21.06.2013
శుక్రవారం
నిన్న బయట
తిరుగుతున్నప్పుడు ఆ హడావుడి, గోలలో ఫోన్ మోగిన సౌండ్ వినపడక మా ఇంటబ్బాయ్ కాల్ మిస్సైపోయానని కొంచెం బెంగగా అనిపించింది. తెల్లారితే తన సిడ్నీ ప్రయాణం కదా
అన్నీ సరిగ్గా సర్దుకున్నాడో లేదో, తను ఊరెళ్ళే సమయానికి నేనింట్లో
ఉంటే బావుండేది కదా.. అని రకరకాల ఆలోచనలతో రాత్రి నిద్ర పట్టలేదు చాలాసేపు. అప్పటికే జర్మనీలో శుక్రవారం
వచ్చేసి ఉంటుంది కాబట్టి
బయలుదేరే ముందు నాకు ఫోన్ చేస్తే "అది సర్దుకున్నావా, ఇది పెట్టుకున్నావా, లైట్లన్నీ ఆపావా, కిటికీలు వేసావా.." లాంటి
రొటీన్ ప్రశ్నలన్నీ
ఒక్కోటీ అరడజను సార్లు అడిగాను. ఇంకా నా ప్రశ్నాపత్రం పూర్తి కాకముందే
"నేను వెళ్ళేది స్కూలుకి కాదు కాన్ఫరెన్స్ కి.. నువ్వేం వర్రీ అవ్వకుండా హేపీగా
ఎంజాయ్ చెయ్యి. వీలున్నప్పుడు ఫోన్లోనో, మెయిల్లోనో కనిపిస్తుంటాను.
ఇంక నిద్రపో" అని ఫోన్ పెట్టేసాడు. తన ఫ్లైట్ టేకాఫ్ ముందు పెట్టిన మెయిల్
తెల్లవారు జామున చూసుకున్నాక కాస్త స్థిమితంగా అలా కొంచెంసేపు నిద్రపోయానో లేదో
వెంటనే లేపేసినట్టు అనిపించింది. నా గొంతు నొప్పి ఇంకొంచెం పెరిగినట్టుంది. అప్పటికే ఉదయం ఆరు గంటలు దాటింది టైము. నేను తప్ప అందరూ
తయారైపోయారు. హడావుడిగా నేను కూడా తొందరగా తెమిలి మేము ఇంట్లోంచి బయటపడేసరికి ఏడు
దాటింది.
ఈ రోజు ప్రయాణం మా
ఇంటి నుంచి మూడు గంటల దూరంలో ఉన్న Yosemite National park కి. ఒక గంట ప్రయాణం తర్వాత మధ్యలో
ఆగి Denny's రెస్టారెంట్లో హెవీ
బ్రేక్ ఫాస్ట్ చేసి మళ్ళీ
బయలుదేరాం. "మీరొక్కరే డ్రైవ్ చేస్తే అలసిపోతారేమో.. కాసేపు నేను కూడా డ్రైవ్
చేస్తానండీ.." అని నిషి అడిగితే "అదేం సమస్య కాదులేమ్మా.. మీరు హాయిగా కూర్చుని
కబుర్లు చెప్తూ ఉండండి. సరదాగా అవన్నీ వింటూ వెళ్ళిపోదాం" అన్నారు కిరణ్ ప్రభ గారు. ఏదో మాటల్లో మాట మొదలై
కిరణ్ ప్రభ గారి కాలేజీ
రోజుల వైపు, అప్పటి కవిత్వం వైపు వెళ్ళిపోయాం. సంవత్సరాలు, తేదీలతో సహా అప్పటెప్పటివో
విశేషాలు కళ్ళకి కట్టినట్టు చెప్తుంటే ఆసక్తిగా మధ్యలో ప్రశ్నలు అడుగుతూ అక్కడక్కడా ఎదురుపడే పాత్రల గురించి మళ్ళీ
గుర్తు చేస్తూ ఒక్కొక్కరి కథ పూర్తిగా చెప్పించుకున్నాం. కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ గార్ల పేర్లలో 'కిరణ్' అని వాళ్ళిద్దరూ పరిచయం కాక ముందు నుంచే ఉందని
తెలుసుకుని బోల్డు ఆశ్చర్యపోయాం. అసలు ఆ కబుర్లన్నీ ఎంత ఆసక్తిగా ఉన్నాయంటే మేము ప్రయాణం
సంగతి మర్చిపోయి దృష్టి అంతా కబుర్ల మీదే పెట్టేసి అదేదో ముచ్చట్లు చెప్పుకోడానికే వచ్చిన ట్రిప్ లా ఒకదాని వెంట ఒకటి అలా కథలు
చెప్పుకుంటూనే ఉన్నాం సాయంత్రం దాకా. నేనైతే నా గొంతునొప్పిని గాలికి వదిలేసి
రోజంతా మాట్లాడుతూనే ఉన్నాను. మొత్తం నలుగురం కలిసి తలా కాసేపు స్కూలు, కాలేజ్, టీనేజ్, చదువులు, ఉద్యోగాలు, కలంస్నేహాలు, మామూలు స్నేహాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు... ఇలా ఒక్కటి కూడా వదలకుండా అందరివీ
ఎప్పటెప్పటి డైరీలో తెరిచి చదివేసాం. అందులో ఎదురుపడిన రకరకాల వ్యక్తుల మనస్తత్వాల
గురించి, ఆయా సందర్భాల
గురించి విశ్లేషించుకుంటూ ఆ రోజంతా చాలా ఉత్సాహంగా గడిచింది.
Yosemite వెళ్ళాక లోపల తిరిగి చూసేదే కాకుండా ఆ వెళ్ళే దారిలో డ్రైవ్ చాలా బాగుంటుందని కిరణ్ ప్రభ గారు చెప్పారు. నిజంగానే మా ప్రయాణమంతా తిరుమల కొండ మీదకి వెళ్ళినట్టు పెద్ద పెద్ద కొండల అంచుల్లో వేసిన ఘాట్ రోడ్డులో సాగింది. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ సహజసిద్ధంగా అడవి లాంటి కొండలు, లోయలు, జలపాతాలతో ఏర్పడింది. ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం అక్కడ ఏర్పడిన పెద్ద పెద్ద గ్రానైట్ కొండలు, మంచు కొండలు, జలపాతాలు, అక్కడున్న రకరకాల వృక్షసంపద, జంతువులు, పక్షులతో కూడిన జీవవైవిధ్యం.. వీటన్నిటి విలక్షణతని బట్టి ఈ పార్క్ ని UNESCO world heritage siteగా గుర్తించారు. అంత ఎత్తైన కొండల నడుమ నుంచీ ప్రయాణించడం, సహజంగా ఏర్పడిన అంత పెద్ద గ్రానైట్ రాళ్ళు, అక్కడక్కడా కొండలపైన కురిసిన మంచు కరిగి ఏర్పడిన చిన్న చిన్న ప్రవాహాలు, కొండల మీద నుంచి జారుతున్న జలపాతాలు.. ఇవన్నీ చాలా ఆహ్లాదంగా అనిపించాయి. అక్కడ ఏరుల్లో పారుతున్న నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే నీళ్ళ అడుగున ఉన్న ప్రతీ చిన్న గులకరాయి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతిని ఎక్కువ ధ్వంసం చెయ్యకుండా ఉన్నది ఉన్నట్టు ఉండనిస్తే ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటుందో కదా అనిపించింది అక్కడ తిరుగుతున్నంతసేపూ.
