బ్లాగ్మిత్రులందరికీ 'వికృతి' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

మది వీణియపై పలికిన మధుమోహన రాగాల భావతరంగిణి!

గోదావరి ఒడ్డున సాయంసంధ్యాసమయంలో నించున్నాను.
పడమటన బంగారుబంతిలా మెరుస్తున్న సూరీడు మెలమెల్లగా గౌతమి ఒడిలో మమేకమైపోతున్నట్టుంది.
చల్లని గాలి తెమ్మెరల గిలిగింతలకి నీటి అలలు వయ్యారంగా కదులుతున్నాయి.
వాటిపైన పడి మెరుస్తున్న సూర్యకిరణాలను చూస్తుంటే నక్షత్రాలు దిగొచ్చి గోదావరి అలలపైన తేలియాడుతున్నాయా అన్నట్టుంది.
దూరంగా కనిపిస్తున్న చిన్న చిన్న చెక్క పడవలు క్రమంగా నా కంటికి చేరువౌతున్నాయి.
నీలాకాశంలో గూడు చేరే తొందరలో ఉన్న పక్షులు అలుపనుకోకుండా తమ పయనాన్ని సాగిస్తున్నాయి.
దూరంగా వంతెనపైన పరుగులు తీస్తున్న వాహనాలు చీమల బారుల్ని తలపిస్తున్నాయి.
తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గాలిగోపురం ఠీవీగా నిలబడి చూస్తోంది.
రామాలయానికి దారితీస్తున్న మెట్లు మిమ్మల్ని స్వామి చరణాల వద్దకు చేరుస్తాను రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది.