Saturday, August 03, 2013

My San Francisco Diary - 7​​17.06.2013
సోమవారం

నిన్న రాత్రంతా కలలో కూడా ఇళయరాజా సంగీతం, బాలు గారి పాటలు వినీ వినీ అలసిపోయానేమో ఈ రోజు పొద్దున్నే ఆలస్యంగా నిద్ర లేచాను. ముగ్గురం కలిసి కూర్చుని నిన్నటి 'పాడుతా తీయగా' కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ టిఫిన్ తినేసాక కిరణ్ ప్రభ గారు ఆఫీసుకి వెళ్ళిపోయారు. తర్వాత నేనూ, కాంతి గారు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం దాకా గడిపేసాం. కిరణ్ ప్రభ గారు లంచ్ కి వచ్చినప్పుడు సాయంత్రం నాలుగున్నర కల్లా తయారై ఉంటే బయటికి వెళదామని చెప్పారు. మధ్యాహ్నం నిషికి ఫోన్లో నిన్నటి పాడుతా తీయగా గురించి పూస గుచ్చినట్టు వర్ణించి చెప్పాక బుద్ధిగా చెప్పిన టైము కల్లా రెడీ అయిపోయి కూర్చున్నాం. కిరణ్ ప్రభ గారొచ్చాక కాఫీ, స్నాక్స్ అయ్యాక ఇంట్లోంచి బయటపడ్డాం.

ఇవాళ మేము వెళ్ళబోయే మొదటి ప్రదేశం పేరు Niles. కాలిఫోర్నియా బే ఏరియాలో Fremont నగరంలో ఉన్న Niles District కి అమెరికా చలనచిత్ర చరిత్రలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలన్నీ కాపలా కాస్తున్నట్టు ఠీవీగా నించుని ఉంటే వాటి మధ్యలో ఒదిగినట్టుగా ఉంటుంది ఈ Niles అనే చిన్న ఊరు. దాదాపు 1850 ప్రాంతంలో పుట్టిన ఈ ఊర్లో అంత పాత కాలం నుంచే రైళ్ళతో సహా చాలా ఆధునిక సౌకర్యాలు ఉండేవట. 1912 లో Essanay Studios నిర్మాణం Niles లో జరిగాక ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. ఎందుకంటే ఆ కాలానికి అత్యంత సూపర్ హిట్ సినిమాలు అయిన చార్లీ చాప్లిన్, బ్రోంకో బిల్లీ ఆండర్సన్ ల మూకీ సినిమాలని నైల్స్ లోనే చిత్రీకరించారట. చార్లీ చాప్లిన్ సినిమాల్లో చాలామందికి తెలిసిన 'The Tramp' సినిమా కూడా ఈ నైల్స్ వీధుల్లోనే తీసారు.

అయితే ఇప్పుడు ఈ Niles ప్రత్యేకత ఏమిటీ అంటే.. ఈ ఊరికున్న చారిత్రిక విలువని గౌరవిస్తూ ఈ ఊర్లోని ప్రధాన వీధులు, భవనాలు, ఇళ్ళు వీటన్నీటిని ఆ పాతకాలం నాటి రోజుల్లోలాగే ఉంచేశారు. అంటే మనం పాత చార్లీ చాప్లిన్ సినిమాల్లో చూసిన షాపులు, ఇళ్ళు ఉన్నట్టే ఉంటాయి ఇప్పటికి కూడా. ఆ antique look ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట. అక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్, రైలు పెట్టెలు కూడా ఉన్నాయి. నైల్స్ లో ఉన్న Essanay సైలెంట్ ఫిలిం మ్యూజియంలో ఆనాటి మూకీ చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయట. అప్పుడప్పుడూ ఆ పాతకాలం నాటి సినిమాలు కూడా ప్రదర్శిస్తుంటారట. ఆ మ్యూజియం కేవలం శని, ఆదివారాల్లోనే తెరిచి ఉంటుంది కాబట్టి మేము మ్యూజియంని సందర్శించే వీల్లేకపోయింది. అయినా సరే చార్లీ చాప్లిన్ సినిమాలు తీసిన ప్రదేశాన్ని చూడటం, ఆ వీధుల్లో తిరగడం ఒక గొప్ప అనుభవం అనిపించింది నాకు. చార్లీ చాప్లిన్ గురించి బ్లాగు మిత్రుడు నాగార్జున రాసిన ఒక మంచి పోస్టు ఇక్కడ చూడొచ్చు.

Nyles నుంచి నేరుగా జొన్నవిత్తుల గారిని కలవడం కోసం కిరణ్ ప్రభ గారి స్నేహితులు ఒకరింటికి వెళ్ళాము. జొన్నవిత్తుల గారు గతంలో కౌముది కోసం శంఖారావం రాసి ఉండటం​, ఆయనకిరణ్ ప్రభ గారూ మంచి మిత్రులవడంతో వారిద్దరూ రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేను వింటూ కూర్చున్నాను. నిన్న 'పాడుతా తీయగా' కార్యక్రమంలో ఆయన్ని కలిసే ఉన్నాను కాబట్టి నన్ను కూడా గుర్తు పట్టారు. జర్మనీ గురించి, నా రీసెర్చ్ గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. మిథునం సినిమాలో ఆయన రాసిన కాఫీ దండకం గురించి, శ్రీరామరాజ్యం పాటల గురించి కాసేపు చర్చ జరిగింది. జొన్నవిత్తుల గారు మామూలు మాటల మధ్యలోనే బోల్డంత సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు ఆశుకవిత్వం చెప్పడం మాత్రం భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలుగు వైభవాన్ని కీర్తిస్తూ తానా సభల్లో విడుదల చేసిన ఆయన పాటల సీడీలు కిరణ్ ప్రభ గారికీ, నాకూ చెరొకటి ఇచ్చారు. తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి మేము బయలుదేరాం.
నేను ఇక్కడికి వచ్చే ముందు ఒకరోజు ఏదో మాటల్లో మా ఇంటబ్బాయ్ "Silicon Valley దాకా వెళుతున్నావు కదా.. Google, Facebook, Apple లాంటివన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి నువ్వు సరదాగా అవి కూడా చూడొచ్చు" అన్నాడు. నాకు వాటన్నీటికీ సంబంధించిన సాంకేతిక విషయాల పరిజ్ఞానం పెద్దగా లేకపోయినా తను అలాంటివన్నీ చాలా ఆసక్తిగా ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి ఈసారికి తన బదులు నేను చూసొస్తాలే అని చెప్పాను. నేనిక్కడికి వచ్చాక కిరణ్ ప్రభ గారు Las vegas వెళదామా అని అడిగితే ఈసారికి అంత దూరంలోవి కాకుండా దగ్గర్లోవి మాత్రం చూద్దామని అన్నాను. అప్పుడే Silicon Valley tech companies వైపు వెళ్ళి సరదాగా అలా చూసొద్దామని అడిగాను. "మేము ఇన్నేళ్ళ నుంచీ ఇక్కడే ఉంటున్నాం గానీ ఎప్పుడైనా అటువైపు వెళ్తే చూడటమే కానీ ప్రత్యేకంగా వాటిని చూడటానికని ఎప్పుడూ వెళ్ళలేదు" అన్నారు కిరణ్ ప్రభ గారు. ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊర్లోని ప్రదేశాలని అంత ప్రత్యేకంగా తిరిగి చూద్దాం అనుకోకపోవడం సహజమే కదా! నేను జర్మనీలో దాదాపు రెండేళ్ళు ఉన్న ఊరి ఫోటోల కోసం ఎప్పుడో వెతికితే నా దగ్గర ఎక్కువ దొరకలేదు. ఎప్పుడూ తిరిగే చోటే కదా అని నాకు ఫోటోలు తియ్యాలన్న ఆలోచన రాలేదు అప్పట్లో. అలాగే సిలికాన్ వ్యాలీలోనే ఉంటున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఏమీ అనిపించదేమో గానీ ఎప్పుడో ఒకసారి బయట నుంచి వచ్చి చూసే వాళ్ళకి మాత్రం ఆ ప్లేస్ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది కదా! :-)

