Thursday, August 01, 2013

My San Francisco Diary - 6



​​16.06.2013
ఆదివారం
రోజు ఉదయాన్నే ఎక్కడికీ బయలుదేరాల్సిన పని లేదు కాబట్టి నేను తీరిగ్గా ఏడు గంటలు దాటే దాకా నిద్రపోయి, మెలకువొచ్చాక కూడా బద్ధకంగా చాలాసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ గడిపి మెల్లగా కిందకి దిగేసరికి టైము ఎనిమిది దాటింది. అప్పటికే కిరణ్ ప్రభ గారు మార్నింగ్ వాక్ నుంచి వచ్చేసారు. లంచ్ కోసం కాంతి గారు పులిహోర కలిపేశారు. వేడి వేడిగా పెసరట్టు బ్రేక్ ఫాస్ట్ ముగించి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. "ఇవాళ మనం వెళ్ళబోయే ప్రోగ్రాం మధ్యాహ్నం రెండు గంటలకి మొదలవుతుంది. ప్రసాద్ వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుంచి కలిసి వెళ్ళడానికి బానే టైం పడుతుంది కాబట్టి మీరిద్దరూ సరిగ్గా పన్నెండింటి కల్లా తయారైపోవాలి. ఇప్పుడింకా టైము తొమ్మిదిన్నరే కాబట్టి పదకొండు దాకా ఎంత బద్ధకంగా కూర్చున్నా పర్లేదు అన్నారు" కిరణ్ ప్రభ గారు. ఇవాళ చుడీదార్లు, స్కర్ట్లు కాకుండా అచ్చ తెలుగు అమ్మాయిల్లాగా చీరలు కట్టుకోవాలని నిర్ణయించుకున్న సంగతి గుర్తొచ్చింది నాకూ, కాంతి గారికీ. "అమ్మో అలాగైతే మనకి చాలా టైం పడుతుంది కదా.. మనం చీరల మ్యాచింగ్ సంగతి కూడా చూసుకుందాం అనుకున్నాం కదా.. పద పద పైకి వెళదాం.." అని కాంతి గారు హడావుడి పెట్టేసి నన్ను హాల్లో నుంచి పైనున్న బెడ్ రూములోకి లాక్కెళ్ళిపోయారు. మేమిద్దరం కలిసి నా పాలనురుగు తెలుపు చీరకి దగ్గరగా ఉన్న గంధం రంగు చీరని కాంతి గారి కోసం సెలెక్ట్ చేసి, ఆ చీరల మీదకి ఏ గాజులైతే బాగుంటుంది, ఏ గొలుసైతే బాగుంటుంది అని ముచ్చటించుకుంటూ దాదాపు గంటసేపు గడిపేశాం. తర్వాత హడావుడిగా రెడీ అవుతున్నాం అన్న భ్రమలో బోల్డంత తీరిగ్గా సింగారాలు పూర్తి చేసుకుని పన్నెండు అవ్వకముందే కిందకొచ్చేసాం. ముగ్గురం కలిసి పులిహోర తినేసి అప్పటికే మాకోసం కాల్ చేసిన ప్రసాద్, పద్మ గారింటికి బయలుదేరిపోయాం. అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కలుపుకుని అన్ని కార్లూ Santa Clara Convention Center వైపు పరుగులు తీసాయి.
ఇంతకీ ఈ పరుగు ఎక్కడికో చెప్పాలి కదా ముందు.. :-)
నేను అమెరికా ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకోగానే నేను వచ్చాక ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలా అని కాంతి గారు, కిరణ్ ప్రభ గారు చర్చించుకుని మొదటి వీకెండ్ Los Angeles ట్రిప్ పెట్టుకుందామని ప్లాన్ చేసారు. అప్పుడే ఒక  విషయం తెలిసింది. అదేంటంటే, ఎన్నో ఏళ్ళ నుంచీ మన గానగంధర్వులు 'పద్మభూషణ్' శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారి చేత విజయవంతంగా నిర్వహించబడుతూ తెలుగునాట సర్వజనాదరణ పొందుతున్న ఈటీవీ 'పాడుతా తీయగా' సంగీత కార్యక్రమాన్ని ఇప్పుడు సరికొత్తగా అమెరికాలోని తెలుగు గాయనీ గాయకుల కోసం అమెరికాలోనే నిర్వహించబోతున్నారు. ఇటీవలే మే నెలలో అమెరికా డాలస్ నగరంలో జరిగిన తానా సభల్లో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా 'అమెరికాలో పాడుతా తీయగా' కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత వరసగా అమెరికాలోని వివిధ నగరాల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్స్.. ఇలా ఒక్కో చోట కొన్ని కొన్ని ప్రోగ్రాములని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాలిఫోర్నియాలోని బే ఏరియాలో Sacramento, Santa Clara ల్లో జూన్ 15, 16 తారీఖుల్లో బాలు గారి ఆధ్వర్యంలో 'పాడుతా తీయగా' జరగబోతోంది. ఈ సంగతి తెలిసాక కిరణ్ ప్రభ గారు "మధురా.. నీకు ఆసక్తి ఉంటే మనం 16 'పాడుతా తీయగా' కి వెళ్ళొచ్చు. లేదంటే లాస్ ఏంజెలిస్ ప్రయాణం పెట్టుకోవచ్చు. నిర్ణయం నీదే" అన్నారు. "అంతటి బాలు గారు పాడుతుంటే దగ్గరగా చూసే అవకాశం ఇలా కలిసొస్తుంటే కాదని ఎలా అనగలనండీ.. లాస్ ఏంజెలిస్ మరొకసారి వచ్చినప్పుడు చూద్దాంలే.." అన్నాను నేను. అలా అప్పుడు ఫిక్స్ అయిన 'పాడుతా తీయగా' ప్రోగ్రాం కే ఇప్పుడు మేము వెళుతోంది. :-)

కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న (BATA, Bay Area Telugu Association) బే ఏరియా తెలుగు సంఘం అక్కడున్న తెలుగు వారందరికీ సుపరిచితం. వారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి 'విరిజల్లు' రేడియో వాళ్ళు మీడియా పార్ట్నర్స్ గా వ్యవహరించారు. కిరణ్ ప్రభ గారికి సహజంగానే విరిజల్లు వారి నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. మేము 'పాడుతా తీయగా' కార్యక్రమం జరగబోతున్న 'శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్' కి చేరుకోగానే 'బాటా' కార్యవర్గ సభ్యులు, విరిజల్లు ద్వారా అందరికీ చిరపరిచితులైన విజయ ఆసూరి గారు, కళ్యాణ్ కట్టమూరి గారు ఎదురై కిరణ్ ప్రభ గారిని, ఆయన కూడా ఉన్న మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. "మధుర అంటే మీరేనా? నైస్ టు మీట్ యూ.. మీరు వస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండీ కిరణ్ ప్రభ గారు.." అని చాలా స్నేహంగా పలకరించారు విజయ ఆసూరి గారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచీ నాలుగు గంటల దాకా ఒక ఎపిసోడ్ నీ, ఆరింటి నుంచీ ఎనిమిదింటి దాకా రెండో ఎపిసోడ్ నీ చిత్రీకరిస్తారని చెప్పారు. మధ్యలో రెండు గంటలు విరామం. మేము మాకిచ్చిన టికెట్స్ తీసుకుని లోపల హాల్లోకి వెళ్ళి చూస్తే మా సీట్లు స్టేజీ నుంచి ఓ పదిహేను అడుగుల దూరంలో సరిగ్గా మధ్యలో ఉన్నాయి. "ఆహా ఎంత మంచి ప్లేస్ ఇచ్చారండీ మనకి.." అని సంతోషించి అందరం వరసగా కూర్చున్నాం. స్టేజీ మీద 'పాడుతా తీయగా' బేనర్, అలంకరణ చూసేసరికి చాలా ఉత్సాహంగా అనిపించింది మా అందరికీ. అక్కడున్న మైకులు, టేబులు, కుర్చీలు చూస్తూ బాలు గారు ఎక్కడ కూర్చుంటారని చర్చించుకుంటూ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడసాగాం. అప్పటికి సమయం ఇంకా రెండు గంటలు కాలేదు.
ఇంతలో చిమట శ్రీని గారు వచ్చి మమ్మల్ని పలకరించి వారి శ్రీమతి గారిని, పిల్లల్ని కూడా పరిచయం చేసారు. నేను ఆయన్ని నేరుగా కలవడం ఇదే మొదటిసారి. మళ్ళీ ఇంకోసారి "మా బే ఏరియాకి స్వాగతమండీ" అని చెప్పి "బాలు గారిని చూడటం మొదటిసారి అన్నారు కదూ.. కార్యక్రమాన్ని బాగా ఆస్వాదించండి. మనం మళ్ళీ మాట్లాడదాం" అని వెళ్ళిపోయారు. మేము అక్కడికి వచ్చిన దగ్గర నుంచీ కిరణ్ ప్రభ గారి పరిచయస్థులే కాకుండా, ఆయన రేడియో అభిమాన శ్రోతలు, కౌముది అభిమానులు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూనే ఉన్నారు. అలాగే ఎవరో వచ్చి "కిరణ్ ప్రభ గారు మీరే కదండీ.. నమస్తే" అని అంటుంటే నేనూ, కాంతి గారు మాట్లాడుకోడం ఆపి అటు పక్కకి చూసాం. అక్కడ ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి నేను బోల్డంత ఆశ్చర్యపోయి "హేయ్.. దిలీప్ నువ్వేంటి ఇక్కడ.. వాటే ప్లెజంట్ సర్ప్రైజ్!" అనగానే దిలీప్ మాత్రం నన్ను చూసి అస్సలే మాత్రం ఆశ్చర్యపోకుండా "నేను నిన్ననే అనుకున్నాలే.. నువ్వు  కిరణ్ ప్రభ గారితో కలిసి ఈ ప్రోగ్రాం కి వస్తావని.." అన్నాడు. దిలీప్ అంటే అందమైన కవిత్వం రాస్తుంటాడే, 'ఏకాంతపు దిలీప్' అన్నమాట. మేమిద్దరం చాన్నాళ్ళ నుంచీ మంచి స్నేహితులం. కానీ ఈ మధ్య ఎవరి బిజీ బిజీలో వాళ్ళం పడిపోయి తీరిగ్గా మాట్లాడుకోక చాలా రోజులైపోయింది. కాంతి గారు ఫేస్ బుక్లో పెట్టిన ఫొటోస్ చూసి "San Jose వచ్చావా?" అని ముందు రోజే మెయిల్ పెడితే "Dublin లో ఉన్నాను" అని చెప్పాను. తన దగ్గరి నుంచీ మళ్ళీ ఏ సమాధానం రాలేదు. తను అమెరికాలోనే ఉన్నాడని నాకు తెలీదు. అందుకని ఉన్నట్టుండి అక్కడ తనని చూడగానే చాలా ఆశ్చర్యపోయాను, ఆనందించాను. సరే, ఇంకాసేపట్లో ప్రోగ్రాం మొదలవబోతోంది కదా.. మనం మళ్ళీ బ్రేక్లో మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు దిలీప్. ఆ సంతోషంలో దిలీప్ గురించి కాంతి గారూ, నేనూ మాట్లాడుకుంటుండగానే స్టేజీ మీదకి అందరూ ఒక్కొక్కరే రాసాగారు. మేము వెంటనే నిశబ్దంగా అయిపోయి బాలు గారు ఎప్పుడు వస్తారా అని రెప్ప వేయకుండా ఆ ద్వారం వైపే చూస్తూ కూర్చున్నాం.
శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారు అలా వేదిక మీదకి నడిచి వస్తూ కనిపించేసరికి ఆడిటోరియం మొత్తం నిండిపోయున్న ప్రేక్షకులందరమూ అసంకల్పితంగా లేచి నించుని కరతాళ ధ్వనులతో ఆయనకి ఘనస్వాగతం పలికాము. "ముందు అందరూ దయచేసి కెమెరాలు తీసెయ్యండి. టీవీలో టెలీకాస్ట్ అవబోయే ప్రోగ్రాంని మీరు ముందే చిత్రీకరించడం బాగుండదు కదా.." అని మెత్తగానే అయినా స్పష్టంగా చెప్పారు బాలు గారు. కార్యక్రమం ఎలా జరగబోతోంది అని ఆయన వివరిస్తూ ఉంటే నేనసలు రెప్ప వెయ్యడం మర్చిపోయి ఆయనకేసి, ఇంకా చెప్పాలంటే ఆయన గొంతుకేసి చూస్తూ ఉండిపోయాను. ఇది నిజంగా నిజమా, ఇంత దగ్గరలో కూర్చుని ఆయన గొంతు వింటున్నానా, అయినా అసలా స్వరం ఏంటీ మాములుగా మనందరం మాట్లాడుతున్నట్టు లేదు, టేప్ రికార్డర్లో కేసెట్ ప్లే చేస్తే వింటున్నట్టుంది కదా, చిన్నప్పటి నుంచీ ఆయన గొంతు కేసెట్లో వినీ వినీ అలా అనిపిస్తోందా, ఇంకా కొన్ని గంటలసేపు బాలు గారి ఎదురుగా కూర్చుని ఆయన మాటలు, పాటలు వినే భాగ్యం కలిగింది కదా నాకు.... ఇలా నా ఆలోచనలు ఎటో ఎటో పోతూ బ్యాక్ గ్రౌండ్లో అలనాటి 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' దగ్గర నుంచీ నిన్నటి 'తలయెత్తి జీవించు తమ్ముడా..' పాట దాకా ఎన్నెన్నో పాటలు నన్ను గుర్తు చేసుకోమంటే నన్ను గుర్తు చేసుకోమంటూ మూకుమ్మడిగా నా మీద దాడి చేస్తున్నట్టు కుప్పలు తెప్పలుగా వినిపించేస్తున్నాయి. ఆ ఉద్వేగం కాస్త తగ్గి, కళ్ళలో తడి పొర కరిగి నేను మాములయ్యే లోపు కార్యక్రమం మొదలైపోయింది. ఈ రెండు ఎపిసోడ్లకీ ముఖ్య అతిథి మరియు సహన్యాయనిర్ణేతగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని ఆహ్వానించారు.
'పాడుతా తీయగా' కార్యక్రమం మొదలైపోయింది. బాలు గారితో పాటు పాడటానికి, అలాగే పోటీలో పాల్గొనే వారికి కోరస్ సహకారం అందించడానికి హరిణి, తేజస్విని అని ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. వీళ్ళకి గట్టిగా ఇరవై ఏళ్ళు ఉంటాయేమో.. ఇదివరకు ఇండియాలో జరిగిన 'పాడుతా తీయగా' సిరీస్ విజేతలని చెప్పి వాళ్ళని పరిచయం చేశారు.  కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో మొదలుపెడదామని చెప్పి బాలు గారు తేజస్వినితో కలిసి మైకు ముందుకి వచ్చారు. ఆర్కెస్ట్రా బృందం సంగీతం మొదలుపెట్టగానే అర్థమైపోయింది అది 'శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..' పాటని. బాలు గారు అలా పాడుతుంటే అచ్చం చిన్నప్పుడు రేడియోలో పొద్దున్నే ఈ పాట విన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంది. అంటే, దాదాపు ఇరవై యేళ్ళ క్రితంలాగే ఇప్పుడు కూడా ఎలా పాడుతున్నారని నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది. అది కూడా అంత చిన్నపిల్ల పక్కన అస్సలే మాత్రం తేడా తెలీకుండా అంత వినసొంపుగా యుగళ గీతం పాడుతుంటే అప్పుడు కలిగిన భావాన్ని చెప్పడానికి అద్భుతం కన్నా ఇంకా పెద్ద మాట ఏదన్నా ఉంటే బాగుండుననిపిస్తుంది. ఆ తన్మయత్వంలో ఉండగానే వరసగా పోటీలో పాల్గొనే పిల్లలు ఒక్కొక్కరూ వచ్చి పాడటం మొదలుపెట్టారు. వాళ్ళని చూస్తే అందరికీ కూడా వయసు ఇరవైల్లోనే ఉంటుందనిపించింది. అందరూ అమెరికాలోని రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వారే! ప్రతి ఒక్కరూ ఇండియాలో సొంత ఊరు, అమెరికాలో ఉండే ఊరు రెండూ చెప్పి పరిచయం చేసుకున్నారు.