Yosemite పార్క్ లోపల అలా అలా ప్రయాణిస్తూ
మ్యాప్లో చూపించిన ప్రకారం ప్రత్యేకమైన విస్టా పాయింట్స్ దగ్గర ఆగుతూ ప్రకృతిలోని వైవిధ్యాన్ని, అద్భుతాలని చూసి సంబరపడుతూ ముందుకి సాగిపోయాం. నడి
వేసవికాలం అవడం వల్లనుకుంటా జలపాతాల్లో నీరు తక్కువగా ఉంది. ఇదివరకు వచ్చినప్పుడు చాలా నీళ్ళున్నాయని కాంతి గారు చెప్పారు.
మధ్యాహ్నం అయ్యేసరికి తిరిగీ తిరిగీ సగం, కబుర్లు చెప్పుకుని సగం అలసిపోయి లంచ్ కోసం వెతుక్కున్నాం. మేము వెళ్ళిన చోట గ్రిల్డ్ మీట్, సలాడ్స్ తప్ప ఎక్కువేం లేక అందరం ఆ
పూటకి ఆకులు, అలములూ
భుజించేసరికి టైము రెండు దాటింది. ఆ రోజు
ఎండ కూడా విపరీతంగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువసేపు ఎండలో తిరిగే ఓపిక మాకెవరికీ లేదు.
అప్పుడు వెనక్కి బయలుదేరితే అలా అలా దారిలో అన్నీ చూసుకుంటూ Yosemite పార్క్ నుంచి బయటపడేసరికి నాలుగు గంటలవుతుంది అనుకున్నాం. మధ్యలో ఒక చోట పెద్ద పెద్ద గ్రానైట్ కొండలన్నీ వరసగా ఉన్న చోట
నేనూ, నిషి పైన మాడుతున్న
ఎండ సంగతి కూడా మర్చిపోయి మా ఫోటోగ్రఫీ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే పని పెట్టుకున్నాం. నిజంగా అసలు ఎంత పెద్ద కొండలో అవి..
వాటి ముందు మేము చీమలంత చిన్నగా
ఉన్నాం అనిపించింది! అక్కడొక అరగంట సేపు ఎండలో మాడిపోయేసరికి మా ఓపిక పూర్తిగా హరించుకుపోయింది. Yosemite నుంచి బయటపడేసరికి నాలుగున్నర
అయింది. తర్వాత దారిలో ఒక చోట ఫ్రూట్ ఫార్మ్ దగ్గర స్ట్రాబెర్రీస్ కొనుక్కుని, స్టార్ బక్స్ లో వైట్ చాకొలేట్ మోకా కొనుక్కుని ఇంకెక్కడా ఆగకుండా మా కథలు చెప్పుకోడం కొనసాగిస్తూ
ఇంటికొచ్చేసాం.
మేము సాయంత్రం
ఇంటికొచ్చేసరికి టైము ఏడున్నర కావొస్తోంది. మళ్ళీ అందరం చకచకా ఫ్రెష్ అయిపోయి
చిమట శ్రీని గారింటికి డిన్నర్ కి వెళ్ళాలని మాకున్న ప్లాన్. అందుకని ఏ మాత్రం బ్రేక్
లేకుండా మళ్ళీ హడావుడిగా
బయలుదేరిపోయాం. మేము బయలుదేరే
టైముకి చీకటి అప్పుడప్పుడే పడుతోంది. ఇంకో రెండు రోజుల్లో 'సూపర్ మూన్' గా మారబోయే చందమామ అప్పటికే
మిలమిలా మెరిసిపోతున్నాడు. San Ramon లో ఉన్న శ్రీని గారింటికి వెళ్ళే దారిలో అన్నీ ranches ఉన్నాయి. ఆ కొండల వెనక
చంద్రోదయం, తెల్లగా కురిసే
వెన్నెల్లో మరింతగా మెరిసిపోతున్న కొండలనీ చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. "మీ అమెరికా చంద్రుడు గొప్ప అందగాడండీ"
అంటే నిజమేనంటూ అందరూ నవ్వారు. శ్రీని గారి ఇల్లున్న కాలనీ పేరు sleeping meadow అని చూసి భలే
అందమైన పేరు పెట్టారనిపించింది. ఆ ప్రదేశం కూడా కొండల మధ్యలో నిశ్చింతగా నిదురిస్తున్నంత ప్రశాంతంగానే ఉంది. మేము శ్రీని గారింటి
దగ్గర్లోకి వెళ్ళాక ఇల్లు వెతుక్కోడానికి కాస్త అయోమయంలో పడ్డాం. ఈ GPS నిద్రపోతున్నట్టుంది
అంటూ సరదాగా జోక్స్ వేసుకుని GPS లో వినిపించే అమ్మాయి
గొంతుని బట్టి ఆవిడకో పేరు పెడదాం అనుకున్నాం. ఎంతైనా మనకి దారి చూపే దేవత కదా పాపం అని 'జయసుధ' అని పేరు పెట్టేసి చాలా నవ్వుకున్నాం.
"మీరు ఇప్పుడు ఇలా అల్లరి చేస్తూ ఎంత నవ్విస్తారో రేపు మీరిద్దరూ వెళ్ళిపోయాక మాకు ప్రతీ
చోటా మీ మాటలు గుర్తుకొచ్చి
ఇంతకింతా దిగులు
పుట్టించేస్తారు తెలుసా.." అన్నారు కాంతి గారు. అంత నవ్వుల్లోంచి ఓ క్షణం నిశబ్దం
అయిపోయాము అందరమూ. అంతలో శ్రీని గారిల్లు వచ్చేసింది.
