Wednesday, July 25, 2012

ఎంత ఎంత వింత మోహమో!

పందిరి మంచం మీద బోర్లా పడుకుని చెంప కింద రెండు చేతులూ పెట్టుకుని మంచం అంచున చేరి నేల మీదకి చూస్తూ ఉంటే చెంప మీద నుంచి కిందకి జారి గాలికి సన్నగా ఊగుతున్న నల్లటి జడ తను ఊగుతూ కింద నున్నటి గచ్చు మీద మెరుస్తున్న తన నీడతో దోబూచులాడుతోంది. కదిలే నీడల వెంట కుడి చేతి చూపుడు వేలితో రాస్తూ వాటి వెనకాలే నే పరిగెడుతూ నీడల్లో ఎవరి పోలికలో వెతుకుతూ ఉండిపోయాను చాలాసేపటి దాకా..
గదిలో పక్కగా నీ చేత్తో వేలాడదీసిన రంగు రంగుల మట్టి గంటలు గాలి పిలుపులకి గలగలమంటూ బదులిస్తున్నాయి. పాదాలపైన తారాడుతున్న వెండి మువ్వలు గాలి పాటకి తాళం వేస్తున్నాయి. పడగ్గది గుమ్మానికి కట్టిన పల్చటి అడ్డు తెరలు గాలి అలలు తరిమినప్పుడల్లా ఎగిరెగిరిపడుతూ నా ముందు దాకా వచ్చి మళ్ళీ అంతలోనే ఉస్సూరంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. తెరలు ఎగిరొచ్చిన ప్రతీసారి నా కళ్ళు అప్రయత్నంగా అటుకేసి చూస్తున్నాయి. తెరలు కాస్తా దోవకి అడ్డు తప్పుకుని ఎవరినో చూపిస్తాయని కన్నులకి వల్లమాలిన ఆరాటం కాబోలు!

తుంటరి గాలి పదే పదే గుమ్మపు తెరలని నా ముందుకి తోస్తూ మళ్ళీ మళ్ళీ ఆశలు కల్పిస్తూ అంతలోనే అడియాసలు చేస్తూ నాతో ఆటలాడుతోంది. ఉహూ.. సారి మాత్రం తల తిప్పి అటుకేసి చూడొద్దని ఉక్రోషంగా అనుకుంటుంటే ఆకతాయి కంటిపాపలు నా కన్నుగప్పి మళ్ళీ మళ్ళీ అటే చూస్తూ నన్ను మాయ చేసేస్తున్నాయి. నా తిప్పలు చూసి కిటికీలోంచి తొంగి చూస్తున్న సన్నజాజి తీగన దాగిన దోర మొగ్గలు నువ్వెంత ఆత్రపడినా మేమింకా విచ్చుకోడానికి నాలుగు ఘడియలైనా సమయముందిలే అంటూ అతి కష్టం మీద నవ్వాపుకునే ప్రయత్నం చేసాయి. నేనడిగానా మిమ్మల్నా సంగతి.. అంటూ ఎర్రగా వాటికేసి చూసి చివాలున లేచి పడగ్గదిలోంచి బయటికి నడిచాను. నా వెనకే గుబురుగా అల్లుకున్న సన్నజాజి తీగ ఆకులన్నీ పకపకా నవ్వుతున్న సవ్వడి చెవిన పడినా విననట్టు నటించాను. అబ్బా.. పట్టరాని ఉక్రోషం.. ఎవరి మీదా.. నన్ను చూసి నవ్విన జాజి కొమ్మ మీదా.. నాకీ పాట్లు తెచ్చిపెట్టిన నీ మీదా.. ఏమో అట్టే తేల్చుకోలేకపోతున్నా..

