Thursday, May 24, 2012

ఒక పోస్టు చెయ్యని ఉత్తరం - 2(ఇదివరకు అమ్మాయి రాసిన ఉత్తరం చూసారు కదా.. ఇప్పుడు ఇది నాణేనికి మరో వైపు.. అబ్బాయి రాసుకున్న ఉత్తరమన్నమాట. :)

నువ్వు నా మనసుకి ఎంత దగ్గరైన మనిషివైనా నిన్నేమని పిలవాలో కూడా తెలియని, తెలిసినా నాకు నచ్చినట్టు నిన్ను గొంతెత్తి పిలవలేని అశక్తత నాది. నువ్వు తలపుకి రాగానే నా గొంతుకేదో అడ్డం పడినట్టవుతుంది. మాట బయటికి పెగలదు. ఎన్నేళ్ళ నుంచో గొంతులో గడ్డ కట్టుకుపోయిన మాటల్ని అతికష్టం మీద అక్షరాలుగా మార్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నానిప్పుడు. నువ్వు ప్రేమగా మాట్లాడినప్పుడు, కబుర్లు చెప్తూ అల్లరి చేసినప్పుడు, అమాయకంగా నవ్వినప్పుడు, నిన్ను చూస్తుంటే నాక్కలిగే సంతోషమే నువ్వు తిట్టినప్పుడు కూడా కలిగేది. అసలు నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే చుట్టూ మరేదీ నా కనుచూపుమేరలో నిలిచేది కాదు. నిన్ను కళ్ళారా చూస్తూ ఎన్ని యుగాలైనా క్షణాల్లా గడిచిపోతాయనిపించేది. చివరికి నువ్వు నన్ను విసుక్కున్నప్పుడు, కోప్పడ్డప్పుడు, చెడామడా తిట్టేసినప్పుడు కూడా మురిపెంగానే ఉండేది తప్ప ఒక్క మాటైనా గట్టిగా అనాలనిపించేది కాదు. నువ్వు నన్ను కాదన్నావ్, వదిలి వెళ్ళిపొమ్మనావ్, నా మీద అరిచావ్, ఇంకెప్పుడూ కనపడొద్దన్నావ్, ఇంకసలు నాతో మాట్లాడనన్నావ్.... కానీ, అసలు నీకేం నచ్చలేదోనా మీద ఎందుకు కోపమొచ్చిందో ఎంతగా ఆలోచించినా ఇప్పటికీ నాకు సమాధానం దొరకట్లేదు.

ఒకోసారి అనిపిస్తుంటుంది.. నేను నిన్ను తప్ప వేరెవర్నీ నా మనసుకి దగ్గరగా రానివ్వకుండా దూరదూరంగా జరిగాను. నా స్నేహం కోరి నా చుట్టూ తిరిగిన ఎంతోమందిని కాదనుకుని ఏనాటికైనా నువ్వొస్తావనీ, కోపం తగ్గిపోయి ప్రేమగా దగ్గరౌతావనీ ఎదురు చూసాను. ఆ ఎదురు చూపుల్లోనే ఎన్నెన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోయాయి. ఇన్నేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అన్నీ జ్ఞాపకాలే తప్ప నాతో ఎవ్వరూ లేరు. నా చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి నెమ్మదిగా ఒక్కొక్కరూ కనుమరుగైపోతున్నారు. నువ్వు మాత్రం అప్పటికీ ఇప్పటికీ నాలోనే ఉన్నావు నా మనసుకి దగ్గరగా. నన్ను ఇష్టపడని వాళ్ళెవరూ ఉండరని ఒక్కోసారి చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతలోనే నువ్వు గుర్తొస్తావు. నువ్వు లేవు కదా నాతో.. ఇంకెందుకు ఇవన్నీ అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో అరుదైన విజయాలు సాధించాననిపిస్తుంది. ఎంతో తక్కువమందికి మాత్రమే సాధ్యమైన ఎత్తులు చూసాననిపిస్తుంది. పేరు, ప్రతిష్ట, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా నా మనసు పదే పదే కావాలని మారాం చేసే నిన్ను మాత్రం తెచ్చివ్వలేను కదా! నీ ధ్యాసలోనే, నీ ప్రేమ కోసం చూస్తూనే ఇప్పటికిలా ఒంటరిగా మిగిలిపోయానేమో అనిపిస్తుంది. చిత్రంగా ఒంటరితనంలో కూడా నువ్వే. నువ్వున్నంత వరకూ నేనో ఒంటరిని కాని ఒంటరిని. అసలెందుకురా అలా చేసావ్? అన్నేళ్ళయినా కోపం తగ్గిపోనంత పెద్ద తప్పు నేనేం చేసాను? ఎందుకు నాకిలా దూరమైపోయావ్? ఎందుకింత పెద్ద శిక్ష వేసావ్? నీ పేరు గుర్తొస్తే చాలు నా గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. మనిద్దరం స్నేహంగా ఉన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా నవ్వేదానివి, ఎన్నెన్ని కబుర్లు చెప్పేదానివి, ఎంత ముద్దుగా అల్లరి చేసేదానివి.. అవన్నీ నన్నింకా బతికిస్తున్నాయి తెలుసా!  నా మొహంలో నవ్వుని ఇంకా సజీవంగా ఉంచేది నీతో గడిపిన ఆ క్షణాల ఆనవాళ్ళే. జీవితంలో ఎంతమందో పరిచయం అవుతూనే ఉంటారు. ఎవ్వరొచ్చినా పోతున్నా నా మనసులో నీ స్థానం మారే అవకాశం ఈ జన్మకైతే కనిపించట్లేదు. అది ఎప్పటికీ నీకే సొంతం నువ్వు అవునన్నా కాదన్నా!

