చిన్నప్పటి నుంచీ కూడా పాటలంటే ఎక్కువ తెలిసిందీ, విన్నదీ తెలుగు సినిమా పాటలే. బాగా చిన్నప్పుడు మొదట విన్నది రేడియోలో వచ్చే పాటలు. అప్పట్లో రేడియోలో ఏ పాట వచ్చినా ఎక్కువ ఫలానా గీతం.. పాడినవారు ఘంటసాల, పి.సుశీల అని చెప్పేవారు. లేకపోతే ఎస్పీ బాలు, పి.సుశీల పాడారని చెప్పేవారు. తర్వాత్తర్వాత మిగతా గాయనీమణుల పేర్లూ, గొంతులూ పరిచయమైనా చాన్నాళ్ళ వరకూ రేడియోలో వచ్చే పాటలంటే అన్నీ సుశీల అనే ఆవిడ పాడినవే వస్తాయేమో అనుకునేదాన్ని. మరి అన్నేసి వందల పాటలు మధురంగా ఆలపించారు కదా సుశీల గారు.. అలా అనిపించడంలో ఆశ్చర్యమేముంది! :)
ఈ రోజు మధుర గాయని సుశీల గారి పుట్టినరోజు సందర్భంగా సుశీల గారు పాడిన మధుర గీతాలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం. అసలిప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా.. ఒక పెద్ద మిఠాయిల దుకాణానికి వెంటబెట్టుకెళ్ళి 'నీకే మిఠాయిలు కావాలో తేల్చుకో' అన్నట్టూ, ఒక పెద్ద గులాబీ తోటలోకి తీసుకెళ్ళి 'నీకే రంగు గులాబీలు నచ్చాయో ఎంచుకో' అన్నంత అయోమయంగా ఉంది . అసలు ఎక్కడి నుంచి మొదలెట్టి ఎటు వైపెళ్ళి ఎక్కడ ఆగాలో తెలీడం లేదు. ఒకేసారి బోల్డు పాటలు నేను ముందంటే నేను ముందంటూ.. నా మీద అలిగి పోట్లాడుతున్నట్టుంది. సరే.. ఇంకేం చేస్తాం మరి.. సుశీల గారి పాటలతో కోతికొమ్మచ్చి ఆడేస్తాను ఈ వేళ.. :)
"పాడమని నన్నడగవలెనా.. పరవశించీ పాడనా.." అంటూ సుశీల గారు మన కోసం ఎన్ని చక్కటి పాటలు పాడారో కదా! బాపు గారి 'ముత్యాలముగ్గు' లో "ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా.. ముత్తైదు కుంకుమా బతుకంతా ఛాయా.." పాట వింటుంటే వేకువ జామునే సుప్రభాతం విన్నట్టనిపిస్తుంది. 'మేఘసందేశం' లో "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై.." పాట వింటూ ఉంటే మనకి కూడా ప్రకృతిలో మేమకమైపోయిన అనుభూతి వచ్చేస్తుంది. ఇదే సినిమాలో "నిన్నటి దాకా శిలనైనా", "ముందు తెలిసేనా ప్రభూ" పాటలు వింటూ నేనైతే వేరే ఏదో లోకంలోకి వెళ్ళిపోతాను. రోజంతా ఈ రెండు పాటలే వింటూ ఉండిపోయిన రోజులెన్నో!
"గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం", "పాడవోయి భారతీయుడా..", "ఏ దేశమేగినా ఎందుకాలిడినా..", అంటూ దేశభక్తి గీతాలు కూడా పాడారు. 'అమెరికా అమ్మాయి' సినిమాలోని "పాడనా తెలుగు పాట" , 'భాగ్యలక్ష్మి' చిత్రం కోసం పాడిన "కృష్ణ శాస్త్రి కవితలా.. కృష్ణవేణి పొంగులా.." పాట, 'దేశోద్ధారకులు' చిత్రం కోసం పాడిన "స్వాగతం దొరా.. సుస్వాగతం.." పాట... ఇవన్నీ సుశీల గారు అచ్చమైన తేనెల తేటల తెలుగు భాష అందాన్ని గురించి పాడిన తియ్యటి పాటలు. 'తోడు నీడ' చిత్రం కోసం పాడిన "అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మా.." పాట, 'స్వాతిముత్యం' చిత్రం కోసం పాడిన "లాలి లాలి లాలీ.." పాట.. ఈ జోల పాటలు వింటుంటే అలా మత్తుగా సోలిపోవాలనిపిస్తుంది. :)
