Monday, December 30, 2013

​Venice - Through my eyes - 2

వెనీస్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది Gondola రైడ్. గొండోలా అంటే నల్లటి చెక్కతో పూర్తిగా చేతిపనితనంతో తయారుచేయబడిన వెనీషియన్ సాంప్రదాయక పడవ. వీటిని నడిపే వ్యక్తిని Gondolier అంటారు. వీటిని వేరే ఎటువంటి యంత్ర సహాయం లేకుండా కేవలం తెడ్డు వేసి నడుపుతారు. 17, 18 వ శతాబ్దాల కాలంలో వెనీస్లో దాదాపు పదివేల గొండోలా బోట్స్ ఉండేవంటే వీటికి ఎంతటి ఆదరణ ఉండేదో ఊహించవచ్చు. ఇప్పుడు వెనీస్ లో మోటార్స్ తో నడిచే ఎన్ని రకాల పడవలు వచ్చినా కూడా గొండోలా రైడ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. అప్పటంత పెద్ద సంఖ్యలో లేకపోయినా వెనీస్లో ఇప్పుడు దాదాపు ఐదొందల వరకూ గొండోలాలు ఉన్నాయట.

గొండోలాలు నడిపే గొండోలియర్స్ అందరూ ఒకేలాంటి యూనిఫారం వేసుకుని ఉంటారు. దాదాపు ఆరొందల కేజీల బరువుండే ఈ చిన్న పడవల్లో మనుషుల్ని ఎక్కించుకుని వాటర్ ట్రాఫిక్ లో అంతటి ఇరుకైన కాలువల్లో నడపడం చాలా కష్టమైన పని కాబట్టి చాలా ట్రెయినింగ్ ఇచ్చి, పరీక్షలు పెట్టి అన్నీరకాలుగా నిపుణత సంపాదించినవారికే గొండోలియర్స్ గా ఉండటానికి లైసెన్సులు ఇస్తారట. మొత్తం వెనీస్ అంతటా ఈ గొండోలా సర్వీస్ కి స్టాండర్డ్ రేట్స్ ఉంటాయి. వాటి నిర్వహణ అన్నీటికీ కలిపి ఒకే రకంగా ఉంటుందన్నమాట. 40 నిమిషాల పాటు సాగే గొండోలా రైడ్ ఖరీదు 80 యూరోలు. ఇంకా ఎక్కువసేపు తిరగాలనుకుంటే ప్రతీ ఇరవై నిమిషాలకి అదనంగా 40 యూరోలు ఖర్చవుతుంది. కాకపోతే ఒక్కో గొండోలాలో ఆరుగురి వరకూ ఎక్కవచ్చు. కాబట్టి వేరే ఇంకెవరితోనైనా షేర్ చేసుకుంటే తక్కువ ఖరీదులో రైడ్ కి వెళ్ళిరాగలిగే వెసులుబాటు ఉంది. రాత్రి పూట రైడ్స్ అయితే వంద యూరోలు ఉంటుంది. ఇంకా ఏమైనా ప్రత్యేకతలు కావాలనుకుంటే దాన్ని బట్టి ఖరీదు పెరుగుతూ పోతుంది. మన ఇష్టాయిష్టాలని బడ్జెట్ ని బట్టి మనకి కావలసినంతసేపు రైడ్ కి వెళ్ళవచ్చు.

Venetian Gondolas
చేత్తో తయారు చేసిన పడవలు కదాని మాములుగా సాదాసీదాగా ఉండవు ఈ గొండోలాలు. లోపల కూర్చోడానికి పెట్టిన చిన్న బల్లలు, కుర్చీల మీద చక్కటి డిజైన్లు చెక్కబడి, నాణ్యమైన సీట్లు, తివాచీలతో అందంగా సర్ది ఉంటాయి. పూర్వకాలంలో సామాన్యులు పెళ్ళిళ్ళు లాంటి వేడుకల కోసం వీటిని వాడితే ధనవంతులు విలాసంగా ఉపయోగించేవారట. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గొండోలాల్లో ప్రయాణించడం అనే అనుభూతితో పాటు ఈ పడవలు బాగా ఇంటీరియర్ గా ప్రశాంతంగా, నిశబ్దంగా ఉండే సన్నటి ఇరుకైన కాలువల్లోకి తీసుకెళ్ళి తిప్పుతుంటే అంత తక్కువ ఎత్తున్న పడవలో నీళ్ళ మీద ఉయ్యాల జంపాల ఊగుతూ, చుట్టూరా శతాబ్దాల తరబడి నీళ్ళలోనే నానిపోతున్న పాతకాలం ఇళ్ళనీ, పాత కిటికీలని, బాల్కనీలని, కిటికీ పక్కన గోడ మీదకి కట్టిన తీగల మీద ఆరేసిన బట్టల్ని, గుమ్మాల ముందు నీళ్ళలో మునిగిపోయిన మెట్లనీ, ఇళ్ళ ముందు నిలిచి ఉన్న చిన్న పడవల్ని... వీటన్నీటినీ అతి దగ్గరగా చూస్తూ అరే.. భలే చిత్రంగా ఉందే ఈ ఊర్లో జీవన విధానం అని తీరిగ్గా ఆశ్చర్యపోవచ్చు. :-)

Gondola ride through the narrow canals of Venice
గ్రాండ్ కెనాల్ మీదుగా ఉన్న నాలుగు వంతెనల్లోనూ అత్యంత పెద్దది, పాతది అయిన Rialto bridge ని ఊరికే నీళ్ళలోంచి మాత్రమే చూడకుండా ఆ చుట్టుపక్కల నడుస్తూ చూడటం బాగుంటుంది. 16వ శతాబ్దపు నాటి ఈ విశాలమైన వంతెన మీద మధ్యలో నడిచే మెట్ల దారితో పాటు రెండు వైపులా చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. దాదాపు వెయ్యేళ్ళుగా ఈ ప్రదేశంలో నడపబడుతున్న Rialto మార్కెట్లో చాలారకాల లావాదేవీలు జరుగుతూ నిత్యం రద్దీగా ఉంటూ వెనీస్లో అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతోందట. రోజువారీ తాజా కూరగాయలు, పండ్లు, చేపల్లాంటి రకరకాల జలచరాల ఫ్రెష్ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది.

