Monday, August 22, 2011

శ్రీకృష్ణ చరణౌ మనసా స్మరామి.. శ్రీకృష్ణ చరణౌ శిరసా నమామి!


రాధా.. రాధా.. ఇదిగో నేనొచ్చేశాను చూడు.

ఓహో.. శ్రీకృష్ణుల వారు వేంచేసారా.. ఇంత పెందరాళే నా మీద దయ కలిగిందేం స్వామీ! ఇంతకీ ఇప్పుడు సూర్యోదయ వేళయితే పొరపాటున సూర్యాస్తమ సమయం అనుకుని నేను గానీ భ్రమపడటం లేదు కదా!

అమ్మో.. ఇదంతా కోపమే.. నా రాధకే! చిరుకోపంలో నీ మోమున పండిన ఎరుపుకి పోటీ రాలేక సూర్యుడు సైతం చల్లబడిపోతున్నాడు చూసావా రాధా.. పొద్దున్నుంచీ నా కోసం ఎదురుచూపుల్లో అలసి కందిపోయిన నీ మోము చూడలేక సూరీడు పూటకి కూసింత త్వరగా నిష్క్రమిస్తూ చంద్రోదయానికి వీలు కలిపిస్తున్నాడు.. అదిగో నువ్వే చూడు ఆకాశం కేసి సారి!

మాయ మాటలకేం తక్కువ లేదు! అయినా అసలు కృష్ణుడంటేనే మాయ కదూ! ఉదయం నుంచీ వాకిట్లో వేసిన కృష్ణ పాదాల వంకే వళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుంటే గోధూళి వేళకి గానీ నీకు నాపై దయ రాలేదు కదూ కృష్ణా!

మరి నన్నేం చెయ్యమన్నావు చెప్పు.. నేనా ఒక్కగానొక్క కృష్ణుడినీ, పైగా రోజే పుట్టిన బుజ్జి పాపాయిని.. రోజు గోకులాష్టమిని పురస్కరించుకుని లోకమంతా భక్తి పారవశ్యంలో మునిగి కృష్ణా కృష్ణా.. అంటూ కృష్ణ నామస్మరణలో ఓలలాలడుతూ తమ భక్తివిశ్వాసాలతో నన్ను బందీని చేసేస్తే నేనెలా వారందరినీ విడిచి రాగలను చెప్పు.. వారందరి పిలుపులూ ఆలకించి, నా కోసం ప్రేమగా సమర్పించిన వెన్న, అటుకులూ, బెల్లమూ అన్నీ ఆరగించి వారందరికీ సంతోషాన్ని కలిగించి వచ్చేసరికి ఇదిగో వేళయిందన్నమాట!
అయినా రాధా.. కృష్ణుడు ఎచటనున్నా తన మనసు మాత్రం ఎల్లప్పుడూ రాధ చెంతనే నిలిచి ఉంటుందని నీవు మాత్రం ఎరుగనిదా చెప్పు.

ఆహా.. అలాగేం! క్షణాల్లో మాయ చేసి మురిపించేస్తావ్.. అయినా మాయ చెయ్యడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదూ! ఇంద.. వెన్న ముద్దలు ఆరగించు.

అంతేనా.. నాకు నువ్విచ్చే పుట్టినరోజు కానుక వెన్నముద్దలేనా.. వెన్నముద్దల్లాంటి నీ బుగ్గల్లో దాచుంచిన ముద్దులు లేవా?

ఆహ్హాహా.. అక్కడితో అల్లరి సరిపెట్టు మోహనా.. క్షణం క్రితమే చిన్నారి కృష్ణుడిని, బుజ్జి పాపాయిని అన్నావే!

అది లోకమంతటికీ రాధా.. నీకు కాదు.. అయినా లోకాన్నంతా కాచే కృష్ణుడిని ప్రతినిత్యమూ కంటికి రెప్పలా కాచుకునేది ఎవరూ చెప్పు.. నా ముద్దుల రాధే కదూ!

