Showing posts with label బ్లాగులు. Show all posts
Showing posts with label బ్లాగులు. Show all posts

Tuesday, October 02, 2012

మనసు పలికే.. మధువొలికే..


కొంతమందితో స్నేహం రోజుల వ్యవధిలోనే పెరిగి పెద్దదయినట్టు అనిపిస్తుంది. కొంతమంది నేస్తాలతో ఆర్నెల్లకో ఓసారి మాట్లాడినా అంతే ఆత్మీయంగా అనిపిస్తుంది. అలాంటి అరుదైన స్నేహితురాలు ఒకరిని పరిచయం చేస్తానివాళ. తనే 'మనసు పలికే' బ్లాగర్ అపర్ణ. మరి మొదట మా పరిచయానికీ, ఆనక మా స్నేహానికీ వారధి అక్షరాలే కదా.. అందుకే ముందు తన కలం గురించి చెప్తానేం.. :-)

తనేదో వినయం కొద్దీ తను రాసేవి తవికలు అంటుంది గానీ.. నాకైతే తన కవితల్లో తనదైన విలక్షణ ఆలోచనా శైలి, లోతైన భావపరంపర కనిపిస్తాయి. తను ఎంచుకునే పదబంధాలు, పదాల అల్లిక సరళంగా ఉంటూనే ప్రత్యేకంగా అనిపిస్తాయి. అక్షరం మీద మనం పెంచుకున్న మమకారానికీ, అక్షరానికి దూరమైన ఎడబాటు మనసులో మిగిల్చే వెలితికి ఇంతందమైన అక్షరరూపం ఇవ్వొచ్చా అనిపిస్తుంది. ప్రతి నిత్యం పరుగులు తీస్తూ జీవించడం మర్చిపోయి కేవలం బతికెయ్యడానికి అలవాటు పడిపోతున్న మనల్ని ఆపి " క్షణం అడిగిన ప్రశ్న".. బోల్డు ఆలోచనల్లో పడేస్తుంది. ఒకోసారి నేనే నీవన్నంత ఆత్మీయంగా అనిపించిన బంధాలే కంటికి కనిపించని దిగంతాల దూరంలోకి జారిపోయినట్టు మారిపోయే సంక్లిష్టమైన మనఃస్థితిని "నీకూ నాకూ మధ్య.." అంటూ అపర్ణ రాసిన కవితలో మన జ్ఞాపకాల గుర్తులేవో కదలాడినట్టనిపిస్తాయి. కొలతలకీ, లెక్కలకీ అందని సముద్రమంత ప్రేమని అనుభూతి చెందారా ఎప్పుడైనా? అందమైన మనసున్న అమ్మాయి "మౌనముద్ర" దాల్చితే ఎంత మనోహరంగా ఉంటుందో, అదే మనసుకి మనసైన బంధం అందరానిదైపోయి "మరీచిక" లా మిగిలిపోతే మనోవేదన ఎలా ఉంటుందో మీకేమన్నా తెలుసా? అప్పుడెప్పుడో ఇంటర్ చదువుకునే రోజుల్లో అంత చిన్న వయసులోనే అపర్ణ "నేను నేనే" అంటూ ఎంత చక్కటి కవిత రాసిందో మీరే చూడండి.

నాకు బోల్డంత సంబరంగా అనిపించే విషయం ఒకటుంది. అదేంటంటే అపర్ణకి తెలుగు బ్లాగుల గురించి నా బ్లాగు పరిచయం ద్వారానే తెలిసిందట. తను తరచూ చదివే బ్లాగుల గురించి ఎంతో అభిమానంగా తన జ్ఞాపకాలు పంచుకుంది. తెలుగు బ్లాగ్లోకానికి కొత్తగా వచ్చినవాళ్ళు టపాలు చదివితే ఒక్కసారే ఆణిముత్యాల్లాంటి బ్లాగులు కొన్నింటిని పరిచయం చేసుకోవచ్చు.