"మొక్కజొన్న తోటలో ముసిరినా చీకట్లలో", "ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి..", "నీతోటే ఉంటాను శేషగిరి బావా..", "ఓ రంగయో.. పూల రంగయో..", "పాండవులు పాండవులూ తుమ్మెదా...", "మంచిరోజు వస్తుందీ..", "బంగారు బొమ్మ రావేమే..", "గోదారి గట్టుంది.. గట్టు మీనా చెట్టుందీ..", "అహా నా పెళ్ళియంట.." అంటూ సరదా సరదాగా సాగే జానపదాల్లాంటి పాటలు చాలా పాడారు సుశీల గారు. "వస్తాడు నా రాజు ఈ రోజు" పాటలో ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి ఎదురుచూపుల్ని ఎంత సున్నితంగా తన గొంతులో పలికించారో, "ఇది మల్లెల వేళయని.. ఇది వెన్నెల మాసమనీ.." , "ఇది పాట కానే కాదు.. ఈ రాగం నాకు రాదు" అంటూనే అంత ఆవేదనని గొంతులో పలికిస్తారు. "రాధకు నీవేరా ప్రాణం" అని ఆలాపిస్తుంటే మనసు కరిగిపోతున్నట్టుంటుంది. "జోరు మీదున్నావే తుమ్మెదా", "చిన్నమాట.. ఒక చిన్న మాట.." లాంటి పాటలన్నీ ఒక్కసారి విని వదల్లేమంటే ఆశ్చర్యం లేదు. "నీవు రావు నిదుర రాదు..", "నీవు లేక వీణ పలుకలేనన్నది.." అంటూ విరహాన్ని ఎంతో మృదువుగా పలికించారు. 'ధనమా, దైవమా' చిత్రం కోసం పాడిన "నీ మది చల్లగా.. స్వామీ నిదురపో దేవుని నీడలో..", "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" పాటలు వింటుంటే మనసుకి ఎంత శాంతిగా ఉంటుందో!
'గోరంత దీపం' చిత్రం కోసం పాడిన "రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా.." 'సీతారాముల కల్యాణం' చిత్రం కోసం పాడిన "సీతారాముల కళ్యాణము చూతము రారండి.." పాట, 'లవకుశ' చిత్రం కోసం పాడిన "వినుడు వినుడు రామాయణ గాథ", "శ్రీరాముని చరితమును" పాటలు, 'మీనా' చిత్రం కోసం పాడిన "శ్రీరామ నామాలు శతకోటి" పాట, 'పంతులమ్మ చిత్రం కోసం పాడిన "మనసెరిగినవాడు మా రాముడు" పాట, 'పూజ' చిత్రం కోసం పాడిన "నీ దయ రాదా.. రామ నీ దయ రాదా.." అనే త్యాగరాజ కీర్తన... ఈ పాటలన్నీ వింటున్నంత సేపూ రాముని మీదే మన ధ్యానం నిలిచిపోతుంది. 'నర్తనశాల' చిత్రం కోసం సుశీల గారు పాడిన "జననీ శివకామినీ.." పాటైతే ఎంతోమంది ఇప్పటికీ అమ్మవారి పూజల్లో చాలామంది తెలుగు ఇల్లాళ్ళు పాడుకుంటూ ఉంటారు. "మీరజాలగలడా నాయానతి" అని సుశీల గారి గళంలో తియ్యగా వినిపిస్తుంటే ఆ కృష్ణుడు కూడా మురిసిపోతాడేమో! 'సిరిసంపదలు' చిత్రం కోసం పాడిన "వేణు గానమ్ము వినిపించెనే" పాట, 'మంచి కుటుంబం' చిత్రం కోసం పాడిన "మనసే అందాల బృందావనం.." పాట, 'గుండమ్మ కథ' చిత్రం కోసం పాడిన "అలిగిన వేళనే చూడాలి.." పాట, 'సప్తపది' చిత్రం కోసం పాడిన "వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి.." పాట.. ఇలా ఎన్నో కమ్మటి కృష్ణగీతాలు పాడారు సుశీల గారు. "ప్రియే చారుశీలే..", "చందన చర్చిత నీల కళేబర" అంటూ జయదేవుని అష్టపదులు సుశీల గారి గళంలో ఎంత మధురంగా వినిపిస్తాయో!
