Monday, August 01, 2011

ఒక సింహం అబ్బాయ్ కథ!

అనగనగా ఒక పేద్ద అడవి. అడవిలో జింకలు, కుందేళ్ళు, ఉడుతలు, పిల్లులూ, పులులు, నక్కలూ, కుక్కలూ లాంటి బోల్డుమంది ఉండేవారు. అడవిలో ఒక సింహం అబ్బాయ్ ఉండేవాడు. సింహం అబ్బాయ్ అంతెత్తున బలంగా పెద్ద జూలుతో రాజసం ఉట్టిపడుతూ ఠీవీగా నడుస్తూ ఉంటే సింహం అనే పేరు తనని చూసే కనిపెట్టారేమో అన్నట్టు ఉండేవాడు.


సింహం అబ్బాయ్ ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరికి ఏం కావాలన్నా, ఏం సమస్య వచ్చినా అందరూ సింహం అబ్బాయ్ దగ్గరికే వెళ్ళి అడిగేవారు. అందుకని సింహం అబ్బాయ్ అంటే అడవిలో జంతువులందరికీ చాలా చాలా ఇష్టంగా ఉండేది. సింహం అబ్బాయ్ పుణ్యమా అని కుందేళ్ళు, ఉడుతలు, జింకలూ లాంటి సున్నిత మనస్కులందరూ బాధలూ లేకుండా నిర్భయంగా స్వేచ్ఛగా అడవిలో తిరగ్గలిగేవారు. పులులూ, నక్కలూ, తోడేళ్ళూ లాంటి తుంటరి వేషాలేసే వాళ్ళందరూ కూడా సింహం అబ్బాయ్ కళ్ళలోకి నేరుగా చూడటానికే వణికిపోయేవారు. అంతే కాదు సింహం అబ్బాయ్ పట్ల ఉన్న భయభక్తుల వల్ల అస్సలు తోక జాడించకుండా ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా క్రమశిక్షణగా మసలుకునేవారు. అలా సింహం అబ్బాయ్ అందరి బాగోగులూ చూస్తూ, అందరికీ సంతోషాన్ని పంచుతూ అడవి మొత్తానికీ అందాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చేవాడు.

అలా అలా అడవిలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందరికీ చాలా చాలా సంతోషంగా రోజులు గడిచిపోతున్న తరుణంలో మన సింహం అబ్బాయ్ ఒక రోజు అడవిలో విహారం చేస్తూ ఉండగా దూరంగా ఒక పెద్ద చెట్టు కింద ఎవరో ఉన్నట్టు కనిపించింది. అటుకేసి దగ్గరగా వెళ్ళి చూస్తే అక్కడొక సింహం అమ్మాయ్ కళ్ళు మూసుకుని కాళ్ళు దగ్గరగా మునగదీసుకుని ఒక పక్కకి తిరిగి బజ్జుని ఉండటం కనిపించింది. ఎందుకో తెలీదు గానీ సింహం అబ్బాయ్ చూపు నిద్రపోతున్న సింహం అమ్మాయ్ మీద నిలిచిపోయింది. మరింత దగ్గరగా వెళ్ళి నిదరోతున్న సింహం అమ్మాయ్ మొహం కేసి చూస్తూనే ఉండిపోయాడు.
కాసేపటికి చప్పున తేరుకుని వెంటనే.. "ఎవరీ సింహం అమ్మాయ్.. క్షణంలో నన్నే మాయలో పడేసిందే! ఇదివరకెప్పుడూ అడవిలో చూడలేదే.. ఇక్కడెందుకు ఉంది.. పాపం తనకేమన్నా కష్టమొచ్చి ఉంటుందా.. అందుకని ఎక్కడి నుంచో తల దాచుకోడానికి ఇక్కడికి వచ్చి ఉంటుందా.. ఎంతటి అమాయకత్వం ముద్దు మొహంలో.. ఏమైనాసరే సింహం అమ్మాయ్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే!" అనుకుంటూ సింహం అమ్మాయ్ కి దూరంగా జరిగి ఒకసారి గట్టిగా జూలు విదిలించి గాండ్రించాడు.

అరుపుకి నిద్రలో చూస్తున్న అందమైన కలేదో చెదిరిపోయినట్టు బెదిరిపోయి చప్పున లేచి కూర్చుంది సింహం అమ్మాయ్. కళ్ళు తెరిచేసరికీ ఎదురుగ్గా ఉన్న అంతోటి సింహం అబ్బాయ్ ని చూసి గుండె ఝల్లుమంది పాపం సింహం అమ్మాయ్ కి. ఒక్కసారి సింహం అబ్బాయ్ మొహంలోకి చూసే ప్రయత్నం చేసి అంత చురుకైన కళ్ళల్లోకి సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది. అంతలో సింహం అబ్బాయ్ గొంతు సవరించుకుని "నేను ఇక్కడ అడవిలో అందరి బాగోగులూ చూసుకునే సింహం అబ్బాయ్ ని. నిన్నిదివరకూ అడవిలో చూడలేదు. నీకేదన్నా సమస్య ఉంటే చెప్పు. నేను చూసుకుంటాను. నువ్వీ అడవిలో నా దగ్గర ఉన్నంతవరకూ.. అదే మా సంరక్షణలో ఉన్నంతవరకూ బెంగ పడాల్సిన పని లేదు" అని చెప్పాడు. సరేనంటూ తలూపింది సింహం అమ్మాయ్.

అలా అలా కొన్నాళ్ళు గడిచే సరికి సింహం అబ్బాయ్, సింహం అమ్మాయ్ చాలా మంచి స్నేహితులైపోయారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తన చుట్టూ సంతోషాన్ని పండిస్తున్న సింహం అబ్బాయి స్నేహంలో బెంగంటే ఏంటో దిగులంటే ఏంటో మర్చిపోయింది సింహం అమ్మాయ్. అందరితోనూ ఎప్పుడూ గంభీరంగా, ఎంతో మర్యాదగా కనిపించే సింహం అబ్బాయ్ లో ఇంతటి కొంటెతనం, చిలిపితనం దాగున్నాయా అని చాలా ఆశ్చర్యపోయేది కూడా! సింహం అబ్బాయ్ అల్లరి, ప్రేమ ఎంతో ముద్దుగా మురిపెంగా అనిపించేవి సింహం అమ్మాయ్ కి.

అలా రోజులు హాయిహాయిగా సాగిపోతూ ఉండగా ఒక రోజు సింహం అబ్బాయ్ కి అతి ముఖ్యమైన రాచకార్యం ఒకటి వచ్చి పడింది. అప్పుడు సింహం అమ్మాయ్ దగ్గరికొచ్చి "నేను ఇక్కడికి చాలా దూరంలో ఉన్న మరొక అడవికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నవాళ్ళు నా సహాయం కోసం కబురు పెట్టారు. అంచేత నేను వెళ్ళి తీరాల్సిందే. రోజే బయలుదేరుతున్నాను. అంతా సవ్యంగా జరిగితే.... కొన్నాళ్ళలో మళ్ళీ తిరిగొచ్చి నీకు కనిపిస్తాను." అని చెప్పాడు. అప్పుడు సింహం అమ్మాయ్ కి ఏమని బదులు చెప్పాలో తోచలేదు. సరేనన్నట్టు మౌనంగా తలూపి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పింది.

అప్పటి దాకా క్షణాల్లా దొర్లిపోయిన రోజులు భారంగా గడవసాగాయి. సింహం అమ్మాయ్ ఎదురుచూపుల్లో కాలం కష్టంగా కదులుతోంది. కన్ను మూసినా తెరిచినా సింహం అబ్బాయే కనిపిస్తున్నాడు. తనతో గడిపిన జ్ఞాపకాలనే మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ క్షణాలూ, నిమిషాలూ, గంటలూ, రోజులూ లెక్కపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉండిపోయింది. అలా నిరీక్షణలో ఎన్నో రోజులు గడిచాక ఒక రోజు పొద్దున్నే కళ్ళు తెరిచేసరికి ఎదురుగ్గా సింహం అబ్బాయ్ కనిపించాడు. తనని మొట్టమొదటిసారి అడవిలో చూసినప్పటి క్షణాలు గుర్తొచ్చాయి సింహం అమ్మాయ్ కి. అన్ని రోజుల ఎదురుచూపుల తర్వాత కనిపించినప్పటికీ సింహం అబ్బాయ్ కళ్ళలోకి నేరుగా చూడలేక కళ్ళు వాల్చేసింది సింహం అమ్మాయ్. "నిజంగా నువ్విన్నాళ్ళూ నన్నే తల్చుకుంటూ నా కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయావా.. నేను తిరిగి వస్తానని నీకెలా అంత నమ్మకం.. నిజానికి నేను తిరిగొచ్చి మళ్ళీ నిన్ను చూడగలనని నాకే నమ్మకం లేదు" అన్నాడు సింహం అబ్బాయ్. అప్పుడు సింహం అమ్మాయ్ కి ఎంత ప్రయత్నించినా బదులు చెప్పడానికి మాటలే తోచలేదు. చాలాసేపు అలాగే మౌనంగా ఉండిపోయింది. సింహం అబ్బాయ్ కూడా మరింకేం మాట్లాడకుండా గంభీరంగా ఉండిపోయాడు.


వాళ్ళిద్దరి మౌనంలో మరి కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజు సింహం అమ్మాయ్ సింహం అబ్బాయ్ దగ్గరికొచ్చి "నేనీ అడవిలోకి మొదటిసారి వచ్చినప్పుడు మొదట కనిపించింది నువ్వే. నాకేం కావాలన్నా నిన్ను అడగమని చెప్పావు. నిజానికి నేను అడక్కుండానే నువ్వు నాకు చాలా ఇచ్చావు. నువ్వు పక్కననున్నప్పుడు ప్రపంచంలో ఉన్న సంతోషమంతా నాతోనే ఉన్నట్టుంటుంది. నిన్ను తలచుకుంటేనే చాలు.. భయం, బాధ అనే వాటికి నా జీవితంలో చోటే లేదేమో అనిపిస్తుంది. నువ్వు నా కోసం ఇంత ఇచ్చినా నాకింకో కోరిక మిగిలిపోయింది. నేనది అడగొచ్చా?" అంటుంది. కొంచెం ఆశ్చర్యపోయిన సింహం అబ్బాయ్ "తప్పకుండా అడగొచ్చు. ఎంత కష్టపడైనా సరే నీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను" అని బదులిచ్చాడు. అప్పుడు సింహం అబ్బాయ్ కళ్ళల్లోకి చూస్తూ "నా కోసం అచ్చంగా నీ పోలికలతో ఉన్న ఒక బుల్లి సింహం అబ్బాయ్ ని ఇస్తావా మరి?" అని అడిగేస్తుంది సింహం అమ్మాయ్. అప్పుడు సింహం అబ్బాయ్ బిగ్గరగా నవ్వేస్తూ "తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. కానీ కష్టపడి మాత్రం కాదు.. బోల్డంత ఇష్టపడి.." అంటాడు. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ కోసం ఒక బుల్లి సింహం అబ్బాయ్ వచ్చేస్తాడు. ఇంకప్పుడు వాళ్ళు ముగ్గురూ కలిసి అడవిలో బోల్డు సంతోషంగా ఉండిపోతారు.. ఎప్పటికీ..!

ఇంకంతే.. సింహం అబ్బాయ్ కథయిపోయింది!sengihnampakgigi

అసలీ సింహం ఏవిటీ.. కథేవిటీ.. కథలో అర్థం ఏవిటీ.. పరమార్థం ఏవిటీ.. అని మీకేమైనా సందేహం వస్తోందా? అన్నట్టు మీకీ సామెత తెలుసా.. తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్లిందంట.. అలాగే నేనీ సింహం కథ చెప్పానన్నమాట మీకిప్పుడు.. ఇంక చాల్లే గానీ హాశ్చర్యం ప్రకటించింది.. నడవండి నడవండి.. వెళ్ళి రండి!jelir

22 comments:

ఇందు said...

బాగుంది మధురా! ఈ కథలో నీతి ఏంటబ్బా?
బర్రుబర్రుమని అరికాలు ఎంత గీక్కునా అర్ధం కావట్లేదు ;)

ఆ సిమ్హం బొమ్మలు భలే ఉన్నాయ్ సిమ్హం అమ్మాయ్ ;)ఇస్టోరీ కూడా అదుర్స్!

రహ్మానుద్దీన్ షేక్ said...

<< బర్రుబర్రుమని అరికాలు ఎంత గీక్కునా అర్ధం కావట్లేదు ;)


హ హ హ

నేనింకా నా బీరువా ని గీకాను

రాజ్ కుమార్ said...

