Thursday, August 15, 2013

My San Francisco Diary - 12



'సృష్టిలో తీయనైనది స్నేహమేనోయీ..' అని మనందరం ఎప్పుడో అప్పుడు అనుకోకుండా ఉండము కదా.. ఎందుకంటే స్నేహితులు లేని జీవితాన్ని ఊహించడం కష్టం. ఎవరి జీవితపు పరుగు పందెం వారిదే అయినా ఆ పరుగులో మన పక్కన నిలిచి అలసట తెలీకుండా మన ప్రయాణం ఆహ్లాదంగా సాగేట్టు చేసేది నేస్తాలే కదా మరి! మన జీవితపు పూదోటలో ఎన్నెన్నో రకాల స్నేహసుమాలు.. ఒక్కొక్కరూ ఒక్కో సుగంధాన్ని పంచుతూ మనకి సంతోషాన్ని పంచుతారు. మనం బోల్డు అదృష్టవంతులమైతే మన సంతోషాలు, సరదాలు పంచుకునే స్నేహితులందరితో పాటు ఒక Angel Friend కూడా దొరికేస్తారు. ​అంటే ఎలాగంటే.. లోకానికి కనిపించని మన కంటిపాప వెనకున్న చీకటిని చూడగలిగి, ప్రపంచానికి వినిపించని మన కన్నీటి సవ్వడిని వినగలిగిన మనసెరిగిన స్నేహం, సంతోషంగా కేరింతల్లో ఉన్నప్పుడు మనవైపు అస్సలు చూడకుండా మన మొహంలో నవ్వు మాయమయ్యే క్షణం కన్నా ఓ క్షణం ముందే వచ్చి తోడుగా మన పక్కనే నించునే స్నేహం, 'నేనింక ఎగరలేనేమో' అని నిరాశపడి నిలిచిపోయిన క్షణాల్లో బలవంతంగా రెక్కపుచ్చుకు లాక్కెళ్ళి మళ్ళీ ఎగరడం నేర్పించి కన్నీళ్ళ సంద్రం నుంచి తప్పించి సంతోష తీరాలకి దారిని చూపించే స్నేహం, అస్సలు తీరిక లేని పనుల్లో తలమునకలుగా ఉన్నప్పుడు పిలిచినా, అర్ధరాత్రి నిద్ర లేపి పిలిచినా సరే అరక్షణమైనా ఆలస్యం చెయ్యక పలికే స్నేహం, నేను పెంచుకుంటున్న మొక్క చచ్చిపోయింది అన్నంత చిన్న విషయానికైనా, ల్యాబ్లో సంవత్సరం పాటుగా చేస్తున్న ఒక పెద్ద ఎక్స్పరిమెంట్ లో ఆశించిన ఫలితం రాలేదు అన్నంత పెద్ద బాధ గురించి చెప్పినా ఒకేలా విని మనలో దిగులు పోగొట్టి స్ఫూర్తిని నింపే స్నేహం.. అదుగో అలాంటి స్నేహమన్నమాట. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో ధైర్యంగా ఉండేవారికైనా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. వసంతమూ, వానే కాకుండా అడపా దడపా పిడుగులు, వరదలు, శిశిరాలు పలకరించిపోతుంటాయి. ​అవన్నీ ​మన పక్కనుండి ఓపిగ్గా దాటించి మళ్ళీ మనల్ని నవ్వుల లోకంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునే స్నేహితులు ఒకరు ఉండాలిగా మరి.. ​ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హింస అందరికన్నా కొంచెం ఎక్కువ భరించే నేస్తం అన్నమాట.. అదే మాటని తియ్యగా వినిపించేట్టు మార్చి చెప్పాలంటే THE Best Friend అని చెప్పొచ్చు. ;-)


ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు గుర్తు చేసుకుంటున్నానంటే నాకు ఇలాంటి స్నేహితుడు ఒకరున్నారు. అసలు తన పేరే మంచు కాబట్టి ఇంక తనెంత మంచోరో అంటూ నేను ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మా మంచబ్బాయ్ గారు అమెరికాలోనే సిలికాన్ వ్యాలీలో ఉంటారన్నమాట. నేను అమెరికా ప్రయాణం పెట్టుకున్నాక "క్యాబిన్ లగేజ్లో ఏయే వస్తువులు పెట్టకూడదు" అన్న విషయం దగ్గర్నుంచీ విమానం ఎక్కే ముందు "నా ఫోన్ నంబర్ ఫోన్లో ఉన్నా సరే విడిగా కూడా రాసి దగ్గర పెట్టుకో.. ఎక్కడ దేనికి అవసరమైనా వెంటనే నాకు కాల్ చెయ్యి" అని చెప్పేదాకా బోల్డు బోల్డు సలహాలు, సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. అవన్నీ విని నేను "ఎంత మీ అమెరికా గొప్పైతే మాత్రం మొదటిసారి వస్తున్నాం కదాని అడుగు పెట్టీ పెట్టగానే మమ్మల్ని ఇంతలా కంగారు పెట్టేస్తారంటారా" అని ఎదురాడితే "అంత సీరియస్ గా ఏమీ ఉండదులే కానీ ఇవన్నీ జస్ట్ జాగ్రత్త కోసమని.. అంతే" అన్నారు. ముందే ఇలా ఉంటే ఇంక నేను అమెరికా వచ్చాక రోజూ మేము ఎక్కడికి వెళ్తున్నామో కనుక్కుని ఏయే ప్లేసెస్ కి వెళ్తే ఏమేం చూడాలి, ఎక్కడ ఏది ఎక్కువ బాగుంటుంది.. ఇలాంటివాటి గురించి చాలా టిప్స్ చెప్పారు. నాకు శాన్ ఫ్రాన్సిస్కో సిటీ, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, లంబార్డ్ స్ట్రీట్.. ఇలా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ముందే బాగా తెలిసినట్టు చాలా ఫెమీలియర్ గా అనిపించింది. ఇదివరకెప్పుడో వాటన్నీటి గురించి చాలాసార్లు తన మాటల్లో విని ఉండటం వల్ల అలా అనిపించిందని అర్థమైంది. Big Sur బీచ్ గురించి తను చెప్పారనే వెళ్ళాం. కాంతి గారికైతే ఆ బీచ్ ఎంత నచ్చిందంటే ప్రతీరోజూ ఫోటోలు చూసినప్పుడల్లా గుర్తు చేసుకుని "మంచు గారు మనకి ఎంత మంచి బీచ్ ని పరిచయం చేసారో, మనం మళ్ళీ ఇంకోసారి వెళ్తే బావుండు" అనేవారు. రోజూ మా ట్రిప్పుల విశేషాలు వినడంతో పాటు గొంతునొప్పి వచ్చినప్పుడు, జ్వరమొచ్చినప్పుడు పర్లేదు బానే ఉన్నానన్నా గానీ ఎక్కడికెళ్ళి ఏం మెడిసిన్స్ తెచ్చుకోవాలో కూడా చెప్పేవారు. మేము రోజూ బోల్డు ఉత్సాహంగా అన్నీ చోట్లకీ తిరిగేస్తూ గంతులేస్తున్న ఫొటోలన్నీ చూస్తూ ఒక రోజు "మిమ్మల్నింత ఆనందంగా చూస్తుంటే బావుంది కానీ ఈ నాలుగు రోజులూ గడిచాక నువ్వు వెళ్ళిపోయే రోజు వచ్చేప్పటికీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో.. నీ కన్నా కాంతి గారికి ఎక్కువ కష్టం అయిపోతుందేమో ఆ దిగుల్లోంచి బయటపడటం" అన్నారు. "హ్మ్.. అవును కానీ మరేం చేస్తాం.. వెళ్ళిపోయే రోజుటి దిగులుని పోగొట్టే మార్గం ఏదన్నా ఉంటే బావుండు కదా.." అనేసి తర్వాత నేను మేము అప్పుడలా అనుకున్న సంగతి మర్చేపోయాను.

02.07.2013
మంగళవారం

నిన్న సాయంకాలం ఒక ఫోన్ కాల్ వచ్చాక మాలో దిగులు కాస్త తగ్గి కొత్త ఉత్సాహం వచ్చింది కదా.. అప్పుడు మాట్లాడింది మంచు గారే! నేను తన ఫోన్ ఆన్సర్ చెయ్యగానే "ఏంటీ హుషారు తగ్గినట్టుందీ.. మళ్ళీ జ్వరమా.." అంటే "జ్వరం కాదు గానీ, మరి నేను రేపు ఊరెళ్ళిపోతున్నాను కదా.. అందుకని కాంతి గారూ, నేనూ దిగులుగా కూర్చున్నాం" అని చెప్పాను. "ఓహో అవునా.. సరేలే అయితే.. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యన్లే కానీ రేపు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తాను. సరేనా.." అన్నారు. నేను బోల్డు సంబరంగా "రేపు నిజంగా వస్తున్నారా.. అయినా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీరసలు.." అని దాదాపు పోట్లాడినంత గట్టిగా అడిగేసాను. "అప్పుడంతా మీరు ఎంజాయ్ చెయ్యడంలో బిజీ బిజీగా ఉన్నారు కదా.. అందుకని మధ్యలో డిస్టర్బ్ చెయ్యలేదు. అయినా వెళ్ళే రోజు మీ దిగులు తగ్గించే మార్గం ఏదన్నా ఉంటే బావుండు అన్నావు కదా.." అని అప్పుడెప్పుడో నేనన్న మాట గుర్తు చేస్తే నాకెంత ఆశ్చర్యం వేసిందో! ఇంక బదులు చెప్పడానికి మాటలేం దొరక్క అలాగేనని చెప్పేసి వెంటనే కాంతి గారికి, కిరణ్ ప్రభ గారికి చెప్పాను మంచు గారు ఇలా ఎయిర్ పోర్ట్ కి వస్తానన్నారని. వాళ్ళిద్దరికీ తనతో నేరుగా మాట్లాడిన పరిచయం లేకపోయినా నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను కాబట్టి అస్సలేం కొత్త లేదన్నమాట. కిరణ్ ప్రభ గారు వెంటనే "అదేంటి తల్లీ.. మనింటికి రమ్మని అడక్కపోయావా.. కాసేపు కూర్చుని మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా.." అన్నారు. కాంతి గారేమో "నిజమే మధురా.. ఒకేసారి ఎయిర్ పోర్ట్ లో మన ఏడుపు మొహాలు చూడటం కన్నా మనింటికి వచ్చి కలిస్తే నయమేమో కదా.." అన్నారు. సరేనని మళ్ళీ మంచు గారికి ఫోన్ చేసి చెప్పాను. తనేమో "నాకు రేపు సాయంత్రం దాకా రోజంతా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి. రోజు మధ్యలో రావడం కుదరదు. పోనీ మీరు ఎయిర్ పోర్ట్ కి బయలుదేరే టైము కన్నా కొంచెం ముందు ఇంటికే వస్తాన్లే.. సాయంత్రం నాలుగున్నర కల్లా అక్కడుంటాను" అని చెప్పారు.
అందుకని నేనూ, కాంతి గారు నిన్నటి నుంచీ నేను వెళ్ళిపోతున్నానని కాసేపు దిగులుగా, మంచు గారొస్తారు కదాని కాసేపు ఉత్సాహంగా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. పొద్దున్నే లేచి కిందకి వచ్చాక రోజూ లాగే కాంతి గారి చేత్తో ఇచ్చిన గ్రీన్ టీ తాగేసి, యథావిధిగా వాకింగ్ ఎగ్గొట్టి, కిరణ్ ప్రభ గారిని ఆఫీసుకి పంపించేసి ఇడ్లీలు తింటూ కూర్చున్నాం. ఫోనుల్లో వీడ్కోలు కూడా అయిపోయాక ఇద్దరం కలిసి బ్యాక్ యార్డులో గులాబీ మొక్కల మధ్యకి వెళ్ళాం. కాంతి గారు ఫ్లవర్ వేజ్ లో పువ్వులు మార్చడం కోసం జాగ్రత్తగా ఎంచి చూసి ఒక్కో రకం పువ్వులు కోస్తూ తిరుగుతుంటే నేను ఏమీ పని లేకపోయినా ఊరికే కోసిన పువ్వులు మోస్తూ తన వెనకే తిరిగాను. ఈ రోజు కిరణ్ ప్రభ గారు లంచ్ కి ఆలస్యంగా వస్తానన్నారు. "లంచ్ అయ్యాక ఇంట్లోనే ఉంటాను. ఫోన్లో మీటింగ్ ఉంటుంది. ఇంటి నించి అటెండ్ అవుతాను. అది అయిపోయాక మనం ఎయిర్ పోర్ట్ కి బయలుదేరదాం" అని చెప్పారు. నాకు కొంచెం ఒంట్లో బాలేనట్టు ఉందని కాసేపు పడుకుని, మళ్ళీ లేచి అలా ఇలా తిరుగుతూ అంతలోనే ఎలా టైం అయిపోయిందో తెలీలేదు. లంచ్ అయిపోయాక కిరణ్ ప్రభ గారు మీటింగ్ కి వెళ్ళాక నేనూ, కాంతి గారూ చాలాసేపు నిషితో ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నాం. ఊరెళ్ళిపోతున్నానన్న దిగులు వల్లే నాకు ఒంట్లో బాలేదని నిషితో చెప్పారు కాంతి గారు. ఎంతసేపైనా మా కబుర్లకి అలుపూ, అంతమూ ఉండకపోయినా గడియారం మాత్రం అప్పుడప్పుడూ ఉరుముతూ ఉంటుంది కదా.. టైము సాయంత్రం నాలుగైపోతుందని బద్ధకం వదిలించుకుని లేచి చకచకా తయారైపోయాను.

నేను కిందకొచ్చేసరికి కిరణ్ ప్రభ గారి మీటింగ్ అయిపోయింది. మేమిద్దరం కలిసి లగేజ్ అంతా నా గదిలో నుంచి కిందకి తీసుకొచ్చి పెట్టాం. ఎప్పటిలా అలవాటుగా నేనున్న గదిలోంచి వెళ్ళిపోయే ముందు కాస్త బెంగగానే గదంతా ఒకసారి కలియచూసుకుని కిందకి వచ్చేసాను. అప్పుడే మంచు గారు కాల్ చేసి దారిలో ట్రాఫిక్ చాలా ఉందని తను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పారు. మేము ముగ్గురం అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. "కాంతి గారూ.. మనం మంచు గారిని ఇదే మొదటిసారి కదా చూడటం.. మనకెలా అనిపిస్తుందంటారు ఇప్పుడు?" అని నేనంటే "అస్సలేమీ కొత్తగా అనిపించదు. ఎప్పటి నుంచో బాగా తెలిసున్న స్నేహితులం కాబట్టి చాలా మామూలుగా మాట్లాడేస్తాం.." అని కాంతి గారు చెప్తుండగానే మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్లో మంచు గారే! "నేను మీ ఇంటి ముందుకొచ్చేసాను" అనగానే "మాటల్లోనే వచ్చేసారుగా.. ఎదురెళ్ళి స్వాగతం చెప్పెయ్ మరి.." అన్నారు కాంతి గారు. నేను ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ గుమ్మం తలుపు తీసుకుని ఇంటి ముందుకొచ్చాను. అప్పుడే కారు దిగి కార్లో నుంచి ఏవో బయటకు తీసుకుంటూ కనిపించారు మంచు గారు. ముందు తనని చూసీ చూడగానే "Wow.. Here comes my Best friend!" అనిపించింది చాలా సంబరంగా. తనకి ఎదురెళ్ళి చేతులో ఉన్న ఫ్లవర్స్, స్వీట్స్ అందుకోగానే "నీక్కాదు ఇవి.. కాంతి గారు వాళ్ళ కోసం తెచ్చాను" అన్నారు. అదే తను నాతో మాట్లాడిన మొదటి మాట. నాకెంత నవ్వొచ్చిందో.. అస్సలేమాత్రం తేడా లేకుండా ఎప్పుడూ ఎవరెవరం ఎలా ఆలోచిస్తామో, ఎలా ఉంటామో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే చేసాం ఇద్దరి స్వభావాలకి అస్సలు పొంతన లేకుండా! "ఏంటీ.. అంత అలసిపోయినట్టు కనిపిస్తున్నారు" అని అడిగితే "ఆఫీస్ నుంచి నేరుగా వచ్చేసాను. కొంచెం క్రిటికల్ ఇష్యూ ఏదో ఉండి లాస్ట్ మినిట్ దాకా కొంచెం హడావుడి.." అని చెప్పారు. లోపలకి వెళుతూనే "కాంతి గారూ.. ఇవన్నీ మీకోసమే తెచ్చారంట. నన్నస్సలు ముట్టుకోడానికి వీల్లేదన్నారు" అని చెప్తే అందరూ నవ్వారు. కాంతి గారేమో "ఎప్పుడూ మధుర పిలిచినట్టు మీరు అచ్చం మంచబ్బాయ్ లానే ఉన్నారు" అని చెప్తే నిజంగానే చాలా బుద్ధిమంతుడిలా నవ్వి ఊరుకున్నారు. "కాఫీ తీసుకుంటారా.." అని అడిగితే వద్దనేసరికి కాఫీనే వద్దంటే ఇంకేం తీసుకునే ఛాన్స్ లేదని నేను అనుకుంటూ ఉండగానే కాంతి గారు "కేక్ తింటారా.. మధుర బర్త్ డే కేక్ ఉంది" అనేసరికి పాపం కాదనలేక ఊ అనేసారు. తర్వాత కిరణ్ ప్రభ గారు, తను మాట్లాడుతూ కూర్చున్నారు కానీ ఎంతసేపటికీ ఆ కేక్ ముక్క కదలడం లేదు. ఇంక నేను చూడలేక "నా బర్త్ డే కేక్ కదాని కష్టపడకండి. మీకు పనిష్మెంట్ ఇద్దామని కాదులెండి కేక్ పెట్టింది. తినకుండా వదిలెయ్యొచ్చు" అని చెప్పి రక్షించేసాను.

అప్పటికే టైము ఐదున్నర అయింది. ముందు రోజు నేను ఆన్లైన్ చెకిన్ చెయ్యడానికి ట్రై చేస్తే ఎందుకో కుదరలేదు. ఉదయం ఎయిర్ లైన్స్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే "క్షమించండి. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీరు నేరుగా ఎయిర్ పోర్ట్ లోనే చెకిన్ చేసుకుని అఘోరించండి" అని చాలా మర్యాదగా చెప్పిందో అమ్మాయి. నా ఫ్లైట్ రాత్రి 9:25 కి. అందుకని "మూడు గంటల ముందు వెళ్ళి చెకిన్ చేసేస్తే కంగారు లేకుండా ఉంటుంది. చెకిన్ అయిపోయాక అప్పుడు తీరిగ్గా అక్కడ ఎయిర్ పోర్ట్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. మీరిద్దరూ ముందు బయలుదేరి వెళ్ళి చెకిన్ చేసేసరికి మిగతా లగేజ్ తీసుకుని వెనకే మేము వచ్చేస్తాం" అన్నారు కిరణ్ ప్రభ గారు. ఎలాగూ వెళ్ళిపోవాలని తెలుసు కానీ ఏంటో అలా సూట్కేస్ తీసుకెళ్ళి కార్లో పెట్టేస్తుంటే అదోలా అనిపించింది కొంచెం కష్టంగా.. ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ కొనుక్కోడం ఎందుకులే అని నేను ఇంట్లోంచి ఒక రెండు వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఇల్లంతా చుట్టూ ఒకసారి చూసుకుని, దేవుడికో మాట చెప్పేసి, కాంతి గారు మాకు ఎదురొస్తే మేమిద్దరం ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాము. అప్పుడు మా ఇద్దరి మొహాలు చూసి మంచు గారు "ఇప్పుడే కాదు వెళ్ళేది. ఓ గంటలో మళ్ళీ కలుసుకుంటారు కదా.. కొంచెం నవ్వండి" అన్నారు. నేను కారు విండోలో నుంచి వెనక్కే చూస్తూ, మా వీధి మలుపు దాటి మేము అక్కడ రోజూ తిరిగిన పరిసరాలన్నీ దాటిపోయేదాకా అలా మౌనంగా ఉండిపోయాను.