ఘంటసాల, సుశీల గారు పాడిన పాటలయితే దేనికదే అద్భుతం అనిపించేలా ఎన్నెన్నో పాటలు. 'మూగమనసులు' చిత్రం కోసం పాడిన "నా పాట నీ నోట పలకాల సిలకా.." , 'గులేబకావళి కథ' చిత్రం కోసం పాడిన "నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని", 'మంచి చెడు' చిత్రం కోసం పాడిన "రేపంటి రూపం కంటి..", 'వాగ్దానం' చిత్రం కోసం పాడిన "నా కంటిపాపలో నిలిచిపోరా..", 'దాగుడు మూతలు' చిత్రం కోసం పాడిన "అడగక ఇచ్చిన మనసే ముద్దు", "మెల్ల మెల్ల మెల్లగా..", 'మంచి మనసులు' చిత్రం కోసం పాడిన "నన్ను వదలి నీవు పోలేవులే..", 'ఆత్మబలం' చిత్రం కోసం పాడిన "చిటపట చినుకులు పడుతూ ఉంటే", 'సిఐడి' చిత్రం కోసం పాడిన "నా సరి నీవని నీ గురి నేనని", 'రాజకోట రహస్యం' చిత్రం కోసం పాడిన "నెలవంక తొంగి చూసింది", 'గూఢచారి 116' చిత్రం కోసం పాడిన "నువ్వు నా ముందుంటే", లక్షాధికారి చిత్రం కోసం పాడిన "మబ్బులో ఏముంది.. నా మనసులో ఏముంది", 'బందిపోటు' చిత్రం కోసం పాడిన "ఊహలు గుసగుసలాడే..", 'గుండమ్మ కథ' చిత్రం కోసం పాడిన "ప్రేమయాత్రలకు బృందావనము", "ఎంత హాయి ఈ రేయి", 'తోడికోడళ్ళు' చిత్రం కోసం పాడిన "ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే", 'రాముడు భీముడు' చిత్రం కోసం పాడిన "తెలిసిందిలే తెలిసిందిలే.."........ ఇలా మనం గుర్తు చేసుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు మనకి. :) 'రక్త సంబంధం కోసం వీరివురూ కలిసి పాడిన "చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే" పాట ఇప్పటికెన్నోసార్లు విని ఉన్నా మళ్ళీ మళ్ళీ విన్న ప్రతీసారీ కళ్ళు తడిసిపోతుంటాయి. :(
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు కలిసి ఎన్నో చక్కటి పాటలు పాడారు. 'శివరంజని' సినిమా కోసం పాడిన "నవమి నాటి వెన్నెల నీవు" పాట, చిలిపి కృష్ణుడు చిత్రం కోసం పాడిన "చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు" పాట, 'గూడుపుఠాణి' చిత్రం కోసం పాడిన "తనివి తీరలేదే నా మనసు నిండలేదే.." పాట, 'తోటరాముడు' చిత్రం కోసం పడిన "ఓ బంగరు రంగుల చిలకా పలకవే.." పాట, 'బుల్లెమ్మ బుల్లోడు' సినిమాలోని "కురిసింది వాన నా గుండెలోన.." పాట, 'అమరదీపం' చిత్రం కోసం పాడిన "ఏ రాగమో.. ఇది ఏ తాళమో.." పాట, 'దేవత' సినిమాలోని "ఎల్లువొచ్చి గోదారమ్మ..", 'యుగపురుషుడు' సినిమాలోని "ఒక్క రాత్రి వచ్చిపోరా.. వేయి రాత్రుల వెన్నెలిస్తా.." పాట, 'త్రిశూలం' చిత్రం కోసం పాడిన "రాయిని ఆడది చేసిన రాముడివా.." పాట, 'శుభోదయం' సినిమాలోని కంచికి పోతావా కృష్ణమ్మా.." పాట, కొండవీటి సింహం సినిమాలోని "ఈ మధుమాసంలో.. ఈ దరహాసంలో.." అనే పాట, 'నోము' చిత్రంలోని "కలిసే కళ్ళలోనా.. కురిసే పూలవాన.." పాట, 'పంతులమ్మ సినిమాలోని "మానసవీణ.. మధుగీతం" పాట, 'నీడ లేని ఆడది' సినిమా కోసం పాడిన "తొలివలపే తియ్యనిది.." పాట, 'ఖైదీ' సినిమాలోని "గోరింట పూసింది.. గోరింక కూసింది.." అనే పాట, 'పెళ్ళి పుస్తకం' కోసం పాడిన "శ్రీరస్తు శుభమస్తు" పాట, 'రాజ్ కుమార్' చిత్రం కోసం పడిన "జానకి కలగనలేదు" పాట, 'చిట్టి చెల్లెలు' సినిమాలోని "ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది.." పాట... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతెక్కడ చెప్పండి.. :)
'జీవనతరంగాలు' చిత్రం కోసం స్వయంగా సుశీల గారు పాడిన "పుట్టినరోజు పండుగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ.." అనే ఈ తియ్యటి పాటతోనే ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా.. :)
సుశీల గారూ.. మీరు ఆలపించిన మధుర గీతాలతో ప్రతి నిత్యం మీరు మమ్మల్నందరినీ సంగీతసాగరంలో ఓలలాడిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక పాట వింటూ మేమందరం మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటాం, మీ అమృత గానమాధుర్యానికి పరవశిస్తూనే ఉంటాం. మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనీ, ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ చక్కటి ఆరోగ్యాన్నీ, సుఖసంతోషాలనీ, ప్రశాంతతనీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పైన టపాలో రాసిన అన్నీ పాటలకీ ఆడియో లింక్ ని జత పరచడం జరిగింది. సుశీల గారి పాటలు విని అందరూ ఆనందిస్తారని తలుస్తూ.. సుశీల గారి పుట్టినరోజు తేదీని గుర్తు చేసి ఈ పోస్ట్ రాయడానికి ప్రోత్సహించిన 'చిమట మ్యూజిక్' శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. :)