Monday, March 03, 2014

కలకీ ఇలకీ మధ్యన..



నా అంతఃపుర సౌందర్యానికి ధీటైనది ఏడేడు లోకాల్లోనూ లేదని ప్రతీతి. ఘనత వహించిన నా అంతఃపుర సౌధాలు అల్లంత దూరానున్న ఆకాశంతో కరచాలనం చేస్తూ నా వైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటాయి. తలుపులు, కిటికీలు, గోడలు సర్వమూ రంగురంగుల గాజు అద్దాలతో గొప్ప కళానైపుణ్యం రంగరించి పేర్చిన నా అంతఃపురపు అద్దాల మేడలు చూసేవారి కళ్ళని మిరుమిట్లు గొలుపుతుంటాయి. ప్రణాళికాబద్ధంగా ఏకరీతిన పెరిగిన విశాలమైన పచ్చిక మైదానాలు, వాటి మధ్యన నా ఆజ్ఞననుసరించి నిర్ణిబద్ధంగా పూవులు పూచే పూదోటలు, నా మాట జవదాటక నియమంగా పిందె తొడిగి నేను మెచ్చే రుచుల్లో మాగి ఫలాలనిచ్చే వృక్షసంపద, నేను ఆదేశించినపుడు నా మనసెరిగి వీచే అనిలం, నా కట్టుబాట్లకి తలవంచి కురిసే వానజల్లులు, నిత్యం నా కనుసన్నల్లో మెలిగే సూర్యకాంతులు, చంద్రకళలు.. ఒకటేమిటి.. నా రాచనగరులో నేను చూడని అందం, నాకు దక్కని ఆనందం లేవంటే అతిశయోక్తి కాదు!

ఎన్నో యుగాలుగా ఈ రాణీవాసపు అపూర్వ సౌందర్యంలో, అమర సౌఖ్యాలలో ఓలలాడుతున్న నాకు చిరునగవు తప్ప మరో భావన తెలియదు. సంతోషం, సంబరం తప్ప మరో అనుభూతి దరిజేరదు. ఇలా సాగుతున్న నా పయనంలో ఒకనాడు నేను కోరి కురిపించిన వెన్నెల జల్లుల్లో మబ్బుల తల్పం మీద నిదురిస్తుండగా ఎన్నడూ లేనిది ఆనాడే తొలిసారి అనుభవమైన కలవరపాటేదో నన్ను మేల్కొలిపింది. అర్ధనిమీలిత నేత్రాలతో వీక్షించగా గాలి తెమ్మెరలు, వెన్నెల కాంతులు తమ పని తాము నియమంగా చేసుకుపోతున్నాయి. కాస్త అటూ ఇటూ పరికించి చూసిన కనురెప్పలు అలసటగా తూలిపోయాయి.

మళ్ళీ అదే కలవరం రేగి నిదుర చెదరి కనులు తెరిచేసరికి నా చుట్టూ తెల్లని మబ్బుల పరుపు కనిపించనంత చిక్కటి చీకటి అలుముకుని ఉంది. ఏనాడూ నా ముందు కదలడానికైనా సాహసించని రంగుటద్దాల కిటికీలని కప్పిన పరదాలు అలజడిగా ఎగురుతూ చేస్తున్న శబ్దం మినహా మరేమీ వినిపించని నిశబ్దం! కిటికీ తలుపుల అద్దాలు గదిలో నేలను తాకే చోట తెరలు ఎగిరెగిరిపడుతూ ఆ సన్నటి చీలికల్లోంచి గదిలోపలికి కమ్ముకొస్తున్న తెల్లటి పొగ.. ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుపు.. వెన్నెల కన్నా పాల మీగడ కన్నా మిన్నగా మెరుపులు చిందిస్తోన్న తెలుపు రంగులో మెల్లమెల్లగా గదంతా కమ్ముకుంటూ నా దాకా వస్తోందా ధవళ ధూపం.

