Thursday, January 15, 2009

నిన్నే నిన్నే అల్లుకొని.. కుసుమించే గంధం నేనవనీ..!!

పల్లవి ఒక పాటకి సంబంధించినది. పాట వినగానే ఇది ఏదో ఎనభైల్లోనో, తొంభయ్యో దశకంలోనో వచ్చిన పాటేమో అనిపిస్తుంది. అంటే.. సంగీతం, సాహిత్యం శైలిలో అనిపిస్తాయి. కానీ, ఇంతకీ పాట ఇటీవలే విడుదలైన 'శశిరేఖా పరిణయం' అనే సినిమాలోనిది. 'క్రియేటివ్ డైరెక్టర్' కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో తరుణ్, జెనీలియా జంటగా నటించారు. సినిమా బాగానే ఉందని అందరూ అంటున్నారు.. కానీ, నేను ఇంకా చూళ్ళేదు. పాట మాత్రం చాలా చక్కగా ఉంటుంది. దృశ్యీకరణ కూడా ఖచ్చితంగా బావుండి ఉంటుందని నేను ఊహిస్తున్నా :)

సిరివెన్నెల గారి చక్కటి తేట తెలుగు సాహిత్యానికి, చిత్ర గాత్రం కలిసి.. పాటను ఒక మంచి మెలొడీగా చేశాయి. మణిశర్మ గారి సంగీతం కూడా అందుకు తగ్గట్టుగా చక్కగా కుదిరింది.

ఒక బాపు బొమ్మ లాంటి అచ్చ తెలుగింటి అమ్మాయి.. తన మనసైన అబ్బాయి గురించి పాడుకునే పాట ఇది. ఇవన్నీ ఏంటి నాన్ సెన్స్.. అంటారా? అయితే.. పాట మీకు ఎక్కడం కష్టమే :) మీరు.. ఒక చక్కటి సంగీత సాహిత్యాలున్న తెలుగు పాటని వినాలనుంటే ఒకసారి పాటని విని చూడండి. ఇక్కడ పాట సాహిత్యం ఇస్తున్నాను. లుక్కెయ్యండీ :)



నిన్నే నిన్నే అల్లుకొని.. కుసుమించే గంధం నేనవనీ..
నన్నే నీలో కలుపుకొని.. కొలువుంచే మంత్రం నీవవనీ..
ప్రతీ పూట పువ్వై పుడతా.. నిన్నే చేరి మురిసేలా..
ప్రతీ అడుగు కోవెలనవుతా.. నువ్వే నెలవు తీరేలా..
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ..

నిన్నే నిన్నే అల్లుకొని.. కుసుమించే గంధం నేనవనీ..

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే..
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే..
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే..
తాళి కట్టి యేలవలసిన దొరవూ నువ్వే..
రమణి చెరను దాటించే రామచంద్రుడా..
రాధ మదిని వేధించే శ్యామసుందరా..
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగా పండించరా..

నిన్నే నిన్నే అల్లుకొని.. కుసుమించే గంధం నేనవనీ..

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా..
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా..
గంగ పొంగునాపగలిగిన కైలసమా..
కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంమా..
ప్రాయమంతా కరిగించి ధారపోయనా..
ఆయువంతా వెలిగించి.. హారతియ్యనా..

నిన్నే నిన్నే నిన్నే.. .... నిన్నే నిన్నే నిన్నే..!!

మరి ఆలస్యమెందుకు.. ఓసారి పాట ఏస్కోండీ :)

8 comments:

Anonymous said...

సాహిత్యం చాలా బావుందండి. ధన్యవాదాలు

శ్రీ said...

భలే పాటండీ...సినిమా అయిపోయిన తర్వాత పెట్టాడు ఆ డైరక్టర్. మధ్యలో ఉంటే మంచి అసెట్ అయిఉండేది.

ఈ పాట నాకు, మా అమ్మాయికి చాలా ఇష్టం. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళ వీడియో లో ఈ పాట తప్పకుండా పెట్టుకోవచ్చు.

Unknown said...

Good one !

naakkudaa chaalaa nachchindandi ee paata ! krishnavamsy movies lo paatala saahityam, kOnasIma andaalu baagaa untaayi.

ఫణి ప్రసన్న కుమార్ said...

చక్కటి పాట అందించరు మధురవాణి గారూ, సంతొషం.

నేస్తం said...

పాట సాహిత్యం బాగుంది వింటా నా పనులన్నీ అయ్యకా తీరికగా దన్య వాదాలు

మరువం ఉష said...

కళ్ళు మూసుకొని పదం పదం విడదీసి వినదగ్గ, కాళ్ళు కదుపుతూ నర్తించగల, చేతులతో నాకు వచ్చీ రాని తాళం వేస్తూ ఆస్వాదించగల పాటలా తోస్తుంది. నిజంగా ఈ weekend లో విని తీరతాను. దన్య వాదాలు + కృతజ్ఞతలు.

Srujana Ramanujan said...

చాలా మంచి భావం ఉన్న పాట ఇది. సిరివెన్నల కురిసినట్టుంది.

సృజన వల్లిక.

S said...

బాగుంది పాట.
ఎక్కడ వినాలో లంకె కూడా ఇస్తే పోయేది గా :)