Friday, January 23, 2009

మా పెరటి జాం చెట్టు గాథ

మొన్న మా పెరటి కబుర్లు కొన్ని చెప్పాను కదా.. మరి.. అన్నింటిలో.. నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే.. మా గాబు పక్కనే ఉండే ఎర్ర జాంకాయ చెట్టు. అబ్బా.. ఇప్పుడు గుర్తొచ్చినా.. ఎంత బావుంటుందో అనుభూతి..! కానీ.. అదిప్పుడు లేదులెండి.. నేను డిగ్రీకి వచ్చాకనుకుంటా.. నేలలో సారం దిగిపోడం వల్లనో, మరేదో కారణంగా.. కాయలన్నీ బాగా చిన్న చిన్నగా కాయడం.. గడ్డుల్లాగా మారడం మొదలుపెట్టాయి. అదీ కాక స్థలంలో చెట్టు ఉండకూడదని పనికిమాలిన వాళ్ళో చెప్తే.. అది కొట్టేసారు :( నేను హాస్టల్ నుంచి ఇంటికెళ్ళి చూసాక నాకు భలే ఒళ్ళు మండిపోయింది.. మా నాన్నతో అన్నాను కూడా.. ఏమైనా.. కొట్టేసింది తిరిగి రాదుగా :( అప్పటి జ్ఞాపకాలు కొన్నింటిని చెప్తాను వినండి మరి..!

జాం చెట్టుకి చిన్న చిన్న కాయలే కాసేవి. అంటే.. మన బజారులో దొరికేవాటిలాగా పెద్దగా ఉండవన్నమాట.. పెద్ద సున్నుండ సైజులో ఉండేవి :) మా నాన్న పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ.. చెట్టుని సారి పరీక్షించి.. దోరగా ఉన్న కాయల్ని కోసిపెట్టేవారు. మా తమ్ముడు చిన్నప్పటి నుండీ హాస్టల్ అవడం వల్ల.. ఇలాంటి విషయాల్లో నాకు కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ.. వాడు సెలవల్లో వచ్చినప్పుడు మాత్రం.. కాయలు కోసారంటే.. రెండు కొయ్యాల్సిందే.. పూర్తిగా పండినా పండక పోయినా :)పండినవి మాత్రం ఎంత బావుండేవో.. లోపల పింక్ గా.. మ్మ్.. గుర్తొస్తే.. ఉన్నపళంగా ఇప్పుడొక జాం కాయ తినాలనిపిస్తుంది. కానీ.. కుదరదుగా..ఇక్కడ దొరకవు :(


ఇంకా జాంచెట్టు మీద బోలెడు ఆటలాడే వాళ్ళం. చెట్టు మరీ అంత పెద్దది కాకపోవడం వల్ల, బలమైన కొమ్మలు లేకపోవడం వల్ల మా అమ్మ వాళ్లు మమ్మల్ని చెట్టు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. అయితే మధ్యాహ్నం పూట మా అమ్మమ్మ పురాణ కాలక్షేపానికి వాళ్ళ భక్తి సంఘం స్నేహితురాళ్ళ (మా తమ్ముడు పెట్టిన పేరు) దగ్గరికి వెళ్ళేది. మా అమ్మ కాసేపు పడుకునేది. ఇంక చూడండి.. మాకు అప్పుడు స్వాతంత్ర్యం వచ్చేసినట్టే..! మా అమ్మ పడుకునే దాకా టీవీనో చూస్తున్నట్లు నటించి.. ఆవిడకి అలా కన్నంటుకోగానే.. పిల్లుల్లాగా ఇంటి తలుపు మెల్లగా దగ్గరికి వేసి ఉరుక్కుంటూ వెళ్లి జామ చెట్టు ఎక్కేవాళ్ళం. ఒక కొమ్మ కాస్త పెద్దదిగా ఎత్తు మీద ఉండేది. దాని మీద కూర్చునే వాళ్ళు రాజు గారన్న మాట. ఇంకాస్త కింద ఉండే చిన్న కొమ్మ మీద కూర్చునే వాళ్లు మంత్రి అన్న మాట. నేనూ, మా తమ్ముడూ ఇద్దరం మార్చి మార్చి రాజు మంత్రి సింహాసనాల్లో కూర్చునే వాళ్ళం జాం చెట్టు మీద :) చెప్పండి రాజు గారూ.. చెప్పండి మంత్రి గారూ.. అనుకుంటూ ఏవేవో మాట్లాడుకునే వాళ్ళం. అవన్నీ సరిగ్గా గుర్తు లేవు ఇప్పుడు :(


