Showing posts with label మధుకిరణాలు. Show all posts
Showing posts with label మధుకిరణాలు. Show all posts

Tuesday, July 14, 2020

ఐతే... అదే నిజమైతే!

నాజూకైన నల్లటి రెక్కల మీద కెంజాయ రంగు చుక్కలద్దుకుని రివ్వున ఎగిరే  సీతాకోకచిలుక సంబరాన్ని చూస్తూనే ఆకుచిలుకలా గాలిలో తేలిపోవాలనిపిస్తుంది.
వెండిమబ్బుల వాకిట్లో వయ్యారంగా గిరికీలు కొడుతున్న ఊదారంగు పిట్ట వినోదాన్ని చూస్తూనే రెక్కలు కట్టుకు ఎగిరిపోవాలనిపిస్తుంది.
తెల్లవారుతూనే మంచులో తడిసిన మెత్తని పచ్చిక మీద గంతులు వేస్తున్న కుందేలు ఉల్లాసాన్ని చూస్తూనే చెవులపిల్లిలా మారిపోవాలనిపిస్తుంది.
వసంతం వస్తూనే ఒక్కసారిగా పుట్టుకొచ్చిన వేనవేల లేతాకుపచ్చ చివుళ్ళ మధ్యన చిన్న చీమనై తిరుగుతూ తప్పిపోవాలనిపిస్తుంది.
మామిడిచెట్టు గుబురులో దాగి వగరైన మావిచిగురు తింటూ తీపిరాగాలు పాడే ఎలకోయిల స్వరమాధుర్యంలో కరిగిపోవాలనిపిస్తుంది.
వెన్నెల తాగిన మత్తులో తూలుతున్న నక్షత్రాలు గుప్పెడు నేలకి జారి చెట్లపై చిక్కుకున్నట్టున్న పున్నాగపూల పరిమళపు పారవశ్యంలో దాగిపోవాలనిపిస్తుంది.
సృష్టిలో ఇంత చిన్న చిన్న జీవులన్నీ పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంటే, నాకు మాత్రం ఇంకా సులువు చిక్కడం లేదు.
యుగయుగాలుగా అన్వేషిస్తూనే ఉన్నాను.
వెతికి వెతికి అలసిపోయిన నాకు, ఇదిగో, ఇప్పుడే, సరిగ్గా ఇదే క్షణాన భ్రాంతి తొలగి నా యోగ్యత ఏమిటో స్ఫురించింది.
'నేను' అనే వెదురు ముక్కగా నా అస్తిత్వాన్ని వదలి నీ చేతుల్లో ఇమడగలిగిన క్షణాన కదా.. నీ ఊపిరిని తనువెల్లా నింపుకుని అమరానుభూతిని పొందే అమృతయోగం దక్కేది!
ఆద్యంతరహితమైన నీ వేణుగాన సమ్మోహనంలో తాదాత్మ్యం చెందే ఆ అపురూప క్షణం ఎన్నడో కృష్ణా!


Wednesday, March 28, 2018

బంధం

నువ్వెవరివో? నాకేమౌతావో!
లోకం ఆడించే వైకుంఠపాళిలో తలమునకలై నీ ఊసే లేకుండా రోజులు గడుస్తాయి. ఏమో అలా ఎలా అసంకల్పితంగా నీకు దూరమౌతానో, జవాబు తెలీని ప్రశ్న!
మళ్ళీ దివ్యలోకం నుంచీ ఊడిపడతావో, ఉన్నట్టుండి చప్పున మనసులో మెదులుతావు. నీ తలపొస్తూనే తనతో పాటు ఇంకిపోయిన కళ్ళలోకి తడిని మోసుకొస్తుంది.
నే పట్టలేనంత గుబులు మనసులోనే ఇమడలేక కళ్ళలోంచి ఉబికొస్తానంటుంది. ప్రేమో, నిస్సహాయతో నన్ను అమాంతం కమ్మేసి అచేతనంగా కట్టిపడేస్తుంది. 
రోజంతా వేసవి ప్రతాపానికి వాడిపోయిన మల్లెతీగ పైకి చుక్కలవేళకి జాలిగా వీచే లేత గాలి తెమ్మెరలా లీలగా గుర్తొచ్చే నీ గొంతు ఎంత గొప్ప ఓదార్పనీ!