ఏమైనా నువ్వు దొంగ కృష్ణుడివి సుమా! ముద్దులూ మురిపాల ముచ్చట తర్వాత గానీ.. ఏదీ చిన్నారి కృష్ణుడి అల్లరి జ్ఞాపకాలు చెప్పవూ నాకు..

సరే.. అలాగే చెప్తాను విను. మరేమో ఒకసారి ఏమయ్యిందంటే.. నాకు చిన్నప్పటి నుంచీ పాలమీగడలూ, వెన్నముద్దలంటే మహా ప్రియం కదా! ఇంట్లో యశోదమ్మ ఎంత గారంగా గోరు ముద్దలు తినిపించినా గోప స్త్రీల ఇళ్ళలో దొంగిలించి తిన్న వెన్న రుచే వేరు! అంచేత నేను నా స్నేహితులైన గోప బాలకులతో కలిసి గోప స్త్రీల ఇళ్ళల్లో చొరబడి వాళ్ళు ఉట్టి కట్టి భద్రంగా దాచుంచిన పాల మీగడలూ, వెన్నముద్దలూ దొంగిలించి అందరం కలిసి ఎంచక్కా ఆరగించే వాళ్ళం. ఎంత అల్లరి చేసినా వారి చేతికి మాత్రం ఎప్పుడూ చిక్కేవాడిని కాదు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి పాలు, వెన్న మాత్రం మాయమైపోతున్నాయెలా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. ఎలాగైనా నన్ను పట్టుకోవాలని ఒకనాడు అందరూ కలిసి ఉపాయం పన్ని అందరిళ్ళలోనూ కాపలా ఉండగా నేను అందరికీ అన్నీ చోట్లా కనిపించి ఎవరికి వారే కృష్ణుడు తమ చేతికి చిక్కాడనుకునేలా భ్రమ కల్పించాను. తీరా చివరికి నేనెవరి చేతికీ చిక్కలేదని గుర్తించాక ఉక్రోషం కొద్దీ వారందరూ కలిసి యశోదమ్మ దగ్గరికెళ్ళి నా అల్లరి గురించి చిలవలు పలువలుగా చెప్పారు. అయినా వారి పిచ్చి గానీ, అదంతా మా బంగారు తల్లి యశోదమ్మ నమ్ముతుందా ఏవిటీ.. నా కృష్ణుడు ఎంతటి బుద్ధిమంతుడో నాకు తెలియనిదా.. వెళ్ళండి వెళ్ళండి ఇక చాడీలు చెప్పింది చాల్లే.. అని వారందరినీ అదలించి పంపేసి నన్ను దగ్గరికి తీస్కుని బుగ్గలు పుణికి ఒక వెండి గిన్నె నిండుగా వెన్న తీసుకొచ్చి గోరు ముద్దలు తినిపించింది యశోదమ్మ.

మరోసారేమో నేను బాగా అల్లరి చేస్తున్నానని , మన్ను తింటున్నానని యశోదమ్మ నన్ను కోప్పడి నోరు తెరిచి చూపమంటే పధ్నాలుగు భువనాలనీ చూపాను.. తెలుసా రాధా నీకు?

ఆహా.. ఎందుకు తెలీదు.. ప్రతి రోజూ నీ కళ్ళల్లోకి చూసినప్పుడల్లా విశ్వ దర్శన భాగ్యం కలిగిస్తూనే ఉంటావుగా నాకు! వెన్న ముద్దల కోసం మారాం చేసినా, వన్నెల ముద్దుల కోసం గారం చేసినా నువ్వు నా బుజ్జి కన్నవి, చిన్నారి తండ్రివి, వరాల మూటవి, బంగారు కొండవి, వంశీ మోహనుడివి, ముద్దుల మురారివి, రాధామాధవుడివి కదూ!