ఇక పోతే కొమ్మల మీద కూర్చుని చేసే విశిష్టమైన పని మరోటి ఉంది. అదేంటంటే 'జామాకు పాన్' తయారు చేసుకుని తినడం. అన్నట్టు.. మీరెప్పుడైనా తిన్నారా మరి?? చెప్తాను చూడండి. లేత జామ ఆకు ఒకటి తీసుకుని.. దాని మధ్యలో కాస్త చింత పండుకి ఉప్పు అద్ది పెట్టి.. ఆకుని మడిచి నోట్లో పెట్టుకుని గబ గబా తినెయ్యడమే :) జామ ఆకు వగరు, ఉప్పు, చింత పులుపు కలిసి అదొక రకమైన రుచి వస్తుంది. జీలకర్ర, చింతపండు, ఉప్పు తింటామే పుల్లకి పెట్టుకుని.. కాస్త టైపులో అన్నమాట..! కానీ.. ఇంట్లోంచి చింతపండు తెచ్చుకోడానికి కాస్త కష్టపడే వాళ్ళం. ఎందుకంటే.. అమ్మ చూస్తే ఊరుకోదు.. అలా అంతంత చింతపండు తింటే మంచిది కాదు.. కడుపు చెడిపోతుంది అంటుంది. కానీ.. అవన్నీ వినం కదా మనం.. అందుకని మా అమ్మ పడుకోగానే మా ఇంటి మధ్య గదిలో ఒక పెద్ద అల్యూమినియం క్యానులో ఉండే చింతపండుని కాస్త దొంగతనం చేసేసి ఒక ప్లేట్లో ఉప్పు, చింతపండు పెట్టేసుకుని వచ్చి జాం చెట్టు ఎక్కేవాళ్ళం. అప్పట్లో ఇప్పట్లాగా ఒకటి రెండు కేజీలు చింతపండు కొనుక్కోడం కాదు. మా పొలం దొడ్డిలో ఉన్న చింత చెట్ల నుంచి బోలెడు చింతపండు వచ్చేది అంతా తీసి పెద్ద క్యానుల్లో పెట్టేవారు. ఇంక వచ్చే ఏడు దాకా అదే..! కాబట్టి.. అంత పెద్ద క్యానులోంచి కాస్త తీసినా ఎంత తీసామో వెంటనే తెలిసేది కాదు ఇంట్లో వాళ్ళకి :) అంతే కాదు చింతపండులోంచి వచ్చే బోలెడు చింత పిక్కలేమో నా ఆటకి అన్నమాట :) మేము అలా తినేవాళ్ళమని తరువాత మా అమ్మకి తెలిసేది గానీ.. వద్దంటుందని చూడనప్పుడు చేసేవాళ్ళం ఇలాంటి పనులన్నీ. మొత్తానికి అమ్మ లేచేదాకానో, అమ్మమ్మ పురాణ కాలక్షేపం నుంచి వచ్చేదాకానో జాం చెట్టు మీద ఊగుతూనే ఉండేవాళ్ళం. అదన్న మాట..మా జాంచెట్టు కథ.


మీకూ మీ చిన్నప్పటి గాధలు బోలెడు గుర్తొచ్చి ఉంటాయి కదా..! జ్ఞాపకాల్లో కాసేపు విహరించండి రండి మరి..
మళ్లీ కలుద్దాం..
ప్రేమతో..
మధుర వాణి

Wednesday, January 21, 2009

మా ఇంటి పెరటి కబుర్లు.. వింటారా మరి..??

నమస్కారం అందరికీ..!
నేను ఇప్పుడు సభా కార్యక్రమం ఏమీ పెట్టట్లేదు కానీ.. చిన్నప్పటి.. మా పల్లెటూరి ఇంట్లోని పెరటి కబుర్లు చెప్దామనుకుంటున్నాను.. మీరు వినడానికి రెడీ అయితే.. కాస్కోండి మరి..!!

