Friday, May 20, 2011

ఒక బ్లాగు మీ జీవితాన్నే మార్చేస్తుంది!

సభకు నమస్కారం! అంటే, బ్లాగులూ బజ్జులూ అవీ చూడక చాలా రోజులైపోయింది కదాని టైపులో రీ-ఎంట్రీ అన్నమాట! :)
రోజు నేను మీ అందరికీ బ్లాగులు-వాటి విలువ, బ్లాగులు-వాటి ప్రాశస్త్యం, బ్లాగులు రాయడం- తద్వారా జరిగే పరిణామాలు అనే అంశానికి సంబంధించిన ఒక ముచ్చట చెప్తాను. బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని సావధానంగా వినండి.

మధ్య బొత్తిగా పనీ పాటా లేకుండా ఖాళీగా కూర్చుని ఏం చెయ్యాలో తోచనప్పుడు నాకు కనీసం గోళ్ళు గిల్లుకునే అలవాటు కూడా లేకపోవడం చేత ఇహ తప్పక 'ఏమైందీ వేళ' అనే ఒక తెలుగు సినిమా చూసాను.

సినిమాలో వీరో వీరోయిన్లు ఇప్పటి స్పీడ్ యుగానికీ, స్పీడ్ ప్రేమలకీ మాత్రం తగ్గకుండా అలా అలా ప్రేమలో పడి మునిగిపోవడం చేత ఇంట్లో వాళ్ళని కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడి చక చకా రిజిస్టర్ పెళ్లి చేసేసుకుంటారు. ఒక రెండు డ్యూయెట్లు పాడేసుకున్న తరవాత వన్ ఫైన్ నైట్ టీవీలో వస్తున్న రామాయణం సినిమాలో సీన్ చూస్తూ సీత గురించి మొదలెట్టిన వాదన కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి నువ్వెంతంటే నువ్వెంతని అరిచేసుకుంటారు. నేను తలచుకుంటే నీకంటే అందమైన వాడిని/దాన్ని క్షణాల్లో పెళ్ళి చేసుకోగలను.. చిటికేస్తే జనాలు క్యూలో నించుంటారు నా చెయ్యందుకోడానికి అన్న రేంజ్ లో ఇద్దరూ చెడామడా తిట్టేసుకుని 'లెట్స్ బ్రేకప్' అనుకుంటారు.

ఒకరి మీద ఒకరికి పీకల దాకా ఉన్న కోపంతో విడిపోయి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి యమా స్పీడ్ గా డైవోర్స్ కూడా తీసేస్కుని రెండో పెళ్ళికి సిద్ధపడతారు. కాబోయే రెండో భర్త/భార్యకి పాత ప్రేమ-పెళ్ళి కథ చెప్తున్నట్టుగానే సినిమా నెరేషన్ నడుస్తుంది మొదటి నుంచీ.
ఇద్దరూ పోటాపోటీగా రెండో పెళ్ళి కోసం నిశ్చితార్థం, పెళ్ళి తేదీ నిర్ణయాలు వగైరా చేసుకుంటూ ఉండగా ఎప్పట్లాగే అనాదిగా వస్తున్న మన తెలుగు సినిమా సాంప్రదాయాన్ని అనుసరించి మనసులో మొదటి భర్త/భార్య మీద కోపం క్రమేణా పోయి మళ్ళీ బోల్డంత ప్రేమ తన్నుకువచ్చేస్తుంటుంది ఇద్దరికీ. అయినా గానీ, ఒకరి కంటే ఒకరు ముందు రెండో పెళ్ళి చేసుకుని తమ గొప్పతనాన్ని ప్రదర్శించాలనే అహంకారంతో పెళ్ళికి సిద్ధపడతారు.

అలా అలా సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఊహించని ట్విస్ట్ వస్తుంది. సరిగ్గా రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టె టైముకి ఇద్దరికీ జ్ఞానోదయం అయిపోయి రెండో పెళ్ళి కాన్సిల్ చేసుకుని మళ్ళీ వాళ్ళిద్దరూ కల్సుకోడంతో కథ సుఖాంతం అవుతుంది.

