కష్టాల్లో, బాధల్లో కూరుకుపోయి, ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో.. నిస్సహాయంగా ఉన్నప్పుడు.. దేవుడున్నాడని నమ్మే మనుషులు అనుకునే మాట ఇది. నాకు ఇప్పుడలాగే దేవుడిని ఎలుగెత్తి పిలవాలనిపిస్తుంది మళ్ళీ మరో మారణహోమాన్ని ముంబై టెర్రర్ రూపంలో చూస్తుంటే.. రోడ్ల మీద, హోటళ్ళలో, విమానాశ్రయంలో, ఆసుపత్రుల్లో..ఎన్నో చోట్ల విచక్షణారహితంగా బాంబులు, కాల్పులు జరుగుతుంటే.. అక్కడ చిక్కుకుపోయిన సాటి మనుషులను ప్రత్యక్షంగా టీవీలో చూస్తుంటే ఎలా స్పందించాలో తెలీలేదు. నిస్సహాయంగా కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు రాలాయి అంతే.. :( అంతకు మించి ఏమనాలో తెలియట్లేదు. వారానికొక కొత్త సినిమా విడుదలైనట్టుగా, బాంబు దాడులు జరుగుతున్నాయి మన దేశంలో.. దీనికి కారణాలు ఎవరైనా గానీ, సామాన్య జనం బలై
పోతున్నారు. అయినా.. ఎక్కడని తప్పించుకోగలం?? ఆసుపత్రికీ, రోడ్డు మీదకీ, గుళ్లకీ, గోపురాలకీ, బస్ స్టేషన్ లకీ, రైలు స్టేషన్లకీ వెళ్ళకుండా ఎలా బ్రతకడం..?? అసలు ఇలాంటి దుశ్చర్యలకీ పాల్పడే వాళ్ళకి వాళ్ల గమ్యం ఏంటో తెలుసా అని నాకొక సందేహం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ.. వాళ్లు చచ్చీ, జనాల్నీ చంపి, చివరికి ఎవరికీ ఏమి కట్టబెడదామని వాళ్ల ఆరాటం? ఈ పవిత్ర కార్యం చేసి వీరులై చచ్చి స్వర్గానికెళ్లాలనా? ఏమో.. వాళ్ళకే తెలియాలి మరి. ఏదో పత్రిక లో చూసాను. టెర్రరిస్టులు సాంకేతికంగానే కాదు, విజ్ఞాన పరంగా కూడా ముందున్నాం అని నిరూపించుకోడానికి ఏవో ప్రభుత్వ వెబ్ సైట్లను స్వాధీనపరుచుకున్నారు అనీ... అసలు మనిషికి చదువు, విజ్ఞానం ఎందుకో నాకర్ధం కాలేదు నాకు.. అంత గొప్పగా చదువుకుని ఉండి.. మరి వాళ్ల బుర్రలో ఏమి పురుగులుంటాయో.. ఇంత మూర్ఖమైన పనులకి పాల్పడుతుంటారు. పైగా దేవుడి పేరు చెప్పుకునీ మరీ అఘోరిస్తుంటారు. హయ్యో.. రామా..నాగరికత ఎటు పయనిస్తోంది తండ్రీ..?? మాకెలాగూ తెలియట్లేదు.. నీకేమైనా తెలుస్తుందా???
ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోవడం మాత్రమే కాదు. ఈ హింస వల్ల మరెన్నో కోణాల్లో నష్టం వాటిల్లబోతోంది కదా..! ఎన్నో కోట్లమంది పౌరులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రైతులుగా, కూలీలుగా, ఎన్నో రకాల ఉద్యోగాలను ఎంతో కష్టపడి బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ మన దేశాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు కష్టపడి పెంచిన దేశ ప్రతిష్టనీ, దేశాభివృద్ధినీ.. ఇలాంటి తీవ్రవాదుల క్రూరమైన చర్యలు ఒక్కసారిగా నేలమట్టం చేస్తున్నాయి.
ముంబై మన దేశ వాణిజ్య రాజధాని కదా..! ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది ఎన్నో పనుల మీద అక్కడికి వస్తారు. అలా వచ్చిన వాళ్లందరూ ఎక్కువగా బస చేసే హోటళ్ళలో తాజ్ మహల్, ఒబెరాయ్ ముందు వరసలో ఉంటాయి. ఇప్పుడు ఇంత ఘోరంగా అక్కడ జరిగిన భద్రతా వైఫల్యాన్ని చూసాక.. ఎవరైనా మన దేశానికి ఏ మొహం పెట్టుకుని వస్తారు?? క్రికెట్ లాంటి క్రీడల కోసం వచ్చే విదేశీయులూ, ఎన్నో వ్యాపారాల నిమిత్తం వచ్చే వాళ్లు.. ఎందరెందరో ఆ హోటళ్ళలో ఉంటారట. అంతెందుకు నిన్న ఈ ఘోరం జరిగినప్ప్పుడు కూడా లోపల చిక్కుకుపోయిన వారిలో వారే చాలామంది ఉన్నారు. ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త భార్య సమేతంగా ఏదో విశిష్ట అవార్డు తీసుకోవడం కోసం ముంబై వచ్చి నిన్న ఆ హోటలో లోనే చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తూ మన పోలీసులు వారిని రక్షించారు. ఇంకా ఇలాంటి వాళ్లు ఎంత మంది ఇరుక్కుపోయారో..?
