Tuesday, October 08, 2013

ఓ సాయంకాలపు చింతన!



ఇవాళంతా మబ్బు మబ్బుగా, చీకటి వెలుగుల దాగుడు మూతల ఆటలా, ఎండ దేవుడువాన దేవుడు కలిసి ఆకాశాన్ని చెరో సగం పంచుకున్నట్టు చెరి కాసేపు విజృంభిస్తూ చిత్ర విచిత్రంగా ఉంది వాతావరణం. రోజుకి కొలువులో దుకాణం కట్టేసి ఇంటికి పోదామని కిటికీలోంచి బయటికి చూస్తే అప్పుడే ఎవరో తరుముకొస్తున్నట్టు చిందరవందరగా చినుకుల దాడి మొదలైంది. ఎలాగూ వానొస్తుంది కదాని ఇంకో చిన్న పని చేసేద్దామని ఉపక్రమించేసరికి ఎంత ఆత్రంగా వచ్చిందో అంతే హడావుడిగా ఆగిపోయింది వాన. అరే.. ఇంకో పది నిమిషాలు పనుందే నాకు అనుకుంటూ అది పూర్తి చేసి చూసే​సరికి మళ్ళీ తగుదునమ్మా అంటూ ఎదురొచ్చింది. హూ.. ఏంటో ఈ ఊరి వాన.. ఓ పద్ధతీ పాడూ లేకుండా దిగబడిపోతుంటుంది అని మురిపెంగా విసుక్కుని కిటికీలోంచి బయటికి చూస్తూ నించున్నా.

దూరంగా కనిపిస్తున్న పచ్చటి చేలు, తోటల మీదుగా, బుల్లి బుల్లి బొమ్మరిళ్ళలాంటి పెంకుటిళ్ళ మీదుగా, ఆకుపచ్చటి నీళ్ళతో నిండిన కొలను మీదుగా నేను నించున్న కిటికీ అద్దం దాకా అడుగడుగునా ఎదురవుతున్న నేలింటి నేస్తాలని నింపాదిగా తన చిరు చినుకుల స్పర్శతో పలకరిస్తూ పులకరిస్తోంది నింగి నుంచి తరలి వచ్చిన వానమ్మ. అందర్నీ పేరుపేరునా తరచి తరచి పలకరించానన్న నమ్మకం కలిగింది కాబోలు చినుకుల జడి కాస్త నెమ్మదించింది. ఇలాంటి చిరుజల్లుల్లో తడవడం నాకెంత సరదానో గుర్తొచ్చి అట్టే ఆలస్యం చెయ్యకుండా మరుక్షణంలో బయటికొచ్చిపడ్డాను. తలుపు తెరిచీ తెరవగానే చల్లటి ఇగం లాంటి గాలి విసురుగా ఎదురొచ్చింది. మొహం మీదకొచ్చి వాలిన మొదటి నాలుగైదు చినుకులు జిల్లు జిల్లున తాకి వెన్నులోంచి వణికించేసాయి. అమ్మో.. అప్పుడే ఊళ్ళోకి చలి పులి జొరబడిపోతున్నట్టుంది అనుకుంటూ చప్పున అరచేతులు వెచ్చగా జేబుల్లో దాచేసుకున్నా కానీ అదెంతోసేపు లేదు. వెనువెంటనే దుడుకుగా పరిగెత్తుకొచ్చి మోముని ముద్దాడిన చినుకుల చక్కిలిగింతలన్నీ చిరునవ్వులు పూయించి చలిని దూరంగా తరిమేసాయి.

