Friday, December 19, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 12

మేఘ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది అప్పుడు.
ఒకరోజు ఉదయం కాలేజీకి వెళ్ళే తొందరలో అద్దం ముందు నించుని జడ వేసుకుంటుంటే "మేఘా.. నీకోసం ఎవరో వచ్చారు" అంటూ ఒక అమ్మాయి పిలుపు బిగ్గరగా వినిపించింది.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య సంచిక డిసెంబరు సంచికలో... ​Wednesday, November 05, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 11


​ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా ​​నిద్రలేచింది.​

ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక నవంబరు సంచికలో... 

 

Saturday, October 04, 2014

​ఆటా 2014 సభల జ్ఞాపిక 'అక్షర'లో నా కథ 'అవ్యక్తం'


ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా'​ మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. ​పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది.

​ఇంత చక్కటి జ్ఞాపికలో నాక్కూడా చోటు కల్పించినందుకు, శ్రమ తీసుకుని సంచిక ప్రతిని ఇంతదూరం పంపినందుకు ప్రత్యేకంగా అక్షర సంపాదకులు రవి వీరెల్లి గారికీ, మిగతా సంపాదక వర్గానికీ కృతఙ్ఞతలు.
కథ చదివి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ..
Thursday, October 02, 2014

​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..


చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మా అమ్మ, అత్తయ్య కలిసి చాలా ఏళ్ళు గౌరమ్మని పెట్టారు. మా చుట్టుపక్కల రెండు మూడు వీధుల్లో అందరూ మా చుట్టాలే కాబట్టి ఎక్కువగా అంతా కలిసి ఒక గౌరమ్మనే పెట్టుకునే వారు.

దసరా రోజులు మొదలవగానే పొలం నుంచీ నల్లటి బంకమట్టి తెప్పించి దానితో ఐదు కానీ, ఏడు కానీ మెట్లు లాగా తయారు చేసి అందులో ఒక వెంపలి చెట్టు కొమ్మని కానీ, తులసి కొమ్మని గుచ్చుతారు. వెంపలి మొక్క అంటే ముదురు ఊదా రంగు పువ్వులతో ఉండే చిన్న మొక్క. వెంపల చెట్టు శాస్త్రీయ నామం Tephrosia purpurea. ప్రత్యేకంగా ఈ మొక్కనే ఎందుకు వాడతారో నాకు తెలీదు కానీ "పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో 'వెంపల చెట్టుకి నిచ్చెనలు వేసేవాళ్ళు పుట్టుకొస్తారు' అని చెప్పిన మొక్క ఇదేనని, ఇంత చిన్న మొక్కకి నిచ్చెనలు వేయడమేమిటో విడ్డూరం" అని మా అమ్మమ్మ చెప్పేది.
దసరా నవరాత్రుల మొదటి రోజు సాయంకాలం ఎవరైతే గౌరమ్మని ఎత్తుకుంటానని మొక్కుంటుందో ఆవిడ ఇలా మట్టి దిమ్మెలపై ప్రతిష్టించిన వెంపలి మొక్కని ఒక ఇత్తడి తాంబోళంలో పెట్టి పసుపు, కుంకుమలతో పూజించి గాజులు, జాకెట్టు ముక్క మొదలైనవాటితో అలంకరిస్తారు. ఆ మొక్కే గౌరమ్మతల్లి రూపం అన్నమాట. సాయంకాలం కాస్త ఎండ తగ్గాక ఇంటి ముందు వాకిట్లో అంతా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి అక్కడొక స్టూలు వేసి దాని మీద గౌరమ్మని తెచ్చి పెడతారు. చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ, ముఖ్యంగా చిన్నపిల్లలు, పెళ్ళి కాని పిల్లలు అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తలా ఒక ప్లేటులో ఆకులు పరిచి దాని మీద వాళ్ళకి దొరికిన పువ్వులతో గుండ్రంగా వరుసల్లో అలంకరించి ఆ పూలపళ్ళాలు తీసుకుని గౌరమ్మ దగ్గరికి వస్తారు.

ముందుగా గౌరమ్మని పెట్టిన ఇంటావిడ దీపారాధన చేసాక అందరూ తాము తీసుకొచ్చిన పూలపళ్ళాలని గౌరమ్మ చుట్టూరా కింద నేల మీద పెట్టి అందరూ దండం పెట్టుకున్నాక పాటలు పాడటం మొదలుపెడతారు. ఎవరైనా ఒకరు చెప్తుంటే మిగతా వాళ్ళందరూ వారిని అనుకరిస్తూ పాడతారు. పాటల్లో ప్రతీ వాక్యానికీ చివర ఉయ్యాల, చందమామ, గుమ్మడి, క్రోలు ఇంకా చాలా రకాలైన పదాలతో పాటలు ఉంటాయి. ఈ పాటల ప్రహసనం చాలా సరదాగా ఉంటుంది. చిన్నపిల్లలకి అంటే పదేళ్ళ లోపు వాళ్ళకి వచ్చిన ఒక మూడు నాలుగు చిన్న పాటలుంటాయి. నాకిప్పుడు సరిగ్గా గుర్తు లేదు కానీ ఒక పాట ఉండేది పువ్వల పేరు మీద. అదే పాటని ఒకసారి బంతిపూలు అనీ, ఒకసారి కలువపూలనీ, గులాబీలనీ ఇలా మార్చి మార్చి మళ్ళీ పాడేవాళ్ళం. పదిహేను పదహారు వయసున్న ఆడపిల్లలకి ఎక్కువ పాటలు, పెద్ద పెద్ద పాటలు వచ్చేవి. మొత్తం జట్టులో ఎవరికైతే ఎక్కువ పాటలు, కొత్త కొత్త పాటలు వస్తాయో ఆ అమ్మాయి నాయకత్వంలో అన్నీ నడిచేవి. అంటే అందరం ఆ అమ్మాయి చెప్పినట్టు నడుచుకోవాలన్నమాట. మధ్య మధ్యలో పనుల్లో తీరిక చేసుకుని పెద్దవాళ్ళు వచ్చి ఒకటి రెండు పాటలు పాడి వెళ్ళేవారు. "ఏవిటే నీరసంగా మీ పాటలూ మీరూ.. మా చిన్నప్పుడైతే మేము గౌరమ్మ దగ్గర పాటలు పాడుతుంటే రెండు వీధులవతల దాకా ఖంగుమనేది. అంత సిగ్గైతే ఎలా.. గట్టిగా గొంతెత్తి పాడండీ" అని ఉత్సాహపరిచే పెద్దవాళ్ళు కొంతమంది ఉండేవారు. "నువ్వు పాడు వదినా, నీకు ఆ మోదుగపూల పాట వచ్చుగా, చిలకమ్మ పాట పాడితే జయక్కే పాడాలి.." ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరాచికాలూ, ఆట పట్టించుకోడాలు, బతిమాలించుకుని సిగ్గుపడుతూ పాడటం.. ఆడవాళ్ళ నవ్వుల మెరుపులు గౌరమ్మ చుట్టూ ఉన్న రంగురంగుల పువ్వులతో పోటీ పడేవి.

సాధారణంగా పాటల్లో అమ్మాయిల ఊసులో, అమ్మవారి స్తుతో ఉండేవి. ఒక పాట ఉండేది. పెళ్ళైన ఒకమ్మాయిని అత్తవారింటి నుంచీ పండక్కి పుట్టింటికి తీసుకువెళ్ళడానికి ఆ అమ్మాయి అన్నలు వస్తారు. ఆ అమ్మాయి ఇంట్లో అత్తమామలు, బావలు, మరుదులు, తోడికోడళ్ళు అందరికీ చెప్పీ పండక్కి పుట్టింటికి వెళ్ళడానికి అనుమతి అడుగుతుంది. నాకు మొత్తంగా పాటలన్నీ గుర్తులేవు కానీ కొన్ని వాక్యాలు చెప్తాను. దాన్నిబట్టి పాటలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.

భారతం చదివేటి ఓ మామా గారూ..
మా అన్నలొచ్చారు క్రోలు మము పంపారండీ..
మీ అన్నలొస్తేనూ క్రోలు.. మీకేం తెచ్చారు..
నాకు నల్లచీర క్రోలు నెమలడుగుల రైక..
అత్తకి పట్టుచీర క్రోలు అద్దాల రైక..
పాపకి కట్నంగా క్రోలు పాలు త్రాగే గిన్నె..
******
తీగ మీద కూర్చుందెవరో గానీ తీగ నాగన్నుయ్యాలో..
తీగ మీద కూర్చుంది రాములు వారు తీగ నాగన్నుయ్యాలో..
రాములవారి ముందుకు ఎవర్ని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
రాములవారి ముందుకు సీతను తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
సీత ముందుకు ఎవర్ని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
సీత ముందుకు గజ్జెలు కట్టిన పాపని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
******
ఒక పాటలో అమ్మాయి కొలనులో ఉన్న కలువపూలు తెచ్చిమ్మని అబ్బాయిని అడుగుతుంది. అబ్బాయి నీళ్ళలోకి వెళ్ళి గిరకల లోతు నీళ్ళున్నాయి కష్టం అంటాడు. అమ్మాయి అయినా పూలు కావాలంటుంది. తర్వాత పిక్కల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు, పీకల లోతు నీళ్ళున్నాయి అని చెపుతూ ఉంటాడు అబ్బాయి. చివరికి ఎలాగో పువ్వులు తెచ్చిస్తాడు.
******
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
కొమ్మ వంచకుండా పూలు కోయండి..
పూలు నలగకుండా మాల కట్టండి..

ఈ పాటలో ఒక లైను ఉంటుంది 'అద్దంలో నా మొగుడు నను చూసి నవ్వే..' అని. అది పాడటానికి తెగ సిగ్గుపడిపోయేవాళ్ళం అందరం. అప్పటిదాకా పెద్ద పెద్దగా పాడేవాళ్ళం కాస్తా ఆ ఒక్కటీ నెమ్మదిగా పాడేవాళ్ళం. ఇలా గౌరమ్మ చుట్టూ పాటలు పాడేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ అబ్బాయిలు ఉండటానికి వీల్లేదు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు అయితే పర్లేదు కానీ పడుచు కుర్రవాళ్ళు కనిపిస్తే అమ్మాయిలంతా నిశబ్దం అయిపోయేవాళ్ళు. ఆడపిల్లలు సిగ్గుపడుతున్నారు మీరు వెళ్ళండ్రా అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. చిన్నప్పుడు ఏదో పాటలో 'ఢిల్లి మీద డిప్పరాజు క్రోలు' అని ఉన్న వాక్యం పట్టుకుని "అదేంటక్కా.. ఒకసారి మళ్ళీ పాడు" అని పదే పదే పాడి ఏడిపించేవాడు మా తమ్ముడు.

గౌరమ్మ చుట్టూ నిలబడి ఒక గంటన్నరో, రెండు గంటలో పాటలు పాడాక గౌరమ్మని పెట్టిన పెద్దావిడ కొబ్బరికాయ కొట్టి మంగళ హారతి ఇస్తుంది. తర్వాత గౌరమ్మని తీసుకెళ్ళి వాళ్ళింట్లో దేవుడి గదిలో పెట్టేస్తారు. పిల్లలంతా కలిసి పేర్చుకొచ్చిన పూలపళ్ళాలు ఎవరిది వారు తీసుకుని రెండు చేతులతో పట్టుకుని వాటిని నిమజ్జనం చెయ్యడానికి వాగుకి వెళ్ళేవాళ్ళం. ఆ పూలపళ్ళేల మధ్యలో దీపం వెలిగించి పెట్టేవాళ్ళం. రోజుకొక మట్టి ప్రమిద కావాలంటే ఇంట్లోవాళ్ళు ఇవ్వరు కాబట్టి గుండ్రంగా ఉండే ఉమ్మెత్త కాయలని ముచ్చిక తీసి, పైనున్న ముల్లులు అరిగిపోయేలా గచ్చుకేసి రుద్ది, లోపలంతా శుభ్రం చేసి అందులో నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించుకునేవాళ్ళం. చిన్నపిల్లలు ఆ ఉమ్మెత్తకాయ దీపాలు తయారు చేసిమ్మని కాస్త పెద్ద అమ్మాయిల చుట్టూ అక్కా అక్కా అంటూ తిరిగి బతిమాలేవాళ్ళు. ఇప్పటిదాకా అబ్బాయిలు దగ్గరలో కనిపించరు కానీ గౌరమ్మ పళ్ళాలు తీసుకుని వాగుకి వెళ్ళేప్పుడు మాత్రం సిద్ధమైపోతారు. అంటే మరి అంగరక్షకుల్లా పక్కనే వెళ్ళి దార్లో ఎవరూ ఏ ఇబ్బందీ పెట్టకుండా అమ్మాయిల చేత క్షేమంగా నిమజ్జనం చేయించి రావాలి కదా, అదన్నమాట మగపిల్లల బాధ్యత.

మా ఊరి బయట చిన్నవాగు, పెద్దవాగు అని రెండు ఉండేవి. రెండూ వెళ్ళి గోదావరిలోనే కలుస్తాయి. చిన్నవాగుకి వెళ్ళాలంటే ఒకవైపు పొలాలు దాటుకు వెళ్ళాలి. పెద్దవాగేమో ఇంకో పక్క రోడ్డు దాటి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలన్నా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉండేది. అప్పుడే చీకట్లు పడుతుండగా పువ్వుల మధ్యన వెలుగుతున్న దీపాలతో అమ్మాయిలందరం గౌరమ్మ పాటలు పాడుకుంటూ కాస్త వెనుకగా అబ్బాయిలు నడుస్తూ వాగు దాకా వెళ్ళేవాళ్ళం. ప్రతీ రోజూ తెగ చర్చించుకునేవాళ్ళం ఈ రోజు చిన్నవాగుకి వెళదామా, పెద్దవాగుకి వెళదామా అని. వెళ్ళే దారిలో పక్క వీధుల వాళ్ళు కూడా మాలాగా గౌరమ్మ పాటలు పాడుతూ ఎదురువస్తారుగా, అప్పుడు వాళ్ళ కన్నా మనం గట్టిగా పాడాలి, వాళ్ళకి తెలియని కొత్త కొత్త పాటలు పాడాలి అని భలే పోటీలు పడేవాళ్ళం. ఎవరైనా మాకు తెలియని కొత్త పాట పాడినట్టు వినిపిస్తే అదేంటో తెలుసుకుని అర్జెంటుగా నేర్చేసుకోడానికి ప్రయత్నాలు జరిగేవి.

వాగు దాకా వెళ్ళాక ఒక్కొక్క పూల పళ్ళాన్ని పూలు చెదిరిపోకుండా నెమ్మదిగా నీళ్ళ మీద తేలేట్టు వదలడం అందరికీ వచ్చేది కాదు. బాగా వచ్చిన వాళ్ళు మిగతావాళ్ళవి కూడా వదలడానికి సాయం చేసేవాళ్ళు. పువ్వులు పేర్చుకునేప్పుడే కింద ఆకులు పరుస్తాం కాబట్టి సులువుగానే ఉండేది. కాకపోతే వాగు గట్టున జారిపడిపోకుండా కాస్త జాగ్రత్తగా చేయాలంతే. గౌరమ్మ పళ్ళాలన్నీ నీళ్ళలో వదిలాక ఎవరి గౌరమ్మ ఎలా వెళుతుందో దీపం ఎలా వెలుగుతుందో కనుచూపుమేరా చూసుకుంటూ ఉండేవాళ్ళం. దీపం ఆరిపోకుండా, పువ్వులు చెదిరిపోకుండా చక్కగా వెళితే తృప్తి అన్నమాట. ఒకోకసారి నీళ్ళలో ఏదైనా అడ్డు తగిలో,అవి పక్కకి కొట్టుకు వచ్చో మధ్యలో ఆగిపోతే మగపిల్లలు తమ వెంట తెచ్చిన పొడవాటి కర్రలతో ఎలాగోలా వాటిని నీటిప్రవాహంలోకి మళ్ళించేవారు. ఈ పనులన్నీ చేసేప్పుడు అప్పుడప్పుడూ సాహసాలు జరుగుతుండేవి. ఎవరైనా కాలుజారి నీళ్ళలోకి జారడం, కర్రతో సరిచేయబోయి పట్టు తప్పి నీళ్ళలో పడిపోవడం, పొరపాటున పూలతో పాటు పళ్ళెం నీళ్ళలో జారవిడిచేయడం లాంటివి. అలా ఏదైనా జరిగితే వాటి గురించి కథలు కథలుగా వర్ణించి చెప్పుకుంటూ, ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి మాత్రం తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడేవాళ్ళం. నిమజ్జనం అయిపోయాక ఖాళీ పళ్ళాలతో పాటు గౌరమ్మ ప్రసాదంలా వాటిలోంచి రెండు మూడు పువ్వులు తీసుకుని జళ్ళో తురుముకుని ఇంటిదగ్గర వాళ్ళకి కూడా తీసుకెళ్ళేవాళ్ళం. ఏ పక్క వీధి వాళ్ళో ఎదురొచ్చినప్పుడు అప్పటికప్పుడు బిగ్గరగా పాటలు పాడుతూ నవ్వులు, కబుర్లతో తిరిగి మళ్ళీ గౌరమ్మని పెట్టిన ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పటికే ఆవిడ కొట్టిన కొబ్బరికాయతో పాటు వడపప్పు, పంచదార కలిపి ప్రసాదం చేసి సిద్ధంగా ఉంచేది. అందరి పళ్ళాల్లోనూ గుప్పెడు ప్రసాదం పెట్టిచ్చాక అది తినుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు.

ప్రతీరోజూ మధ్యాహ్నం నుంచే ఎవరింట్లో నుండి ఏ పువ్వులు తెచ్చుకుని గౌరమ్మని పేర్చుకోవాలా అన్న ఆరాటంలో, వెతుకులాటలో ఆడపిల్లలందరూ తలమునకలుగా ఉండేవారు. పండుగ రోజు దాకా పండగంతా పిల్లలదే. పువ్వులు పేర్చుకోవడం, వాగుకి వెళ్ళి రావడం సరదాగా ఉండేది. చివరి రోజైన దసరా రోజు మాత్రం సందడంతా పెద్దవాళ్ళదే. పిల్లలు ఎంచక్కా కొత్తబట్టలు వేసుకుని అందంగా ముస్తాబై అమ్మలు, అత్తలు, పెద్దమ్మలు, పిన్నులు అందరూ కలిసి చేస్తున్న గౌరమ్మ వేడుకలని చూసి ఆనందించడమే.

పండుగ రోజు గౌరమ్మని ఎత్తుకునే ఆవిడతో పాటు, చుట్టూరా గౌరమ్మ పళ్ళాలు ఎత్తుకునేవాళ్ళు కూడా చాలామంది రోజంతా ఉపవాసం చేస్తారు. ముందు రోజు నుంచే పొలాలు, చేల వెంబడి తిరిగి బస్తాల కొద్దీ తంగేడు పువ్వులు, చెరువులోకి దిగి కలువు పూలు, తామరపూలు, అందరిళ్ళ నుంచీ సేకరించిన బంతిపూలు, సీతమ్మవారి జడబంతి, బంగళాబంతి, చామంతులు.. ఒకటేమిటి దాదాపు పువ్వులు పూసే ప్రతీ మొక్కనీ ఖాళీ చేసి గుట్టలు గుట్టలు పూలు పోగు చేస్తారు. ఒక వీధిలో కలిసి చేసుకుంటున్నవారంతా ఎక్కడో ఒకరింట్లో విశాలమైన గదిలో కూర్చుని ఆ పువ్వులన్నీటితో ఎవరెవరు గౌరమ్మని ఎత్తుకుంటారో వాళ్ళందరి పేరు మీదా లెక్క ప్రకారం పూలపళ్ళేలు సిద్ధం చేస్తారు. నీళ్ళ మీద వదిలాక తొందరగా విడిపోకుండా ఉండేలా పకడ్బందీగా ఉండేట్టు మధ్యలో అంతా ఒత్తుగా తంగేడు ఆకులు, పువ్వులు పేర్చి పైన కనిపించేలా వరుసల్లో రంగురంగుల పువ్వులు పేర్చేవాళ్ళు. ఇక్కడ కూడా అందరికీ పోటీ, ఈ ఏడాది ఎవరి గౌరమ్మ పెద్దగా ఉంటుందో, ఎవరు ఎక్కువ అందంగా అలంకరిస్తారో చూడాలని. చాలా వెడల్పైన పెద్ద పెద్ద తాంబోళాల్లో గౌరమ్మలని పేర్చేవాళ్ళు. పూలతో అంతా సిద్ధం అయిపోయాక చివర్లో రంగు కాగితాలు, తళుకు కాగితాలు కత్తిరించి చేసిన గొలుసు దండలు, పూల బొమ్మలు పైపైన అలంకరించేవారు. వెంపలచెట్టు కొమ్మలకి రంగు రంగుల గాజులు, పూసలు అందంగా కట్టేవారు. ఇవన్నీ చూడ్డానికి చాలా అందంగా ఉండేవి కానీ బోలెడంత బరువు ఉండేవి. వీటిని ఆడవాళ్ళు తలకెత్తుకుని ఊరేగింపుగా గోదావరి దాకా తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలన్నమాట. కాబట్టి గౌరమ్మని ఎత్తుకోవడం అంటే సామాన్యమైన పని కాదు.

