Friday, August 09, 2013

My San Francisco Diary - 9



20.06.2013
గురువారం
ఉదయం మెలకువొచ్చేసరికి నిన్నటి సముద్రపు గాలి ప్రేమగా ఇచ్చిన తలనొప్పి, గొంతునొప్పి నాకు శుభోదయం చెప్పాయి. అప్పటికే టైము ఎనిమిదైపోతున్నా సరే నన్నెవరూ నిద్ర లేపలేదు. నేను తీరిగ్గా దిగి కిందకొచ్చేసరికి కిరణ్ ప్రభ గారు ఆఫీసుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిషి, కాంతి గారు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నన్ను చూస్తూనే ​"నిద్ర సరిపోయిందా? తొందరగా రెడీ అవ్వాలి ఈ రోజు. బయటికెళ్ళే పనుంది కదా" అన్నారు. ​కాంతి గారి బంధువులు ప్రసాద్ గారు ఆ రోజు ఉదయం పూట తన వర్క్ బిజీ పెద్దగా లేదని మా ముగ్గురినీ శాన్ ఫ్రాన్సిస్కో తీసుకెళ్తానన్నారు. ​మధ్యాహ్నం మూడింటికల్లా వెనక్కి తీసుకొచ్చేస్తే అప్పుడు మేము మళ్ళీ షాపింగ్ కి వెళ్ళాలి అనుకున్నాం. కిరణ్ ప్రభ గారు బాగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయారు. నేను వేడి వేడిగా గ్రీన్ టీ ​తాగాక ​గొంతు కొంచెం పర్లేదనిపించిది. తొమ్మిదిన్నర కల్లా అందరం రెడీ అయిపోవాలి కాబట్టి ​నిషి పైకెళ్ళగానే నేను ఇడ్లీ తింటుంటే పద్మవల్లి గారు ఫోన్ చేసారు. ​నిన్న రాత్రి నిషి ఎప్పుడొచ్చింది, ఎంత ఎక్సైటింగా ఫీలయ్యాము, ఈ రోజు ప్రోగ్రాం ఏంటీ వగైరా విశేషాలన్నీ ఓ ముప్పావు గంటసేపు చెప్పుకున్నాక ఈ లోపు గడియారం చూసి భయపడి ​అప్పటికింక టాటా చెప్పేసుకున్నాం. ఇడ్లీ తినేసాక మహా బద్ధకంగా ఉన్నాసరే నాదొక్కదానిదే ఆలస్యమంతా అని ​గుర్తించి నేను కూడా చక చకా తయారైపోయి కిందకొచ్చేసాను. అప్పటికే హాల్లో చిమట శ్రీని గారు మాట్లాడుతూ కనిపించారు ​. నిషి వచ్చింది కదాని హాయ్ చెప్పి వెళదామని వచ్చారట. రేపు శుక్రవారం రాత్రికి శ్రీని గారింట్లో డిన్నర్ కి అందర్నీ రమ్మని ఇదివరకే ఒకసారి మెయిల్లో, ఫోన్లో చెప్పినా సరే మళ్ళీ ఒకసారి ముఖాముఖి ఆహ్వానించారు శ్రీని గారు. ఆయనతో మాట్లాడటం భలే సరదాగా ఉంటుంది. శ్రీని గారి సంభాషణల్లో సందర్భానుసారంగా చక్కటి హాస్య చతురతతో పాటు భలే భలే మంచి తెలుగు పదాలు దొర్లుతూ ఉంటాయి. అలా ఆనందంగా వింటూ కూర్చోవచ్చు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగానే టైము దాదాపు పదిన్నర అయింది. మమ్మల్ని పికప్ చేసుకోడానికి ప్రసాద్ గారు, వాళ్ళ టీనేజ్ అబ్బాయి శ్రేయష్ వచ్చారు. శ్రీని గారికి టాటా చెప్పేసి ప్రసాద్ గారు వాళ్ళతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో కి బయలుదేరాము.


అప్పుడు ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో తొందరగానే శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోకి వెళ్ళిపోయాము. San Franciso skyline మధ్యగా వెళుతుంటే ఎత్తులో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ నింగినంటుతున్నట్టున్న ఆకాశహర్మ్యాల వంకే చూసుకుంటూ మెల్లగా ఆ వీధుల్లో తిరగడం మొదలుపెట్టాము. వాటన్నీటినీ చూస్తూ అసలు ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ ఎంత గర్వంగా ఫీలవుతుంటారో కదా అనుకున్నాం. "కానీ సిటీలో ఉండాలంటే చాలా ఖర్చు కాబట్టి వీళ్ళందరూ చాలావరకూ పక్కన ఉండే చిన్న ఊర్ల నుంచీ ఉద్యోగానికి రోజూ వచ్చి వెళుతుంటారు. అందుకే రష్ అవర్ ట్రాఫిక్ బాగా ఎక్కువుంటుంది. సాయంత్రం ఆ టైము దాకా ఉండకుండా ఈ లోపే మనం వెళ్ళిపోతే ట్రాఫిక్ ని తప్పించుకోవచ్చు" అని ప్రసాద్ గారు చెప్పారు. కొన్నిచోట్ల రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లా కనిపించిన వాటిని చూస్తూ అసలు ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఖరీదు ఉంటుందో కదా అన్న మాటొచ్చి "ఎక్కువే ఉంటుందేమో కదా.." అన్నారు కాంతి గారు. "మామూలు ఎక్కువ కాదు. ఇక్కడ చిన్న చిన్న ఫ్లాట్స్ ఖరీదే కొన్ని మిలియన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడనుకున్నావ్ అత్తా.. We are in the heart of San Francisco, One of the world's finest cities!" అని చెప్పాడు శ్రేయష్. నాకు ఆ మాట వినగానే "వావ్.. నిజమే కదా.. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాం కదా ఇప్పుడు" అని భలే థ్రిల్లింగా అనిపించింది.