ఇదివరకెరుగని కలకలమేదో కొత్తగా నాలో పుట్టి ఆ ఉద్వేగానికి చలించిపోయి చప్పున కళ్ళూ, గుప్పిళ్ళూ గట్టిగా మూసేసి చేతులు రెండూ గట్టిగా పెనవేసి హృదయాన్ని పదిలం చేసాను. ఇప్పుడు ఈ నిశ్శబ్దంలో బెదురుతున్న నా గుండె చప్పుడు మినహా ఇంకేమీ వినిపించడం లేదు. నా పాదాలను తాకిన ఆ ధవళధూపం తాలూకు చల్లదనం జిల్లనిపిస్తుంటే కదలాలన్న స్పృహ పోగొట్టుకుని శిలలా నిలిచిపోయాను. పాదాల మీద సుతారంగా పారాడిన స్పర్శ రేపిన గిలిగింత కొత్తగా పరిచయమవుతుంటే పాదాల పైన తారాడుతున్న బంగారు మువ్వలు నా అనుభూతిని ప్రతిఫలిస్తూ చిరుసవ్వడి చేస్తున్నాయి. ఆ వణుకులోంచి తేరుకోకముందే అదే స్పర్శ పాదం అంచుకి జారి చిన్నారి వేలుని చటుక్కున లాగినట్టనిపించి అప్పటిదాకా భయం భయంగా బిగ్గరగా కొట్టుకుంటున్న గుండె సడి ఒక్క క్షణం లయ తప్పింది. పాదం చివరన ఎగసిన ఆ చిన్ని అల ఆపాదమస్తకం వ్యాపించి కనుపాప దోసిట ముత్యాలు రాల్చింది. తనువంతా అల్లిబిల్లిగా రెపరెపలాడుతున్న సీతాకోకచిలుకలు నా మనసుకి కూడా రెక్కలిచ్చి ఎగరేస్తుంటే ఆ మాయామోహంలో కొట్టుకుపోతూ ఇదేమో తెలియని అయోమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ అంతలోనే మెలమెల్లగా అలజడి తగ్గి చల్లదనానికి అలవాటు పడుతున్న ప్రాణం.. నాకు తెలీకుండానే మళ్ళీ మగతలోకి జారిపోయాను.

కలల్ని అల్లిన నిదురంతా కరిగి మళ్ళీ ఇలలోకి వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతా ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. రోజుటిలాగే నా ఆనతిననుసరించి వేకువ పొద్దు నీరెండ కిటికీ తెరల్లోంచి పల్చగా గది లోపల పరచుకుంటోంది. అద్దాల గోడలు, కిటికీలు ఎప్పటిలాగే తెరల వెనకాల మౌనంగా ముడుచుకు కూర్చున్నాయి. తెరలే గోడలేమో అన్న భ్రాంతిని కలిగిస్తూ కదలక మెదలక స్థిరంగా నిలుచునున్నాయి. అంతా యథావిధిగా ఉన్నాసరే రాత్రి నిదురలో నాకెదురైన అనుభవం అబద్ధమని నమ్మాలనిపించడం లేదు. ఆ తెల్లటి ధూపం, చిరుచలి, వణుకు, అన్నిటికీ మించి ఆ దివ్యస్పర్శ, నా కంటిపాపల్లో ఊరిన కన్నీటి ముత్యాలు ఇవన్నీ ఇంకా తాజాగా ఉన్నాయి.

రోజంతా రంగురంగుల పువ్వుల మధ్య సీతాకోకచిలుకలతోనూ, చిట్టి గువ్వలతోనూ ఆడుకునే ప్రయత్నం చేసాను. ఎప్పటిలా అవేవీ నన్ను సంతోషపెట్టలేకపోతున్నాయి. నా మోమున నవ్వు పుట్టనంటోంది. గుండె లోతుల్లో లోలోపల ఏదో నొప్పి, భరించరాని బాధ కలుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, వెన్నెల.. అందర్నీ రమ్మని పిలిచాను. ఎవరూ నాలో రేగిన ఈ కలవరాన్ని హరించలేకున్నారు. ఎన్నడూ లేనిది ఏదో మోయలేని బరువు మోస్తున్నట్టు విపరీతమైన అలసటగా ఉంది. అందరినీ వదిలి నా ఏకాంత మందిరంలో చేరి మబ్బు తునకలతో పేర్చిన తల్పం మీద వాలాను. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు పలికే నిద్రాదేవి మొదటిసారి మొహం చాటేసింది. కళ్ళు మూస్తే అదే కలవరం.. అరిపాదాల్లో రేగే అలజడి గుండె దాకా వరదలా కొట్టుకొస్తోంది. ఆ మాయాధూపం మళ్ళీ వస్తే అదేంటో తరచి చూడాలని ఎదురు చూస్తూ కళ్ళు మూసుకునే మెలకువలో ఉండిపోయాను.