ఒక మూడేళ్ళ క్రితం దాకా మా కుటుంబం ఒక పల్లెటూర్లోనే ఉండేది. అది మా అమ్మమ్మ వాళ్ల సొంత ఇల్లు. కానీ.. మా మామయ్యలెవరూ అక్కడ ఉండేవాళ్ళు కాదు. నాకు నాలుగేళ్ళున్నప్పుడు ఇంట్లోకి మేము వచ్చాం. కాబట్టి నా చిన్నతనం అంతా ఇంట్లోనే.. అదొక ఆరు చిన్న గదులున్న ఇల్లు. ఇంటి వెనకాల చాలా ఖాళీ స్థలం ఉండేది. అందులో ఒక మూలాన ఒక నీళ్ళ తొట్టి (మేము 'గాబు' అనేవాళ్ళం), ఒక మూలాన స్నానాల గది ఉండేవి. నా చిన్నతనంలో ఒక పెద్ద పశువుల కొట్టం ఉండేది గానీ.. చాలా ఏళ్ళ క్రితమే పశువుల్నీ.. కొట్టాన్నీ కూడా తీసేశారు.


ఇంక మా ఇంట్లో మొక్కల సంగతి చెప్పాలంటే.. ఆయా కాలాన్ని బట్టి.. అన్నీ రకాల పూల మొక్కలు, ఆకు కూరలు, కాయగూరలు ఉండేవి. ఫలానా పూల మొక్క లేదు అనడానికి అవకాశం ఉండేది కాదు :) అంత చక్కటి నందనవనం లాంటి తోటని పెంచి పెద్ద చేసిన ఘనత మాత్రం మా అమ్మకీ, అమ్మమ్మకే దక్కుతుంది. మా పెరట్లో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. కాయలు కాసినా ఎక్కడో పైన ఉండేవి కాబట్టి మాకు అందే అవకాశమే ఉండేది కాదు :( అందకపోయినా.. రోజూ చెట్టు మీద నిఘా వేసేవాళ్ళం ఎన్ని కాయలు కాస్తున్నాయి, ఎన్ని కాయలు ఎండటానికి దగ్గరపడుతున్నాయి అని. ఎప్పుడో ఎండిపోయి రాలి కిందపడితే.. అప్పుడు వాటిల్లో దూదిని తీసి భలేగా ఆడుకునే వాళ్ళం. దూది చాలా తేలికగా ఉండి ఉఫ్.. అని ఊదితే ఎగురుతూ ఉండేది :) ఒకసారి మా అమ్మమ్మ చెప్పింది బూరుగు పత్తితో దిండు తయారు చేసుకుంటే బావుంటుంది. చాలా మెత్తగా ఉంటుంది అని. ఇంక చూస్కోండీ.. అప్పటి నుంచి పోటీలు పడి మరీ బూరుగు కాయలు ఏరి, పత్తిని జాగ్రత్తగా దాచి ఎలాగో మొత్తానికి ఒక చిన్న దిండు తయారు చేశాము. చాలా రోజులవరకూ ఉండేది దిండు మా ఇంట్లో..!