Facebook ముందు కిరణ్ ప్రభ గారు, కాంతి గారు..
ముందుగా 1 Hacker way, Menlo Park లో ఉన్న Facebook Headquarters కి వెళ్ళాము. మొదట ప్రారంభించబడిన Palo Alto నుంచి కొన్నేళ్ళ క్రితమే Facebook ఇక్కడికి వచ్చిందట. దాని ముందు నించుని ఆ ఆఫీసులోకి వెళుతున్న ఉద్యోగులని, భవంతులని చూస్తుంటే "ఈ రోజు ప్రపంచం మొత్తానికీ మంచిదో, పిచ్చిదో అయిన ఒక కొత్త వ్యసనాన్ని పుట్టించింది వీళ్ళే కదా.." అని నవ్వొచ్చింది. అందరూ తీరిగ్గా ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఫ్రెండ్స్, ఫోటోలు, కబుర్లు అంటూ హాయిగా ఉపయోగించుకుంటున్న ఫేస్ బుక్ సాంకేతిక సదుపాయాలు ఇందులో పని చేసే వాళ్ళందరి కృషి ఫలితం కదా అనిపించింది. మా ఇంటబ్బాయ్ చెప్పిన Mark Zuckerberg జీవిత చరిత్ర గుర్తొచ్చింది. కేవలం ఒక వ్యక్తి మేధస్సులో పుట్టిన ఆలోచన మొత్తం ప్రపంచంలోనే ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో.. ఇవాళ అందరి జీవితాల్లోనూ ఫేస్ బుక్ ఒక విడదీయలేని బంధంలా పెనవేసుకుపోయింది కదా అనిపించింది. అటూ ఇటూగా నా అంత వయసున్న అబ్బాయి ఎంత ఘనత సాధించాడు, ప్చ్.. అలాంటి వాళ్ళతో పాటు మనమూ పుట్టినా మనం ఎంత మామూలుగా మిగిలిపోయాం.. అన్న ఆలోచన కూడా వచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళ గురించి తలచుకున్నప్పుడల్లా నాకెప్పుడూ వచ్చే ఆలోచన ఇది. మళ్ళీ అంతలోనే నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చి మా ఇంటబ్బాయ్ వచ్చుంటే చాలా సంతోషించేవాడు కదాని కొంచెం తనని మిస్సయిన ఫీలింగ్ వచ్చింది. ఫేస్ బుక్ మన జీవితాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటీ అన్న విషయం మీద చర్చించుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాం.

Facebook నుంచి నేరుగా Google కి వెళ్ళాము. Amphitheatre Pkwy, Charleston road పేర్లు చూడగానే Google రాజ్యానికి వచ్చేసాం అనిపించింది. అసలు గూగుల్ ని చూసినప్పుడైతే ఇంకా ఎన్నెన్ని ఆలోచనలు వచ్చాయో! ఒక పదేళ్ళ క్రితం అసలు గూగుల్ అనే పేరు కూడా తెలీని నేను గూగుల్ లేకుండా గడిచే రోజుని ఇప్పుడు ఊహించలేను. అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది ఉన్నట్టుండి గూగుల్ మాయమైపోతే మన పరిస్థితి ఏంటి అని.. అన్నీటికన్నా ముందు "అమ్మో.. నా బ్లాగు.." అనిపిస్తుంది నాకైతే! ;-) నేను అలా ఆలోచిస్తూ "అసలు గూగులే లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్న మీరు, జర్మనీలో ఉన్న నేను పరిచయమే అయ్యేవాళ్ళం కాదు కదా.. అంటే గూగుల్ లేకపోతే మన స్నేహమే లేకుండా పోయేదేమో.. మన జీవితాల్ని చాలా మార్చేసింది కదూ.." అంటే కిరణ్ ప్రభ గారు, కాంతి గారు నిజమేనంటూ నవ్వారు. అక్కడ ఫోటోలు తియ్యొచ్చో లేదోనని నేను సందేహపడుతుంటే "ఏం పరవాలేదు. ధైర్యంగా తీసుకో.. వేరే వాటి సంగతి చెప్పలేను గానీ మమ్మల్ని ఫోటోలు తియ్యడానికి వీల్లేదు అని చెప్పే హక్కు మన చరిత్ర మొత్తం తెలుసుకునే గూగుల్ కి బహుశా లేదేమో" అని జోక్ చేసారు కిరణ్ ప్రభ గారు. అక్కడ గూగుల్ కాంపస్లో గూగుల్ లోగోలో కనిపించే రంగుల్లో డిజైన్ చేసిన సైకిళ్ళు కనిపించాయి. నేనూ, కాంతి గారూ ఆ గూగుల్ సైకిళ్ళు తొక్కాలని చాలా సరదాపడ్డాము కానీ మరీ బాగోదేమోనని ఊరికే ఫోటో మాత్రం తీసుకుని వచ్చేశాం. గూగుల్ కాంపస్ పరిసర ప్రాంతాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చుట్టూ కొండలు, మైదానాలతో ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది.