శాన్ ఫ్రాన్సిస్కో స్కై లైన్ మొత్తానికీ అన్నిటికంటే ఎత్తైన sky scrapper బిల్డింగ్ Transamerica Pyramid దగ్గరికి వెళ్ళాము. ఈ పిరమిడ్ బిల్డింగ్ ని దూరం నుంచీ చూపిస్తూ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఇది iconic building అని, ఏ మూలకి వెళ్ళినా కనిపిస్తూనే ఉంటుందని ఇదివరకే కిరణ్ ప్రభ గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ప్రసాద్ గారు మమ్మల్ని సరిగ్గా పిరమిడ్ బిల్డింగ్ ముందుకి తీసుకెళ్ళి నించోబెట్టి ఇదే మాట ఇంకోసారి చెప్పారు. అలా తలెత్తి అంత పెద్ద స్కై స్క్రాపర్ ని చూడటం భలే సరదాగా ఉంది. అది పిరమిడ్ ఆకారంలో ఉండటంతో మరింత ప్రత్యేకంగా కనిపించింది. ఆ బిల్డింగ్ ని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తియ్యడంతో పాటు, మేము దాని ముందు నించున్నప్పుడు బిల్డింగ్ అంతా ఫోటోలో వచ్చేలా చెయ్యడం కోసం నానా రకాల ప్రయోగాలు చేస్తూ చాలా నవ్వుకున్నాం. శ్రేయష్ తన కొత్త HTC ఫోన్లో తీసిన ఫోటోలు చూసి అందరం బోల్డు సరదా పడిపోయాం.
తర్వాత మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ది డే - Lombard street రైడ్ కి వెళ్ళాం. San Francisco అంటేనే ఊరంతా మొత్తం ఎత్తుపల్లాలతో, కొండలు, లోయల్లా ఉంటుంది కదా.. ఈ లోంబార్డ్ స్ట్రీట్ ఒక ఎత్తైన కొండ మీద నుంచీ కిందకి వాలుగా ఉంటుంది. అది స్ట్రెయిట్ గా ఉండకుండా జిగ్ జాగ్ లా wavy గా ఉంటుంది. ఈ వీధికి one of the most crooked street గా ప్రంపంచవ్యాప్తంగా చాలా పేరుంది. నేను ఇదివరకు వీడియోలు చూసినప్పుడు "వామ్మో.. ఆ రోడ్డులో అసలెలా డ్రైవ్ చేస్తారో, చూస్తుంటేనే భయమేస్తుంది" అనుకున్నా. అలాంటిది ఆ వీధిలో ఇప్పుడు మేము వెళ్ళ బోతున్నాం అంటే ఏదో పెద్ద జెయింట్ వీల్ ఎక్కబోతున్నట్టు కొంచెం కంగారుగా, కొంచెం ఎక్సైటింగా అనిపించింది. చిత్రం ఏంటంటే ఈ ఊర్లో అంత ఎత్తైన కొండల్లాంటి వీధుల్లో కూడా రెండు వైపులా ఇళ్ళు ఉండి ఆ ఇళ్ళ ముందు అలా వాలుగా నిలబెట్టిన కార్లున్నాయి. వాటిని చూస్తుంటేనే జారి కిందకి పడిపోతాయేమో అనిపిస్తుంది. అసలా కార్లు నడిపేవాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. రోజూ టెన్షన్ పడకుండా స్థిమితంగా ఎలా పార్క్ చేసుకుంటారో ఏంటో అనిపించింది.

లోంబార్డ్ స్ట్రీట్ పైన మా కారు నించున్నప్పుడే కింద కనిపిస్తున్న wavy రోడ్ చూస్తూనే చాలా ఎక్సైట్ అయిపోయాము అందరమూ. ఈ లోపు ప్రసాద్ గారు ముందు సీట్లో కూర్చున్న నాతో "కారు పైనున్న sunroof ఓపెన్ చేస్తాను. మీరు సీట్లో లేచి నిలబడి అప్పుడు ముందున్న వీధిని చూడండి. ఇంకా ఎక్సైటింగా ఉంటుంది" అన్నారు. "అమ్మో.. నాకు భయమేస్తుంది" అంటే "మొన్ననే గొల్లపూడి గారొచ్చినప్పుడు ఈ స్ట్రీట్ అలాగే చూపించాను. ఆయన "నా జీవితంలో నన్ను ఎవరూ ఇలా తిప్పలేదయ్యా.. అద్భుతంగా ఉంది ఈ అనుభవం" అన్నారు. అంత పెద్దాయన చేయగా లేనిది మీకేం భయం.. మళ్ళీ మళ్ళీ మా Jaguar కార్లో ఇలాంటి ఎక్సైటింగ్ ఛాన్స్ దొరకదు మీకు. ట్రస్ట్ మీ.. ఇట్ విల్ బీ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్.. కమాన్.. గెటప్.." అని చాలా ఎంకరేజ్ చేసారు ప్రసాద్ గారు. నాకింకా మొహమాటంగానే అనిపించి వెనక్కి తిరిగి నిషి వైపు, కాంతి గారి వైపు చూస్తే "పర్లేదు ఎక్కేసేయ్.. భయమేస్తే దిగిపోవచ్చులే" అని ఇంకాస్త గట్టిగా ముందుకి తోసారు. సరేనని కాస్త భయపడుతూనే ముందు సీట్లో సన్ రూఫ్ లోంచి లేచి నిలబడ్డాను. మొదట ఒక నిమిషం కాస్త వణుకొచ్చి చేతులు రెండూ కార్ రూఫ్ మీద ఆన్చి నించున్నా. అలా నిలబడి కిందకి చూస్తుంటే వంకలు తిరిగి వయ్యారంగా ఉన్న crooked స్ట్రీట్, వీధంతా కలర్ ఫుల్ గా విరగబూసిన హైడ్రాంజియా పూల పొదలు, వీధి కింద వైపు పల్లంలో బొమ్మలు పేర్చినట్టు కనిపిస్తున్న ఇళ్ళు, వాటి వెనక దూరంగా సముద్రం, అలా కారు కిందకి మలుపులు తిరుగుతూ వెళ్తుంటే అంత మండే ఎండలోనూ హాయిగా మొహానికి ఎదురు వీస్తున్న చల్లటి సముద్రపు గాలి... ఆహా.. నిజంగా అద్భుతం అనిపించే అనుభవం! ఈ మాత్రం ధైర్యం చెయ్యకపోయి ఉంటే ఎంత గొప్ప అనుభూతి కోల్పోయేదాన్ని కదా అనుకున్నా. కిందకి దిగాక "చాలా అంటే చాలా బాగుందండీ అలా కార్లో నించోడం, చాలా థాంక్స్ ప్రసాద్ గారూ.. మీరు గట్టిగా అనకపోతే ఈ థ్రిల్ మిస్సయ్యేదాన్ని" అని చెప్పాను. "నిషీ.. వానా డూ ఇట్?" అని అడిగారు ప్రసాద్ గారు. "కమాన్ నిషీ.." అని అందరం తనని చీర్ చేస్తూ ముందుకి నెట్టాం. మళ్ళీ ఇంకోసారి లోంబార్డ్ స్ట్రీట్ రైడ్ ఎంజాయ్ చేసాము. ఆ వీధి నిండా ఉన్న టూరిస్టులందరూ మమ్మల్ని చూసి చాలా థ్రిల్ ఫీలయ్యి "ఆర్యూ మిస్ వరల్డ్?" అని సరదాగా అడుగుతూ చప్పట్లు కొట్టి అభినందించడమే కాకుండా మా కారుని బోల్డు ఫోటోలు కూడా తీసుకున్నారు. "అక్కా.. మీ ఫ్రెండ్స్ లాగే నువ్వు కూడా సరదాగా ఎక్కరాదూ.." అని కాంతి గారికి లేని ధైర్యాన్ని నూరిపోసారు ప్రసాద్ గారు. నేను, నిషి, శ్రేయష్ కూడా కాంతి గారిని బలవంతపెట్టి ముందుకి తోసాం. ఆ రోజు వీకెండ్ కాకపోవడం వల్ల ఎప్పుడూ ఉండేన్ని కార్లు లేకుండా కాస్త రద్దీ తక్కువగా ఉంది. అందుకని మొత్తానికి క్రూక్డ్ స్ట్రీట్ లో ముచ్చటగా మూడుసార్లు పైకీ కిందకీ తిరిగి చాలా సరదా పడ్డాం. మమ్మల్ని అంత ఓపిగ్గా తిప్పినందుకు ప్రసాద్ గారికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అసలు.. కేవలం మేము కలిసి వెళ్ళామన్న ఒక్క కారణంగా కాకుండా అప్పుడు కలిగిన థ్రిల్ మూలాన ఈ స్ట్రీట్లో రైడ్ మాత్రం మా ముగ్గురికీ జీవితాంతం ప్రత్యేకంగా గుర్తుండిపోయే జ్ఞాపకం అయిపోతుందనడంలో అస్సలే మాత్రం సందేహం లేదు. అంత బాగా ఎంజాయ్ చేసాము. :-)

అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో అలా అలా తిరుగుతూ Ghirardelli Square వైపు వెళ్ళాం. దారిలో రోడ్ల మీద శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఐకాన్ లా చెప్పుకునే cable cars కనిపించాయి. ఈ కేబుల్ కార్స్ పంతొమ్మిదో శతాబ్దం నుంచీ నడుస్తున్నాయట. వాటి వెనక అంత చరిత్ర ఉంది కాబట్టే ఇక్కడ అవి చాలా స్పెషల్ అన్నమాట. చూడ్డానికి కొంచెం ట్రాముల్లా ఉండి రోడ్డు మీదున్న ట్రాక్స్ మీద నడుస్తుంటాయి. మేము Ghirardelli Square వైపు వెళుతుంటే దూరంగా బే మధ్యలో Alcatraz island కనిపించింది. శాన్ ఫ్రాన్సిస్కో లోకల్ చాకొలెట్ కంపెనీ Ghirardelli ఉన్న ప్లేస్ అన్నమాట అది. మేము చాకొలేట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూడలేదు కానీ అక్కడే పక్కనున్న ఒక ఆర్ట్ మ్యూజియంకి తీసుకెళ్ళారు ప్రసాద్ గారు. మాకెవ్వరికీ చిత్రకళ గురించి పెద్ద పరిజ్ఞానం లేకపోయినప్పటికీ అక్కడున్న పెయింటింగ్స్ చూసి అద్భుతం అనిపించింది. మ్యూజియం నుంచి బయటికొచ్చాక ఎదురుగా చిన్న బీచ్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి చూస్తే దూరంగా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కనిపించింది. ఆ బీచ్ ఒడ్డున పెద్ద పెద్ద ఫెర్రీలు ఉన్నాయి. నీళ్ళ మధ్యలో అల్కాట్రాజ్ కనిపిస్తోంది. అల్కాట్రాజ్ కి తీసుకెళ్ళే ఫెర్రీలు అక్కడి నుంచే ఉంటాయని శ్రేయష్ చెప్పాడు. అక్కడ తిరుగుతున్నప్పుడు నిషికి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఏదో ముఖ్యమైన ఇష్యూ వచ్చిందని. తను చాలాసేపు అలా కాల్ మాట్లాడుతూనే ఉంటే నేను "అయినా పర్లేదులే ఈ లోపు మనం కొన్ని ఫొటోస్ క్లిక్ చేద్దాం" అని చెప్పి మేము కూడా తన పక్కనే తిరుగుతూ ఫోటోలు దిగాం.
తర్వాత మళ్ళీ నిన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూసిన విస్టా పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళారు ప్రసాద్ గారు. "ఈ రోజు మబ్బులు, పొగమంచు లేకుండా చాలా క్లియర్ స్కై ఉంది. "చూసేవాళ్ళు చాలా లక్కీ అయితే తప్ప ఇలా జరగదు" అని ప్రసాద్ గారు అనగానే నాకూ, కాంతి గారికీ చాలా నవ్వొచ్చింది. "అవునండీ.. మేము చాలా లక్కీ.. అందుకే నిన్న కూడా ఇలానే ఉంది" అని చెప్తే ఆయన కూడా నవ్వారు. నిషి తో కలిసి కాసేపు అక్కడ తిరిగి ఫోటోలు దిగుదాం అనుకున్నాం. అప్పుడే మళ్ళీ తనకి ఆఫీస్ కాల్ వచ్చింది. అయినా సరే అలాగే ఫోటోలు క్లిక్ చేసేశాం. తర్వాత ఆ ఫొటోలన్నీ చూస్తుంటే ఎంత ఫన్నీగా ఉందో.. ఎవరన్నా సెలబ్రిటీలు వచ్చి వాళ్ళ పనిలో వాళ్ళుంటే ఫ్యాన్స్ మాత్రం అదేం పట్టించుకోకుండా వాళ్ళ వెనకే తిరుగుతూ ఎలా పడితే అలా పిచ్చి పట్టినట్టు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కదా.. అచ్చం అలానే చేశాం మేము కూడా. ఇంటికొచ్చాక ఆ ఫొటోస్ చూసి నిషి "అయ్యో.. సారీ రా.. మీతో సరిగ్గా లేను కదా అప్పుడు నేను.." అని నొచ్చుకుంటే నేను "ఏం పర్లేదులే.. నీ పనిలో నువ్వున్నాసరే మేమేం నిన్ను మిస్సవ్వలేదు. భుజాల మీద చేతులేసి మరీ ఎలా దిగామో చూడు ఫోటోలు" అని చెప్పేసరికి అందరం చాలా నవ్వుకున్నాం.
అప్పటికే మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది. అందరికీ ఆకలేస్తోంది. ఆ రోజు గురువారం కాబట్టి నిషి ఏమీ తినట్లేదని ఉదయం నుంచీ కాంతి గారికి చాలా దిగులుగా ఉంది. అప్పటికీ ఇంటి నుంచి జ్యూస్లు తెచ్చాం గానీ ఈ ఎండలో తిరుగుడుకి నీరసపడిపోతుందేమో అని కాంతి గారి భయం. నిషి ఏమో "ఎప్పుడూ అలవాటేనండీ.. మీరేం వర్రీ అవ్వకండి" అని సర్ది చెప్తూ ఉంది. ఉదయం నుంచీ గంటకోసారి ఈ పరామర్శల పర్వం నడుస్తూ ఉంది. దారిలో సబ్ వే దగ్గర ఆగి అందరం లంచ్ చేస్తే నిషి మాత్రం పక్కనున్న స్టార్ బక్స్ నుంచి frappuccino తెచ్చుకుంది. అక్కడి నుంచి ప్రసాద్ గారు Muir Beach Overlook దగ్గరికి తీసుకెళ్ళారు. అది Golden Gate National Recreation Area లో ఉంది. అక్కడికి వెళ్ళే దారంతా కొండల అంచున ఘాట్ రోడ్డులా ఉంది. దారిలో sunset way అని పేరున్న సైన్ బోర్డు కనిపించింది. మేము వెళ్ళబోయే చోట సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుందని ప్రసాద్ గారు చెప్పారు. అలా అలా అందరం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. ఒక పెద్ద కొండ అంచు మీదకి తీసుకెళ్ళి కార్ ఆపాక అందరం కార్ దిగి ఎదురుగా చూస్తే పైన ఆకాశం, కింద పసిఫిక్ మహా సముద్రం రెండూ ఎండలో నీలం రంగులో మెరిసిపోతూ కనిపించాయి. ఆకాశం, సముద్రం, చుట్టూ కొండలు తప్ప ఇంకేం లేవు అక్కడ. కొండ మీద నుంచి ఒక సన్నటి మట్టి దారి ఉంది. దాని చివరికంటా నడుచుకు వెళ్ళి ఆ అంచున నించుంటే ఇంక కళ్ళ ముందంతా సముద్రమే!



