నాజూకైన నల్లటి రెక్కల మీద కెంజాయ రంగు చుక్కలద్దుకుని రివ్వున ఎగిరే సీతాకోకచిలుక సంబరాన్ని చూస్తూనే ఆకుచిలుకలా గాలిలో తేలిపోవాలనిపిస్తుంది.
వెండిమబ్బుల వాకిట్లో వయ్యారంగా గిరికీలు కొడుతున్న ఊదారంగు పిట్ట వినోదాన్ని చూస్తూనే రెక్కలు కట్టుకు ఎగిరిపోవాలనిపిస్తుంది.
తెల్లవారుతూనే మంచులో తడిసిన మెత్తని పచ్చిక మీద గంతులు వేస్తున్న కుందేలు ఉల్లాసాన్ని చూస్తూనే చెవులపిల్లిలా మారిపోవాలనిపిస్తుంది.
వసంతం వస్తూనే ఒక్కసారిగా పుట్టుకొచ్చిన వేనవేల లేతాకుపచ్చ చివుళ్ళ మధ్యన చిన్న చీమనై తిరుగుతూ తప్పిపోవాలనిపిస్తుంది.
మామిడిచెట్టు గుబురులో దాగి వగరైన మావిచిగురు తింటూ తీపిరాగాలు పాడే ఎలకోయిల స్వరమాధుర్యంలో కరిగిపోవాలనిపిస్తుంది.
వెన్నెల తాగిన మత్తులో తూలుతున్న నక్షత్రాలు గుప్పెడు నేలకి జారి చెట్లపై చిక్కుకున్నట్టున్న పున్నాగపూల పరిమళపు పారవశ్యంలో దాగిపోవాలనిపిస్తుంది.
సృష్టిలో ఇంత చిన్న చిన్న జీవులన్నీ పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంటే, నాకు మాత్రం ఇంకా సులువు చిక్కడం లేదు.
యుగయుగాలుగా అన్వేషిస్తూనే ఉన్నాను.
వెతికి వెతికి అలసిపోయిన నాకు, ఇదిగో, ఇప్పుడే, సరిగ్గా ఇదే క్షణాన భ్రాంతి తొలగి నా యోగ్యత ఏమిటో స్ఫురించింది.
'నేను' అనే వెదురు ముక్కగా నా అస్తిత్వాన్ని వదలి నీ చేతుల్లో ఇమడగలిగిన క్షణాన కదా.. నీ ఊపిరిని తనువెల్లా నింపుకుని అమరానుభూతిని పొందే అమృతయోగం దక్కేది!
ఆద్యంతరహితమైన నీ వేణుగాన సమ్మోహనంలో తాదాత్మ్యం చెందే ఆ అపురూప క్షణం ఎన్నడో కృష్ణా!