Friday, November 14, 2008

సుమతీ శతకం పద్యం 16

నమస్కారం..! వేళ చూడబోయే సుమతీ పద్యం ఇదే..!

ఒకయూరికి నొక కరణము

నొక తీర్పరియైన గాక వొగిఁదరుచైనం

గకవికలు గాక యుండునె

సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలుపుట్టి సమస్తం చెడిపోవుట సహజము.

చూశారుగా పద్యంలో నీతి. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. పని అయినా ఎవరు చేయాలో వాళ్లు చేయాలి. అలాగే ఒకేసారి ఎక్కువమంది తల దూర్చకూడదు. అలా చేస్తే అది ఖచ్చితంగా నష్టానికే దారి తీస్తుంది చివరికి. ఇంగ్లీషులో కూడా ఇదే అర్ధాన్ని చెప్పే ఒక ప్రసిద్ధ సామెత ఉంది. "Too many cooks spoil the broth" అని. ఎక్కువమంది ఒకే వంటలో వేలు పెడితే ఎలా ఉంటుందండీ మరి?? నువ్వు ఉప్పు వేసావా? కారం వేసావా? అది వేస్తే ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. అనుకుంటూ ఒకటికి రెండు సార్లు వేసి లేదా మర్చిపోయి..అందరి పాక శాస్త్ర ప్రావీణ్యం పోటాపోటీగా ఉపయోగించి చివరికి మొత్తం పారబోయాల్సి వస్తుంది.అంతేగా మరి..!


ఇదే కాకుండా..ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే.. ఒకేసారి చాలామంది బోలెడు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి అన్ని విరుద్ధమైన భావాల్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఎక్కువ కంగారుని, అయోమయాన్ని, భయాన్ని కలిగిస్తారు. ఒకేసారి అందరూ రకరకాలుగా చెప్పడం వల్ల పాపం సదరు వ్యక్తికి అసలేమి చేయాలో పాలుపోదు. ఎవరు మి చెప్పినా చివరికి అసలు పరిస్థితిలో ఉన్న వ్యక్తే కదా ఏదయినా చేయాల్సింది లేదా ఎదుర్కోవాల్సింది..!


సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొంచెం లోతుగా ఈ సలహాల సంగతి చూద్దాం..! మనకి ఏదయినా సమస్య వచ్చినప్పుడు వేరేవారి సలహాలు అడగడం మంచిదే కానీ.. అందరి అభిప్రాయాల్నీ మనం పాటించాల్సిన అవసరం లేదు. అంటే నా ఉద్దేశ్యం.. వారందరి కోణాల్లోంచి మనం సమస్యని చూసి, తద్వారా ఎక్కువ అయోమయంలోకి వెళ్ళకూడదు అని. వాళ్ల సలహాలన్నీ అభిప్రాయాలుగా మాత్రమే గ్రహించాలి కానీ మన సమస్యకి పరిష్కారాలుగా కాదు. అందరు చెప్పినవి విని.. చివరిగా మాత్రం మనకు సరి అనిపించేదే చెయ్యాలి. ఎందుకంటే మనం చేసిన పని వల్లనైనా లభించే ఫలితాన్ని.. మనమే అనుభవిస్తాం. కాబట్టి మన ఆలోచనలు, నిర్ణయాలు, వాటి ఫలితాల బాధ్యత కూడా నూటికి నూరు శాతం మనదే అవుతుంది. మరెవరి సలహా వల్లో నష్టం జరిగింది అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది.


