Sunday, November 02, 2008

సుమతీ శతకం పద్యం 15

నమస్కారం..!
ఈ రోజుటి సుమతీ పద్యం ఇదే..!

ఏరకుమీ కసుగాయలు

దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

తాత్పర్యం: భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగిపారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!

చూసారుగా ఈ పద్యం..! మీరేమంటారు మరి.. :)

బంధువులని దూషించకూడదంటా ... ఇంతకుముందే బంధువుల గురించి వచ్చే అపాయాలని గురించి అనుకున్నాం కదా..! ఇప్పుడేమో ఇది...ఏది ఏమైనా సందర్భానుసారం నీతిని కూడా తీసుకోవాలి. అంటే బంధువులందరినీ ఏమీ అనకూడదు...వేరే వాళ్ళని అనచ్చని కాదు గానీ.. ఎవరినైనా పూర్తిగా విషయ పూర్వాపరాలు తెలుసుకోకుండా మాట జారకూడదు. అది స్నేహితులైనా, బంధువులైనా సరే...! కానీ, ఒకవేళ బంధువులైనా కూడా నిజంగా చెడు చేయాలనుకునేవారిని దూషించకుండా ఎలా ఉంటాం? :) అంతే కదా..!

పచ్చి కాయలు తినద్దంట..:) అయినా పచ్చివి తింటే అరగదు మొదటి పాయింట్..ఇంకోటి ఏంటంటే, పచ్చివి కోసేసి వృథా చేయడం కన్నా పండే దాకా ఉండడం ఉత్తమం కదా..! :) ఇలా కాదు కానీ, అలాంటి పసి మొగ్గల్నీ, పసి పిందెలనీ కోసేయ్యకూడదు అని కూడా కవి ఉద్దేశ్యం అయ్యి ఉండచ్చు అనుకుంటున్నా.. ఒక రకంగా అది మనిషి మనస్తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందేమో... కదా..! ఇంకా విరియని మొగ్గలనీ, పక్వానికి రాని పిందెలనీ కోసేయ్యాలని అనిపించకూడదు అసలు..కదా..ఎందుకంటే అవి మనుషులు కాకపోయినా వాటికీ ప్రాణం ఉంటుందిగా..అలా కాకపోయినా వాటి వల్ల ఉపయోగం ఉండదని తెలిసీ ఊరికే కోసి పడేయ్యకూడదు కదా..!! ఏమో లెండి.. అయినా ఈ రోజుల్లో ఒక పెద్ద పెరడు, అందులో మొక్కలు, చెట్లు...మళ్ళీ అందులో మనం వెళ్లి పూలు, పండ్లు కోయడం..అసలు ఇంత సీన్ ఉందంటారా?? :)


ఇక యుద్ధం...పాతకాలం నాటి యుద్దాలు కాకపోయినా..మన జీవితం కూడా యుద్ధం లాంటిదే ఒకరకంగా.. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది..మనం మాత్రం ఎప్పుడూ ధైర్యంగా సాగిపోతూ ఉండాలి. పిరికిగా వెనుతిరగకూడదు ..! చాలాసార్లు విసుగుగా, విరక్తిగా అనిపిస్తుందనుకోండి. కానీ, మనకి మనమే ధైర్యం చెప్పుకుని ఆశావహ దృక్పథంతో అలా అలా బండి నడిపించేయ్యాలి..అంతేగా మరి..!


గురువుల మాట జవదాటకూడదు అంటున్నారు కదా..! మరీ మనం అంత గురుభక్తి చూపించకపోయినా పర్లేదు కానీ, గురువుల మీద జోక్స్ వేసుకుని, వాళ్ళని తిట్టేంత గొప్పవాళ్ళం అవ్వకపోతే చాలు. ఈ మధ్య కాలం లో సినిమాలల్లో చూసి మరీ, విథ్యార్థులు మరీ heroicగా ఫీల్ అవుతున్నారు lecturers మీద జోకులేయడాన్ని. దాన్ని కొంచెం తగ్గిస్తే బావుంటుందని నా అభిప్రాయం..మీరేమంటారు మరి???


ప్రేమతో...

మధుర వాణి


2 comments:

S said...

"ఏరకుమీ కసుగాయలు"
-నాకెమనిపించిందంటే, మడిసన్నాక కూసింత ఓపికుండాలి..p.అని చెప్తున్నాడేమో అని. :)

ఉదాహరణకు - అవెన్ లో ఒక నిముషానికని హీటింగ్ కి పెట్టాక, అర నిముషంలో ఏమైందో చూద్దాం అని మధ్యలో తెరవకూడదు అనమాట :))

మధురవాణి said...

@ S,
చూసారా.. ఓవెన్ లేని రోజుల్లో రాసింది ఇప్పటికి కూడా మనం ఇలా అన్వయించుకోగలుగుతున్నాం అంటే.. ఎంతైనా గ్రేటే కదా ఈ శతకం రాసినాయన! :D