నేను తేరుకుని ఈ లోకంలోకి వచ్చేసరికి మంచు గారు ఏంటో తెగ వెతికేస్తున్నారు ఫోను, GPS రెండిటిల్లోనూ. కళ్ళు మూసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోమన్నా వెళ్ళే రకం కదా, ఏదో కొత్త ప్లేస్ కి వెళ్ళాలన్నట్టు అంతలా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. అదే అడిగితే Stoneridge Drive ఎక్కడుందా అని చూస్తున్నానన్నారు. "Stoneridge Drive అయితే నాకు తెలుసు. అక్కడున్న స్టోన్ రిడ్జ్ మాల్ కి మేము షాపింగ్ కి వెళ్ళాం" అని చెప్తే "ఎలా వెళ్ళాలో తెలుసా నీకు?" అన్నారు. "అంటే.. దారి తెలీదు. కానీ మా ఇంటికి చాలా దగ్గరని మాత్రం తెలుసు" అని చెప్పాను. "ఎలా వెళ్ళాలో GPS చెప్తుందిలే" అని తనంటే అక్కడికి మేము ఎందుకు వెళ్ళాలో అర్థం కాలేదు నాకు. "ఎందుకంటే చిన్న షాపింగ్ పనుంది. అది చూసుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోదాం" అన్నారు. "మీరన్నీ మాథ్స్ ఈక్వేషన్లు చెప్పినట్టు చెప్పకుండా నాకు అర్థమయ్యేలా చెప్పండి" అని అడిగాను. "నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. హడావుడిగా వచ్చాను కదా.. గిఫ్ట్ కార్లో పెట్టేసాను అనుకుని మర్చిపోయి వచ్చేసాను. ఆ విషయం మీ ఇంటి ముందు కార్ దిగాక తెలిసింది. అందుకని ఇప్పుడు మనం అలా షాపింగ్ కి వెళ్ళి ఇలా వచ్చేద్దాం. జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్" అని చెప్పారు. "అసలు ఇప్పుడు నాకెందుకు గిఫ్ట్.. ఊరెళ్ళిపోయేవాళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటారా మీ అమెరికాలో" అంటే "అందుక్కాదు. ఈ సంవత్సరానికి నీ బర్త్ డే గిఫ్ట్ వచ్చిందా?" అని నన్ను ఎదురుప్రశ్న అడిగారు. "ఓ అవును కదా.. మర్చిపోయాను. నా బర్త్ డే గిఫ్ట్ ఏది?" అంటే "అదే మరి చెప్పేది మర్చిపోయి వచ్చానని. నీ జర్మనీ బుర్ర అమెరికాలో సరిగ్గా పని చేస్తున్నట్టు లేదు కదా.." అన్నారు నవ్వుతూ. "ఆ కొనేసి పెట్టిన గిఫ్ట్ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాన్లే.. ఇప్పడు మళ్ళీ కొనడం ఎందుకు వేస్ట్.. అయినా ఇప్పుడు షాపింగ్ అంటే మనకి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళడం లేట్ అయిపోతుందేమో.." అన్నాను కంగారుగా. "కొనేసిన గిఫ్ట్ ఏం వేస్ట్ అయిపోదులే.. అది నేను రిటన్ ఇచ్చేస్తాను కానీ నువ్వు ప్రతీదానికీ కంగారుపడకుండా కాసేపు చెప్పిన మాట విను. నువ్వొక్కదానివే కాదు కదా ఎయిర్ పోర్ట్ కి వెళుతోంది. నేను కదా తీసుకెళ్తున్నాను. నిన్ను మీ జర్మనీకి భద్రంగా పంపించే బాధ్యత నాది. సరేనా.. ఇంక దిగు" అనేసరికి అంతా బానే ఉంది గానీ ఉన్నట్టుండి దిగిపొమ్మంటారేంటబ్బా.. అనుకుని పక్కకి చూసేసరికి అప్పటికే మేము స్టోన్ రిడ్జ్ మాల్ పార్కింగ్లో ఉన్నాం. "ఏంటో.. అయినా నా పిచ్చి గానీ ఎలాగైనా తను చెయ్యదల్చుకున్నదే చేసేస్తారు గానీ మనం చెప్పిన మాట ఎప్పుడైనా వినిపించుకునే రకం కాదు కదా" అని గుర్తొచ్చి సరేనని బుద్ధిగా తనని ఫాలో అయిపోయాను. "మన కార్ ఎక్కడ పార్క్ చేసామో గుర్తుంచుకుంటావా" అంటే "బాబోయ్.. ఇలాంటి విషయాల్లో నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని రేపటి దాకా ఇక్కడే తిప్పుతాను. దార్లూ అవీ మీరే గుర్తు పెట్టేసుకోండి బాబూ.. నాకేం సంబంధం లేదు ముందే చెప్తున్నా" అనేసరికి గట్టిగా నవ్వేసి "ఊరికే అన్నానులే.. మళ్ళీ దానికి కూడా కంగారు పడకు ఇప్పుడు. నాకు గుర్తుంటుందిలే.." అన్నారు.
మాల్ లోపలకి వెళ్ళి మ్యాప్ ఎక్కడుందో వెతుక్కుని మంచు గారేమో దాని మీదున్న షాప్స్ ప్లాన్ చూస్తుంటే నేనేమో కాంతి గారితో వచ్చినప్పుడు ఏయే షాప్స్ తిరిగామా అని గుర్తు చేసుకుంటూ దిక్కులు చూస్తూ నించున్నా. మ్యాప్లో రెండు షాపుల పేర్లు చూపించి రెండీటిల్లో దేనికి వెళదాం అని అడిగారు. అందులో ఒక పేరు చూసి కొంచెం కోపంగా "మిమ్మల్నసలూ... ఎవరైనా ఇంత కంగారులో పది నిమిషాల షాపింగ్ కోసమని అలాంటి షాపులకి వెళ్తారా.." అని అరిచేసి ఆ ఇంకో రెండో షాప్ పేరు Sunglass Hut అని చూసి అదైతే నయం అనుకుని దానికి వెళదాం అన్నాను. తనేమో మళ్ళీ నవ్వుతూ "నువ్వు చెప్పకపోయినా మనం Sunglass Hut కే వెళ్ళేవాళ్ళం. ఆ షాప్ కోసమే మనం ఈ అడ్రస్ వెతుక్కుని మరీ వచ్చాం. నేను ఇదివరకు నీకోసం కొన్న గాగుల్స్ లాంటివే ఇక్కడ స్టోర్లో చూసి వెంటనే తీసేసుకుని వెళ్ళిపోవడమే.. ఓకే నా.." అన్నారు. తీరా షాపు దాకా వెళ్ళాక అప్పుడు గమనించారు ఇందాక నా గోలలో పడి కార్లోంచి దిగేప్పుడు వాలెట్ మర్చిపోయి వచ్చేసారని. "నేను ఫాస్ట్ గా వెళ్ళి తీసుకుని వస్తాను. ఇక్కడే ఉండు" అంటే "ఉహూ నేను కూడా వస్తాను" అని వెంట వెళ్ళినందుకు తన నడకతో సమానంగా పరిగెట్టాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చి షాపులో తను గాగుల్స్ కోసం వెతుకుతుంటే నేను కూడా ఊరికే ఉండటం ఎందుకు అని కొన్ని కళ్ళద్దాలు చూసాను. వాటికి ఉన్న ప్రైస్ ట్యాగ్స్ అన్నీ వందల డాలర్లలో ఉంటే చూసి నాకు ఇందాక మ్యాప్లో చూసిన ఆ మొదటి షాపుకి వెళ్ళుంటే ఇంతకన్నా నయంగా ఉండేదేమో అనిపించింది. జ్యూయెలరీ షాపు కన్నా కళ్ళద్దాల షాపులో ఖరీదు ఎక్కువుంటుందని నిజంగా ఊహించలేదు. వెంటనే తన దగ్గరికి వెళ్ళి "బాబోయ్.. ఈ గాగుల్స్ నాకొద్దు. ఇన్ని డబ్బులు పెట్టి ఎవరన్నా గాగుల్స్ కొనుక్కుంటారా అసలు.. ఒకసారి ఏమైందో తెలుసా.. నేను ఫిఫ్టీ యూరోస్ పెట్టి కొనుక్కున్న గాగుల్స్ బ్యాగ్లో పడేసి దాని మీద గీతలు పడితే ఎన్ని రోజులు బాధపడ్డానో తెలుసా.. నాకొద్దు.." అని అరిచి మరీ చెప్పాను. అంతా విని అతి మాములుగా "ఏం పర్లేదు.. అలా గీతలు పడకుండా ఉండాలనే షాపు వాళ్ళు కూడా ఒక డబ్బాలో పెట్టి మరీ ఇస్తారు" అన్నారు. అదొక చిన్న షాపు. Ray Ban, Gucci, Guess లాంటి కొన్ని ఫేమస్ బ్రాండ్స్ వి సెలెక్టెడ్ పీసెస్ కొన్ని ఉన్నాయంతే. అయినా ఆ ప్రైస్ ట్యాగులు చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు రోజుకో రెండు కళ్ళజోళ్ళు అమ్ముకున్నా చాలు బ్రహ్మాండంగా బతికేస్తారని! అవునూ.. ఇదివరకు కొన్నది ఏ బ్రాండో అందులో మాత్రం వెతికితే సరిపోతుంది కదాని అదే మాట తనని అడిగాను. "సరిపోతుందనుకో.. కానీ అది కొన్న రోజు పక్కన డిస్ప్లే లో ఉన్న అమ్మాయి మొహం గుర్తుంది కానీ బ్రాండ్ పేరు ఏంటో గుర్తులేదు. ఇక్కడేమో ఆ మొహం కనపడట్లేదు" అన్నారు. "ఇది మాత్రం దారుణం అసలు.. పేరు కూడా చూడకుండా అమ్మాయిలని గుర్తు పెట్టుకున్నారా.. తిక్క బాగా కుదిరింది. బాగా వెతుక్కోండి. కానీ ఇప్పటికే పదిహేను నిమిషాలు అయిపోతోంది. మనం తొందరగా వెళ్ళాలి" అన్నాను. ఇంతలో కళ్ళజోడు కొనుక్కోడానికి పాపం మేమింతలా ఎందుకు హడావుడి పడుతున్నామో అర్థం కాక షాపులో అమ్మాయి హెల్ప్ కావాలా అనడిగితే "ఇప్పుడు నువ్వు ఒక్కో కళ్ళజోడు పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించినా వినే టైం మాకు లేదులేమ్మా" అనుకుంటూ వద్దని చెప్పేసాం. మంచు గారేమో "పక్కన నీ గోల లేకపోతే పదిహేను కాదు పది నిమిషాల్లోనే అయిపోయి ఉండేది నా షాపింగ్.. ఇదిగో ఈ మూడీటిల్లో ఏది బావుందో చూడు" అన్నారు. నేను వెంటనే ఆ మూడీటి ట్యాగులు చూస్తుంటే "నేను చూడమన్నది గాగుల్స్, ట్యాగులు కాదు" అన్నారు. నేనప్పటికే చూసేసాను కాబట్టి 4, 3, 2 తో మొదలైన వాటిల్లో నాకా చివరిదే కావాలన్నాను. వాటికి అన్నేసి వందల డాలర్ల రేటు ఉండటం వెనక ఏదో పెద్ద సోది చరిత్ర ఉంటే ఉంటుందేమో గానీ చూడ్డానికి డిజైన్ మాత్రం నేను చెప్పిందే బావున్నట్టుంది. మాకు టైము కూడా ఎక్కువ లేదు కాబట్టి నాతో ఇంకేం వాదించకుండా అది ప్యాక్ చేసి ఇచ్చెయ్యమన్నారు. ఆ VERSACE గాగుల్స్ తో పాటు దానికోసం ఇచ్చిన వైట్ బాక్స్ ఎక్కువ నచ్చేసింది నాకు. వెంటనే డబ్బులు కట్టేసి బయటపడదాం అనుకుంటే షాపులో అమ్మాయి "మీరింత గొప్ప కళ్ళజోడు కొన్న పుణ్యానికి మీ వంశచరిత్ర సగమైనా సరే మాకు చెప్పాలి" అంటూ ఒక పెద్ద ఫార్మ్ ఇచ్చింది ఫిల్ చేసిమ్మని. "నా వల్ల కాదు. ఈ భాగ్యం కూడా మీకే.." అనేసరికి పాపం మంచు గారే ఓపిగ్గా అది రాసిచ్చి అప్పుడు మాల్లోంచి బయటపడ్డాం. నేను నా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ షాప్లో మర్చిపోయి వచ్చేసాను. అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ కి బయలుదేరిపోయాం.

దారిలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేసరికి క్షణాల్లో ఎయిర్ పోర్ట్ దగ్గరికి వచ్చేసినట్టు అనిపించింది. San Fransisco International అని కళ్ళ ముందు కనపడగానే మళ్ళీ నేను ఊరెళ్ళి పోతున్నాను కదాని గుర్తొచ్చేసింది. మంచు గారు "కాంతి గారు వాళ్ళు ఎక్కడున్నారో కాల్ చేసి కనుక్కో" అంటే వెంటనే వాళ్ళతో మాట్లాడాను. "ఇప్పుడే ఎయిర్ పోర్ట్ లో కార్ పార్క్ చేసి పైకి వెళుతున్నాం. మీరు చెకిన్ చేసేసారా" అనడిగితే "ఉహూ ఇంకా లేదు. ఇప్పుడే వచ్చాం మేము కూడా. అదో పెద్ద కథలెండి. తర్వాత చెప్తాను. రెండు నిమిషాల్లో మీకు కనిపిస్తాం" అని చెప్పేసి "మనకి లేట్ అయిపోయిందేమో.. పదండి పదండి త్వరగా" అని మంచు గారిని కంగారు పెట్టేసాను. అప్పటికి ఇంకా ఏడున్నర కూడా కాలేదు. తనేమో "ఇంకా టైముంది. ఏం పర్లేదు" అంటూనే నా హింస భరించలేక గబగబా లగేజ్ తీసుకుని ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు నడిచాం. సగం దూరం వెళ్ళాక తెలిసింది తను పాపం ఈ హడావుడిలో ఫోన్ కార్లోనే మర్చిపోయి వచ్చారని. చేతిలో లగేజ్ కూడా ఉంది కదా.. "నువ్విక్కడే నించో.. నేనెళ్ళి నిమిషంలో వచ్చేస్తాను" అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తెచ్చుకున్నారు. పైకి వెళ్ళాక Air France చెకిన్ కౌంటర్ ఎక్కడుందో చూసుకుని వెళ్ళాం. కిరణ్ ప్రభ గారు, కాంతి గారు "మీరిద్దరూ వెళ్ళి లైన్లో నించుని చెకిన్ చేసి రండి. మేము ఇక్కడే పక్కన మొన్న నిషిని దింపిన రోజు కూర్చున్న చోట ఉంటాము" అన్నారు.
క్యూ చూస్తే ఒక అయిదారుగురితో చిన్నగానే ఉండేసరికి హమ్మయ్యా అనుకున్నాను. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచీ ఒకటే ఉరుకులు పరుగులేమో నాకు దాహంగా అనిపించింది. కానీ నేను రెండో వాటర్ బాటిల్ కూడా కార్లో మర్చిపోయి వచ్చేసాను. సర్లే చెకిన్ అయిపోయాక కొందాంలే అనుకున్నా. ఇంతలో ఎయిర్ లైన్స్ అమ్మాయి వచ్చి "మీరిద్దరిలో ఒకరు లైన్లో నించుని ఇంకొకరు వెళ్ళి పక్కనే ఉన్న kiosk లో చెకిన్ చెయ్యండి" అని చెప్పింది. అప్పుడున్న కంగారులో నాకు అదంతా చేసే ఓపిక లేక టికెట్ పేపర్స్, పాస్పోర్ట్ అన్నీ మంచు గారి చేతిలో పెట్టేసాను. తను వెళ్ళి ఎంతసేపు ట్రై చేసినా ఎందుకో చెకిన్ అవ్వలేదు. ఎయిర్ లైన్స్ అమ్మాయి కూడా ట్రై చేసి కుదరక "సర్లే కౌంటర్లో చేస్తార్లే.. వెళ్ళి లైన్లో ఉండండి" అంది. లైన్లో చూస్తే జనాలు పెద్దగా లేరు కానీ ఎంతసేపైనా లైను కదిలినట్టే అనిపించడం లేదు. మేము ఆ మాటా ఈ మాట చెప్పుకుంటూ నేను చేతిలో ఉన్న వాలెట్లో యూరో కాగితాలు, నాణేలు చూపిస్తూ "చూసారా.. మా డబ్బులు" అంటే "యూరోలు సరే గానీ డాలర్స్ ఏమీ కనిపించడం లేదేంటి.. మొత్తం ఖర్చు పెట్టేసావా?" అనడిగారు. "ఖర్చు పెట్టెయ్యడం ఎక్కడా.. నేనసలు డాలర్స్ మార్చుకోందే! నేనొక్కదాన్ని అసలెక్కడికీ వెళ్ళలేదు కదా.. షాపింగేమో క్రెడిట్ కార్డ్ తో చేసేసాను" అని చెప్తే "అయితే మాత్రం డాలర్స్ అస్సలు లేకుండా ఎలా ఉన్నావ్.. ఇప్పుడు లోపలకి వెళ్ళిపోయాక ఆకలేసిందనుకో.. వాడు క్రెడిట్ కార్డులు, యూరోలు తీసుకోనంటే ఏం చేస్తావ్.." అంటూనే తన వాలెట్లోంచి కొన్ని డాలర్ నోట్స్ తీసిచ్చారు. "వద్దులెండి. అయినా ఎయిర్ పోర్ట్ లో యూరోస్ తీసుకోకుండా ఉంటారా.." అన్నాను. తనేమో "తీస్కో నువ్వు ముందు" అని గట్టిగా అనేసరికి పైన కనిపించిన 20 డాలర్ నోటు చూసి ఇదొక్కటి అయితే సరిపోతుందిలే.. నేను అంతకన్నా ఎక్కువ తినలేను కదా" అంటే ఈసారి ఏమీ అనకుండా ఒక్క చూపు చూసారు. ఇంకేం మాట్లాడకుండా టక్కున తన చేతిలోంచి డబ్బులు లాగేసుకుని లోపల పెట్టేసుకున్నా. అప్పటికి లైన్లో మా ముందు ఒక్కరే ఉన్నారు ఇంకా.
అక్కడ కౌంటర్లో ఒక మధ్య వయస్కురాలైన ఫ్రెంచ్ ఆవిడ ఉంది. మా వంతు వచ్చాక టికెట్స్ ఇచ్చి లగేజ్ అక్కడ పెట్టాం. ఒక్క నిమిషం అని చెప్పి నా టికెట్స్ తీసుకుని పక్కకి వెళ్ళి పది నిమిషాలైనా రాకపోయేసరికి నాకు టెన్షన్ వచ్చింది. కాసేపటికి తీరిగ్గా వచ్చి "మీ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంది. మీరు లోపలకి వెళ్ళాక సీట్ అవైలబిలిటీ చూసి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఈ లోపు నేను వేరే పాస్ ఇస్తాను" అనేసరికి నాకు కంగారుగా అనిపించింది. టికెట్ పోస్ట్ పోన్ చేసినప్పుడు ఇలాంటిదేమీ చెప్పలేదు నాకు. ఇప్పుడు సడన్ గా వెయిటింగ్ లిస్టు అంటే అయోమయంగా అనిపించింది. అందులోంచి నేను బయటపడక ముందే "మీ సూట్కేస్ ఒక కేజీన్నర ఎక్కువ బరువుంది. అది తీసెయ్యాలి" అంది. అప్పటికి నాకింక టెన్షన్ పడే ఓపిక కూడా లేక నీరసం వచ్చేసింది. మంచు గారేమో కొంచెమే కదా ఎక్కువుంది అని సర్ది చెప్పబోతే "మా ఎయిర్ ఫ్రాన్స్ లో రూల్స్ అంటే రూల్సే.." అందావిడ. నేనేమో పక్కనించీ "పర్లేదులెండి.. నేను కొన్ని అంత ముఖ్యం కాని వస్తువులు తీసేస్తాను" అని పక్కకొచ్చి సూట్కేస్ ఓపెన్ చేసి కొంచెం బరువు తగ్గించి మళ్ళీ తీసుకెళ్ళాం. ఈసారి "ఎయిర్ ఫ్రాన్స్ లో మేము చాలా స్ట్రిక్ట్.. నియర్లీ 24 ఈస్ నాట్ 23" అని లెక్కలు నేర్పించేస్తున్నట్టు మహా గొప్పగా చెప్పింది. కాదన్నందుకో, లెక్కలు నేర్పించబోయినందుకో తెలీదు కానీ మంచబ్బాయ్ గారికి కొంచెం కోపమొచ్చేసింది ఈసారి. "ఎక్స్ట్రా బరువుంటే ఎంత డబ్బులు కట్టాలి చెప్పండి" అని వాలెట్ తీసి చేతిలో పట్టుకున్నారు. ఆవిడేమో "జస్ట్ 200 డాలర్స్" అంది. అప్పటికే నాకు టికెట్ వెయిటింగ్ లిస్టు అందనీ, సూట్కేసు బరువెక్కువై ఓపెన్ చెయ్యాల్సి వచ్చిందని చాలా ఇబ్బందిగా, టెన్షన్ గా ఉంటే ఇప్పుడీ కేజీ బరువు కోసం అన్ని డబ్బులు వేస్ట్ చేస్తారేమోనని భయపడి చచ్చాను. గబగబా వెళ్ళి దాదాపు తనని పక్కకి లాగేసినంత పని చేసి "ప్లీజ్.. ఈ ఒక్కసారి నా మాట వినండి. సూట్కేసులో పనికిరాని వస్తువులు చాలా ఉన్నాయి. నేను అవి తీసేస్తాను. వాటి కోసం ఇన్ని డబ్బులు తగలెయ్యడం దండగ" అని బతిమాలేసాను. "సరే.. డబ్బులేం కట్టనులే. నువ్వేం వర్రీ అవ్వకు" అని చెప్పి ఇంకో కేజీ కూడా తీసేసాక అప్పుడు ఆవిడ చెక్ చేసి ఓకే అంది. సాధారణంగా క్యాబిన్ లగేజ్ చెకిన్ దగ్గర చూడరు కదాని అది కాంతి గారి దగ్గరే వదిలేసి వచ్చాం. ఈవిడేమో మళ్ళీ "మా ఎయిర్ ఫ్రాన్స్.." అని మొదలెట్టి అది కూడా తీసుకురండి అంది. కిరణ్ ప్రభ గారికి ఫోన్ చేసి మేమున్న దగ్గరికి తెచ్చిమ్మని చెప్పాక అది కూడా ఓ అరకేజీ ఎక్కువ బరువుంటే ఎలా అన్న సందేహం వచ్చింది. మంచు గారు వెంటనే నా దగ్గర నుంచీ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఎదురెళ్ళి అందులోంచి కూడా కొంచెం బరువు తీసి పక్కన పెట్టి "మీరిక్కడే ఉండండి. అక్కడికి రాకండి" అని చెప్పి వచ్చారు. మళ్ళీ దాని వెయిట్ చెక్ చేసాక కూడా ఆ ఫ్రెంచ్ పోలేరమ్మకి ఎంత చాదస్తం అంటే ఇందాక బయటకి తీసిన వస్తువుల బ్యాగ్ వైపే చూస్తోంది అనుమానంగా. "తల్లోయ్.. ఇవన్నీ ఇక్కడే వదిలేస్తాను. ఇదిగో ఈయన తీసుకెళ్ళిపోతారు. వెళ్ళేది నేనొక్కదాన్నే కదా.." అని చెప్పాక అప్పుడు శాంతించింది.

ఆ చెకిన్ ప్రహసనం అంతా అయిపోయేసరికి టైము ఎనిమిది దాటింది. అప్పటికి నాకు నించోడానికి కూడా ఓపిక లేనంత వణికించేసింది ఆవిడెవరో గానీ. నలుగురం వచ్చి కూర్చున్నాక ఇందాక తీసేసిన వస్తువులన్నీ కాంతి గారికి ఇస్తే అందులో చాక్లెట్స్ చూసి "అయ్యో.. చాక్లెట్స్ కొన్నే కదా కొన్నావు. ఇవి కూడా తీసేసావా" అన్నారు. ఆ మాట వినగానే మంచు గారు "చాక్లెట్స్ కి ఏం పర్లేదులే" అని లాప్టాప్ బ్యాగ్లో కొన్ని, క్యాబిన్లో కొన్ని సర్దేసారు. "ఇంతకీ లాప్టాప్ బ్యాగ్ ఎక్స్ట్రా అని అంటుందేమో.. దాని సంగతి మర్చిపోయాం కదా.. లోపలకి వెళ్ళాక ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో.." అని భయపడ్డాను నేను. "ఆవిడెవరో మరీ సోది మొహంలా ఉంది కానీ ఇంత సీన్ అవసరం లేదు. అస్సలేం ఇబ్బంది ఉండదు. కంగారు పడకు. అంతగా అవసరమైతే నువ్వు లోపల నుంచి మాకు కాల్ చేద్దూ గానీలే.. ఓ.. ఇంక నీ దగ్గర మొబైల్ ఉండదు కదూ.. కాయిన్స్ ఉంటే లోపల ఫోన్స్ యూజ్ చేస్కోవచ్చు" అన్నారు కిరణ్ ప్రభ గారు. "అయినా సెక్యూరిటీ చెక్లో అండర్ ఫోర్టీన్ వాళ్ళని పెద్దగా పట్టించుకోరులే.. భయం లేదు" అని మంచు గారు అనేసరికి నేను తప్ప అందరూ నవ్వారు. నాకు నిజంగానే జోక్ అర్థం కాలేదు. అప్పటికింకా వణుకు తగ్గక నోట్లోంచి మాట కూడా సరిగ్గా బయటికి రావడం లేదు. మంచు గారు నావైపు చూసి "ఆకలేస్తుందా.. ఏమన్నా తింటావా" అని అడిగారు. "మంచినీళ్ళు కావాలి" అని చెప్తే వెళ్ళి ఓ పెద్ద లైన్లో నించుని రెండు వాటర్ బాటిల్స్ తో పాటు గుప్పెడు చిల్లర కాయిన్స్ పట్టుకొచ్చి ఇచ్చారు. అంత టెన్షన్ పడిపోతుండేసరికి ఒకేసారి ఎక్కువ మంచినీళ్ళు కూడా తాగలేకపోయాను. నేను లోపలకి వెళ్ళిపోయే దాకా రెండు నిమిషాలకోసారి మంచినీళ్ళు తాగమని గుర్తు చేస్తూనే ఉన్నారు మంచు గారు. కిరణ్ ప్రభ గారు నా చేతుల వంక చూసి "ఎంత ఎర్రగా కందిపోయాయో చేతులు, మొహం కూడా.. ఇంకేం కంగారు పడకు తల్లీ.. లగేజ్ పని అయిపోయిందిగా" అన్నారు. "మీరీ విషయం ఎవరికీ చెప్పకండి. మీరందరూ చిన్నపిల్ల అనడమేమో గానీ నిజంగానే చిన్నపిల్లని ఊరికి పంపిస్తున్నట్టు నానా కంగాళీ అయిపోయింది కదా.. ఎవరన్నా చూస్తే పాపం ఇదే మొదటిసారేమో ఫ్లైట్ ఎక్కడం అనుకుంటారు" అన్నాన్నేను. "టెన్షన్ లగేజ్ ఒక్కదాని గురించే కాదులెండి. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందని చెప్పారు" అన్నారు మంచు గారు. అంత టెన్షన్ లోనూ కాంతి గారు "వెయిటింగ్ లిస్టా.. అంటే పోస్ట్ పోన్ చేస్తారా.. అలాగైతే ఎంచక్కా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోదాం" అనేసరికి చాలా నవ్వొచ్చింది.

మంచు గారు టైము చూస్తూ "యు హావ్ టు గో ఇన్ ట్వల్వ్ మినిట్స్.. వెయిటింగ్ లిస్ట్ అన్నారు కదా.. ఒకవేళ లోపల వాళ్ళు నీ పేరు అనౌన్స్ చేస్తే టైముకి నువ్వక్కడ ఉండాలి. అందుకని ముందే వెళ్ళాలి" అని చెప్తే నాకప్పుడు మళ్ళీ "అవును.. నేనింక వెళ్ళిపోతున్నాను కదా" అన్న దిగులు గుర్తొచ్చింది. తను నా ఐఫోన్ తీసుకుని "​లోపలకి వెళ్ళాక ఫోన్ లేకపోయినా ఇంటర్నెట్ కి కనెక్ట్ ​అవ్వగలిగితే మెయిల్ ఇవ్వొచ్చు" అని ఎయిర్పోర్ట్ ఇంటర్నెట్ ​కి ఎలా కనెక్ట్ అవ్వాలో వివరంగా చూపించారు. "ఫోన్ లాక్ అయినప్పుడు నెట్ డిస్కనక్ట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు రీకనక్ట్ చేసుకోవాలి" అని చెప్తూ నా మొహంలోకి చూసేసరికి తనకి అర్థమైంది తను చెప్పిందంతా నాకొక్క ముక్క కూడా బుర్రలోకి వెళ్ళడం లేదని. ​"నీ ఫ్లైట్ టేకాఫ్ అయ్యేదాకా నేను ఎయిర్ పోర్టులోనే వెయిట్ చేస్తుంటాను. ఏం అవసరమైనా నాకు కాల్ చెయ్యొచ్చు. డోంట్ వర్రీ.." అన్నారు. హ్మ్.. వెళ్ళడానికి ఇంకో ఐదు నిమిషాలుందనగా నేనొక్కదాన్నే నవ్వుతూ ఏదేదో సోది చెప్తుంటే వాళ్ళు ముగ్గురూ పెద్దగా ఏం మాట్లాడకుండా నన్నే చూస్తుంటే అస్సలు అర్థం పర్థం లేని నాన్సెన్స్ మాట్లాడుతున్నానేమోనని సందేహం వచ్చింది. కిరణ్ ప్రభ గారేమో "టెన్షన్ పడుతున్నావని తెలీకుండా ఉండటానికి బోల్డు మాట్లాడేస్తున్నావా తల్లీ.." అనడిగేసరికి నాకింకేం మాట్లాడాలో తోచలేదు.