ఉహూ.. ఇలాక్కాదని చెప్పి ఇంటి ముందు సింహద్వారం పక్కనే ఉన్న ఉయ్యాల బల్ల మీద పుస్తకం చేత పట్టుక్కూర్చున్నా. రోజూ తమ వెంట పరుగులు తీసే కళ్ళు వేళ బద్ధకంగా కదలకపోడం చూసి చిన్నబుచ్చుకున్న అక్షరాలు బారులు తీరి నించుని మా పట్ల నీకీ ఉపేక్ష తగునా అన్నట్టు.. దీనంగా నాకేసి చూస్తున్నాయి. అయినా లాభం లేకపోయేసరికి అంతటితో ఊరుకోకుండా బలవంతంగానైనా నన్ను తమ వెంట లాక్కెళ్ళడానికి నానా తంటాలూ పడసాగాయి. ఉహూ.. ఎక్కడా.. అసలు చోటైనా రెప్పలు క్షణమైనా నిలవందే.. అంతులేని ఆరాటాన్ని నిలువెల్లా నింపుకుని మరింకేం పట్టనట్టు పదే పదే వాకిటి వైపే తొంగి తొంగి చూస్తున్నాయి. ఎంతసేపైనా ఇదే తంతు అయ్యేసరికి ఇహ అక్షరాల గోల పడలేననుకుని చప్పున మొహం తిప్పేసుకుని నిర్దాక్షిణ్యంగా పుస్తకం నోరు నొక్కేసి పక్కన పడేసాను. హమ్మయ్యా.. ఇంక నా కళ్ళకి అడ్డం పడే వాళ్ళెవరూ లేరు సుమా.. అని నిశ్చింతగా వాకిలికి కళ్ళప్పగించేశాను.

ఉయ్యాల ఊగనా వద్దా అన్నట్టు మెల్లగా కదులుతోంది అట్టే గడవని నిమిషాల్లాగే! అబ్బా.. ఏం చేసైనా కాలాన్ని తొందరపెట్టి ముందుకి పద పదమని అదిలించలేం కదాని.. అదో అసహనం తోడై అస్సలు ఉన్న చోట ఉండనివ్వడం లేదు నన్ను. ఎవర్ని విసుక్కోవాలో తెలీని అయోమయంలో సారికి ఉయ్యాల మీద అలిగేసి ఒక్క ఉదుటున తన ఒడిలో నుంచి బయట పడ్డాను. కాసేపు తోటలోని మొక్కల మధ్యన తిరుగుదామని బయలుదేరాను. మధ్యన నువ్వు నాకోసం తెచ్చిన చెంగావి రంగు మందార కొమ్మ అప్పుడే వేళ్ళూనుకోడమే కాకుండా చిరుమొగ్గ తొడిగి ఎంత వయ్యారాలు పోతోందో.. మందారం మోమున ఒలికిపోతున్న ముగ్ధత్వాన్ని చూడగానే అందాకా ఉన్న విసుగు మాయమై పెదవులు విచ్చుకున్నాయి. నాలుగు రోజుల నుంచీ ముద్దుగా కనువిందు చేస్తున్న ఎర్ర గులాబీని తాకీ తాకగానే పూరేకులన్నీ జలజలా రాలి నా పాదాల్ని తడిపేసాయి. వాటన్నిటినీ ఆప్యాయంగా దోసిట్లోకి ఎత్తుకొచ్చి ఉయ్యాల బల్ల మీద వదిలొచ్చిన పుస్తకం గుండెల్లో భద్రంగా దాచేసాను. జాజుల మీద అలిగొచ్చిన ఉక్రోషంతో మల్లె పందిరి చుట్టూ రోజుటి కన్నా మరింత మురిపెంగా ప్రదక్షిణాలు చేసి మొగ్గ మొగ్గనీ పలకరించి ఇవాళ మా ఊసులు వినే భాగ్యం అచ్చంగా మీకే రాసిచ్చేస్తున్నానంటే సంబరంగా నవ్వాయి. పక్కనే తులసి కోటలో కొలువు దీరిన తులసి కొమ్మ నన్ను చూసి నిండుగా నవ్వేసరికి సిగ్గు ముంచుకొచ్చేసింది. నేను ఇంట్లోకి పరుగు తీయబోతూ వెనుదిరిగేసరికి వాకిట్లో నువ్వు!

అప్పటి నుంచీ నేను నీ కోసమే.. నువ్వొస్తావని ఎదురు చూసీ చూసీ.. అరే.. నువ్వొచ్చేసావే! కానీ.... ఏం చెప్పనూ.. చెప్పడానికేం లేదే నా దగ్గర. ఎందుకింతసేపు ఆరాటపడిపోయానో నాకే తెలీడం లేదు. ఇంతసేపూ హద్దూ పద్దూ లేనట్టు అమాంతం రెక్కలు సాచి నింగిలో గువ్వల్లా ఎగిరిన అల్లరి ఊహలన్నీ నువ్వు ఎదుట పడగానే పంజరంలో రామచిలుక మాదిరి బుద్ధిగా గుండె లోలోపలి అరల్లో పదిలంగా ఒదిగిపోయాయి. ఇంతసేపూ నీతో చెప్పాలని రాసులుగా పోసిన చిలిపి ఊసులన్నీ కనుబొమ్మలు అల్లిన సిగ్గు తెరల మాటుకి పారిపోతూ నన్ను ఒంటరిగా నీ చేతికప్పగించేసి పక్కకి తప్పుకున్నాయి. ముందస్తు హెచ్చరిక లేకుండా ఎగిరొచ్చిన వాన సనసన్నటి చినుకులు రాలుస్తోంది. ఉన్నట్టుండి తరుముకొచ్చిన తడబాటుతో బొమ్మలా నించుండిపోయిన నన్ను లాలనగా చేరదీసి పసిడి బుగ్గల్లో ఎర్రెర్రని సిగ్గుల తాంబూలం పండిస్తున్న గోరువెచ్చని గిలిగింత చినుకులదా, నీదా.. కన్నా!

29 comments:

ఫోటాన్ said...

Nice :)

శ్రీ said...

అక్షరాల వెంట...
భావాలవెంట...
కళ్ళను పరుగులు తీయించాలంటే..
మీ తరవాతే..చాలా బాగుంది మధురవాణి గారూ!
@శ్రీ

పద్మవల్లి said...

:-)

Anonymous said...

చాలా బావుంది మధురగారు.నేను చాలా రోజులనుండి మీ బ్లాగు అనుసరిస్తున్నాను మరియు మీ టపాలను ఆనందిస్తున్నాను. కానీ ఎప్పుడూ కామెంటడానికి బద్దకమో మరేమో అంతగా ధ్యాస పెట్టలేదు. కానీ ఈ రొజు మీ పోస్టులో ఈ క్రింది రెండు వాక్యాలు నన్ను కామెంటకుండా ఆగనీయలేదు. అవి...
"నాలుగు రోజుల నుంచీ ముద్దుగా కనువిందు చేస్తున్న ఎర్ర గులాబీని తాకీ తాకగానే పూరేకులన్నీ జలజలా రాలి నా పాదాల్ని తడిపేసాయి."
"రోజూ తమ వెంట పరుగులు తీసే కళ్ళు ఈ వేళ బద్ధకంగా కదలకపోడం చూసి చిన్నబుచ్చుకున్న అక్షరాలు బారులు తీరి నించుని మా పట్ల నీకీ ఉపేక్ష తగునా అన్నట్టు.. దీనంగా నాకేసి చూస్తున్నాయి."
I enjoyed the subtle love and feelings of the girl. God bless you.

Thanks & Regards,
Sridevi.

Unknown said...

మధురంగా రాయటంలో మీకు మీరే సాటి అని మరోమారు నిరూపించారు.
ఎన్నెన్ని భావాలు...ఎంతెంత అందంగా చెప్పారో...
ఉదాహరణకి ..."చిలిపి ఊసులన్నీ కనుబొమ్మలు అల్లిన సిగ్గు తెరల మాటుకి పారిపోతూ ...." వహ్! Simply Superb!

Ramani Rao said...

చాలా బాగుంది మధుర...

జ్యోతిర్మయి said...

వేసవి సాయంత్రం మల్లెల పరిమళంలా మధురంగా వుంది...

Prasanna said...

very nice:)

చిలమకూరు విజయమోహన్ said...

Nice!

Unknown said...

ప్రకృతిని,ఊహలని కలబోసి అక్షరాలలో నాట్యం చేపించటం, ఆ ఊహ నిజమేమో అన్నట్లు అనిపించింది ఒక్క క్షణం.

ఆహ్లాదం గా ఉంది చదువుతుటే.

అభినందనలు మధుర గారు.

ఇందు said...

wowwww so cute madhu :)

చాణక్య said...

ఆడపిల్ల మనసు తెలుసుకోవాలంటే మీవి, కొత్తావకాయగారివి పోస్టులే చదవాలండీ! కానీ ఎవరి శైలి వారిదే మళ్లీనూ! ఎంత చక్కగా పదాల్లో పరిచేస్తారో! మీకు మీరే సాటి అమ్మాయిగారు. :)

Ennela said...

suparOOOOOOOOOOOOOOOOOOOO!!!!

హను said...

chala baga chepparu... too gud

మధురవాణి said...

