్జులూ అవీ చూడక చాలా రోజులైపోయింది కదాని ఈ టైపులో రీ-ఎంట్రీ అన్నమాట! :)
ఈ రోజు నేను మీ అందరికీ బ్లాగులు-వాటి విలువ, బ్లాగులు-వాటి ప్రాశస్త్యం, బ్లాగులు రాయడం- తద్వారా జరిగే పరిణామాలు అనే అంశానికి సంబంధించిన ఒక ముచ్చట చెప్తాను. బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని సావధానంగా వినండి.

ఈ మధ్య బొత్తిగా పనీ పాటా లేకుండా ఖాళీగా కూర్చుని ఏం చెయ్యాలో తోచనప్పుడు నాకు కనీసం గోళ్ళు గిల్లుకునే అలవాటు కూడా లేకపోవడం చేత ఇహ తప్పక 'ఏమైందీ ఈ వేళ' అనే ఒక తెలుగు సినిమా చూసాను.

ఈ సినిమాలో వీరో వీరోయిన్లు ఇప్పటి స్పీడ్ యుగానికీ, స్పీడ్ ప్రేమలకీ ఏ మాత్రం తగ్గకుండా అలా అలా ప్రేమలో పడి మునిగిపోవడం చేత ఇంట్లో వాళ్ళని కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడి చక చకా రిజిస్టర్ పెళ్లి చేసేసుకుంటారు. ఒక రెండు డ్యూయెట్లు పాడేసుకున్న తరవాత వన్ ఫైన్ నైట్ టీవీలో వస్తున్న రామాయణం సినిమాలో సీన్ చూస్తూ సీత గురించి మొదలెట్టిన వాదన కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి నువ్వెంతంటే నువ్వెంతని అరిచేసుకుంటారు. నేను తలచుకుంటే నీకంటే అందమైన వాడిని/దాన్ని క్షణాల్లో పెళ్ళి చేసుకోగలను.. చిటికేస్తే జనాలు క్యూలో నించుంటారు నా చెయ్యందుకోడానికి అన్న రేంజ్ లో ఇద్దరూ చెడామడా తిట్టేసుకుని 'లెట్స్ బ్రేకప్' అనుకుంటారు.

ఒకరి మీద ఒకరికి పీకల దాకా ఉన్న కోపంతో విడిపోయి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి యమా స్పీడ్ గా డైవోర్స్ కూడా తీసేస్కుని రెండో పెళ్ళికి సిద్ధపడతారు. కాబోయే రెండో భర్త/భార్యకి ఈ పాత ప్రేమ-పెళ్ళి కథ చెప్తున్నట్టుగానే సినిమా నెరేషన్ నడుస్తుంది మొదటి నుంచీ.
ఇద్దరూ పోటాపోటీగా రెండో పెళ్ళి కోసం నిశ్చితార్థం, పెళ్ళి తేదీ నిర్ణయాలు వగైరా చేసుకుంటూ ఉండగా ఎప్పట్లాగే అనాదిగా వస్తున్న మన తెలుగు సినిమా సాంప్రదాయాన్ని అనుసరించి మనసులో మొదటి భర్త/భార్య మీద కోపం క్రమేణా పోయి మళ్ళీ బోల్డంత ప్రేమ తన్నుకువచ్చేస్తుంటుంది ఇద్దరికీ. అయినా గానీ, ఒకరి కంటే ఒకరు ముందు రెండో పెళ్ళి చేసుకుని తమ గొప్పతనాన్ని ప్రదర్శించాలనే అహంకారంతో పెళ్ళికి సిద్ధపడతారు.

అలా అలా సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఊహించని ట్విస్ట్ వస్తుంది. సరిగ్గా రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టె టైముకి ఇద్దరికీ జ్ఞానోదయం అయిపోయి ఆ రెండో పెళ్ళి కాన్సిల్ చేసుకుని మళ్ళీ వాళ్ళిద్దరూ కల్సుకోడంతో కథ సుఖాంతం అవుతుంది.