Google దగ్గర నుంచి వెళ్ళి Sunnyvale లో ఉన్న Yahoo Headquarters ని చూసినప్పుడు "అసలు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఆద్యుడు Yahoo వాడే కదా" అనిపించింది. తొంభైల్లో యాహూ మెయిల్ గురించి మొదటిసారి తెలుసుకున్న రోజులు గుర్తొచ్చాయి. తర్వాత Cupertino లో ఉన్న Apple కాంపస్ కి వెళ్ళాం. సహజంగానే స్టీవ్ జాబ్స్ గురించి తలచుకుంటూనే ఐపాడ్ దగ్గర్నుంచీ ఐపాడ్ మినీ దాకా Apple wonders అన్నీ పుట్టింది ఇక్కడేనన్నమాట అనుకున్నాను. ఎవరేమంటేనేం Apple వాడు మాత్రం జనాల్ని క్షణాల్లో మాయ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ కొనిపించెయ్యగలడు కదానిపించి నవ్వొచ్చింది. వాళ్ళ ప్రొడక్ట్స్ లాగే వాళ్ళ ఆఫీసుల ముందున్న బోర్డులు ఒక్కోటి ఒక్కో రంగు apple లోగో తో చూడగానే నచ్చేసేలా ఉన్నాయి. మొత్తానికి ఇంత చిన్న సిలికాన్ వేలీ మొత్తం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందో, చేస్తోందో కదా అనుకుంటూ ఇంకా దారిలో Intel, Oracle, Dell, మన Tata Consultancy Services లాంటివన్నీ చూసుకుంటూ వెళ్ళాము. "ఇప్పుడు నువ్వొచ్చి ఇలా చూస్తుంటే మాక్కూడా ఎప్పుడూ చూసే వీటన్నిటినీ కొత్తగా చూస్తున్నట్టుంది" అన్నారు కిరణ్ ప్రభ గారు.

మనందరికీ చిన్నప్పటి నుంచీ మనకి సంబంధించిన రకరకాల విషయాలను పంచుకోడానికి చుట్టూ ఎప్పుడూ స్నేహితులు ఉంటారు కదా.. కాలేజీ చదువుల వరకూ అందరికీ ఎప్పుడూ పక్కన ఆత్మీయంగా మెలిగే స్నేహితులు ఉంటారు గానీ ఆ తర్వాత ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు దశలోకి వచ్చాక రకరకాల కారణాల వల్ల అప్పటిదాకా ఉన్న ప్రపంచం నుంచి మనకి దూరం పెరిగిపోయి మన చుట్టూ ఒక పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. అంటే మనుషులు ఉండరని కాదు. పరిచయాలు ఉంటాయి కానీ మనసుకి దగ్గరైన స్నేహాలు ఉండడం అరుదు. అంటే ఉదాహరణకి అప్పటికప్పుడు సినిమాకి వెళ్ళడానికో, ఊరికే కాలక్షేపం చెయ్యడానికో ఏ ఆఫీస్ కోలీగో, ఫ్రెండో దొరకొచ్చు. కానీ, ఆ సినిమా కథ గురించో, పాటల గురించో, మనకి నచ్చిన పుస్తకం గురించో విశ్లేషిస్తూ చర్చించతగిన స్నేహితులు దొరక్కపోవచ్చు. బయటికి కనిపించే చదువు, ఉద్యోగం, రోజువారీ విషయాలు కాకుండా మన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు పంచుకోడానికి మన వ్యక్తిత్వాన్ని పోలిన, మన మనసుకి దగ్గరగా తోచే స్నేహితులు దొరకడం కష్టమైపోతుంది. అలాంటి దశలో ఈ గూగుల్, ఫేస్ బుక్ లాంటివన్నీ మొత్తం ప్రపంచాన్ని తీసుకొచ్చి మన ముందు నిలబెడతాయి. కవిత్వం, సాహిత్యం, రాజకీయాలు, చరిత్ర, సైన్సు, ఆటలు, పాటలు.. మన ఆసక్తి ఏదైనా సరే మనలా ఆలోచించేవాళ్ళు, అచ్చం మనలాగే ఫీలయ్యేవాళ్ళు బోల్డుమందిని మనకి అరచేతిలో నిలబెట్టి చూపిస్తుంది. స్నేహం గురించి ఒక నానుడి ఉంది. ఎవరైనా ఒక విషయం చెప్పగానే "నువ్వు కూడానా.. అచ్చం నేనూ అంతే.." అనే మాటతోనే స్నేహం మొదలవుతుందట. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనుషుల మధ్యన ఉండే ఇలాంటి భావసారూప్యతే మన మధ్యన ఉండే దూరాన్ని సైతం లెక్క చేయక వారితో మనకి సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది. అలా ఏర్పడిన స్నేహాలు అమితమైన సంతోషాన్ని, ఆత్మసంతృప్తిని ఇవ్వడమే కాకుండా జీవితకాలపు అనుబంధాలుగా శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

కేవలం ఆన్లైన్ స్నేహితులే కదా అనో, ఆన్లైన్ స్నేహితులు ఇంత ఆప్తబంధువుల్లా మారిపోతారా అని ఎవరికైనా విచిత్రంగా అనిపిస్తే ఒకోసారి అది ఎలా వివరిస్తే వారికి అర్థమవుతుందో వెంటనే తోచదు. కానీ ఆలోచిస్తే, మాములుగా ఏ బస్సులోనో, రైల్లోనో, స్కూల్లోనో, కాలేజీలోనో కలుసుకుని స్నేహితులైనట్టుగానే ఇప్పుడు గూగుల్, ఫేస్ బుక్, యాహూ లాంటి వాటిల్లో పరిచయాలు ఏర్పడుతున్నాయంతే కదా! పరిచయం ఎక్కడ మొదలైంది అన్నదాన్ని బట్టి ఆ అనుబంధాల గాఢతని అంచనా వెయ్యడం సరికాదేమో అనిపిస్తుంది. ఒకోసారి పదేళ్ళు పక్కింట్లోనే ఉన్నా మనకి స్నేహం కలవకపోవచ్చు, ప్రపంచానికి ఆవలి పక్కన ఉంటూ కూడా ప్రాణస్నేహితుల్లా మెలిగేవారు ఉండొచ్చు కదా! ఒకప్పటి కలం స్నేహాలు ఇప్పటి ఆన్లైన్ స్నేహాలు ఒకలాంటివేనేమో అని కూడా అనిపిస్తుంటుంది నాకు. కాకపోతే ఇప్పటిదాకా ఉన్నవాటి కంటే ఈ ఇంటర్నెట్ మాధ్యమం అన్ని రకాలుగానూ మరింత శక్తివంతమైనది. స్పైడర్ మేన్ సినిమాలో "With great power comes great responsibility" అని చెప్పినట్టు కాస్త ఎక్కువ జాగ్రత్తే అవసరమేమో!