దసరా రోజు సాయంత్రానికల్లా ఒకటో రెండో ఎడ్ల బండ్లు సిద్ధం చేసి వాటికి కూడా రంగు కాగితాలు అవీ అంటించి అందంగా ముస్తాబు చేసేవారు. వాటిలో బ్యాటరీ సహాయంతో పెట్టిన మైకుసెట్టు ఉండేది. సాయంత్రం నాలుగింటికల్లా పిల్లా పెద్దా అందరూ కొత్త బట్టలతో తయారై గౌరమ్మ చుట్టూ చేరేవారు. మగవాళ్ళంతా నిమజ్జనం ఏర్పాట్లు చూసుకునేవారు. ఊరు ఊరంతా గౌరమ్మల చుట్టూనే ఉంటారు. రోజూ లాగే ఆరుబయట వాకిట్లో అందంగా అలంకరించిన పెద్ద పెద్ద గౌరమ్మలని కొలువుదీర్చి ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి పాటలు పాడతారు. పండుగ రోజు స్పెషల్ ఏంటంటే మైకు ఉండటం. ఒక్కో వీధిలోంచి ఒకరిని మించి ఒకరి గౌరమ్మ పాటలతో ఊరంతా హోరెత్తిపోతుంది. అందరూ వచ్చి గౌరమ్మ దగ్గర కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేసుకుంటారు. పండగ రోజుకి ఊర్లో ఉండేవాళ్ళే కాకుండా, పెళ్ళిళ్ళు చేసుకుని వేరే ఊర్లకి కాపురాలకి వెళ్ళిన ఆడపడుచులందరూ పండక్కి పుట్టింటికి వచ్చి గౌరమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు.

ఒక రెండు గంటల సేపు ఇంటిదగ్గర పాటలు అయ్యాక అందరూ గౌరమ్మలని ఎత్తుకుని ఊరేగింపుగా గోదావరికి బయలుదేరతారు. అంతంత నిండుగా పేర్చడం వల్ల కేజీల కొద్దీ బరువుండే పెద్ద పెద్ద గౌరమ్మలని తలకెత్తుకుని ఊర్లోని ప్రధాన వీధుల గుండా వెళుతూ మధ్య మధ్యలో గుళ్ళ దగ్గర ఆగి ప్రదక్షిణాలు చేస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి దాకా సాగుతుంది గౌరమ్మ ఊరేగింపు. బ్యాండు మేళం, పాటలు, మైకులు, బాణాసంచా మెరుపులు వీటన్నిటి మధ్యా అందరూ కాలినడకన ఊరేగింపుగా వెళుతుంటే చిన్న పిల్లలందరినీ గౌరమ్మ వెంట వెళుతున్న ఎడ్లబండిలో ఎక్కిస్తారు. నాకు బండిలో ఇరుక్కుని కూర్చుని, మధ్య మధ్యలో నిలబడి చుట్టూ చూడాలన్న ప్రయత్నం చేస్తూ వెళ్ళిన జ్ఞాపకాలే ఎక్కువ. మైకులో రకరకాల పాటలు బోల్డు వేసేవారు. అన్నీ బానే ఉండేవి కానీ 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా..' అన్న పాట విన్నప్పుడల్లా నాకు ఇబ్బందిగా అనిపించేది. దేవతని పట్టుకుని భయం భక్తీ లేకుండా నీ మొగుడెవరమ్మా అంటారేమిటీ, తప్పు కదా, కళ్ళు పోవూ.. ఇదేం పాటో ఏమిటో అనుకునేదాన్ని. అప్పుడు దసరా పండక్కి విన్న పాటల్లో చాలావరకూ పాత సినిమా పాటలేనని నాకు చాలా యేళ్ళ తర్వాత తెలిసి నవ్వొచ్చింది. :-)

ఒక రెండు మూడు గంటల పాటు ఊరేగింపుగా సాగాక చివరికి అందరూ గోదావరి ఒడ్డుకి చేరి అక్కడ గౌరమ్మలని నిమజ్జనం చేసి ఇంటికి తిరిగొస్తారు. ప్రసాదాలు అవీ మామూలే. చేలల్లోంచి గోదావరి దాకా మట్టిదారుల్లో నడిచి వెళ్లి నిమజ్జనం చేసి రావడం అనేది కాస్త సాహసంతో కూడుకున్న పని. అందుకే మగవాళ్ళందరూ పక్కనే ఉండి చాలా సాయం చేస్తారు. పిల్లలని అయితే అసలు అక్కడిదాకా రానివ్వరు. మా అమ్మ చెప్పేది, వాళ్ళ చిన్నప్పుడు అంటే పెళ్ళి కాకముందు లంగావోణీలు వేసుకునే రోజుల్లో దసరా రోజులకి గోదావరిలో నీళ్ళు మరీ ఒడ్దు దాకా కాకుండా కాస్త లోపలకి ఉండేవంట. వీళ్ళందరూ ఇసుకలోకి వెళ్ళి గోదాట్లో గౌరమ్మలని వదిలాక వెన్నెల వెలుగులో ఇసుకలో గౌరమ్మ పాటలు పాడుకుంటూ చెమ్మచెక్కలు, ఒప్పులకుప్పలు, వెన్నెలకుప్పలు లాంటి రకరకాల ఆటలు ఆడుకుని ఆడుకునీ అలసిపోయి ఎప్పటికో తిరిగివచ్చేవాళ్ళట. అంత అందమైన జ్ఞాపకం నాకైతే దొరకలేదు మరి!

నా చిన్నప్పుడు ఇలా చేసుకునే గౌరమ్మ పండుగని మా ఊళ్ళో ఇప్పటికీ జరుపుకుంటున్నారు. గౌరమ్మ, బతుకమ్మ అని రకరకాల పేర్లతో జరుపుకునే ఈ దసరా పండుగ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పండుగ. తెలంగాణాలో ప్రాంతాల్లో ఒక్కోచోట ఒక్కోరకంగా వాళ్ళ ఇల్లు, వీధి, ఊరు వరకే పరిమితమై జరుపుకునే ఈ బతకమ్మ పండుగ ఉన్నట్టుండి రాష్ట్రీయ, జాతీయ, ఇంకా మాట్లాడితే అంతర్జాతీయ పండుగలాగా అయిపోయి మంత్రులు, ఎంపీలు, పోలీసులు, కలెక్టర్లు, అధికారులు ఆడా, మగా తేడా లేకుండా మహా గొప్పగా నెత్తి మీద బతుకమ్మలతో ఫోటోలు దిగి పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా అంతా ఇదే అయిపోయి భక్తి, సాంప్రదాయం కన్నా ఆడంబరం, గొప్పతనాన్ని చాటుకోవడానికి పనికొచ్చేలా రూపం మార్చుకుని కనిపిస్తుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తున్నమాటైతే వాస్తవం. కానీ ఎవరి సంబురం వాళ్ళిష్టం కాబట్టి, అసలే మనది ప్రజాస్వామ్యం కాబట్టి.. అందరికీ గౌరమ్మ పండగ శుభాకాంక్షలు. :-)

Wednesday, October 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 10

కోపంగా వెళ్ళిపోయిన నీలూ మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి తమ మధ్య జరిగిన వాదోపవాదాలు మర్చిపోయి ఆనందంగా మాట్లాడింది రజని. అప్పటికే రాసి కవర్లో పెట్టి అంటించిన ఉత్తరాన్ని నీలూ చేతిలో పెడుతూసాధ్యమైనంత త్వరగా శ్రీకాంత్ కి ఇచ్చెయ్యి అంది.​
సరేనన్నట్టు తలూపి రజని ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళిందినీలూ.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక అక్టోబరు సంచికలో...​

 

Monday, September 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 9


నాన్నగారు కిరణ్ తో మాట్లాడుతుండటంఆశ్చర్యంగా చూసింది మేఘ.
మెయిన్ రోడ్ మీద ఆటో కోసం ఎదురుచూస్తున్నప్పుడు పక్కనే నించున్న అబ్బాయిలు పరిచయం అయ్యారు. మాటల్లో మీ కాలేజీ పేరు, నీ పేరు చెప్తే మీరంతా స్నేహితులని చెప్పారు. కిరణ్, ప్రదీప్ అని పేర్లు చెప్పగానే మనింటికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడానని గుర్తొచ్చింది. ఆటో దొరకలేదు కానీ అలా కులాసాగా మాట్లాడుకుంటూ నడిచే వచ్చేశాం మేఘ ఆశ్చర్యానికి వివరణ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక సెప్టెంబరు సంచికలో...​


Thursday, August 07, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 8


హలో..
హాయ్ మేఘా.. ఎలా ఉన్నావ్? చాలా మాటలు వినపడుతున్నాయి. ఏంటీ హడావుడి?
బావున్నాను. ఇంతకు ముందు నీతో మాట్లాడిన సిసింద్రీ మా పిన్ని కొడుకు. వాడికి భోగిపళ్ళు పోసే కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు. అదే హడావుడి. నువ్వెలా ఉన్నావ్?
సూపర్ గా ఉన్నా. నువ్వు పంపిన కార్డ్ అందింది. డాడీ తెచ్చిచ్చారు మధ్యాహ్నం.
ఏమన్నా అన్నారా? ఇన్ని రోజుల తన ఆరాటాన్నంతా ఒక చిన్నమాట చాటున దాచేసి చాలా మామూలుగా అడిగింది మేఘ.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక ఆగస్టు సంచికలో...​

Thursday, July 03, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 7

మేఘ కాదన్నాక కూడా కిరణ్ ఎదురుపడ్డాడంటే ఇప్పుడేం జరుగుతుందో చూడాలన్న ఉత్సుకత కలిగింది రజనికి. సరిగ్గా అదే కారణంగా ఆందోళన మొదలైంది నీలూకి. మేఘ మనసులో భావాలని ఇదీ అని చెప్పడం కష్టం. కానీ ముగ్గురూ తమ ఉద్దేశ్యాలేవీ ముఖాల్లో కనపడనీయకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూలై సంచికలో... ​

Tuesday, June 24, 2014

​జర్మనీయం e-పుస్తకం


2013 జనవరి నుంచి డిసెంబరు దాకా ఏడాది పాటు కౌముది సాహిత్య పత్రికలో 'జర్మనీయం' శీర్షికన నేను రాసిన వ్యాసాలు అన్నీ కలిపి 'e- పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.  కౌముదికి ధన్యవాదాలు.

