Sunday, January 22, 2012

నీ ప్రేమలో.. నిన్నా, నేడు!

నేను నిన్ను ప్రేమించాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమించాను. నా ప్రాణ సమానంగా ప్రేమించాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమించాను.

నీ మాటా, నవ్వూ, నడకా, చూపూ, అలక, బెట్టు, పొగరు, కోపం, చిరాకు, విసుగు, తిట్లూ, బుజ్జగింపులూ, మెచ్చుకోలు... ఇలా నీ నుంచి నా వైపు వచ్చే ప్రతీదీ అపురూపంగానే కనిపించేది నా కళ్ళకీ మనసుకీ కూడా!

నీ ఇష్టాలూ, అభిరుచులూ, కోరికలూ.. నువ్వేదంటే అదే నాక్కూడా నచ్చేది. నీకు నచ్చే రంగులూ, నీకు నచ్చే సినిమాలూ, నీకు నచ్చే మనుషులూ.. ఇలా ప్రతీదీ నీ ఇష్టంలోనే నా సంతోషం ఉండేది. "తీపిని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. ఒకసారి తిని చూడు.. తియ్యగా ఎంత బాగుంటుందో.." అన్న నీ ఒక్క మాటకి ఎప్పుడూ లేనిది అమాంతంగా మిఠాయిల మీద ఇష్టం వచ్చేసింది నాకు. నిజంగా అవెంత అందమైన రోజులు!

ప్రతీ క్షణం నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానన్న ఆలోచన తప్ప అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను అన్న ప్రశ్నే ఎప్పుడూ తోచలేదు. నువ్వంటే ఇష్టం.. నీతోనే నా లోకం.. అంతే! నీతో ప్రేమలో ఉన్నానన్న భావన జీవితాన్ని ప్రతీ క్షణం జీవిస్తున్నానన్న సంతృప్తిని కలిగించేది. నీ ప్రేమలో నాకు నేను పరిపూర్ణత్వాన్ని పొందినట్టు అనిపించేది.

కాలం రెప్పపాటులో కరిగిపోయింది..

నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఇంకోలా ఎందుకు లేవు, నిన్నలా మొన్నలా రోజెందుకు లేవని నిన్ను నిలదీశాను. అలా ఎందుకు లేవని నాలో నేనే బెంగ పెట్టుకుని క్రుంగిపోయాను. నేను నిన్ను ఎందుకు ప్రేమించాను, అసలు నిన్నెందుకు నేను ప్రేమించాలి, నువ్వు నాకు నచ్చినట్టు ఎందుకు ఉండట్లేదు, ఇప్పుడు నువ్విలా ఉంటే నాకు నచ్చట్లేదు.. అంటూ నిన్ను పదే పదే విసిగించాను, నొప్పించాను.

నాకు తెలీకుండానే నాలో నీ మీద ప్రేమ స్థానంలో కోపాలూ, పంతాలూ, సందేహాలూ వచ్చి చేరిపోయాయి. ఒకప్పుడు నాలో మొత్తంగా నిండిపోయిన నీ మీద ప్రేమ ఎక్కడికి పోయింది? ఎంతగా వెతికి చూసినా రవ్వంతైనా కనిపించడం లేదే? అద్దం ముందు నించుని చూసుకుంటే నా బదులు నువ్వే కనిపించే రోజుల నుంచి.. నాకు నేను కూడా కనిపించకుండా శూన్యంలా మిగిలిపోయిన పరిస్థితుల్లోకి వచ్చి పడ్డాను.

కాలం కదలనని మొండికేసింది..

"నువ్వు మారిపోయావు" అని పదే పదే గొంతు చించుకుని అరుస్తున్న నన్ను నా మనస్సాక్షి నిలదీసి అడుగుతోంది. ఇంతకీ మారింది కేవలం నువ్వేనా.. నేనేం మారనేలేదా? నీలో మార్పుని ప్రశ్నించే ముందు నాలోకి ఒకసారి తొంగి చూడమంటోంది. నిజంగా నేను నిన్ను ప్రేమించడం నిజమైతే నీలో వచ్చిన మార్పుని మాత్రం నేను ప్రేమించనా.. ప్రేమించలేనా?

సరే.. ఒక వేళ కాదు కూడదు అనుకుంటే నిన్ను పూర్తిగా వద్దనుకుని దూరం చేసుకోగలనా? నిజంగా నాక్కావలసింది అదేనా? ఉహూ.. కాదు.. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. నువ్వు అనే ఆలోచన లేని నేను లేనే లేను. నువ్వు లేని నేను నాకే నచ్చను.
మరి అలాంటప్పుడు నాకెందుకింత పంతం.. నా ఆలోచనలకి అనుగుణంగానే నువ్వుండాలని స్వార్ధమా? అసలు నిజమైన ప్రేమున్న చోట స్వార్ధానికి చోటు ఉంటుందా?

నా ప్రేమతో నిన్ను బంధించాలనుకోను. నీ స్వేచ్ఛని గౌరవిస్తాను. నిన్ను నిన్నుగా ప్రేమిస్తాను. నీలోని మార్పునీ, నీ ఇష్టాల్నీ, అయిష్టాల్నీ ప్రేమిస్తాను. నీలో ఉన్న లోపాల్ని, బలహీనతల్ని కూడా ఇష్టంగా ప్రేమిస్తాను.