మొత్తానికి ఈ సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలని చూస్తూ తిరగడం, మా స్నేహం కూడా ఇలానే మొదలవ్వడం వల్లనుకుంటా.. ఈ సాయంత్రపు సిలికాన్ వ్యాలీ విహారం నాలో రకరకాల ఆలోచనలని కదిలించింది. ఇలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బోల్డు విషయాలు చర్చించుకుంటూ తిరిగేసరికి మా ముగ్గురికీ చాలా ఆకలేసింది కూడా. మేము Cupertino లో ఉన్నప్పుడు అక్కడ కిరణ్ ప్రభ గారి ఆప్తమిత్రులు ఒకరింటికి వెళదామనుకుని ఆయనకి ఫోన్ చేస్తే "నేనిప్పుడే ఇండియా నుంచి వచ్చాను. ఇంట్లోనే ఉన్నాను రండి" అని ఆహ్వానించారు. ఆయన్ని అందరూ GD గారని పిలుస్తారని, చాలా పెద్ద వ్యాపారవేత్త అని, ఇప్పుడు ఇండియాలో ఉంటున్నారు కానీ బిజినెస్ పనుల మీద ఇండియాకి, అమెరికాకి తరచూ తిరుగుతూ ఉంటారని కిరణ్ ప్రభ గారు చెప్పారు. "వాళ్ళ తోటలో పెద్ద కరివేపాకు చెట్టుంటుంది కాబట్టి మనం తాజా కరివేపాకు కూడా కోసుకొచ్చుకోవచ్చు" అని కాంతి గారు ఉత్సాహపడ్డారు. GD గారింటికి వెళ్ళగానే ఆయన సాదరంగా ఆహ్వానించి అప్పుడే ఇండియా నుంచి తీసుకొచ్చిన నువ్వులడ్డు ఇచ్చారు. అసలే ఆకలేస్తుందేమో చాలా రుచిగా ఉందనిపించింది. కాసేపు వాళ్ళ కబుర్లు విన్నాక "మనం వెళ్ళి కరివేపాకు కోసుకుందాం" అన్నారు కాంతి గారు. మా ఇద్దరితో పాటు GD గారు కూడా తోటలోకి వచ్చి సాయం చేస్తానంటే పర్లేదండీ అని చెప్పి ఆయన్ని  పంపించేసాం. నిమ్మచెట్టు మీద పచ్చగా పండి నిగనిగలాడుతున్న నిమ్మకాయలు, లేత కరివేపాకు కోసుకున్నాం. కిరణ్ ప్రభ గారు GD గారికి నన్ను పరిచయం చేస్తూ "రీసెర్చ్ కాకుండా కథలు అవీ రాస్తూ ఉంటుందీ అమ్మాయి. మాకు అలానే పరిచయం అయ్యింది కౌముది ద్వారా.." అని చెప్తే GD గారు "డబ్బు సంపాదించడమన్నా కాస్త సులువేమో గానీ మీ అందరిలాగా కథలు, కవిత్వాలు రాయడం అంటే మహా కష్టమైన పనండీ.. నాకైతే అసాధ్యం" అని జోక్ చేస్తే అంత పెద్ద మాట అనకండి మీరని నవ్వేశాం మేము. మాటల మధ్యలో వచ్చే నెలలో కీరవాణి గారు, రాజమౌళి గారు వస్తున్నారని, కీరవాణి మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుందని GD గారు చెప్పారు. తర్వాత మేము వాళ్ళకి టాటా చెప్పేసి కార్లో వెనక్కి వస్తున్నప్పుడు "GD గారు అంత మాములుగా కనిపిస్తున్నారు గానీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటారు కదా అలాంటి వ్యక్తిత్వం ఆయనది. గొప్ప స్నేహశీలి. ఇటీవల శ్రీరామరాజ్యం, ఈగ లాంటి సినిమాలకి గ్రాఫిక్స్ వర్క్ చేసిన మకుట గ్రాఫిక్స్ సంస్థ GD గారికి చెందినదే. ఆయనకి సినిమా పరిశ్రమతో చక్కటి స్నేహాలు ఉన్నాయి. కీరవాణి, రాజమౌళి ఆయనకి దగ్గరి స్నేహితులు అవడం వల్ల కన్సర్ట్ సంగతి ముందే తెలిసింది." అని కిరణ్ ప్రభ గారు చెప్పారు. Cupertino లో ఇదివరకు కిరణ్ ప్రభ గారు పని చేసిన ఆఫీసు, అప్పట్లో ఆరేళ్ళ పాటు వాళ్ళు ఉన్న ఇళ్ళు, వీధులు చూసుకుంటూ అక్కడి నుంచీ డిన్నర్ చెయ్యడానికి Santa Clara లో ఉన్న Dosai Place కి వెళ్ళాం.
అమెరికాలో, అందునా బే ఏరియాలో, సిలికాన్ వ్యాలీలో ఎప్పుడు తల తిప్పి చూసినా చుట్టూ ఇండియన్స్ కనిపిస్తూనే ఉంటారు కాబట్టి సహజంగానే బోలెడు ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ Dosai Place యజమాని సాగర్ గారు తనకి చాలా మంచి మిత్రులని, అలాంటి మంచి వ్యక్తులని తప్పకుండా కలిసి తీరాలని నన్ను అక్కడికి తీసుకెళుతున్నానని కిరణ్ ప్రభ గారు చెప్పారు. అక్కడికి వెళ్ళే ముందే సాగర్ గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్టారెంట్లోనే ఉన్నానని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఫుడ్ ఆర్డర్ చేసి తిని బయటికి రావడానికి దాదాపు గంటన్నర పైనే పట్టింది. అంతసేపూ కూడా సాగర్ గారు మా పక్కనే కూర్చుని బోల్డు కబుర్లు చెప్పారు. అమెరికాలో వస్తున్న తెలుగు మాసపత్రిక 'నమస్తే ఆంధ్ర' కూడా సాగర్ గారిదేనని తెలిసింది. నన్ను పరిచయం చేస్తూ "మధుర రాసినవి కూడా గతంలో 'నమస్తే ఆంధ్ర' లో వేసారు. తను వచ్చినప్పుడు ఇద్దామని ఒక పత్రిక కాపీ తీసి దాచాను. కానీ అదెలాగో మిస్ అయింది" అని కిరణ్ ప్రభ గారు చెప్తే సాగర్ గారు వెంటనే "ఎప్పుడు ఏ నెలలో వచ్చిందో చెప్పండి. నేను కాపీ దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను" అని ఎవరికో ఫోన్ చేయబోయారు. "ఫిబ్రవరి 2012 లో వాలెంటైన్స్ డే స్పెషల్ పేజీలో ప్రేమలేఖ లాగా నేను రాసిన పోస్టుని తీసుకుని వేసారండీ. కలర్ పేజీలో అందంగా డిజైన్ చేసారని అప్పట్లో నాకోసం ఒక కాపీ తీసిపెట్టారు కిరణ్ ప్రభ గారు. కానీ, చాలా రోజులైపోయింది కదండీ. ఇప్పుడంత కష్టపడి వెతకడం ఎందుకులెండి. పర్లేదు" అని చెప్పి ఆయన్ని వారించాను నేను. సాగర్ గారి చిన్ననాటి స్నేహితుడి వాళ్ళ అబ్బాయి జర్మనీలో మాస్టర్స్ చదువుకోడానికి వచ్చాడని, తనతో మాట్లాడి తనకి ఏమన్నా సహాయం అవసరమైతే చెయ్యమని నన్ను కోరారు. ఆ అబ్బాయి పేరు భరత్. అలాగేనని చెప్పి నా ఈమెయిలు ఐడీ ఇచ్చి వస్తే తెల్లారి భరత్ మెయిల్ చేసి "జర్మనీ వచ్చాక మాట్లాడతాను అక్కా.. చాలా థాంక్స్.." అని చెప్పాడు. భలే చిత్రంగా అమెరికా వెళ్ళడం వల్ల జర్మనీలో ఇంకో కొత్త పరిచయం ఏర్పడింది. త్వరలో జరగబోతున్న NATS సభల కోసం ఇండియా నుంచి నందమూరి బాలకృష్ణ వచ్చారని, భోజనం ఇక్కడి నుంచే పంపిస్తున్నారని సాగర్ గారు చెప్తుంటే మాటల్లో ఎన్టీఆర్ గురించి వచ్చింది. కిరణ్ ప్రభ గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ NTR  సినీ జీవిత ప్రస్థానం గురించి చేసిన రేడియో ప్రోగ్రాం మొత్తం 13 భాగాలు కలిపి 24 గంటల నిడివి వచ్చింది. అంటే ఆపకుండా 24 గంటల పాటు ఎన్టీఆర్ సినీజీవిత విశేషాలు వినొచ్చన్నమాట. సంగతి తెలిసిన సాగర్ గారు చాలా ఉత్సాహంగా ఆ ప్రోగ్రాం సీడీ చేసి ఇస్తే NATS కి వెళ్ళినప్పుడు బాలకృష్ణకి ఇస్తానని, ఆయన ఎన్టీఆర్ గురించి అంత మంచి ప్రోగ్రాం వింటే చాలా సంతోషిస్తారని చెప్పారు. ఆ రోజు డిన్నర్లో రుచి చూసిన పుణుగులు, కొత్తు పరాటా, ఊతప్పం, గోబీ 65, వెజ్ బిరియానీ అన్నీ చాలా బాగున్నాయి. అంత చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చిన సాగర్ గారు బిల్ తీసుకోడానికి మాత్రం ససేమిరా అని మళ్ళీ తప్పకుండా రండి అని చెప్పి గుమ్మం దాకా వచ్చి సాగనంపారు. వచ్చే వారం నిషి వచ్చినప్పుడు వీలైతే మళ్ళీ వస్తాం అని చెప్పాం కానీ మాకు మళ్ళీ కుదరనేలేదు. Dosai Place నుంచి ఇంటికొచ్చేసరికి రాత్రి దాదాపు పదకొండు గంటలయింది. అప్పటికే బాగా అలసిపోయున్నామేమో వెంటనే నిద్రొచ్చేసింది.