జాబిలి కి రాయకుండా ఇక్కడ రాశారేమిటండీ??
;) ;) :)

మధురవాణి said...

@ ఇందూ, రహ్మాన్..
మీరలా గోళ్ళూ, వేళ్ళూ పాడు చేసుకోకూడదనే కదా లాస్ట్ లో ఆ రెండు లైన్లూ రాసింది.. ;) ఇంత చెప్పాక కూడా మీకీ కథలో ఏదన్నా నీతి కనిపిస్తే అదేంటో నాకూ చెప్పండి.. :))

@ వేణూరాం,
ఏదో సరదాకి రాసానండీ ఈ కథ.. ఇదేం నీతి కథ కాదు కదా పిల్లలకి చెప్పడానికి అనిపించి జాబిల్లికి పంపలేదు.. :)

హరే కృష్ణ said...

కళ్ళు మూసుకుని ఒక పక్కకి తిరిగి బజ్జుని ఉండటం కనిపించింది.
ఇదేంటి గూగుల్ బజ్జా అని అనుకొని ఆ తర్వాత ఈ వాక్యం చదివి నాలుక కరుచుకున్నాను :))


కధ తో పాటు చెప్పిన విధానం చాలా బావుంది
ఒక బుల్లి సింహం అభిమాని :)

Sravya V said...

సింహం అమ్మాయి , సింహం అబ్బాయి :))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>నడవండి నడవండి.. వెళ్ళి రండి!

మీ బ్లాగుకి వచ్చి కష్టపడి టపా చదువుతే ఇలా అంటారా? ఏమైనా బాగుందా?

ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ. రెండు దరహాసాలు.

శివరంజని said...

wowwwwwwwwwwwwwwwwwwwwwwwwww
భలే భలే సింహం కథ ........నాకు సూపర్ నచ్చేసింది తెలుసా .......నీ కథ లంటే నాకు చాలా ఇష్టం కూడా

శివరంజని said...

ముందు చదివినప్పుడు ఇది కధే అనుకున్నా .కాని నువ్వు చివరి లైన్స్ రాసావు చూసావా ...అప్పుడు మాత్రం అర్ధాలు వెతకాలి అనిపించింది


అసలీ సింహం ఏవిటీ.. కథేవిటీ.. కథలో అర్థం ఏవిటీ.. పరమార్థం ఏవిటీ.. అని మీకేమైనా సందేహం వస్తోందా? అన్నట్టు మీకీ సామెత తెలుసా.. తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్లిందంట.. అలాగే నేనీ సింహం కథ చెప్పానన్నమాట మీకిప్పుడు.. ఇంక చాల్లే గానీ హాశ్చర్యం ప్రకటించింది.. నడవండి నడవండి.. వెళ్ళి రండి>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

అబ్బోఓఓఓ .....................ఆహా .......అలాగా ??? అంతేనంటావా ??????????అంతే అంతే ..ఇది కథే ..... నిజంగా కథే .........నేను నమ్మేస్తున్నా ........ కాని
నేను ఇంకా బుల్లి సింహం బుజ్జి సింహం నా కోసం తెస్తున్నావేమో అనుకున్నా మధు .....

ఆ.సౌమ్య said...

ఇదే సినిమా మధురా?...చాలా తెలుగు సినిమాల్లో చూసాను ఈ కథని :P

..nagarjuna.. said...

:)

వేణూశ్రీకాంత్ said...

సగంనుండి చివరి పేరా చదివే వరకూ హేవిటో.. అనుకుంటూ కాసేపు బుర్ర కాసేపు మోకాలు గోక్కున్నా.. చివరిపేరా చదివాక తేదీ మరోసారి కన్ఫర్మ్ చేసుకున్నా ఆగస్ట్ ఫస్టే కదా అని :-)
కథేమో కానీ చెప్పిన విధానం బాగుంది :)
సింహం బొమ్మలు బోలెడంత బాగున్నాయ్ :-)

అనుదీప్ said...

మధుర గారు... ఎదో అనుకుంటే ఇంకేదో అయిందంట... అలా ఉంది కథ... మీరు నాకు సింభా కథ, కాదు కాదు సింభా లాంటి కథ చెబుతారు అనుకున్నా.. కానీ, చివరికి అలా ముగించారు.. లాస్ట్ స్టేట్మెంట్ తొ బానే cover చేశారు..దానికి మీకు నూటికి 90 మార్కులు పడతాయ్... దీనినే అనుభవం అని తెలుగులో, EXPERIENCE అని ఆంగ్లములో అంటారు.. BTW photos చాల బాగున్నాయ్.. Great Work keep it up... :) :)

Karnam vanitha said...

cute story and pictures

రవికిరణ్ పంచాగ్నుల said...

కధ బహు బాగు..

బొమ్మలు మరీ బహు బాగు..

HarshaBharatiya said...

అదుర్స్
simple and cute love story

kiran said...

హహహ..మధుర...ఎంత కుతేఏఏఏఏఎ గ ఉందొ కథ..:D
నేను నవ్వుతు నవ్వుతు చదివేస...
సింహం అబ్బాయ్..సింహం అమ్మి మద్య నో duet ..:ప..ఇదొక్కటే కాస్త నిరాశ పరిచింది..:P
నాకు ఈ కథ ఊ సింహనికైన చుపించాలనిపిస్తోంది..:)

ఇందు -అరికాలు baagaa గోకు..:P

మధురవాణి said...

@ హరే కృష్ణ,
హహ్హహ్హా... భలేవారే! బజ్జోడం అంటే గూగుల్ బజ్జనుకున్నారా! :D :ద
థాంక్యూ.. బుల్లి సింహం అభిమాని గారూ! :))

@ సుజ్జి,
:P

@ సాయి,
:))

@ శ్రావ్య,
బుల్లి సింహం అబ్బాయ్ కూడా! ;)

మధురవాణి said...

@ బులుసు గారూ,
హిహ్హిహీ.. అంటే, ఇప్పటికి ఇంటికేల్లిపోయి మళ్ళీ కొత్త టపా వేసినప్పుడు రండీ అని చెప్పడం అన్నమాట.. అర్థం చేసుకోరూ! ;) :D

@ శివరంజని,
థాంక్యూ ఊ ఊ ఊ ఊ ఊ ఊ శ్రియా! :)
అలాగ లేని పోని అర్థాలు వెతక్కూదడనే కదా అన్తిడిగా చెప్పింది. నువ్వేమో చెప్పాను కదాని మరీ ఎక్కువ వెతికేసావా? :))
అబ్బా.. ఆహా.. అలాగే.. అంతే అంతే.. వేరే ఇంకేం లేదు.. సరేలే, బుల్లి సింహం నా దగ్గరికొచ్చాక కాసేపు నీకిస్తాలే ఆడుకోడానికి.. :))

@ సౌమ్యా,
హిహ్హిహ్హీ.. కదా.. ఎన్నో ఎన్నో తెలుగు సినిమాలు చూసీ చూసీ ఆ జ్ఞానం ఎక్కువైపోయి నేను చెప్పిన కథనుకోండి..

@ నాగార్జున,
:)

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
హహహహ్హా.. వేణూ.. :)))

@ అనుదీప్,
ఇంతకీ ఎవరా సింభా, ఏమా కథండీ? నాకు తెలీదే.. ఆ కథేదో మీరే చెప్పండి మరి.. :))

@ వాణి, రవికిరణ్, హర్ష,
థాంక్యూ! :))

@ కిరణ్,
క్యూట్ గా ఉందా? హిహ్హిహ్హీ.. థాంక్యూ!
డ్యూయెట్ మిస్సయిన్దంతావా.. మళ్ళీ ఈ సారి ఏదన్నా కథ చెప్తే మిస్ చెయ్యన్లే.. నిన్ను తల్చుకుని మరీ ఒక డ్యూయెట్ పాడించేస్తా.. సరేనా! ;)

sphurita mylavarapu said...

కథ కన్నా కామెంట్లు ఎక్కువ నవ్వు తెప్పించాయ్....అలా ఖోపం గా చూడకండి మరీ...నేనేదైనా సినిమా(బాలక్రిష్ణ సినిమా) కి పేరడీ ఏమో అనుకుంటూ చదివా హి హి హి...

బొమ్మలు మాత్రం సూపరు అందరూ చెప్పినట్టు

మధురవాణి said...

@ స్ఫురిత,
బాలకృష్ణ సినిమాకి పేరడీ అనుకున్నారా? :( :( సరే, బొమ్మలు సూపర్ అన్నారు కాబట్టి ఈ సారికి మీతో పోట్లాడకుండా ఊరుకుంటున్నా.. ;) :))