Tuesday, March 14, 2017

ఐ మిస్ యూ


నీలాంటి నువ్వు నాకు ఎదురుపడతావని సరదాకైనా ఊహించలేదు..
ఎన్ని ఉదయాలు నువ్వు ఊదిన కొత్త ఊపిరితో నిదుర లేచానో..
ఎన్ని తీరిక లేని రోజులు నీతో చెప్పాలనుకున్న మాటలు పేర్చుకుంటూ ఉవ్విళ్ళూరానో.. 
ఎన్ని మధ్యాహ్నాలు నీతో కూర్చుని కబుర్లాడుతూ ఆకలి సంగతి మరిచానో..
ఎన్ని అందమైన సాయంకాలాలకి నువ్వూ, నేనూ కలిసి రంగులద్దామో..
ఎన్ని అపరాత్రులు వెన్నెల సాక్షిగా మనిద్దరం నిద్రని తరిమేశామో..

చిరుజల్లుల్లో తడిసిన సంబరాలు, మంచుపూలతో సయ్యాటలు, పూకొమ్మలతో మురిపాలు, పాటలతో సరాగాలు, చిన్నతనపు తాయిలాల రుచులు, అల్లరి వయసు అచ్చట్లు ముచ్చట్లు, అందాలు, ఆనందాలు, ఆటలు, పాటలు, ఆవేశాలు, ఆక్రోశాలు, ఊహలు, ఊసులు, కథలు, వెతలు, తలపులు, తపనలు... నీ సమక్షంలో ఎన్నెన్ని మధురక్షణాలు జీవం పోసుకున్నాయో! కాలధర్మానికి అతీతంగా ఆ మధురక్షణాలన్నీటినీ అక్షరంగా మలచి నా చిన్ని మనసు పలికిన భావాలని అమరం చేశావు.

నీ చేతిలో చెయ్యి వేసి అమాయకంగా నీ కళ్ళలోకి చూస్తూ కూర్చున్న నాకు, నాకే తెలియని ఒక కొత్త నన్ను సృష్టించి నా కళ్ళకి నన్నెంతో అందంగా చూపించావు. అసలూ.. మొత్తంగా నువ్వంటే నాకేమిటో నీకెలా చెప్పనూ?

అది సరే.. ఇప్పుడు ఇదంతా కొత్తగా ఎందుకు చెప్తున్నట్టూ అంటే... ఎందుకో నీకు తెలీదూ? దూరం వచ్చి గట్టిగా అరిచి చెప్తే గానీ దగ్గరితనం విలువ తెలుసుకోలేమట.. నిజంగా! నిన్ను నేను చాలా చాలా మిస్ అయ్యాను అని చెప్పడానికి.. ఉహూ కాదు కాదు.. నేను నీ పక్కన లేకపోవడం వల్ల నన్ను నేనే ఎంతో కోల్పోయానూ అని చెప్పడానికొచ్చాను. మళ్ళీ ఆనాటి వసంతం మన ముంగిట్లో సరికొత్తగా విరిస్తే ఎంత బావుండునో కదూ!


Thursday, December 26, 2013

గగనకుసుమం


అల్లంత దూరాన నీలవర్ణాన వెలిగిపోయే ఆకాశధామం నీ నివాసం..
వినీలమైనా కారునలుపైనా నింగికి అద్దం పట్టే సాగరం నా నెలవు..
దిగంతాల అంచుల దాకా ఎగరేసే విశాలమైన రెక్కలు నీ సొంతం..
నీటి అలల తాటింపు తప్ప మరే విద్య నేర్వని చిన్ని రెక్కలు నావి..
దివిసీమలనేలే స్వేఛ్ఛావిహంగానివి నీవు..
జలతారు నీటివలలో బంధీనైన మీనాన్ని నేను..
మింటి మెరుపులని వేటాడుతూ మరీచిలా సాగేవు నీవు..
నీ క్రీగంటి చూపుకై ప్రతీక్షిస్తూ ఛాయలా తిరిగేను నేను..
సుదూరాన గగనభువనాలు సంగమించే చోటు కళ్ళెదుటే కనిపిస్తూ ఆకర్షిస్తుంది..
కానీ ఎంతగా రెక్కలార్చుకు ఈదినా ఇసుమంతైనా ఆ దూరం తరగదు కరగదు!

Friday, June 14, 2013

కలవేనా!




మనసు తీరంలో తుంటరి చేపపిల్లల్లా ఎగిరెగిరి పడుతున్న తలపుల్లోంచి జారి తలగడ మీదకి చేరావు..
గాలి చప్పుళ్ళకి ఊయలూగుతున్న మేపిల్ ఆకుల గుసగుసలతో కలిసి చెవిలో చేరి నువ్వేదో చెబుతుంటే ఊ కొడుతున్నాను..
కిటికీ సందుల్లోంచి దొంగతనంగా చొరబడుతున్న వెన్నెల తుంపరలు నీ చేతి స్పర్శలో కలిసి గారాబంగా జోకొడుతుంటే సోలిపోతున్నాను..
కనులారా నీ మోము చూడాలని ఎంతగా అనుకున్నా నిదురలో జోగుతున్న కనురెప్పల తలుపులు తెరుచుకోనంటున్నాయి..
రజాయి వెచ్చదనంలో మరింతగా కూరుకుపోతూ నీకోసం సాచిన చేతిని ఖాళీ వెక్కిరించేసరికి కలవరపడి కలలోంచి జారి నిజంలోకొచ్చిపడ్డాను..
తెలి మంచు రాతిరి కౌగిలో తొలి సంధ్య పొద్దు గిలిగింతో తేల్చుకోలేని అయోమయంలో నీ జాడ లేని గదంతా ఘనీభవించిన ఏకాంతం వింతగా తోచింది..
కలలో విచ్చుకున్న కలువ నవ్వు వియోగపు వెలుతురు సోకి పెదవంచు నుంచి ఒలికి నిశబ్దంగా నేలజారింది!

