జంతికలు, మురుకులు, చక్రాలు, కారప్పూస, చక్కిలాలు.. ఇలా అష్టోత్తరం చదవచ్చనుకుంటా ఈ పిండివంటకున్న పేర్లతో. చిన్నప్పుడు ఏ దసరానో, దీపావళి పండగో వచ్చినప్పుడు స్కూల్లో తోటి పిల్లలు మా ఇంట్లో చక్రాలు చేసారు అని చెప్తే అదేదో కొత్త వెరైటీ అనుకుని ఇంటికొచ్చి అమ్మని గట్టిగా అడిగేసాను ఆ చక్రాలేవో అర్జెంటుగా నువ్వు మాకు చేసి పెట్టమని. చక్రాలన్నా కారప్పూస అన్నా ఒకటేలే అని అమ్మ నా ఉత్సాహమంతా ఒక్క ముక్కలో తీసి పారేసింది. జంతికలు, మురుకుల గురించి కూడా అలాంటి ఆశాభంగాలు ఎదుర్కొన్నాక బోడి ఒక్క పిండి వంటకి ఇన్నేసి పేర్లా అని కోపం కూడా వచ్చింది.
చిన్నప్పుడు కారప్పూస తినడం సంగతెలా ఉన్నా వాటిల్లో రకరకాల అక్షరాలూ, బొమ్మలు వెతికి కనిపెట్టి వాటిని తినెయ్యడం, వాటి గురించి నా కారప్పూస గొప్పదంటే నాది గొప్పదని తమ్ముడూ నేనూ వాదించుకుని కొట్టేసుకోడం, గచ్చు మీద బొమ్మలు పేర్చిన కింద, ఇద్దరం కొట్టుకున్న కింద తినడం కన్నా ఆగం చేస్తున్నామని అమ్మ చేత తిట్లు తినడం.. ఇవన్నీ భలే సరదాగా ఉండేవి. అమ్మా, అమ్మమ్మా కలిసి కారప్పూస చేస్తుంటే నేను కూడా పొయ్యి చుట్టూ తిరుగుతూ నేనొకసారి పిండిని నూనెలో వత్తుతానని గోల చేసేదాన్ని. ఎంత బతిమాలినా అస్సలు ఒక్కసారి కూడా ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సర్లెమ్మని వాళ్ళు చేస్తుంటే చూస్తూనైనా సరదా పడేదాన్ని. జంతికల గిద్దెల్లో అడుగున ఉంటె రేకుల మీద రకరకాల ఆకారాల్లో కన్నాలు ఉంటాయి కదా. వాటిల్లో నక్షత్రపు ఆకారంలో ఉన్న దాన్ని చూసి దానితో పిండి వేస్తే నక్షత్రాల్లా రాలిపడుతుందేమో, అవన్నీ నూనెలో వేగాక అలా గుప్పెడుతో నక్షత్రాలు తీసుకోవచ్చేమో అని తెగ సరదా పడేదాన్ని నేను. ఆ నక్షత్రాల రేకుతో వేస్తావా లేదా అని చాలా రోజుల పాటు అమ్మని విసిగించగా విసిగించగా నా పోరు పడలేక దానితో వేసింది. అవేమో నేను అందంగా ఊహించుకున్నట్టు నక్షత్రాలు రాలేదు. మురుకుల్లా వచ్చాయి. అబ్బా.. భలే బాధ పడిపోయాన్లే అప్పుడు. అయినా మిగతావన్నీ సన్నగా దారాల్లా వస్తుంటే చూస్తూ కూడా దీనితో అలా నక్షత్రాలు వస్తాయని నేనెలా ఊహించుకున్నానో, అదేం తింగరి లాజిక్కో నాకిప్పటికీ అర్థం కాదు ఎంత ఆలోచించినా. :-)
