'ముగింపు' అనే మాటలోనే ఏదో తీపి ఉంటుంది.
అన్నట్టు తీపి అనే పదానికి తియ్యని రుచి అనే కాకుండా నొప్పి అనే అర్థం
కూడా ఉంది తెలుసు కదా! సైన్సు చెప్పినా, ప్రకృతి చూపినా, అనుభవం నేర్పినా మొదలంటూ ఉన్నదానికి తుది కూడా ఖచ్చితంగా ఉంటుందన్నది సార్వజనీన సత్యం. అయితే చాలాసార్లు ఆరంభాలు, అంతాలూ రెండూ కూడా ఎప్పుడొస్తాయో మన చేతుల్లో ఉండదు.
అసలు ఏదైనా మొదలైనప్పుడే ముగింపు గురించి ఆలోచిస్తామా మనం? మనిషి ఆశా జీవి కదా.. బహుశా అలా ఆలోచించడానికి పెద్దగా ఇష్టపడం అనుకుంటాను. మనకి ఆనందాన్ని కలిగించే వాటి విషయంలో ముగింపనేదే లేకుండా ఆ ఆనందానికి శాశ్వతత్వం సిద్ధిస్తే బాగుండుననిపిస్తుంది. కొన్నిసార్లు అమాయకంగా అవి నిజంగా శాశ్వతమన్న వెర్రి నమ్మకంలోనే బతికేస్తుంటాము ఏదో ఒక రోజు వాస్తవం వాత పెట్టి లేపేవరకూ.. :-)
సినిమా అయిపోగానే చివర్లో 'ది ఎండ్' అని వేస్తారు కదా.. అంటే ఇంక అక్కడితో వారు చెప్పాలనుకున్న కథ అయిపోయిందని అర్థం. కానీ ఆ కథ ఎలా ముగుస్తుందన్న దాన్ని బట్టి ఒకోసారి 'ది ఎండ్' ని చూడటం హమ్మయ్యా అన్నట్టు
తేలిగ్గానూ, అదే అంగీకరించలేని ముగింపు చూడాల్సి వస్తే ఓ దీర్ఘ నిట్టూర్పో లేదా ఓ వారం పది రోజుల దాకా ఆ కథ తాలూకు
ఆలోచనల్లో మునిగి తేలడమో జరుగుతుంటుంది. అసలు చిత్రం ఏంటంటే, ఏదైనా ప్రారంభంలో సంతోషాన్నిచ్చినప్పుడు అసలది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది లాంటి ప్రశ్నలేవీ ఉదయించవు. అదే ముగింపు మాత్రం అంతులేని ప్రశ్నాపత్రంలా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరగాలి, నాకే ఎందుకు జరగాలి, ఏదో మేజిక్ జరిగి ఇదంతా మారిపోతే బాగుండు, అసలు ఇది మొదలే అవ్వకుండా ఉంటే ముగింపే చూడాల్సి వచ్చేది
కాదు కదా, అసలిదంతా నా దురదృష్టమేనా.. ఇలాంటి శుష్కవాదనలు చేస్తూ
గిలగిలలాడిపోతూ ఉంటుంది మనసు. కేవలం ముగింపుని
ఎదుర్కోలేనన్న బాధలో నుంచి పుట్టుకొచ్చే పిరికి వేదాంతం అన్నమాట ఇదంతా. అసలు ఎంచక్కా మన తెలుగు సినిమాల్లో (అన్నీ కాకపోయినా చాలావాటిల్లో) లాగా ప్రతీ కథకీ 'శుభం' కార్డు పడితే ఎంత హాయో కదా.. కష్టపడి టికెట్టు
కొనుక్కొచ్చి సినిమా చూసిన వాళ్ళు వెళ్ళేప్పుడు స్థిమితంగా వెళ్ళాలనేమో
మనవాళ్ళు శుభారంభాలతో పాటు శుభాంతాలనే ఎక్కువగా నమ్ముకుంటుంటారు.
ప్రతీ మనిషికీ పరిమిత జీవితకాలం, ప్రతీ రోజుకీ ఇరవై నాలుగు గంటలే కదా ఉంటాయి. ఈ చిన్న చిన్న జీవితాల్లో ఆరంభాలు తప్ప ముగింపులనేవే లేవనుకోండి, ఉన్న ఈ కాస్త సమయంలో కొత్తవాటికి చోటెక్కడ? అంటే ఇంకోలా చెప్పాలంటే ప్రతీ ఆరంభానికీ ముగింపుంటేనే, ప్రతీ ముగింపు ఇంకో సరి కొత్త ఉదయానికి శ్రీకారం చుట్టే వీలుంటుంది. కానీ అన్నీ తెలిసినా ముగింపు అనేది ఎప్పుడూ భారంగానే
తోస్తుంది. ఒక ముగింపు నుంచి మరో ప్రారంభం దాకా నడిచేలోపు చాలా
నొప్పులు భరించాలి, కన్నీళ్ళు చిందించాలి, కొత్త పాఠాలు నేర్చుకోవాలి. మనం అవునన్నా కాదన్నా మన ప్రమేయం లేకుండానే ఒక్కో మజిలీ
దాటుకుంటూ జీవన పయనం సాగిపోతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి
చూస్తే సుదూరపు గతంలో మసక మసగ్గా కనిపించే జ్ఞాపకాలని తల్చుకుని ఓ మెత్తటి
నవ్వో, వెచ్చటి కన్నీటి చుక్కో పుడుతుంది. మరుక్షణంలో అడుగు
ముందుకు పడి నడక సాగుతూనే ఉంటుంది మరో ముగింపు ఎదురయే దాకా!
ఒకోసారి ముగింపు దానంతటదే తరుముకు రాకుండా మనమే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి
ఎదురవొచ్చు. దేన్నైనా సులువుగా చేజార్చుకోకుండా
ఎంత శ్రమపడైనా సరే చిక్కబట్టుకోవడమే ఉత్తమమనీ, అందులోనే అమితమైన ఆనందం ఉందనీ, వదులుకోవడం ఎప్పుడూ సరైన పరిష్కారం కాదనేది నిజమే అయినప్పటికీ కొన్నిసార్లు
వదిలెయ్యడం, వదిలించుకోవడం, ముగింపుని ఆహ్వానించడం మరింత
మేలు చేసే మలుపు అవుతుందనేది కూడా అంతే నిజం అని నేనంటే కాదనగలరా? :-)