ప్రతీ ఊరికీ ఒక సెంటర్ అఫ్ అట్రాక్షన్ ఉన్నట్టే వెనీస్ లో St. Mark Square (Piazza San Marco) ఉంది. ఇది వెనీస్ సెంటర్ అన్నమాట. ఈ ప్రదేశాన్ని నెపోలియన్ 'డ్రాయింగ్ రూమ్ ఆఫ్ ద యూరోప్' అన్నాడట. వందల సంవత్సరాల చరిత్రతో ఘనత వహించిన St. Mark's Basilica church, St. Mark's Campanile (bell tower), Clock tower, Doge's Palace (Duke's palace) మొత్తం అన్నీ ఇక్కడే ఒకేచోట ఉంటాయి. వెనీస్ లో ఊరంతా బోలెడు చర్చిలు ఉన్నా ఇవి ముఖ్యమైనవి అన్నమాట. రిపబ్లిక్ ఆఫ్ వెనీస్ గా ఉన్నప్పుడు వెనీస్ మొత్తానికి అధిపతిగా ఉండి పరిపాలించే డ్యూక్ నివసించిన రాజభవనం ఇక్కడే ఉంది గ్రాండ్ కెనాల్ పక్కనే. వెనీస్ లో ఉన్న చాలా మ్యూజియంలు, చర్చిల లోపలకి వెళ్ళడానికి టికెట్లు విడివిడిగా దేనికది కొనుక్కోడంతో పాటు, కొన్ని కాంబినేషన్ టికెట్స్ కూడా ఉంటాయి. సాధారణంగా వీటిని సందర్శించాలంటే చాలా పెద్ద క్యూ దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆన్లైన్లో ముందే టికెట్స్ కొనుక్కుని మన విజిట్ ని షెడ్యూల్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే వీటన్నీటిని అంత దగ్గరగా, పరిశీలనగా చూడాలనుకుంటే ఎక్కువ టైము, డబ్బు ఖర్చవుతుంది కాబట్టి ఎవరెవరి ఆసక్తిని బట్టి వారు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూడలేకపోయినా సరే గ్రాండ్ కెనాల్ పక్కనే ఉన్న ఈ చారిత్రాత్మక సెయింట్ మార్క్ స్క్వేర్ లో కాలినడకన చుట్టూ తిరుగుతూ అన్నీ చూడటం కూడా చాలా గొప్ప అనుభూతి అనే చెప్తాను నేనైతే!

Rialto Bridge, St, Mark's Square, St. Mark's Basilica, Doge's Palace
వెనీస్ తో పాటుగా వెనీస్ మెయిన్ సిటీ నుంచి కాస్త దూరంలో విడిగా ఉన్న కొన్ని ద్వీపాలు కూడా సందర్శనాయోగ్యమైనవే. San Giorgio Maggiore అనే ఒక చిన్న ద్వీపం సెయింట్ మార్క్ స్క్వేర్ కి చాలా దగ్గర్లోనే ఉంటుంది. Vaporetto లో వెళితే ఒక్క స్టాప్, ఐదారు నిమిషాల్లో వచ్చేస్తుంది. అక్కడ తొమ్మిదో శతాబ్దం నుంచే చర్చి, క్రిస్టియన్ మొనాస్టరీ ఉండేవట. ఇప్పుడున్న పెద్ద చర్చి 16 వ శతాబ్దంలో కట్టారట. ఈ చర్చికున్న బెల్ టవర్ మీదకి లిఫ్ట్ ఎక్కి వెళ్ళవచ్చు. 6 యూరోలు టికెట్. పైకెక్కి అక్కడనుంచి చూస్తే వెనీస్ నగరం వ్యూ, ముఖ్యంగా సెయింట్ మార్క్స్ స్క్వేర్ చాలా అందంగా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు మొత్తం పొగమంచుతో నిండిపోయి ఉండటం వల్ల అంత క్లియర్ వ్యూస్ లేవు కానీ ఇది తప్పకుండా వెళ్ళి చూడాల్సిన వ్యూ అనిపించింది నాకు. చర్చి లోపల పాత కాలం నాటి ఆర్కిటెక్చర్, పెయింటింగ్స్ వగైరా కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. 'ఈ చర్చి చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి సరైన బట్టలు వేసుకురావాలి. పొట్టి దుస్తులతో లోపలకి అనుమతి నిషేధం' అని రాసున్న బోర్డ్ చూసి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటిదాకా నేను చాలా పాతకాలం చర్చిలు చూసాను కానీ ఇలాంటి నోట్ మాత్రం ఇదే మొదటిసారి చూడటం. గ్రాండ్ కెనాల్ లోంచి చూసినప్పుడు ఈ ద్వీపం చాలా అందంగా కనిపిస్తుంది.

Foggy views from Grand canal: St. Mark's Square, St. Giorgio Maggiore,  Santa Maria Della Salute
వెనీస్ కి కాస్త దూరంగా Murano, Burano అని రెండు ద్వీపసమూహాలు ఉన్నాయి. ఇవి కూడా అచ్చం వెనీస్ లాగే నీళ్ళలో తేలుతున్నట్టే ఉంటాయి. వెనీషియన్ గ్లాస్ కి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందట. ఇక్కడున్న గ్లాస్ వర్కర్స్ కేవలం చేతి పనితనంతో తయారు చేసే గ్లాస్ కళారూపాలు అద్భుతంగా ఉంటాయి. ఈ గ్లాస్ మేకింగ్ పరిశ్రమ ముఖ్యంగా మురానో ద్వీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఊర్లో చాలా చోట్ల గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియని దగ్గరగా చూసే అవకాశం ఉంది. మేము ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో చూడటానికి వెళితే ఒక Glass smith కేవలం ఒకే ఒక నిమిషంలో మా కళ్ళముందే ఒక చిన్న గుర్రం బొమ్మ చేసి చూపిస్తే అద్భుతం అనిపించింది. ఇసుక లాంటి పొడిని చూపించి అదొక రకమైన క్వార్ట్జ్ అని దానితోనే గాజు బొమ్మలు చేస్తారని చెప్పారు. దాన్ని ముద్దలా చేసి వందల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉండే వేడి కొలిమిలో కాల్చి అది వేడిగా ఉన్నప్పుడే చకచకా వాళ్ళకి కావలసిన ఆకారాల్లో మలుస్తారట. గాజులో రకరకాల రంగులు, డిజైన్లు సృష్టించడం కోసం రకరకాల రసాయనాలని వాడతారట. ఏదో మట్టి బొమ్మని చేసినంత సులువుగా క్షణాల్లో గాజుబొమ్మల్ని రూపొందించడం మాత్రం గొప్పగా అనిపించింది.

మురానో అంతా ఎక్కువగా ఇలా తయారు చేసిన గ్లాస్ వస్తువుల దుకాణాలే ఉంటాయి. వెనీస్ నిండా ఎక్కడ చూసినా కనిపించే గ్లాస్ వస్తువులన్నీ కూడా మురానో లోనే తయారు చెయ్యబడతాయి. గాజుతో ఏమేం వస్తువులు తయారు చేస్తారని చెప్పాలంటే అదొక పెద్ద లిస్టు అవుతుంది. చిన్న చిన్న జంతువుల బొమ్మల దగ్గర్నుంచీ పెద్ద పెద్ద షాండ్లియర్ల వరకూ వారు తయారు చెయ్యని వస్తువే లేదు. అమ్మాయిల నగలు అయితే ఇక చెప్పనవసరం లేదు. వాళ్ళ సృజనాత్మకత, పనితనం గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. అవన్నీ చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. పర్సులు ఖాళీ కూడా అయ్యాయనుకోండి అది వేరే విషయం! మురానో గ్లాస్ ఎంతందంగా ఉంటుందో ఖరీదు కూడా అంతే ఎక్కువ. అక్కడ షాపుల్లో వారందరూ ఇవి అన్నీటిలాగా మేడిన్ చైనా వస్తువులు కావు ఒరిజినల్ మురానో గ్లాస్ అని వాళ్ళ మార్క్ చూపించి, అది చెక్ చేసుకుని మాత్రమే కొనుక్కోండి అని చెప్తున్నారు. అక్కడ మనమేదైనా వస్తువు కొనుక్కుంటే వాళ్ళే దాన్ని భద్రంగా ప్యాక్ చేసి ప్రపంచంలో ఏ మూలకైనా పోస్టు ద్వారా పంపిస్తారట. ఖరీదు ఎక్కువైనా సరే వాళ్ళ పనితనానికి మాత్రం జోహార్లు అనిపించింది. అసలు వెనీస్ లో ఉన్నంతలో బోల్డు టైము ఈ గాజు కళాఖండాలని చూడ్డానికే సరిపోయింది. అంతలా ఆకర్షించేశాయి. ఈ ఊర్లోనే గ్లాస్ బ్లోయింగ్ చరిత్రని విపులంగా వివరించే గ్లాస్ మ్యూజియం కూడా ఉందట కానీ మేము వెళ్ళలేదు.