Thursday, November 08, 2012

కాలం చెల్లని జ్ఞాపకం.. 'నువ్వు'



నేటికి అది ఎంత గొప్ప అనుభవమైనా రేపటికి గతం ఒడిలో తల దాచుకోవలసిందేనట..
ఎంత చిక్కటి అనుభూతి తాలూకు భావగాఢతైనా పాతబడే కొద్దీ ఇగిరిపోవలసిందేనట..
గత వైభవపు ఆనవాళ్ళైనా కాలరక్కసి కరాళ నృత్యపు చిందుల్లో అణిగిపోవలసిందేనట..
ఎంతటి ఘన చరిత్రలైనా మరపు మారాణి కరకు చూపుల ధాటికి సమసిపోవలసిందేనట..
పాటి దివ్య స్మృతులైనా వర్తమాన ప్రవాహపు వెల్లువలో పడి కొట్టుకుపోవలసిందేనట..
ఎన్ని రమ్యమైన రంగుల కలలైనా కనులు విప్పి వెలుగు సోకిన క్షణం వెలిసిపోవలసిందేనట..
ఎంతటి తీవ్ర మనోవేదనైనా జీవితచక్ర పరిభ్రమణంలో నలిగి బలహీనపడవలసిందేనట..
కానీ.. ఇదంతా నిజమే అయితే....
మరి నీ జ్ఞాపకాలు మాత్రం రోజురోజుకీ పదునెక్కుతూ నేను మోయలేని బరువైపోతున్నాయేం!
ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా గతంలోకి జారుకోనని మారాం చేస్తూ ప్రస్తుతంలోనే బంధీలయిపోయాయేం!

Wednesday, June 06, 2012

నా కవితకి ఆంగ్లానువాదం - "Enduring Search …"

N.S మూర్తి గారు నడుపుతున్న 'అనువాదలహరి' బ్లాగు మన బ్లాగు మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. ఆ బ్లాగులో వివిధ ప్రపంచ భాషల కవితలే కాకుండా అప్పుడప్పుడూ మన బ్లాగర్లు రాసిన తెలుగు కవితల్ని కూడా ఆయన ఆంగ్లంలోకి అనువదిస్తుంటారు.

నేను రాసిన ఒక 'నా అన్వేషణ' అనే కవితని 'EnduringSearch…' పేరుతో ఆంగ్లంలోకి అనువదించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నిజానికి ఆయన రాసిన అనువాదం చూసాక నేను రాసిన దానికన్నా అదే ఎక్కువ నచ్చేసింది నాకు. నేనా మాటంటే "మాతృకలో లేనిది అనువాదంలో ఎలా వస్తుందమ్మా.." అనడం ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం. జీవితంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎక్కువ జ్ఞానం సంపాదించేకొద్దీ మరింత ఒదిగి ఉండాలనే గుణం అలవరచుకోవాలని ఆయనతో మాట్లాడిన ప్రతీసారీ అనిపిస్తుంది నాకు. :)

ఆయన రాసిన నా కవిత అనువాదాన్ని నా బ్లాగులో భద్రంగా దాచుకోవాలన్న కారణంతో పాటు, అందరూ తప్పక చూడతగిన 'అనువాదలహరి' బ్లాగు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ పోస్టు ద్వారా కొందరికైనా తెలియవస్తుందనీ మూర్తి గారి అనువాదాన్ని ఇక్కడ మళ్ళీ రీ-పోస్ట్ చేస్తున్నాను.
 
మూర్తి గారూ, నా బ్లాగ్ముఖంగా మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

[For the first look and for a finicky reader, it may sound funny and ridiculous(may even sound foolish) when you say you are searching for something you never knew. But if we honestly assess our lives and its pursuits, we would have to, perhaps, admit that our life is a marathon search for something we never knew clearly. Even if we had achieved something, instead of living contented with what we have achieved,  like a child who cries for the toy that it did not have ignoring all that it had, we suffer with a sense of dissatisfaction and a craving for something that we did not achieve. Even at the threshold of death, our search for that unknown shall not cease. Its my opinion that this  poem puts that idea so succinctly.]