మాకున్న టైము అయిపోయింది. ​అందరం లేచి నించున్నాం. మంచు గారు పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసి "ఇవి ఈ చేతిలో పెట్టుకో. ఈజీగా ఉంటుంది" అని నా చేతిలో పెట్టి, ఇంకో చేతికి లాప్టాప్ బ్యాగ్ అందించారు. కాంతి గారు సెక్యూరిటీ చెక్లో ఊరికే తియ్యడం పెట్టుకోడం ఇబ్బంది అని చేతి వాచ్ తీసి బ్యాగ్లో పడేయ్యమని చెప్పి నా స్వెటర్, క్యాబిన్ బ్యాగ్ తను తీసుకుని ముందుకి నడిచారు. కిరణ్ ప్రభ గారేమో నన్ను కొంచెం పక్కకి తీసుకెళ్ళి అక్కడ నుంచి లోపల సెక్యూరిటీ చెక్ దాటాక ఒక పాయింట్ చూపించి "నువ్వు అక్కడికి వెళ్ళేదాకా మేము కనిపిస్తాం. ఇక్కడే నించుని ఉంటాం చూడు" అని చెప్పారు. సరిగ్గా సెక్యూరిటీ చెక్ లోకి అడుగు పెట్టే  ముందు దాకా వెళ్ళేసరికి ఇంక వాళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. నేను మాత్రం ఇహ్హిహ్హీ అని తెగ నవ్వేస్తూ "మీరేం కంగారుపడకండి. నేను జాగ్రత్తగానే వెళ్తాను" అని చెప్పి కాంతి గారికి "మళ్ళీ వస్తాను బెంగ పెట్టుకోకండి" అని మరీ మరీ చెప్పి లోపలికి నడిచాను. నేను వెళుతూ వెళుతూ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసినా ముగ్గురూ అలా కదలకుండా అక్కడే నించుని నా వైపే చూస్తూ కనిపించారు. "ఏంటో.. నిజంగా చిన్నపిల్లని ఫస్ట్ డే స్కూలుకి పంపిస్తున్నట్టు భలే పెట్టుకున్నారు మొహాలు ముగ్గురూ.." అని చాలా నవ్వొచ్చింది. అంతలోనే నేను మళ్ళీ ఎప్పుడు వీళ్ళని చూస్తానో కదాని బెంగగా అనిపించింది. నేను నవ్వుతూనే ఉన్నాను గానీ కళ్ళ ముందున్న వాళ్ళ ముగ్గురి బొమ్మా అస్పష్టంగా అయిపోతోంది వాళ్ళకీ నాకూ మధ్య దూరం పెరుగుతున్నందుకో, కళ్ళలో కన్నీటి తెర అడ్డుపడినందుకో సరిగ్గా తెలీలేదు. కిరణ్ ప్రభ గారు ఇందాక చూపించిన పాయింట్ దగ్గరికి వెళ్ళి నించుని అక్కడినుంచి నవ్వుతూ ఇంకొకసారి టాటా చెప్పి ముందుకి వెళ్ళిపోయాను.

తర్వాత సమస్యలేవీ లేకుండానే బోర్డింగ్ పాస్ ఇచ్చేసరికి హమ్మయ్యా అనుకుని వెంటనే "All happy.. Worry not" అని కొత్త టెలిగ్రాం భాష కనిపెట్టి మా Thee Musketeers కి మెయిల్ పెట్టడానికి ప్రయత్నించాను. మెయిల్ సెండ్ అయ్యే టైముకి నెట్ డిస్కనక్ట్ అయ్యి వెళ్ళిందో లేదో తెలీలేదు. నాకేమో అక్కడ నించునే టైం లేకుండా వెంటనే ఫ్లైట్లోకి పంపించేసారు. ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాక "వేరే ఎవరినన్నా ఫోన్ అడిగి ఒక కాల్ చెయ్యమ్మా.. ఏమనుకోరు" అన్న కిరణ్ ప్రభ గారి మాట గుర్తొచ్చి అంతలోనే నా జర్మనీ సిమ్ కార్డ్ వేసుకుంటే ఇంటర్నేషనల్ రోమింగ్ లో పని చేస్తుంది కదాని సూపర్ ఐడియా వచ్చింది. అర్జెంటుగా ఆ పని చేసి టెక్స్ట్ పెట్టి ఒకసారి  బెటర్ గా ఫీలవుతారని కిరణ్ ప్రభ గారికి కాల్ చేసాను. నేను అంతా బానే అయింది అని చెప్పాక "ఇప్పుడు మేము సరిగ్గా ఎక్కడున్నామో తెలుసా తల్లీ.. స్వర్గద్వారం దగ్గర.. కాంతికి నేను చెప్తానులే.. మంచు గారు నీ ఫ్లైట్ టేకాఫ్ అయ్యేదాకా ఎయిర్ పోర్టులోనే వెయిట్ చేస్తానన్నారు. తనకి కాల్ చేసి చెప్పమ్మా. హేపీ జర్నీ" అని చెప్పి పెట్టేసారు. అసలు ఎయిర్ పోర్ట్ కి వచ్చిన దగ్గర్నుంచీ కాంతి గారు పెద్దగా మాట్లాడలేదు అని గుర్తొచ్చి కాస్త బాధనిపించింది. వెంటనే మంచు గారికి ఫోన్ చేసి "నథింగ్ టు వర్రీ.. అబౌట్ టు ఫ్లై.. మీరింక ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే చాలా రాత్రయిపోయింది కదా.." అని చెప్తే "కాంతి గారితో మాట్లాడావా.. నువ్వు జాగ్రత్త. వెళ్ళగానే ఒక మెయిల్ పెట్టు" అని చెప్పి పెట్టేసారు. ఆ రోజు ఉదయం నుంచీ కొంచెం ఒంట్లో బాలేక, మళ్ళీ సాయంత్రం నుంచీ టెన్షన్ పడీ పడీ ఉన్నానేమో ఫ్లైట్లో సర్దుకుని కూర్చోగానే ఒకేసారి రిలాక్స్ అయిపోయినట్టు అనిపించి మూసిన కన్ను తెరవకుండా విపరీతంగా నిద్రపోయాను. ఎంతలా నిద్రపోయానంటే ప్యారిస్ దాకా దాదాపు పన్నెండు గంటల ప్రయాణం ఎలా గడిచిందో నాకసలేం తెలీలేదు.

03.07.2013
బుధవారం
Charles de Gaulle Airport, Paris లో విమానం దిగేసరికి టైము సాయంత్రం ఐదు దాటింది. బాగా నిద్రపోయి లేచేసరికి అస్సలు ప్రయాణపు అలసటే తెలీలేదు. నేను మామూలైపోయేసరికి రాత్రి నేర్చుకున్న ఇంటర్నెట్ పాఠం గుర్తొచ్చేసి ఫోన్లోంచి నెట్ కనక్ట్ అయ్యి పారిస్ నుంచి అందరికీ హాయ్ చెప్పాను. తర్వాతి ఫ్లైట్ కి ఇంకా గంటే టైముంది కాబట్టి నేను సెక్యూరిటీ చెక్, కస్టమ్స్ చెక్ వగైరాలన్నీ పూర్తి చేసుకుని Munich వెళ్ళే ఫ్లైట్ గేట్ వెతుక్కుని వెళ్ళేసరికి ఆ పాటికే బోర్డింగ్ మొదలైపోయింది. అక్కడి నుంచి ప్రయాణం గంట సేపే కాబట్టి ఫ్లైట్లో కూర్చుని అలా ఒక పది పాటలైనా విన్నానో లేదో అంతలోనే మ్యూనిక్ వచ్చేసింది. Munich లో ఫ్లైట్ లాండ్ అవ్వగానే నా ఫోన్ ఆన్ చేసి అందరికీ ఇంకోసారి మ్యూనిక్ నుంచి హాయ్ చెప్పి మా ఇంటబ్బాయ్ కి కాల్ చేసాను. తను అప్పటికే వచ్చి నాకోసం ఎదురు చూస్తున్నాడు. అలా విమానంలోంచి దిగి ఇలా లగేజ్ తీసుకుని వెళ్ళిపోవడమే కాబట్టి హమ్మయ్యా కాసేపట్లో ఇంట్లో ఉంటాను అనుకుంటూ వెళ్ళాను. లగేజ్ కోసం చూస్తూ నించుంటే దూరంగా మా ఇంటబ్బాయ్ కనిపిస్తున్నాడు. ఎంతసేపటికీ నా సూట్కేస్ రాలేదని ఇద్దరం కాసేపు ఫోన్లో ఎయిర్ ఫ్రాన్స్ ని తిట్టుకుని తర్వాత నేను వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చి వచ్చేసరికి దాదాపు ముప్పావుగంట పట్టింది. రాత్రి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో "మా ఎయిర్ ఫ్రాన్స్ పరువు, ప్రతిష్ట.." అంటూ ఆవిడ చెప్పిన సోది గుర్తొచ్చి ఒళ్ళు మండిపోయింది. అక్కడ నించున్నంతసేపూ తెగ తిట్టుకుని కంప్లెయింట్ ఇచ్చాక బయటపడ్డాను. అప్పటికీ నా కడుపు మంట చల్లారక ఈ ఎయిర్ ఫ్రాన్స్ వాడు ఎంత దుర్మార్గుడు అన్న టాపిక్ మీద ఉపన్యాసం మొదలుపెట్టబోయి ముందు మంచు గారొచ్చారు తెలుసా ఎయిర్ పోర్ట్ కి అని ఆనందాన్ని ప్రకటించి అర్జెంటుగా నా కొత్త గాగుల్స్ కూడా చూపించేసాను. అప్పుడు మా తమ్ముడు ఎప్పుడూ చెప్పినట్టు ప్రతీ సీనూ క్లైమాక్స్ లా ఉండే కథలాగా రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు మా ఇంటబ్బాయ్ కి చెప్పడం మొదలుపెట్టాను. ఈ స్టోరీ డిస్కషన్ లో లీనమైపోయి మేము మా ఇంటి దగ్గర దిగాల్సిన బస్టాప్ మర్చిపోయి ముందుకెళ్ళిపోయాం. నేను గబుక్కున గమనించడం వల్ల నెక్స్ట్ స్టాప్ లో దిగేసాం. నేను "అయ్యో అలా మర్చిపోయామేంటి.." అంటే మా ఇంటబ్బాయేమో "నువ్వు స్టోరీలు చెప్పడం మొదలుపెట్టాక వినేవాళ్ళు బస్సేం ఖర్మ.. ఫ్లైట్ మిస్సయిపోయినా అందులో ఏం ఆశ్చర్యం లేదు కదా.." అన్నాడు. ఇద్దరం కలిసి నవ్వుకుంటూ ఎండాకాలం కాబట్టి అప్పుడప్పుడే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో చాలా రోజుల తర్వాత మా ఊరిని చూసిన ఆనందంలో "ఈ గాలి ఈ నేలా.." అనుకుంటూ సంబరంగా ఇంటికి వచ్చేశాం. ఇంట్లోకి రాగానే ముందు అమెరికా ఫోన్లన్నీ చేసి క్షేమంగా ఇల్లు చేరానని చెప్పి, కాంతి గారికైతే నేను అస్సలు అలసిపోలేదు అని సాక్ష్యంగా నా మొహం కూడా చూపించి అప్పుడు అన్నం తినేసి హాయిగా బజ్జున్నాను.
అలా నా శాన్ ఫ్రాన్సిస్కో డైరీలో ఇప్పటికి మాత్రమే ఆఖరుదైన ఈ చివరి పేజీ పూర్తయింది..!


