నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎంతటి పనిమంతురాలినో ఇదివరకే చెప్పానుగా! ఆ దొండకాయల ప్రహసనం జరిగినప్పుడు నాకు పదకొండేళ్ళు, ఎనిమిదో తరగతిలో ఉన్నా. ఆ తరవాత తొమ్మిదో తరగతిలోకొచ్చాక ఒక రోజు నాకో చిత్రమైన కోరిక పుట్టింది. ఎలా అయినా సరే నేనే స్వయంగా ఒక కూర చేసేసి ఇంట్లో అందరి చేతా వాహ్వా వాహ్వా అనిపించుకోవాలి అని. అలా అనుకున్నదే తడవుగా మా అమ్మ దగ్గరికెళ్ళి నా కోరిక గురించి చెప్పాను. "ఎందుకులేమ్మా.. ఇప్పుడేదో రోజులు బాగానే గడుస్తున్నాయి. ఏదో నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. నువ్వు వంట చేయడం ఎందుకులే! పైగా రాజు గారి హుకుం ఒకటి ఉందిగా" అంటూ నన్ను వారించే ప్రయత్నం చేసింది. కానీ, మండే సూర్యుడిని ఎవరూ అరచేతితో ఆపలేరన్నట్టు వంట చేయాలనే నా తృష్ణని మా అమ్మ ఆపలేకపోయింది. నేను చేసి తీరాల్సిందే అని పట్టుబట్టడం వల్ల నా ధృడసంకల్పాన్ని సహృదయంతో అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చివరికి సరే అంది. అప్పుడు ఏం కూర చెయ్యాలా అని ఒక రెండ్రోజులు పగలనకా రాత్రనకా తీవ్రంగా ఆలోచించగా చించగా ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఏదో కూర చేయడం ఎందుకు.. అదేదో నాకిష్టమైన బెండకాయ కూర చేస్తే పోలా.. అని.
సరే.. ఇంక అప్పుడు 'బెండకాయ కూర ప్రాజెక్టు' మొదలెట్టాను. అమ్మ వెళ్లి బెండకాయలు కొనుక్కొచ్చి ఇస్తానంది. ఏవీ అక్కర్లేదు.. నేనే స్వయంగా కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను. మళ్ళీ తరవాత నువ్వే సగం పని చేసావని సగం క్రెడిట్ నీకొచ్చేస్తుంది. కాబట్టి అలా ఒప్పుకోనని చెప్పా. "సర్లే అయితే, లేత బెండకాయలు అరకిలో తీసుకురా.. చివరలు విరిచి చూడు.." అంటూ ఎలా ఎంచుకోవాలో చెప్పింది అమ్మ. అసలే ఏకసంథాగ్రాహిని కదా.. అమ్మ చెప్పినట్టు తు.చ తప్పకుండా పాటించి కేవలం ఒక గంట సేపట్లోనే అరకిలో లేత బెండకాయలు ఎంచుకుని తీస్కొచ్చుకున్నా! ఇంటికి రాగానే అమ్మ అంది "బెండకాయలు కొనుక్కొచ్చావా.. లేకపోతే స్వయంగా సాగు చేసి పండించి తెచ్చావా.." అని. కానీ, గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళందరినీ ప్రజలు ఇలాగే అంటుంటారు కాబట్టి ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని సర్ది చెప్పుకుని నా పనిలో నేను నిమగ్నమయ్యాను. నేను బెండకాయలు ఎలా కోసాను అనే అంకం మీకిప్పుడు వివరించబోవట్లేదు ఎందుకంటే, నేను కూరగాయలు కోసే టెక్నిక్ ని మీరు ఇదివరకే తెలుసుకుని ఉన్నారు కాబట్టి.
అలాగే పాపం ఏడుస్తూ ఏడుస్తూ ఉల్లిపాయ కూడా తరిగాను.
పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ సిద్దం చేసుకున్నాను. అమ్మ పక్కన నించుని చూస్తాను అంది. ఆహా..ఆశ దోశ అప్పడం.. అదేం కుదరదు.. నా ఫార్ములా కాపీ కొట్టేసి రేపటినుంచి నువ్వు ప్రపంచ ప్రసిద్ధ కుక్ వి అయిపోదామనేగా! నో.. కుదరదు అని ఖరాఖండీగా చెప్పేసి వంటగది గుమ్మం దాటి లోపలికి రానీలేదు. మనలో మన మాట... అసలు కాపీ కొట్టింది నేను. రోజూ అమ్మ చేస్తుంటే పక్కన తిరుగుతూ చూసి నేర్చుకున్న ఫార్ములానే నేను ఫాలో అయింది కూడా! ష్.. యీ మాట ఎక్కడా లీక్ చేయకండి.
ఒక్కటి కూడా మర్చిపోకుండా అవసరమైనవన్నీ వేసి ప్రతీ క్షణం కలియబెడుతూ మొత్తానికి కూర పూర్తి చేసాను. ఇంక నాన్న ఎప్పుడొస్తారా అని గేటు దగ్గర నిలబడి కాలు కాలిన పిల్లిలా ఒకటే తిరుగుతూనే ఉన్నాను. " ఇవ్వాళ నువ్వు వంట చేసావని గేటు దగ్గరున్నప్పుడే తెలుసుకోలేరు కదా మీ నాన్న. కాబట్టి, అక్కడి దాకా వచ్చినాయన ఇంట్లోకి రాకుండా వెనక్కి పారిపోయే అవకాశం లేదు గానీ నువ్వు లోపలి రా" అంటూ అమ్మ పిల్చినా గానీ కోపంగా ఓ చూపు చూసి మళ్ళీ గేటు దగ్గర పచార్లు చేయడం కొనసాగించాను. మొత్తానికి ఎప్పటికో నాన్నొచ్చారు. గేటు దగ్గరినుంచే నేనెంత కష్టపడి బెండకాయ కూర చేసానో హరికథ వినిపించేశాను. నిజానికి మా నాన్నకి బెండకాయ కూరంటే పెద్దగా ఇష్టముండదు. కానీ, ఆ రోజు నేను చేశాను కాబట్టి "ఆహహా..అబ్బో.. ఏం రుచి ఏం రుచి.. అమోఘం.. అద్భుతం.. అమృతంలా ఉంది. అసలు నా బిడ్డ ఎంత రుచిగా చేసింది కూర. ఇన్నేళ్లల్లో నువ్వెప్పుడైనా ఇలా చేసావా అసలు.. నా కూతురి దగ్గర నువ్వు ట్రైనింగ్ తీస్కోవాలి.." అంటూ అమ్మతో చెప్తూ నన్ను తెగ పొగిడేశారు నాన్న. దానికి అమ్మేమో " నిజమే.. అందుకే రేపటి నుంచి మీ రాకుమారి వంట చేసి పెడుతుంది.. మీరు తిని పెట్టండి. నేను ఊరికే కూర్చుని ప్రేక్షకురాలిలాగా చూస్తూ ఉంటాను" అంది. నాన్నలా పొగిడేసరికి నేను దాదాపు మేఘాల దాకా వెళ్లి కాసేపు ఆకాశ విహారం చేసి మళ్ళీ భూమ్మీదకొచ్చాను. "నిజంగా బాగుందా నాన్నా.. నిజంగా బాగా చేశానా.." అని ఓ వంద సార్లన్నా అడిగుంటాను ఆ రోజు. చాలాసేపటి తరవాత నాన్న " నిజంగా బ్రహ్మాండంగా చేశావమ్మా.. అద్భుతం అనుకో.. కాకపోతే ఓ చిన్నమాట! ఇప్పుడు మనం అన్నం తిన్నాక మనింట్లో వాళ్ళందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించు ఈసారి. సరేనా! అప్పుడింకా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నీ వంటకి తిరుగే లేదింక.." అన్నారు.
