Showing posts with label సుమతీ శతకం. Show all posts
Showing posts with label సుమతీ శతకం. Show all posts

Friday, December 05, 2008

ఓడలు బండ్లవ్వచ్చూ..బండ్లు ఓడలవ్వచ్చూ..!!

ఈ వేళ మరో మంచి సుమతీ పద్యం..!

ఓడల బండ్లును వచ్చును

ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును

ఓడలు బండ్లును వలెనే

వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.


అందరూ అంగీకరించాల్సిన ఒక గొప్ప జీవన సత్యాన్ని చాలా సరళంగా చెప్పారు ఈ పద్యంలో.. ఈ సంగతి మనకి తెలిసినదిగానే అనిపించినా నిజానికి ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలామంది మర్చిపోతుంటారు. సిరిసంపదలు శాశ్వతం కాదని తెలిసినా సిరిననుసరించే గౌరవమర్యాదలు ఇవ్వడమనేది లోక రీతి అయిపోయింది. భాగ్యవంతుల అడుగులకు మడుగులొత్తడం ఒక ఎత్తయితే.. సంపద లేదన్న కారణంగా శక్తి సామర్ధ్యాలు ఉన్నవారిని చిన్న చూపు చూడడం మరింత బాధాకరమైన విషయం.


ఒక వ్యక్తికి ఎంత వరకు విలువని ఇవ్వాలి, ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని వాళ్ల కులగోత్రాలు, వంశ చరిత్ర, సిరిసంపదలు వగైరా.. లాంటి విషయాలని చూసి నిర్ధారణకి రాకుండా వాళ్ల వాస్తవీకమైన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వగలిగినట్టయితే మనకు చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోండి. అప్పుడు పరిగణింపబడే మొదటి విషయాలు ఎక్కువ శాతం వాళ్ల స్టేటస్ కి సంబంధించినవే ఉంటాయి. ఒకవేళ ఈ స్టేటస్ లు తక్కువైన మంచి అబ్బాయి లేదా అమ్మాయి మనకు తెలిసి ఉన్నా కూడా.. ఆ సంబంధానికి పెద్దగా మొగ్గు చూపరు చాలా మంది.


అసలు అమెరికా సంబంధాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనీ, దూరదేశం వెళ్ళిన ఆడపడుచులకు అన్యాయం జరుగుతోందనీ.. చాలా మంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఇది కాదనలేని సత్యం. కానీ, దీనికి నిజమైన బాధ్యులెవరు?? ప్రతీ తల్లిదండ్రులు ఒక చోట చేరి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే , మా అల్లుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని.. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవే ముచ్చట్లు. కొంతమంది అయితే ఇండియా లోనే పిల్లలు ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకోడానికి తెగ ఇబ్బంది పడిపోతుంటారు. మరి కొంతమంది బతిమాలి, బలవంతం చేసి మరీ, విదేశాలకి తోలేస్తూ ఉంటారు పిల్లల్ని స్టేటస్ కోసం... విదేశీ సంబంధాలంటే అదేదో.. గొప్ప భోగం అనుకుంటూ మిగతా విషయాలకి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆదరాబాదరాగా పెళ్ళిళ్ళు చేసెయ్యడం. చివరికి ఏదయినా సమస్య వస్తే అందరూ బాధపడడం. చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి జరిగేలోపు అబ్బాయి కుటుంబం నుంచి ఎన్ని రకాల డిమాండ్లు వచ్చినా గానీ, తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు. కట్నం అనీ, లాంఛనాలనీ వాళ్లు కోరికల లిస్టు పెంచుకుంటూ పోతున్నా గానీ, మంచి సంబంధం ఎలాగో ఆ మూడు ముళ్ళు పడిపోతే బాగుణ్ణు... మళ్ళీ ఇలాంటి గొప్ప సంబంధం దొరకదేమో.. అనుకుంటూ పాపం చాలా ఇబ్బందులు పడుతూ పెళ్ళిళ్ళు జరిపిస్తారు. కానీ, వీళ్ళిలా అడుగుతున్నారంటే, వీళ్ళ వ్యక్తిత్వం ఎంత నికృష్టంగా ఉన్నట్టు.. ఎందుకులే వదిలేద్దాం అని మాత్రం అనుకోరు.. ఎంతో చదువు, ఆస్తి ఉన్న మగ పెళ్ళివారు కూడా మంచి తరుణం మించిపోయిన రాదు.. అనుకుంటూ బోలెడు డిమాండ్స్ చేస్తూ ఉంటారు. అమ్మాయి అందంగా ఉండీ, నెలకి అయిదంకెల్లో సంపాదిస్తున్న గానీ, ఈ లిస్టులో మాత్రం ఏమీ మార్పులుండవు.