~~~~~~~~~~~~~~~

నేను ఈ డైరీ రాయడం మొదలుపెట్టాక చాలా సందర్భాల్లో మధ్యలో పూర్తిగా రాయగలనో లేదోనని సందేహించాను. నా డైరీలో కబుర్లు చాలామందికి ఆసక్తికరంగా అనిపించి ఇంత ఇష్టంగా ప్రతీ పేజీ చదువుతారని అస్సలు ఊహించలేదు. ఇది రాయడం మొదలుపెట్టాక చాలా మంది దగ్గర్నుంచీ కొత్తగా వచ్చిన మెయిల్స్, మెసేజెస్ చూసి చాలా ఉత్సాహంగా అనిపించింది. నా రాతలు చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎక్కువగా మెచ్చుకోని మా అమ్మ "నీ డైరీ ప్రతీ పేజీ చదువుతున్నాను. నీతో పాటు పక్కనే నీ చెయ్యి పట్టుకుని తిరుగుతూ అన్నీ ప్రదేశాలని చూస్తున్నట్టు, నీ స్నేహితులందరితో మాట్లాడుతున్నట్టుంది. నీ డైరీ చదవడం ఎంత నచ్చుతోందంటే చదివాక అందరిలాగా నేను కూడా కామెంట్ రాస్తే బావుండు అనిపిస్తోంది. నువ్వు బంగారుతల్లివి కాబట్టే నీకెప్పుడూ అంత గొప్ప స్నేహితులు దొరుకుతారు" అని పొగిడేసినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. నేనిలా నా జ్ఞాపకాలు నాకొక్కదానికే పరిమితం చేసుకోకుండా అక్షరాల్లో కూర్చి అందరితో పంచుకోవడం కొందరికైనా సంతోషాన్ని కలిగిస్తుందంటే నేను మంచి పనే చేసాననిపిస్తోంది.
'నేను' అంటే నా స్నేహితులు, నా రాతలు, నా స్వేచ్ఛ.. అన్నీ కలిస్తేనే నేను అని స్వీకరించి నా సరదాలని, సంతోషాలని ఎప్పుడూ కాదనని మా ఇంటబ్బాయ్ కి బోల్డు థాంకులు చెప్పాలనిపిస్తోంది.
ఇంకా... నా వెనక, ముందు, పక్కన, ఇలా ఎప్పుడూ నా చుట్టూ ఉంటూ ఈ డైరీలోని ప్రతీ అక్షరాన్నీ దగ్గరుండి రాయించిన నా ప్రియాతి ప్రియమైన ప్రాణనేస్తాలకి.. ఈ డైరీలోని పేజీలే కాకుండా నా డైరీలోని ప్రతీ పేజీలోనూ బోల్డన్ని అందమైన రంగుల్ని నింపుతూ నేనెప్పుడూ నవ్వుల్లో వెలిగేలా అపురూపంగా చూసుకునే నిషి, కిరణ్ ప్రభ గారు, కాంతి గారుమంచబ్బాయ్ గారికి... బోల్డంత ప్రేమతో నా శాన్ ఫ్రాన్సిస్కో డైరీ అంకితం! :-)

23 comments:

cbrao said...

అయిపోయిందా! బాధగా వీడ్కోలు - ఈ డైరీకి.

బాల said...

“ఫ్రెంచ్ పోలేరమ్మ” భలే పేరు పెట్టారండి.
మళ్ళీ మీ style లో రాశారు డైరీ. నాలాంటి చిన్నపిల్లలు పొగిడితే బాగోదని పొగడటంలేదు కానీ, లేకపోతేనా..............

Padmaja said...

చాలా బాగుంది మధుర మీ San Francisco diary , మీ పేరు లాగే!

Kanthi Kiran said...

మధురా!
స్నేహానికి నిర్వచనం బహుశా నాకు తెలిసినంతలో నువ్వు చెప్పినంత బాగా ఎవరూ చెప్పలేరేమో!
నీ స్నేహం ఎంత తీయటి పరిమళమో, నీ చుట్టూ ఉన్న స్నేహితులు కూడా నీలానే ఉంటారని ఊహించని సర్ ప్రైజ్ సంఘటన 'మంచు గారనే మంచబ్బాయి' వల్ల జరిగినప్పుడు ఈ స్నేహ పరిమళం జర్మనీ నుండి డబ్లిన్ వరకూ వీచిందని తెలిసొచ్చింది.
తన స్నేహితురాలి సంతోషం కోసం ఆమె స్నేహితురాలి పుట్టిన రోజు అని ముందుగానే తెలుసుకుని బిజీ షెడ్యూల్లో ఉండి, ఆఫీస్ ఫోన్లు అటెండ్ అవుతూ అందమైన గులాబీలు, జర్మనీ చాక్లెట్స్,​ ​అంతకన్నా అందమైన శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్ కార్డుతో ప్రొద్దున్నే వచ్చి ఇంటి తలుపు తట్టి మరీ చెప్పిన మంచు గారి ఆత్మీయత నువ్వు రాసిన తియ్యని స్నేహానికి నిదర్శనం.
ఇంత అందమైన డైరీ లో ప్రతి పేజీలోనూ మా పేర్లు అలా కనపడుతుంటే ఆ వాక్యాలు చదివినప్పుడల్లా మాకు అనిపించేది ఒక్కటే 'నువ్వు మాకు Angel Friend' అని.

సిరిసిరిమువ్వ said...

చాలా బాగా వ్రాసావు మధురా. మమ్ముల్ని కూడా చెయ్యి పట్టుకుని నీ వెంట తిప్పేసావు. వందల సార్లు చూసిన వాళ్ళు కూడా ఇంత చక్కగా వర్ణించ లేరేమో! నీ జ్ఞాపకశక్తికి మాత్రం వావ్!

చివర్లో ఆ ఎయిర్ పోర్టు సీనులో నువ్వు కంగారు పడి మమ్ముల్ని కంగారు పెట్టినా మొత్తానికి సుఖాంతం చేసావు.

ఇంతకీ నీ లగేజి నీ దగ్గరకి ఎన్ని రోజులకి చేరింది!

స్నేహ said...

మధురవాణి గారు,

మీ డైరీ మొత్తం ఆపకుండా చదివించేసారు.అంతా చదివేసాకా మీ అమ్మగారు చెప్పినట్టు "నువ్వు బంగారుతల్లివి కాబట్టే నీకెప్పుడూ అంత గొప్ప స్నేహితులు దొరుకుతారు" అన్న మాట నిజ్జంగా నిజం అనిపించింది.

I felt very happy reading your dairy Thank you so much for sharing with us

ఫోటాన్ said...

చాలా బాగుంది, బాగా రాసారు. :)

Sudha said...

Madhura!
One thing came to my mind after finishing reading your diary is "She is being very honest". Great job and it is going to be one of your sweetest memories!!

Chandu S said...

మధురా, ఎంత బాగా రాశావో చెప్పలేను. నువ్వు సంతోషపడితే మాక్కూడా సంతోషం. నువ్వు దిగులుపడితే మాక్కూడా దిగులు. చాలా మంచి అనుభూతిని మిగిల్చావు. చివరి పార్ట్ మాత్రం అయ్యో అయిపోతోందే అయిపోతోందే అనుకుంటూ చదివాను. చదివిన తర్వాత చెప్పాలనుకున్నవన్నీ కామెంట్ లో పెట్టలేకపోయాను. నిజం.

ఈ లైన్స్ బాగా నచ్చాయి.


నువ్వు బంగారుతల్లివి కాబట్టే నీకెప్పుడూ అంత గొప్ప స్నేహితులు దొరుకుతారు

Unknown said...

చాలా బాగున్నాయి మీ కబుర్లు మధుర గారు. అంత ఆత్మీయంగా మీకు ఆతిథ్యం ఇచ్చిన మీ స్నేహితులకు కూడా జోహార్లు.

శ్రీనివాస్ పప్పు said...

మొత్తానికి నీ డైరీ మాచేత వదలకుండా చదివిస్తూ మమల్ని కూడా చేయిపట్టి అన్ని ప్రదేశాలూ చూపిస్తూ,ఆ అనుభూతుల్ని మాకు కూడా పంచినందుకు థాంక్సో. చివర్లో మా మంచుకొండతో ఫినిషింగ్ టచ్ హార్ట్ టచింగ్.

చివరిగా పైన కాంతి గారు చెప్పినట్టు ఇంత అందమైన డైరీ లో ప్రతి పేజీలోనూ మా పేర్లు కనపడకపోయినా, చదివినప్పుడల్లా మాకు అనిపించేది ఒక్కటే 'నువ్వు మాకు Angel Friend అని

జయ said...

మధుర గారు, ఇన్ని మధురమైన అనుభవాలను మూటగట్టుకున్న మీ అదృష్టానికి, అభినందనలు.

మధురవాణి said...

@ cbrao,
హ్మ్.. అయిపోయిందండీ.. ధన్యవాదాలు.

@ బాల,
ఆవిడకి తగ్గ పేరు అదేనని పెట్టేసానండీ.. థాంక్స్ డైరీలో పేజీలన్నీ ఆసక్తిగా ఫాలో అయినందుకు..
అయితే మీరు పేరుకి తగ్గట్టు చిన్నపిల్లలేనన్నమాట.. :)

@ పద్మజ గారూ,
ధన్యవాదాలండీ.. :)

@ Kanthi Kiran,
కదా అసలు.. మంచు గారిచ్చిన మీ పుట్టినరోజు సర్ప్రైజ్ మాత్రం మీతో పాటు నాక్కూడా సూపర్ సర్ప్రైజ్.. భలే గొప్ప జ్ఞాపకంలే ​మనకి! :-) ఈ డైరీ ప్రతి పేజీలోనూ మీ పేర్లున్నాయి కాబట్టే ఇంతందంగా ఉంది తెలుసా.. నా బ్లాగులో మీ సంతకం చూడటం చాలా సంబరంగా ఉంది. దానికొక్కదానికి మాత్రం థాంక్స్ చెప్తానేం.. ;-)​

మధురవాణి said...

@ సిరిసిరిమువ్వ,
అన్నీ అలా వివరంగా గుర్తుండిపోయాయండీ.. అందుకే రాయగలిగాను. నాతో పాటు నా జ్ఞాపకాల్లో విహరించినందుకు, నా సంతోషాన్ని పంచుకున్నందుకు ఆనందంగా ఉంది.​ బోల్డు ధన్యవాదాలు.

