Monday, November 03, 2008

వేణువై వచ్చాను భువనానికీ..! గాలినై పోతాను గగనానికీ...!!

నమస్కారం..!
ఈ రోజు ఒక మధురమైన గీతాన్ని గుర్తు చేస్తున్నాను మీ అందరికీ.. పాట మధురంగానే ఉంటుంది గానీ, భావం మాత్రం చాలా భారంగా ఉంటుంది. వేదాంత ధోరణిలో సాగే ఈ పాటని వేటూరి సుందర రామ్ముర్తిగారు అత్యద్భుతంగా రచించారు. "వేణువై వచ్చాను భువనానికీ..గాలినై పోతాను గగనానికీ.." అనే ఈ పాట 1993 లో వచ్చిన 'మాతృదేవోభవ' అనే చిత్రంలోనిది. ఈ సినిమా తెలియని వాళ్లు ఉండరు. అప్పట్లో ఒక సంచలన చిత్రంగా నిలిచింది ఈ సినిమా. నాజర్, మాధవి జంటగా నటించారు. మాధవి నటనకి పరాకాష్ట ఈ సినిమా. ఎంతో ఆవేదనను అనుభవించే పాత్రలో మాధవి ఇమిడిపోయి నటించి ప్రేక్షకుల చేత కన్నీటి వరదలు పారించింది ఈ సినిమాలో. ఒక కుటుంబం లోని అనుబంధాలు, బాధలు, విధి వారితో ఆడుకునే కథే ఈ సినిమా. ఈ సినిమా చూసి ఏడుపు రాని వారు ఉంటే వారికి కన్నీటి గ్రంధులు పని చేయనట్టే.. అని అనుకోవచ్చు.

ఈ సినిమాలో ఈ పాట ఏ సన్నివేశం లో వస్తుందంటే... సంగీత ఉపాధ్యాయురాలయిన మాధవి, పిల్లలకి అన్నమాచార్య గీతాల్ని గురించి వివరిస్తుంది. భక్తి, రక్తి, ముక్తి, విరక్తి అన్నీటినీ తన కీర్తనలలో నింపిన అన్నమాచార్య తన ఆఖరి రోజుల్లో వేదనతో స్వామికి ఇలా విన్నవించుకున్నారట. "స్వామీ.. బ్రతుకు సంధ్యలోకి మళ్లిపోతుంది. ఇహలోకంలో నీకు సేవ చేసుకునే అదృష్టానికి దూరమైపోతున్నాను" అని. ఆ అన్నమాచార్య కీర్తనకి స్పందించిన ఒక మహాకవి హృదయం తన కవితా పదపుష్పాలతో ఇలా పరిమళించింది. అని మాధవి పిల్లలకి చెప్పి ఈ పాట పాడుతుంది. ఆ మహాకవి మన వేటూరి గారన్నమాట. ఈ పాట దృశ్యీకరణ కూడా చాలా బావుంటుంది.

MM కీరవాణి గారు స్వరపరిచిన ఆణిముత్యాల్లో ఈ సినిమా పాటలకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక గాయని చిత్ర తన గళంతో ఇంకా మాధుర్యాన్ని నింపింది ఈ పాటలో. మీరే చూడండి మరి..!

వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!
వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!


మమతలన్నీ మౌనగానం... వాంఛలన్నీ వాయులీనం...!
వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!

మా
తృదేవోభవ ..! పితృదేవోభవ..! ఆచార్యదేవోభవ..!

ఏడుకొండలకైనా బండ తానొక్కటే... ఏడు జన్మల తీపి ఈ బంధమే..!
ఏడుకొండలకైనా బండ తానొక్కటే... ఏడు జన్మల తీపి ఈ బంధమే..!


నీ కంటిలో నలక.. లోవెలుగునే కనక.. నేను మేననుకుంటే అది చీకటే....
హరీ... హరీ... హరీ....!!

రాయినై ఉన్నాను ఈనాటికీ... రామ పాదము రాక ఏనాటికీ...!

వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!
వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!


నీరు కన్నేరాయే... వూపిరే బరువాయె...
నిప్పు నిప్పుగా మారే నా గుండెలో...

నీరు కన్నేరాయే... వూపిరే బరువాయె...

నిప్పు నిప్పుగా మారే నా గుండెలో...


ఆ నింగిలో కలిసి...
నా శూన్య బంధాలు...
పుట్టిల్లు
చేరే మట్టి ప్రాణాలు...

హరీ... హరీ... హరీ....!!

రెప్పనై వున్నాను మీ కంటికి...
పాపనై
వస్తాను మీ ఇంటికి...!


వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోయాను గగనానికి...!
గాలినై
పోయాను గగనానికి...!


8 comments:

Unknown said...

మధురవాణి గారు, మంచి పాట గురించి వివరంగా రాశారు. లక్కీగా ఈ మధ్యనే ఆ పాట నాకు అందుబాటులోకి వచ్చింది. ఎన్నిసార్లు విన్నా ఆ గాత్రంలోని భారం మనసుని కదిలిస్తూనే ఉంటుంది.

శ్రీ said...

చాలా మంచి పాట మధురవాణి గారు. నెల్లూరులో ఈ సినిమాకి వచ్చిన వాళ్ళకి ఉచితంగా చేతిగుడ్డలు పంచి పెట్టారు కన్నీళ్ళు తుడుచుకోవడానికి. ఈ పాటకి రాళ్ళు కుడా కరుగుతాయంటే అతిశయోక్తి కాదేమో?

రిషి said...

'మాత్రదేవోభవ ' ఎంత బావుంటుందో అంత బాధపెడుతుంది..చూసిన ప్రతీసారీ.

'రాలిపోయె పువ్వా నీకు ' పాట విన్నా చూసినా కూడా కళ్ళల్లో అప్ర్యత్నంగా నీళ్ళు తిరుగుతాయ్.

anveshi said...

nijamE yi movie yenta bavuntundO anta bhada pedutundi.

nway manchi sahityam vunna paaTa ni post cEsaru thanks

Anonymous said...

ee cienema lo inkoka paata kudaaaaaa chala baguntundi adi kudaaaaaaaaaa maaku andiste baguntundi

శ్రీసత్య... said...

అమ్మ ప్రేమకు అర్ధం చెప్పే "మాతృదేవోభవా" సినిమా అంటే నా ప్రాణం.మళ్ళి నాకు అ సినిమాలో విషేషాలను గుర్తు చేసినందుకు దన్యవాదములు.

మీ శ్రీసత్య...

సుజాత వేల్పూరి said...

వేటూరి కి పాదాభివందనం చెయ్యదగ్గ పాటల్లో ఇదొకటి. చిత్ర అత్యద్భుతంగా పాడిన పాటల్లో కూడా ఇదొకటి.

Bolloju Baba said...

వేణువై వచ్చి గాలినై పోవటం అన్న ఎత్తుగడతోనే ఒక అంతులేని విషాదాన్ని ఆవిష్కరిస్తారు మహాకవి.

పంచభూతాలను భిన్నకోణంలో చూపిస్తారు.
నీటిని కన్నీరుగా, గాలిని బరువుగా, నిప్పుని హృదయాగ్నిగా, మట్టి ప్రాణాలు పుట్టిల్లు చేరాయనటం వేటూరిగారి అనన్య ప్రతిభకు తర్కాణం.


మొదట్లో ఈ పాట సంగీతం ఇళయరాజా అని బ్రమపడ్డాను. కానీ కీరవాణి అని తెలిసి ఆశ్చర్య పోయాను. గొప్ప సంగీతం.
సుజాత గారన్నట్లు వేటూరి గారికి పాదాభివందనం చేయదగ్గ పాటిది.

మంచి పాటను మరలా స్మరించుకొనే అవకాసం కల్పించారు. ధన్యవాదాలు.

బొల్లోజు బాబా