ఏమిటో.. ప్రపంచం ఎంతో పురోగమిస్తుందంటారు. కులాల మధ్య ద్వేషాలు, స్టేటస్ ల గొడవలు మాత్రం గత వందేళ్ళ నుంచీ అలాగే ఉన్నాయి. ఎప్పటికీ భద్రంగా ఉంచడానికి అనేకానేక వారసులు పుడుతూనే ఉన్నారు. ఇక ఇంతేనేమో మన సమాజం :(


ఏది ఏమైనప్పటికినీ..ఈ పద్యం లో చెప్పినట్టుగా.. సిరిసంపదలు శాశ్వతం కాదనీ, మనిషి నిజమైన వ్యక్తిత్వమే అన్నిటినీ మించిన పెద్ద ఆస్తి అనీ ప్రతీ ఒక్కరు తెలుసుకోవడమే కాకుండా.. నిజంగా పాటించగలిగితే ఎంత బావుంటుందో కదా..!! ఎవరిదాకానో ఎందుకు గానీ.. ప్రతీ ఒక్కరం మన దగ్గరి నుంచే ఆరంభిస్తే సరి..!! ఏమంటారూ..??


ప్రేమతో..

మధురవాణి

Friday, November 21, 2008

సుమతీ శతకం పద్యం 17

హాయ్ హాయ్..
నమస్కారం. ఈ వేళ మరో సుమతీ పద్యం మన మధుర వాణిలో..!

ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
తాత్పర్యం: తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

పైన చూసారుగా..! స్నేహమైనా, ప్రేమైనా, చివరికి ఉద్యోగం చేయాల్సిన చోట కూడా ఇరువైపులా నుండి పరస్పర అంగీకారం, ఇష్టం ఉండాలని ఈ పద్యంలో చెప్తున్నారు.

ఈ విషయాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా.. ఇంకా మన చుట్టూ ఉన్న సమాజంలో బలవంతపు ప్రేమలు, పెళ్ళిళ్ళు, లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏ మనిషికైనా ప్రతీ విషయంలో తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఏ రంగు డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏమి తినాలి... ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలో మనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్క అభిరుచికి గానీ, అభిప్రాయానికీ గానీ కారణాలు అడిగితే మనమెవ్వరమూ సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనిషి భావాలకు, మనసు స్పందనకు కారణాలు ఉండనవసరం లేదు.

యాధృచ్చికంగా దీనికి సంబంధించిందే ఈ రోజు పొద్దునే 'మధురవాణి' లో ఒక quotation పోస్ట్ చేశాను. మనలో ఏదయినా ఒక అలవాటుని గానీ, అభిరుచిని గానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మార్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద విషయాల దాక వెళ్లనవసరం లేదు కానీ.. పొద్దున్నే లేవడం, ఇష్టం లేని టిఫిన్ చేయడం.. ఇలాంటి చిన్న చిన్నవాటిని కూడా మార్చుకోవాలంటే మన తల ప్రాణం తోకకి వస్తుంది. కానీ.. మరి మనం వేరే వాళ్ళయితే మార్చుకోవాలని బాగా expect చేస్తాము. చాలా అసహనానికి గురవుతుంటాం కూడా.. వేరే ఎవరి దగ్గరో కాదు గానీ, ఇది ఎక్కువగా మన కుటుంబ సభ్యుల దగ్గర గానీ, స్నేహితుల దగ్గర గానీ చేస్తూ ఉంటాం. వాళ్లు ఒక విషయంలో మారట్లేదని విసుగు చెందేముందు ఒక్కసారి మన మార్పు గురించి ఆలోచిస్తే మనం వాళ్ళని వాళ్లుగానే సంతోషంగా స్వీకరిస్తాం. అసలు నిజమైన అభిమానం, ప్రేమ అంటే.. వారి సుగుణాలతో పాటు బలహీనతల్ని కూడా ప్రేమించడమే.

మరో సంగతి ఏంటంటే.. వాళ్ల అభిప్రాయం మనకి నచ్చనంత మాత్రాన అది తప్పని కాదు కదా..! ఈ కోణంలో మాత్రం ఎప్పుడూ ఆలోచించం అసలు. ఎందుకో ఒప్పుకోబుద్ది కాదు. కానీ.. దాన్ని మనం అధిగమించగలగాలి. అప్పుడే విసుగు, చిరాకులాంటివి మన దరిచేరవు. మనమేదో గొప్పగా కష్టపడిపోయి వాళ్ళని భరిస్తున్నట్టు చాలాసార్లు భావిస్తూ ఉంటాం కూడా..! ముందు అసలు ఆ భావం మనకి రాకుండా ఉండాలి. అప్పుడు మనకి regrets ఉండవు ఏ బంధంలోనైనా.. రోజు రోజుకీ మన సంతోషం నిల్వలు పెంచుకుంటూ పోవచ్చు.

అంచేత.. నేను చెప్పొచ్చేదేంటంటే.. అధ్యక్షా..! మనందరం మన మనసు గదుల్లో మనం ఇష్టపడేవారితో పాటు వారి ఆసక్తులకీ, అనాసక్తులకీ, అభిప్రాయాలకీ, కోరికలకీ, ఇష్టాలకీ, అయిష్టాలకీ, భావాలకీ, ప్రేమకీ, బలహీనతలకీ, కోపతాపాలకీ, విసుగుకీ, చిరాకుకీ... అన్నీటికీ చోటుని పంచుదాం..! ఒకేసారి మహాత్ములం అయిపోలేం కానీ.. కనీసం ప్రయత్నిద్దాం.. ఏదో ఒక రోజు పూర్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోగలమనే గమ్యం వైపు..!

ప్రేమతో...
మధుర వాణి

Friday, November 14, 2008

సుమతీ శతకం పద్యం 16

నమస్కారం..! ఈ వేళ చూడబోయే సుమతీ పద్యం ఇదే..!

ఒకయూరికి నొక కరణము

నొక తీర్పరియైన గాక వొగిఁదరుచైనం

గకవికలు గాక యుండునె

సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలుపుట్టి సమస్తం చెడిపోవుట సహజము.

చూశారుగా ఈ పద్యంలో నీతి. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఏ పని అయినా ఎవరు చేయాలో వాళ్లు చేయాలి. అలాగే ఒకేసారి ఎక్కువమంది తల దూర్చకూడదు. అలా చేస్తే అది ఖచ్చితంగా నష్టానికే దారి తీస్తుంది చివరికి. ఇంగ్లీషులో కూడా ఇదే అర్ధాన్ని చెప్పే ఒక ప్రసిద్ధ సామెత ఉంది. "Too many cooks spoil the broth" అని. ఎక్కువమంది ఒకే వంటలో వేలు పెడితే ఎలా ఉంటుందండీ మరి?? నువ్వు ఉప్పు వేసావా? కారం వేసావా? అది వేస్తే ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. అనుకుంటూ ఒకటికి రెండు సార్లు వేసి లేదా మర్చిపోయి..అందరి పాక శాస్త్ర ప్రావీణ్యం పోటాపోటీగా ఉపయోగించి చివరికి మొత్తం పారబోయాల్సి వస్తుంది.అంతేగా మరి..!


ఇదే కాకుండా..ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే.. ఒకేసారి చాలామంది బోలెడు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి అన్ని విరుద్ధమైన భావాల్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఎక్కువ కంగారుని, అయోమయాన్ని, భయాన్ని కలిగిస్తారు. ఒకేసారి అందరూ రకరకాలుగా చెప్పడం వల్ల పాపం సదరు వ్యక్తికి అసలేమి చేయాలో పాలుపోదు. ఎవరు ఏమి చెప్పినా చివరికి అసలు పరిస్థితిలో ఉన్న వ్యక్తే కదా ఏదయినా చేయాల్సింది లేదా ఎదుర్కోవాల్సింది..!


సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొంచెం లోతుగా ఈ సలహాల సంగతి చూద్దాం..! మనకి ఏదయినా సమస్య వచ్చినప్పుడు వేరేవారి సలహాలు అడగడం మంచిదే కానీ.. అందరి అభిప్రాయాల్నీ మనం పాటించాల్సిన అవసరం లేదు. అంటే నా ఉద్దేశ్యం.. వారందరి కోణాల్లోంచి మనం సమస్యని చూసి, తద్వారా ఎక్కువ అయోమయంలోకి వెళ్ళకూడదు అని. వాళ్ల సలహాలన్నీ అభిప్రాయాలుగా మాత్రమే గ్రహించాలి కానీ మన సమస్యకి పరిష్కారాలుగా కాదు. అందరు చెప్పినవి విని.. చివరిగా మాత్రం మనకు సరి అనిపించేదే చెయ్యాలి. ఎందుకంటే మనం చేసిన ఏ పని వల్లనైనా లభించే ఫలితాన్ని.. మనమే అనుభవిస్తాం. కాబట్టి మన ఆలోచనలు, నిర్ణయాలు, వాటి ఫలితాల బాధ్యత కూడా నూటికి నూరు శాతం మనదే అవుతుంది. మరెవరి సలహా వల్లో నష్టం జరిగింది అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది.


