Wednesday, November 05, 2008

రాలిపోయే పువ్వా.. నీకు రాగాలెందుకే..! తోటమాలి నీ.. తోడు లేడులే..!!

నమస్కారం..!
రోజు కూడా మిమ్మల్నందరినీ మరోసారి ఆవేదనలోకి తీసుకెళ్ళే పాటను గుర్తు చేస్తున్నాను. మొన్ననే 'మాతృదేవోభవ' సినిమాలోని 'వేణువై వచ్చాను' అన్న పాట గురించి మాట్లాడుకున్నాం కదా..! అయితే అది వినగానే చాలా మంది స్నేహితులకి 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' అన్న పాట కూడా గుర్తొచ్చింది. పాట రాగాన్ని, భావాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందామని నన్ను అడిగారు. అసలు పాటను గురించి ఏదన్నా చెప్పాలనుకున్నా గానీ మాటలు బయటికి రావు. చాలా బాధగా ఉంటుంది. ఏముందిలే.. అది ఒక సినిమానే కదా...మరీ అంత లీనమైపోయి బాధపడడం ఎందుకులే..అని ఎంత సర్దిచెప్పుకున్నా గానీ.. మాములుగా అనిపించదు. నిజంగానే మన కళ్ళముందే ఒక కుటుంబానికి అలా జరిగింది అన్నట్టుగా ఉంటుంది. మనకి అలా అనిపించేలా సినిమా తీసిన దర్శకులు k.అజయ్ కుమార్ గారికే గొప్పతనం చెల్లుతుంది.

సినిమాకి మాతృక మలయాళంలో వచ్చిన 'అక్షధూడు' అనే సినిమా. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు తీయడంలో మళయాళ సినీ పరిశ్రమ తరవాతే ఎవరైనా..!
అన్నట్టు..ఒకఆసక్తికరమైన సంగతి ఏంటంటే..మలయాళంలో కూడా మాధవే నటించింది. సినిమా మొదటి సగంలో ఎంత ముద్దుగా, ముచ్చటగా ఉంటుందో మాధవి.. రెండో సగంలో అంత దయనీయంగా ఉంటుంది. ఈ సినిమాలో నటనని గురించి మాధవిని ఎంత పొగిడినా సరిపోదు అసలు. మాధవి సినీజీవితంలోనే ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర అని విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ప్రముఖ నిర్మాత KS రామారావు గారు మలయాళ సినిమా చూసి అనువాద హక్కులు తీసుకుని తెలుగులో తీసారు. అందువల్లే మనం ఇంత మంచి సినిమాని తెలుగులో చూడగలిగాము.

ఈ సినిమాకి కీరవాణి గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం ప్రాణం లాంటివి. ఈ సినిమాలో 'వేణువై వచ్చాను' అనే పాట స్వతహాగా వేటూరి గారికి బాగా నచ్చిందట. కానీ 'రాలిపోయే పువ్వా' పాటకి వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది. కృష్ణ గారి 'అల్లూరి సీతారామరాజు' సినిమా తరవాత మన తెలుగు పాట సాహిత్యానికి మళ్ళీ జాతీయ అవార్డు రావడం ఈ సినిమాతోనే.
కేవలం 37 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మొదటి రెండు వారాలు థియేటర్లన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయట. మూడోవారం నుంచి జనాలు వరుస కట్టారు. తరవాత ఏమి జరిగిందో మనందరికీ తెలుసు కదా... కన్నీళ్లు తుడుచుకోడానికి ఖర్చీఫ్ లు కూడా పంచిపెట్టారు. అలా చివరికి కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

ఇంక ఈ పాట సందర్భానికి వస్తే.. ఇక తను కూడా చనిపోతాను అని తెలిసిపోయాక తమలాగా అనాధల్లాగా పెరగకూడదని పిల్లలందరినీ దత్తత ఇస్తుంది మాధవి. సినిమా మొత్తంలోకీ మనల్ని బాగా కదిలించే సన్నివేశాలు ఇవే. చివరగా దీపావళికి కుటుంబం అంతా ఒకసారి కలవాలని మళ్ళీ పిల్లలని పిలవడానికి వెళ్తుంది. అప్పుడే ఈ పాట వస్తూ ఉంటుంది. మళ్ళీ తనకి తోడుగా అవిటి వాడవడం వల్ల తన వద్దే మిగిలిపోయిన కొడుకు. ఈ బాబుతో పాటు పుట్టిన ఇంకో కవల పిల్లాడిని కలిసినప్పుడు పడే ఆవేదనా.. :( :( హమ్మో... నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంక ఆపేస్తున్నాను ఆ సందర్భాన్ని గురించి చెప్పడం :(