Wednesday, June 04, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 6

పరీక్ష రాయడానికి వెళ్ళిన రజని ప్రేమలేఖ తీసుకొచ్చాననడం, నీలూ రజని మీద కోపంగాఅరవడం చూసిన రేవతి ఇద్దరినీ శాంతింపచేసి మీరిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. అలా పక్కకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం పదండి అంటూ పక్కనే ఖాళీగా ఉన్న క్లాసురూంలోకి తీసుకెళ్ళింది.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూన్ సంచికలో... 


Sunday, June 01, 2014

వంగూరి ఫౌండేషన్ ఉగాది బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు'

​వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.
చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..

Wednesday, May 28, 2014

పూలకోనలో కోరి కురిసిన వాన


నడిరాత్రి నిద్రలో మెలకువొచ్చేసరికి ఇంటి పైకప్పుకి ఏటవాలుగా ఉన్న కిటికీ అద్దాల మీద దడ దడమని దురుసుగా దూకుతున్న వాన చినుకుల చప్పుడు. ​ఊరంతా నిద్రలో మునిగి తన ఉనికిని ఎవరూ పట్టించుకోకపోయినా నాకు ఇవ్వడమే తప్ప ఎదురు ఆశించడం తెలీదన్నట్టు నిర్విరామంగా చీకట్లో కురుస్తూనే ఉంది వాన. నిద్ర పూర్తిగా విదిలించుకుని పారిపోయాక కళ్ళు తెరిచి కిటికీ మీద కురుస్తున్న వానధారల నీడలు గది లోపల గోడల మీద పడుతుంటే వాటికేసి చూస్తూ వానని వింటూ ఉండిపోయాను. వానంత నిస్వార్థంగా బదులు ఆశించకుండా మనం ప్రేమను పంచగలమా.. ఉహూ.. ఆశించడం సంగతి పక్కన పెట్టినా మన ఉనికిని సైతం గుర్తించకపోయినా అంతే హాయిగా ప్రేమిస్తూ ఉండగలమా? హ్మ్.. ఏవిటో ఈ అర్ధరాత్రి వేదాంతం.. ఆలోచనలకి పగలూ రాత్రి తేడా తెలీదెందుకో!

ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో గుర్తే లేదు. ఉదయం నిద్ర లేచేసరికి వాన సవ్వడి వినపడలేదు. లేచొచ్చి కిటికీ తెరలు పక్కకి జరిపి చూస్తే సన్నటి వాన మౌనంగా కురుస్తూనే ఉంది. తర్వాత గంటకోసారి ఎన్నిసార్లు కిటికీలోంచి బయటికి చూసినా అదే దృశ్యం. అలా అలా అలవోకగా ఆకాశం నుంచి రాలుతున్న వానజల్లు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మళ్ళీ పగలు, మళ్ళీ రాత్రి.. రోజులు తేదీలు మార్చుకుంటున్నాయి కానీ వాన రంగు మాత్రం మారడం లేదు. ఏవిటీ వాన.. ఎన్నాళ్ళైనా ఆగదా.. అలాగని ఉరుములు, మెరుపులతో గర్జించదు. ఏ మాత్రం ఆవేశం ప్రదర్శించకుండా అంతే స్థిమితంగా అలుపూ సొలుపూ లేకుండా కురుస్తూనే ఉంది వాన. ఆకాశం ఎన్నాళ్ళ నుంచి దాచుకుందో ఈ చినుకులన్నీ ఇలా ధారాళంగా నేల మీదకి వంపేస్తోంది. ఇంకా చాల్లే ఆపవోయ్.. అని ఎలా వానకి చెప్పడం? ఎవరు చెప్తే వింటుందో! బయట చెట్టూ చేమా గడ్డీ అంతా మసక మసగ్గా నీటి ఆవిరి కమ్ముకున్నట్టు అయిపోయాయి. గాలికి ఊగుతున్న చెట్లని చూస్తుంటే వానకి తడిచీ తడిచీ వణికిపోతున్నట్టున్నాయి పాపం!

వాన సంగతి మర్చిపోయి నా పనిలో నేనుంటే కిటికీలోంచి ఇంట్లోకి జొరబడిన వెలుతురు రేఖలు వెన్ను తట్టి పిలిచాయి. ఆహా ఎండ వచ్చేస్తోందని సరదాపడి కిటికీ ముందుకొచ్చాను. ఎండ పొడ తాకిడికి సిమెంటు నేల మీది వాన జాడలు క్రమంగా మాయమైపోతున్నాయి. చెట్లన్నీ గాలి వీవెనతో నీటి చుక్కల్ని సుతారంగా దులుపుకుంటూ కొమ్మల్నీ ఆకుల్నీ ఆరబెట్టుకుంటున్నాయి. ఒక గంట గడిచిందో లేదో మళ్ళీ నల్ల మబ్బులు తొంగి చూస్తున్నాయి. ఇక అప్పటి నుంచీ కాసేపు సన్నటి చినుకురవ్వలు, కాసేపు పల్చటి ఎండ, మరి కాసేపు రెండూ కలిసి జంటగా పాడే యుగళగీతం.. వింతగా కవ్వింతగా మారిపోతున్న పరిసరాల రంగుల్ని చూస్తుంటే నాక్కూడా వాటిలో భాగమైపోవాలనిపించింది. అవ్వడానికి సాయంత్రం అయిదవుతున్నా ఈ కాలం ఇప్పుడప్పుడే ఎండ పోదు, చీకటి పడదు కాబట్టి ఈ వాతావరణంలో ఉద్యానవన విహారం చేస్తే బాగుంటుందనిపించింది. వసంత కాలపు పూత పూసే మొక్కలన్నీ కలిసి తోటని రోజుకో రంగులో ముస్తాబు చేసి మురిపిస్తుంటాయి. అదీగాక ఈ మధ్య తోటలోని మొక్కల్ని, పువ్వుల్ని పలకరించి కూడా చాన్నాళ్ళైపోయింది.

చిన్నా పెద్దా రంగూ రూపం తేడా చూపకుండా అందర్నీ సమానంగా ఆదరించే వర్షపు జల్లుల్లో విరిసిన పూలమొక్కలు ఎంత తాజాగా మెరిసిపోతున్నాయోనని చూడబోయే పూలతోటని తల్చుకుని ఉవ్విళ్ళూరుతూనే ఈ ఎండావానల్ని నమ్మడానికి లేదని చిన్న గొడుగు తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాను. ఒక పది అడుగులు వేసానో లేదో చిటుక్కు చిటుక్కుమంటూ వాన చుక్కలు మొదలైపోయాయి. క్షణంలో గొడుగు చాటున దూరిపోయాను. ఇంకో పదడుగులు వేసాక చుట్టూ కనిపిస్తున్న ఆకుపచ్చటి నేస్తాలని చూసి వాటిలా నేనూ హాయిగా ప్రకృతిలో భాగమైపోవాలని వచ్చి ఇంత చిన్న జల్లుకే ముడుచుకుపోతే ఈ భాగ్యానికి రావడమెందుకూ అనిపించింది. ఒకేసారి గొడుగుని మూసెయ్యడానికి తటపటాయించి కొద్ది కొద్దిగా గొడుగుని పక్కకి నెట్టేస్తూ మెల్లమెల్లగా ఒక్కో చినుకునీ పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక్కో వాన చుక్క దగ్గరయ్యేకొద్దీ మనసులో తనువులో ఉరకలెత్తే ఉత్సాహంతో పాదాలు నేల విడిచి గాల్లో తేలుతున్నట్టుంది. మరో పదడుగులు పడేసరికి గొడుగుని పూర్తిగా వదిలించుకోగానే ఒక్కసారిగా మూసిపెట్టిన పంజరంలోంచి మాయమై విశాలాకాశంలోకి రెక్కలు విప్పుకు ఎగిరి వచ్చినట్టుంది. ఎక్కడో సుదూరపు మబ్బుల లోకం నుంచి దిగి వచ్చి నాతో జత కడుతున్న వాన చినుకులు నేను సైతం ఆ గగనసీమలకి చెందినదాన్నేమోనన్న ఊహలు రేపుతున్నాయి. వాన కురిసిన ప్రతీసారి అమ్మో తడవకూడదంటూ ఏవేవో కారణాలతో పారిపోతూ చివరిసారి ఎప్పుడు కావాలని మనసుపడి వానలో తడిసానో జ్ఞాపకం రావడం లేదు. బహుశా ఏళ్ళయిపోయినట్టుంది. అందుకేనేమో ఇంత ఉద్విగ్నంగా ఉందీ అనుభూతి ఎన్నో ఏళ్ళ ఎడబాటు తర్వాత నేను పూర్తిగా మర్చిపోయిన యుగాల నాటి 'నేను' నాకు ఎదుటపడినట్లుగా!


