Tuesday, October 21, 2008

సుమతీ శతకం poem11

ఈ రోజు ఇంకొక సుమతీ పద్యాన్ని చూద్దాము.

ఉదకము ద్రావెడు హయమును

మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్

మొదవుకడ నున్న వృషభము

జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్నఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.


ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆయా సమయాల్లో ప్రవర్తించాలని ఏ పద్యంలో నీతి. ఆ విషయాన్నే ఉదాహరణలతో ఈ పద్యంలో వివరించారు. చదువుసంధ్యలు లేని ఒక మామూలు మనిషికి కూడా అర్ధమయ్యే రీతిలో రాయడమే సుమతీ శతకం యొక్క గొప్పతనం. ఇక్కడ చెప్పిన సందర్భాలు ఆ కాలానికి సరితగ్గవి కానీ, ఇప్పుడు మనకి ఎదురయేవి కాదులే..!


మనం ఎవరైనా తెలిసిన వాళ్ళింటికి వెళ్ళామనుకోండి . ఒకోసారి మనం పరాయి వాళ్ళం ఉన్నా గానీ, వాళ్ళింట్లో ఏదో పరిస్థితి వల్ల వారి స్వంత విషయాలు మాట్లడుకోడమో, వాదించుకోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు మనం అల్లాంటి పరిస్థితి నుంచి బయటపడడం మంచిది. అనవసరంగా వారి స్వవిషయాల్లో ఆసక్తి గానీ, జోక్యం గానీ చేసుకోకపోడమే మనకి మంచిది. ఒకోసారి వాళ్లు వాదించుకుంటూ, మరో పక్క మనకి చెప్తూ ఉంటారు. "చూడండి...ఎలా చేసారో...ఎప్పుడూ ఇంతే. మీరే చెప్పండి నా తప్పేముంది. అదీ...ఇదీ.." అని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భం వస్తే మాత్రం మనమేదో పెద్దమనుషుల్లాగా వాళ్ళకేదో సర్ది చెప్పడానికి గానీ, న్యాయం చెప్పడానికి గానీ ప్రయత్నించకపోవడమే మంచిది. ఎవరికైనా అల్లాంటివి సహజం. అదీ కాక బయటి వారెప్పుడూ పరాయి వారే ఎంత స్నేహితులయినా కూడా.


కాబట్టి ఎప్పుడైనా ఏ బంధంలో అయినా సరైన హద్దులు ఉండాలి. అది తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భర్తైనా, భార్యైనా, స్నేహితులైనా ఎవరైనా...అంటే నా ఉద్దేశ్యం అందరితో లెక్కలేసుకుని, గిరి గీసుకుని ఉండాలని కాదు. కానీ, ఏ ప్రపంచంలో ప్రతీ మనిషి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలతో పూర్తిగా సమానం అవ్వలేవు. కాబట్టి ఎంత బంధం ఉన్నా కూడా వారి సొంత ఆలోచనలు, భావాలు ఊపిరి పోసుకునేంత అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా మనిషి బ్రతకగలడు. కానీ, స్వేఛ్చ లేని జీవితం నరకం తో సమానం. మానసిక స్వేఛ్చ కూడా అందులో భాగమే. మరి మనందరం ఆ స్వేఛ్చ ని ఆస్వాదిస్తూ అలాగే మన జీవితంలో ఉన్న అందరికీ స్వేచ్ఛని పంచుదాం.

మళ్లీ కలుద్దాం..!


ప్రేమతో...

మధుర వాణి

4 comments:

coolvivek said...

వెరీ ఫన్నీ.... ;)

మరిచిపోయిన సుమతీ శతకం మళ్ళీ జ్ఞాపకం చేశావు...
చాలా బావున్నాయి వాణీ.....
Cute..!!

మధురవాణి said...

@ coolvivek,
Thank you! :-)

S said...

నాకా పద్యంలో పోలికలు ఏమాత్రం నచ్చలేదు కానీ, మీ వివరణ మాత్రం నచ్చింది.

మధురవాణి said...

@ S,
పోన్లెద్దూ.. ఏదోకటి నచ్చింది కదా! థాంక్యూ! :)