18.06.2013
మంగళవారం
రోజు ఉదయమంతా నేనూ, కాంతి గారూ యథావిధిగా కబుర్లు చెప్పుకున్నాం. మధ్యాహ్నం లంచ్ తర్వాత కిరణ్ ప్రభ గారు మా ఇద్దర్నీ Stone ridge mall లో దింపి వెళ్ళారు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేప్పుడు మళ్ళీ పికప్ చేసుకుంటానని చెప్పారు. మా ఇద్దరికీ కాళ్ళు నొప్పులు పుట్టేదాకా సాయంత్రం వరకూ బోల్డు షాపులు తిరిగేశాం. మాకోసం కొనుక్కోడానికి పెద్దగా నచ్చినవేమీ కనిపించలేదు గానీ ఆ రోజు మా ఇంటబ్బాయ్ కోసం చాలా బట్టలు కొన్నాం. ఆ రోజు సెలెక్షన్ అంతా కాంతి గారిదే. తనకి ఈ కలర్ బాగుంటుంది, ఆ డిజైన్ బాగుంటుంది అనుకుంటూ బోల్డు చొక్కాలు కొనేసాం. కష్టపడి ఆ షాపింగ్ బ్యాగులన్నీ మోసుకుని మాల్ బయటకొచ్చి కిరణ్ ప్రభ గారికి కాల్ చేస్తే పది నిమిషాల్లో వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడేమన్నా కొనుక్కుని తినాలన్న ధ్యాస కూడా లేనంతగా షాపింగ్లో మునిగిపోయేసరికి బోల్డు అలసిపోయి చాలా ఆకలేసింది.ఇంటికి వెళ్ళగానే వేడి వేడిగా టొమాటో సూప్ తాగి, పాప్ కార్న్ తిని హమ్మయ్యా అనుకున్నాం. :-)

రోజు మంగళవారం కాబట్టి కిరణ్ ప్రభ గారికి 'విరిజల్లు' రేడియో షో ఉంటుంది కాబట్టి బయటికి ఎక్కడికీ వెళ్ళే ప్లాన్ లేదు. ఆయన అరవై సంవత్సరాల 'దేవదాసు' సినిమా గురించి రేడియో ప్రోగ్రాం చేస్తుంటే నేనూ, కాంతి గారూ కూడా శ్రద్ధగా విన్నాం. రేడియో షో అయిపోగానే కిరణ్ ప్రభ గారికి ఎవరో ఫోన్ చేసి పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నాం అని చెప్పారు. ఆ వచ్చేది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తమ్ముడు శ్రీరామ్ గారు అని కాంతి గారు నాతో చెప్పారు. కాసేపటికే శ్రీరామ్ గారు, వారి స్నేహితుడితో కలిసి వచ్చారు. ఆయన రూపం, మాట్లాడుతుంటే గొంతు రెండూ సిరివెన్నెల గారిని బాగా గుర్తు చేసాయి. ఎవరూ చెప్పకుండానే సిరివెన్నెల గారికి, ఈయనకీ ఏమన్నా బంధుత్వం ఉందేమోనని మనకే తెలిసిపోతుంది. కిరణ్ ప్రభ గారు, శ్రీరామ్ గారు ఎవరెవరో చాలా మంది గురించి యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఉంటే నేను వింటూ కూర్చున్నాను. శ్రీరామ్ గారి అమ్మాయి, మనవలతో కలిసి సెలవలకని అమెరికా వచ్చారట. ఆ రోజు ఉదయం నుంచీ Napa valley లో తిరిగి వెనక్కి వస్తూ ఇక్కడికి వచ్చారట. అందరూ రావలసింది గానీ మధ్యలో పిల్లలు అలసిపోయి గొడవ పెట్టేసరికి వాళ్ళు వేరే కారులో ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు. వాళ్ళందరూ ఇదివరకు చాలాసార్లే వచ్చారని, అందరితోనూ కిరణ్ ప్రభ గారికి మంచి స్నేహం ఉందని తెలిసింది. శ్రీరామ్ గారు మాటల్లో వాళ్ళ అల్లుడు గారు పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాతో బిజీగా ఉండి ఈ ట్రిప్ కి రాలేకపోయారని చెప్పారు. తర్వాత మిగతా సినిమాల గురించి ఇంకా ఏవో మాటలు విన్నాక వారి అల్లుడు గారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని నాకు అర్థమైంది. శ్రీరామ్ గారికి నన్ను పరిచయం చేస్తూ జర్మనీలో PhD అని చెప్తే ఆయన మా ఊరు, నాన్న గారి వివరాలు అడిగారు. వాళ్ళ స్నేహితుడి అమ్మాయి ఎవరో జర్మనీలో PhD చేసిందని, ఒకవేళ అది నేనేనేమో అనిపించి అడిగానని అన్నారు. "సిరివెన్నెల తరంగాలు పుస్తకం మళ్ళీ ఎప్పుడు అచ్చు వేస్తారండీ" అని నేను అడిగితే "తెలీదమ్మా.. చెప్పలేం. అన్నయ్య నిర్ణయిస్తారు ఏ విషయమూ.. అయినా ఇప్పుడు కౌముదిలో వస్తోందిగా.." అన్నారు. శ్రీరామ్ గారు ఉన్నంతసేపు సిరివెన్నెల గారి గురించి కబుర్లు వినడం భలే అనిపించింది.

