Thursday, October 28, 2010

తల ఎత్తి జీవించు తమ్ముడా.. తెలుగు నేలలో మొలకెత్తినాననీ!

ఈ వాక్యం ఒక పాట పల్లవికి సంబంధించింది. యీ పాట 2009 లో శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహాత్మ' సినిమాలోనిది. అప్పల్రాజు చెప్పినట్టు (రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కొత్త సినిమా పాటలో) కృష్ణవంశీ తన సినిమాలతో సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా, ఆయన పుణ్యాన అప్పుడప్పుడూ ఇలాంటి మంచి మంచి పాటలు వినే భాగ్యం కలుగుతూ ఉంటుంది నాలాంటి వాళ్లకి. ;)

ఈ సినిమాకి సంగీత సారధ్యం వహించింది విజయ్ ఆంటోని. అసలు యీ రోజుల్లో ఇంత మంచి తెలుగు పాట వినగలగడం అది కూడా తెలుగుజాతి ఔన్నత్యాన్ని తెలియజెప్పే పాట అవడం ఆశ్చర్యమూ, ఆనందకరమూ అయిన విషయం. ఇక సిరివెన్నెల గారు యీ పాటని రాసారు అనడం కంటే.. తెలుగు జాతి కీర్తిని అంతే అందమైన తెలుగు పదాల్లో పొదిగారు అనడం సరైనది. అలా ఒద్దికగా పేర్చిన సిరివెన్నెల గారి పదాలకి ప్రాణం పోసింది మాత్రం మన బాలు గారి గాత్రం. నాకైతే బాలు గారి స్వరంలో యీ పాట చెవులకు వినబడుతోంటే ఓ రకమైన ఆనందం, ఉత్సాహం, గర్వం, కాస్తంత బాధ అన్నీ భావాలు కలగాపులగమైపోయి కళ్ళు తడిసిపోతుంటాయి. పాట మొదట్లో "సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ.." అంటూ చెవిన పడగానే చాలా ఉద్వేగంగా అనిపిస్తుంది.

ఎంత గొప్పది నా మాతృభూమి, ఎంతటి కీర్తివంతం నా గత చరిత్ర అని మనసులో ఓ పక్క పొంగిపోతూనే, మరో పక్క వేరెవరి ప్రమేయం అక్కరలేకుండా మనలో మనమే కొట్టుకు ఛస్తున్న ఇప్పటి మన దుస్థితి గుర్తొచ్చి ఉస్సూరుమనిపిస్తుంది. హుమ్మ్.. మన పోట్లాట ముందు ముందు ఎంత దూరం పోనుందో మరి! రాజకీయాల గురించి నాకెక్కువ తెలీదు గానీ తెలుగు మాట్లాడే మనమంతా ఒక్క కుటుంబానికి చెందినట్టేనని నా అభిప్రాయం. నా ఒక్కదాని అభిప్రాయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదనుకోండి. ;) ఈ పాటలో సిరివెన్నెల గారన్నట్టు భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటామంటారా? సందేహమే!

మళ్ళీ పాట విషయానికొస్తే, సినిమా టైటిల్స్ పడేప్పుడు వచ్చే పాట ఇది. యీ పాట వీడియోలో తెలుగుతల్లి కడుపున పుట్టిన మహానుభావులు ఎందరినో చూపిస్తారు. వాళ్ళల్లో చాలామంది గొప్పతనం గురించి నాకు తెలీదు. పుట్టెడు అజ్ఞానంలో ఉన్న నాలాంటి ఈ తరం జనాలకి తెలిసేట్టుగా బొమ్మలతో పాటు వారి పేర్లు కూడా వేశారు. అందుకు కృష్ణవంశీకి థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట విన్నాక అందులో చూపించిన వాళ్ళందరి జీవిత చరిత్రలు చదివితే బాగుండుననిపిస్తుంది నాకు. ఎప్పటికైనా ప్రయత్నించాలి.

ఈ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఓసారి చూడండి. అంతా అర్థమైంది గానీ, తెలుగునేలని "త్రిసంధ్యాభివంద్యం" అని ఎందుకన్నారో నా మట్టిబుర్రకి అర్థం కాలేదు. తెలిసినవారు ఎవరైనా ఈ సందేహం తీరిస్తే ధన్యురాలిని. నాకైతే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత నచ్చేసింది ఈ పాట. ఇప్పటిదాకా ఈ పాట వినని వాళ్లెవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు ప్రయత్నించండి. తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాట కోసం ఇక్కడ చూడండి.


సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ..

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

తల వంచి కైమోడ్చు తమ్ముడా..
తెలుగు తల్లి నను కని పెంచినాదని..
కనుక తులలేని జన్మమ్ము నాదని..

త్రైలింగ ధామం.. త్రిలోకాభిరామం..
అనన్యం.. అగణ్యం.. ఏదో పూర్వపుణ్యం..
త్రిసంధ్యాభివంద్యం... అహో జన్మ ధన్యం!

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి..
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి..
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ..
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి..

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ముల తపఃసంపత్తి నీ వారసత్వం..
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం..
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం..
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం..

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

Wednesday, October 20, 2010

చేజారిన ప్రేమ!


నువ్వు ఎప్పుడో శిథిలమైన గతానికి ప్రతీకవని నేననుకున్నాను.
ఏదీ ధైర్యంగా నాలోకి మాటు తొంగి చూసి చెప్పమని నా మనసు నిలదీసింది.
నాలో నువ్వు లేవని దాన్ని నమ్మించడానికి విఫలయత్నం చేశాను.
మనసు పోరుకి ఎదురు నిలవలేక ఏవో నిశివీధుల్లో తప్పించుకు తిరిగాను.
నేను నిమిత్త మాత్రురాలిని అన్నట్టు కాలం తన రంగులు మారుస్తూ కరిగిపోతూనే ఉంది.

గుండెలో మూలనో రహస్యంగా దాగిన మధుర జ్ఞాపకాలు ఉన్నట్టుండి నిద్ర లేచాయి.
ఇన్నాళ్ళూ మా జాడ మరచినట్టు భ్రమపడుతున్నావు కదూ అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
కరిగిపోయింది కేవలం కలేనని చెప్పి మనసుని మాయ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను.
కల కాదు నే కోల్పోయింది మరెన్నటికీ తిరిగిరాని అమూల్యమైన ప్రేమనీ అది వాదిస్తోంది.
వేదనతో ఘనీభవించిన నా మనసుని వెచ్చటి కన్నీళ్ళలో కరిగించెయ్యాలని ఉంది.

నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయిన నా అమాయకత్వానికి నవ్వొస్తోంది.
నిన్ను చేజార్చుకున్న నా పిచ్చితనానికి జాలేస్తోంది.
నిన్నందుకోలేకపోయిన నా దురదృష్టానికి కోపమొస్తోంది.
నిన్ను చేరుకోలేని నా అశక్తతకి ఏడుపొస్తోంది.

నిరంతరం వెంటాడుతున్న నీ తలపుల నుంచి దూరంగా పారిపోడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను.
నా మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న నీ స్మృతుల్ని తుడిచెయ్యలేక ఓడిపోయి సోలిపోతున్నాను.
ఇప్పుడు కూడా నువ్వు పంచిన అప్పటి జ్ఞాపకాలే నా తోడుగా నిలబడి నా మనసుకి ఊపిరి పోస్తున్నాయి!

Thursday, October 07, 2010

ఆహా! నెయ్యి రుచి.. అనరా మైమరచి!

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని, వేడి వేడిగా అప్పుడే కాచిన నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుంది!
వేడి వేడి ఇడ్లీని కారప్పొడి, నెయ్యిలో ముంచుకు తింటే ఎలా ఉంటుంది!
వేడి వేడి పరమాన్నంలో మధ్యన పెద్ద గురుగులాగా చేసుకుని దాన్నిండా నెయ్యి నింపుకుని తింటుంటే ఎలా ఉంటుంది!
తెల్లవారుఝామున్నే గోదారి స్నానం చేసి, రామాలయానికి వెళ్లి రాముడి దర్శనం చేసుకుని, గోదావరినీ, సూర్యోదయాన్నీ చూస్తూ.. అక్కడ విస్తరాకులో కట్టి ఇచ్చే వేడి వేడి చక్కెరపొంగలి ప్రసాదం గనక తింటే అమృతం రుచంటే ఏంటో యిట్టే తెలిసిపోతుంది ఎవరికైనా!
ఇంకా నేతి గారెలు, బూరెలు, అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు.. వీటన్నీటి రుచి ఎంత అమోఘంగా ఉంటుందీ!
మాట కొస్తే, అసలు ఏ పచ్చడిలో అయినా, కూరలోనయినా నాలుగు నేతిబొట్లు వేసుకు తింటే.. ఆహా.. స్వర్గం అంచుల్లో తేలుతున్నట్టు ఉంటుంది కదూ!
అసలు వీటన్నీటికి ఆ అద్భుతమైన రుచి ఎలా వచ్చిందో తెలుసా? కేవలం నెయ్యి వల్లే!
అమృతం ఎలా ఉంటుందీ.. అని ఎవరైనా అడిగితే 'నెయ్యిలా..' అని ఠక్కున సమాధానం చెప్పేస్తాను నేనయితే.kenyit