Venetian Glass Art of Murano

మురానో ద్వీపం గ్లాస్ కి ప్రసిద్ధి అయితే బురానో అనే ఇంకో చిన్న ద్వీపం లేస్ మేకింగ్ కి ప్రసిద్ధి. వెనీస్ నుంచి vaporetto తీసుకుంటే 45 నిమిషాల్లో బురానో కి వెళ్ళవచ్చు. ఈ ఊరు కూడా వెనీస్ లాగే ఉన్నాసరే ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఇళ్ళన్నీ కూడా బోల్డన్ని రంగుల్లో మెరిసిపోతూ ఊరంతా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఊరంతా లేసులు అమ్మే షాపులు ఉంటాయి. లేసులు అంటే ఏముందిలే మామూలు లేసులే కదా అనుకున్న నాకు అక్కడ షాపుల్లో ఉన్న రకరకాల వస్తువులు చూసి చాలా ఆశ్చర్యమేసింది. లేసుల అల్లికతోనే రకరకాల బట్టలు, తివాచీలు, బొమ్మలు, స్వెటర్లు అసలు ఒకటేమిటి వందల రకాల వస్తువులని తయారు చేశారు. ఇదంతా ముఖ్యంగా ఆడవాళ్ళు నడుపుకునే చేనేత పరిశ్రమ లాంటిది అనుకుంటా. కొన్ని దుకాణాల్లో బామ్మల వయసులో ఉన్నవాళ్ళు కూర్చుని శ్రద్ధగా ఏవో అల్లుతూ, కుట్టేస్తూనే ఉన్నారు. ఈ ఊర్లో లేసుల చరిత్రకి సంబంధించిన మ్యూజియం కూడా ఉందట. ఊరు మాత్రం అన్నీ బ్రైట్ కలర్స్ వేసిన ఇళ్ళతో భలే బాగుంది చూడటానికి. ఈ లేసు వర్కులు కూడా చాలా ఖరీదెక్కువే. మురానో, బురానో చూడ్డానికి వెనీస్ లాగే ఉంటాయి కానీ జనాల తాకిడి అక్కడికన్నా తక్కువ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది.Burano: Colurful Houses and the Lace making Art

యూరోప్లో చాలా చోట్ల గమనించాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడైనా యంత్రాల మీద కాకుండా మనిషి చేతుల్లో తయారు చేయబడే వస్తువులకి, హస్తకళలకి విలువ, ఖరీదు చాలా ఎక్కువ. అందరూ ఆయా కళాకారులకి ఎంతో గౌరవం ఇస్తారు. అసలు ఇటలీలో అంత మారుమూల ఉన్న చిన్న ఊర్లో వారు తయారు చేసే వస్తువులకి ఎంత విలువో, వారు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో! అందరి దగ్గరా క్రెడిట్ కార్డుతో డబ్బులు కట్టించుకోగలిగే సౌకర్యం కూడా ఉంది. ప్రపంచమంతా హస్తకళలని అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటే మన భారతదేశంలో మాత్రం చేనేత వస్త్రాలకి, హస్తకళలకి అంత తక్కువ ఖరీదు ఎందుకు కడతారో అర్థం కాదు. వాటి గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళ కష్టం, కళ ప్రపంచమంతా గుర్తించేట్టుగా మంచి సౌకర్యాలు, ప్రచారం కల్పించొచ్చు కదా అనిపించింది. వెనీషియన్ సొసైటీలో తరతరాలుగా ఈ కళాకారులకి ఉన్న గౌరవం, స్థానం ఆర్థికంగా, విలువల పరంగా కూడా చాలా ఎక్కువట. మనం కూడా మనవారికి తగిన గౌరవం ఇవ్వకపోతే ఆ కళలన్నీ ముందు తరాల దాకా వెళ్ళవేమో! అసలైనా అంత గొప్ప పనితనాన్ని గుర్తించలేకపోవడం, గౌరవించలేకపోవడం ఎంత అజ్ఞానం, దౌర్భాగ్యం! అక్కడ అవన్నీ చూస్తున్నంతసేపూ ఇలాంటి ఆలోచనలే వచ్చి బాధనిపించింది.

ఇంక తిండి విషయానికొస్తే ఇటాలియన్ వంటకాలని ఇష్టపడేవారు ఇక్కడ భోజనాన్ని బాగా ఆస్వాదించొచ్చు. వెనీస్ ఉండేదే నీళ్ళల్లో కాబట్టి రకరకాలైన చేపలు, రొయ్యలు, స్క్విడ్స్, ఏవేవో రకం గవ్వలు అవీ ఇవీ అని కాకుండా నీళ్ళల్లో ఉండే సకల జీవాలు ఇక్కడ ఆహారంలో ముఖ్య భాగంగా కనిపిస్తాయి. అవన్నీ ఇష్టపడేవారికి పండగేనన్నమాట! :-) జర్మనీలో ఇటాలియన్ ఫుడ్ ప్లేసెస్ లో కూడా చాలాసార్లు ఇటాలియన్ ఫుడ్ తిన్నాసరే ఇక్కడికంటే వెనీస్ లో రుచులు చాలా గొప్పగా ఉన్నాయనిపించింది నాకు. అందరి సంగతి నేను చెప్పలేను గానీ వేరేమీలేకుండా ఉట్టి టొమాటో క్రీమ్ తో చేసిన sphagetti pomodoro నే అద్భుతం అనిపించింది నాకైతే. ఇంకా వెనీషియన్ బేకరీల్లో ఏవేవో కొత్త రకం బేక్డ్ గూడ్స్, రకరకాల పేస్ట్రీస్ కనిపించాయి. రకరకాల నట్స్ తో చేసే వెరైటీలు చాలా ఉన్నాయి. ఏది ట్రై చేసినా వావ్ అనే అనిపించింది. వీటన్నిటితో పాటుగా ఇటలీ దాకా వెళ్ళి తిరామిసు తినకుండా ఎలానూ ఉండలేము కదా! మొత్తానికి ఫుడ్ విషయంలో యూరోప్లో మరే దేశంలోనూ ఇంత హ్యాపీగా అనిపించదేమో అనిపించింది. రుచులు సరే రేట్లు సంగతేంటంటే  మాత్రం, ఎక్కువనే చెప్పాలి. నిజానికి వెనీస్ వెళ్ళే ముందు అందరూ బాబోయ్ అక్కడసలు ఏమీ తినలేం, చాలా ఎక్కువ ఖరీదు అని చెప్పారు. కానీ, మా ఊరే యూరోప్లో costilest cities లో ముందు వరసలో ఉంటుంది కాబట్టి అనుకుంటా మాకు అంత ఎక్కువన్న భావన రాలేదు. ఒక మాదిరి డీసెంట్ రెస్టారెంట్ లో ఇద్దరు మనుషులకి ఒక సింపుల్ మీల్ విత్ అ కూల్ డ్రింక్ మినిమం 35 యూరోలు అవుతుంది. ఏ వైనో కావాలంటే ఇంకా ఎక్కువవుతుంది. నిజం చెప్పాలంటే కాస్త గట్టిగా తినేవాళ్ళకి అది కూడా బాగా కడుపు నిండా తినేశాం అన్నట్టు అనిపించకపోవచ్చు. అది కూడా మెయిన్ సెంటర్లలో కాకుండా కొంచెం ఊర్లో లోపలకి ఉన్న చోట్లే! కానీ అక్కడక్కడా చిన్న శాండ్ విచ్లు, పిజ్జా ముక్కలు కాస్త చవకగా అమ్మే చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి.