వరుసగా ఇన్ని బాంబు దాడులు జరుగుతూ ఉంటే దేశంలోనే అత్యంత ముఖ్యమైన అలాంటి ప్రాంతాల్లో సెక్యూరిటీ ఎందుకు సరిగ్గా లేదు? మన ఇంటిలిజెన్స్ వర్గాలు ఏమి చేస్తున్నాయో?? ఇక్కడ మరో విషయం.. అలా అని మనం పూర్తిగా పోలీసులని నిందించలేం.. ఎందుకంటే ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా తమ వ్యక్తిగత జీవితాలని మర్చిపోయి ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించే వారి త్యాగానికి మనం విలువ కట్టలేం కదా..! మనకి చాలా పోలీసు, మిలటరీ బలగం అన్నీ ఉన్నాయి. వాళ్లు చాలా వరకు తమ భాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కానీ, వాళ్ళందరినీ సమన్వయ పరచాల్సిన అధికారం కలిగిన ఉన్నతాధికారులు, మంత్రులూ, ప్రభుత్వం ఏమి చేస్తున్నాయో మరి..?? అసలు వైఫల్యానికి కారణం వీళ్ళే. రాజకీయ నాయకుల సెక్యూరిటీ గురించి చూపించే శ్రద్ధలో ఏ కాస్త శ్రద్ధ అయినా దేశ భద్రతలో కూడా చూపిస్తే వీటిల్లో కొన్నీటినైనా అయినా ఆపగలిగే వారేమో అనిపిస్తుంది నాకయితే.. సామాన్య మానవుల భద్రతని ఎలాగూ తుంగలో తొక్కారు.. చివరికి దేశం పరువు మర్యాదలు కాపాడడంలో కూడా విఫలమయ్యాయి మన ప్రభుత్వాలు :( మొతానికి, తీవ్రవాదులు వాల్లనుకున్నది సాధించినట్లే ఉంది చివరికి. ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని మేము చాలా భద్రతని కల్పిస్తాము ఇప్పటి నుంచి మా దేశంలో.. అదీ ఇదీ.. అని కాకమ్మ కబుర్లు చెప్తే ఎవరు నమ్ముతారంటారు? రాజకీయ నాయకులందరూ మేల్కొని ఒకరి తరవాత ఒకరు మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ చెప్పేసి.. ఆ తర్వాత వాళ్ల పనిలో వాళ్ళుంటారు. ఖండించడం తప్ప వేరే ఏమీ చేసేట్టుగా కనిపించట్లేదు పరిస్థితి.. :(
మొత్తానికి ఈ తీవ్రవాద సమస్య పెరిగి పెద్దదవుతూ.. చివరికి ప్రపంచంలో మన భారత దేశం ఉనికినే ప్రశ్నించే రోజులోస్తాయేమోనని చాలా భయంగా, బాధగా ఉంది. ఇన్ని రకాలుగా ఆలోచించి మనస్తాపం చెందడమే కానీ, మనమేమి చెయ్యాలో తెలియని అయోమయంలో, ఆవేదనలో.. ఏమనాలో తెలీక ఆ దేవుడిని పిలుస్తున్నాను.. "
దేవుడా..
ఒకసారి ఇటువైపు చూడు నాయనా..
ఏమిటీ వైపరీత్యం..??" అని.
ఈ ఘోరాన్ని చూసి ఎలా స్పందించాలో తెలియక నా గుండెల్లో సుడులు తిరుగుతున్న భావావేశాన్ని మీతో చెప్పడానికి ప్రయత్నించాను. ఇది నా స్పందన మాత్రమే..! నిజానిజాల్లో ఏమైనా తేడాలుంటే మన్నించండి.
ఇన్ని జరుగుతున్నాగానీ.. ఏదో ఒక నాటికి.. ఇలాంటి హింసలు లేని ఒక అందమైన, ఆదర్శ ప్రపంచాన్ని చూస్తామేమో అనే ఒక చిన్ని ఆశ మాత్రం నాలో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఏమో మరి.. నా ఆశ ఎప్పటికీ అందని కలలాగా మిగిలిపోతుందో .. లేక నిజమై నిలుస్తుందో.. కాలమే నిర్ణయించాలి..!!