చినుకుల తోడుగా గాల్లో తేలుతూనే గతం, వర్తమానం, భవిష్యత్తు, నా చుట్టూ పరిగెడుతున్న ప్రపంచం, మనుషులు అన్నీ మాయమైపోగా అచ్చంగా నాదైన ఏకాంతసీమలో అడుగు పెట్టాను. వాన చినుకులు ఆగిపోయి ఎండొచ్చేస్తోంది. పచ్చిక, చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, పొదలు, తీగలు అన్నీ ప్రశాంత వదనాలతో కనిపిస్తున్నాయి. బహుశా నా మనసులో ప్రశాంతతే వాటిలో ప్రతిబింబిస్తుందేమో! చుట్టూరా చూసినంత మేరకు ఆకుపచ్చని పరిసరాలు కనిపిస్తుంటే ప్రశాంతత ఏ మూల దాక్కున్నా మనని వెతుక్కుంటూ రాదూ? రంరగురంగుల టులిప్స్ మీద నిలిచిన వాన చుక్కలు ఒక్కో రంగు పువ్వుల మీద ఒక్కోలా కనిపిస్తుంటే 'స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు' అని చిన్నప్పుడు బళ్ళో చదువుకున్న పాఠం గుర్తొచ్చింది. గాలి వీచినప్పుడల్లా ఆకుల మీదా పువ్వుల మీదా నిలిచిన నీటి ముత్యాలు వయ్యారంగా చేసే బ్యాలే చూడ్డం సరదాగా ఉంది. గాలికి ఊగుతున్న లిల్లీ ఆఫ్ ది వ్యాలీ, బ్లీడింగ్ హార్ట్స్, విస్టీరియా పూగుత్తులు, చాలావరకూ రాలిపోగా అక్కడక్కడా మిగిలిన మాగ్నోలియాలు, ఇప్పుడప్పుడే పూత మొదలైన పియోనీస్ అన్నీటినీ తరచి తరచి చూస్తుంటే అసలు ఇంత వైవిధ్యంగా అనూహ్యంగా అద్భుతంగా ఈ పువ్వుల డిజైనింగు ఎలా సాధ్యపడిందో అన్న ఆలోచన వెంటే ఇంటబ్బాయ్ వినిపించే ఫ్లవర్ జెనెటిక్స్ పాఠాలు గుర్తొచ్చాయి. ఊహూ.. ఈ అందమైన సృష్టి రహస్యాలు అంత సులువుగా ఇప్పుడప్పుడే మనిషికి పూర్తిగా అర్థమయ్యే అవకాశం లేదులే అనిపించింది.

వానకి తడిసిన మట్టి, పసరికతో కలిసి గాల్లో తేలి వస్తున్న లిలాక్స్ పరిమళం కోసం ఆ పొదల చుట్టే కాసేపు ప్రదక్షిణాలు చేస్తుండగా వాన చినుకులు మళ్ళీ దూసుకొచ్చాయి. దాదాపు అంతా ఖాళీగా ఉన్న తోటలో దూరంగా రెండు మూడు కదిలే గొడుగులు కనిపించాయి. 'గొడుగు పక్కన పడేసి చినుకుల్ని హత్తుకోండి' అని అరిచి చెప్పాలనిపించింది. మరో ఐదు నిమిషాలకి అసలు గొడుగులే మాయమైపోయాయి. అప్పుడప్పుడూ ఆకాశంలో రయ్యిమని దూసుకుపోతున్న విమానాలు తప్ప ఇంత పెద్ద తోటలో నా ఏకాంతాన్ని భంగం చేయడానికి మరెవ్వరూ మిగల్లేదు. తోటలోని పైన్ చెట్ల మీదుగా ఎగురుతున్న విమానాల్ని తల పైకెత్తి ముఖం మీద పడే వాన చినుకుల్ని తప్పించుకుని చూస్తూ ఏ విమానం ఏ ఎయిర్ లైన్స్ ది అయ్యుంటుందా అని కనిపెట్టే సరదా కూడా బాగుంది.


ఈ చిన్నారి పూల మొక్కలు దాటుకుని తోట లోపలివైపుకి వెళితే అక్కడ పెద్ద వనంలాగా ఉంటుంది. చుట్టూ పెద్ద చెట్లతో చుట్టుముట్టి మధ్యలో చిక్కగా కాస్త చీకటిగా రకరకాల పూపొదలతో నిండి ఉంటుంది. ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఒక్కోరకం పొదలు పువ్వులతో కనిపిస్తాయి. అటువైపుగా వెళ్ళబోతుండగా చినుకులు కాస్తా ధారలుగా మారి దడదడా కురవడం మొదలైంది వాన. మరీ పెద్ద వానేమోనని జంకుతూ నా బొమ్మలపెట్టె కోసమైనా గొడుగుని ఆశ్రయించక తప్పింది కాదు. అప్పటిదాకా నిశబ్దంగా ఉన్న పరిసరాల మధ్యలో ఒంటరిగా చుట్టూ చెట్ల మీద కురుస్తున్న వాన చేస్తున్న వింత శబ్దం వినడం బాగుంది. ఒక క్షణం ఇంటికి వెళితే నయమేమో అన్న ఆలోచన వచ్చినా ఎందుకో ముందుకే వెళ్ళాలనిపించింది. పచ్చిక మీద కాసేపు, చెట్ల మధ్యనున్న సన్నటి మట్టిబాటల్లో కాసేపు తిరుగుతూ దూరంగా వానలో తడుస్తున్న పీచ్ తోటని, పూత రాల్చిన చెర్రీ చెట్లనీ, ఆపిల్ చెట్లనీ చూస్తూ ముందుకి నడిచాను. ఒక చోట గుబురుగా దాదాపుగా భుజాలెత్తు పెరిగిన ఫెర్న్ మొక్కలు అన్నీ కాపీ పేస్ట్ చేసినట్టు క్లోన్స్ లా భలే ఉన్నాయి. వాటి మధ్యలోకి వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఇక్కడ విషప్పురుగు, పుట్ర పెద్దగా ఉండవులే కానీ కొంచెం భయమేసి ఆగిపోయాను.


వర్షం ఇంకాస్త మోపవుతోంది. దూరంగా ఆపిల్ చెట్ల వెనుకగా పూత రాలిపోయిన క్విన్స్ పొదల మాటున ఆకుల సందుల్లోంచి కొద్ది కొద్దిగా గులాబీ రంగు కనపడుతోంది. ఏం పువ్వులు పూచాయో చూద్దామని దగ్గరికెళ్ళాను. వళ్ళంతా పువ్వులు చేసుకున్నట్టుగా విరగబూసిన రోడోడెండ్రాన్ పొదలు కనిపించాయి. ఈ తోటకి ఒక చివరన గుబురుగా ఉండే ఎత్తైన చెట్ల మధ్యన పది పదిహేను రకాల రంగుల్లో రోడోడెండ్రాన్స్ ఉన్నాయని తెలుసు. అవన్నీ ఒకసారి చుట్టి వచ్చేద్దామని దారిలో మిగతా మొక్కల్ని తప్పించుకుంటూ కొమ్మల్ని, పొదల్ని తోసుకుంటూ ఆ కొస దాకా వెళ్ళాను. అందాకా వెళ్ళాక ఒక ఇరవై అడుగుల దూరంలో కళ్ళెదుట కనిపించిన దృశ్యాన్ని చూసి బొమ్మలా నించుండిపోయాను. అంతటి అందాన్ని చూసిన ఆనందంలో గట్టిగా కేరింతగా అరవాలనిపించింది. 'ఎంత బాగుందో చూడండి' అని ఎవరికైనా చెప్పాలనిపించింది. చుట్టూ చూస్తే నిశబ్దంగా నవ్వుతున్న పువ్వులు, చెట్లు తప్ప మనుషుల్లేరుగా!

అక్కడంతా ప్రవహిస్తున్న ఆకుపచ్చటి నది మధ్యన ద్వీపంలా చెట్టంతా విరగబూసిన గులాబీరంగు పూలచెట్టు. గాలికీ, వానకీ కదిలి ఒక్కొక్కటే అలవోకగా రాలిపడుతున్న పువ్వులు, అప్పటికే రాలి పడిన పువ్వులతో స్వాగతం చెపుతున్నట్టున్న అందమైన పూలదారి. అసలీ ఏకాంతలోకంలో ఈ పూలతోటలో ఇదంతా నా ఒక్కదాని కోసమే సృష్టించినట్టు, ఈ పూలన్నీ నాకోసమే పూసినట్టు, కథల్లో కలల్లోలా ఒక కొత్త లోకానికి వచ్చినట్టు, పైనుంచి కురిసే వానజల్లుల్లో తడుస్తూ.... అప్రయత్నంగా "ఇది మాత్రం చాలు ఇది మాత్రమే.. నాకింక చాలు ఇది మాత్రమే.." అని గొంతెత్తి పాడాలనిపించింది.


మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నన్ను ఆహ్వానిస్తున్న పూల తివాచీ వైపు నడిచాను. ఎంతసేపైనా కనురెప్ప వెయ్యకుండా ఆ పరిసరాల్నే చూస్తూ ఉండిపోవాలనేంత పరవశంగా అనిపించింది. ఇంకాస్త ముందుకెళితే చెంగావి రంగు పూలతో నిండిపోయి మరొక పూపొద. ఇంకాస్త ముందుకెళితే మరొక రంగు, ఇంకొక రంగు, రంగు రంగుల పూపొదల మజిలీలు..... "పర్పుల్, పింక్ అంటే ఒక రంగు కాదా?" అని అడిగే అబ్బాయిలందరికీ ప్రైవేట్ చెప్పడానికి సరిపోయేన్ని వన్నెల్లో విరగబూసాయి పువ్వులు. :-)

ఆ రంగురంగుల పూలపొదల చుట్టూ ఎంతసేపు తిరిగినా, ఎంత చూసినా తనివి తీరనంత సౌందర్యం. ఎన్ని ఫోటోలు తీసినా నా కంటికీ, మనసుకీ కనిపిస్తున్నంత అద్భుత చిత్రాన్ని అది బంధించలేకపోతోందనిపించింది. అక్కడక్కడే ఎంత తిరిగినా ఇక చాలు వెళదామని అడుగులు వెనక్కి పడటం లేదు. ఆ పరిసరాల సౌందర్యానికి నన్ను నేను మరచి ​ఓ పువ్వులానో చినుకులానో మారి వాటిలో కలిసిపోయినట్టుంది. మాటలు మాయమైపోయి మనసు ప్రకృతితో గొంతు కలిపి మౌనగానాలు చేసే వేళ.. "నేనేనా నేనేనా.. నా నుంచి నేనే వేరయ్యానా... ఉన్నానా నేనున్నానా.. ఉన్నానుగా అంటున్నానా​.." ప్రకృతి సుందరి పాటలు పాడటం నేర్పిస్తోంది. ఒక్క పాటలేంటి, తనువు, మనసు పువ్వు కన్నా తేలికైపోయి నాట్యం చేసేస్తుంటేనూ...
అంతవరకు లేనిదేదో ఇంతలోనే అయినదేమో..
నీ కోసమే నేనంటూ.. నాకోసమే నీవంటూ..
నన్ను నీలో నిన్ను నాలో వెతుకుతూ ఉంటే..
స్నేహమూ నువ్వే.. సంతోషమూ నువ్వే..
ఆత్మలోన నువ్వే.. అనుభూతిలోన నువ్వే..
నేను ఏరి కోరుకున్న కొత్త జన్మ నువ్వే...