ఇంకా వెనీస్ లో అంతా ఎక్కడ చూసినా ఇటాలియన్ భాషే మాట్లాడినా సరే బాగా పర్యాటక ప్రదేశం కాబట్టి అన్నీ చోట్లా నోట్స్ అవీ ఇంగ్లీషులో కూడా ఉన్నాయి. ఇటాలియన్ మాత్రం భలే వినసొంపుగా ఉంది వినడానికి. రెస్టారెంట్స్ లో, దుకాణాల్లో మాత్రం కొందరు కొద్ది కొద్ది ఇంగ్లీషు మాట్లాడతారు. బాగా మాట్లాడగలిగినవారు చాలామంది ప్రత్యేకంగా ఇంగ్లీషు మాట్లాడతామని రాసి పెడుతుంటారు. లోకల్ ఇటాలియన్స్ తో పాటుగా వేరే దేశాల నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్, ముఖ్యంగా ఆసియా వాళ్ళు చాలామంది కనిపించారు. చాలామంది వీధుల్లో బొమ్మలు, సావనీర్స్ అమ్ముకునే చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు. ఒక ఇండియన్ కెఫే పెట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్ అతను యూరోప్లో రెఫ్యూజీస్ కి, అసైలమ్ సీకర్స్ కి వేరే దేశాల ఇటలీ నే బాగుంటుందని, అందుకే ఇక్కడ ఎక్కువమంది ఉన్నారని చెప్పాడు. కానీ, వారికి చాలా సమస్యలు ఉన్నాయనుకుంటా. వారి సమస్యలని గురించి ప్రస్తావిస్తూ కొన్ని రకాల ప్రొటెస్ట్ బోర్డ్స్ కనిపించాయి అక్కడక్కడా.

జర్మనీలో క్రిస్మస్ టైములో 24 మధ్యాహ్నం నుంచే అన్నీ దుకాణాలు మూసేస్తారు. 25, 26 న అయితే రెస్టారెంట్లు లాంటివి కూడా ఉండవు. వెనీస్లో ఒక ఇటాలియన్ రెస్టారెంట్ లో అతను జర్మనీ గురించి అన్నీ అడిగి తెలుసుకుంటూ అక్కడ అలా పూర్తిగా మూతపడటం అనేది ఉండదని చెప్పి జర్మనీలో అలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యపోయాడు. మాకు మామూలు రోజుల్లో షాపులు రాత్రి ఎనిమిది దాటాక ఉండవు. ఆదివారాలు పూర్తిగా మూసేసే ఉంటారంటే అతను ఇంకా ఆశ్చర్యపోయాడు. ఇదొక్కటే కాదు గానీ అంత తక్కువ టైములోనే జర్మనీకి, ఇటలీకి చాలానే తేడాలు కనిపించాయి.

ఇంకా, ఊరంతా నీళ్ళే ఉంటాయంటే ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత కష్టం! అంటే, అక్కడ నివసించే వారందరూ ఎంత క్రమశిక్షణగా, పద్దతిగా ఉండాలో కదా.. ఊరంతా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న నీళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నాయో! అంత చిన్న చిన్న సందుల్లో తిరుగుతున్నప్పుడు కూడా ఎక్కడా ఒక్క ఈగ, దోమ కానీ, కనీశం నాచు వాసన కూడా అనిపించలేదు.Night view of Venice

పగటి పూట అందమంతా ఒక ఎత్తు అయితే చీకటి పడ్డాక విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోయే వెనీస్ నగరపు అందం పూర్తిగా ఇంకో రకం మాయ! దీపాల కాంతులు నీళ్ళ మీద మెరుస్తూ, నీటి మీద తిరిగే పడవల కదలికలకి ఊయలలూగే నీటి అలలతో పాటుగా వయ్యారంగా కదిలే దీపపు కాంతుల ఛాయలు, చూస్తున్నకొద్దీ చూడాలనిపించింది. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, వెనీస్ నగరంలో అదాటుగా ఎటువైపు చూసినా ఒక దృశ్యకావ్యంలా మనోహరంగా ఉంది. చిత్రలేఖనం వచ్చినవారు తల తిప్పి ఎటు చూసినా ఒక పెయింటింగ్ గీసేసుకోవచ్చు. ఊర్లో చాలా చోట్ల చాలామంది అలా పెయింటింగ్స్ గీసి అమ్ముతున్నారు కూడా! అలాగే, రాండమ్ గా ఎటు వైపు చూసి కెమెరా క్లిక్ చేసినా ఆ ఫోటోని పెద్దది చేసి గోడ మీద తగిలించేసుకోవచ్చు. వెనీస్ నగర వీధుల్లో తిరిగే కొద్దీ మరీ మరీ నచ్చేసి ఆ ఊరు వదిలి వెనక్కి వచ్చేయ్యాలంటే భలే దిగులేసింది. కానీ, మళ్ళీ ఎప్పుడో మరోసారి తప్పక వస్తామంటూ ప్రేమగా వీడ్కోలు చెప్పేసి వచ్చాము.
అదన్నమాట నేను చూసిన వెనీస్ నగరం!

నా కళ్ళతో చూపించిన వెనీస్ మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తూ, ఎన్నో అందమైన, అమూల్యమైన అనుభూతులని నా సొంతం చేసిన 2013 కి వీడ్కోలు పలుకుతూ 2014 అందరి కోసం గొప్ప గొప్ప సంతోషాలని మూట కట్టి మోసుకురావాలని కోరుకుంటూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. :-)


Friday, December 27, 2013

​Venice - Through my eyes - 1

వెనీస్ వెళుతున్నామని చెప్పగానే మా తమ్ముడు "ఏదో ఏదో నాలో పులకింత కలిగే.. భాగ్యరేఖ వరియించెలే.." అని పాట పాడితే చాలా నవ్వొచ్చింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పాటలో 'వెనీస్ - నీటిపై తేలే నగరం' అని చూసి ఇదేదో భలే చిత్రంగా ఉందే అనుకున్న గుర్తు. తర్వాత వెనీస్ లో తీసిన చాలా సినిమా పాటలు చూడటంతో పాటు యూరోప్ వచ్చాక ఈ ఊరి గురించి మరిన్ని వివరాలు తెలిశాయి గానీ మొదటి జ్ఞాపకం మాత్రం అదే! భవిష్యత్తులో నేను చూడగలనని అప్పుడు నాకు తెలీదు గానీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత వెనీస్ నగరాన్ని కళ్ళారా చూస్తున్నప్పుడు మాత్రం గొప్ప సంభ్రమంగా అనిపించింది.