అసలు మనం ఒకరిని సలహా అడిగే ముందు మనకి వారిపై పూర్తి నమ్మకం ఉండాలి. వాళ్లు సమస్య గురించి మనకంటే వివేకంగా ఆలోచించగలరు అనీ.. మన శ్రేయోభిలాషులనీ.. మనం నమ్మాలి. అలాంటి ఆత్మీయులతోనే మనం సొంత సమస్యలను చెప్పుకోవాలి. అంతేగానీ.. బాధలో ఉన్నాం కదా అని.. కొద్దిగా ముఖపరిచయం ఉన్నవారందరి దగ్గరా.. మన స్వవిషయాలు చర్చించకూడదు. మీరు మరీ చెప్తారండీ.. మనందరం ఎంతో చదువుకున్నాం.. గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం. విశాల ప్రపంచాన్ని చూస్తున్నాం. అలా సొంత సమస్యలని అందరి దగ్గరా మాట్లాడేసేవారు ఉన్నారా అని మీరు అనుకుంటే.. టమాటా పప్పులో కాలేసినట్టే :) బోలెడంతమంది ఉన్నారని మీరు నమ్మాలి. అంతే కాకుండా చాలామంది అలా చేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించలేరు కూడా..అది మరీ జాలిపడాల్సిన సంగతి..! PG లు చదివి, అయిదంకెల జీతాన్నిగడిస్తూ ఇలా చేసే తెలివైన వారిని చాలా మందిని నేను చూసాను. ఎందుకంటే తెలివితేటలకీ, మనిషి వ్యక్తిత్వానికీ సంబంధం లేదని నా అభిప్రాయం. అది చాలావరకు నిజం కూడా.. ఉదాహరణకి వాళ్ల భర్తతోనో, అత్తతోనో, లేదా..కనీసం స్నేహితులతోనో చిన్న భేదాభిప్రాయం వచ్చిందనుకోండీ .. వెంటనే మనతో అనేస్తారు. తను ఇలాంటి వాడు, అలాంటి వాడు..నన్నిలా బాధపెట్టాడు..అసలు తనతో ఉండడమే వ్యర్ధం..ఇంకా..ఇలా చాలా చాలా..మొదటిసారి మనం చాలా బాధ పడిపోతాం.. ఓదారుస్తాం.. మళ్ళీ వెంటనే రెండు రోజుల్లో అసలేమి జరగనట్టు అంతా చాలా గొప్పగాఉంది..సూపర్..అని చెప్తారు. మళ్లీ రెండు రోజులకి ఇంకో విషయమూ ఇలాంటిదే జరుగుతుంది. ఇలా పదే పదే జరిగాక మనకి వాళ్ల మీద ఉన్న సదభిప్రాయం పోతుంది. వాళ్లు నిజంగా పెద్ద సమస్యతో వచ్చినా మనం మొదటిసారిలా ఫీల్ అవ్వలేము. అంటే.. చివరికి వాళ్ల పరిస్థితి నాయనా..పులి కథలాగా అవుతుందన్నమాట. నిజానికి అలాంటి వారికి ఏదో సలహా ఇచ్చి సహాయపడదాము అనుకోడం కూడా తప్పే అని నా ఉద్దేశ్యం. దాని వల్ల ఉపయోగం ఉండదు కూడా. మన సమయం, ఆలోచన రెండూ వ్యర్థం.. అంతే..! ఎందుకంటే వాళ్లు మారాల్సిన అవసరాన్ని వాళ్లు ఎప్పటికీ గుర్తించలేరు. కోణంలో ఆలోచిస్తే.. సలహాలు తీసుకోవడంలోనే కాదు..ఇవ్వడంలో కూడా సరైన వ్యక్తులనే ఎంచుకోవాలి సుమా.. అనిపిస్తుంది.

మీరేమంటారు మరి..!



ప్రేమతో...
మధుర వాణి

5 comments:

Sreelatha said...

1.i agree with you except for last para.most of the times, i have observed, people discuss their so called private lives just to get a sympathatic ear. they are not expecting any suggestions from you, but when they talk their hearts become light and are not depressed anymore.
2. small talk - you don't have to necessarily talk on intelligent subjects to start a conversation. have a chat on anything - your surrounding persons won't perceive you as a cave person.

మధురవాణి said...

Hi Latha,

1. What you told is also right. But, then it depends on the menatility of the person. Infact,You see people of both kinds. Any way, this kind of things change from person to person.

2. Im sorry, but I didn't get the meaning of this.

మధురవాణి said...

Hi Latha gaaru,

1.clarification - People who expect only sympathy but not any advices comes under a different topic. what I meant here was only people who expect advices. becos I was talking basically abt advices. But, again as I said earlier, there will be many more aspects to a point.

2. please let me know what do you mean by point 2

కొత్త పాళీ said...

బాగా చెప్పారు.

S said...

బాగుంది కానీ, ఈసారి నాకు ప్రతిపదార్థం కావల్సి వచ్చేలా ఉంది!
:(