Tuesday, January 03, 2012

నా చంద్రుడు!

నా మనోహరుని దర్శన భాగ్యం కోసం మేనంతా కన్నులు చేసుకుని నెల్లాళ్ళ నుంచీ నిరీక్షిస్తున్నాను..
నెలపొడుపు నాటి నుంచీ రోజూ కాసిన్ని వెన్నెలముద్దలు ఒంటబట్టించుకుంటూ నిండుగా ఎదుగుతున్నాడు..
తీరా పున్నమి శుభఘడియలు దగ్గర పడే సమయానికి ఆకాశాన్నంతా కరి మబ్బులు దోచేసాయి..
వానా వానా వెళ్ళిపోవే నా మావని మింగెయ్యమాకే.. అని బుజ్జగిస్తూ మాటిమాటికీ పెరట్లోకి తొంగి చూస్తున్నా..
బంగారు వాన.. బుద్ధిగా నా మాట విని ఈ వేళకి ప్రయాణం మానుకుని మబ్బు పరదాల చాటుకెళ్ళిపోయింది..
ఎదురుచూపులకి స్వస్తి పలుకుతూ కొబ్బరాకుల సందుల్లోంచి సనసన్నగా ఒలికిపోతున్న వెన్నెల నవ్వులు..
మా చూపులు కలిసే లోపే మధ్యన అడ్డుతెర పడుతూ గాలి తెమ్మెర, కొబ్బరాకుల గిల్లికజ్జాలాటలు..
అబ్బబ్బా వీళ్ళ పోట్లాట ఎప్పటికీ తెమిలేనూ.. నిత్యం ఉండే తంతేగా ఇది అని ఉసూరుమంటుండగా...
మబ్బుల పల్లకి ఎక్కి ఆకాశంలో పైపైకి తేలియాడుతూ.. నా కళ్ళల్లో వెన్నెల పంట పండిస్తూ..
రెండు చేతులూ సాచి తన కౌముది కౌగిట్లో ఒదిగిపొమ్మంటూ నాకై అరుదెంచే.. నా చంద్రుడు!

* సుజ్జీ కోసం! :)

14 comments:

జ్యోతిర్మయి said...

కలువ మనసులో మాట చెప్పేశారు...

Anonymous said...

మామ తలపే మధురం.

వేణూశ్రీకాంత్ said...

బాగుంది :-) గాలితెమ్మెర కొబ్బరాకుల గిల్లికజ్జాలాటలు మరీ బాగున్నాయ్ :-)

♛ ప్రిన్స్ ♛ said...

hmm nice

హరే కృష్ణ said...

Nice :)
సరేనండీ చందమామ మీదే ఒప్పుకొంటూన్నామ్ .. ఇకమీద చందమామ మీద ఫ్లాట్ కొనాలంటే సుజ్జీ ని సంప్రదించగలరు :P

సుజాత వేల్పూరి said...

వెన్నెల్లో మడత మంచం మీద కూచుని వేడి వేడి పాలన్నం తింటున్నట్టుంది...ప్రపంచంలోని హాయంతా మనసులోనే ఉన్నట్టుగా!

Unknown said...

ఎప్పట్లానే మళ్ళీ మధురం...మీ శైలి అద్భుతం...ఏది రాసినా అక్షరాలా భావాన్ని అందంగానూ పండించగలరు...Hats off!

Sravya V said...

భలే ఉంది మధుర మీ ఊహ !

రాజ్ కుమార్ said...

బాగుందండీ..నాకో డౌట్.. అడగమంటారా? ;)

Unknown said...

"నెలపొడుపు నాటి నుంచీ రోజూ కాసిన్ని వెన్నెలముద్దలు ఒంటబట్టించుకుంటూ నిండుగా ఎదుగుతున్నాడు.."
భలే ఉంది మీ ఊహ మధుర గారూ

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
అంతేనంటారా! ధన్యవాదాలు. :)

@ కష్టేఫలే,
నిజం చెప్పారు శర్మ గారూ.. అంతే కదా మరి.. అందరికీ ముద్దుల మామ చందమామ! :)

@ వేణూ శ్రీకాంత్,
థాంక్స్ వేణూ.. అంతే అంతేలే.. ఎవరైనా గిల్లికజ్జాలాడుకుంటుంటే చూసేవాళ్ళకి వినోదమే కదూ! ;)

@ తెలుగు పాటలు,
ధన్యవాదాలండీ..

మధురవాణి said...

@ హరేకృష్ణ,
థాంక్స్.. :)
ఓహో.. అలాగైతే ఈ పోస్ట్ రాసినందుకు అందరి కంటే ముందు సుజ్జీ నా కోసం చందమామ మీద ఒక ఫ్లాట్ రాసివ్వాలని మనవి చేసుకుంటున్నాను. .. :D

@ సుజాత గారూ,
అయితే మీకంత అందమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసానా.. ధన్యోస్మి! :)

@ వెన్నెల్లో మడత మంచం మీద కూచుని వేడి వేడి పాలన్నం తింటున్నట్టుంది...ప్రపంచంలోని హాయంతా మనసులోనే ఉన్నట్టుగా!

@ చిన్ని ఆశ,
ఎప్పట్లానే మధురం మీ స్పందన.. మీ అభిమానానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. :)

@ శ్రావ్యా,
అవునా.. థాంక్యూ థాంక్యూ! :)

మధురవాణి said...

@ రాజ్ కుమార్,
థాంక్స్! ఇంతకీ మీ సందేహం తీరినట్టేనా? ;) లేకపోతే మళ్ళీ అడగొచ్చు. :))

@ genialsandeep,
మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు. :)
నా బ్లాగుకి కొత్తగా విచ్చేసినట్టున్నారు కదూ.. సుస్వాగతం! :)

Unknown said...

థాంక్యూ మధురవాణి గారూ..:)