క్రిస్మస్ ముందు ఒక మూడు నాలుగు రోజులు ఎక్కడికైనా వెళదామని అనుకుంటూ ఇటలీలో అయితే ఈ టైములో ఎక్కడ బాగుంటుందో తెలుసుకుందామని నా ఇటాలియన్ ఫ్రెండ్ ఒకమ్మాయిని అడిగాను. వెనీస్ కానీ, రోమ్ కానీ వెళితే చాలా బాగుంటుందని చెప్పింది. వెనీస్ వేసవికాలంలో అయితే అందంగా ఉంటుందేమో కదా అని అడిగితే ఒక్క వేసవిలోనే కాదు, మొత్తం అన్నీ కాలాల్లోనూ అందంగానే ఉంటుంది. అప్పుడైతే టూరిస్టులు మరీ కుప్పలు తెప్పలుగా ఉంటారు. చలికాలంలో అయితే జనాల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి వెనీస్ కి వెళ్ళమని సూచించింది. సరేలెమ్మని ట్రైన్ టికెట్, హోటల్ వివరాలు లాంటివన్నీ చూస్తే అవి కూడా మరీ ఆకాశంలో లేకుండా కాస్త తక్కువలోనే కనిపించాయి. అక్కడ ఉష్ణోగ్రతలు చూస్తే పది డిగ్రీలకి అటూ ఇటూగా ఉండేసరికి పర్లేదులే మరీ అంత చలేమీ ఉండదనిపించింది. డిసెంబరు 20 న ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాక వెదర్ ప్రెడిక్షన్ చూస్తే వెనీస్ లో వాన అని కనిపించింది. అదే మాట నేనెళ్ళి నా ఇటాలియన్ ఫ్రెండుతో అంటే "నువ్వేం కంగారు పడకు. వానలో ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది వెనీస్ సిటీ" అని తేలిగ్గా తేల్చేసింది. సర్లే ఏదయితే అది అనుకుంటూ బయలుదేరిపోయాం. నిజానికి అక్కడున్న మూడు రోజులూ ఏదో నాలుగు చినుకులు కురిసాయి గానీ వర్షం అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చలి కూడా మా దగ్గర కన్నా తక్కువే ఉంది. ఇబ్బంది పెట్టేంత చలి కాదు. కానీ దట్టంగా కమ్ముకున్న పొగమంచు వల్ల దూరం నుంచీ, ఎత్తులో నుంచీ వెనీస్ ద్వీపాల అందాన్ని నిండుగా చూడలేకపోయాం.

వెనీస్ లో ఒక బుల్లి ఎయిర్పోర్ట్ (మార్కో పోలో) ఉంది కాబట్టి ఫ్లైట్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ మరీ దూర ప్రయాణాలు కాకపోతే యూరోప్లో ట్రైన్ జర్నీలే ఇష్టమనిపిస్తుంది నాకు. ఎందుకంటే రకరకాల ఊర్ల గుండా రైళ్ళు ప్రయాణించే దారులన్నీ చాలా అందంగా ఉంటాయి. జర్మనీలోని మ్యూనిక్ నుంచి ఇటలీలో ఉన్న వెనీస్ కి వెళ్ళే యూరో సిటీ ఎక్స్ప్రెస్ రైలు తీసుకుని ఏడున్నర గంటల్లో వెనీస్ కి చేరుకున్నాం. ఆస్ట్రియా దేశంలోని Innsbruck మీదుగా వెనీస్ దాకా వెళుతుందీ ట్రైన్. ఏడు గంటల ప్రయాణం అయినా రైలు కిటికీలోంచి కదిలిపోతూ తెల్లటి మంచు పోత పోసుకున్న ఆల్ప్స్ పర్వతాలు, బోల్డన్ని చిన్న చిన్న వాగులు, వంకలు, అక్కడక్కడా నదులు, పొగమంచులో తేలిపోతున్న కొండలు, కోనలు, కొత్త కొత్త ఊర్లతో, అందమైన దృశ్యాలతో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ మూడు దేశాల గుండా సాగిన ప్రయాణం ఆహ్లాదంగా అలసట తెలీకుండా సాగిపోయింది.

Views from the Train window

ఈశాన్య ఇటలీలో అడ్రియన్ సముద్రపు అఖాతంలో ఏర్పడిన కొన్ని చిన్న ద్వీపాల సమూహమే వెనీస్ నగరం. సులువుగా చెప్పాలంటే బంగాళాఖాతం (Bay of Bengal), San Francisco Bay లాగా ఇటలీలో అడ్రియన్ సముద్రపు బే venetian lagoon లో ఏర్పడిన 118 చిన్న చిన్న ఐలాండ్స్ కలిపి వెనీస్ నగరంగా అవతరించింది. ఈ బుల్లి బుల్లి ద్వీపాలన్నీ కూడా చుట్టూరా నీళ్ళతో వేరు చేయబడుతూ బోల్డన్ని వంతెనలతో సహాయంతో వారధి వేయబడి ఉంటాయి. అందుకే వెనీస్ నగరానికి 'సిటీ ఆఫ్ కెనాల్స్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్' అని కూడా పేర్లున్నాయి. UNESCO world heritage sites జాబితాలో చోటు చేసుకున్న ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటిగా, one of the most romantic cities in the world గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కేవలం నాలుగు వందల చదరపు కిలోమీటర్లున్న ఈ చిన్న నగరం ప్రపంచం నలుమూలల నుంచి ప్రతీరోజూ దాదాపు యాభై వేలకి పైగా సందర్శకులని ఆకర్షిస్తోందంటే ఈ నగరపు ఖ్యాతిని అంచనా వేయొచ్చు.