గదంతా తెల్లగా నిండిపోతున్న వెలుగు కనురెప్పల మీద వాలుతోంది.. మళ్ళీ అదే చల్లని స్పర్శ నన్ను తాకిన అనుభూతి.. నాకు సహకరించని కళ్ళని బలవంతంగా తెరిచాను. గదంతా తెల్లటి పువ్వుల వాన కురుస్తోంది. ఎక్కడి నుంచి రాలుతున్నాయో తెలీని ఆ సుమాలు నేలను తాకుతూనే అదృశ్యమైపోతున్నాయి. అంతకంతకూ చలి పెరిగిపోయి నేను వణికిపోతున్నాను.
ఆ పూలవానలో వాటితో పోటీపడుతున్న తెలుపుతో మెరిసిపోతూ నావైపే నడిచి వస్తూ కనిపించాడు అతను.
అటువైపు చూస్తూనే అప్రయత్నంగా నా పెదవులు మొదటిసారి పలికాయి 'ప్రేమ' అనే మాటని.. ఇన్ని యుగాలుగా నాకు తెలీకుండానే నేను ఎదురుచూస్తున్నదేదో ఇప్పుడే ఎదురైన అద్భుతంలా, చుట్టూ వెల్లివిరిస్తున్న శాంతి నా మనసంతా నిండిపోతూ, మేనంతా గాలి కన్నా తేలికైపోయి చుట్టూ కురుస్తున్న తెల్లటి పువ్వుల మధ్యన విహరిస్తున్న భావన..
అంతటి సాన్నిహిత్య భావన కలిగాక 'నువ్వెవరివి' అని అడగాలన్న ప్రశ్నే ఉదయించలేదు నాలో.
"నువ్వు.. నువ్వెలా రాగలిగావు ఇక్కడికి?" అడిగాను నాలో నేనే గొణుక్కుంటున్నంత మెల్లగా.
అతను నవ్వాడు. అతను నవ్వుతుంటే చుట్టూ రాలుతున్న తెల్లటి పూవులన్నీ వెలవెలబోతున్నాయి.
"నేను రావాలనుకుంటే ఎక్కడికైనా రాగలను" అన్నాడతను.
"ఎందుకు రావాలనిపించింది నీకు?"
"నీకు తెలియని కొత్త లోకాన్ని చూపిద్దామనీ.."
"నాకు తెలియని లోకమా?" అని ఎదురుతిరిగే లోపు నిన్నటి నుంచీ ఎదురైన అనుభవాలన్నీ గుర్తొచ్చి ఆ మాటని పెదవి మాటునే దాచేసాను.
"అయితే నాకింతవరకూ తెలియని భారాన్నీ, మనోవ్యథనీ, కన్నీటినీ రుచి చూపించడానికి వచ్చానంటావా? నాకిక్కడే బాగుంది. నా అంతఃపురం దాటి నేనెక్కడికీ రాను."
"ఈ రంగుటద్దాలకి అవతల దూరంగా ఓ అందమైన లోకం ఉంది. ఈ అంతఃపురం దాటి నాతో వస్తే నువ్వింతవరకూ చూడని కొత్త రంగులు చూపిస్తాను. వస్తావా మరి?"
నేను ఆలోచనలో పడ్డాను. "అమ్మో ఇంత చలి నా వల్ల కాదు" అన్నాను వణికిపోతూ.
"ఏదీ.. నా అరచేతుల్లో నీ పాదాలుంచు.. నిన్ను నా గుండెల్లో పొదువుకుని భద్రంగా తీసుకెళతానుగా.." అంటూ అనునయంగా నా పాదాలని తాకిన ఆ చిరువెచ్చని చేతిస్పర్శని దూరం చేయలేకపోయాను.
అతని చెయ్యందుకుని మొదటిసారి నా అంతఃపురం గడప దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