ఈ పాటలోని ప్రతీ పదం కూడా అస్తమించబోతున్న శారద (పాత్ర పేరు) జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. కానీ, ఇలా ప్రతీ పదంలో ఇన్ని రకాలుగా.. భావాన్ని వ్యక్తీకరించడం వేటూరి గారికే చెల్లింది. అంత మహానుభావుడు మన తెలుగుదేశంలో జనించడం నిజంగా మనందరం చేసుకున్న పుణ్యం. కీరవాణి గారు పాటలోని భావాన్నంతా గొంతులో నింపి ఈ పాటను ఆలపించారు.

మరోసారి వేటూరి గారి ఈ అద్భుత సాహిత్యం మీ కోసం..

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!

తోటమాలి నీ.. తోడు లేడులే..!

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!

లోకమెన్నడో చీకటాయెలే ..!
నీకిది తెలవారని రేయమ్మా..!

కలికీ మా చిలకా.. పాడకు నిన్నటి నీ రాగం..!

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!

తోటమాలి నీ తోడు లేడులే..!

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!

లోకమెన్నడో చీకటాయెలే ..!

చెదిరింది నీ గూడు గాలిగా... చిలకా గోరింకమ్మ గాథగా...

చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా......

తనవాడు తారల్లో చేరగా.. మనసు మాంగల్యాలు జారగా..

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...!

తిరిగే భూమాతవు నీవై.. వేకువలో వెన్నెలవై..

కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హారతివై..

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!

తోటమాలి నీ.. తోడు లేడులే..!

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!

అనుబంధమంటేనే అప్పులే.. కరిగే బంధాలన్నీ మబ్బులే..

హేమంత రాగాల చేమంతులే.. వాడిపోయే.. ....

తన రంగు మార్చింది రక్తమే.. తనతో రాలేనంది పాశమే..

దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే...!

పగిలే ఆకాశము నీవై.. జారిపడే జాబిలివై..

మిగిలే ఆలాపన నీవై.. తీగ తెగే వీణియవై..


రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..!

తోటమాలి నీ తోడు లేడులే..!

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..!

లోకమెన్నడో చీకటాయెలే ..!


భారమైన మనసుతో.. సెలవు తీసుకుంటున్నాను..!

5 comments:

Anil Dasari said...

వర్తమాన తెలుగు సినీ సంగీత దర్శకుల్లో డొక్కశుద్ధి ఉన్న కొద్దిమందిలో కీరవాణి ప్రధముడు. అరుదుగా పాడినా కొన్ని మంచి పాటలు పాడాడతను. వాటిలో నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి మీరిప్పుడు వివరించిన 'రాలిపోయే పువ్వా' కాగా, రెండోది 'మొండి మొగుడు-పెంకి పెళ్లాం' చిత్రంలో అతనే స్వరాలు కట్టి ఆలపించిన 'నాటకాల జగతిలో జాతకాల జావళి' అనే పాట. మీకు వీలైతే దాన్ని గురించి కూడా రాయగలరు.

చిలమకూరు విజయమోహన్ said...

మంచి పాటను గుర్తుచేసి మనసును, కళ్ళను తడిచేశారు.

రిషి said...

మీరు మళ్ళీ నా గుండె పిండి జాడించేసారు... :(

ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే....మాధవి,నాజర్ తొ సమానంగా ఆ పిల్లల నటన కూడా చక్కగా నప్పింది ఈ సినిమాలో

భరత్ said...

చాల మంచి పాటలని మళ్లీ గుర్తు చేసినందుకు
నీకు నా కృతజ్ఞతలు మధుర వాణి

kasinenisreeram said...

నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం
శ్రీరామ్