వెనీస్ ని ఇటాలియన్ భాషలో Venezia అంటారు. మేము వెనీస్ లో కాకుండా పక్కనే ఉన్న ఇంకొక చిన్న ఊరు Venezia Mestre లో ఉండి రోజూ వెనీస్ వెళ్ళొచ్చాం. Mestre వెనీస్ లాగా నీళ్ళ మీద తేలే ఊరు కాదు. మామూలుగానే ఉంటుంది. Mestre నుంచి వెనీస్ కి దాదాపు పది కిలోమీటర్ల దాకా ఉంటుంది. బస్లో పది నిమిషాల ప్రయాణం. బస్సులు మామూలు రోజుల్లో పది పదిహేను నిమిషాలకి ఒకటి ఉంటే సెలవు రోజుల్లో బస్సుల ఫ్రీక్వెన్సీ కాస్త తక్కువగా ఉంటుంది. వెనీస్ లో అర్ధరాత్రి దాటాక కూడా దాదాపు 24 గంటలు బస్ సౌకర్యం ఉంది. Mestre కూడా Veneto region కిందకి వస్తుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతటికీ కలిపే ఉంటుంది. మొత్తానికీ కలిపి ఒక టికెట్ కొనుక్కుంటే సరిపోతుంది. ప్రతీసారీ బస్సు ఎక్కినప్పుడల్లా కాకుండా ఒకేసారి ఫ్లాట్ రేట్ టికెట్స్ కొనుక్కుంటే మనకి వీలుగా ఉండటంతో పాటు చవకగా వస్తుంది. 12, 24, 36, 72 గంటలకి టికెట్స్ ఉంటాయి. అంటే మనం టికెట్ కొన్నాక బస్లో కానీ, ట్రాంలో కానీ ఎలక్ట్రానిక్ వాలిడేషన్ చేసిన దగ్గర్నుంచీ మన టికెట్ పని చెయ్యడం మొదలుపెట్టి సరిగ్గా ఆ కాలపరిమితి ముగిసాక ఎక్స్పైర్ అయిపోతుందన్నమాట. టికెట్స్ ముందే కొనిపెట్టుకుని మనకవసరం ఉన్నప్పటి నుంచే వాలిడేట్ చేసుకోవచ్చు. కానీ, టికెట్ దగ్గరుంచుకుని వాలిడేట్ చెయ్యకుండా ప్రయాణించడం నేరం. టికెట్ చెకింగ్ కి వస్తే జరిమానా విధిస్తారు. యూరోప్లో ఇది సాధారణంగా ఉండే పద్ధతే కానీ బయటివాళ్ళు చాలామంది తెలీక ఇబ్బంది పడుతుంటారు ఒకొకసారి. మేము 72 గంటల టికెట్ తీసుకున్నాం. దాని ఖరీదు ఒక్కొక్కరికి 35 యూరోలు.

Mestre నుంచి వెనీస్ కి బస్లో వెళుతుంటే మధ్యలోనే రోడ్డుకిరుపక్కలా నీళ్ళతో నిండిన బే, దాంట్లో చిన్న చిన్న పడవలు అవీ కనిపిస్తుంటే వెనీస్ వచ్చేశామోచ్ అని చాలా ఉత్సాహంగా అనిపించింది. బయటనుంచి వెనీస్ కి వచ్చే బస్సులన్నీ Piazzale Roma అనే ఒక సెంటర్ కి చేరతాయి. ఇటాలియన్ భాషలో సెంటర్, స్వేర్ ని Piazza అంటారు. అందుకని తరచూ ఆ పేరు కనిపిస్తూ ఉంటుంది. Piazzale Roma ని ఒకరకంగా వెనీస్ కి ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. బస్సులు, కార్లు మరే రకమైన రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా వెనీస్లో ఇక్కడిదాకానే సాధ్యం. ఇక్కడినుంచి మిగతా అంతా నీళ్ళ మీదనే అన్నీ! కాబట్టి Piazzale Roma లోనే బస్సులన్నీ వచ్చి ఆగుతాయి. పక్కనే కార్ పార్కింగ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక పెద్ద వంతెన దాటి ఒక రెండు నిమిషాలు నడిస్తే Venezia Santa Lucia రైల్వే స్టేషన్ వస్తుంది. Piazzaa Roma లో ఒక వాటర్ బస్ స్టాప్ ఉంటుంది. వెనీస్ అంతా నీటి మీద తేలుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండే రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ సాధ్యం. ఒకటి నేల ఉన్నంత మేరా, వంతెనలు ఉన్న చోటా కాలినడకన వెళ్ళడం, రెండోది వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవడం. వెనీస్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందించే వాటర్ బస్ సర్వీస్ ని Vaporetto అంటారు. ఇవి లాంచీల్లాగా ఉంటాయి. మనం కొనుక్కున్న టికెట్స్ మొత్తం అన్నీ రూట్స్ లో వెళ్ళే Vaporetto ఎక్కడానికి పనిచేస్తాయి. అలా కాకుండా ఒక్కో ట్రిప్ కి విడిగా కొనుక్కోవాలంటే వన్ వే కి 6 యూరోస్ ఉంటుంది. వెనీస్ లోని మొత్తం అన్నీ ప్రదేశాలని కలుపుతూ ఈ వాటర్ బస్ సర్వీస్ ఉంది. ఇది కాకుండా వాటర్ టాక్సీలు కూడా ఉంటాయి. ట్యాక్సీ అంటే తెలిసిందేగా మనకి నచ్చినట్టు ఒక చోటు నుండి ఇంకొక చోటికి తిరగొచ్చు. అచ్చంగా మనకోసమే బుక్ చేస్కోవచ్చు కానీ సహజంగానే ఖరీదు ఎక్కువ. వేసవికాలంలో జనం పుట్టలు పుట్టలుగా ఉన్నప్పుడు Vaporetto ల్లో కాలు పెట్టే సందు దొరకడం కూడా కష్టంగా ఉంటుందట. తీరిగ్గా అది ఎక్కి కూర్చుని బయటికి చూసి ఆస్వాదించేంత వీలు కుదరదన్నమాట. డిసెంబర్లో మాత్రం అంత రద్దీ లేకపోవడం వల్ల Vaporetto రైడ్ చాలా సరదాగా అనిపించింది.

Vaporetto (water bus), Bus stop, Water Taxi

వెనీస్ లో మొట్టమొదటగా చెయ్యాల్సిన పని ఒక మ్యాప్ కొనుక్కోవడం. ఎంట్రన్స్ దగ్గరే ఉన్న టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో టికెట్స్ తో పాటు మ్యాప్స్ కూడా అమ్ముతారు. 3 యూరోలు పెట్టి ఒక మ్యాప్ కొనుక్కుంటే ఎక్కడున్నామో అందులో చూసుకుంటూ ఊరంతా హాయిగా తిరిగెయ్యొచ్చు. Vaporetto మ్యాప్స్, ప్లాన్స్ కూడా చాలా ముఖ్యం. ఏది ఏ డైరెక్షన్లో వెళుతుంది అనేది కొత్తవాళ్ళకి కాస్త అయోమయంగానే ఉంటుంది. ఇవి మాత్రం కాస్త శ్రద్ధగా చూసుకోవాలి. వెనీస్ మ్యాప్ చూస్తే నగరపు భూభాగమంతా నీళ్ళలో ఒక చిన్న చేప ఆకారంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఊరంతా నీళ్ళూ, కాలువలే ఉన్నా ఊరి మధ్యగా ఒక పెద్ద మెయిన్ కెనాల్ ఉంటుంది. దాన్నే Grand Canal అంటారు. Piazzale Roma Vaporetto స్టాప్ కూడా గ్రాండ్ కెనాల్ లోనే ఉంటుంది. ముందు అక్కడినుంచి మొదలుపెట్టి ఏదో ఒక Vaporetto ఎక్కి అప్పుడు తీరిగ్గా ఎటు వెళదామో చూద్దాం అనుకున్నాం.