శ్రీని గారింట్లో అప్పటికే
సాహిత్య, సంగీతాభిరుచులు
కలిసే మిత్రులు కొందరు వచ్చి ఉన్నారు. పాడుతా తీయగా కార్యక్రమం రోజు పరిచయం అయిన గోకుల్ గారితో పాటు ఇంకా కొత్తవారు
కొందరు ఉన్నారు. శ్రీని గారి శ్రీమతి గారు, వారి ఇద్దరమ్మాయిలతో
కబుర్లు చెపుతూ కూర్చున్నాం కాసేపు. రోటీల దగ్గర్నుంచీ బిర్యాని, డబుల్ కా మీటా దాకా ఏర్పాటు చేసిన
హెవీ డిన్నర్ అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముగించి అప్పుడు తీరిగ్గా సంగీత చర్చలు మొదలెట్టాము. అంతకు కొద్ది రోజుల
ముందే చిమట మ్యూజిక్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సినిమా పాటల క్విజ్ లో ప్రశ్నలుగా అడిగిన
కొన్ని పాటల బిట్స్ వినిపించి అవేంటో కనిపెట్టమన్నారు శ్రీని గారు. మధ్య మధ్యలో ఒక్కో పాట చరిత్రలోకి వెళ్ళిపోయి ఎప్పటెప్పటివో పాటల
గురించి అందరూ బోల్డన్ని విశేషాలు చెప్తుంటే వింటూ కూర్చున్నాం. మధ్యలో నిషి రాసిన 'ఊసులాడే జాబిలట' నవల గురించి కూడా వాళ్ళందరూ తమ
అభిప్రాయాలు చెప్పారు. శ్రీని గారింటి తోటలో కాసిన ప్లమ్స్ తింటూ ఇంకాసేపు కబుర్లు
చెప్పుకున్నాక మాకు తెలీకుండానే నిద్రకి కళ్ళు వాలిపోసాగాయి. ఉదయం నుంచీ ఎండలో
తిరిగీ తిరిగీ ఆ అలసటకి బాగా నిద్రొచ్చేస్తోంది. అప్పటికే టైము అర్ధరాత్రి పన్నెండు దాటిపోయేసరికి అంత చక్కటి భోజనం, సాహితీ సంగీత కబుర్లతో విందు
ఏర్పాటు చేసిన శ్రీని గారి దంపతులకి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరిపోయాము.
మేము ఇంటికి
తిరిగొచ్చేసరికి అర్ధరాత్రి ఒంటిగంట దాటినా తెల్లారి సాయంత్రం నిషి ఊరెళ్ళిపోతుంది కదా
అన్న దిగులుతో మాకు వెంటనే వెళ్ళి నిద్రపోవాలనిపించలేదు. ఒక పక్క కళ్ళు మూతలు పడిపోతున్నా సరే అలాగే కష్టపడి ఇంకో గంటసేపు
కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం ముగ్గురం. అప్పటి మా నిద్ర మొహాల ఫోటోలు చూస్తే చాలా
నవ్వొస్తుంది. అర్ధరాత్రి
రెండున్నర దాటాక వెళ్ళి పడుకున్నాం రేపటి గురించిన బెంగతో..!
22.06.2013
శనివారం
ఈ రోజు మా ఉదయం ఎలా
మొదలైందో నిషి మాటల్లో...
~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~
అదొక యధాలాపపు
ఉదయం..
ఎప్పుడోనే మెలకువ వచ్చేసినా క్రితం రోజు తిరిగిన అలసట శరీరాన్ని లేవనీకుండా బుజ్జగిస్తోంది..
ఇంతలో పక్కన్నుంచి ఏదో ఒక పాట.. లీలగా.. కొంచెం విన్నదే.. ఇష్టమున్నట్టనిపిస్తున్నదే!
అంతే! నాగస్వరం విన్న నాగినిలా సగం మూసిన కళ్ళతో వెళ్ళిపోయాను..
తను బోర్లా పడుకుని ఉన్నా.. మెలకువగానే ఉన్నట్టు పాటకి చిన్నగా, లయబద్దంగా కదులుతున్న పాదాలు చెప్తున్నాయి..
ఆ పాదాలు చూస్తే తగిలీ తగలని ఉదయపు చలికి ముడుచుకున్న బుజ్జి పావురాలు గుర్తొచ్చాయి!
అలికిడికేమో? తలెత్తి తను నా వైపు చూడగానే... 'ఎందులోదీ పాట?' అని అడుగుతూ, సమాధానం కోసం చూడకుండా తనని దాటి, మంచం మీద ఖాళీగా ఉన్న అటువైపుకి... పెద్ద కిటికీ వైపుకి చేరుకున్నా..
తను కాస్త సర్దుకుని ఇంకాస్త చోటివ్వగానే, కంఫర్టర్ లో కూడా భాగం తీసేసుకుని.. కంఫర్టబుల్‌గా పక్కనే సెటిల్ అయిపోయి... తీరిగ్గా కళ్ళెత్తి పక్కకి చూశాను..
కిటికీ నిండా.. అంచుల గుండా.. నీలంగా.. ఒదిగిపోయిన ఆకాశం!!
నిర్మలంగా, నిశ్చలంగా కనిపిస్తూనే.. మృదువుగానే.. పట్టి లాగేసుకుంటోంది.. కళ్ళు తిప్పనీయడంలేదసలు!
అబ్బాయిలు నీలం రంగు ఎందుకు ప్రిఫర్ చేస్తారో కాస్తేదో అర్ధమైనట్టనిపించింది!!
పక్కనే ఉన్న పేరు తెలీని ఓ పెద్ద చెట్టు ఆకులు మెల్లగా బాలే చేస్తున్నాయి.. ఎవరన్నారు గాలిని చూడలేమని!?!?
బయటకే అనేశాననుకుంటా! వెంటనే తను వెల్లకిలా తిరిగి, "నిన్నరాత్రి చూడాల్సింది.. నిండు చందమామ.. కిటికీ పక్కనే.. చేతులు చాచితే అందేట్టు.. అందంగా నవ్వుతూ" అనగానే...
'నిజమా! మరి నన్ను పిలవాల్సింది!' ఏదో అద్భుత ఘట్టం మిస్సైపోయిన ఫీలింగ్ నాలో!
"అనుకున్నా పిలుద్దామని కానీ అప్పటికే చాలా అలసిపోయాం కదా! నిద్ర పోనిద్దాంలే అనుకున్నాను", రాత్రెప్పుడో మిస్సైతే మిస్సయ్యా కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రశాంత చందమామ నవ్వు తన మొహంలో!
'ఇంతకీ ఈ పాట ఎందులోదీ?' ఎప్పుడో పూర్వజన్మలో అడుగుదామనుకున్న ప్రశ్న నెమ్మదిగా బయటకొచ్చింది..
"ఎందులోదేమిటీ!! మొన్న నీకు పంపానుగా! బావుంది వినమని" ఆక్షేపణగా తన గొంతు..