ఒక అబ్బాయి చక్కగా పంచె కట్టుకుని నుదుటన విభూతి రేఖలు పెట్టుకుని వచ్చాడు పాట పాడటానికి. శ్లోకంతో సహా ప్రారంభించి 'వేదంలా ఘోషించే గోదావరి.. అమరాధామంలా శోభిల్లే రాజమహేంద్రి..' అంటూ ఆంధ్రకేసరి చిత్రంలోని పాట పాడాడు. బాలు గారు, జొన్నవిత్తుల గారు చాలా చక్కగా పాడాడని ఆ అబ్బాయిని మెచ్చుకుని ఆ పాటలో తెలుగు జాతి వైభవాన్ని ఎంత గొప్పగా వర్ణించారని వివరించి చెప్పారు. పంచె కట్టుకు రావాలన్న అతని ఆలోచనని కూడా అభినందించారు. తర్వాత అమ్మాయి 'స్వాతి ముత్యపు జల్లులలో.. శ్రావణ మేఘపు జావళిలో..' అంటూ పాడింది. ఆ పాట ప్రారంభంలో వినిపించే సిగ్నేచర్ ట్యూన్ లాంటి మ్యూజిక్ ని ఆర్కెస్ట్రా బృందం చాలా గొప్పగా వినిపించారు. "'శ్రావణ మేఘపు జావళి' లాంటి పదప్రయోగాలు మళ్ళీ  ఎవరైనా చేయగలరాండీ మహానుభావుడు వేటూరి తప్ప.." అంటూ బాలు గారు వేటూరి గారికి వందనం అర్పించారు. ఇంకొక అమ్మాయి 'స్వరములు ఏడైనా రాగాలెన్నో..' అనే పాట పాడింది. ఈ పాట నేనెప్పుడూ వినలేదంటే "అయ్యో అవునా.. ఇది చాలా మంచి పాట. తూర్పు-పడమర సినిమాలోది" అని కిరణ్ ప్రభ గారు చెప్పారు. డా. సి. నారాయణ రెడ్డి గారు ఈ పాట సాహిత్యంలో గొప్ప వేదాంతాన్ని రంగరించి రాసారని కొన్ని వాక్యాలని జొన్నవిత్తుల గారు వివరించి చెప్పారు. తర్వాత ఒక అబ్బాయి 'దొంగ దొంగ' సినిమాలోని 'కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం..' పాట పాడాడు. AR రెహమాన్ సంగీతంలో వచ్చిన హుషారైన ఈ పాటని ఆ అబ్బాయి కూడా అంతే హుషారుగా పాడాడు. పాట అయిపోయేసరికి వింటున్న వాళ్ళందరిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ పాట సాహిత్యంలో రాజశ్రీ గారు 'అందగత్తెకి అమ్మై పుడితే ఊరికత్తని అర్థం..' అని భలే చిలిపిగా రాసారని బాలు గారు, జొన్నవిత్తుల గారు వారి సరదా వ్యాఖ్యానాలతో నవ్వించారు. తర్వాత చివరిగా ఒక తమిళ అబ్బాయి వచ్చి సిరివెన్నెల సినిమాలో 'ఈ గాలి, ఈ నేల..' పాట పాడాడు. అతనికి తెలుగు రాకపోయినా తమిళంలో రాసుకుని పాట నేర్చుకుని పాడటం చూసి ఆనందం కలిగింది. అక్కడ స్టేజీ మీద ఆర్కెస్ట్రా బృందంలో అందరూ కలిపి పట్టుమని పది మందైనా లేరు కానీ వాళ్ళ దగ్గరున్న పరిమితమైన వాయిద్యాలతో ఏ పాటకైనా సరే సరిగ్గా అమరేలా సంగీతం ఇవ్వడం మాత్రం చాలా గొప్పగా అనిపించింది. "చాలా మంది 'పాడుతా తీయగా' లో వెనకాల వేరే ఇంకేదో మిక్సింగ్ ఉంటుందని అనుకుంటారట. కానీ అదేం లేదు, మీరు టీవీలో చూసే మ్యూజిక్ ఇప్పుడు మీ కళ్ళ ముందు వాయిస్తున్న వీళ్ళు ఇప్పటికిప్పుడు సృష్టిస్తున్నదే.." అని బాలు గారు ఆర్కెస్ట్రా బృందాన్ని అభినందిస్తే ప్రేక్షకులందరూ గట్టిగా చప్పట్లతో గొంతు కలిపారు. అక్కడికి ఐదుగురు పాడిన పాటలతో మొదటి ఎపిసోడ్ పూర్తయింది. కాసేపు విరామం తర్వాత రెండో భాగం మొదలవుతుందని చెప్పి అందరూ వేదిక మీద నుంచి నిష్క్రమించారు.
మేము బయటికి వెళదామని లేచి బయలుదేరుతుండగా చిమట శ్రీని గారు వచ్చి "బాలు గారిని కలిసి వద్దాం పదండి" అన్నారు. శ్రీని గారు నేనొచ్చిన రోజు నుంచే చెప్తున్నారు బాలు గారు ఇక్కడున్న నాలుగు రోజుల్లో ఏదో ఒక సమయంలో బాలు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్తానని. నిషి ఏమో "శ్రీని గారు బాలు గారు ఉన్నంతసేపు ఆయన వెనకే నీడలా తిరుగుతుంటారు కాబట్టి నిన్నెలాగైనా బాలు గారి దగ్గరికి తీసుకెళ్ళమని నేను కూడా చెప్పాను" అంది. కానీ నేనింకా ఆయన మాటలు, పాటలు విన్న మైమరపులోనే ఉండి శ్రీని గారు వచ్చి పిలిచేసరికి "నిజంగా ఇప్పుడే వెళదామాండీ?" అని అడిగాను బోల్డు ఆశ్చర్యంగా. ఆయన నవ్వి "కెమెరా తీసుకుని పదండి. ఫోటో కూడా తీసుకుందాం" అన్నారు. కాంతి గారు, నేను కలిసి శ్రీని గారి వెనక బయలుదేరాం. శ్రీని గారి స్నేహితులు గోకుల్ గారు కూడా మాతో పాటు వచ్చారు. దారిలో జొన్నవిత్తుల గారు కనిపిస్తే శ్రీని గారు ఆయనతో మాట్లాడి నన్ను పరిచయం చేసి మమ్మల్ని ఫోటో కూడా తీసారు. తర్వాత బాలు గారి దగ్గరికి వెళుతుంటే నాకు చాలా ఉద్వేగంగా, కంగారుగా అనిపించింది. అసలు ఆయన ఎదురుగా నించున్నాక ఏం మాట్లాడాలి.. "బాలు గారూ.. మీరు చాలా అద్భుతంగా పాడతారండీ.. ఆ పాట నాకు ఇష్టమండీ, ఈ పాట చాలా బాగుంటుందండీ" అని చెప్పాలా? ఇలాంటివన్నీ ఇప్పటికి ఆయన కొన్ని కోట్ల సార్లు వినీ వినీ ఉంటారు కదా! అయినా నా పిచ్చి గానీ "సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, వెన్నెల అందంగా ఉంటుంది, బాలు గారు బాగా పాడతారు, మధుర మంచమ్మాయి.." ఇలాంటివన్నీ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా వచ్చి చెప్పాలా ఏంటీ.. అని చాలా సిల్లీగా అనిపించింది. నేనిలా ఆలోచనల్లో ఉండగానే బాలు గారి దగ్గరికి వెళ్ళి ఓ ఐదడుగుల దూరంలో నించున్నాం. ఎవరో ముగ్గురు నలుగురు అప్పటికే ఆయనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఏదో సినిమా కేసెట్ మీద బాలు గారి పేరు చూసినప్పుడు ఎలా ఫీలయ్యారు, ఏ పాటలు వింటే ఏమనిపిస్తుంది.. అని చాలా అభిమానంగా, ఆరాధనాపూర్వకంగా ఆయనకీ వివరిస్తున్నారు. ఆయనేమో వాళ్ళ ఉత్సాహాన్ని అర్థం చేసుకుని ఆదరంగా " చాలా సంతోషమండీ.." అని చిరునవ్వు నవ్వుతూ ఫోటో కూడా దిగి పంపించారు. తర్వాత మేమే! అప్పటికి నాకు మాటతో పాటు ఆలోచన కూడా పోయి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. మూగమ్మాయిలాగా అలా ఆయనకేసి చూస్తూ నించున్నా. శ్రీని గారు నన్ను ఆయన ముందుకి తీసుకెళ్ళి "ఈ అమ్మాయి మధురవాణి అని జర్మనీ నుంచి వచ్చిందండీ. సైంటిస్టుగా పని చేస్తూనే తెలుగులో చాలా చక్కగా రాస్తూ ఉంటుందండీ.. మీరంటే చాలా అభిమానమని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను" అని చెప్పారు. "ఏమ్మా.. మీ ఊరిలో ఉండవా అయితే ఇలాంటివి.. ఇక్కడిదాకా వచ్చి చూడాలన్నమాట.." అని నవ్వారు. అప్పటికి నా నోట్లోంచి మాట బయటికొచ్చింది. "నాకు మిమ్మల్ని ఇలా ఎదురుగా చూసాక ఏం చెప్పాలో మాటలు తోచట్లేదండీ.." అని మాత్రం అనగలిగాను.  "ఏం పరవాలేదమ్మా.. నేను అర్థం చేసుకోగలను" అని నవ్వారాయన. నేను ఆయన పాదాలకి నమస్కారం చేస్తే తల పైన చెయ్యి ఉంచి "శుభం తల్లీ.." అని ఆశీర్వదించారు. శ్రీని గారు కాంతి గారిని చూపిస్తూ మిసెస్ కిరణ్ ప్రభ అని చెప్తే "కిరణ్ ప్రభ గారి పేరు బాగా తెలిసిందే కదా.. నాకు తరచూ మెయిల్స్ వస్తూ ఉంటాయి ఆయన దగ్గర నుంచి" అన్నారు. అంతకు ముందు రోజే ఎప్పుడో పాత పత్రికలో బాలు గారి మొట్టమొదటి ఇంటర్వ్యూ కనిపిస్తే కిరణ్ ప్రభ గారు దాన్ని శ్రీని గారికి పంపిస్తే ఆయన అది ఫ్రేం చేయించి బాలు గారికి చిన్న కానుకలా ఇచ్చి ఉన్నారు. ఆ విషయం కూడా ఆయనకి చెప్తే సంతోషించారు. "ఫోటో తీసుకుంటారామ్మా.." అని ఆయనే గుర్తు చేసాక మేము ఫోటోలు తీసుకుని మా కోసం ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి గాల్లో తేలుతూ బయటికి వచ్చేసాం. ఈ గొప్ప అనుభూతిని అందించినందుకు శ్రీని గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే కదా! చిమట శ్రీని గారి ఆధ్వర్యంలో 12.08.2013 న బాలు గారి పాత పాటల స్వర హేల 'అంకితం.. నీకే అంకితం' అనే కార్యక్రమం హైదరాబాదు రవీంద్ర భారతిలో జరగబోతోంది. ఆసక్తి కలవారు వెళ్ళవచ్చు. ప్రవేశం ఉచితం.
మళ్ళీ ప్రోగ్రాం మొదలయేలోపు ఇంకా టైం ఉండటంతో కాసేపు దిలీప్, నేనూ మాట్లాడుకున్నాం. కాఫీలు అవీ అయ్యాక మళ్ళీ రెండో ఎపిసోడ్ మొదలయ్యింది. ఈ సారి ఇంకొక ఐదుగురు కొత్త వాళ్ళు పాడటానికి వచ్చారు. ముందులాగే వాళ్ళందరూ పాడటం మొదలు పెట్టే ముందు బాలు గారు ఆయన స్వరంతో కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఈ ఎపిసోడ్ లో పాటలన్నీ ఇళయరాజా సంగీతంలో వచ్చినవే ఉంటాయన్న తియ్యటి మాట చెప్పి గీతాంజలి సినిమాలోని 'ఓ పాపా లాలీ..' పాట పాడారు. అసలు ఆ సంగీతం, ఎదురుగా బాలు గారు నించుని ఆ పాట పాడుతుంటే.. అలా వింటూ ఉంటే కనులు, మనసు రెండూ తడిసి ప్రాణం ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయింది. ముందులాగే మళ్ళీ అదే ఆశ్చర్యం, అద్భుతం కలగలిసిన భావనేదో మనసంతా నిండిపోయింది! పోటీలో పాల్గొన్నవారిలో ఒక అమ్మాయి 'జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ..' పాట పాడింది. బాలు గారు, జొన్నవిత్తుల గారు ప్రతీసారీ పాటల సాహిత్యం గురించి విశ్లేషించడమే కాకుండా కొన్ని పదాలకి అర్థం తెలుసో లేదోనని పాడిన వారిని కనుక్కుని వారికి వివరించి చెప్పడంతో పాటు పాడినప్పుడు దొర్లిన స్వరదోషాలని కూడా సరిదిద్దారు. తర్వాత ఇంకొకరు 'పరువమా.. చిలిపి పరుగు తీయకే..' పాట పాడుతున్నప్పుడు నాకు ఈ పాట నిషి పరిచయం చేస్తేనే తెలిసిందని కాంతి గారికి చెప్పాను. తర్వాత తెలుగు సరిగ్గా రాని ఇంకొక అమ్మాయి 'కరిగిపోయాను కర్పూర వీణలా..' పాట చాలా బాగా పాడింది. ఈ రెండు పాటలూ వినడానికి చాలా హాయిగా అనిపించినా వాటిల్లో ఉన్న ఆర్కెస్ట్రేషన్ ఎంత క్లిష్టమైనదో, అలాంటివి స్వరపరచడంలో ఇళయరాజా గారి ప్రత్యేకతని వివరించారు బాలు గారు. 'కరిగిపోయాను' పాటలో వేటూరి గారి చిలిపితనాన్ని పట్టి చూపించారు జొన్నవిత్తుల గారు. తర్వాత ఒక అబ్బాయి మహర్షి సినిమాలోని 'సాహసం నా పథం.. రాజసం నా రథం..' పాటని చాలా హైఎనర్జీ లెవెల్స్ తో చక్కగా పాడాడు. ఆ అబ్బాయి పాడుతుంటే స్టేజీతో పాటు మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయిందనిపించింది. అతను పాడటం అయిపోయాక బాలు గారు మెచ్చుకుంటూనే కొన్ని చోట్ల ఎనర్జీ సరిపోలేదని అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అబ్బాయి అంత అద్భుతంగా పాడితే ఈయన ఇలా అంటారేంటి అనిపించింది. ఆ అబ్బాయికి వివరించి చెప్తూ మధ్యలో రెండు లైన్లు ఆయన పాడి వినిపించారు. అది వినగానే చప్పున క్షణంలో అర్థమైపోయింది నాకు నిజంగానే రెండిటికీ తేడా ఉందని. ఆ తేడా ఏంటో, దాన్ని సంగీత పరిభాషలో ఏమంటారో ఇవేవీ తెలియని, స్వరజ్ఞానం లేని నాలాంటి మామూలు వాళ్ళకి ఆయన పాడి వినిపించగానే చాలా తేడా ఉందని మాత్రం చప్పున అర్థమైపోతుంది. ఈ పాట సాహిత్యంలో 'నిర్భయం నా హయం' అన్న పదప్రయోగం గొప్పగా ఉందని జొన్నవిత్తుల గారు వివరించారు. చివరిగా ఒక అబ్బాయి వచ్చాడు పాడటానికి. పేరు నాకు సరిగ్గా గుర్తుంటే అర్జున్ అనుకుంటాను అతని పేరు. ఆ అబ్బాయిని చూస్తే ఇరవయ్యేళ్ళకి మించి ఉండవనిపించింది. 'నిరీక్షణ' సినిమాలో ఏసుదాస్ గారు పాడిన 'సుక్కల్లే తోచావే..' పాటని అస్సలు ఏసుదాసు గారిని గుర్తు చెయ్యకుండా, ఆయన్ని ఏ మాత్రం అనుకరించకుండా తన సొంత శైలిలోనే పాడాడు. ఆ పాట సంగీతం, ఆ అబ్బాయి పాడిన విధానం, సాహిత్యంలో ఉన్న లోతైన భావం.. అన్నీ కలిసి నా చెక్కిళ్ళని తడిపేసాయి. పాట అయిపోయాక తీరిగ్గా గమనించుకుని "బాబోయ్ నేను కళ్ళు తుడుచుకోడం కూడా మర్చిపోయినట్టున్నా.. ఏ కెమెరా వాళ్ళైనా నన్ను గానీ చూపిస్తే ఈ పిల్ల ఎవరో పాపం పాటలు విని ఏడ్చేస్తోంది.." అని చూసేవాళ్ళందరూ నవ్వుకుంటారేమో అనిపించి నాకే నవ్వొచ్చింది. ప్రోగ్రాం అయిపోయాక రెండు మూడు రోజుల దాకా కూడా అప్పుడప్పుడూ ఆ అబ్బాయి పాడిన పాట నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
చివర్లో ఇదివరకు సిరీస్ లో గెలిచిన ఒక అబ్బాయి వచ్చి జొన్నవిత్తుల గారు 'దేవుళ్ళు' సినిమా కోసం రాసిన 'అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా..' అని అద్భుతంగా పాడి మా ఊరి రాముడిని గుర్తు చేసి కళ్ళు చెమర్చేలా చేసాడు. ఏంటో ఇవాళంతా మాటిమాటికీ కళ్ళు తుడుచుకోడమే సరిపోతోంది అని మళ్ళీ నవ్వొచ్చింది. రెండు భాగాల్లో పాడిన పదిమందిలో ఇద్దరు ఎలిమినేట్ అయిన వారి పేర్లు చెప్పి, వారికి బహుమతి ప్రధానం చేసి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం పొడవునా బాలు గారు విసిరిన చతురోక్తులు, జొన్నవిత్తుల గారు ఆశువుగా చెప్పిన పద్యాలతో ఆద్యంతం చాలా సరదాగా సాగింది. మధ్యాహ్నం రెండింటి నుంచీ రాత్రి దాదాపు తొమ్మిదింటి దాకా మధ్యలో తిండి సంగతి కూడా మర్చిపోయి అలసట అన్నమాటే తెలీకుండా అలా సంగీత ప్రవాహంలో కొట్టుకుపోయాం. ఇంకా ఆ పాటలే చెవుల్లో మారుమోగుతుండగా వాటి గురించే కబుర్లు చెప్పుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చేసాం. అప్పటికే చాలా ఆలస్యం అయిందని వస్తూ వస్తూ దారిలో పిజ్జా హట్ నుంచి పిజ్జా తెచ్చుకుని తినేశాం. ఆ రోజు పడుకున్నాక నిద్రలో కూడా నాకు పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉదయం నుంచి గడిచిన సమయాన్నంతా మళ్ళీ మననం చేసుకుంటూ నా డైరీలో ఇది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే రోజని తల్చుకుని మనసు నిండా సంతోషం నింపుకుని సంతృప్తిగా నిద్రాదేవి ఒడిలోకి చేరిపోయాను. :-)

