(నిన్నటి టపాకి కొనసాగింపు)
నిన్న సాయంత్రం ఏమైందంటే.. నాక్కొంచెం నీరసంగా ఉంది, ఓపిక లేదని చెప్పి ఇంటికొచ్చి వంట చేయకుండా ముసుగు తన్ని కూర్చున్నానన్నమాట. నాక్కొంచెం సహాయం చేద్దామని పాపం తను కూడా పని మధ్యలోనే ఆపేసి ల్యాబ్ నుంచి తొందరగా వచ్చేశాడు. ఇహ అప్పుడు రాత్రికి మాకు భోజన సదుపాయం ఎలాగా అని ఆలోచించుకోవాలి కదా! నేనేమో నా వల్ల మాత్రం కాదన్నట్టు
దీనంగా మొహం పెట్టేసరికి ఇంక మన అబ్బాయ్ గారికి వేరే గత్యంతరం లేకపోయింది. అన్నం వండటం వరకూ సమస్య లేదు.. ఎందుకంటే రైస్ కుక్కర్లో పెట్టేయ్యడమే కదా! మరి అన్నంలోకి ఏదో ఒక కూర కావాలి కదా తినడానికి. అందుకని నువ్వు ఆమ్లేట్స్ వేసెయ్యి, ఆవకాయ వేసుకుని తినేద్దాం అన్నా నేను. ఏ కళనున్నాడో ఏమో గానీ, నో.. నేను ఆమ్లెట్ వేయను, కోడిగుడ్డు పొరటు చేస్తాను.. అన్నాడు. బాబోయ్.. వంట చేయాలని నీకు ఇంత ఉత్సాహం వస్తే నేనెందుకు అడ్డుపడటం అని సరే అన్నా!
ఇహ ఇప్పుడు కోడిగుడ్డు పొరటు చేయు విధానం ఎలాగో మీరు సావధానంగా వినండి మరి. అదేలెద్దురూ.. చదవండి.
మొదట అబ్బాయ్ గారు వెళ్లి పొయ్యి దగ్గర నించుని అక్కడి నుంచే నాకు ఇంటర్వ్యూ పెట్టారు. కూర చెయ్యడానికి ఏ కళాయి వాడాలి, రెండు ఉల్లిపాయలు వేయనా, మూడు వెయ్యనా, మరీ సన్నగా తరగాలా, కొంచం పెద్దవైనా పర్లేదా, ఆలివ్ నూనె వెయ్యనా, సన్ఫ్లవర్ నూనె వెయ్యనా.. ఇవ్విధముగా సాగిందన్నమాట నా ఇంటర్వ్యూ!
కళాయిలో నూనె వేసాక మళ్ళీ ఇంకో సందేహం. పొయ్యి మీద నుంచి దింపి పట్టుకొచ్చి నాకు చూపించి మరీ అడిగాడు అంత నూనె సరిపోతుందో లేదోనని.
కళాయిలో నూనె వేడెక్కాక తాలింపు గింజలు వెయ్యమని చెప్పానో లేదో.. ఇంక నువ్వేం చెప్పక్కర్లేదులే.. మళ్ళీ కూర రుచిగా వచ్చాక క్రెడిట్ అంతా నీదేనంటావు. నాకు తెలుసు తరవాత పసుపు వెయ్యాలి, ఆ తరవాత ఉల్లిపాయ ముక్కలెయ్యాలి.. అంతే కదా.. అన్నాడు. సర్లే అని నేను ఊరుకున్నా. ఎంతసేపైనా ఉల్లిపాయ ముక్కలు వేగిపోవట్లేదని మళ్ళీ ఓ కంప్లెయింటు.
సందు దొరికింది కదా అని నేనొక ఉచిత వంటోపదేశం చేసేసా. వంట చేయడమంటే తీరిగ్గా లాప్టాప్ ముందు కూర్చుని pacman ఆడడం, ఐఫోన్లో గేమ్స్ ఆడటం అనుకున్నావా మరి!
వంట చేయడానికి బోల్డంత ఓపికుండాలి బాబూ.. అని.
హెంతో కష్టపడి ఓ అయిదు నిమిషాలు ఓపిగ్గా కలబెట్టాక ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. ఈ లోపు నాకో జ్ఞానోపదేశం కూడా..
అసలైనా కూరగాయల్ని ఇలా ఎక్కువెక్కువసేపు మగ్గించి తింటే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయనీ. ఎంత తక్కువ మగ్గితే అంత ఆరోగ్యమనీ! ఇంతలో మరో సందేహం ఎన్ని గుడ్లు వెయ్యాలి అని. ఓహో.. నాలుగెయ్యనా.. సర్లే ఇంకేం చెప్పకు నువ్వు అన్నాడు. ఇంకో అయిదు నిమిషాలయ్యాక.. గుడ్డు కూడా బాగానే వేగిపోయింది, ఇంక కారం వేసెయ్యనా.. అంటూ మళ్ళీ ప్రశ్న. సరే, వేసెయ్యి.. అవునూ.. ఇంతకీ ఉప్పేసావా? అంటూ నా తిరుగు ప్రశ్న. ఓహ్..
ఇందాక అనుకున్నా.. అంతలోనే మర్చిపోయా.. ఇప్పుడు వేస్తున్నాలే! ఎంతేశావ్ ఉప్పూ కారం అనడిగాను. ఖచ్చితంగా ఎక్కువయ్యే అవకాశం మాత్రం లేదు. అలా వేశాను తెలివిగా అన్నాడు.
ఆ తరవాత ఇంకో అయిదు నిమిషాలు ఆపసోపాలు పడుతూ ఆ కూరని తిప్పీ తిప్పీ కష్టపడి చివరికి ఎలాగో కోడిగుడ్డు పొరటు చేయడం అనే ప్రహసనం ముగించాం.. క్షమించాలి.. ముగించాడు. ఇందులో నాకు అస్సలు క్రెడిట్ లేదని బ్లాగ్ముఖంగా మనవి చేసుకుంటున్నా అధ్యక్షా! (స్వగతం - ఇప్పుడన్నా కామెంట్లలో గైడ్ డౌన్ డౌన్ అనడం ఆపి జిందాబాద్ అంటారో లేదో!). అప్పటికే మాకు బాగా ఆకలిగా ఉండటంతో వెంటనే ఆ కోడిగుడ్డు పొరటుని వేడి వేడి అన్నంలో వేసుకుని తినేశాం కాబట్టి, ఫోటోలూ అవీ ఏమీ తీయలేదు. అంచేత ఈ గొప్ప రెసిపీని కళ్ళారా చూసే మహద్భాగ్యం కలగకుండా మీరు తప్పించుకుని బతికిపోయారని
చెప్పడానికి చింతిస్తున్నాను. కానీ, మా ఇంటబ్బాయ్ గారి మాటల్లో చెప్పాలంటే మాత్రం.. ఇప్పటిదాకా మొత్తం జీవితంలో తిన్న అన్నీ కోడిగుడ్డు పొరటుల్లోకీ.. ఇదే అత్యుత్తమమైనదీ, శ్రేష్ఠమైనదీ మరియూ రుచికరమైనదీ అట!
ఇంతటితో కథ సమాప్తం. ఇందు మూలంగా నీతి ఏంటంటే, ఎవరికైనా వంట అస్సలు రాకపోతే ఎంచక్కా ఆమ్లెట్ వెయ్యడం, కోడిగుడ్డు పొరటు గనక ఈ విధంగా వీజీగా నేర్చేసుకున్నట్టయితే అప్పుడప్పుడైనా మీ ఇంటమ్మాయిలు కాస్తో కూస్తో సుఖపడిపోగలరు. అలా అని చెప్పి అత్యుత్సాహంతో అన్నీ వంటలు మహా బాగా నేర్చేసుకుని ఆ తరవాత మీ పాకశాస్త్ర ప్రావీణ్యం వల్ల వచ్చిన పొగరుతో
మీ ఇంటమ్మాయిల వంటలకి వంకలు పెట్టేంత దూరం మాత్రం వెళ్లకండేం! మంచబ్బాయిలు చెప్పిన మాట వింటారన్నమాట.. విన్నారు కదూ!
కొసమెరుపు: అసలు కార్తీక మాసం వనభోజనాలకి కోడిగుడ్డు పొరటు రెసిపీ చెప్పడవేంటో, మరీ చోద్యం కాకపోతే అని మీరు విస్తుపోతున్నారు కదూ! ఏదోకటిలెద్దురూ.. ఈసారికి సర్దుకోండి. అయినా మన పోకిరి చెప్పినట్టు.. రెసిపీ చెప్పామా లేదా అన్నది ముఖ్యం కానీ అది కోడిగుడ్డు పొరటా ఆమ్లెట్టా అన్నది అంత ముఖ్యం కాదు కదా! అయినా మీ అందరికోసం అరిసెలు, లడ్డూలు, బూందీ, కారప్పూస, ఇంకా.. జంతికలు ఇక్కడ పెట్టాను. తినేసి వెళ్ళండేం!
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!