'యా, పంపావు.. కానీ తెల్సుగా.. చాలా బిజీలో విన్నాను.. సో, అంత ఎక్కలేదు' కాస్త అపాలజిటిక్‌గా అంటూనే 'ఇప్పుడు వింటుంటే చాలా బావుంది!' అని సిన్సియర్‌గా ఒప్పుకున్నా...
"ఇది సరే.. అందులో.. ఈ పాట విన్నావా?...." అంటూ తను ఇంకేదో చెప్పింది....
అలా.. అలా... ఎంతసేపు ఎన్ని పాటల గురించి.. పుస్తకాల గురించి.. బట్టల గురించి.. వాటి గురించి.. వీటి గురించి.. ఆ విప్పారిన నీలాకాశం సామీప్యంలోనే మాట్లాడుకున్నామో!!
నిజంగానే అదొక యధాలాపపు ఉదయం.. But, Thanks to Madhura it was an unforgettable casual morning!!
ఇంతకీ ఆ పాటేంటంటే.......... స్నేహమూ నువ్వే.. సంతోషమూ నువ్వే.. ఆత్మలోన నువ్వే.. అనుభూతిలోన నువ్వే.. నేను ఏరి కోరుకున్న కొత్తజన్మ నువ్వే!
:-)
~~~~~~~~~~~~~
ఎప్పుడోనే మెలకువ వచ్చేసినా క్రితం రోజు తిరిగిన అలసట శరీరాన్ని లేవనీకుండా బుజ్జగిస్తోంది..
ఇంతలో పక్కన్నుంచి ఏదో ఒక పాట.. లీలగా.. కొంచెం విన్నదే.. ఇష్టమున్నట్టనిపిస్తున్నదే!
అంతే! నాగస్వరం విన్న నాగినిలా సగం మూసిన కళ్ళతో వెళ్ళిపోయాను..
తను బోర్లా పడుకుని ఉన్నా.. మెలకువగానే ఉన్నట్టు పాటకి చిన్నగా, లయబద్దంగా కదులుతున్న పాదాలు చెప్తున్నాయి..
ఆ పాదాలు చూస్తే తగిలీ తగలని ఉదయపు చలికి ముడుచుకున్న బుజ్జి పావురాలు గుర్తొచ్చాయి!
అలికిడికేమో? తలెత్తి తను నా వైపు చూడగానే... 'ఎందులోదీ పాట?' అని అడుగుతూ, సమాధానం కోసం చూడకుండా తనని దాటి, మంచం మీద ఖాళీగా ఉన్న అటువైపుకి... పెద్ద కిటికీ వైపుకి చేరుకున్నా..
తను కాస్త సర్దుకుని ఇంకాస్త చోటివ్వగానే, కంఫర్టర్ లో కూడా భాగం తీసేసుకుని.. కంఫర్టబుల్‌గా పక్కనే సెటిల్ అయిపోయి... తీరిగ్గా కళ్ళెత్తి పక్కకి చూశాను..
కిటికీ నిండా.. అంచుల గుండా.. నీలంగా.. ఒదిగిపోయిన ఆకాశం!!
నిర్మలంగా, నిశ్చలంగా కనిపిస్తూనే.. మృదువుగానే.. పట్టి లాగేసుకుంటోంది.. కళ్ళు తిప్పనీయడంలేదసలు!
అబ్బాయిలు నీలం రంగు ఎందుకు ప్రిఫర్ చేస్తారో కాస్తేదో అర్ధమైనట్టనిపించింది!!
పక్కనే ఉన్న పేరు తెలీని ఓ పెద్ద చెట్టు ఆకులు మెల్లగా బాలే చేస్తున్నాయి.. ఎవరన్నారు గాలిని చూడలేమని!?!?
బయటకే అనేశాననుకుంటా! వెంటనే తను వెల్లకిలా తిరిగి, "నిన్నరాత్రి చూడాల్సింది.. నిండు చందమామ.. కిటికీ పక్కనే.. చేతులు చాచితే అందేట్టు.. అందంగా నవ్వుతూ" అనగానే...
'నిజమా! మరి నన్ను పిలవాల్సింది!' ఏదో అద్భుత ఘట్టం మిస్సైపోయిన ఫీలింగ్ నాలో!
"అనుకున్నా పిలుద్దామని కానీ అప్పటికే చాలా అలసిపోయాం కదా! నిద్ర పోనిద్దాంలే అనుకున్నాను", రాత్రెప్పుడో మిస్సైతే మిస్సయ్యా కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రశాంత చందమామ నవ్వు తన మొహంలో!
'ఇంతకీ ఈ పాట ఎందులోదీ?' ఎప్పుడో పూర్వజన్మలో అడుగుదామనుకున్న ప్రశ్న నెమ్మదిగా బయటకొచ్చింది..
"ఎందులోదేమిటీ!! మొన్న నీకు పంపానుగా! బావుంది వినమని" ఆక్షేపణగా తన గొంతు..
'యా, పంపావు.. కానీ తెల్సుగా.. చాలా బిజీలో విన్నాను.. సో, అంత ఎక్కలేదు' కాస్త అపాలజిటిక్‌గా అంటూనే 'ఇప్పుడు వింటుంటే చాలా బావుంది!' అని సిన్సియర్‌గా ఒప్పుకున్నా...
"ఇది సరే.. అందులో.. ఈ పాట విన్నావా?...." అంటూ తను ఇంకేదో చెప్పింది....
అలా.. అలా... ఎంతసేపు ఎన్ని పాటల గురించి.. పుస్తకాల గురించి.. బట్టల గురించి.. వాటి గురించి.. వీటి గురించి.. ఆ విప్పారిన నీలాకాశం సామీప్యంలోనే మాట్లాడుకున్నామో!!
నిజంగానే అదొక యధాలాపపు ఉదయం.. But, Thanks to Madhura it was an unforgettable casual morning!!
ఇంతకీ ఆ పాటేంటంటే.......... స్నేహమూ నువ్వే.. సంతోషమూ నువ్వే.. ఆత్మలోన నువ్వే.. అనుభూతిలోన నువ్వే.. నేను ఏరి కోరుకున్న కొత్తజన్మ నువ్వే!
:-)
~~~~~~~~~~~~~
అంతందంగా మొదలైన ఉదయం తర్వాత
"ఈ రోజంతా బయట తిరిగే ప్లానులన్నీ కాన్సిల్ చేసేసుకుని స్థిమితంగా
ఇంటిపట్టున ఉండాలనుంది" అన్న నిషి కోరిక ప్రకారం అలా బద్ధకంగా ఇంట్లోనే
కూర్చున్నాం. "ఈ రోజు మీరు వంట పని పెట్టుకోడానికి వీల్లేదు. ఏదో ఒకటి సింపుల్ గా
తినేద్దాం లెండి" అని కాంతి గారిని కిచెన్ వైపు వెళ్ళనివ్వకుండా ఆపేశాం. రోజంతా ఏమేం
కబుర్లు మాట్లాడుకుంటున్నా గానీ అందరి మొహాల్లో నవ్వుల వెనుక
దాగున్న దిగులు, మాటల వెనక
నొక్కిపెట్టేసిన బెంగ అప్పుడప్పుడూ
తొంగి చూస్తోంది. ముందుకి కదలొద్దని
ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా
గడియారం మధ్యాహ్నం దాకా లాక్కెళ్ళిపోయింది.