చుట్టూ బలంగా వీస్తున్న ఈదురు గాలులేవీ నన్ను తాకలేని అదృశ్య శక్తి ఏదో వచ్చి చేరింది నాలో. అతనితో కలిసి ఎంత దూరం నడుస్తున్నా ఆకలిదప్పులు, అలసట తెలియడం లేదు. నేనెరిగిన అద్దాల మేడల ఆనవాలు సైతం అంతమైపోయేంత దూరం తీసుకెళ్ళాడు. దారి పొడవునా ఎవరూ అడక్కుండానే పూస్తున్న పువ్వులు, ఎవరూ వినకపోయినా పాడే గువ్వలు, అడక్కుండానే పండ్లని దోసిట్లో రాల్చే చెట్లు, ఎవరి కోసమూ ఆగకుండా ఉరకలేసే ఏరూ.. చాలా వింతలు కనిపించాయి. వాటన్నీటినీ సంభ్రమంగా చూస్తూనే అవన్నీ దాటుకుని మరో కొత్త లోకంలోకి అడుగు పెట్టాము.

అక్కడ ఎటు చూసినా ఒకటే రంగు.. తెల్లటి తెలుపు.. ఎత్తైన పర్వతాలు, వాటి నిండా దట్టంగా ఎదిగిన చెట్లు, కొండలోయల్లో నీటి చెలమలు, చెరువులు.. భూమ్యాకాశాలు మొత్తం తెల్లగా మెరిసిపోతూ పారిజాతాల రెమ్మలు ఆరబోసినట్టు, సన్నజాజుల రెక్కలు వెదజల్లినట్టు అన్నిటా అంతటా తెల్లటి మెరుపే నర్తిస్తోంది. ఇన్నాళ్ళూ నేను చూడని రంగే లేదనుకున్న నా గర్వాన్ని తుడిచిపెడుతూ అన్ని రంగుల్నీ తనలోనే ఇముడ్చుకుని వింత కాంతుల్లో శోభిస్తున్న ధవళవర్ణం నా కన్నుల్ని వెలిగిస్తోంది.

ఇంకాస్త ముందుకి వెళ్ళాక నీలాకాశం దిగొచ్చి నీటిలో దాగినట్టుంది. అక్కడ సముద్రానికి అంతెక్కడో, ఆకాశానికి హద్దెక్కడో ఎంత ప్రయత్నించినా నా చూపుకి అందడం లేదు. సముద్రపు ఒడ్డున తెల్లటి ఇసుకలో మా ఇరువురి అడుగుల గుర్తులు జతగా పడుతున్నాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు పడినప్పుడు నీలిరంగు నీళ్ళ మీద, తెల్లటి ఇసుక మీద పుట్టే వింత రంగుల్ని నేనిదివరకెన్నడూ చూడలేదు. అదే సముద్రం మీద వెండి వెన్నెల కురుస్తున్నప్పుడు నల్లటి నీటి అద్దంలో మంచుబొమ్మలా మెరిసిపోయిన నా ప్రతిబింబాన్ని, ఎగిసిపడే సంద్రపు కెరటాలపైన విరిసిన వన్నెల్ని వర్ణించే శక్తి నాకు లేదు. పుట్టి బుద్ధెరిగాక నా ఊహలకైనా అందని అందం, ఆనందం అనుభవంలోకి వస్తున్న భావన!
నేనింకా ఆ సరికొత్త ప్రపంచపు అనుభూతుల్లో మునిగి ఆనందాశ్చర్యాల్లో తేలుతుండగా అతనన్నాడు.
"ఇప్పుడు నమ్ముతావా నీకు తెలియని అందమైన లోకం వేరొకటి ఉందని?"
ఈ కొంగొత్త సౌందర్యం తాలూకు పరవశం నన్నింకా ఇంకా గమ్మత్తుగా కమ్మేస్తుండగా "ఊ.."అని మాత్రం అన్నాను.
"ఇక బయలుదేరుదామా.. నిన్ను పదిలంగా నీ గూటికి చేర్చాలిగా!"
ఉన్నపళంగా ఆకాశంలో తేలే మబ్బుల ఒడిలోంచి పాతాళ లోకపు అగాథంలోకి జారిపడ్డంత బెదురు కలిగింది. బేలగా చూసాను అతని కళ్ళల్లోకి. అడ్డు పడిన కన్నీటి తెర అక్కడేముందో చూడనివ్వలేదు.