ఒక గంట పైన కూర్చుని శ్రీరామ్ గారు వాళ్ళు వెళ్ళిపోయాక "సిరివెన్నెల గారు 2004 లో అమెరికా వచ్చినప్పుడు మనింట్లో నలభై రోజులు ఉన్నారు" అని కిరణ్ ప్రభ గారు చెప్పారు. "2008 లో వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్న గదిలోనే పది రోజులు ఉన్నారు" అని కాంతి గారు చెప్పగానే నేను ఆశ్చర్యంతో ఎగిరి గంతేసినంత పని చేసాను. నిజంగా నిజమా అని మళ్ళీ మళ్ళీ అడిగితే "నీ గదిలో బీరువా మీదున్న ఫోటో మాగ్నెట్ చూసావా.. అది సిరివెన్నెల గారిని San Francisco తీసుకెళ్ళినప్పుడు దిగిన ఫోటో.." అని మళ్ళీ ఒకసారి దగ్గరుండి చూపించారు కాంతి గారు. "ఈ గదిలో చాలామంది ప్రత్యేక అతిథులు ఉన్నారమ్మా.. సిరివెన్నెల గారు, గొల్లపూడి మారుతీరావు గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, బలభద్రపాత్రుని రమణి గారు, జొన్నవిత్తుల గారు, ఆకెళ్ళ గారు, ఆర్పీ పట్నాయక్, పార్వతి మెల్టన్, శర్వానంద్, పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు​.. వీళ్ళందరూ కాక ఇంకా మధుర అనే అమ్మాయి కూడా ఉంది. అయినా మధుర మాత్రం గెస్టు కాదులే, ఈ రూమ్ ఇంక తనకేనని ఇచ్చేసాం.." అని నవ్వారు కిరణ్ ప్రభ గారు. "అయ్య బాబోయ్.. అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారా ఈ గదిలో.." అని నేనింకా బోల్డు ఆశ్చర్యపోతూనే ఉన్నాను ఆ పూటంతా. ఆ ఆశ్చర్యంలోనే అన్నం తినేసి, నిద్ర కూడా పోయాను ఆ రోజుకి. :-)
ఎప్పుడెప్పుడు తెల్లారిపోయి బుధవారం వస్తుందా అని కాంతి గారు, నేను తెగ ఆరాటపడిపోవడం మొదలెట్టాం. ఎందుకంటే నిషి వచ్చేది రేపే కదా మరి! :-)

22 comments:

Anonymous said...

నేనే ఫస్ట్ :)

ఏకాంతపు దిలీప్ said...

దసరథ్ గూడే గారిని కూడా కలిసావన్నమాట! అవును ఆయన హైదరబాద్లో మా చిప్ డిజైనింగ్ ఇండస్ట్రీకి ఒక మూల స్థంభం..

Sunita Manne said...

ఏమిచెప్పను? నీతోపాటు చూస్తున్నట్టే ఉంది. ఫ్రీమాంట్ లో నా ఫ్రెండ్ ఉంది. అదెప్పుడు రమ్మన్నా ఏదో ఒక కారణం వెళ్ళడానికి కుదర్లేదు. నువ్వు రాసిన విశేషాలన్నీ బుక్ మార్క్ చేసుకుంటే వెదుక్కోకుండా చూడొచ్చు:))మిగిలిన విశేషాల కోసం ఎదురుచూపు:)) ఇప్పుడు కాంబో స్పెషల్ కదా:)))

dilipkumar said...

PRATHI AMSAM ATI-SAMEEPALAM UNDI VIVARITUNNATLU UNDI.

రాధిక(నాని ) said...

స్నేహితులరోజు శుభాకాంక్షలు.చక్కని స్నేహితులు మీకు దొరికారు.మీరు రాస్తున్నది చదువుతుంటే బందువులు కూడా అంత ఆత్మీయంగా ఉండరేమో అనిపిస్తుంది .మీ స్నేహం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మంచి టైమ్ లో మీరు అమెరికా వెళ్లారు .చక్కగా అందరినీ కలసి ఆ వివరాలన్నీ మాతో పంచుకుంటున్నారు.థాంక్యు ... .నిషి గారి కోసం నేనూ ఆత్రుతగా చూస్తున్నాను.

బాల said...

వావ్!!! మీరు silicon valley చూసేశారా? మీరు లక్కీ అండీ, నాకు మీ మీద జెలసీగా ఉందండీ...... ;-)

Chandu S said...

ప్రతి ఎపిసోడ్ చాలా బాగుంటోంది మధురా. Thanks for sharing your experiences

శ్రీనివాస్ పప్పు said...

"ఈ గదిలో చాలామంది ప్రత్యేక అతిథులు ఉన్నారమ్మా.. సిరివెన్నెల గారు, గొల్లపూడి మారుతీరావు గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, బలభద్రపాత్రుని రమణి గారు, జొన్నవిత్తుల గారు, ఆకెళ్ళ గారు, ఆర్పీ పట్నాయక్, పార్వతి మెల్టన్, శర్వానంద్.. వీళ్ళందరూ కాక ఇంకా మధుర అనే అమ్మాయి కూడా ఉంది. అయినా మధుర మాత్రం గెస్టు కాదులే, ఈ రూమ్ ఇంక తనకేనని ఇచ్చేసాం.."

