అప్పుడే కొంచెం పక్కన నించుని వేరే ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న ఒక సీనియర్ అక్క వెంటనే నా దగ్గరికొచ్చి బోల్డు ఆశ్చర్యంతో "ఇదెక్కడి మాలోకం పిల్లే బాబూ.. నీకు సఖి సినిమా తెలీకపోడమూ, మాధవన్ తెలీకపోడమా.. ఎంత అపచారం! అసలు నువ్వే కాలంలో ఉన్నావు తల్లీ.. ఇప్పుడు సఖి సినిమా రెండోసారి రిలీజ్ అయింది.. మొదటి రిలీజ్ అప్పుడే వంద రోజుల పైన ఆడింది. నీకింకా మాధవన్ ఎవరో కూడా తెలీలేదంటే నువ్వే లోకంలో బతుకుతున్నావే బాబూ.. నువ్వు ముందు అర్జెంటుగా నడువ్ సినిమాకి.. అయిదు నిమిషాల్లో రెడీ అయ్యి రావాలి.." అంటూ చాలా చనువుగా ఎప్పటి నుంచో స్నేహం ఉన్నట్టు నాతో గొడవ చేసి సినిమాకి బయలుదేరదీసింది అ సీనియర్ అమ్మాయి. నాకసలు ఫస్ట్ రిలీజ్ సెకండ్ రిలీజ్ అంటే ఏంటో ఒక్క ముక్క అర్థం కాకపోయినా ఇదేదో అర్జెంటుగా చూడాల్సిన సినిమా అని మాత్రం అర్థమయ్యి హడావుడిగా సినిమాకి బయలుదేరాను. :)

ఇంక సినిమా గురించి ఏం చెప్పమంటారు.. నేనిప్పుడు ఒక్కో సీన్ గురించీ వర్ణించి వర్ణించి చెప్పడం మొదలెడితే మూడు గంటల సినిమా గురించి పది గంటల సేపు వినాల్సొస్తుంది పాపం మీరందరూ. అందుకని మీ అందరి క్షేమం కోరి ఇప్పుడు అంత ఘోర కార్యం తలపెట్టలేను. అసలు సినిమా టైటిల్స్ దగ్గరే డామ్మని పడిపోయాను. "వసంతపు నవ్వులే.." పాట, ఆ ట్యూను, మాధవన్ బైక్ మీద వస్తూ ఉండటం.. ఆహా.. అలా చూస్తుండిపోడమే తప్ప మాటల్లేవ్! "మాంగల్యం తంతునేనా.." బిట్ సాంగ్ కూడా ఈ ట్యూన్ లోనే ఉంటుంది. నాకీ ట్యూనంటే ఎంతిష్టమంటే ఇప్పటికీ నా మొబైల్ రింగ్ టోన్ ఈ పాటే! మొత్తానికి సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. :)
ఇంతకీ అప్పుడలా మమ్మల్ని హడావుడిగా సినిమాకి తీసుకెళ్ళిన సీనియర్ అక్క డిగ్రీ ఫైనలియర్ చదివే శైలజ అని తర్వాత వివరాలు తెలిసాయి. మేమందరం శైలక్కా అని పిలిచేవాళ్ళం. ఆ రోజు సఖి సినిమా చూసాకా వెనక్కి వచ్చేప్పుడు శైలక్క అడిగింది "ఇప్పుడు చెప్పవే.. ఈ సారి నిద్దర్లో లేపి అడిగినా సరే మాధవన్ ఎవరో తెలీదంటావా!" అని నవ్వేసింది. సినిమా ఎలా ఉందని అడిగితే "అబ్బో.. సూపరక్కా.. నాకు చాలా నచ్చేసింది" అన్నా. మళ్ళీ వచ్చే ఆదివారం వెళ్దామా అంది. అలాగే మళ్ళీ వచ్చే వారం కూడా రెండోసారి చూశాం సఖి సినిమా. నా జీవితంలో హాల్లో ఒకే సినిమా రెండు సార్లు చూసిన మొదటి సినిమా సఖి నే.. అప్పటికీ, ఇప్పటికీ ఆ సినిమా అంటే చాలా ఇష్టం నాకు. :) ఈ సఖి సినిమా మత్తులోనే అప్పట్లో మాధవన్, స్నేహ నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటి వస్తే, మహా ఉత్సాహంగా వెళ్ళి చూసాం. సినిమా పేరు 'నిన్ను చూశాక' అనుకుంటా.. బాబోయ్ అసలు మాధవనేనా ఈ సినిమాలో అన్నంత ఆశ్చర్యపోయాం.. అంత సోది సినిమా అన్నమాట. అప్పుడర్థమైంది సఖి సినిమా మణిరత్నం మ్యాజిక్ అని! ;)