అంతటి దూరమూ క్షణాల్లో ప్రయాణించి నా అంతఃపురపు రంగుటద్దాల గదికి తిరిగొచ్చేసాము. 
అతని చల్లని స్పర్శ అలసిన కనురెప్పల మీద సుతారంగా సోకుతుంటే తనువు, మనసు నా ఆధీనంలోంచి జారిపోయాయి. నిద్రాదేవి ఒడి చేరిపోయాను. మళ్ళీ ​నాకు మెలకువొచ్చేటప్పటికి నా గదిలో ఎప్పటిలాగే నా నియమావళిని అనుసరించి ప్రసరించే వెలుతురు, వీచే గాలి యాంత్రికంగా తమ విధులు నిర్వర్తిస్తున్నాయి.​ నేను లేచి అద్దాలకి అవతలవైపున్న ప్రపంచాన్ని చూడాలన్న తాపత్రయంతో​ అద్దాల గోడలని కప్పి​న పరదాలు తొలగించాలని ప్రయత్నించాను. ఒకదాని వెనుక ఒకటి రంగు రంగుల తెరలు ఎంతకీ తరగకుండా పుట్టుకొస్తూ​ ఆ అద్దాలు దాటి ఆవలి వైపుకి నన్ను చూడనివ్వడం లేదు​. ఈ అద్దాల మేడలు, నే పిలిస్తే పూచే నా పూదోట, నేను కోరితే పాటలు పాడే గువ్వలు, నా నియంత్రణలో ఉండే చీకటి వెలుగులు.. ఇవన్నీ వాటి పూర్వపు ప్రాభవాన్ని కోల్పోయి నా వేదనని ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి.

ఆనాటి నుంచీ నా చుట్టూ ఘనీభవించిన ఏకాంతంలో కాలం ఆగిపోయిందో గడుస్తుందో నాకు తెలియడం లేదు. మళ్ళీ ఎప్పుడూ నా రంగుటద్దాల కిటికీ తెరలు రెపరెపలాడనే లేదు. ఏనాటికైనా వాటిలో చలనం కలిగి పక్కకి తొలగి నా కలని కళ్ళముందు నిలుపుతాయన్న వెర్రి ఆశ కొద్దీ నేను అటు వైపు చూడడం మానుకోనూ లేదు.

మునుపటి రోజుల 'నేను' మళ్ళీ నాకెప్పటికీ దొరకలేదు. ఎన్నటికీ మరువలేని తిరిగిరాని స్వప్నం కోసం కలకీ ఇలకీ మధ్యన ఊయలూగుతూ మిగిలిపోయాను... అతని జ్ఞాపకాలకి బంధీగా!