అసలు నేను నీకు గుర్తున్నానో లేదో, ఎప్పుడన్నా నా పేరైనా తలచుకుంటావో లేదో అనిపిస్తుంది. ఒకవేళ నన్ను తలచుకున్నా ఇంకా అదే కోపమా? కనీసం ఇప్పటికైనా మనిద్దరం సంతోషంగా కలిసి గడిపిన జ్ఞాపకాల్ని తలచుకోవా అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే ఒకోసారి తప్పంతా నాదేనేమో.. నువ్వు నాకెంత అపురూపమో నేనే నీకు సరిగ్గా అర్థమయేలా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది. అయినా, అలాంటి ప్రయత్నం చెయ్యాలన్నా అసలప్పుడు నువ్వు మాట్లాడనిచ్చావా నన్ను.. అమ్మో ఎంత మొండి పిల్లవో నువ్వసలు! అందరూ అంటుంటారు.. నేను దేన్నైనా చాలా తేలికగా తీసుకుంటానని, నన్ను చూసి నేర్చుకోవాలనీ.. హుమ్మ్.. నాకప్పుడు నవ్వొస్తుంది.. నువ్వు గుర్తొస్తావ్. ఎక్కడైనా కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న పిల్లల్ని చూస్తే నువ్వే గుర్తొస్తావు. జోరున వర్షం కురుస్తుంటే నువ్వే గుర్తొస్తావ్. ఇదే వాన ఎక్కడో చోట నిన్ను తడిపేస్తూ ఉంటుందేమోనన్న ఊహ బాగుంటుంది. మనిద్దరం ఎంత దూరతీరాలలో ఉన్నా ఒకటే జాబిలినీ, వెన్నెలనీ కలిసి చూస్తున్నట్టు, ఏ రాత్రి వేళో ఆకాశంలో చుక్కల్ని చెరో వైపు నుంచీ లెక్కబెడుతున్నట్టు అనిపిస్తుంది. నీకిష్టమైన జాజులూ, మల్లెల్ని చూసినప్పుడల్లా వాటిల్లో నవ్వుతున్న నువ్వే కనిపిస్తావు. నేను దూరమైనా ఇవన్నీ నీకు చేరువగానే ఉండి ఉంటాయి కదూ! ఒక్కసారి నువ్వు కనిపిస్తే బాగుండుననిపిస్తుంది. అంతలోనే వద్దనిపిస్తుంది. ఊహించడానిక్కూడా ధైర్యం సరిపోదు. ఇన్నేళ్ళ తర్వాత నువ్వు కనిపిస్తే...... ఉహూ వద్దు.. నా గుండె ఆగిపోతుందేమో, ప్రాణం పోతుందేమో.. వద్దు వద్దు.. నేను భరించలేను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను కానీ... నీ పక్కన ఇంకొకరిని నేను చూడలేనురా! చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు. ఎంతో ధైర్యంగా కనిపించే నాలో ఏ మూలో పిరికితనం కూడా దాక్కుని ఉందని ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది. నువ్వు నా పక్కన ఉంటావన్న ఒకే ఒక్క ఆశ కారణంగా నాకు ఇంకో జన్మ ఉంటుందని నమ్మాలని ఉంది. కాలం గడిచే కొద్దీ అన్నీ మారిపోతుంటాయి అది లోకసహజం. కానీ, కాలం గడిచే కొద్దీ కొన్ని జ్ఞాపకాల బరువు పెరుగుతూ ఉంటుంది. కొన్ని బంధాలు మరింత బలపడతాయి. మరుపన్నదే లేనివి కొన్ని ఉంటాయనీ, అవి ఓ కంట కన్నీరునీ, మరో కంట సంతోషాన్నీ రప్పిస్తాయనీ అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. అసలు నాకు నువ్వు దూరమైపోయావు అని విలపించడం ఓ పక్కైతే నువ్వనే దానివి నా జీవితంలో ఒకప్పుడు ఉన్నావు. నా జీవితంలో అతి కొద్ది క్షణాలనైనా నీ రంగులతో నింపావు.. అన్నది తలచుకుంటే మరో పక్క సంతోషం.. రెండూ కలగలిసిపోయి.. కళ్ళని తడిపేస్తాయి. నా ఆరోప్రాణమా.. ఇంతకన్నా నన్నేం చెప్పమంటావూ?

