Saturday, November 15, 2008

ఏ తీగ పూవునో.. ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో..

హలో హలో..! నమస్తే..!
పైన పేరు చూసారుగా.. ఆ తియ్యటి పాట గురించే నేను ఇప్పుడు మాట్లాడబోయేది. పాట K. బాలచందర్ గారు దర్శకత్వం వహించిన 'మరో చరిత్ర' అనే సినిమాలోనిదని మీకు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకోండి. కానీ, ఈ పాటతో పాటు సినిమా గురించి కూడా నాకు కొంచెం చెప్పాలనిపిస్తోంది. అసలు సంగతేంటంటే, నేను చాలా రోజులుగా పాట గురించి వ్రాయాలనుకుంటున్నాను. కానీ, నేను ఇంతవరకు సినిమా పాటలు విన్నాను గానీ, సినిమా ఎప్పుడూ చూడలేదు. చూడాలని చాలా రోజుల నుంచీ అనుకుంటున్నాను. అలా అనుకునీ అనుకునీ మొత్తానికి నిన్ననే చూడగలిగాను.

మన
తెలుగు సినీ రిత్రలో, అదీ ప్రేమ కథల్లో ఒక మైలురాయిగా ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం మరో చరిత్ర.. ఇది దాదాపుగా అందరు ఒప్పుకునే విషయం. బాలచందర్ గారు సినిమాని నేరుగా తెలుగులోనే తీసారు. ఆయన అనుంగు శిష్యుడు, అప్పట్లో నూనూగు మీసాల యువకుడు అయిన కమలహాసన్ బాలు గా, కథానాయకుడిగా నటించాడు. అందం, అభినయంతో పాటు చక్కటి గాత్రం ఉన్న సరిత స్వప్నగా, కథానాయకిగా సినిమాతోనే తెరంగేట్రం చేసింది.

ఇంకా, సంధ్య గా మాధవి ఒక ముఖ్య పాత్రని పోషించింది. 1978 లో సినిమా విడుదల అయింది. అంటే ఇప్పటికి ముప్పై ఏళ్ళు సినిమాకి. ఇన్నేళ్ళ తరువాత సినిమా చూసినా గానీ, నాకు అద్భుతంగానే అనిపించింది చాలా వరకు. అరవ అబ్బాయి, తెలుగు అమ్మాయి పక్క పక్క ఇళ్ళల్లో ఉండి ప్రేమించుకుంటారు. కులగోత్రాల కారణంగా పెద్దలు అభ్యంతరం చెప్తారు. ప్రేమ కోసం పోరాడి చివరికి దురదృష్టవశాత్తూ ఇద్దరు చనిపోతారు. వాళ్ల ప్రేమ మరో చరిత్రగా నిలిచిపోతుంది. అదీ సినిమా కథ.

సినిమాలో మొదటగా మనకి మాట్లాడాలనిపించే విషయం కమల్, సరిత జోడి. ఆ ప్రేమ కథకి చాలా చక్కగా ఇమిడిపోయారు. అందువల్ల మనం చూసేప్పుడు కథలో లీనమైపోతాము. అరవ కుర్రాడిగా వచ్చీ రానీ తెలుగు మాట్లాడుతూ కమల్ చాలా ముద్దుగా ఉంటాడు సినిమాలో. తన నట జీవితం తోలిరోజులే అయినా కూడా చాలా అద్భుతంగా భావాల్ని పలికించాడు. నాట్యకళని కూడా ప్రదర్శించాడు. సినిమా చివరలో స్వప్న వాళ్ల అమ్మతో మాట్లాడుతూ.. తెలుగుని ఎన్ని రకాలుగా స్పష్టంగా నేర్చుకున్నాడో ప్రదర్శించే సన్నివేశం చూస్తుంటే నాకు 'సాగరసంగమం' లో శైలజ కి అన్నీ రకాల నాట్యాలను వివరించే సన్నివేశం గుర్తొచ్చింది. సరిత మొదటి సినిమా అని మనం అనుకోము. ఆ గొప్పతనం బాలచందర్ గారికే దక్కుతుంది.ఈ సినిమాకి మరో ప్రత్యేక విలువని తీసుకొచ్చింది గణేష్ పాత్రో రాసిన సంభాషణలు. ఎక్కడా.. ఒక మాట ఎక్కువ గానీ..తక్కువ గానీ ఉండవు. అలాగే BS లోకనాథన్ సినిమాటోగ్రఫీ. సినిమా మొత్తం విశాఖపట్టణం పరిసర ప్రాంతాల్లో తీసారని సినిమా టైటిల్స్ లో చూసి చాలా ఆశ్చర్యపోయాను. అద్భుతమైన లోకేషన్స్ లో తీసారు. కొన్ని సన్నివేశాలు వర్ణచిత్రాలలాగా అనిపిస్తాయి. ఇంక సినిమాకి ప్ర్రాణం పోసింది నిజంగా సంగీతం అని చెప్పచ్చు. MS విశ్వనాథన్ గారు పదికాలాల పాటు నిలిచిపోయే సంగీతాన్ని అందించారు. ప్రతీ పాట ఆణిముత్యమే.బాలు, స్వప్నల ప్రేమ కథంతా.. ప్రతీ సన్నివేశం దర్శకుడి సృజనాత్మకతని మనకి చూపిస్తుంది. సంధ్య పాత్రలో మాధవి నటన మనసుని కదిలిస్తుంది. చిత్రం చివరలో బాలుకి ఆపద రాకూడదని ఆవేదన చెందే సన్నివేశంలో గొప్పగా నటించింది. సినిమా చూసేప్పుడు నాకొకటి అనిపించింది. ఈ రోజుల్లో కథానాయికలు 20 సినిమాలు నటించినా అలాంటి సన్నివేశం ఒక్కటైనా నటించే అవకాశం వస్తుందా అని. ఒక వేళ వచ్చినా నటించగాలరా అని.. నాకు సందేహమే..!