ఇంతకీ ఇక్కడ పెళ్ళి ఆగిపోయిన సందర్భంలో వచ్చే ఆసక్తికరమైన అమోఘమైన ట్విస్ట్ గురించే మీకు నేను చెప్పాలనుకుంది.
రిజిస్ట్రార్ ఆఫీసులో హీరో పెళ్ళి సంతకం పెట్టబోయినప్పుడు సదరు రెండో హీరోయిన్ గంభీరంగా 'ఆగు..' అంటుంది.
'నిజంగా నువ్వు నీ మొదటి భార్యని పూర్తిగా మర్చిపోయావా?' అని ఘట్టిగా నిలదీస్తుంది.
ఇంతకు ముందు ప్రశ్న అడిగినప్పుడల్లా 'ఇంకా లేదు.. ప్రయత్నిస్తున్నాను' అని చెప్పిన హీరో గారు ఇప్పుడు మాత్రం 'పూర్తిగా మర్చిపోయాను' అంటాడు.
దానికి రెండో హీరోయిన్ పాపం దీనంగా మొహం పెట్టి ' మాట నిజమైతే నేనెంతో సంతోషించేదాన్ని' అంటుంది.
హీరో మొహం వేళ్ళాడేస్తాడు. చుట్టూ ఉన్న అందరూ నోర్లు తెరుచుకుని చూస్తుంటారు పాపం.

ఇంతలో సరిగ్గా అప్పుడే రెండో హీరోయిను కెవ్వు కేక లాంటి డైలాగ్ చెప్తుంది. 'ఒరే హీరోగా.. నేను నీ బ్లాగ్ ఫాలో అవుతూనే ఉన్నానురా.. నువ్వు నీ మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నావనీ, తనని మిస్ అవుతూ బాధ పడుతున్నావని, నన్ను పెళ్ళి చేసుకోవడం కరెక్టా కాదా అని పెద్ద డైలమాలో ఉన్నావని నువ్వు నీ బ్లాగ్లో రాసింది నేను చదివాను. నువ్వు కనీసం పెళ్ళి టైముకన్నా అయోమయం పోగొట్టుకుని కాస్త క్లారిటీ తెచ్చుకుంటావని ఆశించాను. కానీ, నువ్వు బొత్తిగా రొటీన్ తెలుగు సినిమా హీరోలానే పశ్చాత్తాపపడుతున్నావు.. మొదటి భార్యే కావాలనుకుంటున్నావు. ఇహ ఇప్పుడు తరతరాలుగా వస్తున్న తెలుగు సినిమా రెండో హీరోయిను సాంప్రదాయాన్ని నేను కూడా కొనసాగిస్తూ త్యాగం చెయ్యక తప్పట్లేదు' అంటుంది. చివరికి మొదటి వీరోవీరోయిన్లు కలుసుకుంటారు. కథకి శుభం కార్డు పడుతుంది.

అమ్మాయి డైలాగ్స్ చెప్తున్నప్పుడు 'Seenu's Blog' అనీ, అందులో నిజం పేర్లతో హీరో గారు తన స్టోరీని చక్కగా వివరించి రాసి ఉన్న పోస్టునీ చూపిస్తారు. కాకపోతే, అది తెలుగు బ్లాగ్ కాదు ఇంగ్లీష్ బ్లాగనుకోండి. ఏదైతేనేం.. మొత్తానికి హీరో గారు రాసుకున్న బ్లాగు వల్ల కథలో హెంత పెద్ద ట్విస్ట్ వచ్చిందో చూసారా?
దీని బట్టి మీకేం అర్థమయింది? 'ఒక బ్లాగు మీ జీవితాన్నే మార్చేస్తుంది!' అని టేక్ హోమ్ మెసేజ్ అన్నమాట! ;)