అసలు మనం ఒకరిని సలహా అడిగే ముందు మనకి వారిపై పూర్తి నమ్మకం ఉండాలి. వాళ్లు ఈ సమస్య గురించి మనకంటే వివేకంగా ఆలోచించగలరు అనీ.. మన శ్రేయోభిలాషులనీ.. మనం నమ్మాలి. అలాంటి ఆత్మీయులతోనే మనం సొంత సమస్యలను చెప్పుకోవాలి. అంతేగానీ.. బాధలో ఉన్నాం కదా అని.. కొద్దిగా ముఖపరిచయం ఉన్నవారందరి దగ్గరా.. మన స్వవిషయాలు చర్చించకూడదు. మీరు మరీ చెప్తారండీ.. మనందరం ఎంతో చదువుకున్నాం.. గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం. విశాల ప్రపంచాన్ని చూస్తున్నాం. అలా సొంత సమస్యలని అందరి దగ్గరా మాట్లాడేసేవారు ఉన్నారా అని మీరు అనుకుంటే.. టమాటా పప్పులో కాలేసినట్టే :) బోలెడంతమంది ఉన్నారని మీరు నమ్మాలి. అంతే కాకుండా చాలామంది అలా చేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించలేరు కూడా..అది మరీ జాలిపడాల్సిన సంగతి..! PG లు చదివి, అయిదంకెల జీతాన్నిగడిస్తూ ఇలా చేసే తెలివైన వారిని చాలా మందిని నేను చూసాను. ఎందుకంటే తెలివితేటలకీ, మనిషి వ్యక్తిత్వానికీ సంబంధం లేదని నా అభిప్రాయం. అది చాలావరకు నిజం కూడా.. ఉదాహరణకి వాళ్ల భర్తతోనో, అత్తతోనో, లేదా..కనీసం స్నేహితులతోనో చిన్న భేదాభిప్రాయం వచ్చిందనుకోండీ .. వెంటనే మనతో అనేస్తారు. తను ఇలాంటి వాడు, అలాంటి వాడు..నన్నిలా బాధపెట్టాడు..అసలు తనతో ఉండడమే వ్యర్ధం..ఇంకా..ఇలా చాలా చాలా..మొదటిసారి మనం చాలా బాధ పడిపోతాం.. ఓదారుస్తాం.. మళ్ళీ వెంటనే రెండు రోజుల్లో అసలేమి జరగనట్టు అంతా చాలా గొప్పగాఉంది..సూపర్..అని చెప్తారు. మళ్లీ రెండు రోజులకి ఇంకో విషయమూ ఇలాంటిదే జరుగుతుంది. ఇలా పదే పదే జరిగాక మనకి వాళ్ల మీద ఉన్న సదభిప్రాయం పోతుంది. వాళ్లు నిజంగా పెద్ద సమస్యతో వచ్చినా మనం మొదటిసారిలా ఫీల్ అవ్వలేము. అంటే.. చివరికి వాళ్ల పరిస్థితి నాయనా..పులి కథలాగా అవుతుందన్నమాట. నిజానికి అలాంటి వారికి ఏదో సలహా ఇచ్చి సహాయపడదాము అనుకోడం కూడా తప్పే అని నా ఉద్దేశ్యం. దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు కూడా. మన సమయం, ఆలోచన రెండూ వ్యర్థం.. అంతే..! ఎందుకంటే వాళ్లు మారాల్సిన అవసరాన్ని వాళ్లు ఎప్పటికీ గుర్తించలేరు. ఈ కోణంలో ఆలోచిస్తే.. సలహాలు తీసుకోవడంలోనే కాదు..ఇవ్వడంలో కూడా సరైన వ్యక్తులనే ఎంచుకోవాలి సుమా.. అనిపిస్తుంది.

మీరేమంటారు మరి..!



ప్రేమతో...
మధుర వాణి

Sunday, November 02, 2008

సుమతీ శతకం పద్యం 15

నమస్కారం..!
ఈ రోజుటి సుమతీ పద్యం ఇదే..!

ఏరకుమీ కసుగాయలు

దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

తాత్పర్యం: భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగిపారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!

చూసారుగా ఈ పద్యం..! మీరేమంటారు మరి.. :)

బంధువులని దూషించకూడదంటా ... ఇంతకుముందే బంధువుల గురించి వచ్చే అపాయాలని గురించి అనుకున్నాం కదా..! ఇప్పుడేమో ఇది...ఏది ఏమైనా సందర్భానుసారం నీతిని కూడా తీసుకోవాలి. అంటే బంధువులందరినీ ఏమీ అనకూడదు...వేరే వాళ్ళని అనచ్చని కాదు గానీ.. ఎవరినైనా పూర్తిగా విషయ పూర్వాపరాలు తెలుసుకోకుండా మాట జారకూడదు. అది స్నేహితులైనా, బంధువులైనా సరే...! కానీ, ఒకవేళ బంధువులైనా కూడా నిజంగా చెడు చేయాలనుకునేవారిని దూషించకుండా ఎలా ఉంటాం? :) అంతే కదా..!

పచ్చి కాయలు తినద్దంట..:) అయినా పచ్చివి తింటే అరగదు మొదటి పాయింట్..ఇంకోటి ఏంటంటే, పచ్చివి కోసేసి వృథా చేయడం కన్నా పండే దాకా ఉండడం ఉత్తమం కదా..! :) ఇలా కాదు కానీ, అలాంటి పసి మొగ్గల్నీ, పసి పిందెలనీ కోసేయ్యకూడదు అని కూడా కవి ఉద్దేశ్యం అయ్యి ఉండచ్చు అనుకుంటున్నా.. ఒక రకంగా అది మనిషి మనస్తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందేమో... కదా..! ఇంకా విరియని మొగ్గలనీ, పక్వానికి రాని పిందెలనీ కోసేయ్యాలని అనిపించకూడదు అసలు..కదా..ఎందుకంటే అవి మనుషులు కాకపోయినా వాటికీ ప్రాణం ఉంటుందిగా..అలా కాకపోయినా వాటి వల్ల ఉపయోగం ఉండదని తెలిసీ ఊరికే కోసి పడేయ్యకూడదు కదా..!! ఏమో లెండి.. అయినా ఈ రోజుల్లో ఒక పెద్ద పెరడు, అందులో మొక్కలు, చెట్లు...మళ్ళీ అందులో మనం వెళ్లి పూలు, పండ్లు కోయడం..అసలు ఇంత సీన్ ఉందంటారా?? :)


ఇక యుద్ధం...పాతకాలం నాటి యుద్దాలు కాకపోయినా..మన జీవితం కూడా యుద్ధం లాంటిదే ఒకరకంగా.. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది..మనం మాత్రం ఎప్పుడూ ధైర్యంగా సాగిపోతూ ఉండాలి. పిరికిగా వెనుతిరగకూడదు ..! చాలాసార్లు విసుగుగా, విరక్తిగా అనిపిస్తుందనుకోండి. కానీ, మనకి మనమే ధైర్యం చెప్పుకుని ఆశావహ దృక్పథంతో అలా అలా బండి నడిపించేయ్యాలి..అంతేగా మరి..!


గురువుల మాట జవదాటకూడదు అంటున్నారు కదా..! మరీ మనం అంత గురుభక్తి చూపించకపోయినా పర్లేదు కానీ, గురువుల మీద జోక్స్ వేసుకుని, వాళ్ళని తిట్టేంత గొప్పవాళ్ళం అవ్వకపోతే చాలు. ఈ మధ్య కాలం లో సినిమాలల్లో చూసి మరీ, విథ్యార్థులు మరీ heroicగా ఫీల్ అవుతున్నారు lecturers మీద జోకులేయడాన్ని. దాన్ని కొంచెం తగ్గిస్తే బావుంటుందని నా అభిప్రాయం..మీరేమంటారు మరి???


ప్రేమతో...

మధుర వాణి


Thursday, October 30, 2008

సుమతీ శతకం పద్యం 14

నమస్కారం..!
ఈ రోజు మనం చూడబోయే సుమతీ పద్యం ఇదే..!

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌

దెప్పలుగ జెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.


ఈ పద్యం తెలియని తెలుగు వాళ్లు దాదాపుగా ఉండరనుకుంటున్నాను. పెద్దగా చదువురాని వాళ్లు కూడా ఈ పద్యం చెప్తూ ఉంటారు. మరి ఈ పద్యం లో ఉన్న విషయం అలాంటిది కదా..!


నిజానికి ఈ పద్యం లో నీతి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితంలోకి తరచి చూసినా కనీసం ఒక్క అనుభవం అయినా కనిపిస్తుంది. ఒకటేమిటిలే.. చాలానే ఉంటాయి. ఈ పద్యం లో బంధువులు అన్నారు గానీ, స్నేహితులకీ, కుటుంబ సభ్యులకీ కూడా ఇది చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. అంటే అందరూ అలా ఉంటారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, అలాగే ఎక్కువ శాతం మంది ఉంటారన్నది మాత్రం అందరూ ఒప్పుకునే వాస్తవం.


ఏదో సినిమా పాటలో చెప్పినట్టు.. డబ్బుంటే సుబ్బారావు గారు అంటారు లేకపోతే సుబ్బి గాడు అంటారు. అంటారు అంటారు కాదు గానీ..మనందరం అలాగే అంటాం కదండీ..!! ఉదాహరణకి ఎవరన్నా కోట్ వేసుకుని కనిపించారనుకోండి.. ఎవరయ్యా నువ్వు? అని ఎవరమూ అడగము కదా...వెంటనే అండీ..అనేస్తాము. అదే షాపుల్లో పని చేసే అబ్బాయిలని, కొంచెం సాదా సీదాగా కనిపించే వాళ్ళని మాత్రం 'ఆ.. ఏంటి బాబూ..ఎంటయ్యా..? అని అనేస్తాము. పొరపాటున కూడా అండీ.. అన్న మాట నోటి నుంచి వచ్చిన పాపాన పోదు. అదే మరి లోకం పోకడ అంటే.. :)


అది సరే కానీ.. మనకి జీవితంలో కస్టాలు రావడం కూడా ఒకోసారి చాలా మేలుని కలిగిస్తుంది తెలుసా..! అది ఎలా అంటే.. అసలు నిజమైన స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఎవరో మనకి అప్పుడే తెలుస్తుంది. నేను నిజ జీవితంలో చాలా చూసాను ఇలాంటివి. అంటే.. మీరు కూడా చూసే ఉంటారనుకోండి :) కాకపోతే నాకు తెలిసినవి చెప్తున్నానన్న మాట.. అంతే...

నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. వాళ్ల అమ్మ, నాన్నగారు వాళ్ల చుట్టాలని అంటే..వాళ్ల పెద్దమ్మలు, పెద్ద నాన్నలు..ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నోసార్లు ఆదుకోడమే కాకుండా, చిన్నవాళ్ళకి పెళ్ళిళ్ళు లాంటివి కూడా చేసారు. అసలు వీళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా గానీ, ఒక పెద్ద మంద ఉండేది. ఎవరో ఒకళ్ళు వారాల పాటు వీళ్ళింట్లో తిష్ట వేసేవారు. అలా ఉన్నన్ని రోజులూ బాగానే ఉన్నారు. వీళ్ళకి వ్యాపారం లో కొంచెం నష్టం రాగానే ఎక్కడ వాళ్ల మీద భారం పడుతుందేమోనని అందరూ మొహాలు చాటేశారు. వీళ్ళు పాపం కనీసం అప్పు కూడా అడగలేదు ఎవరినీ...అయినా గానీ ముందే పలాయనం చిత్తగించారన్న మాట. కానీ, నాకు బాగా బాధనిపించిన విషయం ఏంటంటే.. వ్యాపారంలో నష్టం వచ్చినదాని కంటే కూడా.. ఇన్ని రోజులు ఆత్మీయుల్లాగా ఉన్నబంధువులందరూ ఒకేసారి ఇలా నిజరూపాల్లో అవతరించేటప్పటికి పాపం వాళ్లు చాలా పెద్ద షాక్ లోకి వెళ్లిపోయారు. వాళ్లందరూ దూరమవ్వడాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది వాళ్ళకి అసలు కష్టం కంటే ముందు.. తరవాత నా స్నేహితురాలు కుటుంబం అంతా పాపం చాలా కష్టాలు పడి ప్రస్తుతానికి ఎలాగో నిలద్రొక్కుగోగలిగారు. కానీ, ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు.. మన అనుకున్నవాళ్లందరూ ఇలా చేశారనీ.. :(

అందుకే అసలు ఎవరి మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు... కానీ, ఇలాంటి వాటికి అతీతంగా ఒక్క నిజమైన నేస్తం ఉంటే చాలు కదండీ..! ఆ ఆసరా తో ఎన్ని కష్టాలైనా ఈదెయ్యగలం అనిపిస్తుంది.

కానీ, మనం మంచిగా ఆలోచిస్తున్నాం కదా అని అందరూ అలా ఆలోచించరు అనే కఠినమైన వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి. అలాగే ఈ ప్రపంచంలో ఏదయినా సాధ్యమే అని గుర్తుంచుకోవాలి. అప్పుడే అన్ని రకాల సమస్యలని భరించగలిగే శక్తి మనకి వస్తుంది.


అందుకే...బంధువులొస్తున్నారూ..జాగ్రత్త సుమా..!! :)


ప్రేమతో...

మధుర వాణి

Monday, October 27, 2008

సుమతీ శతకం పద్యం13

ఈనాటి సుమతీ పద్యం ఇదే..!

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్‌

సర్పంబు పడగనీడను

గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకు ప్రాణభయంతో కూడినదే సుమా!

ఎలాంటి యజమాని కొలువు చేయకూడదో.. ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పని చేయకూడదనీ, అలా చేస్తే పాము నీడలో బ్రతికే కప్పలాగా ఎప్పుడూ అపాయమేనని అంటున్నారు.


ఏంటోనండీ.. ఈ పద్యం లో ఇలా ఉంది కానీ, అసలు అలాంటి ఉత్తమమైన బాస్ లు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారండీ బాబూ? అవునా కాదా...? మీరే చెప్పండి. అసలు ఉద్యోగం దొరకడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాస్ చాలా మంచి వాడవ్వాలని కోరుకుంటే మనకి ఇంక ఉద్యోగాలొచ్చినట్టే... కదా... :( అంటే నా ఉద్దేశ్యం బాసులందరూ విలన్లని కాదు గానీ..ప్రతీ బాస్ లో కొంచమైనా విలనిజం ఉంటుదని అన్నమాట...అంతే కదా మరి...హ్హ హ్హ హ్హ... అసలు టీ టైములో టీ తాగడం కంటే కూడా సహోద్యోగులందరూ సేద తీరేది బాస్ ని తిట్టుకునే కదా.. :)

