Monday, October 06, 2008

ఓ బంగరు రంగుల చిలకా..పలకవా..ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..

హలో.. హలో.. నమస్తే..
మళ్లీ సోమవారం వచ్చేసింది కదా... అందరం ఎవరి పనిలో వాళ్ళం పడిపోయాము :( అలాగే ఆదివారం అయిపోయిందన్న బెంగలో ఉన్నాం కదా... సరే... ఆ ధ్యాసలోనుంచి బయటపడడానికి ఒక చక్కటి పాట వింటూ దాని గురించి మాట్లాడుకుందాం. మీరేమంటారు మరి ??
" బంగరు రంగుల చిలకా..పలకవా.. అల్లరి చూపుల రాజా..ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా మీద అలకే లేదనీ.."
తెలుగులో మంచి సంగీతం, సాహిత్యం ఉన్న పాటలను ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ఈ పాట తెలిసే ఉంటుంది.
ఈ పాట 1975 లో వచ్చిన తోటరాముడు అనే చిత్రంలోనిది. ఈ సినిమాకి సత్యం సంగీత దర్శకత్వం వహించగా, దాశరధి గారు సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను చలం, కన్నడ మంజుల మీద చిత్రీకరించారు. వీనులవిందైన సంగీతంతో పాటు మనసును స్పందిపచేసే సాహిత్యం ఈ పాట సొంతం. ఈ ప్రేమగీతంలోని అద్భుతమైన ఈ వాక్యాలను ఒకసారి చూడండి ఎంత బాగా రాసారో..
పంజరాన్ని దాటుకునీ.. బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో..
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..నిరుపేదను వలచావెందుకే..
నీ చేరువలో..నీ చేతలలో..పులకించేటందుకే..
ప్రేమకి మనసు ముఖ్యం కాని, ఆస్తి ఐశ్వర్యాలు ఆశించి కాదనీ...ఎంత బాగా చెప్పారో కదా....!

సన్నజాజి తీగుంది...తీగ మీద పువ్వుంది...పువ్వులోని నవ్వే నాదిలే...
కొంటె తుమ్మేదొచ్చింది...జుంటి తేనె కోరింది...అందించే భాగ్యం నాదిలే..
కొండల్లో... కోనల్లో..మనకెదురే లేదులే..
సున్నితమైన ప్రేమ భావాలని ఎంత అందంగా రాసారో కదా...!

కాసేపు ఇలాంటి కమ్మటి పాట వింటే మనసుకి భలే సంతోషంగా అనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం.. ఓసారి వినేసి ఆనందించండి.

ప్రేమతో..
మధుర వాణి

1 comment:

Shashank said...

చలం అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పాట ఇదేనేమో. సంగీతసాహిత్య సమళంకృతే. :)