ఇది జరిగిన కొన్నాళ్ళ తరువాత ఒక రోజు సాయంత్రం నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలి అమ్మా, నాన్నా ఇద్దరూ కలిసి సరుకులు తీసుకురావడానికి పక్కనుండే టౌనుకి వెళ్ళారు. వెళ్లేముందే నా కోసం అన్నం, కూర సిద్ధం చేసి వెళ్ళింది అమ్మ. ఆ రోజు గురువారం కాబట్టి వాళ్ళిద్దరూ అన్నం తినకుండా ఏదో ఒక టిఫిను తింటారు. తిరిగొచ్చాక ఏదోకటి చేస్కోవచ్చులే అనుకుని వాళ్ళు బజారుకి వెళ్ళిపోయారు.అప్పుడే నాకో మహత్తరమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే.. నా పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించడానికి ఇదే సదవకాశం అని. వాళ్ళకోసం ఏం టిఫిను చేద్దామా అని ఆలోచించాను. ఇడ్లీలు, దోసెలు ఎలాగూ ఇప్పటికిప్పుడు చేయలేను, పూరీలు, చపాతీల్లాంటివి చేయడం మరీ రిస్కు. అందుకని బాగా ఆలోచించి ఉప్మా చేద్దామని డిసైడైపోయా. వంటగదిలో కెళ్ళి చూడగానే ఉప్మారవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం.. మొదలైనవన్నీ తేలికగానే దొరికేసాయి. ఇంకేముందీ.. అమ్మ చేస్తుంటే చూసిన అనుభవాన్ని ఉపయోగించుకుని చిటికెలో (అంటే ఓ అరగంటనుకోండి) ఉప్మా చేసేసా!
అమ్మావాళ్ళు బజారు నుంచి వచ్చీరాగానే నేను ప్లేట్లలో వేడి వేడి ఉప్మా పెట్టిచ్చేసరికి చాలా థ్రిల్లయిపోయారు. వాళ్ళకోసం నేనింత ప్రేమగా చేసిపెట్టానని మా అమ్మకయితే ఉప్మా తినకుండానే కడుపు నిండిపోయింది. అంచేత ఏదో కొంచెం తిన్నాననిపించింది. నాన్న మాత్రం నేనేదో పంచభక్ష్య పరమాన్నాలు వండిపెట్టినంత సంబరపడిపోయి పుత్రికోత్సాహంతో చాలానే తినేశారు. నాన్న నన్నెలా పొగిడారని మళ్ళీ చెప్పక్కర్లేదుగా మీకు! ఆ తరువాత ఓ గంటకి అందరం పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఎప్పట్లాగే యీ ఉప్మా చేయడం అనే ఘనకార్యాన్ని నేనెంత ఇదిగా చేశాను అనే అంశం గురించి కథలు కథలుగా వర్ణిస్తున్నా వాళ్ళిద్దరికీ! ఇంతలో "ఏంటో ఉప్మా మరీ ఎక్కువ తిన్నట్టున్నా! కొంచెం కడుపులో మంటగా అనిపిస్తోంది" అన్నారు నాన్న. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా వంటగదిలో ఏ వస్తువుని ఎక్కడి నుంచి దొరకబుచ్చుకున్నాను అని వివరంగా చెప్తున్నా అమ్మకి. ఇంతలో అమ్మ గబుక్కున అరిచింది "ఏంటీ.. ఆ సీసాలో ఉన్న రవ్వతో చేశావా ఉప్మా! నాకప్పుడే అనుమానమొచ్చింది ఏంటా ఉప్మా వాసనేదో కొంచెం తేడాగా ఉందని.. అది ఉప్మారవ్వ కాదే తల్లీ.. ఇడ్లీ రవ్వ" అంటూ. అయ్యో.. అందుకేనేమో పాపం నాన్నకి కడుపులో మంట వస్తోంది అనుకున్నాం. అదృష్టం ఏంటంటే, కొంచెం మంచినీళ్ళు తాగి పడుకున్నాక కడుపులో మంట తగ్గిపోయింది. ఇంతకీ ఇందుమూలంగా తెలిసిన తాత్పర్యం ఏమిటయ్యా అంటే... ఇడ్లీ రవ్వతో కూడా ఉప్మా చేసుకోవచ్చు అని. నోట్ దిస్ పాయింట్!