*** That's the 300th post on this blog.
Thanks everyone who is admiring this blog. I sincerely appreciate all your encouragement and motivation to keep me writing! :-)

Saturday, March 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 3


నీలూ చెప్పినట్టే గుడికి వెళ్ళడానికి తయారవుతోంది మేఘ. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటుంటే తన వెనుకగా ఉన్న తలుపు కాస్త తెరుచుకుని సందులోంచి కెంజాయ రంగు పట్టులంగా కొద్ది కొద్దిగా కనిపిస్తోంది అద్దంలో.
లేచి తలుపు దగ్గరగా వచ్చి ఎవరదీ.. తలుపు వెనక దాక్కుందీ.. పూజా.. నువ్వేనా? అడిగింది మేఘ. వెంటనే తలుపు సందులోంచి కనిపిస్తున్న పట్టులంగా మాయమైపోయి ఘల్లుఘల్లుమనిమువ్వల చప్పుడు వినిపించింది​.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక మార్చి సంచికలో...​


Wednesday, February 19, 2014

పాలగుమ్మి రామకృష్ణారావు గారి నవల 'బలిదానం'

మనిషి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం.

జీవితంలో దాదాపు అన్ని రకాల దశలు దాటి వచ్చి అవసాన దశలో కన్నుమూసిన వారి గురించి బాధపడినా, ఈ భూమ్మీద జీవితాన్ని సంపూర్ణంగా జీవించి నిష్క్రమించారులెమ్మని తలుస్తారు వారితో బంధం ఉన్నవారు. అదే చిన్న వయసులో ఏ జబ్బుల బారినో, అనుకోని ప్రమాదాల బారినో పడి మరణించినవారి గురించి శోకించి శోకించీ చివరికి ఇది కర్మ ఫలితం మన చేతిలో ఏముందిలెమ్మని కాస్త నిబ్బరంగా సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు.

అదే ఒక వ్యక్తి తన ప్రాణాలు తనే నిలువునా తీసేసుకుంటే?

ఆ మరణవార్త తెలిసినవారందరూ ఆ వ్యక్తితో కనీస పరిచయం లేని వారు కూడా కేవలం వార్త విని " అయ్యయ్యో.. అంతటి కష్టం ఏమొచ్చిందో పాపం! బంగారం లాంటి జీవితాన్ని అంతం చేసుకున్నాడు!" అని బాధ పడతారు.
ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని కష్టాలున్నా 'బంగారం లాంటి జీవితం' అనే అంటారు. దానిక్కారణం పుట్టుక అనేది మనకి తెలీకుండా, మన ప్రమేయం లేకుండా ఆయాచితంగా ఈ భూమ్మీద బతకడానికి లభించిన అవకాశం. అసలు ముందు మనం అంటూ ఉంటే కష్టాలో, నష్టాలో వేటినైనా ఎలా ఎదుర్కొనగలమో, ఎలా పరిష్కరించుకోగలమో ఆలోచించి ప్రయత్నించవచ్చు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కష్టాలు ఇవీ.. అని తెలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో "అయ్యో పాపం! ఇంత నరకయాతన అనుభవించాడా! దురదృష్టవంతుడు!" అని జాలి పడి చావు తర్వాత మరణించిన జీవి అస్తిత్వం ఏమవుతుంది అని ఎవరికీ ఇదమిద్దంగా తెలీకపోయినా కూడా అన్ని కష్టాలు అనుభవించిన ఆ జీవికి కనీసం చావుతోనైనా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటారు.

మరి.. ఒక వ్యక్తి "హక్కుల కోసం, సమాజం కోసం, ప్రభుత్వాన్నో, పార్టీలనో బెదిరించడం కోసం, ప్రజలందరి భవిష్యత్తు కోసమే నా ఈ ఆత్మాహుతి" అంటూ తన ప్రాణాన్ని తృణప్రాయంగా తగలబెట్టుకుంటే?

ఎక్కడో ఒక చిన్న పల్లెలో పగలనకా, రేయనకా ఒళ్ళు గుల్ల చేసుకుని నాలుగు పైసలు సంపాదించి మా పిల్లలు మాలాగా కష్టాల్లో బతక్కూడదు, నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకుని మంచి ఉద్యోగం చేసి దొరబాబులా బతకాలి అని పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి చేయాల్సిన న్యాయం సంగతి మర్చిపోయి ఉద్యమాల కోసం బలిదానం అయ్యే యువకుల చావుల గురించి ఎలా అర్థం చేసుకోవాలి?
ఏదైనా సాధించాలన్న తపన, పట్టుదల ఉన్నవాళ్ళు బతికి సాధించాలి కానీ ఎవడినో బెదిరించడానికి, ఎవరి సిద్ధాంతాలనో గెలిపించడానికి వీళ్ళు చావడం ఏమిటో?