హ్యూస్టన్ లో జరిగిన 'పాడుతా తీయగా' కార్యక్రమం గురించి వంగూరి చిట్టెన్ రాజు గారు రాసిన కాలమ్ ఇక్కడ చదవొచ్చు.

16 comments:

వేణూశ్రీకాంత్ said...

ఒకటికి రెండు సార్లు చదివాను మధురా.. ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ చేసేప్పుడు నేనూ లైవ్ రికార్డింగ్ చూసినట్లే మా వాళ్లకి వివరించేస్తానేమో :-))

రాధిక(నాని ) said...

చాలా సంతోషమండి .ఫోటో పెట్టలేదే నండి

ఫోటాన్ said...

ఆ తెల్ల చీర లో నిజ్జంగా ఏంజెల్ లా వున్నారు :)
ఇంతకూ ఆ ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యిందా? అయింటే లింక్ ఇవ్వండి, :)

Saratchandra said...

చాలా చక్కగా ఉందండీ !

M Saratchandra Rao said...

చాలా చక్కగా ఉందండీ !

ఏకాంతపు దిలీప్ said...

ఒక్కసారి చక్రం తిప్పి ఫ్లాష్బాక్ లోకి వెళ్తే.. తమరు నించున్నట్టు గుర్తు లేదు.. ఆశ్చర్యం అయితే ప్రకటించారు :-D అప్పుడే ఆరు టపాలు కట్టేసావా! అయినా ప్రతి నిమిష గమనం అంత చక్కగా నీకు ఎలా గుర్తుంటుందో!

ఆ రోజు పాడుతా తీయగా చాలా బాగా జరిగింది.. మన అదృష్టమేమో అదీ ఇళయరాజా పాటలు..

Prabha said...

స్వాతీముత్యపు జల్లులలో... శ్రావణ మేఘపు జావళిలో...

ఈ పాటకి సంగీతం ఇళయరాజ గారు కాదండీ హంసలేఖ అనుకుంట

మధురవాణి said...

​@ ​వేణూ శ్రీకాంత్,
థాంక్స్ వేణూ.. ఇంకా నేను చెప్పని విశేషాలు చాలానే ఉన్నాయి. బాలు గారు, జొన్నవిత్తుల గారి సంభాషణల్లో ఛలోక్తులు ఏమీ రాయలేదు. అవి కూడా చెప్పేస్తే రేపు టీవీలో చూసినప్పుడు మీరందరూ ఆ థ్రిల్ అంతా మిస్సయిపోతారేమోనని.. :)

@ రాధిక (నాని),
బాలు గారు ఫోటోలు తియ్యకండి అని చెప్పగానే నేను కెమెరా తీసి లోపల పడేసానండీ. ఆడిటోరియంలో ఒక్క ఫోటో కూడా తీయలేదు. అందుకే పెట్టలేదు. :)

@ ఫోటాన్,
హహ్హహ్హా... ఎవరి అక్కలు వాళ్ళకి ఏంజెల్స్ లానే కనిపిస్తారు బాబూ.. :D
ఆ ప్రోగ్రాం అప్పుడు టెలీకాస్ట్ అవుతుందో నాకు తెలీదు. బహుశా ఇంకొన్ని నెలలు పట్టొచ్చనుకుంటాను. నాకు తెలిసినప్పుడు నీకు చెప్తాలే.. :)

మధురవాణి said...