అప్పుడప్పుడూ వైవిధ్యమైన అంశాలని ఎంచుకుని ఆలోచింపచేసే చక్కటి కథలు కూడా రాస్తుంటుంది అపర్ణ. కుటుంబంలో తల్లీ కొడుకులు, అత్తా కోడళ్ళూ, భార్యా భర్తల మధ్యన సహజంగా ఎదురయే పరిస్థితులు, సమస్యల మూలంగా వాళ్ళ వాళ్ళ అంతరంగంలో ఆలోచనలు ఎలా సాగుతుంటాయి అనే అంశాన్ని తీసుకుని తను రాసిన "అంతర్మథనం" అనే కథ కుటుంబ సంబంధాల్లోని విభిన్న కోణాల్ని స్పృశిస్తుంది. సరికొత్త ఎత్తుగడతో మొదలై, తర్వాత ఏం జరగబోతోందో ఏవిటో అన్న ఆసక్తిని రేకెత్తిస్తూ ఊహించని కొత్త మలుపుతో ముగిసే "దుష్యంతుడు" కథ, మనమూ ఎప్పుడో అప్పుడు ఇలానే ఆలోచించామేమో కదూ అని ప్రతి ఒక్కరూ తమలోకి తాము తొంగి చూసుకునేలా చేసే కథ " రోజు" చదివితే భవిష్యత్తులో తన నుంచి మరిన్ని మంచి కథల్ని చూడగలమన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. కథలే కాదు "అనగనగా ఒక ప్రయాణం" లాంటి తన నిజ జీవిత అనుభవాలు, ఆలోచనలు మనల్ని కూడా ఆలోచింపజేస్తాయి.

అప్పుడప్పుడూ సరదా కబుర్లు చెప్పి చాలా నవ్విస్తుంటుంది కూడా.. "బల్లి దోశ" గురించి విన్నప్పుడు ఔరా.. అనుకోడం మా వంతయ్యింది. ఆదివారం అగచాట్ల గురించి చెప్పినప్పుడు బోల్డు నవ్వేసాము. లోకంలో నాలాంటి వాళ్ళందరూ బరువూ బాధ్యత అనో, సన్నగా నాజూగ్గా మారిపోడం ఎలా అనో తీవ్రంగా ఆలోచించేసి బుర్ర బద్దలు కొట్టేసుకుంటుంటే మా అప్పు మాత్రం బోల్డు తిండి తిప్పలు పడుతూ "కొవ్వుదాతా సుఖీభవ" అంటూ విచిత్రమైన స్లోగన్లు వినిపిస్తూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. అన్నట్టు "మొగలిరేకులు" గుచ్చుకుంటే ఎలా ఉంటుందో, "అందమే వ్వాఆ..నందం" ఎలా అవుతుందో తప్పక తెలుసుకోవాలి మీరు. అప్పుడప్పుడూ క్లాసులో నిద్రొచ్చినప్పుడు "తన పేరు అపర్ణ కాదు" అంటుంది కానీ మీరు మాత్రం నిజమని నమ్మకండేం! :-)

"కాళ్ళకి చక్రాలొచ్చాయోయ్.." అంటూ అపర్ణ గంతులేసినప్పుడు మేమందరం కూడా ఎంతో సంతోషించాం. బ్లాగు నేస్తాలందరినీ కలిసిప్పటి వేడుకలో నేను పాలు పంచుకోలేకపోయినా అపర్ణ "ఆనందమానందమాయే" అంటూ తన అక్షరాలతో వేలు పట్టుకు తీస్కెళ్ళి అవన్నీ తిప్పి తీసుకొచ్చినప్పుడు భలే అనిపించిందిలే! మా అపర్ణకి లెక్కలు అదేనండీ గణిత శాస్త్రం బ్రహ్మాండంగా వచ్చు. వయొలిన్ వాయించేంత సంగీతజ్ఞానం ఉంది. ఇంకా తనలో చిన్నారి పంతులమ్మ కూడా దాక్కుని ఉంది. చూసారా.. అమ్మాయి గారికి ఎన్నెన్ని కళలున్నాయో! అన్నట్టు.. పచ్చటి చేల మధ్యన పాడిపంటలతో కళకళలాడుతూ ఉండే అపర్ణ వాళ్ళ ఇంటికి మనకి సదా ఆహ్వానం ఉంటుందని చెప్పింది. ఎంత మంచి మనసో కదా తనది! :-)

మా ఇద్దరి స్నేహం గురించి చెప్పాలంటే అప్పుడెప్పుడోనే "తోటకూర అనుబంధం" విషయంలో మేమిద్దరం గట్టిగా గిల్లుకుని మరీ సేం పించ్ చెప్పుకున్నాం. ఇంకా, గోదావరి ఒడ్డు, రాముల వారి సన్నిధి, సీతమ్మ వారి కోవెల, అభయాంజనేయ స్వామి కొలువు.. అంటూ బోల్డు ఉద్వేగంగా, సంబరంగా మా ఊరి కబుర్లు కలబోసుకోవడం మా ఇద్దరికే సొంతమైన అందమైన అనుభూతి. అన్నట్టు గోదారంటే గుర్తొచ్చింది.. చాలా సినిమాల్లో వచ్చిన మంచి మంచి గోదారి పాటలన్నీ ఏరి కూర్చి అపర్ణ రాసిన "గోదావరి పరవళ్ళు,"  "వేదమంటి మా గోదారి" చిత్రాలు మీరు తప్పక చూడాల్సిందే!

మా ఇద్దరికీ కలిసే మరో అభిరుచి 'సిరివెన్నెల సాహిత్యం'. అప్పుడప్పుడూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటల్లోంచి తనని బాగా ఆకట్టున్న చక్కటి పాటలు కొన్నింటిని ఎంచుకుని అర్థవంతమైన, అందమైన వ్యాఖ్యానాలతో వర్ణిస్తూ తన "విరజాజుల సిరివెన్నెల" బ్లాగులో విశ్లేషిస్తుంటుంది అపర్ణ.

అపర్ణ రాతల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే తన మనసు పలికేది మౌనగీతం కాదని తనంటుంది.. మధువొలికే మధురగీతం అని నేనంటాను. తన రాతలు చదివాక మీరూ నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. :-)

ఇక తన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే.. తనతో కొద్ది పరిచయంలోనే ఎవరికైనా తనలాంటి మంచి స్నేహితురాలు ఉంటే బావుండనిపించేంత స్నేహశీలి. స్స్వచ్ఛమైన మనసుతో చిన్నపిల్లలా అల్లరి చేసే కలుపుగోలు మనస్తత్వం తనది. తను స్నేహానికి ఎంత విలువిస్తుందో తన నేస్తం ఒకరి గురించిన మురిపెం చూస్తేనే తెలుస్తుంది. రోజుల్లో ఇంతందంగా మల్లెచెండు అల్లడం వచ్చిన అమ్మాయిలు ఎంత అరుదో మీరే చెప్పండి. అంతే కాదు.. అపర్ణ ఎంత చక్కగా బొమ్మలు గీస్తుందో! అసలు అపర్ణతో ఒకసారి మాట్లాడిన వాళ్ళెవరైనా ముగ్ధులవాల్సిందే తెలుసా.. తను మాట్లాడే పద్ధతిలో, మాటల్లో ఆత్మీయతతో పాటు ఒద్దిక, అణకువ ఉట్టిపడుతూ.. "ఆహా.. అసలు ఆడపిల్లలంటే ఇలా మాట్లాడాలి" అన్నంత ముచ్చటేస్తుందంటే నమ్మండి. ఎన్నాళ్ళ తరవాత మాట్లాడినా తన గొంతులో పలికే మార్దవం, తను చూపించే ఆపేక్ష బోల్డు ఇష్టంగా ఉంటాయి నాకైతే.

ఇంత చక్కటి అమ్మాయికి, ఆత్మీయ నేస్తానికీ పుట్టినరోజు వస్తూనే తనకి ఇదివరకెన్నడూ ఎరుగని ఎన్నెన్నో కొంగొత్త అనుభూతుల్ని, బోల్డన్ని అమూల్యమైన బంగారు క్షణాలని, మరపు రాని మధురానునుభూతుల్ని, అంతు లేని సంతోషాల్ని తన జీవితంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మా ప్రియనేస్తం 'మనసు పలికే' అపర్ణకి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


Tuesday, February 14, 2012

ఇందు 'వెన్నెల సంతకం'.. స్నేహానికి 'మధుర సంతకం'