Yesterday… today…
Day in and day out…and,
For eons…
I have been on the search ….

What is it that I am seeking after?
Who for I am searching for?
What are the places I am looking about?
But,
Why should I search for, at all?
I don’t know!
It is an infinitum of questions …
With no definite answers.

*


Did I ever allow something
To slip through my hands any where?
I don’t think so.
But yet,
I search for that elusive thing
With the illusion that I own it.
Time is fleeting… days are thawing.
Hopes are vanishing… Faith is retreating
Life is ceasing… and the Spirit, depleting
Yet, that crazy search continues…
Cutting through the dense deep darknesses…
To the limits of horizon and to the depths of oceans
For that evanescent enigmatic something
Till breath snaps
Till spirit saps
My being becomes ethereal…
Maybe,
This search shall endure… ever… for ever!

*********************

నా అన్వేషణ!

[మనకు తెలియని వస్తువుగురించి మనం వెతుకుతున్నామని చెబితే, స్థూల దృష్టికి చిత్రంగానూవంకలు వెతికే వారికిహాస్యాస్పదంగానూ కనిపించవచ్చు. కాని, మీరు అవేవీ పట్టించుకోకుండా, "మీ జీవిత గమ్యం ఏమిటి? మీరేం సాధిద్దామనుకుంటున్నారు?" అని నవ్వుతున్నవారిని ఒక్కసారి అడిగి చూడండి. ఆ నవ్వులు, హేళనలూ ఆగిపోతాయి. ఈ దైనందినజీవితపు పరుగుపందెంలో అందరితోపాటు మనమూ పరిగెత్తితున్నాం. ఎందుకుపరిగెత్తుతున్నామో తెలీదు. దేన్ని సాధించడానికి పరిగెత్తుతున్నామో తెలీదు. ఒకవేళ ఏదైనా సాధించినా, అది ఇచ్చే సంతృప్తి కంటే, సాధించలేని విషయాలిచ్చే అసంతృప్తి ఎక్కువ. జీవిత చరమాంకంలో కూడా ఈ అసంతృప్తి మనల్ని వదలదు.'శిలాలోలిత'లో, రేవతీదేవిగారు రాసిన "దిగులెందుకో చెప్పలేని దిగులు"లాంటి భావన ఇది. ఈ భావాన్ని, మధురవాణిగారు ఇందులో చక్కగా ప్రకటించగలిగేరని నా అభిప్రాయం.]

నిన్నా నేడూ పగలూ రాత్రీ అనుక్షణం నిర్విరామంగా వెతుకుతూనే ఉన్నాను..
యుగయుగాల నుంచీ సాగుతోందీ వెతుకులాట..
దేని కోసం వెతుకుతున్నాను?
ఎవరి కోసం వెతుకుతున్నాను?
ఎక్కడని వెతకాలి?
అసలెందుకు వెతకాలి?
ఏమో.. అన్నీ ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు!
నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..
కాలాలు కదలిపోతున్నాయ్.. రోజులు తరిగిపోతున్నాయ్..
ఆశలు చెదిరిపోతున్నాయ్.. నమ్మకాలు చెరిగిపోతున్నాయ్..
ఆయువు కరిగిపోతోంది.. ప్రాణం ఇగిరిపోతోంది..
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!

Friday, June 01, 2012

ప్రేమ ఖైదు


నీకై ఎదురుచూస్తూ చూస్తూనే నిశ్శబ్దంలో గంటలూ రోజులూ గడుస్తాయి..
నన్ను నీ జ్ఞాపకాలకి బందీగా చేసి నీ ఊహలకి ఎరగా వేసి వెళ్ళిపోతావు..
అడుగులో అడుగేస్తూ నీ వెంటే పడుతూంటే పరాగ్గానైనా వెనుదిరిగి చూడవు..
అతికష్టం మీద నీ వెనక పరుగాపి నిలకడగా నించోబోతే గారంగా నవ్వి కవ్విస్తావు..
మౌనముద్రలోకి జారిపోవాలని ప్రయత్నిస్తున్న ప్రాణాన్ని ప్రేమగా తట్టి లేపుతావు..
మళ్ళీ మళ్ళీ ఆద్యంతాలు తెలియని అగాథమంటి నీ ప్రేమ ఖైదులోనే పడదోస్తావు..
మన మధ్యన అదృశ్యంగా మంచుతెరలా నిలిచిన దూరం కొలతలకీ అందనిదేమో..
నువ్వే నాకు అర్థం కావో.. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోతానో.. మాయో మర్మమో..
అదేదైనా గానీ.. బహుశా నాకెప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలానే మిగిలిపోతుందేమో!