ఇదంతా సరే గానీ.. సినిమా ముగింపు గురించి ఒక మాట చెప్తాను. నాకు సినిమాలో కొంచెం నచ్చనిది ఇదొక్కటే. అంటే.. ప్రేమికులు చనిపోవడం కాదు. స్వప్న ఒక దుర్మార్గుడి చేతిలో బలైపోవడం, బాలు రౌడీల చేతిలో దెబ్బతినడం నాకంత సరిగ్గా అనిపించలేదు. ఏదో ఒకరకంగా చంపెయ్యాలని అలా జరిగినట్లుగా ఉంది. వారి ప్రేమ కోసం ఎంతో ఓరిమితో ఎదురుచూసి అన్నీ సమస్యలు తీరిపోయాయి అనే సమయానికి వారు చనిపోతారు. అదే మరి వారి దురదృష్టమేమో.. అందుకే వారి ప్రేమ చరిత్ర అయిందేమో.. ఇదే దర్శకుడి ఉద్దేశ్యం అయ్యి ఉండవచ్చు.మళ్ళీ సినిమా పాటల విషయానికొస్తే.. మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు.

' తీగ పూవునో' అనే పాట సినిమాలో రెండు సార్లు ఉంటుంది. మొదటి సారి వారిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు సరిత పాడుతుంది. దీన్ని సుశీల గారు ఆలపించారు. మరోటి ప్రేమికులిద్దరూ దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు, పక్కనే ఉన్నాగానీ కలుసుకోలేకపోతున్నప్పుడు బాధతో బాలు పాడే పాట. ఇక్కడ చెప్పుకోవాల్సిన సంగతేంటంటే పాటని కమల్ స్వయంగా పాడడం. రెండు పాటల్లోని సాహిత్యం చాలా బావుంటుంది అని మీ అందరికీ తెలిసిన విషయమే కదా.. అదే మనం మరోసారి గుర్తు చేసుకుందాం..!


సుశీల గారు పాడిన ప్రేమ గీతం..


తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

అప్పుడిన్నా..అర్ధం కాలేదా..!

తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ తెలియని అభిమానమౌనో..


మనసు మూగది మాటలు రానిది.. మమత ఒకటే అది నేర్చినది..

ఆహా.. అప్పుడియా..! పేద్ద అర్ధం అయినట్టు..!

భాష లేనిది.. బంధమున్నది.. మన ఇద్దరినీ జత కూర్చినది..

మన ఇద్దరినీ.. జత కూర్చినదీ..!

తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ తెలియని అభిమానమౌనో..


వయసే వయసును పలకరించినది.. వలదన్నా అది నిలువకున్నది..

.. నీ రొంబ అళ్ళారిక్కే.. ఆ.. రొంబ అంటే..?

ఎల్లలేవీ ఒల్లనన్నది.. నీదీ నాదొక లోకమన్నది..

నీదీ నాదొక లోకమన్నదీ..!

తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ తెలియని అభిమానమౌనో..


తొలి చూపే నను నిలవేసినది.. మరు మాపై అది కలవరించినది..

నల్ల పొన్ను.. అంటే.. నల్ల పిల్ల..!

మొదటి కలయికే ముడివేసినది.. తుది దాకా ఇది నిలకడైనది..

తుది దాకా ఇది నిలకడైనదీ..


తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ తెలియని అభిమానమౌనో..


కమల్ పాడే పాట:

తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ.. తెలియని అభిమానమౌనో..


మనసు మూగది మాటలు రానిది.. మమత ఒకటే అది నేర్చినది..

మనసు మూగది మాటలు రానిది.. మమత ఒకటే అది నేర్చినది..

భాష లేనిది.. బంధమున్నది.. భాష లేనిది.. బంధమున్నది..

మన ఇద్దరినీ జత కూర్చినది.. మన ఇద్దరినీ జత కూర్చినదీ..!


తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ.. తెలియని అభిమానమౌనో..


వయసే వయసును పలకరించినది.. వలదన్నా అది నిలువకున్నది..

వయసే వయసును పలకరించినది.. వలదన్నా అది నిలువకున్నది..

చేసిన బాస శిలవలె నిలిచి.. చేసిన బాస శిలవలె నిలిచి..

చివరికి మంచై కరుగుతున్నది.. చివరికి మంచై కరుగుతున్నదీ..!

తీగ పూవునో.. కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో..

తెలిసీ.. తెలియని అభిమానమౌనో..

పాటలని మీరు మళ్ళీ విని మరొక్కసారి పాటల్లోని మకరందాన్ని రుచి చూడండి..!
ప్రేమతో..

మధుర వాణి

No comments: