Monday, November 24, 2008

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా..

పైన పేరు చూశారుగా.. అసలు ఆ వాక్యాలు వింటే ఏమనిపిస్తుంది??
"వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా.."
ఆహా.. నాకయితే నిజంగానే వెన్నెల్లో నడిచే మబ్బుల్లో నేను విహరిస్తున్నట్టుగా ఉంటుంది ఈ పాట వింటుంటే :)

సున్నితమైన భావాలని అంత అందంగా వ్యక్తపరచగలగడం నిజంగానే మహానుభావులకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది నాకయితే..! సంగీతం కూడా హాయిగా మనసును మీటుతున్నట్టుగా ఉంటుంది. నాకు చాలా చాలా నచ్చే పాటల్లో ఇదొకటి. అందుకే ఈ వేళ మీకు కూడా ఓ సారి ఈ పాటను గుర్తు చేద్దామనిపించింది.


ఇంతకీ గుర్తొచ్చేసిందా ఈ పాట ఏంటో.. ఈ పాట 'క్రియేటివ్ డైరెక్టర్' కృష్ణవంశీ దర్శకత్వంలో 1999 లో వచ్చిన 'అంతఃపురం' అనే సినిమాలోది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు మొదలైన వారు నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే పాత్రలు పోషించారు. నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి.

ఏ లోకానుందోగానీ.. మహానటి సౌందర్య ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచింది. అలాంటి గొప్ప నటిని కోల్పోవడం మనందరి దురదృష్టం :( సినిమాలో విదేశాల్లో ఉండే సౌందర్య, సాయి కుమార్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం, ఆనందంగా జీవితం గడుస్తూ ఉండే సన్నివేశాల్ని ఈ పాట రూపంలో చిత్రీకరించారు దర్శకులు. పాటల్ని చిత్రీకరించడంలో అందెవేసిన చెయ్యి కదా మన కృష్ణ వంశీది. ఈ పాటని చాలా ముచ్చటగా తీర్చిదిద్దాడు.


సంగీతం 'మ్యూజిక్ మేస్ట్రో' ఇళయరాజా గారు అందించారు. ఈ పాట వింటుంటే మనకి KV మహదేవన్ గారి సంగీతం విన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ శైలి, పాటలోని మాధుర్యం అలా అనిపిస్తాయన్నమాట. చిత్ర గాత్రం ఈ పాటని మరింత వినసొంపుగా మార్చింది.

ఈ పాటకి ప్రాణం మాత్రం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అని నేనంటాను. ఒక అమ్మాయి జీవితం ఆనందంగా సాగిపోతూ ఉన్నప్పుడు తన భావాలెలా ఉంటాయో సిరివెన్నెల గారు చెప్పినట్టుగా మరెవ్వరూ చెప్పలేరేమో.. అన్నట్టుగా ఉంటుంది ఈ పాట. ప్రతీ వాక్యం సూటిగా మనసుని తాకుతుంది.


కల్యాణం కానుంది కన్నె జానకికీ..
వైభోగం రానుంది రామచంద్రుడికీ..
దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ..
రావమ్మా సీతమ్మా.. సిగ్గు దొంతరలో..
రావయ్యా రామయ్యా.. పెళ్లి శోభలతో..

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా..
వర్షంలో తడిసే సంద్రంలాగా..
ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో..
అంతా సౌందర్యమే.. అన్నీ నీ కోసమే..!
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా..
వర్షంలో తడిసే సంద్రంలాగా..

నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ..
నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ..
కళ్ళల్లోనే వాలి.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో..
గగనాన్ని ఏలే పున్నమి రాజు.. ఎదలో ఎలా వాలాడో..
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి..
చూస్తూనే
నిజమై.. అవి ఎదటే నిలిచాయి..
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా..!!

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా..
వర్షంలో తడిసే సంద్రంలాగా..

ఇట్టే కరుగుతున్నదీ.. మహా ప్రియమైన క్షణం..
వెనుకకు తిరగనన్నదీ.. ఎలా కాలాన్ని ఆపడం..
వదిలామంటే నేడు.. తీయని స్మృతిగా మారి.. ఎటో పోతుందీ..
కావాలంటే చూడు.. ఆనందం.. మనతో తనూ వస్తుందీ..
హాయి అంతా మహా భద్రంగా దాచి..
పాపాయి
చేసి.. నా ప్రాణాలే పోసి..
నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికీయలేనా..!!

ఆకాశం అంతఃపురమయ్యింది.. నాకోసం అందిన వరమయ్యింది..
రావమ్మా మహారాణీ.. లమ్మా కాలాన్నీ..
అందీ లోకమే.. అంతా సౌందర్యమే..!!
ఆకాశం అంతఃపురమయ్యింది.. నాకోసం అందిన వరమయ్యింది..

పాట వింటుంటే మనసుకెంత హాయిగా ఉంటుందో తెలుసుకోవాలంటే.. విని చూడాల్సిందే.. చెప్పడం కష్టం. మీరూ సారి మళ్ళీ వినండి. వెన్నెల్లో నడిచే మబ్బుల్లో విహరించి, వర్షంలో తడిసే సంద్రాన్ని తాకి రండి.

మళ్ళీ కలుద్దాం..!!

12 comments:

Niranjan Pulipati said...

చాలా మంచి పాట.. ఇంత మంచి పాట ని మళ్ళి గుర్తు చేసినదుకు ధన్యవాదాలు :)

ప్రపుల్ల చంద్ర said...

అద్భుతమైన పాటను గుర్తుచేసారు... సిరివెన్నెల గారి పాటల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే!!

రాధిక said...

అద్భుతమైన పాట.thanks

లక్ష్మి said...

Paatalo madhuryam kanna, adi varninchi cheppina mee mataloni maadhuryam naku baga nachindi

భరత్ said...

chala manchipata ni gurtu chesinanduk madhura vani ki na dhanya vadamulu.laxmi garu anatu pata madhramu kante me varnana inka madhramu ga unadi.e cinema lo ne "aselem gurtuk radu na kannula mundara nv undaga" ane inko adbhutamaina pata undi. daninini kuda meru varninchi mak gurtu cheyalani na manavi madhura vani...

మధురవాణి said...

మీ అందరికీ నచ్చినందుకు సంతోషం..! నేను రాసింది కూడా నచ్చినందుకు ధన్యురాలిని.
Bha గారూ, మరో పాట కూడా ఉంది కదా.. అది మరో సారి గుర్తు చేస్తాను. ఎప్పుడో విన్న పాటలని అకస్మాత్తుగా గుర్తు చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.. ఏమంటారు...??

Anonymous said...

hearing to the nice song aftera long time !!

Ramani Rao said...

ఈరోజే చూస్తున్నా మీ బ్లాగ్. మంచి పాట.

హరే కృష్ణ said...

Excellent lyrics

just Beautiful :)

నేను said...

ఈ పాటతో పాటు "అసలేం గుర్తుకురాదు", "సురీడు పువ్వా" కూడా చాలా బావుంటాయి.

మూవీ ఒక్కణ్ణే పోయి వరుసగా రెండు షోలు చూశా.

lakshmana kumar malladi said...

ఇళయరాజా పాటల గురించి ఎంత చెప్పినా తనివి తీరదండీ! నాకు అత్యంత ఇష్టమైన ఆ సంగీత జ్ఞాని పాటలను, ఈ తమిళ దేశంలో ఉండి ప్రతిరోజూ మనసారా వినే భాగ్యం నాకు కలిగింది. భాష రాకపోయినా అర్ధం కాకపోయినా మనసుకు అత్యంత హాయిని కలిగించే ఆ రాగాలు, శబ్దాల మేళవింపు, సంగీతపు నడకా, అహోఅనిపించే మధ్య మధ్య లో వచ్చే ప్రత్యెక సంగీత గుళికలు నాకు చాలా చాలా ఇష్టం. నా బంతిపూలు పుటలో కొన్నిఅద్భుతమైన పాటల లంకెలు ఇచ్చాను, లేదా అంతర్జాలం లో వెతికి వినగలరు.

Arun Kumar said...

చాలా మంచి పాట.. ఇంత మంచి పాట ని మళ్ళి గుర్తు చేసినదుకు ధన్యవాదాలు :)