ఇంతకీ ఇక్కడ పెళ్ళి ఆగిపోయిన సందర్భంలో వచ్చే ఆసక్తికరమైన అమోఘమైన ట్విస్ట్ గురించే మీకు నేను చెప్పాలనుకుంది.
రిజిస్ట్రార్ ఆఫీసులో హీరో పెళ్ళి సంతకం పెట్టబోయినప్పుడు సదరు రెండో హీరోయిన్ గంభీరంగా 'ఆగు..' అంటుంది.
'నిజంగా నువ్వు నీ మొదటి భార్యని పూర్తిగా మర్చిపోయావా?' అని ఘట్టిగా నిలదీస్తుంది.
ఇంతకు ముందు ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా 'ఇంకా లేదు.. ప్రయత్నిస్తున్నాను' అని చెప్పిన హీరో గారు ఇప్పుడు మాత్రం 'పూర్తిగా మర్చిపోయాను' అంటాడు.
దానికి ఆ రెండో హీరోయిన్ పాపం దీనంగా మొహం పెట్టి 'ఈ మాట నిజమైతే నేనెంతో సంతోషించేదాన్ని' అంటుంది.
హీరో మొహం వేళ్ళాడేస్తాడు. చుట్టూ ఉన్న అందరూ నోర్లు తెరుచుకుని చూస్తుంటారు పాపం.

ఇంతలో సరిగ్గా అప్పుడే ఆ రెండో హీరోయిను కెవ్వు కేక లాంటి డైలాగ్ చెప్తుంది. 'ఒరే హీరోగా.. నేను నీ బ్లాగ్ ఫాలో అవుతూనే ఉన్నానురా.. నువ్వు నీ మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నావనీ, తనని మిస్ అవుతూ బాధ పడుతున్నావని, నన్ను పెళ్ళి చేసుకోవడం కరెక్టా కాదా అని పెద్ద డైలమాలో ఉన్నావని నువ్వు నీ బ్లాగ్లో రాసింది నేను చదివాను. నువ్వు కనీసం పెళ్ళి టైముకన్నా ఈ అయోమయం పోగొట్టుకుని కాస్త క్లారిటీ తెచ్చుకుంటావని ఆశించాను. కానీ, నువ్వు బొత్తిగా రొటీన్ తెలుగు సినిమా హీరోలానే పశ్చాత్తాపపడుతున్నావు.. మొదటి భార్యే కావాలనుకుంటున్నావు. ఇహ ఇప్పుడు తరతరాలుగా వస్తున్న తెలుగు సినిమా రెండో హీరోయిను సాంప్రదాయాన్ని నేను కూడా కొనసాగిస్తూ ఈ త్యాగం చెయ్యక తప్పట్లేదు' అంటుంది. చివరికి మొదటి వీరోవీరోయిన్లు కలుసుకుంటారు. కథకి శుభం కార్డు పడుతుంది.

ఆ అమ్మాయి ఈ డైలాగ్స్ చెప్తున్నప్పుడు 'Seenu's Blog' అనీ, అందులో నిజం పేర్లతో హీరో గారు తన స్టోరీని చక్కగా వివరించి రాసి ఉన్న పోస్టునీ చూపిస్తారు. కాకపోతే, అది తెలుగు బ్లాగ్ కాదు ఇంగ్లీష్ బ్లాగనుకోండి. ఏదైతేనేం.. మొత్తానికి హీరో గారు రాసుకున్న బ్లాగు వల్ల కథలో హెంత పెద్ద ట్విస్ట్ వచ్చిందో చూసారా?
దీని బట్టి మీకేం అర్థమయింది? 'ఒక బ్లాగు మీ జీవితాన్నే మార్చేస్తుంది!' అని టేక్ హోమ్ మెసేజ్ అన్నమాట! ;)

Wednesday, January 05, 2011

అంతకన్నా ఒకటెక్కువే!