ఆకాశం మాత్రం కొత్తగా వింతగా అనిపిస్తోంది. చూడటానికి చుట్టూ అంతా లేత నలుపు రంగులో పల్చటి తెరలా ఉంది. కానీ ఆ నలుపు చాటున వెలుగు జాడ దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. పల్చటి మేఘాల తెరలు తేలికగా ఎగురుతూ వెనకాలున్న వెలుగుని మొత్తంగా దాచడానికి విఫలయత్నం చేస్తున్నట్టు చిత్రంగా ఉంది ఆకాశ చిత్రం. ఎండా, వానా ఇద్దరూ పోట్లాడుకుని వాళ్ళమ్మ దగ్గరికెళ్ళి తమ తగువు తీర్చమని అడిగితే  చెరో దిక్కుకెళ్ళి ఆడుకోండని చెప్పి ఉంటుందా.. దూరంగా ఎండ కూడా కనిపిస్తుంది. శిశిరం మోసుకొచ్చే రంగులు మొదలయ్యాయో, ఎండ మెరుపులో తెలీడంలేదు. అలా నడుస్తూ పోతుంటే దారిలో ఎదురవుతున్న ఆకుపచ్చని చెట్లన్నీ అప్పుడప్పుడే శిశిరపు పేరంటానికి ముస్తాబవుతున్న రమణుల్లా తీరుగా పసుపు కుంకుమలు అద్దుకుంటున్న ఛాయలు కనపడుతున్నాయి.


నేను రోజూ నడిచే దారికి ఇరువైపులా కొత్తగా మొక్కలు నాటారు. ఎక్కడో పుట్టి ఇంతెత్తున ఎదిగిన మొక్కల్ని ఉన్నపళంగా పెరికించి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. పాపం.. వాటికి ఎంత దిగులుగా ఉందో ఏవిటోనని నేను బెంగపడబోతుంటే చెవుల్లో చేరి ఏసుదాస్ గారు "ఏ నావదే తీరమో.." అంటూ ఆర్ధ్రంగా ఏదో చెప్పబోయారు. అటు వింటూ నేను ఏవో ఆలోచనల సుడిలో పడి కొట్టుకుపోబోతుంటే.. "అయినా సొంత ఊరు, ఇల్లూ, వాకిలీ, దేశం అన్నీ వదిలేసి సముద్రాలు దాటి ఇంత దూరం ఎగిరొచ్చి ఈ కొత్త ప్రపంచంలో నువ్వు అలవాటు పడిపోలేదూ.. నాల్రోజులు పోతే అవీ అంతే.. ప్రకృతి ధర్మం సుమా!" అంటూ మనసు తను నేర్చుకున్న పాఠం అప్పజెప్పింది. హ్మ్.. నిజమే.. ఎప్పుడు ఎవరికేది ప్రాప్తమో, ఎవరు ఎక్కడికి చేరతారనేది పూర్తిగా మన చేతుల్లో లేని విషయం కదా.. ఏదేమైనా మనం ఎక్కడుంటే అదే మన సొంతం అనిపిస్తుంది కొన్నాళ్ళకి. పైగా, భూమ్మీద ఏ మూలకి వెళితేనేం.. అంతటా అదే విశాల ఆకాశం ప్రేమగా గొడుగు పడుతుంది, అదే సూరీడు సకల జీవాల బతుకుల్ని వెలిగిస్తాడు. అవే చెట్టూపుట్టలూ, కొండాకోనలూ, వాగూవంకలూ.. అదే పచ్చదనం, అదే చల్లదనం, అదే మట్టి వాసన.. అదే మనుషులూ, అవే మనసులూ, అందరివీ అవే భవబంధాలూ, నవ్వులూ, ఏడుపులూ.. అంతా ఒక్కటే.. వసుధైక కుటుంబం అంటే బహుశా ​ఇదేనేమో!