ఏది ఏమైనప్పటికీ ఈ పద్యం మన ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా అన్వయించుకోడం కష్టమే అనిపిస్తుంది. పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా మనం బాస్ వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమంటాను. మా స్నేహితులు కొంతమంది డాక్టరేట్ కోసం పరిశోధన చేస్తున్నారు. వాళ్ల అనుభవాలు కొన్ని విన్న తరువాత ఎవరికైనా అనిపిస్తుంది మనం ఉద్యోగం సంతోషంగా చేయడానికి బాస్ వ్యక్తిత్వం కూడా ఒక ముఖ్యమైన అంశం అని. బాస్ వచ్చి ప్రతీ అర గంటకీ ఇప్పుడేమి చేస్తున్నావు, అది వచ్చిందా, ఇది ఏమయింది, ఇందాక అయిదు నిమిషాలేమిచేసావు, ఎనిమిది గంటలకి ఒక పది నిమిషాలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, టీ తాగడానికి అయిదు నిమిషాలకంటే ఎక్కువ ఎందుకెళ్ళావు ....ఈ రకంగా కాదేదీ హింసకి అనర్హం అన్నట్టుగా...పీల్చి పిప్పి చేసేసే తింగరి బాస్ లు చాలామంది ఉంటారండీ బాబు...!! మీకు మాత్రం ఇలాంటి బాస్ లు లేకపోతే చాలా అదృష్టవంతులనుకొని దేవుడికొకసారి ధన్యవాదాలు చెప్పండి. ఒకవేళ ఇలాంటి చట్రంలో మీరు మాత్రం ఇరుక్కుపోయి ఉంటే మాత్రం.. మిమ్మల్ని ఆ ప్రభువే కాపాడాలి.. :) అలా ఉంటే మాత్రం, వెంటనే పరిగెత్తుకుని బయటికి వచ్చెయ్యండి. బతికుంటే బలుసాకు తినయినా బతకచ్చు. మరీ అంత నరకమైన ఉద్యోగం చేసి బతికేంత దుస్థితి ఎందుకులెండి...

మనకెవ్వరికీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పనిలో పనిగా మీరందరూ కూడా ఒకసారి 'తథాస్తు' అనేయ్యండి. సరేనా..!

ఇక ఉంటాను మరి సెలవిప్పించేస్తే...


ప్రేమతో...

మధుర వాణి

Saturday, October 25, 2008

సుమతీ పద్యం 12

ఈ రోజు నేను చెప్పబోయే సుమతీ పద్యం తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మననారం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కాబట్టి. మళ్ళీ ఇన్నేళ్ళకి ఆ పద్యాన్ని గుర్తు తెచ్చుకోవడం ఒకరకంగా స్కూల్ రోజుల్ని కూడా గుర్తు చేస్తుంది నాకయితే. మీకు కూడా తప్పకుండా లాగే అనిపిస్తుందని నా నమ్మకం. ఇదే ఆ పద్యం.

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

చూసారుగా..పైన పద్యాన్ని..మీకేమనిపిస్తుంది? అదంతా నిజమే కానీ, ఈ రోజుల్లో అంత మహాత్ములెవరుంటారు? ఒకవేళ అలా చేద్దామనుకున్నా అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో బతకలేరు. ఇప్పటి పరిస్థితులు అలాంటివి మరి. ఏం చేస్తాం?? అని ఒక నిట్టూర్పు విడుస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో సరిగ్గా చెప్పానా? :)


నాకయితే ఎవరికీ ఉపకారం చేయకపోయినా ఫరవాలేదు కానీ, అపకారం మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది.


మనం ప్రపంచంలో జరిగే చాలా సంఘటలని చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అసలెటుపోతోంది? ఏమిటీ విపరీత సంఘటనలు..అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరి మీదో కోపంతో ఎవరో బాంబులు పెట్టి, దానికి అభం శుభం తెలియని సామాన్య ప్రజలు పార్కుల్లోనూ, హోటళ్ళలోనూ , రోడ్ల మీద ఇలాంటి మామూలు ప్రదేశాల్లో బలి అయిపోతుంటే చాలా బాధేస్తుంది. కానీ, ఏమి చెయ్యాలో అర్ధం కాదు. మతాల పేరు మీద, దేవుడి పేరు మీద, రాజకీయ పార్టీల పేరు మీద, చివరికి సినిమా హీరోల మీద అభిమానం తో కూడా గొడవలు చేసే స్థాయికి ఎదిగాం మనం. వీటన్నిటికీ పురికొల్పబడే ముందు, ఒక మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించగలిగినా ఈ అనర్ధాలన్నింటిలో చాలా వరకు జరగవు కదా..!


అసలు ఈ ప్రకృతి సృష్టిలో ఎన్నో అపాయాలు ప్రాణుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో ఎవరం చెప్పలేము. అలాంటప్పుడు బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడుపుతూ, ఎదుటి వారిని బాధపెట్టకుండా బ్రతకచ్చుగా... ఈ సృష్టిలో ఏదో అతీంద్రియ శక్తి అన్నీ జీవరాసుల్నీ నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తినే మనం దైవం అంటాం. దేవుడనే వాడు మనం ఏ రూపంలో ఉన్నాడనుకుంటే ఆ రూపంలో మనకి కనిపిస్తాడు. ఏ మతం ఏ సూక్తులు చెప్పినా చివరికి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, మతాలన్నీ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ, లోక కళ్యాణానికీ ఉద్దేశించబడినవే కదా..!


నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్లు అనుకుని నీవాళ్ళ సుఖం కోసం పాటుపడాలి. అంతే కానీ, ఏ స్వాభిమానం మితిమీరి మా ఊరు, మా రాష్ట్రం, మా భాష అనే అభిమానం కాస్తా వేరే వారి మీద ద్వేషానికి దారితీసేంత స్థాయికి వెళ్ళకూడదు కదా..!


మొత్తానికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఇంకా చాలా మంది మనుషుల్లో మానవత్వం ఉందని నేను నమ్ముతున్నాను. అదొక్కటే కాకుండా ఎందరో మహానుభావులు తమకి ఏ రకంగా సంబంధంలేని శరణార్ధులను ఆదుకుంటున్నారు. వారికోసమే తమ తమ జీవితాలని వెచ్చిస్తున్నారు. అలాంటి మహానుభావులందరూ మనకి తెలిసుండకపోవచ్చు. కానీ, చాలా మంది ఉన్నారు. వాళ్ల అందరి పుణ్యం వల్లే మనలాంటి మామూలు మనుషులకి ఇంకా అన్నం దొరుకుతుందని నాకనిపిస్తూ ఉంటుంది.


ఏది ఏమైనా మన వల్ల ఎవరికీ అపకారం కలగకుండా ప్రయత్నిద్దాం... ఏమంటారు మరి??


ప్రేమతో...

మధుర వాణి

Tuesday, October 21, 2008

సుమతీ శతకం poem11

ఈ రోజు ఇంకొక సుమతీ పద్యాన్ని చూద్దాము.

ఉదకము ద్రావెడు హయమును

మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌

మొదవుకడ నున్న వృషభము

జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్నఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.


ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆయా సమయాల్లో ప్రవర్తించాలని ఏ పద్యంలో నీతి. ఆ విషయాన్నే ఉదాహరణలతో ఈ పద్యంలో వివరించారు. చదువుసంధ్యలు లేని ఒక మామూలు మనిషికి కూడా అర్ధమయ్యే రీతిలో రాయడమే సుమతీ శతకం యొక్క గొప్పతనం. ఇక్కడ చెప్పిన సందర్భాలు ఆ కాలానికి సరితగ్గవి కానీ, ఇప్పుడు మనకి ఎదురయేవి కాదులే..!


మనం ఎవరైనా తెలిసిన వాళ్ళింటికి వెళ్ళామనుకోండి . ఒకోసారి మనం పరాయి వాళ్ళం ఉన్నా గానీ, వాళ్ళింట్లో ఏదో పరిస్థితి వల్ల వారి స్వంత విషయాలు మాట్లడుకోడమో, వాదించుకోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు మనం అల్లాంటి పరిస్థితి నుంచి బయటపడడం మంచిది. అనవసరంగా వారి స్వవిషయాల్లో ఆసక్తి గానీ, జోక్యం గానీ చేసుకోకపోడమే మనకి మంచిది. ఒకోసారి వాళ్లు వాదించుకుంటూ, మరో పక్క మనకి చెప్తూ ఉంటారు. "చూడండి...ఎలా చేసారో...ఎప్పుడూ ఇంతే. మీరే చెప్పండి నా తప్పేముంది. అదీ...ఇదీ.." అని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భం వస్తే మాత్రం మనమేదో పెద్దమనుషుల్లాగా వాళ్ళకేదో సర్ది చెప్పడానికి గానీ, న్యాయం చెప్పడానికి గానీ ప్రయత్నించకపోవడమే మంచిది. ఎవరికైనా అల్లాంటివి సహజం. అదీ కాక బయటి వారెప్పుడూ పరాయి వారే ఎంత స్నేహితులయినా కూడా.


కాబట్టి ఎప్పుడైనా ఏ బంధంలో అయినా సరైన హద్దులు ఉండాలి. అది తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భర్తైనా, భార్యైనా, స్నేహితులైనా ఎవరైనా...అంటే నా ఉద్దేశ్యం అందరితో లెక్కలేసుకుని, గిరి గీసుకుని ఉండాలని కాదు. కానీ, ఏ ప్రపంచంలో ప్రతీ మనిషి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలతో పూర్తిగా సమానం అవ్వలేవు. కాబట్టి ఎంత బంధం ఉన్నా కూడా వారి సొంత ఆలోచనలు, భావాలు ఊపిరి పోసుకునేంత అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా మనిషి బ్రతకగలడు. కానీ, స్వేఛ్చ లేని జీవితం నరకం తో సమానం. మానసిక స్వేఛ్చ కూడా అందులో భాగమే. మరి మనందరం ఆ స్వేఛ్చ ని ఆస్వాదిస్తూ అలాగే మన జీవితంలో ఉన్న అందరికీ స్వేచ్ఛని పంచుదాం.

మళ్లీ కలుద్దాం..!


ప్రేమతో...

మధుర వాణి