నేను నిన్ను ప్రేమిస్తాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తాను. నా ప్రాణ సమానంగా ప్రేమిస్తాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమిస్తాను.

నా కళ్ళల్లో నువ్వొచ్చి చేరిపోయావు.. నా మనసు తేలికైపోయి కేరింతలు కొడుతూ మబ్బుల దాకా ఎగురుతోంది.. నా చుట్టూ ఉన్న చెట్టూ పుట్టా, పక్షీ, నింగీ, నేలా నాతో కలిసి నవ్వుతున్నాయి.

అంతదాకా ఆగిపోయిన కాలం మెల్లగా కదలసాగింది.

అవును.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాను. నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను.

నాకు తెలుస్తోంది..
కాలం నా చేతికి చిక్కనంత వేగంగా పరుగులు తీస్తోంది..!

20 comments:

Anonymous said...

Hi, Very nice...guess me..

Lasya Ramakrishna said...

ప్రేమ గురించి చాలా బాగా చెప్పారండి.

శశి కళ said...

avatala vyakhti ni tanani tanalaage preminchagaligede nijamaina prema...very nice and real love

Sravya V said...

Déjà vu Déjà vu

మధురవాణి said...

శ్రావ్య కనిపెట్టేసారు.. కనిపెట్టేసారు.. :P

Unknown said...

ప్రేమలో మది చేసే మాటల సవ్వడి చక్కగా వెలికి తీశారు.
ఒకప్పుడు పరిగెత్తే కాలం హఠాత్తుగా ఆగిపోతుంది, మళ్ళీ మెల్లిగా కదులుతుంది, చివరికి పరుగులు తీస్తుంది...ఇలా కాలంతో పోటేఅ పడుతూ గెలవటం, ఓడిపోవటం, మళ్ళీ గెలవటం ఒక్క ప్రేమకే సాధ్యం ఈ లోకంలో...
ఎప్పటిలానే మీ శైలి అద్భుతం :)

శేఖర్ (Sekhar) said...

Deja vu ... nice write up

శోభ said...

Super Madhura....

ఫోటాన్ said...

మీ రచనలు, కవితలు హృదయంతరాలను స్పృసిస్తాయి. చాలా బాగుంది.. :))

Kranthi M said...

అపుడెపుడో ఆగిపోయింది నువ్వెళ్ళినప్పుడు, మళ్ళీ నువ్వొస్తేనే కదులుతుందేమో - నువ్వున్నప్పుడు రెప్పపాటులో కరిగిపోయిన అదే నా 'జీవితకాలం'.

ఈ టపా చదివాక నా మనసులో మొలకెత్తిన విత్తనం.మీ టపాతో ఎంత వరకు సంబంధం ఉందో తెలీకపోయినా ఇది చదివినప్పుడు కలిగిన భావం కనుక ఇక్కడ కూడా ఉంచుతున్నాను.

హరే కృష్ణ said...

కాలం నా చేతికి చిక్కనంత వేగంగా పరుగులు తీస్తోంది..!
Superb!

మధురవాణి said...

@ అనానిమస్,
థాంక్సండీ.. అస్సలేం క్లూ లేకుండా మీరెవరో గెస్ చెయ్యడం కష్టమండీ.. :)

@ లాస్య గారూ,
ధన్యవాదాలండీ..

@ శశి గారూ,
బాగా చెప్పారు. ధన్యవాదాలు. :)

@ చిన్నిఆశ,
ప్రేమ గురించి మీరు చెప్పింది బావుంది. ఎప్పట్లాగే మీ వ్యాఖ్య బోల్డు సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ శేఖర్,
Deja vu.. Yes it is! Thank you :)

@ శోభ, హరే కృష్ణ,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

@ ఫోటాన్,
మీ స్పందన చూసి చాలా సంతోషమయిందండీ.. ధన్యవాదాలు. :)

@ క్రాంతి కుమార్ మలినేని,
టపాకి సంబంధం లేకపోడమేంటండీ కవి గారూ.. నేను అన్నేసి వాక్యాల్లో చెప్పిన భావాన్ని మీరు చాలా సులువుగా ఒకే వాక్యంలో తేల్చేస్తేనూ.. ధన్యవాదాలు. :)

Anonymous said...

మధురవాణి గారు,
మీరు ఈ టపాను ఆలోచించి రాశారో, ప్రేమ భావనను అనుభవించి రాశారో లేక అలవోకగా రాశారో, తెలియదుగాని చదివితే అద్భుతంగా ఉంది.

SriRam

కెక్యూబ్ వర్మ said...

బాగుందండీ..

మధురవాణి said...

@ శ్రీరామ్,
నేను రాసింది మీకంతగా నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు.
ఇంకా ఎలా రాశానన్న మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే.. కొంచెం ఆలోచన, కొంచెం అనుభవం, కాసింత అనుభూతి, మరి కొంత ఊహ.. అన్నీటి కలబోతే నేను చెప్పే ఊసులు.. :)

@ కెక్యూబ్ వర్మ,
ధన్యవాదాలండీ.. :)

Unknown said...

Very nice...

మధురవాణి said...

@ మామిడికాయ,
ధన్యవాదాలండీ.. :)

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

..చాలా బాగా చేప్పారు.. ఏదో నేనే ఏవరికి చెబుతున్నట్టు నా జీవిత సత్యంలాగు ఉంది..సుపర్

మధురవాణి said...

@ నేనేవరో మీకు తెలుసా,
ధన్యవాదాలండీ.. :)