మా లంచ్ కోసమని మిరపకాయ బజ్జీలు, బిర్యాని, ఆర్డర్ చేసి తెప్పించారు కిరణ్ ప్రభ గారు. భోజనం
చేద్దామనుకుంటుండగా ఎవరో వచ్చి డోర్ బెల్ కొట్టారు. వెళ్ళి చూస్తే పోస్టులో ఏదో డబ్బా
వచ్చింది. దాని మీద కాంతి గారి పేరున్నా సరే కాంతి గారు, నిషి ఇద్దరూ కలిసి "అది నీకోసమే వచ్చింది. ఓపెన్
చెయ్యి" అన్నారు. నాకేం
అర్థం కాక అయోమయంగా డబ్బా తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! లోపల నాకు 'హేపీ బర్త్ డే' మెసేజ్ తో ఒక అందమైన రిస్ట్ వాచ్
ఉంది. పద్మవల్లి గారు పంపించారు. ఆ
సర్ప్రైజ్ లోంచి బయటపడటానికి కాసేపు పట్టింది. వెంటనే పద్మవల్లి గారికి ఫోన్
చేసి"మీరు పంపిన అందమైన కానుక అందింది. చాలా సర్ప్రైజ్ అయిపోయాను. థాంక్యూ సో
మచ్" అని చెప్తే "నేను, నిషి కలిసి సెలెక్ట్ చేసాము.
నువ్వు పుట్టినరోజు దాకా ఉండకుండా వెళ్ళిపోతున్నావు కదా.. అందుకే ముందే పంపించేసాను. వాచ్ పెట్టుకున్నప్పుడు
ఫోటో తీసి చూపించు" అన్నారు. "పుట్టినరోజు కోసం పంపానన్నారు కాబట్టి అప్పుడే
పెట్టుకుంటాలెండి. చాలా థాంక్స్"
అని చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి ఆ గిఫ్ట్ ఎలా సెలెక్ట్ చేసారని నిషి చెప్తుంటే ఆ
కబుర్లు వింటూ లంచ్ పూర్తి చేసేశాం.
"సాయంత్రం నాలుగింటికి షాపింగ్ కి వెళదాం.
అప్పటిదాకా మీ ఇష్టం" అని కిరణ్ ప్రభ గారు చెప్పారు. ఏంటో.. నిషి అప్పుడే
వెళ్ళిపోతోంది.. ఇంకొక రెండు రోజులుంటే బాగుండేది కదా.. అనుకుంటూ కూర్చున్నాం. "నిషి వెళ్ళిన దిగుల్లోంచి బయటపడక ముందే బుధవారం
వచ్చేస్తుంది. మధుర కూడా వెళ్ళిపోతుంది" అని నీరసంగా అన్నారు కాంతి గారు.
"అయినా పుట్టినరోజు దాకా ఉండి వెళ్తే బాగుంటుంది. అక్కడికి వెళ్ళినా
పుట్టినరోజున ఒక్కదానివే ఉండాలి కాబట్టి ప్రయాణం కాస్త వాయిదా వేస్కోవచ్చు
కదా.." అని అందరూ మూకుమ్మడిగా చెప్పారు. ఆ పోస్ట్ పోన్ ప్రాసెస్ ఏదో చాలా
కాంప్లెక్స్ గా ఉందంటే "నువ్వు ముందు ఆ ఎయిర్ లైన్స్ కి ఒకసారి కాల్ చేసి కనుక్కో"
అని గట్టిగా ముందుకి తోసారు. సరేలే చూద్దామని వాళ్లకి ఫోన్ చేస్తే ఆ లైన్ కలిసి
వాళ్ళు ఒక్కో వివరం అడిగి విషయం తేల్చేసరికి రెండు గంటల పైన పట్టింది. ఒక పక్క ఆ ఫోన్ స్పీకర్లో పడేసి మా కబుర్లలో మేమున్నాం.
చివరికి రెండు గంటల తర్వాత మాట్లాడిన అమ్మాయి మీ టికెట్స్ డేట్స్ మార్చుకుంటే ఇంత
ఖర్చవుతుంది అని చెప్పి ఇప్పుడు చెసేయ్యమంటారా అని అడిగింది. అప్పటికప్పుడు చెయ్యాల్సి వస్తుందనుకోలేదు నేను. కాంతి గారేమో
"ఇంతసేపు కష్టపడి కనుక్కున్నాక మళ్ళీ ఆలోచించేది ఏముందిలే చేసెయ్యి తల్లీ.."
అన్నారు. నేను జూలై ఫస్టుకి చేద్దామనుకుంటే రెండో తారీఖుకి చెయ్యమ్మా అని పక్కనుంచి చెప్తుంటే నేను మంత్రం వేసినట్టు రెండో తారీఖుకే
చేయించేసాను. తర్వాత అమ్మావాళ్ళకి, మా ఇంటబ్బాయ్ కి అందరికీ ఈ విషయం చెప్తే పుట్టినరోజుకి ఒక్కదానివే ఉండక్కర్లేకుండా
మంచి పని చేసావులే అన్నారు.
అనుకోకుండా అలా అప్పటికప్పుడు నా ప్రయాణం వాయిదా పడేసరికి అప్పటిదాకా మా అందరి మొహాల్లో ఉన్న దిగులు కాస్త తగ్గి కొత్త ఉత్సాహం వచ్చింది.ఆ ఉత్సాహంలో షాపింగ్ కి వెళ్ళాం. అదేంటో మనం ఊరికే షాపింగుకి వెళ్ళినప్పుడు 'ఇప్పుడు ఇంత గొప్ప వస్తువు కొనకపోతే నీ ఖర్మ..' అన్నట్టు అన్నీ మంచి మంచివే కనిపిస్తుంటాయి. మనం తప్పనిసరిగా ఏదన్నా కొనాలనుకుని వెళ్ళినప్పుడు ఏదీ ఓ పట్టాన నచ్చదు. ఆ రోజు సరిగ్గా అలాగే అయింది. ఒక రెండు మూడు షాపులు తిరిగి ఇంక టైం అయిపోతోందని బెంగపడే టైములో ఒకే ఒక్కటి మాకు నచ్చింది కనపడింది. "పుట్టినరోజుకి ఇక్కడే ఉంటావు కదా.. నీక్కూడా కొనాల్సిందే" అని చెప్పి నిషితో పాటు మళ్ళీ నాక్కూడా ఇద్దరం ఒకే లాంటి డ్రస్లు కొనుక్కున్నాం. "నిజమే.. పుట్టినరోజు కోసం ఏమన్నా కొనాలి కదా.. పద పద ఏమన్నా చూద్దాం" అని నిషి కంగారు పెట్టేసింది. అప్పుడు అసలు టైము లేదు, అక్కడ మాకేం పెద్దగా నచ్చేవేమీ కనిపించకపోవడంతో నేను హమ్మయ్యా అనుకున్నాను. మా షాపింగు అయిపోయి ఇంటికొచ్చేసరికి దాదాపు ఏడు గంటలు కావొస్తోంది.
అనుకోకుండా అలా అప్పటికప్పుడు నా ప్రయాణం వాయిదా పడేసరికి అప్పటిదాకా మా అందరి మొహాల్లో ఉన్న దిగులు కాస్త తగ్గి కొత్త ఉత్సాహం వచ్చింది.ఆ ఉత్సాహంలో షాపింగ్ కి వెళ్ళాం. అదేంటో మనం ఊరికే షాపింగుకి వెళ్ళినప్పుడు 'ఇప్పుడు ఇంత గొప్ప వస్తువు కొనకపోతే నీ ఖర్మ..' అన్నట్టు అన్నీ మంచి మంచివే కనిపిస్తుంటాయి. మనం తప్పనిసరిగా ఏదన్నా కొనాలనుకుని వెళ్ళినప్పుడు ఏదీ ఓ పట్టాన నచ్చదు. ఆ రోజు సరిగ్గా అలాగే అయింది. ఒక రెండు మూడు షాపులు తిరిగి ఇంక టైం అయిపోతోందని బెంగపడే టైములో ఒకే ఒక్కటి మాకు నచ్చింది కనపడింది. "పుట్టినరోజుకి ఇక్కడే ఉంటావు కదా.. నీక్కూడా కొనాల్సిందే" అని చెప్పి నిషితో పాటు మళ్ళీ నాక్కూడా ఇద్దరం ఒకే లాంటి డ్రస్లు కొనుక్కున్నాం. "నిజమే.. పుట్టినరోజు కోసం ఏమన్నా కొనాలి కదా.. పద పద ఏమన్నా చూద్దాం" అని నిషి కంగారు పెట్టేసింది. అప్పుడు అసలు టైము లేదు, అక్కడ మాకేం పెద్దగా నచ్చేవేమీ కనిపించకపోవడంతో నేను హమ్మయ్యా అనుకున్నాను. మా షాపింగు అయిపోయి ఇంటికొచ్చేసరికి దాదాపు ఏడు గంటలు కావొస్తోంది.
ఇంటికొచ్చి వేడి వేడిగా సూప్
తాగి నేను వచ్చిన రోజు దగ్గర్నుంచీ మార్నింగ్ వాక్ కి వెళదాం అనుకుంటూ వెళ్ళలేకపోయిన
పార్క్ కి వెళ్ళాం. నిషి వచ్చే టైముకి పౌర్ణమి రోజు దగ్గర పడుతుంది కాబట్టి తనున్నప్పుడు వెన్నెల్లో వెళదామని ముందు నుంచే
అనుకున్నాం. నిషి ఫ్లైట్ అర్ధరాత్రి పన్నెండుకి కదాని ఇప్పుడు తీరిగ్గా
వెన్నెల్లో వాకింగుకి బయలుదేరామన్నమాట. అప్పటికి ఇంకా చీకటి పడకపోయినా పడమటి నుంచి ఆకాశంలో
పైపైకి తేలి వస్తున్న పెద్ద చందమామని చూస్తూ చాలాసేపు తిరిగాం. అక్కడ
చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటస్థలంలో ఉయ్యాలలు ఉంటే అస్సలేమాత్రం మొహమాటపడకుండా వాటిల్లో ఊగేసాం. ఇంకా అలా నడుస్తూ నడుస్తూ
కొంచెం చీకటి పడేసరికి టైము తొమ్మిదవుతోందని వెన్నెల విహారం చాలించి ఇంటికి బయలుదేరాము.
మేము ఇంటికెళ్ళి డిన్నర్ పూర్తి చేసేసరికి నిషికి టాటా చెప్పి వెళదామని చిమట శ్రీని గారొచ్చారు. కాసేపు ఆ మాటా ఈ మాట మాట్లాడుకుని తొమ్మిది ముప్పావు కల్లా ఎయిర్ పోర్టుకి బయలుదేరాము. నిషిని నిన్నే కదా ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకొచ్చాం.. ఇంతలోనే పంపించే రోజు కూడా వచ్చేసిందేంటీ అనిపించింది. కానీ అంతలోనే ఈ మూడు రోజుల్లో మేము ఆనందంగా గడిపిన క్షణాలన్నీ ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటుంటే ఆ జ్ఞాపకాల లెక్క తేలిన కొద్దీ చాలా రోజులు కలిసున్నామేమో అన్నంత భ్రాంతి కలిగింది. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు "మొదటిసారి కలిసే సమయం ముడిపడటమే కష్టం. రెండోసారి చాలా సులువుగా కలిసొస్తుంది. నాకా నమ్మకం ఉంది. మళ్ళీ ఇక్కడే శాన్ ఫ్రాన్సిస్కోలోనో, మా ఊర్లోనో, జర్మనీలోనో ఖచ్చితంగా కలుస్తాం అనిపిస్తుంది" అంది నిషి. "అసలు ఎప్పుడో ఒకప్పుడు మనం ముగ్గురం కలిస్తే బావుండు అనుకున్నాం కానీ ఇంత తొందరలో కలవడం కుదురుతుందని అనుకోలేదు కదా.. మనం నిజ్జంగా కలిసాం అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ తల్చుకుంటే ఈ భావనే చాలా గొప్పగా ఉంది కదా.." అన్నాన్నేను. "మీరిద్దరూ ఇక్కడే ఒక రెండు మూడు గంటల డ్రైవ్ దూరంలో ఉంటే ఎంత బాగుండేదో కదా.." అన్నారు కాంతి గారు. కిరణ్ ప్రభ గారు నిశబ్దంగా మా ముగ్గురి మాటలు వింటున్నారు. మాటల్లోనే ఎయిర్ పోర్ట్ దగ్గరికి వచ్చేసాం.
