
ఇన్నేళ్ళల్లో ఈ బస్టాపులో నిలబడి ఎన్నిసార్లు బస్ కోసం ఎదురు చూసానో! అలా ఎదురు చూపుల్లో నుంచి అలవాటుగా ఆలోచనల్లో జారిపోయి పరధ్యానంలో బస్ మిస్సయిన రోజులు ఎన్నో! ఈ ఊరి సముద్రం.. ఇన్నేళ్ళుగా తన కెరటాల చప్పుడులో వినిపించే, నాకు మాత్రమే అర్థమయ్యే ఓ వింత భాష.. మళ్ళీ ఎన్నాళ్ళకి వినగలనో! ఈ వీధీ, ఈ ఇల్లూ వాకిలీ.. ఎంతగా అలవాటైపోయాయో.. నేనే ఆలోచనల్లో ఉన్నా నా ప్రమేయం లేకుండానే పాదాలు వాటంతట అవే ఇల్లు చేర్చేస్తాయి. ఈ మేడ మెట్లు ఎన్ని వందల సార్లు ఎక్కీ దిగి ఉంటానో కదా! నాకు బాగా అలవాటైన కాలింగ్ బెల్ అరుపు, వీధి గుమ్మం తలుపు.. దీనికి ఆనుకుని ఎన్ని సాయంత్రాలు తన కోసం ఎదురు చూస్తూ ఎన్నెన్ని ఊసుల మాలలల్లానో! ఈ బాల్కనీలో నించుని పదే పదే వీధి మొగ వైపే చూస్తూ పిల్లలు స్కూల్ నుంచి ఇంకా రాలేదేమని ఆదుర్దాగా ఎన్ని మాట్లు పచార్లు చేసానో! ఇక్కడ ఈ వంట గది కిటికీ ముందు నించుని బయట కనిపించే పచ్చటి చెట్టుని చూస్తూ ఎన్ని వేనవేల ఆలోచనల్లో విహరించానో! ప్రతి రోజూ ఆ చెట్టు కొమ్మలపై వచ్చి వాలే చిన్ని చిన్ని గువ్వపిట్టలతో కలిసి ఎన్నెన్ని ఊసులు కలబోసుకున్నానో! ఏంటో.. ఉన్నట్టుండి దేన్నైనా వదిలేసి వెళుతుంటే, బాగా అలవాటైపోయిన వాటికి దూరమైపోతుంటే అప్పటికప్పుడు ఉన్నట్టుండి అన్నీటి మీదా విపరీతమైన ప్రేమ పొంగుకొచ్చేస్తుంది కదా! లేకపోతే వీటన్నీటి మీదా నాకింత ప్రేముందని నేనెప్పుడూ గుర్తించలేదేమో! ఇన్నేళ్ళూ చాలా మాములుగా చేసిన రోజు వారీ పనులన్నీ ఈ రోజెందుకో చాలా ప్రత్యేకంగా అపురూపంగా అనిపిస్తున్నాయి.
అయినా అసలు 'మార్పు' అన్న మాట వింటే చాలు.. మనసుకి ఎందుకో అంత ఉలికిపాటు! అప్పుడే కొత్తగా పరిచయమైన రోజునేమో నువ్వెవరివో పరాయివన్నట్టు, నీతో నాకేంటి అన్నట్టు కళ్ళెగరేసి పొగరుగా చూస్తుంది. రోజుల పేజీలు తిప్పేస్తూ పోయిన కొద్దీ తనకే తెలీకుండా బోల్డంత మమకారం పెంచేసుకుని 'నువ్వంటూ రాక మునుపు నేనెలా ఉన్నానో' అన్న స్పృహే కోల్పోతుంది. విధిగా కాలం చల్లే మత్తులో చిక్కుకుపోయిన అదే మనసు 'నువ్వు లేకపోతే అసలు నేనెలా మనగలనూ?' అంటూ అమాయకంగా ప్రశ్నిస్తుంది. సరిగ్గా అప్పుడే 'మార్పు' అనివార్యం, అవసరం, నిరంతరం.. అంటూ విధో, తలరాతో, దైవమో, దెయ్యమో తెలీదు గానీ ఉన్నపళంగా మనని ఎత్తుకెళ్ళి మళ్ళీ ఒక సరికొత్త ప్రపంచంలో పడేస్తుంది. ముందు నాలుగు రోజులు.. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం కనిపించే సూర్యుడి దగ్గర నుంచీ, రాత్రి పూట జో కొట్టి నిదుర పుచ్చే జాబిలీ దాకా ఏవీ ఓ పట్టాన నచ్చవు. ఇవన్నీ ఇన్నాళ్ళూ నేను స్నేహం చేసిన నా నేస్తాలు కాదు. మా ఊర్లో జాబిల్లే నాక్కావాలీ.. ఇదేదో కొత్త లోకం నాకేం బాగాలేదు.. నా పాత లోకమే నాక్కావాలి అని మొండిగా ఎదురు తిరిగి మారాం చేస్తూ ఉంటుంది వెర్రి మనసు.