ఆ తర్వాత నా లగేజీ మూడు రోజులకి ఇంటికి చేరింది. కాకపోతే ​నేను వచ్చింది ఇంటికే కాబట్టి ఇబ్బందేం పడలేదు. :)

@ స్నేహ,
హహ్హహ్హా.. అంతేనంటారా అయితే.. మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలు. :-)

@ ఫోటాన్,
థాంక్స్.. :)

@ Sudha,
Yeah.. This surely is one the most memorable trips I had! Thank you so much for your nice words. Very happy to hear them. :-)

మధురవాణి said...

​@ ​Chandu S,
​మీ కామెంట్ మళ్ళీ మళ్ళీ చదువుకున్నానండీ.. మీ నుంచి ఇలాంటి స్పందన చూడటం చాలా సంతోషంగా అనిపించింది. బోల్డు ధన్యవాదాలు.

@ Praveen Garlapati,
మొదటిసారి నా బ్లాగుకి వచ్చినట్టున్నారు.. స్వాగతం ప్రవీణ్ గారూ.. :)
నా డైరీ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

@ శ్రీనివాస్ పప్పు,
బుల్లెబ్బాయ్ గారూ.. ​నిన్నటి నుంచీ ఆలోచించినా మీరన్న మాటలకి సరితూగే మాటలు నాకు దొరకలేదు బదులు చెప్పడానికి.. థాంక్స్ చెప్తే చాలా తక్కువైపోతుందని చెప్పాలనిపించడం లేదు.. ధన్యోస్మి! :-)

@ జయ గారూ,
హృదయపూర్వక ధన్యవాదాలండీ.. :)

నిషిగంధ said...

వీడ్కోలు.. సముద్రం.. స్నేహం.. వీటి గురించి చాలామంది మాటల్లో విన్నవే కానీ, ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అయినట్లు అనిపిస్తోంది! చాలా బాగా చెప్పావు, వీటి గురించి!

రోజుల బట్టి చూస్తే లెక్క తక్కువే కానీ జ్ఞాపకాలని బట్టి చూస్తే ఏంటో బోల్డన్ని గంటలు, రోజులు కలిసి గడిపినట్టు అనిపిస్తోంది!
కష్టపడి ప్రతి క్షణాన్నీ ఇలా చక్కగా ఫ్రేమ్ చేసి మాకిచ్చినందుకు ఎంతలా థాంక్స్ చెప్పినా తక్కువే, మధురా!!!

I know it's not an easy job and am really glad to be part of this amazing diary! THANK YOU!! :-)


అనామిక said...

చిన్న చిన్న అనుభవాలని కూడా అందంగా చెప్పగలరు మీరు, అలాంటిది ఇంత అందమైన పేజీలని ఇంకా అందంగా చెప్పారు.. enjoyed reading your dairy..

వేణూశ్రీకాంత్ said...

హ్మ్... ఏంటోనమ్మా ఈ పోస్ట్ నిండా మర్చిపోవడం తప్ప నాకేం కనపడలేదు :-) కార్లో మర్చిపోయాను, షాప్లో మర్చిపోయాను ఇంట్లో మర్చిపోయాను అక్కడ మర్చిపోయాను ఇక్కడ మర్చిపోయాను అని చదివి ఒక చోటకి వచ్చేసరికి ఇంకా ఎన్ని మర్చిపోతావ్ మధురా అని నవ్వుకున్నాను, ఆఖరికి మీ ఎయిర్ లైన్స్ వాళ్ళు కూడా నీ లగేజ్ మర్చిపోయారు :-P జోక్స్ అపార్ట్ నిజంగా ఎంత ఖంగారు ఖంగారుగా హడావిడిగా ఉండి ఉంటుందో కదా... ఒక వైపు ఊరెళ్ళిపోవాలి అన్నీ చూసుకోవాలి, ఒక వైపు బెస్ట్ ఫ్రెండ్ ని మొదటి సారి కలవడం, ఇంకోవైపు అంత అందమైన వెకేషన్ కి ముగింపు. ఎన్నిరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండి ఉంటాయో.. నీ గొప్పదనం ఏవిటంటే అవన్నీ నీ అక్షరాలతో మా కళ్ళకు కట్టినట్లు చూపించేశావ్.

ఫ్రెండ్షిప్ గురించి ఈ పోస్ట్ లో చెప్పిన మాటలు చాలా బాగున్నాయ్... నిజానికి నీ డైరీ ఇంత అందంగా ఉండి మా అందరిచేత ఆసక్తిగా చదివించడానికి ఒక కారణం అదే.. ఫలానా చోట ఉన్నాను తిన్నాను చూశాను అని పొడిపొడిగా బుల్లెట్ పాయింట్స్ లో లిస్ట్ చేయకుండా ప్రతిచోటునీ అక్కడి చిన్న చిన్న వివరాలని గుర్తుంచుకుని వాటిని నీ అనుభూతులతో ఆలోచనలతో కలిపి అందమైన పూమాలలా అల్లి మా ముందు పరిచావు అందుకే అంత ఆసక్తిగా నీతోపాటు పయనిస్తూ క్రమం తప్పకుండా చదవగలిగాం.

నీ ఫ్రెండ్స్ గురించి మీ అమ్మగారు ఒక్క లైన్ లో భలే చెప్పారు, What you give is what you get అని ఏదో నానుడి ఉందికదా.. అలా నువ్వు ఇంత అమాయకంగా స్వచ్చమైన స్నేహాన్ని పంచుతావు కనుకే నీ స్నేహితుల నుండి అలానే అందుకోగలుగుతున్నావు. మిగతా వారి గురించి నాకు ఇదివరకే కొద్దో గొప్పో తెలిసినా ముఖ్యంగా ఈ డైరీ చదివి కాంతి కిరణ్ గారి గురించి కిరణ్ ప్రభ గారి గురించి కాస్తైనా తెలుసుకోవడం మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

మీ ఇంట్లో ప్లానింగ్ దగ్గర నుండి మొదలుపెట్టి ఒక నెల రోజులుపాటు మా చేయి పట్టుకుని నీ వెంటే తీసుకువెళ్ళి అందమైన బే ఏరియా అంతటినీ అంతకంటే అందమైన నీ నేస్తాలని మాఅందరకూ చక్కగా పరిచయం చేసినందుకు నీకు బోలెడన్ని ధన్యవాదాలు, ఖచ్చితంగా నేను స్వయంగా వెళ్ళి చూసినా ఇంతటి అనుభూతిని పొందేవాడ్నికాదు. నిషి చెప్పినట్లు ఇట్స్ నాటె ఈజీ టాస్క్, అయినా ఆ సంతోషం కూడా తక్కువేమి కాదు కనుక ఇలాంటి అందమైన జ్ఞాపకాలతో కూడిన ట్రిప్స్ నువు తరచూ వెళ్తుండాలని ఆ విశేషాలు మాకు కూడా చూపించాలనీ కోరుకుంటున్నాను :-)

మధురవాణి said...

@ ​నిషిగంధ,
కవయిత్రి నిషిగంధ గారిని మెప్పించగలిగినందుకు ​
చాలా సంతోషంగా ఉందమ్మాయ్.. :-)
ఊ.. నిజమే.. గడిచిన క్షణాల కన్నా జ్ఞాపకాల బరువే ఎక్కువనిపిస్తోంది నాక్కూడా.
It's all my pleasure ma'am.. Thank you! :-)

@ అనామిక,
మీ అభిమానపూర్వక వ్యాఖ్యకి ధన్యవాదాలండీ..

@ వేణూశ్రీకాంత్,
డైరీ మొదటి పేజీ దగ్గర్నుంచీ ప్రతీదీ ఆసక్తిగా చదువుతూ బోల్డంత ప్రోత్సాహాన్ని అందించినందుకు బోల్డు బోల్డు ధన్యవాదాలు.. నీకు థాంక్స్ చెప్తే చాలా తక్కువైపోతుంది వేణూ.. అయినా సరే ఈసారికిలా చెప్పేస్తున్నాను.. THANK YOU SO MUCH! :-)

కొత్తావకాయ said...

మళ్ళీ వచ్చి చదూకున్నాను మీ డైరీ. నిషి ఓసారెప్పుడో చెప్పినట్టూ.. బరువెక్కువనుకోకుండా బోలెడు జ్ఞాపకాలు తీసుకెళ్ళారు. హేపీ ఫర్ యూ!

మధురవాణి said...

​@ కొత్తావకాయ,
థాంక్యూ సో మచ్! ​​నిజమేనండీ.. అనుకోకుండా అన్నీ అలా కలిసొచ్చి పెద్ద జ్ఞాపకాల మూటే దక్కిందండీ ఈసారికి.. ​:-)

రాధిక(నాని ) said...

మీ డైరీలో లాస్ట్ పేజీ చాలా రోజులనుండి చదవక ఎంత మిస్సయానో ఇప్పుడు తెలిసింది .నాలుగైదు సార్లు చదివాను.స్నేహానికి చక్కటి నిర్వచనాలు ఇచ్చారు .
>>ఎప్పుడూ నవ్వుతూ ఎంతో ధైర్యంగా ఉండేవారికైనా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. వసంతమూ, వానే కాకుండా అడపా దడపా పిడుగులు, వరదలు, శిశిరాలు పలకరించిపోతుంటాయి. ​అవన్నీ ​మన పక్కనుండి ఓపిగ్గా దాటించి మళ్ళీ మనల్ని నవ్వుల లోకంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునే స్నేహితులు ఒకరు ఉండాలిగా మరి..>>అద్భుతం! ఇలా చెప్పగలగటంకూడా దేవుడిచ్చిన వరం .


నువ్వు చాలా బంగారుతల్లివి కాబట్టే నీకెప్పుడూ అంత గొప్ప స్నేహితులు దొరుకుతారు >> మీ అమ్మగారు నీ గురించి కరెక్ట్ గా చెప్పారు ..నిజంగానే మీరు పంచే స్నేహం వల్లే మీక్కూడా అంత మంచి స్నేహితులు దక్కారు..

మీ మధుర స్నేహాలు కలకాలం నిలవాలని కోరుకుంటున్నా :)

మధురవాణి said...

@ రాధిక(నాని),
So nice of you Radhikaa.. Thank you so much for your response! :-)