"యే.. పో.. నువ్వెప్పుడూ ఇంతే! తొండి చేస్తావ్! పంది.."
"నువ్వే పంది.. కుక్క"
"నువ్వే పంది, కుక్క, ఎద్దు"
"నువ్వే పంది, కుక్క, గాడిద, ఎద్దు"
"నువ్వు పది సార్లు పంది, కుక్క, ఎద్దు, గాడిద.."
"నువ్వే.. వంద సార్లు పంది కుక్క.."
"నువ్వు వెయ్యి సార్లు పంది కుక్క.."
"నువ్వే లక్ష సార్లు పంది కుక్క.."
"నువ్వు కోటి సార్లు.."
"నువ్వు మిలియన్ సార్లు.."
"నువ్వు బిలియన్ సార్లు"
"యే.. పో.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే ఒకటి ఎక్కువే!"
"ఎహే.. నువ్వే పో.. నువ్వు ఇన్ఫినిటీ సార్లు పంది కుక్క.."
"నువ్వు ఇన్ఫినిటీ కి ప్లస్ వన్.."
"అహా.. ఇన్ఫినిటీ తరవాత ఇంకేం ఉండదమ్మా పెద్ద! అన్నీటికంటే అదే ఎక్కువ!"
"ఏం కాదు.. నేను ముందే చెప్పాగా.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే ఒకటి ఎక్కువని.. ఇన్ఫినిటీ ప్లస్ వన్"
"అయితే.. నువ్వు యూనివర్స్.. ఇంక అంత కంటే పెద్దది ఏమీ ఉండదు తెల్సా! స్కూల్లో మా టీచరు కూడా చెప్పారు"
"అబ్బ ఛా.. అంత లేదు బాబూ.. నాది యూనివర్స్ ప్లస్ వన్.."
"అయితే పో.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే నావి రెండు ఎక్కువే! యూనివర్స్ ప్లస్ వన్ కి ప్లస్ టూ"
"దానికన్నా ఒకటి ఎక్కువే!"
"దానికన్నా రెండెక్కువే!"
"ఇంకా దానికి కూడా ఒకటి ఎక్కువే!"
"మళ్ళీ దానికి కూడా.. రెండు ఎక్కువే!"
"ప్లస్ వన్"
"ప్లస్ టూ"

ఓయ్ పిల్లలూ.. ఏంటా గొడవా, అరుపులూ.. ఏం చేస్తున్నారు అసలక్కడ! నోర్మూసుక్కూర్చుని పుస్తకాలు తెరవండి.. అస్సలు భయమూ, భక్తీ లేకుండా పోతుందీ మధ్య మీకు. ఎంతసేపూ ఆటలూ, పోట్లాటలే.. చదువూ సంధ్యా లేకుండా.. అయిదు నిమిషాల్లో నేనక్కడికి వచ్చేసరికి ఇద్దరూ పుస్తకాల ముందు కనపడాలి. లేకపోతే వీపు విమానం మోత మోగిస్తా! -marah ఇది మా అమ్మ కేక!
అంతే.. ఇంక నేనూ మా తమ్ముడూ.. గప్ చుప్ సాంబార్ బుడ్డి.. మా లెక్కలన్నీ గోదాట్లోకీ, మేం మాత్రం పుస్తకాల్లోకీ.. sengihnampakgigi

...........

పైనదంతా చదివాక మీక్కూడా స్కూల్ రోజులు గుర్తొచ్చే ఉంటాయి కదూ! నిన్న రాత్రి నేనూ, మా ఇంటబ్బాయ్ ఇలాగే వాదులాడుకుంటూ అలా ఇన్ఫినిటీ, యూనివర్స్ దాకా వెళ్లి వచ్చాం.. ఇంతా చేసి చివరికి మా వాదన ఎక్కడ ఎందుకు మొదలయ్యిందో మర్చిపోయాం..jelir ఏదేమైనా నేను మాత్రం కాసేపు స్కూల్ రోజుల్లోకి వెళ్లేసి వచ్చా! మిమ్మల్ని కూడా పంపిద్దామనే ఈ టపా!senyum

Friday, September 24, 2010

ప్రేమంటే ఏంటి?




ప్రేమంటే ఏంటి?soal

ప్రేమ గుడ్డిది. Love is blind!

కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళకి ఎవరైనా ప్రేమ గుడ్డిది అనేవాళ్ళని చూస్తే 'పాపం.. గుడ్డి వాళ్ళు!' అని జాలిగా అనిపిస్తుంది.sedih
వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్లకేమో ఆ ప్రేమలో పడ్డ వాళ్ళే గుడ్డివాళ్లలా కనిపిస్తుంటారు.kenyit

అసలైతే నిజంగా ప్రేమ గుడ్డిదే! కాకపోతే అసలేమీ కనిపించని గుడ్డితనం కాకుండా colour blindness లాంటిదన్నమాట!
ఆ సదరు ప్రేమలో పడిన వ్యక్తికి మాత్రమే కొంతమేరకు ప్రపంచమంతా కొత్త కొత్త రంగుల్లో కనిపిస్తుంటుంది.rindu

కాకపోతే, యీ రకమైన గుడ్డితనం జీవితాంతం ఉంటే, అంతా హ్యపీసే!menari కొన్నాళ్ళకి గుడ్డితనం పోయి ప్రేమించిన వ్యక్తిలో మామూలు రంగులు కనిపించాయనుకోండి. అప్పుడే వస్తుంది అసలు తంటా!gigil

యీ గుడ్డితనం కాస్తా ఒకళ్ళకి వచ్చి ఇంకొకళ్ళకి రాలేదనుకోండి.. మళ్ళీ అదొక సమస్య. ఆ సదరు వ్యక్తికి కళ్ళు పోయేలా చేయడానికి.. అదేనండీ గుడ్డితనం తీసుకురాడానికి.. అదేనండీ ప్రేమలో పడెయ్యడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది పాపం! మళ్ళీ అదొక పెద్ద ప్రహసనం అవ్వచ్చు, హింసాత్మకంtumbuk కూడా అవ్వచ్చు. చెప్పలేం మరి!

అన్నట్టు, రెడీమేడ్ గుడ్డితనం అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటంటే, నాకు ఫలానా విషయం ఫలానా రంగుల్లో కనపడుతోంది అని గుడ్డిగా ఊహించేసుకుని గుడ్డితనం తెచ్చేసుకోడం అన్నమాట. ఉదాహరణకి అమ్మాయితో పాటు లక్షల ఆస్తి కట్నం వస్తుంది అంటే అమ్మాయి అతిలోకసుందరిలా కనిపించడంlove, లేదా అబ్బాయి కోటీశ్వరుడు అని తెలిస్తే నవమన్మథుడిలా కనిపించడం..encem వగైరా లాంటివన్నమాట!

ఇదంతా బానే ఉంది గానీ, మరి పెళ్ళంటే ఏంటి? అన్న సందేహం వచ్చేస్తోంది కదూ మీకు! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వచ్చేస్తున్నా!
ఏమీ లేదండీ. వెరీ సింపుల్.. యీ యొక్క సదరు గుడ్డితనాన్ని జీవితాంతం, చిరకాలం ఉండేలా కాపాడుకోడానికి ఇద్దరు గుడ్డివాళ్ళు చేసే గుడ్డి ప్రయత్నమన్నమాట!jelir

ముందే చెబుతున్నాను. యీ గుడ్డి పోస్టు చూసి inspire అయ్యి ఎవరైనా గుడ్డివాళ్ళయిపోదాం అనుకుంటే నా పూచీ లేదోచ్!sengihnampakgigi

అసలీ గుడ్డి గోల ఏంటీ అనుకుంటున్నారా? యీ రోజు పొద్దున్నే ఏకాంతపు దిలీప్ గారి 'బజ్' లో "ప్రేమంటే ఏంటి?" అని చూసి Love is blind! అని కామెంట్ పెట్టాను. అలా అలా ఆలోచిస్తుంటే, సరదాగా ఇలా అనిపించింది! అదన్నమాట యీ గుడ్డి పోస్టు వెనక ఉన్న గుడ్డి కారణం!jelir