అలా గ్రాండ్ కెనాల్ మధ్యగా నీళ్ళలో వెళుతూ చుట్టూ ఎటు చూసినా నీళ్ళ మధ్యలో పెద్ద పెద్ద భవంతులు. వాటిని చూస్తుంటేనే తెలిసిపోతోంది అవి శతాబ్దాల నాటి కట్టడాలని. ఎటువైపు చూసినా నీటిపైన తేలుతున్నట్టు కనిపిస్త్తున్న చారిత్రాత్మక కట్టడాలు, వాటి మధ్యన చిన్న పాయల్లాగా పిల్ల కాలువలు, అక్కడ కూడా మళ్ళీ వరుసల్లో కనిపిస్తున్న ఇళ్ళు, అక్కడక్కడా ఆ ఒడ్డు నుంచీ ఈ ఒడ్డుకి చేరవేసే చిన్న చిన్న చెక్క వంతెనలు, లోహపు వంతెనలు... వాటన్నీటినీ కళ్ళు విప్పార్చుకు చూస్తూనే అద్భుతం అనిపించింది. అసలు ఎన్నో శతాబ్దాల క్రితమే ఇంత పెద్ద పెద్ద కట్టడాలని ఇంత బలంగా ఎలా కట్టారు, ఇప్పటికీ ఇవి అంత చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే అప్పటి వారి ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ కి అబ్బురమనిపించింది. సాధారణంగా ప్రపంచ చరిత్ర పరిజ్ఞానం, ఆసక్తి నాకు తక్కువే గానీ ఇప్పుడు వెనీస్ చూసొచ్చాక అసలీ ఊరు చరిత్ర ఏమిటి, ఇవన్నీ ఎలా కట్టారు అని అవన్నీ వెతికి మరీ చదివి తెలుసుకుంటున్నా. ఎన్నో వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర కలిగిన నగరంలో విహరించడం, అప్పట్లో ఇక్కడ ఏమేం జరిగుంటాయో కదా అని తలచుకోవడం భలే థ్రిల్లింగా ఉంది. :-)

Through the Grand Canal of Venice

గ్రాండ్ కెనాల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు కనిపించే పెద్ద పెద్ద భవంతుల్లో చాలా వరకూ ప్రభుత్వానికి చెందిన భవనాలు, మ్యూజియమ్స్, కొన్ని హోటల్స్ ఉన్నాయనుకుంటాను. మామూలు ప్రజల అంటే స్థానికుల జనావాసాలు కాస్త లోపలకి చిన్న చిన్న సందుల్లోకి ఉన్నట్టు అనిపించాయి. వెనీస్ నగరంలో ఎవరికైనా ముఖ్య ఆకర్షణలు మూడు. మొదటిది నీళ్ళలో తిరుగుతూ నీటిపై తేలే నగరాన్ని చూడటం. రెండోది వెనీస్ నగరపు ఇరుకైన సందుల్లో కాలినడకన తిరుగుతూ ఇంటీరియర్ గా ఊరెలా ఉందో, అక్కడి జీవన విధానం ఎలా ఉందో కాస్త దగ్గరగా గమనించడం. మూడోది ఊరంతా ఉన్న బోల్డన్ని పాత చర్చిలని, మ్యూజియంలని సందర్శించడం. వాటిలోకి వెళ్ళడానికి టికెట్ల ఖరీదు ఎక్కువగానే ఉండటంతో పాటు చాలా పెద్ద పెద్ద క్యూలు కూడా ఉంటాయి. ఆర్ట్ మ్యూజియంలు సందర్శించి వాటిని అర్థం చేసుకునే పరిజ్ఞానం కానీ, అర్థం చేసుకుందామన్న ఆసక్తి కానీ లేకపోవడం వల్ల మేము మొదటి రెండు పనులు చేశాము కానీ మూడోది చెయ్యలేదు. ఇంకా రాజుల ప్యాలెస్లు, కాస్సిల్స్, చర్చిల లోపల ఇప్పటికే చాలా ఊర్లలో చూసీ చూసీ బాగా మొహం మొత్తేసింది కాబట్టి దానికన్నా మేమున్న మూడు రోజులూ బయట నుంచి అన్నీ చూస్తూ ఊరిలోనే తిరగాలని అనుకున్నాం.


ఎంత ఇరుకైన సందులైనా సరే ప్రతీ వీధి పేరుని బయట, మ్యాప్లో కూడా చక్కగా మార్క్ చేసి పెట్టడం వల్ల మనకి ఆసక్తి, ఓపిక ఉంటే వెనీస్ మ్యాప్ పట్టుకుని ఒక 3-4 రోజుల్లో మొత్తం ఊరంతా కాలినడకన చుట్టేయ్యొచ్చు. మొత్తం కాదు కానీ రెండ్రోజుల పాటు కొంతవరకూ తిరిగాం మేము. నిజం చెప్పాలంటే ఇళ్ళ మధ్యన సన్నటి సందులు, గొందులు మనకి మరీ అంత విచిత్రంగా అనిపించవు కానీ, వాటిని కూడా అంత ఆర్గనైజ్డ్ గా ఏర్పాటు చేసుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా సరే వివరంగా పేర్లు రాసి పెట్టుకోడం, పగలే కాకుండా, చీకటి పడ్డాక కూడా అస్సలే మాత్రం భయం అనిపించకుండా అలా వెనీస్ వీధుల వెంట తిరగడం మాత్రం చాలా గొప్పగా అనిపించింది. మామూలుగా మనం సైకిళ్ళు, బైకులు, కార్లలో తిరుగుతాం కదా అలాగ ఈ ఊర్లో జనాలకి కొంతమందికి ఇళ్ళ ముందు చిన్న పడవలు ఉన్నాయి. ఇంక వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచీ అంతా నీళ్ళలోనే తిరగడం కదా మరి! స్కూలుకి వెళ్ళడానికి, ఆఫీసుకి వెళ్ళడానికి, ఆసుపత్రికి వెళ్ళడానిక్కూడా ప్రతీదానికి పడవల్లోనే తిరగడం అన్నమాట. అలా ఊహిస్తే ఇక్కడ పుట్టి పెరిగిన వారి జీవితం మనతో పోలిస్తే భలే వైవిధ్యంగా విచిత్రంగా ఉంటుంది కదా అనిపించింది. శతాబ్దాలుగా వీరు నీళ్ళ మీదే బతికేస్తున్నా మిగతా ప్రపంచంతో పాటుగా కొత్త నాగరికతని అందిపుచ్చుకుని అల్ట్రా మోడరన్ గానే ఉన్నారు. ఊర్లో ఏ మూలకి వెళ్ళినా దొరికే wifi (ఉచితంగా కాదులెండి) దానికి నిదర్శనం. అయినా ఎన్నో శతాబ్దాల ముందే మిగిలిన ప్రపంచం అంతా ఇంకా నాగరికతని నిర్మించుకోవడంలో తొలి అడుగులు వేస్తున్న సమయానికే ఆర్కిటెక్చర్, సాంస్కృతిక, సాహిత్య, చిత్రలేఖన రంగాల్లో ఒక వెలుగు వెలిగిన వెనీస్ నగరం ఇప్పటికీ అంత మోడ్రన్ గా ఉండటంలో ఏమీ ఆశ్చర్యం లేదేమో! ఇప్పుడు కూడా తరచూ చాలా రకాలైన ఫ్యాషన్ షోలు, మ్యూజిక్ కన్సర్ట్స్, ఒపెరాలు, హిస్టారిక్ పెయింటింగ్ ఎక్జిబిషన్లు, ఫిలిం ఫెస్టివల్స్ తో వెనీస్ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది.