అక్కడ విపరీతమైన గాలి వీస్తోంది. పైనుంచి మండే ఎండలో ఆ చల్లటి గాలి చాలా హాయిగా అనిపించింది కానీ మరీ మనుషుల్ని కూడా ఎగరేసుకెళుతుందేమో అన్నంత ఈదురు గాలి కాబట్టి అందరూ మరీ ఎక్కువసేపు ఉండలేకపోయారు. ఓ పక్క నుంచి చెవులు నొప్పి, తల నొప్పి వస్తున్నాసరే నాకు మాత్రం ఆ సముద్రం ముందు నుంచి అస్సలు కదలబుద్ధెయ్యడం లేదు ఎక్కడికెళ్ళినా. అలా నించుని హోరుమనే అలల శబ్ధం వింటూ అంత అందమైన సముద్రాన్ని చూస్తుంటే ఆ ఆకర్షణ ఎంత బలంగా ఉందంటే ఆ సముద్రంలో దూకేస్తే బాగుండు అనిపించేసింది. :-) "కదా.. నాక్కూడా అచ్చం అలానే అనిపిస్తుంది.. భలే ఉంది కదా ఇంత ఎత్తు నించీ సముద్రాన్ని చూడటం " అని నిషి, నేనూ ఇద్దరం అనుకుంటూ ఉంటే ప్రసాద్ గారొచ్చి " ఒక ఐదు నిమిషాలు ఉండండి. మేము వెళ్ళిపోయాక దూకేద్దురు గానీ.. మేము న్యూస్లో చూసి ఓహో ఎవరో ఇండియన్ అమ్మాయిలు సముద్రంలో దూకేసారంట. మాకస్సలు తెలీదు వాళ్ళెవరో.. అనుకుంటాం" అని ఆట పట్టించారు. "ఇంత ఎత్తు నుంచీ చూడ్డానికి అందంగానే ఉంటుంది గానీ ఇక్కడ బ్లూ వేల్స్ ఉంటాయి తెలుసా.." అని చెప్పేసరికి అమ్మో అనిపించి కొంచెం భయమేసింది మాకు. అక్కడ ఆ ప్లేస్ ని గురించి వివరాలు కొన్ని రాసి ఉన్నాయి. రెండో ప్రపంచం యుద్ధం సమయంలో జపాన్ 'పెర్ల్ హార్బర్ ఎటాక్' జరిపిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలిస్ సముద్ర తీరాలకి ముప్పుందని చాలా భయపడ్డారట. అప్పుడు ఇక్కడి సముద్ర తీరానికి మిలటరీ ట్రూప్స్ వచ్చి హై అలర్ట్ లో ఉందట. ఇంకా ఆ చుట్టు పక్క కొండల మీద Flora, Fauna ప్రత్యేకతల గురించి కూడా చాలా విషయాలు రాసున్నాయి. అప్పటికే టైము మేము అనుకున్నదానికన్నా ఆలస్యం అయిపోయేసరికి Muir woods కి వెళ్ళే టైము లేదని ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం.
మేము మ్యూర్ బీచ్ ఓవర్ లుక్ నుంచి వెనక్కి శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోకి వచ్చేసరికి సాయంత్రం నాలుగు దాటిపోయి ట్రాఫిక్ బాగా ఉంది. ట్రాఫిక్లో గంటన్నరకి పైగా ఇరుక్కుపోయి ఇల్లు చేరేసరికి సాయంకాలం ఆరున్నర అయిపోయింది. మా ముగ్గుర్నీ ఇంటి దగ్గర దింపేసాక ఇంత ఎక్సైటింగ్ ట్రిప్ కి తీసుకెళ్ళినందుకు ప్రసాద్ గారికి థాంక్స్ చెప్పి శ్రేయష్ కి టాటా చెప్పాం. మేము ఇంట్లోకి వచ్చేసరికి కిరణ్ ప్రభ గారు ఆఫీస్ నుంచి వచ్చి మాకోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇంట్లోకి వస్తుండగానే "రోజెలా గడిచింది తల్లీ.. బాగా ఎంజాయ్ చేసారా?" అని అడిగారు. "ఊ.. ట్రిప్ బావుంది గానీ మీరు లేని లోటు బాగా తెలిసింది. చాలా మిస్సయిపోయాము మిమ్మల్ని" అని నేను చెప్తుంటే కాంతి గారు అప్పుడే ఇంట్లోకి వస్తూ "ఈ పిల్ల మధ్యాహ్నం నుంచి అస్సలేం మాట్లాడకుండా చాలా సైలెంట్ అయిపోయింది. నేనింకా ఒంట్లో బాలేదేమో అని భయపడి రెండు మూడు సార్లు అడిగితే అదేం లేదు బానే ఉన్నానంది. అప్పుడు అర్థమైంది ఈ రోజు ట్రిప్ కి మీరు తీసుకెళ్ళలేదు కదా అందుకే మొహం చిన్నబోయిందని.." అంటూ నవ్వారు. "మనకి రేపు లాంగ్ డ్రైవ్ ఉంది కదమ్మా.. ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాంలే" అన్నారు కిరణ్ ప్రభ గారు. ఇంట్లోకి వచ్చీ రాగానే కాంతి గారికి మళ్ళీ నిషి ఉపవాసం సంగతి గుర్తొచ్చేసి వెంటనే సూప్ తయారు చేసే పనిలో పడ్డారు. మీరు ఫ్రెష్ అయిపోయి వేడి వేడిగా టొమాటో సూప్ తాగేసాక facetime లో గొల్లపూడి గారితో మాట్లాడదాం అన్నారు కిరణ్ ప్రభ గారు.
గొల్లపూడి గారికి కాల్ చెయ్యబోతుంటే ఆగండాగండి ఒక్క నిముషం అని ఆపి "అంత పెద్దవాళ్ళతో, గొప్పవాళ్ళతో ఏం మాట్లాడగలం అసలు. నాకేం మాటలు తోచవు. ఏమన్నా చెప్పండి" అన్నాను నేను. నిషి ఏమో "ముందు మాములుగా ఎలా ఉన్నారండీ అని పలకరించి, మొన్న మీరుండగా వస్తే మిమ్మల్ని కలిసి ఉండేవాళ్ళమండీ.." అని చెపుదాము అంది. "మీరు కనిపించి పలకరిస్తే ఆయనే మీకు బోల్డు కబుర్లు చెప్తారు. మీలాంటి చిన్నపిల్లలతో కూడా ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. కంగారు పడకండి" అని కాల్ చేసారు కిరణ్ ప్రభ గారు. కాల్ ఆన్సర్ చెయ్యగానే స్క్రీన్ మీద నిండుగా నవ్వుతూ గొల్లపూడి గారు, వారి శ్రీమతి శివాని గారు హలో చెప్పారు. "అయ్యా.. మీరు మాట్లాడక మూడు రోజులైపోయిందని బెంగ పెట్టుకున్నానయ్యా.." అన్నారు కిరణ్ ప్రభ గారితో. మమ్మల్ని చూస్తూనే "ఇద్దరిలో మధుర ఎవరు, నిషి ఎవరు, ఎవరెవరు ఏ దేశాల నుంచి వచ్చారు" అని అడిగితే మేమిద్దరం మా వివరాలు చెప్పాము. జర్మనీ అనగానే "మేము దాదాపు పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను జర్మనీ వచ్చామమ్మా.." అన్నారు శివాని గారు. "జర్మనీ అనగానే నాకు Cologne, Bonn నగరాలు గుర్తొస్తాయి. Beethoven లాంటి గొప్ప సంగీతకారుడు పుట్టిన చోటు, అదే ఊరిలో పార్కులో బీతోవెన్ బొమ్మ దగ్గర అతని మ్యూజిక్ ని ఒక పియానో మీద వాయిస్తూ ధర్మం యాచిస్తున్న ఒక వ్యక్తిని చూసిన జ్ఞాపకం ఎప్పుడూ మెదులుతూ ఉంటుందమ్మా.." అన్నారు గొల్లపూడి గారు. Beethoven మ్యూజిక్ లో ఏవేవో పేర్లు చెప్పి వాటి గురించి వివరించి చెప్తూ అలా అలా చరిత్రలోకి వెళ్ళిపోయి బోల్డు సంగతులు చెప్పారు. కాసేపు వాళ్ళిద్దరితో మాట్లాడి వారి దగ్గర సెలవు తీసుకున్నాం. ఆయనకున్న అపారమైన జ్ఞానసంపదకీ, ఈ వయసులో కూడా అన్నీటినీ అలా చకచకా గుర్తు చేసుకుంటున్న ఆయన జ్ఞాపకశక్తికీ చాలా ఆశ్చర్యం, అద్భుతం అనిపించింది.  మేము ఆ మాటే అంటే "ఆయనకి ఒక్క సినిమాలు, సాహిత్యమే కాదు. రేడియో, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు ఇంకా బోల్డు విషయాల మీద గట్టి పట్టుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి. బీతోవెన్ మ్యూజిక్ గురించి ఎంత అలవోకగా చెప్పేసారో చూసారా.. ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఏదొక కొత్త విషయం తెలుస్తుంది మనకి.." అని చెప్పారు కిరణ్ ప్రభ గారు. "అందుకే కదా మరి అలాంటివాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యేది.." అనుకున్నాం నేనూ, నిషి.
ఏడున్నరకి బయలుదేరి హడావుడిగా Livermore Premium Outlets కి షాపింగుకి వెళ్ళాం. వెళ్ళే దారిలో CVS ఫార్మసీలో నా గొంతు నొప్పికి సిరప్ కొనుక్కుని, మాల్ దగ్గర మమ్మల్ని ముగ్గుర్నీ దించాక షాపింగు పని చూసుకురమ్మని కిరణ్ ప్రభ గారు కార్లో లాప్టాప్ లో కౌముది పని చూసుకుంటానన్నారు. నిషి రాకముందు మేమిద్దరం షాపింగుకి వెళ్ళినప్పుడే తను చెప్పింది మళ్ళీ మన ముగ్గురం వెళదామని. అక్కడికి వెళ్ళాక కాంతి గారు "అమ్మాయిలూ.. మీ ఇద్దరూ మంచి డ్రస్సు సెలెక్ట్ చేసుకోండి. తీసుకుందాం. నిషి ఊరెళ్ళే లోపు టైము ఎక్కువ లేదు కాబట్టి ముఖ్యంగా ముందు నిషికి తీసుకోవాలి" అన్నారు. సహజంగానే "అబ్బా ఇప్పుడెందుకులెండి అవన్నీ .." అని మేము గారాలు పోతుంటే "ఇంకా నయంలే.. ఆడపిల్లలు ఇంటికొస్తే ఉట్టిచేతులతో తిరిగి వెళ్ళకూడదు" అని మమ్మల్ని గట్టిగా ముందుకి తోసారు కాంతి గారు. అలా అలా తిరుగుతూ ఏవో చిన్నచిన్న వస్తువులు కొన్నాం గానీ డ్రస్లు మాత్రం ఏమీ నచ్చట్లేదు. మాకేమో టైము కూడా పెద్దగా లేదు. అసలు అర్జెంటుగా కావాల్సింది నిషి కోసం అని చూస్తూ ఉంటే అనుకోకుండా రెండు షాపుల్లో "ఈ డ్రస్ చూడు ఎంత బాగుందో.. ఊరికే ట్రై చేసి చూపించు నువ్వు.." అని ఇద్దరూ కలిసి నన్ను ముందుకి నెట్టి "అబ్బా.. ఎంత బాగుందో.. కొనేద్దాం కొనేద్దాం.." అని ఇద్దరూ కలిసి నాకే కొనేసారు. అప్పటికే రాత్రి తొమ్మిదిన్నర అయిపోయిందని బయటికొచ్చేసాం. కార్ దగ్గరికి రాగానే కిరణ్ ప్రభ గారు షాపింగ్ పని అయిపోయిందా అంటే "ఏంటీ అయ్యేది.. ఇద్దరూ కలిసి అసలు వచ్చిన పని మానేసి నాకు కొన్నారు" అని వాళ్ళిద్దరి మీదా కంప్లెయింట్ చేస్తూ చెప్పాను. సరే మళ్ళీ ఇంకో రోజు వద్దాంలే అనుకుంటూ ఇంటికొచ్చేసాం. డిన్నర్ తినేసాక మేము ఊరి నుంచి వచ్చేప్పుడు ఒకరి కోసం ఒకరు తెచ్చిన బుల్లి బుల్లి గిఫ్ట్స్ అన్నీ ముందేసుకు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే కిరణ్ ప్రభ గారు "రేపు ఉదయం మనం ఆరింటికల్లా బయలుదేరితే బాగుంటుంది. నేను నాలుగున్నరకి లేపుతాను మిమ్మల్ని" అని గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి పడుకున్నారు. ఇంకాసేపయ్యాక మాకూ ఇంక తప్పక అయిష్టంగానే వెళ్ళి నిద్రపోయాం రేపటి రోజంతా మనదే కదా అని ఆనందంగా తలచుకుంటూ.. :-)


12 comments:

Anonymous said...

Muir woods kuda chudalsindi....waiting for next part...

Krishna

ఫోటాన్ said...

ఎలా గుర్తుంచుకుంటారో ఏమో, భలే అందంగా రాస్తారు మీరు, ప్రతి చిన్న ఫీల్ ని కుడా అందంగా రాస్తారు,
టీ తీసుకొని చదవడం మొదలుపెడితే అసలు ఆ రాసిన ప్రాంతాల్లో నేనే వున్నానేమో అన్నంతగా ఫీల్ ఇస్తాయి మీ అక్షరాలు, పదాలు :)
కీప్ రాకింగ్ అమ్మాయ్ :))

నిషిగంధ said...

చూసినవే అయినా ఫోటోలన్నీ భలే బావున్నాయి, మధురా!!

ఆ ఆర్ట్ గ్యాలరీలో మనం ఏం చూడాలో ఎలా చూడాలో తికమక పడుతుంటే ప్రసాద్ గారు, వాళ్ళ దగ్గరకెళ్ళీ 'they just bought a new house and would like to get some art pieces. Can you please show them a couple of pieces" అని ఆ స్పెషల్ లైటింగ్ రూమ్‌లో మనల్ని కూర్చోబెట్టి రెండు, మూడు పెయింటింగ్స్ డిస్ప్లే చేయించారు కదా! భలే అనిపించింది, ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా ఒక ఆర్టేనని! :-)

లంబార్డ్ స్ట్రీట్ డ్రైవ్ మాత్రం సూపర్ థ్రిల్లింగ్ అసలు.. జనాలందరూ పూలనీ, రోడ్డునీ వదిలేసి మనల్ని ఫోటోలు తీసుకోవడం! :))

ఇక గొల్లపూడి గారితో మాట్లాడటం అయితే అసలు మర్చిపోలేను.. ఆయన ఎన్నివిషయాలు ఎంత అలవోకగా చెప్పేస్తున్నారో! ఆ జ్ఞాపకశక్తికి చాలా ఆశ్చర్యం వేస్తుందసలు!

ప్చ్, ఏమైపోయాయ్ ఆ హేపీ హేపీ క్షణాలన్నీ! :(

Anonymous said...

Nijam cheppandi. Meeku Germany baga nacchinda leka US aa. Rendu undavu. Modati sthanam okkadanike :)

ఇందు said...

Baagundi madhu :) I missed Lombard street. ; (

బాల said...

చాలా బాగా enjoy చేశారన్నమాట!!!!!!! 

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది మధురా.. లాంబార్డ్ స్ట్రీట్ డ్రైవ్ లో నీ ఎక్సైట్మెంట్ అంతా కళ్ళకి కట్టినట్లు రాశావ్.

"ఆకాశం, సముద్రం, చుట్టూ కొండలు తప్ప ఇంకేం లేవు అక్కడ. కొండ మీద నుంచి ఒక సన్నటి మట్టి దారి ఉంది.దాని చివరికంటా నడుచుకు వెళ్ళి ఆ అంచున నించుంటే ఇంక కళ్ళ ముందంతా సముద్రమే!"
నిజంగా మీఇద్దరెంత లక్కీనో.. ఇలాంటి వ్యూపాయింట్ కోసం నేను వెయిటింగ్, మామూలు బీచ్ లోనే కొంచెం లోపలికి వెళ్ళి నేనూ ఆకాశం సముద్రం తప్ప చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోడానికి ప్రయత్నిస్తుంటాను నేను. అలాంటిచోట్లే నాకు సముద్రంతో విడదీయ లేనంతగా కలిసిపోవాలనిపిస్తుంటుంది. నువ్ పెట్టిన ఫోటోలు చూస్తుంటే నాకు కూడా ఖచ్చితంగా వెళ్ళిరావాలనిపిస్తుంది.

గొల్లపూడి గారి గురించి వినడం బాగుంది. అలాంటి మహానుభావులతో పరిచయం కావాలంటే ఏ పూర్వజన్మలోనో అదృష్టం చేసుకుని ఉంటే తప్ప కుదరదేమో.

మధురవాణి said...

​@ కృష్ణ,
అవునండీ.. మ్యూర్ వుడ్స్ చూస్తే బావుండేది కానీ ఈసారికి కుదరలేదు. :(

@ ఫోటాన్,
హహ్హహ్హా.. ఇందులో కష్టపడి గుర్తుంచుకునేవి ఏమున్నాయిలే.. ఫిజిక్స్ లెసన్స్ లాంటివయితే గానీ అలాంటి తిప్పలుండవు నాకు.. :-))
నాతో పాటు తిరిగేస్తున్నందుకు థాంక్స్.. :D

@ నిషిగంధ,
బాబోయ్ ఆ ఆర్ట్ గేలరీ ఎక్స్పీరియన్స్ కెవ్వు అసలు.. నాకైతే ఆ మ్యూజియం అమ్మాయి "చెప్పండి మేడం.. మీరేం పెయింటింగ్ కొనాలనుకుంటున్నారు" అని అడుగుతుందో ఏంటోనని కంగారు కూడా వచ్చింది. ​:-​)) నిజంగానే అలా ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీడం ఒక పెద్ద ఆర్ట్!​

ఆ ​హేపీ హేపీ క్షణాలన్నీ మనతోనే కదా ఉన్నాయి. పిలిచినప్పుడల్లా వచ్చి మన కళ్ళ ముందు నించుంటాయి. :-)​

మధురవాణి said...

@ ​Anonymous,
హహ్హహ్హా.. భలే ప్రశ్న అడిగారండీ.. పుట్టిల్లంటే ఎక్కువిష్టమా, అత్తారిల్లంటే ఎక్కువిష్టమా అని అడిగినట్టు ఇరుకున పెట్టేసారు. ;-) రెండూ చాలా ఇష్టమేనండీ.. దేని గురించి మాట్లాడినా అంతే ప్రేమగా మాట్లాడతాను అనుకుంటున్నా మరి.. ఎందుకంటే జర్మనీలో నేనున్నాను, అమెరికాలోనేమో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి.. :-))

@ ఇందు,
థాంక్స్ డియర్.. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళు. I'm sure you'll like it! :-)

@ ​​బాల,
అవునండీ.. చాలా! :-)

@ ​​వేణూ శ్రీకాంత్,
నిజంగా అక్కడి నుంచి చూడటం అద్భుతం వేణూ.. మేము పగటి పూట అలా వెళ్ళి ఇలా వచ్చేసాం గానీ నిజంగా అక్కడ సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తోంది నాకైతే!​

​థాంక్యూ సో మచ్.. డైరీలో ప్రతీ పేజీని ఆసక్తిగా చదువుతున్నందుకు.. :-)​

Santosh Reddy said...


మధుర,
చాలా రోజులకి మీ బ్లాగు సందర్శనం.....
శాన్ ఫ్రాన్సిస్కో అధ్బుత వర్ణనం.....
మళ్లి ఆ నగర అందాలను గుర్తుచేసిన మీ మధుర వ్యాఖ్యానం .....
తెలుగు నూతన కథ రచన ఒరవడిలో ఓ కొత్త సోపానం........
మీ కథా వర్ణనా శైలికి దాసోహం......చివరిగా మీకు ధన్యవాదం........!!!

రాధిక(నాని ) said...

చాలా చాలా చాలా బాగా రాసారు .ఏమి చెప్పను చాలా థాంక్స్ చెపుతున్నా మీ డైరీని మాతో పంచుకుని చక్కగా వర్ణిస్తూ ,వివరిస్తూ చుపిస్తున్నందుకు .బోల్డన్ని థాంకులు:)) .....

మధురవాణి said...

​@ SantoshReddy,
హహ్హహా.. భలే చెప్పారే.. మీ అభిమానానికి ధన్యవాదాలండీ.. :)

@ రాధిక(నాని),
​నేను రాస్తున్నదాన్ని మీరు ప్రతీది అంత ఇష్టంగా చదివి ఆనందిస్తున్నారంటే నాక్కూడా బోల్డు సంతోషంగా అనిపిస్తుందండీ.. మీ ఆత్మీయ స్పందనకి బోల్డు ధన్యవాదాలు.