ఇంకా ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది. ఇంటి చుట్టుప్రక్కల వాళ్లు కూడా చాలామందే వచ్చి తీసుకెళ్తుండేవారు. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే.. నేను రోజూ స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికొచ్చాక.. తను వంట కోసం కూరలు తరుగుతూ.. "ఒక రెండు రెబ్బలు కరివేపాకు కోసుకుని రామ్మా.. తాలింపు వెయ్యాలి" అని నన్ను పిలిచేది. అప్పుడప్పుడూ.. నేను టీవీ ముందు కూర్చొని వెంటనే రాకపోతే "రా..నానా..ఒక్కసారి.. మా అమ్మవి కదూ.. తాలింపు మొదలెట్టేసాను" అని మళ్ళీ పిలిచేది. అప్పుడు నేను రెండే అంగల్లో గెంతుకుంటూ వెళ్లి వెంటనే రెండు రెబ్బలు కోసి గాబు దగ్గర నీళ్ళతో కడిగేసి... పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చేదాన్ని. కరివేపాకు చెట్టు చాలా పెద్దగా ఉండటం వల్ల, దాని వేర్ల నుంచి బోలెడు చిన్న కొత్త మొక్కలోచ్చేవి . అవి చాలా లేతగా ఉంటాయి.. వాటి నుంచి రెబ్బలు తెంపేదాన్ని నేను. అలాంటి చిన్న చిన్న పిలకల్ని చాలా మంది అడిగి తీసుకెళ్ళేవారు వాళ్ళిళ్ళల్లో నాటుకోవడం కోసం. ఏంటో వదినా.. ఎన్ని సార్లు నాటిన బతికి చావట్లేదు మా ఇంట్లో.. అనుకుంటూ తీసుకెళ్ళేవాళ్లు :) నిజంగానే చాలా తక్కువమంది ఇళ్ళల్లో మాత్రమే అవి బ్రతికేవి ఎందుకో మరి..!!


ఇక్కడ దేశం కాని దేశంలో తాజా కరివేపాకు వేసుకుని కూర చేసుకోవాలంటే అదొక పెద్ద ప్రహసనం. ఎక్కడో సిటీ సెంటర్లో ఉండే ఇండియన్ షాప్ కి వెళ్లి తెచ్చుకోవాలి. అది కూడా ఎంత ముదురుగా ఉంటుందో.. అది దొరకడమే మహా అదృష్టం అని అనుకుని ఆనందిస్తాననుకొండీ.. కానీ.. అప్పటికప్పుడు చెట్టు నుండి కోసి వేసి కూర చేసే రోజులు, మా అమ్మ వంట అన్నీ గుర్తొచ్చీ భలే బాధగా ఉంటుంది అప్పుడప్పుడూ.. :( అంతేలే.. మరపురాని మధురమైన రోజులు.. అనుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తుంటాను. అంత కన్నా ఏం చేస్తాం చెప్పండి.?


అలాగే, గులాబీ ఎవరింట్లోనన్నా పూలు పూస్తున్నాయంటే ఎంత గొప్పగానో అనుకునేవారు అందరూ.. ఎందుకంటే.. ఎంత జాగ్రత్తగా పెంచినా.. ఊరికే చనిపోతూ ఉండేవి అవి. నానా తిప్పలూ పడేవాళ్ళు గులాబీలని బ్రతికించడానికి..! మా ఇంట్లో రెండు రకాల గులాబీలు ఉండేవి. రాణీ కలర్ (రోస్ పింక్), లేత గులాబీ రంగు పువ్వులు పూచేవి. ఇంక చామంతులయితే.. ఎన్ని రకాలు ఉండేవో.. చిట్టి చామంతి, బిళ్ళ చామంతి (తెల్లవి మధ్యలో పసుపు రంగు), ఎర్ర చామంతి.. దాదాపు ఎప్పుడు చూసినా ఒక రెండు మూడొందలు పూలుండేవి అన్నీ చామంతులూ కలిపి. రోజూ చుట్టూ పక్కల అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు గిన్నె పట్టుకుని.. పూల కోసం. ఇంకా.. కనకాంబరాలు అయితే బోలెడు ఉండేవి.

మా ఇంట్లో మా అమ్మమ్మ, అమ్మ, నాన్న ముగ్గురూ ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి.. అన్నీ రకాల పూలనూ రోజూ కోసి దేవుడికి పెట్టేవారు. మా అమ్మేమో మధ్యాహ్నం తీరిక సమయాల్లో బంతి పూలు, చామంతులు, కనకాంబరాలు లాంటివి మాలలు కట్టి మా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద దేవుళ్ళ ఫొటోలకి దండలుగా వేసేది. పూలు ఒక వారం దాకా అందంగా ఉండేవి చూడడానికి. ఇంకా.. చాలా రకాల మొక్కలు, పూలు ఉండేవి. మిగిలిన వాటి గురించి మళ్ళీ వచ్చే టపాలో చెప్తాను.
అందాకా సెలవు మరి..!

ప్రేమతో..
మధుర వాణి