Friday, January 08, 2010

టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..

నా మది గది తలుపులు ఎవరూ తట్టలేదు గానీ.. ఈ అందమైన వాక్యాలు ఒక పాట పల్లవిలోవి. ఇటీవలే విడుదలైన "కథ..నిజంగా జరిగిందా.?" అనే సినిమాలోది ఈ పాట. వినూత్న సినిమాలకి శ్రీకారం చుట్టే ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు గారి 'జస్ట్ ఎల్లో' బ్యానర్లో వచ్చిందీ సినిమా. సినిమా రావడమూ..పోవడమూ రెండు జరిగిపోయాయనుకుంటా..! ఈ సినిమా గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే 'మనస్వి' జయ గారి రివ్యూ ఇక్కడ చూడండి. నేను మాత్రం ఈ పాట గురించి చెప్తాను ఇప్పుడు. ఈ పాటకి యువ సినీకవి అనంత శ్రీరామ్ చక్కటి సాహిత్యాన్ని అందించారు. గాత్రపోషణ చేసింది నరేష్ అయ్యర్. ఈ సినిమాకి స్వరాలు అందించింది బహుశా కొత్త సంగీతదర్శకుడనుకుంటాను. ఆయన పేరు SK బాలచంద్రన్. ఇవీ టూకీగా పాటకి సంబంధించిన వివరాలు.


పాట మొదలే ఎంత బావుందో కదా అసలు.! టకటకమని ఎవరో మది తలుపులు తడితే.. తెరిచీ తెరవగానే ఒకేసారి ప్రాణం పోయినంత పని అయిందట. అంతటి పరవశమన్న మాట అబ్బాయికి.! ఇంకా, ఆ అమ్మాయి రాక ఇతగాడి జీవితంలో ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చింది అనే భావాన్ని అనంత శ్రీరామ్ చక్కటి, చిక్కటి మాటల్లో నింపేశారు. పల్లవి కంటే చరణాలు మరింత ఆకట్టుకుంటాయి ఈ పాటలో. పాట రాగం, అలాగే గాయకుడి గాత్రమాధుర్యం రెండూ పోటీ పడ్డాయనిపించింది నాకైతే. ఈ పాట సాహిత్యం క్రింద ఇస్తున్నాను. ఓ చూపు అటేసి.. అలాగే ఓ చెవు కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది మరి.!



టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!

టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!

ఆ హంతకి.. నాలో ఊహకి.. ఊపిరే పోసినది..
నే ఒంటరి.. అనే మాటని.. అంతమే చేసినది..

టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!

ఉలుకూ పలుకూ.. అసలెరుగని మనుసుని ఉసిగొలిపినదా అందం..
ఉరుకూ పరుగూ.. అవి తెలియని తలపుని తెగ తరిమినదే పాపం..
నీలాల నింగి తెర పైన గీసుకున్నానా ఆమె రూపం..
జగమంతా కాగితం చేసి రాసుకున్నానా ప్రేమ గీతం..
ఏ వేళలో.. ఎటేపెళ్లినా.. ఎదురుగా కనబడుతూ..
ఆ పాటనే.. ప్రతీ అక్షరం.. వదలక పలికినదీ..

హో.. అదిగో అదిగో.. ఆ అడుగుల సడి విని కదలని కదలిక రాదా..
అపుడే అకడే.. ఆ పెదవుల నగవుకి ఎదలోని బడలిక పోదా..
సంతోషం నీడలా మారి నడచి వస్తుంది ఆమె వెంట..
ఆనందం పాపలా చేరి ఆడుకుంటోంది ఆమె కంట..
నా రేయికి.. తనే వేకువై.. వెలుగునే ఇచ్చినదీ..
ఈ జన్మలో.. మరో జన్మనే.. మరుక్షణం చూపినదీ..

టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!


Monday, January 04, 2010

ఏమో.!


నా సాహచర్యం నీ జీవనచిత్రంలో క్రొంగొత్త రంగులు నింపిందన్నావు.

నీ కళ్ళలోకి చూస్తే నాపైనున్న అపరిమితమైన ప్రేమ తొణికిసలాడింది.
నాలో నేనే నా సంతోషం చిరునామాని వెతుకుతుంటే నీ రూపు కనిపించింది.
ఇంతకీ నీలో నేనున్నట్టా.. నాలోనే నువ్వున్నట్టా..!?
నేనే నువ్వా.. నువ్వే నేనా.. ఇద్దరం ఒకటేనా.!?
ఏమో.! ఆకాశానికి చందమామ అందమా.. చందమామకి ఆకాశం ఆధారమా అంటే ఏమని చెప్పగలం.?
ఆకాశం, చందమామ ఒకచోట చేరితేనే కదా అసలైన ఆనందం..!



Thursday, November 26, 2009

ఎందువలనా అంటే..!?

ఉషోదయాన పచ్చటి చిగురులపైన, పసిమొగ్గలపైన నిలచిన నీటిముత్యాలను చూస్తే నాకెందుకంత ఆనందమంటే చెప్పలేను..
తెల్లవారుజామునే చెట్టు కింద తెల్లని తివాచీలా పరచుకున్న పారిజాతాలను చూస్తే నాకెందుకంత పులకింతంటే చెప్పలేను..
సాయంసంధ్యలో అరవిరిసిన సన్నజాజులతో నిండిపోయిన తీగను చూస్తే నాకెందుకంత పరవశమంటే చెప్పలేను..
వినీలాకాశంలో ఠీవీగా నించుని అల్లరిగా చూస్తున్న నెలవంకని చూస్తే నాకెందుకంత మైమరపంటే చెప్పలేను..
నల్లని రేయిలో మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రాలను చూస్తే నాకెందుకంత కేరింతో చెప్పలేను..
వసంతంలో విరగబూసిన పూదోటని చూస్తే నాకెందుకంత మురిపెమంటే చెప్పలేను..
శరచ్చంద్రుని వెన్నెల వెలుగులు చూస్తే నాకెందుకంత తన్మయత్వమంటే చెప్పలేను..
హేమంతంలో ఎడతెరిపి లేకుండా వర్షించే జడివానని చూస్తే నాకెందుకంత ఉల్లాసమంటే చెప్పలేను..
శిశిరంలో కురిసే మంచుపూలను అద్దుకుని శాంతిసందేశంలా కనిపించే ప్రకృతిని చూస్తే నాకెందుకంత ప్రశాంతతంటే చెప్పలేను..
రెక్కలు విప్పి స్వేచ్ఛగా మబ్బుల్లో విహరించే విహంగాన్ని చూస్తే నాకెందుకంత సంతోషమంటే చెప్పలేను..
నీ పక్కనుంటే.. నీ చేయందుకుంటే.. నాకెందుకింత నిశ్చింతంటే చెప్పలేను..
నా చిన్ని మనసు చిరుస్పందనలకి కారణమేమని బదులివ్వగలను.!?