ఓ.. ఈ ఆలోచనల్లో మునిగిపోయి ఇప్పటి దాకా నేను నడిచిన దూరం, నన్ను తడిపేసిన వర్షం రెండింటినీ గుర్తించనేలేదే! ఇంటి దాకా వచ్చేసా.. సరి సరి.. ఇంతకీ రాత్రికి వంట ఏం చేస్తే బాగుంటుంది? అసలు ఇంట్లో ఏం కూరగాయలున్నాయో చూడాలి. అబ్బా.. మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోవడం ఎంత సులువో.. ఒక్కసారి ఇంటి మొహం చూస్తే చాలు. అంతే అంతే.. సర్వం సంసారార్పణం! :-)


* పోయినేడాది ఇదే రోజుల్లో రాసుకున్నది డ్రాఫ్ట్స్ లో కనిపిస్తే ఇప్పుడు బ్లాగ్లో పోస్ట్ చేస్తున్నా.. ​

20 comments:

జ్యోతిర్మయి said...

అంతే అంతే అందామంటే...బెంగ తీరనేలేదే. అ కొబ్బరిచెట్లు, వరినాట్లు, మావిచిగురు, ఏటి పాటలు అన్నీ మరీ మరీ గుర్తొస్తున్నాయి. మేఘం కమ్మేసింది. చినుకులు కురుస్తూనే వున్నాయి. ఎక్కడా నీరెండ జాడే లేదు.

Kottapali said...

better late than never, eh?
good one

శ్రీనివాస్ said...

@ సర్వం సంసారార్పణం!!
ఎంత బాగా చెప్పారు..:-)))))))))))))))))))

మీ ఆలోచనలు, వాటిని అక్షరీకరించే తీరు చాలా బాగుంటాయండీ!! :-)

Unknown said...

నేలింటి నేస్తాలని నింపాదిగా తన చిరు చినుకుల స్పర్శతో పలకరిస్తూ పులకరిస్తోంది నింగి నుంచి తరలి వచ్చిన వానమ్మ...

ఎండా, వానా ఇద్దరూ పోట్లాడుకుని వాళ్ళమ్మ దగ్గరికెళ్ళి తమ తగువు తీర్చమని అడిగితే చెరో దిక్కుకెళ్ళి ఆడుకోండని చెప్పి ఉంటుందా..​ :))

ఒక్కసారి ఇంటి మొహం చూస్తే చాలు...సర్వం సంసారార్పణం! :-)

భలే రాస్తారు ...ప్రక్రుతి తో కలిసి మీ ప్రయాణం లో మీ మనసులో ఉసులన్నీ మాతో పంచుకున్నారు ధన్యవాదాలు ..

మధురవాణి said...

​@ జ్యోతిర్మయి,
ఏంటండీ.. చూడబోతే ఇండియా ట్రిప్ అయిపోయినా మీరింకా ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడినట్టులేరే! :-)

@ Narayanaswamy S.,
అంతేనంటారా.. థాంక్స్ గురువు గారూ.. :-)

@ శ్రీనివాస్,
నా ఆలోచనలు, రాతలు మీకు నచ్చుతున్నందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు. :-)

@ Unknown,
నాతో కలిసి ప్రయాణం చేసినందుకు మీక్కూడా ధన్యవాదాలండీ.. :-)

Praveena said...

One of your best posts.

Rajesh said...

Beautiful..

మధురవాణి said...

@ Praveena, Rajesh Kumar

Thank you! :-)

chavera said...

సాయింకాలపు చింతన
ప్రతి రోజూ చదువుతూ
పాతిక రోజుల పైనే అయ్యిందమ్మా
ఆ తరువాత----?

Karthik said...

Beutiful...very nice..:-):-):-)

dokka srinivasu said...

Madhuravani madam garu

Namaskaramu. Mee blog chaalaa baagundi.

Madhuravani madam garu Telugulo konni blogulu choosi chaalaa aanandamu vesindi. Anduloo mee blog kooda vokati.

Madhuravani madam garu meeku mariyu mee kutumba sabhyulaki naa Deepavali subhakamshalu.

Madhuravani madam garu nenu naa blogulo Deepavaliki sambandinchi "Lamps of India" ane oka article post chesaanu (Bhaarata desamuloni Deepamulu).

http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

Madhuravani madam garu naa Lamps of India message ni choosi meeru mee commentsni dayachesi enlish lone ivvandi. Endukante vere placelaloni vallaki mana telugu ardhamu kaadu.