@ ఫోటాన్, Ramani Rachapudi, ప్రసన్న, చిలమకూరు విజయమోహన్, ఎన్నెల, హను..
అభినందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)

@ శ్రీ,
గొప్ప ప్రశంస.. ధన్యవాదాలండీ.. :)

@ పద్మవల్లి,
:-)

@ శ్రీదేవి,
మిమ్మల్నిలా కలుసుకోవడం బాగుందండీ.. నా బ్లాగు రాతలు మిమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీలు చేసుకుని వచ్చి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ చిన్ని ఆశ, జ్యోతిర్మయి,
మీ స్పందన, నిరంతర ప్రోత్సాహం కూడా అంతే మధురంగా ఉంటాయండీ.. మనఃపూర్వక ధన్యవాదాలు. :)

@ శేఖర్,
ప్రకృతినీ, ప్రేమనీ.. ఊహల్నీ, ఊసుల్నీ విడదీసి చూడలేను మరి.. రెండీటి కలబోతలోనే అసలైన అందం, ఆనందం ఉన్నాయి.
స్పందించినందుకు ధన్యవాదాలు.:)

@ ఇందు,
థాంక్యూ సో మచ్ డియర్.. :)

@ చాణక్య,
చాలా పెద్ద ప్రశంస ఇచ్చేసారండీ పాపాయి గారూ..
కొత్తావకాయ గారి రాతలతో నా అక్షరాల్ని పోల్చడం గొప్ప గౌరవంగా భావిస్తాను. బోల్డు ధన్యవాదాలు. :)

Unknown said...

పొరపాటున ఈబ్లాగుకి వచ్చానండి బాబూ....
అంతే ఇక అతుక్కుపోయాను.
పొద్దున్న నుంచి బ్లాగు మొత్తం చదవకుండా ఉండలేక పోయాను..
అసలు ఇంత మంచి బ్లాగ్ ఇప్పటివరకు ఎందుకు మిస్ అయ్యానో???
మీ రచన శైలికి అందుకోండి నా అభినందనలు......................

Anonymous said...

Thank you andi...naaku kooda chaalaa santoshamga vundandi mimmalni ila kalusukovadam and thank you so much for replying to my comment.Nenu FBlo meeku friend request pampinchaanu. Pls accept chesthaaraa? Chaalaa sarlu mee blog ki vachhi kotha post raasaaremo ani vedukkuntoo vuntaanu.:)

Thank You.
Sridevi.

మధురవాణి said...

@ Bala Sekhar Dasari,
హహ్హహ్హా భలేవారే.. That's great compliment. Thank you. నా ప్రపంచంలోకి స్వాగతం. :)

@ శ్రీదేవి,
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి. you are most welcome. I accepted your friend request on Facebook. :)

oddula ravisekhar said...

మీ వర్ణన ఎంతో సహజంగా, సరళంగా చల్లని పిల్ల తెమ్మెరలా ,హృద్యంగా సాగింది.అందమైఅన అమ్మాయి తాలూకు ఊహల్ని ఎంత అందంగా వ్యక్తీకరించారు.

సవ్వడి said...

chanakya gaari commente nadi kudaa..

మధురవాణి said...

@ oddula ravisekhar,
చాలా సంతోషమైందండీ మీ వ్యాఖ్య చూసి.. బోల్డు ధన్యవాదాలు. :)

@ సవ్వడి,
థాంక్యూ! :)

Santosh Reddy said...

మధుర......
చాల రోజుల తరువాత మీ బ్లాగ్ దర్శనం....
కాని ఎప్పటిలానే ఒలికిన అక్షరాల దొంతెరలో నుంచి...
ఏర్చి కూర్చిన మీ మది భావాల హారం .....ఎంతో మధురం......!!!

మధురవాణి said...

@ SantoshReddy,
మీ అభిమానానికీ, ప్రశంసకీ బోల్డు ధన్యవాదాలండీ.. :)

Ramakrishna said...

nice :)

మధురవాణి said...

@ Ramakrishna,
Thanks! :)

ధాత్రి said...

గులాబీల తోటలో ఒక మంచి మంచు ఉషోదయంలా ఉంది..
చదివిన తర్వాత ఒక 'మధురా'నుభూతి..:)

Priya said...

Wowwwwwwwwwww........... :)

మధురవాణి said...

@ ధాత్రి,
మంచు ఉషోదయానికీ, మధురానుభూతికీ సంతోషం.. ధన్యవాదాలు.. :)

@ ప్రియ,
Thank youuuuu.. :)