నా చిన్నారి కృష్ణా.. వేళ నువ్వు పుట్టిన రోజు.. శ్రావణ బహుళాష్టమి.. జగమంతటికీ వెలుగులు నిండిన రోజు.. నిన్ను నమ్మిన వారందరూ ఆనందోత్సాహలతో పండుగ జరుపుకునే రోజు, మురిపెంగా నిన్ను ముద్దు చేస్తూ వెన్నముద్దలు తినిపించే రోజు, నీ నామస్మరణలో మా జన్మ ధన్యమయ్యే రోజు!

కృష్ణా.. అని నిన్ను ఒక్క మారు మనసులో తలచుకున్నంతనే మామ్మాలకించి కష్టాలన్నీ కడతేర్చి సుఖసంతోషాలని ప్రసాదించే మా హృదయ నందనుడివి కదూ కృష్ణా నువ్వు! నిన్ను నమ్ముకున్న వారెల్లరి మదిలోనూ నిత్యం కొలువుండి నీడలా వెన్నంటి మము కాచే నీవెంత దయామయుడివిరా మోహనా!

అట్టి మా ప్రాణ సమానమైన శ్రీకృష్ణ పాదారవిందాలకు ప్రణమిల్లుతూ వేడుతున్నాము.. నీ ప్రేమామృతంలో మా జన్మ ధన్యం గావించి మము తరింపజేయి కృష్ణా!

శ్రీకృష్ణ చరణౌ మనసా స్మరామి.. శ్రీకృష్ణ చరణౌ శిరసా నమామి!

జయ జనార్ధనా కృష్ణా.. రాధికాపతే..
జనవిమోచనా కృష్ణా.. జన్మమోచనా!
గరుడవాహనా కృష్ణా.. గోపికాపతే..
నయనమోహనా కృష్ణా.. నీరజేక్షణా!
విమలగాత్రణే కృష్ణా.. భక్త వత్సలా..
చరణ పల్లవం కృష్ణా.. కరుణ కోమలం!
ప్రణయవారిధే కృష్ణా.. గుణగణాకరా..
దామసోదరా కృష్ణా.. దీన వత్సలా!
భువలయేక్షణా కృష్ణా.. కోమలాకృతే ..
తవ పదాంబుజం కృష్ణా.. శరణమాశ్రయే!

11 comments:

SHANKAR.S said...

ఏంటో కళ్ళు తడిశాయి మధుర గారూ. భక్తో, పారవశ్యమో తెలీదు గానీ మనసు నిండింది. అది చాలు.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

చాలా భావుకులు మీరు. చాలా అందం గా రాస్తారు. మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు.

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది మధురా.. మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు..

MURALI said...

:)

durgeswara said...

జయజనార్ధనా కృష్ణా రాధికాపతే

ఇందు said...

Kevvvvv madhura super undi pho! Krishnashtami shubhakankshalu :)

హరే కృష్ణ said...

చాలా బావుంది !
కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

:)

Anonymous said...

photo chaala bagundandi...chinni krishnudu mudduga unnadu.....ee photo yokka source cheppagalaru

మధురవాణి said...

@ శంకర్ గారూ..
నాకెలా స్పందించాలో తెలీట్లేదు మీ కామెంట్ చూసి.. నాదేం లేదండీ.. అంతా కృష్ణ మాయ.. బోల్డు బోల్డు ధన్యవాదాలు! :)

@ విజయమోహన్ గారూ, కృష్ణప్రియ గారూ, వేణూ శ్రీకాంత్, మురళీ, దుర్గేశ్వర గారూ, ఇందూ, హరే కృష్ణ, అవినేని భాస్కర్..
శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.. :)

@ అనానిమస్,
ఈ చిన్నారి కృష్ణుడి ఫోటో గూగుల్ నుంచి తీసుకున్నదేనండీ.. కృష్ణుడి ఫోటోల కోసం వెతికితే ముందు కనిపించే పది ఫోటోల్లోనే ఇది ఉంటుంది. అంత విరివిగా కనిపిస్తూ ఉంటుంది.. ఒకవేళ మీకు గానీ దొరక్కపోతే 'baby krishna' అని search చేసి ప్రయతించండి. :)