@ ​M Saratchandra Rao,
ధన్యవాదాలండీ..

@ ​ఏకాంతపు దిలీప్,
ఓ అవునా.. అప్పుడు లేచి నించోనందుకు, ఇప్పుడు నించున్నానని రాసినందుకు sorry.. ;-)
ఆ రోజు మేము కూర్చున్నాక శ్రీని గారు, నువ్వు వెంటవెంటనే వచ్చి పలకరించారు. బహుశా ఆయనొచ్చినప్పుడు నించుని ఉంటాను. అయినా చీరలు కట్టుకున్న అమ్మాయిలు ఊరికూరికే లేచి నించోవాలంటే పనిష్మెంట్ లా ఉంటుంది బాబూ.. ​
నేను కూడా మన దిలీపే కదా ఏం పర్లేదులే కష్టపడి నించోకపోతే అనుకున్నానేమో.. హిహిహి.. :D ​
నిజమే ​కదా.. ఆ పూట మాత్రం మనకి ఇళయరాజా పండగ! :-)​

@ ​Prabha,
నిజమేనండీ.. నేను ఇళయరాజా ప్రవాహంలో కొట్టుకుపోతూ పొరపాటు దొర్లింది. సరిదిద్దినందుకు చాలా థాంక్స్.. :)​

నిషిగంధ said...

అసలు నీ మైండ్ ప్రతీ సెకండ్ ని స్కాన్ చేసి దాచినట్టుంది, ఇన్ని విశేషాలు చదువుతుంటే!!
ఆ పాడుతా తీయగా ఎపిసోడ్ ఎప్పుడొస్తుందో ఎమో నేను కూడా చాలా వెయిటింగ్.. మన వాళ్ళందరినీ చూడొచ్చు :)

దీపూ, తను నించుందా కూర్చుందా తర్వాత సంగతి కానీ ముందు నువ్వు తనని చూడగానే చేతులు కట్టుకున్నావా లేదా అది చెప్పు :)))

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మధుర వాణి గారు,
మీరు చూస్తుంటే నన్ను నేను ఆ కార్యక్రమంలో చూసుకున్నట్టే, బాలసుబ్రహ్మణ్యంగారితో మాట్లాడినట్టే మనసు నిండిపోయింది.
ఎన్నిసార్లు చెప్పినా మధుర మంచమ్మాయి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, వెన్నెల అందంగా ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యంగారు బాగా పాడతారు అనే మాటలు కొత్తగా, మధురంగా, హాయిగానే అనిపిస్తాయబ్బా, మాకేమో...............

ఏకాంతపు దిలీప్ said...

@ మధురా
నువ్వు మారవు.. ఇంక ఎప్పుడైనా నీకు కనపడితే నువ్వు లేచి నించోవాల్సిందే.. ఏదో మిమ్మల్ని కలిసిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటే సారి అంటావా... :-)

@ నిషీ
అసలే మొద్దబ్బాయిని! కిరణ్ ఫ్రభ దంపతుల ముందు మర్యాదగా చేతులు కట్టుకునేవాడినే ఏమో! కానీ ఫోటాన్ అన్నట్టు ఏంజెల్ వెలుగులో చేతులు కలవలేదన్నమాట.. చూస్తూ ఉండు, మన అమ్మాయి నవ్వుల్ని, కన్నీళ్ళని పాడుతా తీయగా కెమెరా ఎలా వాడెసుకుంటుందో..

ChimataMusic said...

Amazing Madhura.. simply awesome!! kaLLaku kaTtinaTTugA chinna minute detail kUDA vadalakunDA rAstunnAru. Very pleased to meet you in the Bay Area and very proud to be associated with you.

Cheers,
Srini

మధురవాణి said...

@ నిషిగంధ,
ఆ రోజు 'పాడుతా తీయగా' లో ఇంకా నేను చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి నిషీ.. అవన్నీ నీకు ప్రోగ్రాం చూసినప్పుడు తెలుస్తాయి చూడు. :)

@ ఏకాంతపు దిలీప్,
ఏదో సరదాకి sorry అన్నాంలెండి మొద్దబ్బాయి గారూ.. ఈసారి కలిసినప్పుడు బోల్డంత గౌరవం ప్రదర్శిస్తూ నువ్వు ఓ ఇరవై అడుగుల దూరంలో కనిపించగానే లేచి నించుంటానులే.. :-))

@ లక్ష్మీ దేవి,
హహ్హహ్హా.. అంతేనంటారా.. నాతో పాటు మీరు కూడా అంత సంతోషించడం చాలా బాగుంది. బోల్డు ధన్యవాదాలండీ.. :-)

@ ChimataMusic,
What a pleasant surprise! మీరు ఇండియా ట్రిప్ లో అంత బిజీగా ఉండి కూడా నేను రాసింది చదివి స్పందించినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండీ. Thank you so much.. Thanks for everything Srini ​గారూ! :-)​

Anonymous said...

Awesome Madhu, Entha bagunnayo ni US kabrulu. vivid description, ni pakkana nenu kuda unnattu und. okka page ni dairy lo chadivaka agaleka chaduvutune unnanu. kani padukovali kada anduke ikkade apesi repu chaduvutanu.
sorry didnt learn to write in telugu yet :(. Eppudu naku dull ga anipinchina nenu edina jandhyala gari movie chustanu, ippati nundi ni sanfransisco kabrulu chaduvutanu, ante migata kabrulu balevu ani kadu, idi kallu, manasu, mind annitini lock chesesindi anthey!
vishwasri

మధురవాణి said...

​@ ​Vishwasri,
wow.. It feels great to hear that my diary is making you happy. Thank you so much dear.. you made my day! Hope you like the rest of it. :-)