ఇంక శైలక్క గురించి చెప్పాలంటే, కొంచెం పొట్టిగా, తెల్లగా బొద్దుగా భలే క్యూట్ గా ఉండేది. అస్సలు తను మాట్లాడుతుంటే ఎంత ముచ్చటేస్తుందంటే అందరం బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని అలా వింటూ ఉండిపోయేవాళ్ళం. అప్పుడప్పుడూ తనని పిలుస్తూ ఉండేవాళ్ళం కాసేపు మాతో కూర్చుని కబుర్లు చెప్పరాదూ అని. అసలు విషయం ఏదైనా తను చెప్పే తీరూ, మాటలూ భలే నవ్వించేవి. అసలు తనతో ఉన్నంతసేపూ నవ్వీ నవ్వీ బుగ్గలు నెప్పెట్టేవి. కొన్నాళ్ళకి మీరు మీరు అనే పిలుపు మర్చిపోయి నువ్వు అని పిలిచేసేంత దగ్గరైపోయాం. :)
అప్పట్లో ఒక బ్రూ కాఫీ యాడ్ వచ్చేది. అమృతా రావ్ ఉంటుంది ఆ యాడ్లో.. ఆ అమ్మాయి పొద్దున్నే వాళ్ళ నాన్నగారికి బ్రూ కాఫీ కలుపుతూ తన ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని తనలో తను రిహార్సల్స్ వేసుకుంటూ ఉంటుంది. "నాన్నా.. అదీ.. సాగర్ అని నా బాయ్ ఫ్రెండ్, ఛా.. కొలీగ్.. ఫ్రెండ్.. నేను తనని పెళ్ళి, ప్రేమించుకుంటున్నాం.. " అలా కంగారు కంగారుగా మాటలు తడబడుతూ ఉంటాయి. వాళ్ళ నాన్న గారికి కాఫీ ఇస్తూ "నాన్నా.. సాగర్.. షుగర్ సరిపోయిందా?" అంటుంది. వాళ్ళ నాన్న నవ్వేసి కాఫీ బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకుని "షుగర్ బాయ్ ని ఇంటికి రమ్మను. మాట్లాడాలి. ముహూర్తాలు పెట్టుకోవాలి.." అనేసి వెళ్ళిపోతే ఈ అమ్మాయి సంబరపడిపోయి కేరింతలు కొట్టేస్తుంది.. "ఆనందం బ్రూతో ఆరంభం..." అంటూ యాడ్ ముగుస్తుంది. ఆ యాడ్ భలే క్యూట్ గా ఉండేది.
ఒకసారి శైలక్క చెప్పింది తను వాళ్ళింట్లో ఉన్నప్పుడు టీవీలో ఈ యాడ్ వచ్చిందంట. అది చూస్తూ వాళ్ళ నాన్న గారు పక్కనే ఉన్న శైలక్కతో "ఏరా శైలూ.. నువ్వు నాకు చెప్పడానికి ఇంత మొహమాట పడిపోవాలా?" అని ఆట పట్టించారంట. అప్పుడెంత నవ్వుకున్నామో మేమందరం. అసలు ఇన్నేళ్ళ తర్వాత కూడా తన నెరేషన్లో విన్నది నాకింకా గుర్తొస్తూనే ఉంటుంది. నాకు కాఫీ తాగే అలవాటు లేకపోయినా కాఫీ పరిమళం చాలా ఇష్టం. ఎప్పుడో ఏడాదికోసారి కాఫీ తాగాలనిపిస్తుంది. అది కూడా బ్రూ కాఫీనే.. బ్రూ గుర్తొచ్చినప్పుడల్లా ఈ యాడ్, ఈ యాడ్ గుర్తొచ్చినప్పుడల్లా శైలక్క, శైలక్క గుర్తొచ్చినప్పుడల్లా ఈ బ్రూ యాడ్ గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఇప్పుడు తనెక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలీదు గానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ హాయిగా నవ్విస్తూ ఉండి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని స్నేహాలు కాఫీ పరిమళమంత కమ్మగా ఉంటాయి కదూ.. మా శైలక్క లాగా! :)