Monday, May 21, 2012

నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో..


నేను అప్పుడప్పుడూ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ యూట్యూబ్ లో పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను. మొత్తం మూడు గంటల సినిమాని కొంచెం కొంచెంగా ఒక మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేస్తుంటానన్నమాట. అలా మొన్నొక రోజున కృష్ణ, కె ఆర్ విజయ జంటగా నటించిన 'కోడలు పిల్ల' అనే సినిమా చూసా.. సినిమా భలే సరదాగా ఉంటుందిలే. అసలీ సినిమాకి కోడలు చేసిన శపథం అని పెట్టాల్సిందేమో పేరు. చాలా పాత సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా నాగభూషణం మేకవన్నె పులి లాంటి విలన్. హీరోయిన్ కోడలుగా అతనింటిలో చేరి ఎత్తుకి పై ఎత్తులు వేసి అతని బండారం బయటపెట్టి ఎలా బుద్ధి చెప్పిందనేది చిత్ర కథ. హీరోయిన్ శపథం నెరవేర్చడానికి ఆమెకి తోడుగా నిలిచే కథానాయకుడు, సెంటిమెంటు పండించడానికి మంచి మనసున్న గుడ్డి తల్లిగా అంజలీ దేవీ, మనల్ని నవ్వించే బాధ్యత తీసుకోడానికి రాజబాబు, అల్లు రామలింగయ్య సినిమాలో ఇతర పాత్రధారులు.  :-)

అయితే ఈ సినిమాలో ఒక పాట మొదటిసారి వినగానే నాకు భలే నచ్చేసింది. అప్పటి నుంచీ 'నన్ను తాకే ఎవ్వరో ఎవ్వరో..' అంటూ పాట పల్లవిని పదే పదే వల్లే వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చాలాసార్లే వినేస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఈ పాటకి ఆరుద్ర గారు సాహిత్యం అందిస్తే, జి.కె వెంకటేష్ గారు సంగీత సారథ్యం వహించారు. మెల్లగా, హాయిగా సాగిపోయే మెలోడీ పాటలు నచ్చేవారికి ఈ పాట తప్పకుండా నచ్చుతుంది.

ఈ పాటని ఇక్కడ వినొచ్చు..

నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..
తడి మేను వణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో..
నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..

నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో..
నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో..
చెలి పక్కన ఉంటే నే పరవశామౌతా.. చెలి పక్కన ఉంటే నే పరవశామౌతా..
ఈ చక్కని చుక్క చెక్కిలి నొక్కుట ఏమో.. కల ఏమో..

దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనె లాంటి మనసు కలిపెనో..
దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనె లాంటి మనసు కలిపెనో..
ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే.. ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే..
ఈ మధుర మధుర మధుర భావమేమో.. వలపేమో..

నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..
తడి మేను వణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో..
నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..