అయినా నేనెంత పిచ్చిదాన్ని కాకపోతే ప్రకృతిలో నేనూ భాగమే అన్న ఊసే మర్చిపోయి ఎక్కడెక్కడో దేశాంతరాలు తిరిగీ తిరిగీ అలసిపోయి ఇల్లు చేరిన బహుదూరపు బాటసారిలా... ఎప్పుడో యుగానికొకసారిలా 'నేను' అని కృత్రిమంగా ఆపాదించబడిన అస్థిత్వపు పొరల్ని వలిచి పక్కనపెట్టి ఇలాంటి స్వచ్ఛమైన ఆకుపచ్చని మలుపుల్లో ఒదిగిపోతూ ప్రకృతి లయలో మమేకమైపోయే కాసిన్ని అపురూప క్షణాలని అనుభవించి... ఇక్కడే ఇలాగే శాశ్వతత్వాన్ని పొందాలన్న తృష్ణని అతికష్టం మీద నియంత్రించి, ఈ ​​అద్వితీయానుభూతి అందించే ఉత్తేజాన్ని గుండెల్లో నింపుకుని తిరిగి మనిషి సృష్టించిన మాయాప్రపంచంలోకే వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడో మరొక్కమారు ​వచ్చి ఈ ఆకుపచ్చని లోకపు పొలిమేరల్లో వాలిపోతాననే ప్రతీక్షలో!

​​

Sunday, May 04, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 5


ఇంటర్మీడియెట్చదివే విద్యార్థులను గమనిస్తే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లా కనిపిస్తారు. అప్పటిదాకా స్కూల్లో ఆడుతూ పాడుతూ ఆనందంగా చదువుకున్న వాళ్ళకి ఒక్కసారిగా స్వేచ్ఛ మొత్తం ​కోల్పోయి, జైల్లో ఖైదీల్లాంటి జీవితం ప్రాప్తిస్తుంది. ఇప్పటి రోజుల్లో భావిభారత డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఇదే సరైన మార్గమని ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, పిల్లల నమ్మకం కూడా!

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక మే సంచికలో...​

 

Tuesday, April 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 4

ఆ రోజు మేఘనందన పుట్టినరోజు. రోజుటిలా ​కాకుండా బుద్ధిగా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని అమ్మతో పాటు గుడికి వెళ్ళొచ్చింది.
టైము పది దాటిందో లేదో ఒకటే హడావుడి పడుతూ ఇంట్లోకీ బయటికీ పచార్లు చేస్తోంది.
"ఎందుకే అంత ఆత్రం నీకు? బస్సు ఆలస్యం అయిందేమోలే. ఒక పది నిమిషాలు అటూ ఇటూగా వచ్చేస్తుందిగా. అందాకా కాస్త స్థిమితంగా కూర్చోరాదూ?" మేఘ వాళ్ళమ్మ ​పరిహాసంగా నవ్వింది.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక ఏప్రిల్ సంచికలో... ​

 

Monday, March 03, 2014

కలకీ ఇలకీ మధ్యన..నా అంతఃపుర సౌందర్యానికి ధీటైనది ఏడేడు లోకాల్లోనూ లేదని ప్రతీతి. ఘనత వహించిన నా అంతఃపుర సౌధాలు అల్లంత దూరానున్న ఆకాశంతో కరచాలనం చేస్తూ నా వైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటాయి. తలుపులు, కిటికీలు, గోడలు సర్వమూ రంగురంగుల గాజు అద్దాలతో గొప్ప కళానైపుణ్యం రంగరించి పేర్చిన నా అంతఃపురపు అద్దాల మేడలు చూసేవారి కళ్ళని మిరుమిట్లు గొలుపుతుంటాయి. ప్రణాళికాబద్ధంగా ఏకరీతిన పెరిగిన విశాలమైన పచ్చిక మైదానాలు, వాటి మధ్యన నా ఆజ్ఞననుసరించి నిర్ణిబద్ధంగా పూవులు పూచే పూదోటలు, నా మాట జవదాటక నియమంగా పిందె తొడిగి నేను మెచ్చే రుచుల్లో మాగి ఫలాలనిచ్చే వృక్షసంపద, నేను ఆదేశించినపుడు నా మనసెరిగి వీచే అనిలం, నా కట్టుబాట్లకి తలవంచి కురిసే వానజల్లులు, నిత్యం నా కనుసన్నల్లో మెలిగే సూర్యకాంతులు, చంద్రకళలు.. ఒకటేమిటి.. నా రాచనగరులో నేను చూడని అందం, నాకు దక్కని ఆనందం లేవంటే అతిశయోక్తి కాదు!

ఎన్నో యుగాలుగా ఈ రాణీవాసపు అపూర్వ సౌందర్యంలో, అమర సౌఖ్యాలలో ఓలలాడుతున్న నాకు చిరునగవు తప్ప మరో భావన తెలియదు. సంతోషం, సంబరం తప్ప మరో అనుభూతి దరిజేరదు. ఇలా సాగుతున్న నా పయనంలో ఒకనాడు నేను కోరి కురిపించిన వెన్నెల జల్లుల్లో మబ్బుల తల్పం మీద నిదురిస్తుండగా ఎన్నడూ లేనిది ఆనాడే తొలిసారి అనుభవమైన కలవరపాటేదో నన్ను మేల్కొలిపింది. అర్ధనిమీలిత నేత్రాలతో వీక్షించగా గాలి తెమ్మెరలు, వెన్నెల కాంతులు తమ పని తాము నియమంగా చేసుకుపోతున్నాయి. కాస్త అటూ ఇటూ పరికించి చూసిన కనురెప్పలు అలసటగా తూలిపోయాయి.

మళ్ళీ అదే కలవరం రేగి నిదుర చెదరి కనులు తెరిచేసరికి నా చుట్టూ తెల్లని మబ్బుల పరుపు కనిపించనంత చిక్కటి చీకటి అలుముకుని ఉంది. ఏనాడూ నా ముందు కదలడానికైనా సాహసించని రంగుటద్దాల కిటికీలని కప్పిన పరదాలు అలజడిగా ఎగురుతూ చేస్తున్న శబ్దం మినహా మరేమీ వినిపించని నిశబ్దం! కిటికీ తలుపుల అద్దాలు గదిలో నేలను తాకే చోట తెరలు ఎగిరెగిరిపడుతూ ఆ సన్నటి చీలికల్లోంచి గదిలోపలికి కమ్ముకొస్తున్న తెల్లటి పొగ.. ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుపు.. వెన్నెల కన్నా పాల మీగడ కన్నా మిన్నగా మెరుపులు చిందిస్తోన్న తెలుపు రంగులో మెల్లమెల్లగా గదంతా కమ్ముకుంటూ నా దాకా వస్తోందా ధవళ ధూపం.

ఇదివరకెరుగని కలకలమేదో కొత్తగా నాలో పుట్టి ఆ ఉద్వేగానికి చలించిపోయి చప్పున కళ్ళూ, గుప్పిళ్ళూ గట్టిగా మూసేసి చేతులు రెండూ గట్టిగా పెనవేసి హృదయాన్ని పదిలం చేసాను. ఇప్పుడు ఈ నిశ్శబ్దంలో బెదురుతున్న నా గుండె చప్పుడు మినహా ఇంకేమీ వినిపించడం లేదు. నా పాదాలను తాకిన ఆ ధవళధూపం తాలూకు చల్లదనం జిల్లనిపిస్తుంటే కదలాలన్న స్పృహ పోగొట్టుకుని శిలలా నిలిచిపోయాను. పాదాల మీద సుతారంగా పారాడిన స్పర్శ రేపిన గిలిగింత కొత్తగా పరిచయమవుతుంటే పాదాల పైన తారాడుతున్న బంగారు మువ్వలు నా అనుభూతిని ప్రతిఫలిస్తూ చిరుసవ్వడి చేస్తున్నాయి. ఆ వణుకులోంచి తేరుకోకముందే అదే స్పర్శ పాదం అంచుకి జారి చిన్నారి వేలుని చటుక్కున లాగినట్టనిపించి అప్పటిదాకా భయం భయంగా బిగ్గరగా కొట్టుకుంటున్న గుండె సడి ఒక్క క్షణం లయ తప్పింది. పాదం చివరన ఎగసిన ఆ చిన్ని అల ఆపాదమస్తకం వ్యాపించి కనుపాప దోసిట ముత్యాలు రాల్చింది. తనువంతా అల్లిబిల్లిగా రెపరెపలాడుతున్న సీతాకోకచిలుకలు నా మనసుకి కూడా రెక్కలిచ్చి ఎగరేస్తుంటే ఆ మాయామోహంలో కొట్టుకుపోతూ ఇదేమో తెలియని అయోమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ అంతలోనే మెలమెల్లగా అలజడి తగ్గి చల్లదనానికి అలవాటు పడుతున్న ప్రాణం.. నాకు తెలీకుండానే మళ్ళీ మగతలోకి జారిపోయాను.

కలల్ని అల్లిన నిదురంతా కరిగి మళ్ళీ ఇలలోకి వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతా ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. రోజుటిలాగే నా ఆనతిననుసరించి వేకువ పొద్దు నీరెండ కిటికీ తెరల్లోంచి పల్చగా గది లోపల పరచుకుంటోంది. అద్దాల గోడలు, కిటికీలు ఎప్పటిలాగే తెరల వెనకాల మౌనంగా ముడుచుకు కూర్చున్నాయి. తెరలే గోడలేమో అన్న భ్రాంతిని కలిగిస్తూ కదలక మెదలక స్థిరంగా నిలుచునున్నాయి. అంతా యథావిధిగా ఉన్నాసరే రాత్రి నిదురలో నాకెదురైన అనుభవం అబద్ధమని నమ్మాలనిపించడం లేదు. ఆ తెల్లటి ధూపం, చిరుచలి, వణుకు, అన్నిటికీ మించి ఆ దివ్యస్పర్శ, నా కంటిపాపల్లో ఊరిన కన్నీటి ముత్యాలు ఇవన్నీ ఇంకా తాజాగా ఉన్నాయి.