అసలు యీ భూప్రపంచం మీద నెయ్యి కంటే రుచి గల పదార్ధం ఏదైనా ఉండే అవకాశమే లేదని నా గట్టి నమ్మకం.

చిన్నప్పుడు, ఎక్కడో ఇంటి వెనకాల నిప్పుల మీద నెయ్యి కాస్తుంటే, మొత్తం ఇల్లంతా ఘుమఘుమలాడిపోయేది. నెయ్యి కాచాక చివరలో అప్పుడే తాజాగా పెరట్లో నుంచి తెంపుకొచ్చిన లేత కరివేపాకు రెబ్బలు వేస్తుంది మా అమ్మ.

ఆ కమ్మటి వాసన తగలగానే అప్పటికప్పుడు భలేగా ఆకలేసేది! నాకొక్కదానికి ప్రత్యేకంగా ఇంకో చిన్న నెయ్యి గిన్నె కావాలని గొడవ చేసేదాన్ని. అప్పటికప్పుడు కాచిన నెయ్యి అయితేనే తినేదాన్ని. ఒకసారి నెయ్యేసుకుని అన్నం కలుపున్నాక, మళ్ళీ ప్రతీ ముద్ద పైన కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని తినేదాన్ని.
"అందరూ అన్నం తినడం కోసం నెయ్యి వేసుకుంటారు. అక్క మాత్రం నెయ్యి తినడం కోసం అన్నం తింటుంది. అయినా అందరూ నెయ్యి వేసుకుంటారు. అక్క మాత్రం నెయ్యి పోసుకుంటుంది" అనేవాడు మా తమ్ముడు చిన్నప్పుడు. ఇప్పటికి కూడా అదే మాట మీద నిలబడతాడనుకోండి. అది వేరే సంగతి! స్వర్ణయుగం అంటే అలాంటి రోజులేనేమో!gigil


నెయ్యి ఫోటో జ్యోతి గారి 'షడ్రుచులు' నుంచి.senyum


ఇప్పుడు నెయ్యి తినడం గురించి నేనో కథ చెప్తాను. "నెయ్యి ఎక్కువ తినకూడదు, ఎందుకంటే.." అంటూ యీ కథని మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు.

అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి నెయ్యంటే చాలా ఇష్టమట. అందుకని తెగ తినేవాడట నెయ్యి. అచ్చం నాలాగానే అన్నమాట!jelir
కానీ, వాళ్ళింట్లో ఎక్కువగా పాడి లేకపోవడం వల్ల తనకి కావలసినంత నెయ్యి దొరికేది కాదట. అయినా గానీ, దొరికినంతమటుకు స్వాహా చేస్తూ ఉండేవాడట.
అలా అలా ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడట. పెద్దయ్యాక కూడా నెయ్యి మీద ఇష్టం ఇసుమంతైనా తగ్గలేదట. వాళ్ళింట్లోనే కాకుండా, ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు కూడా నెయ్యి గిన్నె మొత్తం ఖాళీ చేసేవాడట. ఇలా ఉండగా, ఒకసారి ఆ దేశపు రాజు గారు తన కుమార్తె వివాహ సందర్భంగా రాజ్యంలోని ప్రజలందరికీ విందు భోజనం ఏర్పాటు చేసారట. ఆ పెళ్లి విందులో బోలెడన్ని రకాల పిండివంటలు, తినుబండారాలు అడిగినవారికి లేదనకుండా ఎంతైనా సరే వాళ్ళు తృప్తి పడిందాకా వడ్డించాలని రాజు గారు ఆజ్ఞాపించారట.
యీ విందు గురించి విన్న మనోడికి పట్టలేనంత సంతోషమేసిందట. ఇన్నాళ్ళకి నాకెంత కావాలంటే అంత నెయ్యి తినగలిగే అవకాశం వచ్చిందనుకుని వెంటనే బయలుదేరి విందు జరిగే భోజనాలశాల దగరికి వెళ్ళాడట. అక్కడ అందరితో పాటు పెళ్లి బంతిలో కూర్చున్నాడట. అన్నీ వంటకాలు వరుసనే తెచ్చి వడ్డిస్తూ ఉన్నారట. మనోడేమో తెగ ఆత్రంగా ఎదురు చూస్తున్నాడట నెయ్యి ఎప్పుడు తెస్తారా అని. కాసేపటికి ఒక చిన్న చెంచాతో నెయ్యి వడ్డిస్తూ ఒకతను వచ్చాడట.
"ఏంటీ, అంత కొంచెం వడ్డిస్తున్నావ్ నెయ్యి.. నీ సొమ్మేం పెట్టట్లేదుగా! ఆ గిన్నెలో నెయ్యంతా ఒంపెయ్యి.." అన్నాడట.
దానికి ఆ నెయ్యి వడ్డించే ఆయన "బాబూ.. నెయ్యి కొంచమే తినాలి. ఎక్కువ తినడం మంచిది కాదు. అందుకే ఇలా కొంచెం కొంచెం వడ్డిస్తున్నాం" అని చెప్పాడట.
దానికి మనోడు "రాజు గారు.. ఎవరూ ఎంత అడిగితే అంత లేదనకుండా పెట్టమని చెప్పారా లేదా! నాకు ఇంకా పెద్ద పెద్ద గిన్నెల నిండా నెయ్యి కావాలి" అని గట్టిగా అడిగాడట.
"ఎంతైనా వెయ్యడానికి నాకేం అభ్యంతరం లేదు బాబూ.. నెయ్యి ఎక్కువ తాగితే తీరని దాహం వేస్తుంది అని నీ మంచి కోరి చెప్పాను. ఆ పైన నీ ఇష్టం" అన్నాడట ఆ వడ్డించే అతను.
అయినా సరే కావాల్సిందేనని పట్టుబట్టి గిన్నెల కొద్దీ నెయ్యి వేయించుకుని పీకల దాకా లాగించేశాడట మనోడు. అలా గిన్నెలు గిన్నెలు నెయ్యి తాగెయ్యడం వల్ల భోజనం అయిన తరవాత నుంచీ ఒకటే దాహం మొదలయిందట మనోడికి. ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడ తాగుతూనే ఉన్నాడట. కానీ, ఎన్ని నీళ్ళు తాగినా తీరనంత దాహంగా ఉందట. అలా అలా రోజంతా తిరుగుతూ నీళ్ళు తాగుతూ ఊరంతా తిరిగాడట. ఎంత నీళ్ళు తాగుతున్నా కూడా దాహం తీరకపోగా ఇంకా ఇంకా ఎక్కువైపోతోందట. సాయంత్రానికి ఇంక భరించలేక ఇలాక్కాదని చెప్పి దాహం బాగా తీరుతుందని వెళ్లి ఊరి పొలిమేరల్లో ఉన్న నదిలో దూకాడంట. ఇంకేముందీ.. దెబ్బకి చచ్చి కూచ్చున్నాడు. sedih


యీ కథలో నేను తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, 'చాలా ఇష్టం కదా.. బాగుంది కదా.. అని నేను నెయ్యి ఎక్కువెక్కువ వేసుకుని తినకూడదు'.takbole ఇలా అని మా అమ్మ యీ కథ నాకు చెప్పింది.


నిన్న రాత్రి బాగా నెయ్యి వేసుకుని సుబ్బరంగా మెక్కుతుంటే యీ కథ గుర్తొచ్చింది. ఇంకేముందీ.. కట్ చేస్తే మీరు ఎరక్కపోయి నా బ్లాగుకి వచ్చి ఇలా నెయ్యిలో ఇరుక్కుపోయారు. లక్కీ ఫెలోస్ కదూ!sengihnampakgigi