అరిసెలా.. వద్దే వద్దు, సున్నుండలా.. నా వల్ల కాదు, లడ్డూ, మైసూరు పాకా.. మీకో దండం, గవ్వలా.. అంత తీపి నావల్ల కాదు బాబోయ్.... చిన్నప్పుడు ఈ టైపులో స్వీట్లంటే ఆమడ దూరం పరిగెత్తే నాకు ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడూ ఈ కారప్పూసే గతి అయ్యేది. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళమైపోయేసరికి ప్రతీ పండక్కీ ఈ డొక్కు కారప్పూస తినాలా అని విసుగొచ్చేది. హైస్కూలు కొచ్చేసరికి ఆ విసుగు కాస్తా విరక్తిగా మారి పండగ వస్తుందంటే ముందే అమ్మా కారప్పూస కాకుండా వేరే ఇంకేం చేస్తావో చెప్పమని అడిగేదాన్ని. నా హింస పడలేక వాటితో పాటుగా ఏ చెక్కలో, బూందీనో, చేగోడీలో తప్పకుండా చేసేవారు. అసలు ఈ కారప్పూసకున్న విశిష్టత ఏంటంటే ఒక్కొకరింట్లో చేసినవి ఒక్కో రంగు, రూపు కలిగి ఉంటాయి. దానికి తగ్గట్టు వరి పిండి, శనగపిండి అప్పుడప్పుడూ మినప్పిండి, జొన్నపిండి వగైరాలన్నీ రకరకాల వంతుల్లో కలిపి చెయ్యడం, వాము, జీలకర్ర, నువ్వులు లాంటివన్నీ కలపడం, సన్నగా, లావుగా బోల్డు ఆకారాల్లో చెయ్యడం మూలంగా ఈ జంతికలు ఇంటికో రుచిలో ఉంటాయన్నమాట. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారేమో ఇల్లొదిలేసి హాస్టళ్ళ చూరు పట్టుకు వేలాడే రోజుల్లో అందరు స్నేహితులు తీసుకొచ్చినవి రుచి చూసి ఈ విషయం మీద బోల్డు ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాంలెండి.
సరే అప్పట్లోనే అలా ఉంటే ఇక దేశం దాటి వచ్చేసరికి పూర్తిగా
కారప్పూస ఊసే మర్చిపోయాను. కొన్నాళ్ళ క్రితం ఒకరోజు స్నేహితులతో కలిసి
ప్రయాణం చేస్తుంటే వాళ్ళు జంతికల డబ్బా తీసి ముందు పెట్టారు. సాధారణంగా ఇలా
ఎవరన్నా తెలుగింటి పిండివంటలు పెట్టారంటే ఈ మధ్యే ఇండియా నుంచి
దిగుమతి చేసుకున్నారని అర్థం. కానీ ఈ జంతికలు మాత్రం కొత్తగా
ఇక్కడికొచ్చిన ఒక తెలుగమ్మాయి స్వయంగా చేసిందట. ఈ మాట వినగానే మా
ఇంటబ్బాయ్ గారు తెగ ఆనందపడిపోయి "ఆహా.. నిన్న గాక మొన్న కొత్తగా పెళ్ళై వచ్చిన పిల్ల అప్పుడే ఇలాంటి పిండి వంటలు కూడా వండేస్తోందా.. ఆహా తంతే
వెళ్లి కారప్పూస గుట్ట మీద పడ్డాడన్నామాట మనోడు" అని సదరు అమ్మాయిని పెళ్ళి
చేసుకొచ్చిన స్నేహితుడి అదృష్టాన్ని ఉదారంగా పొగిడేసాడు. నాక్కూడా భలే
ముచ్చటనిపించి ఆ అమ్మాయిని మెచ్చుకున్నాను. అయితే అంతటితో అయిపోలేదు ఆ ముచ్చట.
ఇవాళ ఏం కూర చేసావని మాటవరసక్కూడా ఎప్పుడూ అడగని మా ఇంటబ్బాయ్ గారికి తిండి మీద, వంట మీదా ఇంత ఆసక్తి ఎలా వచ్చిందబ్బా, మరీ అంత అద్భుతంలా దేవలోకం నుంచీ జంతికలు జారిపడ్డట్టు పరమానందపడిపోతున్నాడు అనిపించి అదే
మాట అరిచేసాను. అదే అదే శాంతంగా అడిగేశాను (వేరే ఎవరో అమ్మాయిని
పొగిడేసాడనే కుళ్ళూ కుట్రలు ఏమీ లేవని మీరందరూ నమ్మాలి మరి..
జంతికల మీదొట్టు). అంటే అసలిక్కడకొచ్చాక జనాలు ఓపిగ్గా వంట చెయ్యడమే గగనంలా ఉంటే అంత శ్రద్ధగా పిండివంటలు కూడా చేస్తోందంటే గొప్పే కదా మరి.. అందుకే మెచ్చుకున్నాన్లే అని సమాధానపరిచారు ఇంటబ్బాయ్ గారు.
ఇక లాభం లేదు అర్జెంటుగా ఆ జంతికలేవో మనం కూడా చేసిపడేసి (అంటే తినలేక పడేసేలా చెయ్యడం కాదు సుమీ) ఆ మెచ్చుకోలేదో మనమూ సాధించుకోవల్సిందేనని కంకణం కట్టుకున్నాను. లేడికి లేచిందే పరుగన్నట్టు నేను కంకణం కట్టుకుంటే సరిపోతుందా
జంతికల గిద్దలు లేకుండా చెయ్యడం ఎలా కుదురుతుంది? ఆ ఆశాభంగానికి అయ్యయ్యో అని దీనంగా నిట్టూర్చి ఆవేశంగా కట్టుకున్న జంతికల కంకణం కాస్తా విప్పి పక్కన పెట్టి
ఇంకొన్ని రోజుల్లో ఇండియా వెళ్తాను కాబట్టి అప్పుడు కారప్పూస గిద్దెలు తీసుకొచ్చి
నా యొక్క జంతికల ప్రతిజ్ఞ నేరవేర్చుకుందాంలే అనుకున్నాను.
ఇండియా నుంచి వచ్చేప్పుడు నేను చేసి పంపిస్తానని అమ్మ ఎంత బతిమాలినా కూడా "నువ్వేం కష్టపడి చెయ్యకమ్మా.
అక్కడికెళ్ళాక నేను చేసుకుంటాలే" అని వద్దంటే వద్దని గోల చేసాను. సరే.. ఇప్పుడు కావాల్సిన ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంక రంగంలోకి దూకడమే ఆలస్యం. ఎందుకైనా మంచిదని మళ్ళీ అమ్మకోసారి ఫోన్ చేసి వివరంగా కనుక్కున్నా. నూనెతో జాగ్రత్త అదీ ఇదీ అని అమ్మ సవాలక్ష జాగ్రత్తలు చెప్తుంటే "అబ్బా అమ్మా
కారప్పూస చెయ్యడం ఏమన్నా పెద్ద బ్రహ్మవిద్యా.. ఏం పర్లేదులే"
అని ధైర్యం చెప్పేసి అమ్మ చెప్పినట్టే చేసాను. నిజంగానే నేనన్నట్టు ఇదేం
బ్రహ్మవిద్య కాదని నిరూపిస్తూ చక్కగా కుదిరాయి. ఆ ఉత్సాహంలో చిన్న చిన్న
మార్పులతో రెండు మూడు రకాలు ప్రయత్నిస్తే అన్నీ బానే వచ్చాయి.
అమ్మకి ఫోన్ చేసి చెప్తే అమ్మ ఆనందిస్తూనే "నేను ఇక్కడ
నుంచి చేసి పంపించాల్సింది. పాపం నీకెంత
శ్రమ.." అని కాస్త నొచ్చుకుంది. ఇంతలో నాన్న వచ్చి ఏంటీ సంగతి అనడిగారు. అబ్బో ఇప్పుడు మా నాన్నారు నన్ను తెగ పొగిడేసి ఆకాశపు అంచుల దాకా
తీసుకెళ్ళిపోతారు కదాని ఇదీ విషయం అని చెప్పాను. ఆయనేమో ఓస్ అంతేనా..
