Wednesday, September 28, 2011

ఒక దొంగపిల్లి కథ

ఆ మధ్య ఒకసారి బజ్లో అందరం కలిసి పిల్లుల కబుర్లు బోల్డు చెప్పుకున్నాం. అప్పుడు సరదాగా ఒక పిల్లి కథ రాయమని అడిగారు మిత్రులు. ముఖ్యంగా రాజ్ చాలాసార్లు అడిగారు. అప్పుడనుకున్న ఈ కథని రాయడానికి ఇప్పటికి కుదిరింది.
మీరందరూ గబగబా చదివేసి దొంగ పిల్లి కథ ఎలా ఉందో చెప్పండి మరి! :)


ఈ చిట్టి కథని "For kids" వెబ్సైట్ లో చూడండి.

Monday, September 26, 2011

మౌనమే నా భాష!


నేనే నీ ప్రపంచమని మురిపించిన రోజున బదులు పలకడానికి మాటలు దొరక్క మౌనంగా నీకేసి చూస్తుండిపోయాను..
నన్ను మించిన మరో ప్రపంచం కావాలనుకుని దూరమైపోతున్న ఈ రోజున కూడా బదులు తోచక మౌనాన్నే ఆశ్రయిస్తున్నాను..
నా కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క జారితేనే విలవిలలాడిపోయినప్పుడు ఎలా స్పందించాలో తెలీక మౌనంగా నిలిచిపోయాను..
నా పంచప్రాణాలు కన్నీళ్ళలో కొట్టుకుపోయేలా విలపిస్తున్న నన్ను భావరహితంగా చూస్తుండిపోతున్న ఈ క్షణానా మౌనమే శరణ్యమయ్యింది..
నీ కళ్ళల్లో మెరిసిన అమాయకత్వాన్ని, స్వచ్ఛమైన ప్రేమని చూసిన రోజున మాటలు కరువై మౌనపు జల్లుల్లో తడిసిపోయాను..
నీ కళ్ళల్లో నిండిపోయిన నిర్లక్ష్యాన్ని, నిరాదరణని, లెక్కలేనితనాన్ని చూస్తున్న ఈ క్షణాన మాటలు పెగలక మూగబోతున్నాను..
కుసుమ కోమలమైన పూరెమ్మనంటూ నాలోని సున్నితత్వాన్ని అపురూపంగా తలచి లాలించిన ఆ రోజున మౌనంగా నవ్వాను..
హృదయాన్ని కఠిన పాషాణంలా మార్చుకుని శిలాపుష్పంలా మారి బతకమని శాసిస్తున్న ఈ క్షణాన మౌనంగా రోదిస్తున్నాను..
అప్పుడూ ఇప్పుడూ మౌనమే నా భాషయ్యింది... కానీ భావంలో ఎంతటి అగాథాల దూరమో కదూ!

Saturday, September 03, 2011

నే కలగన్నాను!

నిండు పున్నమి వెలుగుల్లో ఉవ్వెత్తున ఎగిసే సంద్రపు కెరటాల్లోని చైతన్యాన్ని కలగన్నాను..
పరవళ్ళు తొక్కుతూ హుషారుగా పరుగులు తీసే కొండవాగులోని చురుకుదనాన్ని కలగన్నాను.
తొలిపొద్దులో పచ్చటి చివుర్లపై నిలిచిన మంచు ముత్యాలని చుంబించే తూరుపు రేఖల్లోని చిలిపితనాన్ని కలగన్నాను..
కన్నె పూమొగ్గపై అల్లరిగా వాలిపోయి మధుర మకరందాన్ని గ్రోలే తుంటరి తుమ్మెదలోని కొంటెతనాన్ని కలగన్నాను..

నా అరచేతిలో ఎర్రగా పండిన చందమామ లాంటి అందమైన మోముని కలగన్నాను..
నల్లటి చీకటి రాతిరిలోని చుక్కల్లా కాంతులీనుతూ నను మురిపించే కన్నులని కలగన్నాను..
నా దోసిలి నిండుగా పున్నాగల పరిమళాలు నింపేసే తెల్లటి తేటైన నవ్వుని కలగన్నాను..
నా కొంగు చాటున దాగుతూ నా ఒడిలో చేరి గారాలు పోయే పసితనాన్ని కలగన్నాను..
నను మాటల మాయలో పడేసి చెక్కిలిపై ముద్దుని దోచుకెళ్ళే గడుసుదనాన్ని కలగన్నాను..
గోదారి తీరాన వెన్నెల వానలో తడిసి ముద్దైపోయిన అనుభూతిని తలపించే మోహాన్ని కలగన్నాను..
నను అనునయంగా చేరదీసే బలమైన బాహుబంధంలో ఒదిగిపోయి ప్రపంచాన్ని మరచిపోవాలని కలగన్నాను..

నా మనసుకి సీతాకోక చిలుకలా రెక్కలొచ్చి స్వేచ్ఛగా నింగి దాకా ఎగరాలని కలగన్నాను..
చుక్కల పూదోటలోకి విహారానికి వెళ్ళి మెరుపులతో నా చీర చెంగు నింపుకోవాలని కలగన్నాను..
ఆకాశమంత ప్రేమలో మమేకమయిపోయి నేననే నేను మాయమైపోవాలని కలగన్నాను..
ఊపిరాగిపోవాలనిపించేంత గాఢమైన కౌగిలిలో చిక్కుకుపోయి కరిగిపోవాలని కలగన్నాను..
నా కలలేవీ నిజమవ్వలేదనుకున్నాను.. కలలు నిజాలవుతాయా ఎక్కడన్నా అని సరిపెట్టుకున్నాను..
కానీ.. నన్ను నాకే అపురూపంగా చూపిస్తూ నా కలలన్నీ పండిస్తూ నువ్వు నా జీవితంలోకి నడిచి వచ్చావు..
మరీ.. బదులుగా నన్నంతా నీకిచ్చేస్తాను... ఎప్పటికీ నాతో ఉండిపోవూ..!