సూపర్ మధురా ఇక్కడ మాత్రం నాకు సాగరసంగమం సినిమాలో జయప్రద,కమల్‌హాసన్ ల సీన్ గుర్తొచ్చింది సెబాసో

http://www.youtube.com/watch?v=RtyCvy1RmF8

Krishna said...

నేను జూన్ 21 దాకా Pleasanton లో ఉన్నాను ...నాకు అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు అని తెలియదు. ఎక్కువగా Fremont, Sunnywale ల లో ఉంటారు అని విన్నాను.. మీరు బాగా రాస్తున్నారు.
Krishna

KumarN said...

ఇంట్రస్టింగ్. ఈ పార్ట్ బాగా నచ్చింది :)

Early 80s లో మా ఊళ్ళో ఉన్న అతి చిన్న గ్రంథాలయంకి వెళ్ళే రోజుల్నుంచీ కిరణ్ ప్రభ గారి కవిత్వం చదివేవాణ్ణి. చాలా ఏళ్ళు రాసేది అమ్మాయి అని అనుకోవడం గుర్తు :) ఇక్కడికొచ్చాక, వారు కూడా యు ఎస్ లో ఉంటారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ( ఎప్పుడో ఓ డిఫరెంట్ ఎరా..ఆంధ్రభూమి, పల్లకీ, స్రవంతి ల రోజులు :))

ఫైనల్లీ ఐ గాట్ అ లుక్ అట్ హిమ్ నౌ :)

ఎనీవే, మీ కబుర్లు బాగున్నాయి. గాడ్ బ్లెస్ యు ఆల్!

M Saratchandra Rao said...

చాలా బాగుందండీ !

వేణూశ్రీకాంత్ said...

నీ ట్రిప్ కబుర్లు వాటితో పాటే నీ ఆలోచనలు వేటికవే అద్బుతం. ఇంత వివరంగా రాస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు అందుకో :-)

చిన్ని ఆశ said...

మీ Diary లో నేరుగా ఏడవ పేజీ చదివేశాం ;)
చాలా ఆసక్తి గా అన్నీ విపులంగా కళ్ళకి కట్టినట్టు రాశారు, సిలికాన్ వ్యాలీ తిరిగి చూసినట్టినిపించింది. అందరి ప్రముఖులనీ కలిసిన మీ ఈ ట్రిప్ మరపురానిదిగా మిగిలిపోతుంది. ఎందరో గొప్పవాళ్ళున్న రూం లో మీరూ ఉండగలగటం...వారి సరసన మీ పేరూ, ప్రతిభా ఎప్పటికైనా చేరకపోదు.

నిషిగంధ said...


వేణు చెప్పినట్టు వెళ్ళిన ప్లేసెస్ గురించే కాకుండా వాటిపట్ల నీ ఆలోచనల్ని కూడా మిళితం చేసి రాస్తున్నందవల్లనేమో, మధురా ఇది ఒక టావెలాగ్‌లా కాకుండా అసలైన డైరీ లానే ఉంది, ఆపకుండా చదివిస్తోంది!

లాస్ట్ టైమ్ నేను కిరణ్‌ప్రభ గారి దంపతులతో దోస పాలెస్‌‌కి వెళ్ళినప్పుడో చిన్న సంఘటన జరిగింది. ఆరోజు మేము శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ అంతా తిరిగి చాలా అలిసిపోయి ఉన్నాము.. వెళ్ళగానే కౌంటర్ దగ్గర వేరేవాళ్ళతో మాట్లాడుతున్న సాగర్‌గారు వెంటనే చుట్టూ తిరిగి బయటకొచ్చి, మమ్మల్ని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, తనే స్వయంగా మా అర్డర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. అంతలో వాటర్ పెట్టడానికి ఒక అబ్బాయి వచ్చాడు. చూడ్డానికి మాస్టర్స్ చేస్తున్న కాలేజ్‌అబ్బాయిలా ఉన్నాడు. వాటర్ గ్లాసుల్లో పోస్తూ, కిరణ్‌ప్రభ గారితో మాట్లాడటం కాస్త చనువుగా, అంతకుముందే ఎరిగున్నవాడిలా మాట్లాడాడు. అతను అటు వెళ్ళగానే కాంతిగారు, కిరణ్‌ప్రభ గారి ముఖాల్లో పేద్ద క్వెస్చెన్ మార్క్, 'ఎవరితను?' అని! ఇంక ఇద్దరూ, అక్కడ చూశామా లేదు ఈ ఫంక్షన్‌లో చూశామా.. అలా కాకుంటే ఫలానా వాళ్ళ చుట్టాలబ్బాయి అనుకుంటా అని అన్నిరకాలుగా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు.
ఆ మధ్యలో ఆ అబ్బాయి మళ్ళీ రావడం మా ఆర్డర్ సర్వ్ చేసి ఇంకేదో మాట్లాడటం కూడా అయ్యాయి, కానీ వీళ్ళకి మాత్రం అతన్ని ఎక్కడ/ఎలా ఎరుగుదురన్న విషయం మాత్రం గుర్తు రావడం లేదు.
ఉన్నట్టుండి, కిరణ్‌ప్రభ గారు, ముందుకు వంగి కాంతిగారితో "ఇలా ఎప్పుడైనా మనుషుల్ని గుర్తుపెట్టుకోలేనంత గర్వం నాలో పెరిగినట్టనిపిస్తే వెంటనే నన్ను నేలమీద దింపు, ప్లీజ్!" అని అన్నారు.
నాకైతే అసలు నోటమాటరాలేదు!! ఆయన తన ప్రతీ పరిచయానికీ ఎంత విలువనివ్వకపోతే అంత మాట ఆయన వద్దనించి వస్తుందీ అనిపించింది!
ఆయన హంబుల్‌నెస్‌కి ఇంతకంటే పెద్ద ఉదాహరణ నేను చూపించలేను.
నువ్వు ఆ రూమ్‌లో ఉన్నవాళ్ళ లిస్ట్ రాశావు కదా, అంతటి ప్రముఖులతో ఎంతో దగ్గర స్నేహితం ఉన్న ఆయన మన దగ్గరకొచ్చేసరికి అచ్చు మనలానే మారిపోతారు.. మనమధ్య కలిసిపోతారు!

అఫ్‌కోర్స్, అతన్ని ఎక్కడ కలిశారో వాళ్ళకి డిన్నర్ పూర్తవకుండానే గుర్తువచ్చేసిందనుకో.. అది వేరే విషయం! ఒక పార్టీలో ఎప్పుడో దాదాపు సంవత్సరం క్రితం చూశారంట. :-)

మధురవాణి said...