అదేమన్నా బ్రహ్మవిద్యా.. సులువేగా.. అని ఒక్క మాటలో తీసి పడేసారు.
"హెంత మాటన్నారు నాన్నారూ.. మీకు కనీసం టీ పెట్టడం కూడా రాదు గానీ నేనింత గొప్ప పని చేస్తే నా ప్రతిభని గుర్తించకుండా అదెంత పని అని తీసిపడేస్తారా? అసలు పుత్రికోత్సాహం అంటే పుత్రిక జనియించినప్పుడు కాదు ఆ పుత్రికకి సొంతంగా విజయవంతంగా జంతికలు చెయ్యడం వచ్చిననాడే పొందాలని పురాణాల్లో చెప్పారు తెల్సా మీకు.." అని జంతికోపదేశం చేసేసరికి పాపం నాన్నారు భయపడి అర్జెంటుగా మెచ్చేసుకున్నారు నన్నూ నా జంతికల్ని కలిపి.

నాకు తెలుసు మీరిప్పుడు ఏమనుకుంటున్నారో.. మా ఇంటబ్బాయ్ మెచ్చుకున్నారా లేదా
అనే కదా.. తినాలంటే తప్పదు కదా మరి పాపమ్.. హిహ్హిహ్హీ..
హాయిగా తిని ఊరుకోకుండా ఓ మాట కూడా అన్నారు "అప్పుడెప్పుడో ఎవరో అమ్మాయిని మెచ్చుకోవడం వల్ల ఇవాళ మనింట్లో జంతికలు తినే భాగ్యం కలిగిందన్నమాట.. ఆహా ఏం లాజిక్కు.." అని. "హెంత ఘోరం నేరం.. ఎవరో ఓ గుప్పెడు జంతికలు పెడితే సంబరపడిపోయావు కదాని కష్టపడి నేను నేర్చుకుని చేసి పెడితే ఇంత మాటంటావా.. ఇంత ఘోరంగా అనుమానించి అవమానించిన పాపానికి నీకు నా చేత్తో చేసిన జంతికలు తినే భాగ్యం లేదింక.. ఇదే జంతిక న్యాయం ప్రకారం నీకు విధించే శిక్ష.." అని తన చేతిలోంచి డబ్బా లాగేసుకుని పూర్తి అహింసాయుతంగా సతి హక్కుల సాధన కోసం కృషి చేసి చివరికి తన చేత "పత్ని మాటలు, చేతలు వంద విధాల రైటు, గ్రేటు" అనిపించాననుకోండి. అది వేరే విషయం. :-)
అంతా బానే ఉంది ఇంతకీ మరి అసలు బ్రహ్మవిద్య ఏంటనేది చెప్పాలి కదా.. ఈ విజయగర్వంతో మొన్నొక రోజు ఎందుకో కొబ్బరి బూరెలు గుర్తొచ్చి అవి కూడా చేసేద్దామని మళ్ళీ తాజాగా ఇంకో కంకణం కట్టేసుకున్నా. అందరూ తడి బియ్యంతో పట్టిన పిండితో బూరెలు చెయ్యాలంటున్నా అది మనకి కుదిరే పని కాదులెమ్మని, అయినా తడి పిండికీ, పొడి పిండికీ ఏ మాత్రం తేడా పడుతుందో తేల్చి చూద్దామని ఆ ప్రయోగం కూడా చేసేసాను. మరి కొబ్బరి బూరెలేవీ? అని అడక్కండి. ఎందుకంటే అప్పుడే కదా మరి నాకు "కొబ్బరి బూరెలు చెయ్యడం ముమ్మాటికీ బ్రహ్మవిద్యే" అని జ్ఞానోదయం కలిగింది. :-D

అసలే ఈ కలికాలంలో సాక్ష్యాలు, రుజువులూ లేకుండా ప్రతిభని ఎవరూ గుర్తించని కారణంగా
బొమ్మలు చూపించడమైనది. :-)