ఆ తరవాత చదువుల కోసం హాస్టళ్ళు పట్టుకు వేలాడటం, వాళ్ళు పెట్టిన గడ్డి తింటూ బతకడం, అడపాదడపా దోశెలు పోయడం, మ్యాగీ నూడుల్స్ చేస్కోడం తప్పించి చేతులు కాల్చుకునే అవసరమూ, అవకాశమూ రెండూ రాలేదు. మళ్ళీ అయిదేళ్ళ క్రితం జర్మనీ వచ్చిన దగ్గర నుంచీ స్వయంపాకం చేస్కోవాల్సిన అవసరమొచ్చి పడింది. ఉద్యోగంతో పాటు అంట్లు తోముకోడం, మార్కెట్ నుంచి సామాన్లు తెచ్చుకోడం, ఇల్లు శుభ్రం చేస్కోడం లాంటి పనులన్నీ నేనే చేస్కోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు నా ఒక్కదాని కోసం వండుకోడమే కాకుండా స్నేహితుల కోసం కూడా రకరకాలు వండిపెడుతూ ఆ ఫోటోలు చూపిస్తే ఇంట్లో అందరూ చాలా ఆశ్చర్యపోతుంటారు. అమ్మకి కూడా కొన్ని కొత్త వంటలు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడూ. ఇంటికెళ్ళినప్పుడు వండిపెడతానంటే మా అమ్మ అసలు ఒప్పుకోదు. అక్కడ రోజూ పని చేసుకోక తప్పదు కదా.. ఇంటికొచ్చినప్పుడు కూడా ఎందుకు. హాయిగా రెస్ట్ తీసుకో అంటుంది. అమ్మప్రేమంటే అదేగా మరి!
కొసమెరుపేంటంటే, ఒకసారి నేను మా అమ్మని అడిగాను. "అమ్మా.. నేనెప్పుడూ మనింట్లో వంట చేయలేదు కదా.. నేర్చుకునే ప్రయత్నం కూడా పెద్దగా చేయలేదు. అలా దేశం కాని దేశం వెళ్ళాక వంట గురించి ఏం ఇబ్బందులు పడతానో అని నీకెప్పుడూ అనిపించలేదా.. చాలామంది స్నేహితుల వాళ్ళ అమ్మలు చాలా గాభరా పడతారు, ట్రైనింగ్ కూడా ఇచ్చి పంపిస్తుంటారు. నువ్వేంటి ఆ విషయం గురించి నాకెప్పుడూ ఏమీ చెప్పలేదు" అని. దానికి మా అమ్మ నవ్వి "నువ్వు దొంగమొహందానివని నాకు తెలుసు. ఎప్పుడూ చెయ్యవు గానీ, నువ్వే పనైనా యిట్టే చేయగలవు. పనిమాలా నీకే పనీ నేర్పించాల్సిన అవసరం లేదని నాకెప్పుడో తెలుసు. అందుకే నేనెప్పుడూ వంట విషయంలో నీ గురించి బెంగ పెట్టుకోలేదు. సలహాలు కూడా ఇవ్వలేదు" అని చెప్పింది. స్వయంగా మా అమ్మే అంత గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాక ఇంక నా పనితనం గురించి... ఎనీ డౌట్స్!?
Wednesday, July 07, 2010
మిస్ 'పనిమంతురాలు' - 2
Tuesday, July 06, 2010
మిస్ 'పనిమంతురాలు'
అదేంటోగానీ నేను చిన్నప్పటి నుంచీ మహా చురుకైన పిల్లని. అంటే చకచకా అన్నీ పనులు చక్కబెట్టడంలో అనుకునేరు. కానే కాదు.. కూర్చుని మాటలు చెప్పడంలో! చిన్నప్పటి నుంచీ స్కూలు, చదువుకి సంబంధించిన విషయాలేవైనా సరే ఎప్పుడూ చురుకే. కానీ, ఇంటి దగ్గరికొచ్చేసరికి మాత్రం.. ప్రతీ దానికీ అమ్మ నామస్మరణమే! స్కూలుకెళ్ళే రోజుల్లో నా దినచర్య ఎలా ఉండేదంటే, పొద్దున్నే తక్కువలో తక్కువ కనీసం ఓ పదిసార్లు మా అమ్మ వచ్చి నన్ను నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. నిద్ర లేపిన ప్రతీసారి సాగరసంగమంలో కమలహాసన్ లా భంగిమ మారుస్తూ మంచంలో ప్రదక్షిణాలు చేయడం నేను చేసే మొదటి పని. "ప్లీజ్ అమ్మా.. ఒక్క ఐదు నిమిషాలాగి మళ్ళీ లేపు" అనే మాటని తారకమంత్రంలా ప్రతీ ఉదయం స్మరిస్తూ ఉండేదాన్ని. నా యీ ప్రహసనం చూసి మా నాన్న గోడ గడియారంలో ఇరవై నిమిషాలు ఫాస్ట్ గా పెట్టారు. అయినా, నేను నా అమోఘమైన తెలివితేటలు ఉపయోగించి ఆ ఇరవై నిమిషాలు లెక్కేసుకునే లేచేదాన్ని. స్కూలు టైముకి సరిగ్గా ఓ అరగంటో, నలభై నిమిషాలో మిగిలి ఉన్నప్పుడు లేచేదాన్ని. ఇంక ఆ తరవాత టూత్ బ్రష్ దగ్గరి నుంచీ స్కూల్ టై, సాక్స్ దాకా అన్నీ అమ్మ అందివాల్సిందే! ఎనిమిది, తొమ్మిది తరగతులకి వచ్చేసరికి పక్కూర్లో ఉన్న స్కూల్లో చేరడం వల్ల రోజూ ఆటోలో వెళ్ళొచ్చేదాన్ని. ఆటో వచ్చే టైముకి చక్కగా రిబ్బన్లతో జడలల్లి, టిఫిను కూడా తినిపించి, లంచ్ డబ్బాతో సహా నన్ను సిద్దంగా ఉంచేది మా అమ్మ. సరిగ్గా ఆటోలో కాలు పెట్టబోయే ముందు "అమ్మా.. మంచినీళ్ళు" అని కేకేసేదాన్ని. అదేంటో తెలీదు కానీ ఎక్కడికన్నా బయటికెళ్ళాలంటే చాలు, సరిగ్గా అప్పుడే దాహమేస్తుంది నాకు. ఇప్పటికీ మా అమ్మ అంటుంది "చిన్నప్పటి నుంచీ యీ అలవాటు పోలేదు నీకు" అని.
అప్పుడప్పుడూ మా అమ్మా, అమ్మమ్మా కొంతమంది అమ్మాయిల గురించి తెగ మెచ్చుకునేవారు. ఎందుకంటే, వాళ్ళందరూ చాలా ఒద్దికగా, పద్దతిగా ఇంటి పనులూ, వంట పనులూ చక్కగా చేయడం, వాళ్ళింట్లో వాళ్లకి సహాయంగా ఉండటం, అన్నీటికంటే ముఖ్యంగా 'అమ్మాయంటే అలా ఉండాలి' అనే సర్టిఫికేటుని అందరి దగ్గరి నుంచీ పొందటం... వగైరా గొప్ప లక్షణాలన్నీ కలిగి ఉండటం వల్ల అలా మెచ్చుకునేవాళ్ళు. అలా మెచ్చుకుని ఊరుకోకుండా, మధ్య మధ్యలో నా మీద పడేవాళ్ళు. "నువ్వూ ఉన్నావ్ ఎందుకూ.. అమ్మాయన్నాక అన్నీ పనులూ చక్కబెట్టే నేర్పరితనం ఉండాలి. రేపు వెళ్ళే ఇంటి దగ్గర 'ఎవరమ్మా నిన్నింత గొప్పగా పెంచిన ఆ మహాతల్లి' అని నీ మొహం మీదే మమ్మల్ని అ(క)డుగుతారు?" అంటూ ఎప్పుడన్నా అన్నారనుకోండి. వెంటనే నేనేం తడుముకోకుండా "అదేంటే అలా అంటారు.. ఎంత మాట ఎంత మాట.. వాళ్ళంతా ఇదిగా అడిగితే మా తల్లి గారు ఫలానా.. మా అమ్మమ్మ గారు ఫలానా.. అని ఆ మాత్రం వివరాలు చెప్పకపోనా ఏంటి?" అని బదులు చెప్పేదాన్ని నేను. వాళ్ళు అప్పుడేమంటారో మీకు తెలుసుగా! ఏముందీ.."ఇలా మాటకి మాట చెప్పమంటే మాత్రం ముందుంటావ్! నువ్వు కూడా కాస్తో కూస్తో పని నేర్చుకోవచ్చుగా" అంటారు.
ఏదో మాటల సందర్భంలో అలా ఓ మాట అంటుంది గానీ, మా అమ్మ ఎప్పుడూ గట్టిగా నువ్వీ పని చెయ్యి అనేది కాదు. ఎలా అంటుంది పాపం నా బద్ధకం గురించి తెలిసి కూడా. ఓసారిలాగే సోఫాకి అతుక్కుని టీవీ చూస్తూ "అమ్మా.. మంచీళ్ళు.." అని కేక పెట్టాను. మా అమ్మకి ఒళ్ళు మండి "పొద్దుటి నుంచీ అలానే బద్దకంగా పడుకుంది గాక, పదడుగుల దూరంలో ఉన్న మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేవా? నేను చేస్తున్న పనాపి నీకు తెచ్చివ్వాలా? నీకు దాహమేస్తే నువ్వే తెచ్చుకో" అని సహాయ నిరాకరణోద్యమం చేద్దామనుకుంది నా మీద. కానీ, నేను మాత్రం అలాగే బద్దకంగా టీవీ చూస్తూ దాహం సంగతే మర్చిపోయాను. ఓ అరగంటయ్యాక మా అమ్మెందుకో ఆ గదిలోకొచ్చి నీళ్ళు తాగావా అంటే లేదన్నాను. అంతే, మా అమ్మకి చాలా కోపం, బాధా రెండూ కలిగాయి. ఇంత బద్దకమా అని కోపం.. దాహం వేసినా ఇంతసేపు నీళ్ళు తాగకుండా ఉన్నానే అని బాధ. పాపం అప్పటికప్పుడు ఓ గ్లాసు మంచినీళ్ళు తెచ్చి తాగించింది. అంతటి ఘన చరిత్రన్నమాట నాది!
అలాంటి నాకు ఓ రోజు బుర్రలో ఏదో పురుగు తిరిగి మా అమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా నేనివాళ నీకు పనిలో సాయం చేస్తాను అని అడిగా! నాలో వచ్చిన ఆ పెనుమార్పుకి మా అమ్మకి ఉక్కిరి బిక్కిరై కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చినంత పనయింది. సరే, యీ దొండకాయలు కోసివ్వు అంది. సరేనని చెప్పి వంట గదిలో కాకుండా హాల్లో మధ్యలో ఓ పేద్ద సెట్టింగు వేసుకున్నా దొండకాయలు కోసే ప్రాజెక్టు కోసం. ఓ పేద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో దొండకాయలేసి అది తీస్కెళ్ళి అక్కడ పెట్టుకున్నా. ఇంకో గిన్నేమో కోసిన ముక్కలేయడానికి, మరొకటేమో, తీసేసిన ముచ్చికలు వెయ్యడానికి పెట్టుకున్నా. కడిగిన కాయలు తుడవడానికి ఒక నేప్కిన్ పెట్టుకున్నా. కాయలు కోయడానికి ఓ చెక్క, కోసే ముక్కలు ఆ చెక్క మీద నుంచి కింద పడిపోకుండా జాగ్రత్త కోసం దాని కింద ఓ పేద్ద ప్లేటు, ఓ కత్తి, యీ సెట్టింగు అంతా పెట్టడానికి ఒక పీట, అలాగే నేను కూర్చోడానికి మరో పీట... ఇలా ఓ అరగంటసేపు అటూ ఇటూ తిరిగి, అదెక్కడుంది ఇదెక్కడుంది అని మా అమ్మని విసిగించి కావలసిన సరంజామా అంతా అమర్చుకున్నా. ఎదురుగా టీవీ పెట్టుకుని, చేతికందేట్టు రిమోట్ కూడా పెట్టుకున్నా! ఇహ జైహింద్ అనుకుని దొండకాయలు తరిగే మహా యజ్ఞం మొదలు పెట్టా! ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టా. అదేంటో, అంత ఇదిగా శ్రద్ధ తీస్కుని తరుగుతున్నా ముక్కలన్నీ తలా ఒక సైజులో వస్తున్నాయి. అయినా సరే అలుపెరుగని మహా యోధురాలిలాగా అలా అలా ఓ గంట పైగా ఎంత తరిగినా ఆ అరకేజీ దొండకాయలు మాత్రం అయిపోవట్లేదు. యీ లోపు మా అమ్మ వచ్చి "ఆహాహా.. బంగారమ్మా.. ఎంత పనిమంతురాలివే నా తల్లీ.. ఇంత పేద్ద వేదిక ఏర్పాటు చేసుకున్నావన్నమాట యీ పనికి! సర్లే.. ఇలా అయితే ఇవ్వాళ రాత్రికి అందరం పస్తుండాల్సి వస్తుంది. కష్టపడింది చాల్లే! ఇంక నేను కోసుకుంటాను" అని చెప్పి తీస్కెళ్ళిపోయింది. ఓ ఐదు నిమిషాల్లో మిగిలినవి తరిగేసి కూర చేసేసింది. అందరూ అన్నం తినేప్పుడు "యీ రోజు కూర కోసం దొండకాయలు కోసింది నేనే! అది నేనే!" అంటూ వాళ్ళందరికీ మెతుక్కోసారి చొప్పున మళ్ళీ మళ్ళీ చెప్పి చంపేసాను. ఆ దెబ్బకి హడలిపోయి అందరూ మూకుమ్మడిగా మా అమ్మని ప్రార్థించారు.. ఇక మీదట నా చేత ఇలాంటి బృహత్కార్యాలు చేయించద్దని.
మరుసటి రోజు ఒకటే గొడవ నేను నా కుడి చెయ్యి నొప్పిగా ఉందని చెప్పి. ఏదో ఆటల్లో దెబ్బ తగిలించుకున్నానేమో అనుకుంది మా అమ్మ. మోచెయ్యి పైన జబ్బంతా వాసినట్టు ఒకటే నొప్పి. చాలాసేపటికి మాకు అర్ధమయ్యింది. ఆ నొప్పి క్రిందటి రోజు పెట్టుకున్న 'దొండకాయలు తరిగే ప్రాజెక్టు' మూలంగానేనని. నాన్నొచ్చాక చెప్పింది అమ్మ 'మీ రాకుమారి గారు ఎంతటి సుకుమారులో చూడండి. గట్టిగా ఓ ఇరవై దొండకాయలు తరిగినందుకు చెయ్యి వాపు వచ్చిందని ఇవ్వాళంతా నా చేత నొక్కించుకుంటూనే ఉంది" అని. నేనేమో "గంటకి పైగా చాలా కష్టపడి తరిగాను నాన్నా" అని దీనంగా మొహం పెట్టుకుని చెప్పాను. మా ఇద్దరి వాదోపవాదాలు శ్రద్దగా విన్నాక నాన్న ఇలా తీర్పు చెప్పారు. "హెంత మాట హెంత మాట... మా అంతఃపురంలో మా ముద్దుల రాకుమారి చేత దొండకాయలు తరిగించుటయా! అహో.. ఎంతటి ఘోరము.. నా చిట్టితల్లి మీద అంత భారం మోపి నీవేమి చేయుచున్నావు. ఇక మీదట యీ ఇంట్లో నా బంగారుతల్లి చేత ఇటువంటి కష్టతరమైన పనులు చేయించే ప్రయత్నం ఎవరైనా చేసినచో యీ మహారాజు దండనకి గురి కావాల్సి వస్తుంది" అంటూ హుకుం జారీ చేసి నన్ను దగ్గరికి తీసుకుని కాసేపు చెయ్యి నొక్కి పెట్టారు.
ఇప్పుడు చెప్పండి మీరే.. నేనెంత పనిమంతురాలినో!