మూడు రోజుల క్రిందట ఇదే
ఎయిర్ పోర్ట్ లో పట్టలేనంత సంబరం, మళ్ళీ సరిగ్గా అదే చోట మనసుకి భారమైన వీడుకోలు సన్నివేశం.. హ్మ్.. మన జీవితం కన్నా గొప్ప డ్రామా ఉన్న సినిమా
బహుశా ఇంకేదీ ఉండదేమో అనిపించింది. లగేజ్ చెకిన్ చెయ్యడానికి నేనూ, నిషి వెళ్ళి క్యూ లో నించున్నాం.
అక్కడ నించున్న అరగంట సేపూ మేమిద్దరం ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా నించున్నామని లగేజ్ ఇవ్వడానికి నిషి కౌంటర్
దగ్గరికి నా చెయ్యి విడిచి వెళ్ళినప్పుడు తెలిసొచ్చింది. చెకిన్ అయిపోయాక ఇంకా దాదాపు గంట
టైం ఉంది ఫ్లైట్ బోర్డ్ చెయ్యడానికి. నలుగురం కలిసి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం. "మూడు వారాల క్రితం గొల్లపూడి గారు
వాళ్ళని దింపడానికి వచ్చినప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చున్నాం. ఈసారి మళ్ళీ
వచ్చినప్పుడు ఈ టేబుల్ ని చూసినప్పుడు నిషిని పంపించిన జ్ఞాపకం గుర్తొస్తూ
ఉంటుంది" అన్నారు కాంతి గారు. చుట్టూరా మాలాగే ఎవరినో పంపించడానికి వచ్చిన
వాళ్ళలో రకరకాల భావాలు కనిపించాయి. చాలామంది లాగే మేము కూడా ఎవరినో పిలిచి ఫోటో
తీయించుకున్నాం.
ఎయిర్ పోర్ట్ లోపలకి
వచ్చిన దగ్గరి నుంచీ నిషి ఎక్కువ మాటల్లేకుండా మౌనంగా అయిపోయింది. అందర్నీ చూస్తుంటే
నేనే ఎక్కువ నవ్వుతూ మాములుగా కనిపిస్తున్నాననిపించింది. అందరూ నా మాటలు పూర్తి శ్రద్ధగా వింటున్నారో లేదో తెలీకపోయినా
నేనేదో ఏదో చెప్పి నవ్వించాను. కాసేపు అటూ ఇటూ నడిచి వద్దామని లేచాం. నిషి నన్నలా
దగ్గరగా పట్టేసుకుని ఇద్దరం భుజాల మీద చేతులు వేసుకుని నడుస్తుంటే స్కూల్లో
ఎక్కువ రోజులు సెలవలొచ్చే ముందు మళ్ళీ నేస్తాలని ఎప్పటికో
కానీ చూడము కదా అన్న బెంగతో పక్కపక్కనే తారట్లాడుతూ తిరిగిన రోజులు గుర్తొచ్చాయి. టాటా
చెప్పాల్సిన టైము దగ్గర పడే కొద్దీ మా మధ్యన మాటలు కరువైపోతున్నాయి. ఇంకో పది నిమిషాలు ఉండగానే "ఇంక మీరు బయలుదేరండి. లోపల
సెక్యూరిటీ చెక్ టైం పడుతుంది. నేనింక వెళతానులే" అని చెప్పి దూరంగా వెళ్ళి నిలబడింది
నిషి. ఇంకాసేపు అక్కడే ఉంటే తన కళ్ళు చెప్పిన మాట వినవని మమ్మల్ని వెళ్ళిపోమంటోందని అర్థమవుతోంది. కాంతి గారు అప్పటికే చాలా
సేపటి నుంచి మౌనమైపోయారు. "జాగ్రత్త నిషీ.. హేపీ జర్నీ" అని చెప్పాక టాటా
చెప్పేసి అట్టే వెనక్కి తిరిగి చూడకుండా లోపలకి వెళ్ళిపోయింది నిషి. మేము కూడా
అక్కడ మాకింకేం పనన్నట్టు క్షణం సేపన్నా నిలబడకుండా వెనక్కి వచ్చేశాం.
ఎయిర్ పోర్ట్ పార్కింగ్లో
ఉన్న కారు తీసుకుని బయలుదేరగానే పక్కనున్న ఖాళీ సీటుకేసి చూస్తూ "ఎదురు
చూసినంతసేపు పట్టలేదు కదా.. నా పక్క సీటు అప్పుడే ఖాళీ అయిపోయింది" అన్నారు
కాంతి గారు. ఎంత అలవోకగా మాట్లాడేవాళ్ళకైనా ఒకోసారి మాటలు దొరకవు. అందులోనూ
నాకస్సలు తల్చుకోడం, మాట్లాడటం ఇష్టం
లేని విషయాల్లో ఈ 'వీడుకోలు' ముందుంటుంది. San Mateo bridge మీదకి వచ్చేసరికి ఆ
రోజు నేను ఇదే స్వర్గద్వారం అని చెప్పగానే నిజ్జంగా నిజం అన్నంత ఆనందంగా గట్టిగా
నవ్వేసిన నిషి గుర్తొచ్చింది. వంతెన పక్కన నిశ్చలంగా ఉన్న నీళ్ళ మీద వెన్నెల
కిరణాలు పరావర్తనం చెందుతూ అసలు అక్కడ నీళ్ళే లేవేమో అదంతా నున్నటి గచ్చేమో అన్న
భ్రమ కలిగిస్తోంది. అప్పుడప్పుడూ మధ్య మధ్యలో కదులుతున్న నీటి అలల్లో వెన్నెల వయ్యారంగా నాట్యమాడుతోంది.
చూడండి చూడండి అంటూ కాంతి గారికి చూపిస్తే కొద్ది క్షణాలు వెన్నెల మాయలో
పడిపోయారు. నిషి ఫోన్ చేసి "About to takeoff.. ఇంటికెళ్ళాక మాట్లాడతాను" అని చెప్పి పెట్టేసింది. నిషి కబుర్లతో
తొందరగా ఇంటికొచ్చేసినట్టు అనిపించింది. అప్పటికే చాలా రాత్రి అయ్యింది కాబట్టి వెళ్ళి
పడుకున్నాం. ఎన్నో రకాల ఆలోచనలు, భావాలు కలగలిసిపోయి మదిని
పరిగెత్తిస్తుంటే కిటికీలోంచి తొంగి చూస్తున్న వెన్నెల నా అవస్థ గమనించి ఈ పూటకి నాకు
తోడొచ్చి నిదుర దరికి చేర్చింది.
14 comments:
ఫొటోస్ చాలా బాగున్నాయి, బాగా తీసారు...
మేటర్ మళ్ళీ చదువుతా :)
"ఎదురు చూసినంతసేపు పట్టలేదు కదా..."