దాదాపు ఏడాదిన్నర క్రితం మన తెలుగు బ్లాగ్లోకంలో ఒక కొత్త బ్లాగు పుట్టింది. ఏమా బ్లాగు కథ అని అలా అటుకేసి తొంగి చూస్తే 'వెన్నెల సంతకం' అనే చక్కటి ఆహ్లాదమైన పేరుతో మొదటి చూపులోనే ఆకట్టుకుంది బ్లాగు. "మనసు పొరల్లో విరబూసిన జ్ఞాపకాల పరిమళాలు.. జాబిల్లి వెదజల్లిన వెండి పుప్పొడి రేణువులు.." అంటూ కాసింత భావుకత్వం, బోలెడంత సున్నితత్వం, మరి కాసింత కవిత్వపు పరిమళం అద్దుకుని అందంగా స్వాగతం పలికే పరిచయ వాక్యాలు కనిపించాయి. ఎవరబ్బా ఇంతందమైన బ్లాగుని రాస్తున్నారు అని బ్లాగరు పేరు చూడగానే అప్పుడు అర్థం అయింది అసలు మహత్యం ఎక్కడుందో. ఎందుకంటే అసలు 'ఇందు' అంటేనే చందమామ అని అర్థం కదా మరి! ఓహో.. అందుకేనేమో జాబిలమ్మ ఇంతందంగా వెన్నెల సంతకం చేస్తోంది. సార్థక నామధేయురాలల్లే ఉందే అమ్మాయి అనిపించింది.

తన గురించి చెప్పమంటే 'ప్రకృతి నాకు స్ఫూర్తి' అనే ఇందు తను చూసొచ్చిన అందమైన ప్రదేశాల గురించి, అక్కడ కనువిందు చేసిన ప్రకృతి రమణీయతని గురించి తనదైన శైలిలో కళ్ళకి కట్టినట్టు అందంగా వర్ణిస్తుంది. అప్పర్ పెనిన్సులా అందాలు, స్మోకీస్ టపాలు చదివితే తన అక్షరాల వెంబడి అడుగులు వేస్తూ మనం కూడా వెళ్లి చూసొచ్చినట్టే అనిపిస్తుంది. కేవలం అక్షరాల్లో నిక్షిప్తం చేయడమే కాకుండా అందమైన ప్రకృతి దృశ్యాలని తన కెమెరా కన్నుతో శాశ్వతం చేసే విద్య కూడా బాగా వచ్చు ఇందుకి. తను తీసిన ఛాయాచిత్రాలు చూడాలంటే తన ఫోటో బ్లాగ్ 'చిత్రాంజలి' ని సందర్శించాలి.
కేవలం అమెరికా అందాలే కాదు తిరుమల కాలిబాట ప్రయాణం గురించీ, సాగర్ రోడ్డు గురించి కూడా చక్కటి కబుర్లు చెప్పింది గుంటూరమ్మాయి. చిరుజల్లులంటే తనకి ఇష్టమే అయినప్పటికీ ఏమైనా తనకి మంచు అంటేనే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది. అనిపించదూ మరి.. అప్పుడోసారి ఒక అందమైన మంచు కురిసే ఉదయాన్ని మనకి చూపించిందా, మొన్నీ మధ్యే బోల్డన్ని మంచు ముచ్చట్లు చెప్పిందా, మళ్ళీ అప్పట్లో ఓసారి పేద్ద సాహసంగా మంచుకి ఎదురీదానని చెప్పి కాస్త కంగారుపెట్టింది కూడా కదా!

అన్నట్టు, మీకు ఇందు సైకిలు కథ తెలుసా.. తెలీకపోతే ముందు అర్జెంటుగా వెళ్లి తెలుసుకురావాల్సిందే! ఇంకా తన చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడితో కలిసి చేసిన అల్లరి, కళాశాల కబుర్లు, నోట్ బుక్ వెనక పేజీల్లో గీసిన కళాఖండాలూ, ఎప్పటికైనా తీరుతుందో లేదోననుకున్న తన అందమైన కల, మసాలా తాతయ్య కబుర్లూ.. ఇవన్నీ హాయిగా అలా గడ్డం కింద రెండు చేతులూ పెట్టుక్కూర్చుని వినదగిన కబుర్లు. అప్పుడప్పుడూ మిస్సింగ్ రోజ్, పరంజ్యోతి అంటూ తను చదివిన పుస్తకాలని మనకి పరిచయం చేస్తుంటుంది. పుష్పక విమానం లాంటి మంచి సినిమాల గురించే కాకుండా తింగర మంగళ అంటూ హర్రర్ సినిమా స్టోరీ చెప్పి మనల్ని కడుపుబ్బా నవ్వించేస్తుంది.