ప్రభుత్వం ఫలానా చెడ్డపని చేసిందంటూ వెంటనే కనిపించిన ప్రభుత్వ కార్యాలయాల మీదా, వాటి ఉద్యోగులైన డాక్టర్ల మీదా రాళ్ళూ రప్పలు విసిరి, ప్రభుత్వ ఆస్తులు అన్న పేరు తగిలించి కనిపించిన బస్సులు, రైళ్ళు తగలబెట్టి, రోడ్ల మీద టైర్లు మంట పెట్టి తమ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నాం, వ్యవ్యస్థ మీద తిరుగుబాటు చేస్తూ పోరాడుతున్నాం అనుకునేవారు చేసే పనుల వల్ల ఎవరి ఆస్తికి నష్టం జరుగుతుంది, ఎవరి జీవితాలు స్థంభించిపోతున్నాయి అన్నది ఆలోచించరెందుకో?

కాలేజీల్లో, యూనివర్సిటీల్లో గొప్ప చదువులు చదివి విజ్ఞానాన్ని సంపాదించి, దాన్ని వ్యవ్యస్థని బాగు చెయ్యడానికి, కన్నవాళ్ళని, ఉన్న ఊరిని, దేశాన్ని ఉద్ధరించడానికి వినియోగించాల్సిన విద్యార్థులు..
"మా చదువులు పూర్తిగా నాశనమైనా పరవాలేదు. స్కూళ్ళు మూసేసినా పరవాలేదు, పరీక్షలు ఆపేసినా పరవాలేదు, కాలేజీలు మానేసి జైల్లో కూర్చున్నా పర్వాలేదు, చివరికి ఏ కిరోసినో, పెట్రోలో పోసుకుని మమ్మల్ని మేము తగలెట్టుకున్నా పరవాలేదు" అంటూ ఆత్మాహుతులకీ, బలిదానాలకి సిద్ధం అవుతుంటే వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవాళ్ళ, ఊరి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో కదా!

ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావు గారు రాసిన నవల 'బలిదానం'. కౌముది మాసపత్రికలో జనవరి 2012 నుంచీ సెప్టెంబర్ 2012 దాకా ధారావాహికగా వచ్చిన ఈ నవల ఇప్పుడు పూర్తిగా e-బుక్ రూపంలో కౌముది గ్రంథాలయంలో లభ్యమవుతోంది.

కేవలం 38 పేజీలు  ఉన్న ఈ చిన్న నవల చదవడం పూర్తయ్యాక చాలా ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ప్రతి నిత్యం పొద్దున్నే పేపర్లో ఇలాంటి వార్త ఏదో ఒకటి చూస్తూనే ఉండటం వల్ల ఈ నవల చదువుతున్నంతసేపు కేవలం ఇదొక నవలే కదా అన్న భావన రాకుండా, నిజంగా ఇలా ఎందరి జీవితాలు నలిగిపోతున్నాయో అనిపించి మనసు భారమవుతుంది. చాలా సహజంగా రాశారు రామకృష్ణారావు గారు.

ఒక ఉద్యమం తప్పు, ఒక పోరాటం తప్పు, సామాజిక స్పృహ ఉండటం తప్పు అని ఎవరూ అనరు కానీ ప్రాణాలు తీసుకోవడం ద్వారా దేన్నో గెలిపించాలన్న భావన పోగొట్టుకుని బతికి పోరాడి ఏదైనా సాధించాలని మన యువత గుర్తిస్తే మన దేశం మరింత బాగుపడుతుందేమో!

పాలగుమ్మి రామకృష్ణారావు గారి నవల 'బలిదానం' ఇక్కడ కౌముది గ్రంథాలయంలో ఉచితంగా చదవొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.