అబ్బా ఇందాకే ఇలాంటి ఓ సన్నివేశంలో ఇదే డైలాగ్ అనుకుని ఇటొచ్చాను ఈ పోస్ట్ లో మళ్ళీ అదే చదివాను హ్మ్.. ఏం చెప్పగలం నాక్కూడా మాటలు రావట్లేదు.
అన్నట్లు నిషి మాటల్లో ఉదయం చాలా చక్కగా ఉంది :)
వీడుకోలు భారం తెలుస్తూనే ఉంది. ముందు పోస్టుల్లో కనిపించిన సందడి మచ్చుకైనా లేదు.
అబ్బా మధురా, నీ మాటల గారడీతో మాక్కూడా నీ అనుభూతుల్ని పంచేశావ్. చాలా టచ్చింగా వుంది, ఫోటోస్ బావున్నాయి.
మీ ఇంటి అబ్బాయి flight track చేసార?
:(((( naku baga badhesindi madhu post chivaralo chaduvutunte..... Nuvvela tattukunnav? :(
Casual ఉదయమేనేమో కానీ, నిషిగంధ గారి మాటల్లో చాలా బావుంది..
>>వెంటనే తను వెల్లకిలా తిరిగి, "నిన్నరాత్రి చూడాల్సింది.. నిండు చందమామ.. కిటికీ పక్కనే.. చేతులు చాచితే అందేట్టు.. అందంగా నవ్వుతూ" అనగానే...
Simply superb :)
>>"ఎదురు చూసినంతసేపు పట్టలేదు కదా.."
హ్మ్ హ్మ్...
ఎదురుకోలు, వీడుకోలు
రెండింటిని హృద్యంగా
చిత్రించావమ్మా, సెభాష్
టాటా చెప్పాల్సిన టైము దగ్గర పడే కొద్దీ మా మధ్యన మాటలు కరువైపోతున్నాయి.
"నిశ్శబ్దం మాట్లాడినంత గొప్పగా ఏ భాషా మాట్లాడలేదు, కలయికలో ఆనందాన్నీ,విడిపోవటంలో విషాదాన్నీ నిశ్శబ్దం ప్రకటించినంత బాగా ఏ స్వరమూ ప్రకటించలేదు"
కిటికీ నిండా.. అంచుల గుండా.. నీలంగా.. ఒదిగిపోయిన ఆకాశం!!
నిర్మలంగా, నిశ్చలంగా కనిపిస్తూనే.. మృదువుగానే.. పట్టి లాగేసుకుంటోంది.. కళ్ళు తిప్పనీయడంలేదసలు!
పక్కనే ఉన్న పేరు తెలీని ఓ పెద్ద చెట్టు ఆకులు మెల్లగా బాలే చేస్తున్నాయి.. ఎవరన్నారు గాలిని చూడలేమని!?!? నిషి గారు భలే రాస్తారు ఇది చదువుతుంటే పక్కన కుర్చుని చెపుతున్నట్టుంది చాలా సార్లు చదివాను.చాలా నచ్చింది
హ్మ్ నిషి గారు వచ్చారు వెళ్ళిపోయారు :( తను వెళ్లిపోతుంటే మీ ఫీలింగ్స్ ఉహించుకుంటే భాధగా అనిపించింది .అంత అనుబంధం ఏర్పడ్డాక ఎలాగైనా మళ్ళి మళ్ళి తప్పకుండా కలుస్తూనే ఉంటారు .కాకపొతే కాస్త టైం పట్టొచ్చు :)
కొన్ని అనుభవాలు, అనుభూతులు వర్ణించడం చాలా కష్టం, మాటల్లో చెప్పలేము అంటుంటాము కదా! ఆ శనివారం కూడా నాకు అలాంటిదే! కానీ, ఆ రోజు బయటకనుకున్న మాటలు సరేసరి.. మనందరి మనసుల్లో తిరుగాడిన ఆలోచనలనీ, దిగులో బెంగో.. ఆ రెండూ కలసిన భారాన్నీ కూడా ఏదో అద్దంలోంచి చూసినట్టు రాశావు, మధురా!
మళ్ళీ ఆ రాత్రి... నేను ఫ్లైట్లో సర్దుకుని కూర్చున్నాక 'ఏదన్నా ప్రాబ్లెం వచ్చి వీడు ఫ్లైట్ కాన్సిల్ చేస్తే బావుండు ' అనుకోవడం గుర్తొచ్చి నవ్వొచ్చింది! :-)
Yosemite డ్రైవ్‌లో చెప్పుకున్న కధలు మాత్రం సూపర్.. అన్నిటికన్నా కాంతిగారి హాస్టల్ కబుర్లు హైలైట్ :)))
వేణు, మేధ గారు, రాధిక(నాని) గారు.. మా క్యాజువల్ ఉదయం మీక్కూడా నచ్చినందుకు థాంక్యూ..
పప్పు గారు, మీ కామెంట్‌కి +100 :)
@ ఫోటాన్,
అలాగేనండీ.. థాంక్యూ.. :-)
@ వేణూశ్రీకాంత్,
అంతే వేణూ.. ఏ క్షణాల కోసం ఎదురు చూసామో అవి మాయమైపోతాయి. జ్ఞాపకాలని మిగులుస్తాయి కదా.. అదే ఊరట!
@ MURALI,
హ్మ్.. అంతే కదా మరి.. తప్పని వీడుకోలు!
@ Sudha,
థాంక్యూ సో మచ్ గారూ..
@ Andhraman,
లేదండీ.. ట్రాక్ చేసే కన్నా ముందే తనే మెయిల్లో కనిపించేసాడు. థాంక్యూ సో మచ్!
@ ఇందు,
మరి తప్పదు కదా ఇందమ్మాయ్.. వెళ్ళడం అంటూ ఉన్నాక వెనక్కి వచ్చెయ్యాలి. వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు.. అది తప్పని పని కదా! :-)
@ మేధ,
థాంక్స్ ఫర్ ది కామెంట్.. :-)
@ chavera,
ధన్యవాదాలండీ..
@ శ్రీనివాస్ పప్ప,
మాటల్లేవండీ బుల్లెబ్బాయ్ గారూ.. చప్పట్లొకటే! :-)
@ రాధిక(నాని ),
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ విష్.. మళ్ళీ తప్పకుండా ఎప్పుడో అప్పుడు కలుస్తామనే మాక్కూడా అనిపిస్తూ ఉంటుంది.. చూడాలి మళ్ళీ ఎప్పటికో మరి! :-)
@ నిషిగంధ,
హహ్హహ్హా.. ఫ్లైట్ కాన్సిల్ చేస్తే బావుండు అనుకున్నావా.. :)))))
నిజమే.. కాంతి గారి హాస్టల్ కబుర్లు లంచ్ చేస్తూ చెప్పుకున్నాం కదా ఆ రోజు. :D
Post a Comment