రోజంతా రంగురంగుల పువ్వుల మధ్య సీతాకోకచిలుకలతోనూ, చిట్టి గువ్వలతోనూ ఆడుకునే ప్రయత్నం చేసాను. ఎప్పటిలా అవేవీ నన్ను సంతోషపెట్టలేకపోతున్నాయి. నా మోమున నవ్వు పుట్టనంటోంది. గుండె లోతుల్లో లోలోపల ఏదో నొప్పి, భరించరాని బాధ కలుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, వెన్నెల.. అందర్నీ రమ్మని పిలిచాను. ఎవరూ నాలో రేగిన ఈ కలవరాన్ని హరించలేకున్నారు. ఎన్నడూ లేనిది ఏదో మోయలేని బరువు మోస్తున్నట్టు విపరీతమైన అలసటగా ఉంది. అందరినీ వదిలి నా ఏకాంత మందిరంలో చేరి మబ్బు తునకలతో పేర్చిన తల్పం మీద వాలాను. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు పలికే నిద్రాదేవి మొదటిసారి మొహం చాటేసింది. కళ్ళు మూస్తే అదే కలవరం.. అరిపాదాల్లో రేగే అలజడి గుండె దాకా వరదలా కొట్టుకొస్తోంది. ఆ మాయాధూపం మళ్ళీ వస్తే అదేంటో తరచి చూడాలని ఎదురు చూస్తూ కళ్ళు మూసుకునే మెలకువలో ఉండిపోయాను.

గదంతా తెల్లగా నిండిపోతున్న వెలుగు కనురెప్పల మీద వాలుతోంది.. మళ్ళీ అదే చల్లని స్పర్శ నన్ను తాకిన అనుభూతి.. నాకు సహకరించని కళ్ళని బలవంతంగా తెరిచాను. గదంతా తెల్లటి పువ్వుల వాన కురుస్తోంది. ఎక్కడి నుంచి రాలుతున్నాయో తెలీని ఆ సుమాలు నేలను తాకుతూనే అదృశ్యమైపోతున్నాయి. అంతకంతకూ చలి పెరిగిపోయి నేను వణికిపోతున్నాను.
ఆ పూలవానలో వాటితో పోటీపడుతున్న తెలుపుతో మెరిసిపోతూ నావైపే నడిచి వస్తూ కనిపించాడు అతను.
అటువైపు చూస్తూనే అప్రయత్నంగా నా పెదవులు మొదటిసారి పలికాయి 'ప్రేమ' అనే మాటని.. ఇన్ని యుగాలుగా నాకు తెలీకుండానే నేను ఎదురుచూస్తున్నదేదో ఇప్పుడే ఎదురైన అద్భుతంలా, చుట్టూ వెల్లివిరిస్తున్న శాంతి నా మనసంతా నిండిపోతూ, మేనంతా గాలి కన్నా తేలికైపోయి చుట్టూ కురుస్తున్న తెల్లటి పువ్వుల మధ్యన విహరిస్తున్న భావన..
అంతటి సాన్నిహిత్య భావన కలిగాక 'నువ్వెవరివి' అని అడగాలన్న ప్రశ్నే ఉదయించలేదు నాలో.
"నువ్వు.. నువ్వెలా రాగలిగావు ఇక్కడికి?" అడిగాను నాలో నేనే గొణుక్కుంటున్నంత మెల్లగా.
అతను నవ్వాడు. అతను నవ్వుతుంటే చుట్టూ రాలుతున్న తెల్లటి పూవులన్నీ వెలవెలబోతున్నాయి.
"నేను రావాలనుకుంటే ఎక్కడికైనా రాగలను" అన్నాడతను.
"ఎందుకు రావాలనిపించింది నీకు?"
"నీకు తెలియని కొత్త లోకాన్ని చూపిద్దామనీ.."
"నాకు తెలియని లోకమా?" అని ఎదురుతిరిగే లోపు నిన్నటి నుంచీ ఎదురైన అనుభవాలన్నీ గుర్తొచ్చి ఆ మాటని పెదవి మాటునే దాచేసాను.
"అయితే నాకింతవరకూ తెలియని భారాన్నీ, మనోవ్యథనీ, కన్నీటినీ రుచి చూపించడానికి వచ్చానంటావా? నాకిక్కడే బాగుంది. నా అంతఃపురం దాటి నేనెక్కడికీ రాను."
"ఈ రంగుటద్దాలకి అవతల దూరంగా ఓ అందమైన లోకం ఉంది. ఈ అంతఃపురం దాటి నాతో వస్తే నువ్వింతవరకూ చూడని కొత్త రంగులు చూపిస్తాను. వస్తావా మరి?"
నేను ఆలోచనలో పడ్డాను. "అమ్మో ఇంత చలి నా వల్ల కాదు" అన్నాను వణికిపోతూ.
"ఏదీ.. నా అరచేతుల్లో నీ పాదాలుంచు.. నిన్ను నా గుండెల్లో పొదువుకుని భద్రంగా తీసుకెళతానుగా.." అంటూ అనునయంగా నా పాదాలని తాకిన ఆ చిరువెచ్చని చేతిస్పర్శని దూరం చేయలేకపోయాను.
అతని చెయ్యందుకుని మొదటిసారి నా అంతఃపురం గడప దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

చుట్టూ బలంగా వీస్తున్న ఈదురు గాలులేవీ నన్ను తాకలేని అదృశ్య శక్తి ఏదో వచ్చి చేరింది నాలో. అతనితో కలిసి ఎంత దూరం నడుస్తున్నా ఆకలిదప్పులు, అలసట తెలియడం లేదు. నేనెరిగిన అద్దాల మేడల ఆనవాలు సైతం అంతమైపోయేంత దూరం తీసుకెళ్ళాడు. దారి పొడవునా ఎవరూ అడక్కుండానే పూస్తున్న పువ్వులు, ఎవరూ వినకపోయినా పాడే గువ్వలు, అడక్కుండానే పండ్లని దోసిట్లో రాల్చే చెట్లు, ఎవరి కోసమూ ఆగకుండా ఉరకలేసే ఏరూ.. చాలా వింతలు కనిపించాయి. వాటన్నీటినీ సంభ్రమంగా చూస్తూనే అవన్నీ దాటుకుని మరో కొత్త లోకంలోకి అడుగు పెట్టాము.

అక్కడ ఎటు చూసినా ఒకటే రంగు.. తెల్లటి తెలుపు.. ఎత్తైన పర్వతాలు, వాటి నిండా దట్టంగా ఎదిగిన చెట్లు, కొండలోయల్లో నీటి చెలమలు, చెరువులు.. భూమ్యాకాశాలు మొత్తం తెల్లగా మెరిసిపోతూ పారిజాతాల రెమ్మలు ఆరబోసినట్టు, సన్నజాజుల రెక్కలు వెదజల్లినట్టు అన్నిటా అంతటా తెల్లటి మెరుపే నర్తిస్తోంది. ఇన్నాళ్ళూ నేను చూడని రంగే లేదనుకున్న నా గర్వాన్ని తుడిచిపెడుతూ అన్ని రంగుల్నీ తనలోనే ఇముడ్చుకుని వింత కాంతుల్లో శోభిస్తున్న ధవళవర్ణం నా కన్నుల్ని వెలిగిస్తోంది.

ఇంకాస్త ముందుకి వెళ్ళాక నీలాకాశం దిగొచ్చి నీటిలో దాగినట్టుంది. అక్కడ సముద్రానికి అంతెక్కడో, ఆకాశానికి హద్దెక్కడో ఎంత ప్రయత్నించినా నా చూపుకి అందడం లేదు. సముద్రపు ఒడ్డున తెల్లటి ఇసుకలో మా ఇరువురి అడుగుల గుర్తులు జతగా పడుతున్నాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు పడినప్పుడు నీలిరంగు నీళ్ళ మీద, తెల్లటి ఇసుక మీద పుట్టే వింత రంగుల్ని నేనిదివరకెన్నడూ చూడలేదు. అదే సముద్రం మీద వెండి వెన్నెల కురుస్తున్నప్పుడు నల్లటి నీటి అద్దంలో మంచుబొమ్మలా మెరిసిపోయిన నా ప్రతిబింబాన్ని, ఎగిసిపడే సంద్రపు కెరటాలపైన విరిసిన వన్నెల్ని వర్ణించే శక్తి నాకు లేదు. పుట్టి బుద్ధెరిగాక నా ఊహలకైనా అందని అందం, ఆనందం అనుభవంలోకి వస్తున్న భావన!
నేనింకా ఆ సరికొత్త ప్రపంచపు అనుభూతుల్లో మునిగి ఆనందాశ్చర్యాల్లో తేలుతుండగా అతనన్నాడు.
"ఇప్పుడు నమ్ముతావా నీకు తెలియని అందమైన లోకం వేరొకటి ఉందని?"
ఈ కొంగొత్త సౌందర్యం తాలూకు పరవశం నన్నింకా ఇంకా గమ్మత్తుగా కమ్మేస్తుండగా "ఊ.."అని మాత్రం అన్నాను.
"ఇక బయలుదేరుదామా.. నిన్ను పదిలంగా నీ గూటికి చేర్చాలిగా!"
ఉన్నపళంగా ఆకాశంలో తేలే మబ్బుల ఒడిలోంచి పాతాళ లోకపు అగాథంలోకి జారిపడ్డంత బెదురు కలిగింది. బేలగా చూసాను అతని కళ్ళల్లోకి. అడ్డు పడిన కన్నీటి తెర అక్కడేముందో చూడనివ్వలేదు.