కానీ, కాలం చేసే మాయని తప్పించుకోగల సమర్థత తనకెక్కడిదీ! తనలో వస్తున్న కొత్త మార్పుని తానే గుర్తించలేనంత అలవోకగా మెలమెల్లగా కొత్త ప్రపంచానికి అలవాటు పడిపోయి మళ్ళీ విధిగా కొత్త బంధాలు పెనవేసుకుపోతూ ఉంటుంది. అప్పుడప్పుడూ తలవని తలంపుగా గత స్మృతుల మేఘాలు మెరిసి జ్ఞాపకాల జడివాన కురిసి మనసుని పన్నీటి జల్లుల్లోనో, కన్నీటి జల్లుల్లోనో తడిపేసి పోతాయి. కానీ, ఎక్కడా క్షణమైనా కాలు నిలపక మనని సైతం తనతో పాటు పరుగులు తీయమంటూ హడావిడి పెట్టేసే ఆత్రం కాలం సొంతం కదా! నిమిషమైనా నిలువనీక అలా అలా ముందుకి పద పదమంటూ నిత్యం తరుముతూనే ఉంటుంది. అలా పరుగులు తీస్తూనే అక్కడక్కడా మన దారిలో గబగబా చేతికందిన జ్ఞాపకాల జాజిపూలని గట్టిగా గుప్పిట చిక్కించుకుని, ఆ జాజిపూల పరిమళాల్ని గుండెల్లో భద్రంగా దాచుకుంటూ ముందుకి.. మును ముందుకి సాగిపోడమే! అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలనిపిస్తుంది. అంతలోనే ఏదో సంశయం.. నేను చాలా దూరం నడిచి వచ్చేశానేమోనని! కొంచెం తటపటాయిస్తూనే మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే నాకెంతో ప్రియమైన పూదోటలు కనుచూపు మేరలో కనిపించవు.. తరచి తరచి చూస్తే ఆకాశం కౌగిట్లో ఒదిగిన దూరపు కొండల్లా మసక మసగ్గా కనిపిస్తాయి. అంతలోనే కళ్ళల్లో నీళ్ళు నిండిపోయి ఆ దృశ్యం అంతా మరింత ముద్దైపోయి చూపు మసక బారుతుంది. ఇంతలో ఎక్కడి నుంచో నవ్వుల గలగలలు వినిపించి నా వెనకచూపుని మరల్చి ముందుకి చూడవోయ్ అంటూ పిలుస్తాయి. ఆ నవ్వుల తెరల్లో వీచే క్రొంగొత్త స్నేహ సమీరాలు నా తడి కళ్ళని ఆప్యాయంగా తడిమి నా పెదవులపై చిరునవ్వులు పూయిస్తాయి. నా ఎద లోతుల్లో పదిలంగా దాగి ఉన్న ఆనాటి జాజిపూల పరిమళాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాయి!
వైశాఖం మోసుకొచ్చే మరుమల్లెల సుగంధాలు, శ్రావణ మేఘాలు విసిరే విరిజల్లులూ, శారద రాత్రుల్లో విరిసే వెన్నెల మెరుపులూ, హేమంతంలో తరువులు చిత్రించే వర్ణసమ్మేళనాలు, శిశిరంలో మదిని మత్తెక్కించే మంచు మురిపాలు.. మార్పు అంటే ప్రకృతి సొంపుగా చిత్రించే కాలాలన్నీటి రంగుల కలబోతేగా! మన జీవితమూ అంతేనేమో!
*
నా ప్రియ '
నేస్తం'
కోసం..
ఇష్టంగా మురిపెంగా..!