​@ ​యమ్.ఎల్.ఏ,
:-)

@ ​ఏకాంతపు దిలీప్,
హేయ్ దిలీప్.. అయితే నీకు GD గారు తెలుసన్నమాట.. cool! :-)

@ Sunita Manne,
నాతో పాటు కలిసి తిరుగుతున్నందుకు బోల్డు థాంక్స్.. Fremont ప్రయాణం పెట్టుకునేప్పుడు నాక్కూడా చెప్పండి మరి.. :-) ఊ ఊ.. డైరీలో తర్వాతి పేజీ కోసం నేను కూడా తెగ ఎదురు చూస్తున్నాను. :D

@ dilipkumar,
నా డైరీ మీరు కూడా ఫాలో అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ సో మచ్ దిలీప్ గారూ! :-)

మధురవాణి said...

@ ​రాధిక (నాని),
మీ ఆత్మీయ శుభాకాంక్షలకి ధన్యవాదాలండీ.. మీక్కూడా స్నేహితులరోజు శుభాకాంక్షలు. నా వరకు నాకైతే బంధువుల కంటే స్నేహితుల్లోనే ఎక్కువ ఆత్మీయులు ఉన్నారండీ. ఏ బంధుత్వమూ లేకపోయినా ఏర్పడే అనుబంధం స్నేహం కదండీ.. కాబట్టి మరింత విలువైనదేమో అనిపిస్తుంది నాకు. :-) ​


@ బాల,
హహ్హహ్హా.. అంతేనంటారా.. థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్.. :))​


@ Chandu S,

Great to see your comment శైలజ గారూ.. థాంక్యూ సో మచ్! :-)

@ శ్రీనివాస్ పప్పు,
మీకు భలే భలే గుర్తొస్తాయండీ బుల్లెబ్బాయ్ గారూ.. అందులో కమల్ హాసన్ లా నిజంగా నేను సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఆశ్చర్యపడటం మాత్రం అంతే అనుకోవచ్చండీ. మళ్ళీ ఒకసారి సాగరసంగమం చూపించారు​. బోల్డు ధన్యవాదాలు. ​

మధురవాణి said...

​@ Krishna,
థాంక్సండీ.. నేను అక్కడున్నప్పుడు Pleasanton కి వచ్చానండీ కొన్నిసార్లు. ​
​Fremont, Sunnyvale అంత కాకపోయినా ​
అక్కడ కూడా తెలుగు వాళ్ళు బానే ఉన్నారనుకుంటాను.

@ KumarN,
నేను రాసిందేమో గానీ మీ కామెంట్ సూపర్ ఇంటరెస్టింగా ఉందండీ.. అన్నేళ్ళ క్రితం వీక్లీల్లో చూసిన కవిత్వం, కవి పేరు భలే గుర్తున్నాయండీ మీకు.. :-)
I'm glad that you are liking my posts. Thank you!

@ M Saratchandra Rao,
ధన్యవాదాలండీ..

@ వేణూశ్రీకాంత్,
Thank you so so much.. Venu! :-)

మధురవాణి said...

​@ చిన్ని ఆశ,
​ధన్యవాదాలండీ.. ఎన్నో మధుర జ్ఞాపకాలున్న ఈ ట్రిప్ ఎప్పటికీ ప్రత్యేకంగానే గుర్తుండిపోతుందండీ నాకు. :-)

@ నిషిగంధ,
మనం ఇదివరకు చెప్పుకోని కొత్త విషయం చెప్పావు నిషీ.. నువ్వన్నది నిజమే, వాళ్ళిద్దరి పక్కనుంటే రోజుకొకటైనా మనం నేర్చుకోతగ్గ విషయం కనిపిస్తుంటుంది. Thanks for sharing your memory.. :-)

cbrao said...

మీ శాంఫ్రాన్సిస్కో డైరీ అన్ని భాగాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రావెలాగ్ లా కాకుండా ఒక స్నేహితురాలు కబుర్లు చెప్తున్నంత ఆత్మీయంగా ఉన్నాయి. గూగుల్ కి దగ్గర్లోనే Linkedin office ఉంది. Career buildup కి అది దోహదకారిగా ఉంటోంది. ఇంకా శాన్ హోసె (San Jose) లో ఈ-బే, సిస్కో, అడోబీ (Adobe famous for Photoshop), సన్నీవేల్లో ప్లాక్సొ (Plaxo), పాలో ఆల్టో లో హెచ్.పి (H.P.) ఉన్నాయి. మీరున్న సమయంలో వీక్షణం (Bay Area writers meet) సమావేశం జరగలేదా? జరిగితే డా||.గీత కూడా పరిచయమయ్యేవారు మీకు. కిరణ్ ప్రభ గారి నివాసం లో జరిగిన వీక్షణం సమావేశానికి నిషీగంధ కూడా వచ్చింది. వీక్షణం విశేషాలలో తన గురించికూడా వ్రాసాను. చూడండి http://www.koumudi.net/Monthly/2012/november/index.html

మధురవాణి said...

​@ cbrao,
నేను రాస్తున్నవి మీకు నచ్చుతున్నందుకు సంతోషమండీ.. సిలికాన్ వేలీ కంపెనీలంటే ఒకటా రెండా బోల్డు ఉన్నాయి కదండీ.. అప్పుడున్న కొద్ది టైములో అంతవరకే చూడగలిగాను. మీరు చెప్పినవన్నీ బహుశా మళ్ళీ సారి వెళ్ళినప్పుడు చూస్తాను. థాంక్యూ సో మచ్! :-)
మీ వీక్షణం సమావేశాల గురించి కిరణ్ ప్రభ గారు చెప్పారండీ. అప్పుడు నిషి వచ్చినప్పటి సంగతి కూడా తెలుసు నాకు. కానీ నేను అక్కడున్నప్పుడు ​
​వీక్షణం జరగలేదండీ. మీరిచ్చిన లింకులో నాకు వీక్షణం వ్యాసం ఎక్కడుందో కనిపించలేదండీ.

cbrao said...

ఆ గొలుసు (Link) లోని పుటలో ఎడమ పక్కన సూచిక (Index) లో వ్యాస కౌముది కింద వీక్షణం విశేషాలు అనే బొత్తం పై క్లిక్ చెయ్యండి. మీకు ఆ నెల వీక్షణం విశేషాలు తెలుస్తాయి. ఇవి ప్రతి నెలా కౌముది మాస పత్రిక లో ప్రచురితమవుతాయి. ఈ సారి శాంఫ్రాన్సిస్కో వచ్చేటప్పుడు రెండవ శని లేదా ఆదివారం సమావేశానికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి. Bay Area writers, editors సాంగత్యం మీకు నచ్చగలదు.

మధురవాణి said...

@ cbrao,
I found the link now. Thanks for your suggestions.