Narrow streets of Venice

వెనీస్ వీధుల్లో కళకళలాడిపోతూ కనిపించేది ముఖ్యంగా రకరకాల దుకాణాలు. అవన్నీ చూశాక వీళ్ళకి చాలా ప్రత్యేకమైన సృజనాత్మకత, పనితనం ఉందని అర్థమైంది. ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో వెనీస్లో జరిగే Carnival గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కార్నివాల్ పెరేడ్ లో అందరూ రకరకాల మాస్కస్ పెట్టుకుని తిరుగుతారు. వెనీస్ పేరు చెప్పగానే చాలామందికి రంగురంగుల్లో మెరిసిపోయే ఈ మాస్కులే గుర్తొస్తాయి. ఈ కారణం వల్లనే వెనీస్ కి సిటీ ఆఫ్ మాస్కస్ అని కూడా పేరుంది. నేను ఇదివరకు కొన్ని చోట్ల మాస్కస్ చూసాను గానీ వెనీస్ వీధుల్లో ప్రత్యేకంగా మాస్కుల కోసమే ఉన్న బోల్డన్ని దుకాణాలు, లెదర్, పోర్సిలీన్, రకరకాల ఫ్యాబ్రిక్, లేసులు, ఈకలు ఇంకా చాలా రకాలుగా తయారు చేసిన అన్నేసి రకాల మాస్కస్ చూసినప్పుడు మాత్రం వావ్.. అనిపించింది. అసలు ఎంతందంగా ఉన్నాయో! దానికి తగ్గట్టు చిన్న చిన్న షాపుల్లో నిండుగా, ఒద్దికగా వాటిని సర్దుకున్న తీరు మహా ముచ్చటగా ఉంటుంది. అవన్నీ ఎంత అందంగా ఉన్నాయంటే వీధుల్లో నడుచుకుంటూ ప్రతీ దుకాణం లోపలకి వెళ్ళి చూడాలనిపించేంతలా! చాలా షాపుల వాళ్ళు ఫోటోలు తీయరాదని బోర్డ్లు పెట్టుకున్నారు. ఎంత బాగున్నా సరే బోల్డన్ని మాస్కులు కొనుక్కుని మనమేం చేసుకుంటాం అని మూడీటితో ఆగిపొయాను గానీ ఎంత ఆకర్షించేసాయో అసలా మాస్కులు. ఈ మాస్కులు అందంతో పాటు రేట్లు కూడా చాలా ఎక్కువే! వీటిల్లో చాలావరకు చేతిపనితనంతో చేసినవే అనుకుంటాను. వాటన్నీటిని చూసి ఆనందిస్తూ వాటిని తయారు చేసిన పనితనాన్ని మెచ్చుకుంటూ తిరగడం ఒక మంచి అనుభూతి!

Venetian Masks

అలా అలా వెనీస్ వీధుల్లో తిరిగేస్తుంటే ఒక చోట 'Merchant of Venice' అన్న పేరుతో ఒక కొట్టు కనిపించింది. అదేదో పెర్ఫ్యూమ్ షాపు. కానీ ఆ పేరు చూడగానే నాకు టక్కున టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకంలో చదువుకున్న పాఠం గుర్తొచ్చింది. అది షేక్స్పియర్ రాసిన ఒక ప్లే. ఆంటోనియో, బస్సానియో అని ఇద్దరు స్నేహితులుంటారు. ఆంటోనియో స్నేహితుని కోసం షైలాక్ అనే వడ్డీ వ్యాపారస్థుడి దగ్గర అప్పు చేస్తాడు. దుర్భుద్ధి కలిగిన అతను అప్పు తీర్చలేకపోతే తన శరీరంలోంచి ఒక పౌండ్ మాంసాన్ని బదులుగా ఇవ్వాలని కోరతాడు. బస్సానియో ఆ డబ్బుతో పోర్షియా అనే రాకుమారి స్వయంవరానికి వెళతాడు. అక్కడ రాకుమారులు ఆమె చూపించిన బంగారు, వెండి, సీసం మూడు పెట్టెల్లో ఒకదాన్ని ఎంచుకుంటే దాన్ని బట్టి ఆమె వరుడిని ఎంచుకుంటుంది. సీసం పెట్టెని కోరుకున్న బస్సానియో ఆమెని పెళ్ళాడతాడు. నాకు బాగా గుర్తు, All that glitters is not gold అన్న వాక్యం మొదటిసారి అప్పుడే నేర్చుకున్నా నేను. తర్వాత ఆంటోనియో పడవలన్నీ మునిగిపోయి నష్టాలు వచ్చి అప్పు తీర్చలేకపోతాడు. అప్పుడు షైలాక్ ఒక పౌండ్ మాంసంగా గుండెని కోసిమ్మని అడుగుతాడనుకుంటా. ఆ కేసు విచారణ వెనీస్ డ్యూక్ ఎదుట జరుగుతుంది. ఆ కేసులో నుంచి ఆంటోనియో ని ఎలా బయటపడేస్తారు అనేది మిగతా కథ. చాలా చాలా బాగుంటుంది. ఆ పెర్ఫ్యూమ్ షాపు చూసాక నాకీ కథంతా గుర్తొచ్చి అయితే నాకు వెనీస్ పేరు చిన్నప్పుడే తెలుసన్నమాట అని నవ్వొచ్చింది. షేక్స్పియర్ వెనీస్ నగరంలో జరిగినట్టుగా ఈ ప్లే ని రాశారట. Giacomo Casanova, Marco Polo అనే ప్రముఖ సాహిత్యకారులు, Antonio Vivaldi అనే సంగీతకారుడు వెనీస్ నగరంలో పుట్టినవారేనట. వారి వర్క్స్ నుంచి కూడా అప్పటి వెనీస్ చరిత్రని మనం తెలుసుకోవచ్చట. వెనీస్ చూసొచ్చాక అప్పటి సంగతులని వివరించే పుస్తకాలేమైనా చదివితే బాగుండనిపిస్తుంది ఇప్పుడు. :-)

... to be continued

Thursday, December 26, 2013

గగనకుసుమం


అల్లంత దూరాన నీలవర్ణాన వెలిగిపోయే ఆకాశధామం నీ నివాసం..
వినీలమైనా కారునలుపైనా నింగికి అద్దం పట్టే సాగరం నా నెలవు..
దిగంతాల అంచుల దాకా ఎగరేసే విశాలమైన రెక్కలు నీ సొంతం..
నీటి అలల తాటింపు తప్ప మరే విద్య నేర్వని చిన్ని రెక్కలు నావి..
దివిసీమలనేలే స్వేఛ్ఛావిహంగానివి నీవు..
జలతారు నీటివలలో బంధీనైన మీనాన్ని నేను..
మింటి మెరుపులని వేటాడుతూ మరీచిలా సాగేవు నీవు..
నీ క్రీగంటి చూపుకై ప్రతీక్షిస్తూ ఛాయలా తిరిగేను నేను..
సుదూరాన గగనభువనాలు సంగమించే చోటు కళ్ళెదుటే కనిపిస్తూ ఆకర్షిస్తుంది..
కానీ ఎంతగా రెక్కలార్చుకు ఈదినా ఇసుమంతైనా ఆ దూరం తరగదు కరగదు!