అంతటి దూరమూ క్షణాల్లో ప్రయాణించి నా అంతఃపురపు రంగుటద్దాల గదికి తిరిగొచ్చేసాము. 
అతని చల్లని స్పర్శ అలసిన కనురెప్పల మీద సుతారంగా సోకుతుంటే తనువు, మనసు నా ఆధీనంలోంచి జారిపోయాయి. నిద్రాదేవి ఒడి చేరిపోయాను. మళ్ళీ ​నాకు మెలకువొచ్చేటప్పటికి నా గదిలో ఎప్పటిలాగే నా నియమావళిని అనుసరించి ప్రసరించే వెలుతురు, వీచే గాలి యాంత్రికంగా తమ విధులు నిర్వర్తిస్తున్నాయి.​ నేను లేచి అద్దాలకి అవతలవైపున్న ప్రపంచాన్ని చూడాలన్న తాపత్రయంతో​ అద్దాల గోడలని కప్పి​న పరదాలు తొలగించాలని ప్రయత్నించాను. ఒకదాని వెనుక ఒకటి రంగు రంగుల తెరలు ఎంతకీ తరగకుండా పుట్టుకొస్తూ​ ఆ అద్దాలు దాటి ఆవలి వైపుకి నన్ను చూడనివ్వడం లేదు​. ఈ అద్దాల మేడలు, నే పిలిస్తే పూచే నా పూదోట, నేను కోరితే పాటలు పాడే గువ్వలు, నా నియంత్రణలో ఉండే చీకటి వెలుగులు.. ఇవన్నీ వాటి పూర్వపు ప్రాభవాన్ని కోల్పోయి నా వేదనని ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి.

ఆనాటి నుంచీ నా చుట్టూ ఘనీభవించిన ఏకాంతంలో కాలం ఆగిపోయిందో గడుస్తుందో నాకు తెలియడం లేదు. మళ్ళీ ఎప్పుడూ నా రంగుటద్దాల కిటికీ తెరలు రెపరెపలాడనే లేదు. ఏనాటికైనా వాటిలో చలనం కలిగి పక్కకి తొలగి నా కలని కళ్ళముందు నిలుపుతాయన్న వెర్రి ఆశ కొద్దీ నేను అటు వైపు చూడడం మానుకోనూ లేదు.

మునుపటి రోజుల 'నేను' మళ్ళీ నాకెప్పటికీ దొరకలేదు. ఎన్నటికీ మరువలేని తిరిగిరాని స్వప్నం కోసం కలకీ ఇలకీ మధ్యన ఊయలూగుతూ మిగిలిపోయాను... అతని జ్ఞాపకాలకి బంధీగా!


*** That's the 300th post on this blog.
Thanks everyone who is admiring this blog. I sincerely appreciate all your encouragement and motivation to keep me writing! :-)

Saturday, March 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 3


నీలూ చెప్పినట్టే గుడికి వెళ్ళడానికి తయారవుతోంది మేఘ. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటుంటే తన వెనుకగా ఉన్న తలుపు కాస్త తెరుచుకుని సందులోంచి కెంజాయ రంగు పట్టులంగా కొద్ది కొద్దిగా కనిపిస్తోంది అద్దంలో.
లేచి తలుపు దగ్గరగా వచ్చి ఎవరదీ.. తలుపు వెనక దాక్కుందీ.. పూజా.. నువ్వేనా? అడిగింది మేఘ. వెంటనే తలుపు సందులోంచి కనిపిస్తున్న పట్టులంగా మాయమైపోయి ఘల్లుఘల్లుమనిమువ్వల చప్పుడు వినిపించింది​.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక మార్చి సంచికలో...​


Wednesday, February 19, 2014

పాలగుమ్మి రామకృష్ణారావు గారి నవల 'బలిదానం'

మనిషి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం.

జీవితంలో దాదాపు అన్ని రకాల దశలు దాటి వచ్చి అవసాన దశలో కన్నుమూసిన వారి గురించి బాధపడినా, ఈ భూమ్మీద జీవితాన్ని సంపూర్ణంగా జీవించి నిష్క్రమించారులెమ్మని తలుస్తారు వారితో బంధం ఉన్నవారు. అదే చిన్న వయసులో ఏ జబ్బుల బారినో, అనుకోని ప్రమాదాల బారినో పడి మరణించినవారి గురించి శోకించి శోకించీ చివరికి ఇది కర్మ ఫలితం మన చేతిలో ఏముందిలెమ్మని కాస్త నిబ్బరంగా సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు.

అదే ఒక వ్యక్తి తన ప్రాణాలు తనే నిలువునా తీసేసుకుంటే?

ఆ మరణవార్త తెలిసినవారందరూ ఆ వ్యక్తితో కనీస పరిచయం లేని వారు కూడా కేవలం వార్త విని " అయ్యయ్యో.. అంతటి కష్టం ఏమొచ్చిందో పాపం! బంగారం లాంటి జీవితాన్ని అంతం చేసుకున్నాడు!" అని బాధ పడతారు.
ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని కష్టాలున్నా 'బంగారం లాంటి జీవితం' అనే అంటారు. దానిక్కారణం పుట్టుక అనేది మనకి తెలీకుండా, మన ప్రమేయం లేకుండా ఆయాచితంగా ఈ భూమ్మీద బతకడానికి లభించిన అవకాశం. అసలు ముందు మనం అంటూ ఉంటే కష్టాలో, నష్టాలో వేటినైనా ఎలా ఎదుర్కొనగలమో, ఎలా పరిష్కరించుకోగలమో ఆలోచించి ప్రయత్నించవచ్చు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కష్టాలు ఇవీ.. అని తెలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో "అయ్యో పాపం! ఇంత నరకయాతన అనుభవించాడా! దురదృష్టవంతుడు!" అని జాలి పడి చావు తర్వాత మరణించిన జీవి అస్తిత్వం ఏమవుతుంది అని ఎవరికీ ఇదమిద్దంగా తెలీకపోయినా కూడా అన్ని కష్టాలు అనుభవించిన ఆ జీవికి కనీసం చావుతోనైనా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటారు.

మరి.. ఒక వ్యక్తి "హక్కుల కోసం, సమాజం కోసం, ప్రభుత్వాన్నో, పార్టీలనో బెదిరించడం కోసం, ప్రజలందరి భవిష్యత్తు కోసమే నా ఈ ఆత్మాహుతి" అంటూ తన ప్రాణాన్ని తృణప్రాయంగా తగలబెట్టుకుంటే?

ఎక్కడో ఒక చిన్న పల్లెలో పగలనకా, రేయనకా ఒళ్ళు గుల్ల చేసుకుని నాలుగు పైసలు సంపాదించి మా పిల్లలు మాలాగా కష్టాల్లో బతక్కూడదు, నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకుని మంచి ఉద్యోగం చేసి దొరబాబులా బతకాలి అని పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి చేయాల్సిన న్యాయం సంగతి మర్చిపోయి ఉద్యమాల కోసం బలిదానం అయ్యే యువకుల చావుల గురించి ఎలా అర్థం చేసుకోవాలి?
ఏదైనా సాధించాలన్న తపన, పట్టుదల ఉన్నవాళ్ళు బతికి సాధించాలి కానీ ఎవడినో బెదిరించడానికి, ఎవరి సిద్ధాంతాలనో గెలిపించడానికి వీళ్ళు చావడం ఏమిటో?

ప్రభుత్వం ఫలానా చెడ్డపని చేసిందంటూ వెంటనే కనిపించిన ప్రభుత్వ కార్యాలయాల మీదా, వాటి ఉద్యోగులైన డాక్టర్ల మీదా రాళ్ళూ రప్పలు విసిరి, ప్రభుత్వ ఆస్తులు అన్న పేరు తగిలించి కనిపించిన బస్సులు, రైళ్ళు తగలబెట్టి, రోడ్ల మీద టైర్లు మంట పెట్టి తమ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నాం, వ్యవ్యస్థ మీద తిరుగుబాటు చేస్తూ పోరాడుతున్నాం అనుకునేవారు చేసే పనుల వల్ల ఎవరి ఆస్తికి నష్టం జరుగుతుంది, ఎవరి జీవితాలు స్థంభించిపోతున్నాయి అన్నది ఆలోచించరెందుకో?

కాలేజీల్లో, యూనివర్సిటీల్లో గొప్ప చదువులు చదివి విజ్ఞానాన్ని సంపాదించి, దాన్ని వ్యవ్యస్థని బాగు చెయ్యడానికి, కన్నవాళ్ళని, ఉన్న ఊరిని, దేశాన్ని ఉద్ధరించడానికి వినియోగించాల్సిన విద్యార్థులు..
"మా చదువులు పూర్తిగా నాశనమైనా పరవాలేదు. స్కూళ్ళు మూసేసినా పరవాలేదు, పరీక్షలు ఆపేసినా పరవాలేదు, కాలేజీలు మానేసి జైల్లో కూర్చున్నా పర్వాలేదు, చివరికి ఏ కిరోసినో, పెట్రోలో పోసుకుని మమ్మల్ని మేము తగలెట్టుకున్నా పరవాలేదు" అంటూ ఆత్మాహుతులకీ, బలిదానాలకి సిద్ధం అవుతుంటే వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవాళ్ళ, ఊరి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో కదా!

ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావు గారు రాసిన నవల 'బలిదానం'. కౌముది మాసపత్రికలో జనవరి 2012 నుంచీ సెప్టెంబర్ 2012 దాకా ధారావాహికగా వచ్చిన ఈ నవల ఇప్పుడు పూర్తిగా e-బుక్ రూపంలో కౌముది గ్రంథాలయంలో లభ్యమవుతోంది.

కేవలం 38 పేజీలు  ఉన్న ఈ చిన్న నవల చదవడం పూర్తయ్యాక చాలా ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ప్రతి నిత్యం పొద్దున్నే పేపర్లో ఇలాంటి వార్త ఏదో ఒకటి చూస్తూనే ఉండటం వల్ల ఈ నవల చదువుతున్నంతసేపు కేవలం ఇదొక నవలే కదా అన్న భావన రాకుండా, నిజంగా ఇలా ఎందరి జీవితాలు నలిగిపోతున్నాయో అనిపించి మనసు భారమవుతుంది. చాలా సహజంగా రాశారు రామకృష్ణారావు గారు.

ఒక ఉద్యమం తప్పు, ఒక పోరాటం తప్పు, సామాజిక స్పృహ ఉండటం తప్పు అని ఎవరూ అనరు కానీ ప్రాణాలు తీసుకోవడం ద్వారా దేన్నో గెలిపించాలన్న భావన పోగొట్టుకుని బతికి పోరాడి ఏదైనా సాధించాలని మన యువత గుర్తిస్తే మన దేశం మరింత బాగుపడుతుందేమో!

పాలగుమ్మి రామకృష్ణారావు గారి నవల 'బలిదానం' ఇక్కడ కౌముది గ్రంథాలయంలో ఉచితంగా చదవొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.