మీకు సీతాకోకచిలుకలా హాయిగా గాల్లో ఎగరాలనుందా.. అయితే ఇందు దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలా ఎగరాలో తను మీకు నేర్పిస్తుంది. అలాగే పాపం ఇందు చిన్ననాటి నేస్తం తప్పిపోయిందట. మీకెక్కడన్నా ఎదురు పడితే మన ఇందు తన కోసం ఎదురు చూస్తోందని చెప్పడం మర్చిపోకండేం! అప్పుడెప్పుడో కార్ డ్రైవింగు నేర్చుకుంటున్నాననీ, తనకి అర్జెంటుగా డ్రైవింగు లైసెన్స్ వచ్చెయ్యాలని మనందర్నీ కూడా తన కోసం పూజలూ, వ్రతాలూ చెయ్యమని చెప్పింది కదా.. ఇప్పటికైనా లైసెన్సు వచ్చిందో లేదో మరి మన మేడం గారికి.

ఇప్పటికిప్పుడే కమ్మటి కొత్తావకాయ రుచి చూడాలనిపిస్తోందా.. అయితే ఇందూ బ్లాగు తలుపు కొట్టండి. మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనిపించే కమ్మటి కొత్తావకాయ విందు దొరుకుతుంది. ఇంకా ఇందు పాకశాస్త్ర ప్రావీణ్యం చూడాలంటే మాత్రం తన చేత్తో వండి వార్చిన కొబ్బరన్నం, రివర్స్ సేమ్యా ఉప్మా రుచి చూడాల్సిందే. పనిలో పనిగా తను చెప్పే నూడిల్స్ కథ కూడా వినేసి రండి మరి. మధ్య ఇందు 'బ్రెడ్డు హేటర్స్' సంఘం ఒకటి స్థాపించింది. మీరు కూడా నాలాగా 'బ్రెడ్డు వద్దు..ఇడ్లీనే ముద్దు' అనేవారయితే చందూ గారిని సపోర్ట్ చేస్తూ ఇందూకి వ్యతిరేకంగా సంఘంలో చేరొచ్చు. హిహ్హిహ్హీ.

కల్యాణం కమనీయంలా ఇందు పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలుసా మీకు. ఇంకా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసి ఇందూచందూలని దీవించి రండి. ఇందుకి భక్తి ప్రపత్తులు కొంచెం ఎక్కువే. చక్కగా సంప్రదాయబద్ధంగా పండుగలూ, పూజలూ చేసుకోడం చాలా ఇష్టం. మీరే చూడండి వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, శివరాత్రి అంటూ ఎంత బాగా పూజలూ పునస్కారాలూ చేస్తుందో. అప్పుడప్పుడూ బుద్ధం శరణం గచ్చామీ అని కూడా స్మరిస్తుంది. అలాగే మీకు జావాలో ఏమన్నా సందేహాలుంటే ఇందుని అడిగెయ్యండి. ఎందుకంటే తను జావా వ్రతం చేసిందిగా మరి.

ఇందుకి కథలు రాయడం బాగా వచ్చు తెలుసా.. ఒక్క చిట్టి చీమ కథే కాదు, అందమైన ప్రేమకథలు కూడా రాసేస్తుంది. తొలిసారి నిన్ను చూసింది మొదలు.. అంటూ తను రాసిన తొలి కథ చదివితే మీరూ ఒప్పుకుంటారు. కేవలం కథలే కాదు.. శ్రావణ మేఘాలూ, స్వప్నాలూ అంటూ అలవోకగా కవితలు అల్లేస్తుంది. అంతే కాదు.. 'For women' అనే వెబ్సైటు కోసం తన అమెరికా వాసపు కబుర్లతో ఆసక్తికరమైన వ్యాసాలు కూడా రాస్తోంది ఇందు.

ఇందుకి అందమైన డైరీలన్నా, నెమలీకలన్నా, చాక్లెట్లన్నా మహా ఇష్టం. మీరెప్పుడైనా తన కోసం ఏదన్నా కానుకివ్వాలనుకుంటే అవి ఇచ్చెయ్యండి. బోల్డు సంతోషపడిపోతుంది. ఇంకా ఏం ఇష్టం అని అడుగుతున్నారా.. దెయ్యాల కథలంటే ఇష్టమనుకోండి. కానీ, కొంచెం భయం కూడా. అయినా సరే తను వింటానంటుంది గానీ మీరు మాత్రం తనకి దెయ్యాల కథలు చెప్పకండేం. ఎందుకంటే తర్వాత తను భయపడి పాపం చందూ గారిని కూడా కంగారు పెట్టేస్తుంది కాబట్టి. అలాగే ఇంటర్నెట్లో ఆడే గేమ్స్ గురించి మాత్రం ఇందుకి అస్సలు గుర్తు చెయ్యకండి. అసలే ఎంతో కష్టపడి ఒకసారి తన మీద తను గెలిచింది. అందుకని మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు.. సరేనా!

ఇందు గురించి ఇంకొక గొప్ప విశేషం చెప్పాలి. అదేంటంటే, తనకి కృష్ణుడు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా.. అయ్యో రామా.. నిజమండీ బాబూ.. తన బ్లాగు ముంగిట్లోకి అడుగు పెట్టగానే "ఇందూ.. ఏమన్నా కబుర్లు చెప్పవా అని ముద్దుగా అడిగే చిన్నారి కృష్ణుడిని చూస్తే మీరూ ఒప్పుకు తీరతారు. సరదాకేం కాదు గానీ, నిజంగానే ఇందుకి కృష్ణుడంటే బోల్డంత ఇష్టం, ఆరాధనా, ప్రేమా, భక్తీనూ! తన బ్లాగులో మొట్టమొదటి పోస్టుని ఒక అందమైన కృష్ణ శ్లోకం తోనే ప్రారంభించింది. శ్రీకృష్ణ చరణాల్ని తలచుకోగానే తనకి ఎంతటి భక్తి పారవశ్యమో! 'యమునా తటిలో నల్లనయ్యకై..' అంటూ సాగే కమ్మటి పాటకి ఎంతందంగా వ్యాఖ్యానం చెప్పిందో చూసారా? తన అందమైన కల కృష్ణుడి కృపతో కళ్ళెదుటే నిజంలా నిలిచి ఒక అద్వితీయమైన అనుభూతిని తనకెలా సొంతం చేసిందో మీరూ తెలుసుకోండి. మీరెప్పుడైనా బృందావనానికి వెళ్ళారా? ఇందు రాసిన బృందావనం కథ చదివితే మధురానగరి తీరం, యమునా తరంగాల సవ్వడి, బృందావనంలోని పుష్ప పరిమళాలూ, మోహన మురళీగానం.. సర్వమూ అనుభవంలోకి వస్తాయి. ఎప్పటికీ గుర్తుండిపోయే అమూల్యమైన అనుభూతిని ఒడిసిపట్టుకోవచ్చు. తన రాతలన్నీటిల్లోకీ నాకు మరీ మరీ నచ్చిన టపా కూడా ఇదే.

ఇంతసేపూ ఇందు రాతల గురించే చెప్పాను కదా.. ఇప్పుడు ఇందు గురించి రెండు మాటలు చెప్తానేం.. ఇందు చాలా మంచి అమ్మాయి. చాలా చాలా మంచి అమ్మాయి. నిజ్జంగా నిజం.. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు, తన చుట్టూ ఉన్న అందరితోనూ స్నేహంగా మసలుకునే మంచి మనసు. ఎంత అల్లరి చేస్తుందో అంత ఆలోచనాపరురాలు కూడా. నాకైతే చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితురాలైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాగుల ద్వారా పరిచయమై, స్నేహం పెంపొంది నా మనసుకి నచ్చి దగ్గరైన అతి తక్కువమంది ఆత్మీయులలో ఇందు ఒకరు. అలాంటి చిన్నారి ఇందు పుట్టినరోజు రోజే కాబట్టి.. తను ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ, తను కోరుకున్నవన్నీ దక్కాలనీ, కొంచెం బిజీ తగ్గి ఇదివరకులా తరచూ తన వెన్నెల సంతకంతో మనందరినీ మురిపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.. మనందరం కలిసి ఇందుకి హేప్పీ హేప్పీ బర్త్ డే చెబుదామా మరి..