Tuesday, June 29, 2010
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
'యువరత్న' నందమూరి బాలకృష్ణ గారి సినిమా పాటలు ఓ నాలుగు చెప్పండి అని ఏ తెలుగువారినైనా అడిగితే వెంటనే ఏం సమాధానం వస్తుంది? 'లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా..' అనో, 'నిన్న కుట్టేసినాది మొన్న కుట్టేసినాది గండు చీమ' అనో, 'అందాల ఆడబొమ్మ..' అనో, 'సింహమంటి చిన్నోడే వేట కొచ్చాడే' అనో చెప్తారు కదా! ఎందుకంటే, మరి ఆయన పాటలు అలాంటివే ఎక్కువ పాపులర్ కాబట్టి. కానీ, ఇలాంటి వాటికి భిన్నంగా ఆయన సినీమాల్లోంచి ఒక మెలోడీని నేను మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు. :-)
అదే 1994 లో వచ్చిన 'గాండీవం' సినిమాలోని 'గోరువంక వాలగానే' అనే పాట. యీ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికగా రోజా నటించింది. అక్కినేని నాగేశ్వర రావు గారూ, మోహన్ లాల్, శ్రీ విద్య ఇతర తారాగణం. ఇప్పుడు హిందీలో ఎడాపెడా కామెడీ సినిమాలు తీసేస్తున్న ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ యీ సినిమాకి దర్శకుడు. యీ సినిమాకి MM కీరవాణి గారు స్వరాలందించారు. యీ పాటని కీరవాణి గారి పాటల్లో ఓ ఆణిముత్యం అనుకోవచ్చు.
యీ పాట గురించి తెలిసినవాళ్ళతో పాటుగా తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారని నాకనిపించింది. ఇంతకీ నాకీ పాట ఎలా పరిచయం అయిందంటే... చిన్నప్పుడు వేరే ఊర్లో ఉండే మా నాన్న స్నేహితుడు ఒకాయనకి ఆడియో షాప్ ఉండేది. ఆయన దృష్టిలో మంచి పాటలు అనిపించినవన్నీటిని ఏరి కూర్చి ప్రత్యేకంగా నాన్న కోసమని కొన్ని కేసెట్లు రికార్డ్ చేసి పెట్టేవారు ఆయన. నాన్న ఆ ఊరెళ్ళినప్పుడల్లా కొత్త కేసెట్లు పట్టుకొచ్చేవారు. చిన్నప్పుడు మేమెప్పుడూ పెద్దగా సినిమాలు చూసింది లేదు. కానీ, పాటలు మాత్రం చాలానే వినేవాళ్ళం. అలా అప్పట్లో యీ పాట విన్నప్పుడు పదాలు పెద్దగా అర్ధం కాకపోయినా కూడా బాగా నచ్చేసింది మా ఇంట్లో అందరికీ. చాలా యేళ్ళ తరవాత మళ్ళీ ఇంటర్నెట్లో వెతికి పట్టుకున్నా యీ పాటని. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి :-)
యీ పాట ట్యూన్ ఎంత బాగుంటుందో పాటలో అలవోకగా పారాడే తెలుగు పదాలు అంతకంటే అందంగా అనిపిస్తాయి. మహానుభావుడు వేటూరి గారు ఏ స్వర్గాన ఉన్నారో ఉన్నారో గానీ మనకిలాంటి అందమైన తెలుగు పాటల్ని మిగిల్చి వెళ్ళిపోయారు. యీ పాటలో సాహిత్యం వింటుంటే నిజంగా చెవిలో తేనె పోసినట్టుంటుంది. ఏ వాక్యం బాగుంది అని చెప్పాలంటే, పాటలో ఉన్న ప్రతీ ఒక్క లైను గురించీ చెప్పాల్సి వస్తుంది. :-) ఒక్కమాటలో చెప్పాలంటే అందమైన తెలుగు పదాలతో సయ్యాట ఆడించారు వేటూరి గారు యీ పాటలో. ఓసారి క్రిందన రాసిన పాట సాహిత్యం చూస్తే మీరూ యీ విషయం ఒప్పుకుంటారు.
ఇహ అంతందమైన తెలుగు పదాలు సుస్పష్టంగా, స్వచ్ఛంగా పలికే మన బాలు గారి స్వరంలో ఎంత తియ్యగా వినిపించాయో స్వయంగా వింటే గానీ అర్ధం కాదు ఎవరికైనా! యీ పాటలో బాలు గారితో పాటు చిత్ర గారు, శ్రీ కిరణ్ కూడా గొంతు కలిపారు. మీకూ యీ పాట కావాలంటే ఇక్కడ చూడండి.
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా..
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా..
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిలా పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో..
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరీడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో..
ఎవరికివారే… యమునకు నీరే….
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో..
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో..
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే.. బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో..
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే.. గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో..
పరవశమేదో.. పరిమళమాయే..
పువ్వు నవ్వే దివ్వె నవ్వే.. జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..