Madhuravani madam garu meeru naa Lamps of India message ki migilina vallu ichinatle oka manchi comment (sandesamu) englishulo isthaaru ani alaage naa Heritage of India bloguki memberu gaa join avutharu ani aasisthunnanu.

మధురవాణి said...

​@ chavera,
సారీ అండీ.. ఈ మధ్యన బ్లాగులో కనిపించడం కాస్త తగ్గింది. :(

@ ఎగిసే అలలు,
థాంక్సండీ.. :)

@ dokka srinivasu,
మీ అభిమానానికి ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ..

chavera said...

కాస్త కాదమ్మా, పుర్తిగా!
జర్మణీయం కూడా అయిపోయింది,
మరి వచ్చె నెలలో---?

Anonymous said...

కాస్త కాదమ్మా, పూర్తిగా తగ్గింది,
నెలకొక సారి వచ్చే జర్మనీయం కూడా అయి పోయింది,
ఆ తరువాత, క్రొత్త సంవత్సరంలో ---?

Manasa said...

Madhura garu, mee Sanfransisco diaries start chesa..first page lo ..oosulade oka jabilata chusi adi mottam chadivesi Nishi and Kiranprabha garu tega nachesaru..Tarvata Sanfransisco diaries chadivesa ratri kurchuni..abbo..chala nachesindandi..I am back to my world after long time..mee style of writing ku nenu pedda fan ayipoyanu. meeru Germany lo ne unnaru plus scientist ani telisi gabalana london nindi akadiki vachi kaliseyali mimmalni anipinchindi...congrats..and good posts..Keep writing for us...1

Manasa said...

Madhura garu, meeru Germany lo untarani scientist ani telisi twaraga london nindi akadiki vachi mimmalni kaliseyalani anipinchindandee..

Mee Sanfransisco diaries ratri chadivi mee friendship ku mee writing style ku flat ayi pedda fan ayipoyani..danilo meeru prastavinchina Oosulade oka jabilata chadivesi Nishi gariki Kiranprabha garu tega nachesaru..felt so exited. Chala natural writing style..admirable..congrats and keep writing for us..:))

మధురవాణి said...

@ chavera,
నాక్కూడా రాయడం వదలకుండా ఉండటమే ఇష్టం కానీ రకరకాల కారణాల తరచూ రాయడం కుదరడంలేదండీ. అంతకుమించి మరేం కాదు. మీ అభిమానానికి శతధా కృతజ్ఞురాలిని.​

మధురవాణి said...

​​@ Manasa,
మీ స్పందన చాలా సంతోషాన్ని కలిగించిందండీ. నా డైరీ మీకంత నచ్చినందుకు, మీకు ఊసులాడే ఒక జాబిలటని పరిచయం చేసినందుకు ​ఆనందంగా ఉంది. మీరు లండన్ నుంచి ఎప్పుడైనా జర్మనీ వస్తే నాకో మాట చెప్పండి. తప్పకుండా అలాగే కలుద్దాం. మీ అభిమానపూర్వక స్పందనకి బోల్డన్ని ధన్యవాదాలు. :-)​

ఏలియన్ said...

"అయినా సొంత ఊరు,​ ఇల్లూ,​ వాకిలీ, దేశం అన్నీ వదిలేసి సముద్రాలు దాటి ఇంత దూరం ఎగిరొచ్చి ఈ కొత్త ప్రపంచంలో నువ్వు అలవాటు పడిపోలేదూ.. నాల్రోజులు పోతే అవీ అంతే.. ప్రకృతి ధర్మం సుమా!"

ఈ పోస్ట్ ఒక్కటని కాదు, మీ పోస్ట్స్ అన్నిట్లో లో పాజిటివ్ దృక్పధం బాగుంటుంది,

మధురవాణి said...


@ ఏలియన్,
Thanks for the compliment! :-)