Wednesday, August 14, 2013

My San Francisco Diary - 11



​​​​23.06.2013
ఆదివారం
ఈ రోజు ఉదయాన్నే వీలైనంత త్వరగా ​ఇంట్లోంచి బయలుదేరి బీచ్ కి వెళదామని అనుకున్నాం. నేను నిద్ర లేచేసరికే కాంతి గారు మేము తీసుకెళ్ళడం కోసమని పులిహోర కలిపారు. మేము టిఫిన్లు చేసి తీరిగ్గా తయారై ఇంట్లోంచి బయటపడేసరికి దాదాపు పదిన్నర అయింది టైము. బీచులకి వెళదాం అనుకుంటున్నప్పటి నుంచీ హాఫ్ మూన్ బే, 17 మైల్ డ్రైవ్.. వాటికి వెళదామని కిరణ్ ప్రభ గారు చెప్తుంటే నేనేమో ముందు Big Sur కి వెళదామని అడిగాను. ఇదివరకెప్పుడూ వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ముగ్గురికీ మొదటిసారన్నమాట ఈ బీచ్ ట్రిప్. మా ఇంటి నుంచి బిగ్ సర్ కి రెండు గంటల పైనే డ్రైవ్. సగం దూరం వెళ్ళాక రోడ్డుకి ఒక పక్కన సముద్రం, ఇంకో పక్కన పెద్ద పెద్ద కొండలు ఉన్న రోడ్లో సాగింది మా ప్రయాణం. ఆ ప్రదేశం చాలా ఎత్తులో ఉండటం, పక్కనే సముద్రం ఉండడం వల్లనుకుంటా చాలా తక్కువ ఎత్తులో మన పైపైనే పొగమంచు మబ్బులు తేలుతున్నాయి. కారు వెళుతున్న రోడ్డు నుంచీ కుడి పక్కకి ఓ ఐదారు అడుగులేస్తే కింద పే..ద్ద సముద్రం. అలా కొండ అంచుల్లో వెళుతూ సముద్రాన్ని చూడటం థ్రిల్లింగానే అనిపించినా అలాంటి దారుల్లో డ్రైవ్ చెయ్యాలంటే నాలాంటి ధైర్యవంతులు అస్సలు పనికిరారనిపించింది. ఆ కొండల మీద రకరకాల రంగుల్లో పూసిన గడ్డి పూలు, ముదురాకుపచ్చ కొండలు, లోయల మీదుగా అలా గాలిలో ఎగురుతూ పోతున్న పొగమంచు దుప్పట్లు, వందల ఏళ్ళ నుంచీ సముద్రం మధ్యలో మొండిగా నిలబడిన ఒంటరి శిలలు, ఆ కొండ రాళ్ళ మధ్యలో కట్టిన పాతకాలం వంతెన అవన్నీ కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోవాలనిపించేంత అందంగా ఉన్నాయి.


Big Sur ఊర్లోకెళ్ళాక అక్కడో మ్యాప్ కొనుక్కుని చుట్టపక్కల ఏమేం ఉన్నాయో తెలుసుకుని Pfeiffer Beach కి వెళ్ళాం. ఆ బీచ్ కి వెళ్ళే దారి చూసి అసలు లోపలకి వెళ్తే నిజంగా బీచ్ వస్తుందా రాదా అన్నంత సందేహం వచ్చింది మాకు. ఎందుకంటే అదేదో అడవిలోకి వెళ్ళే డొంక దారి లాగా, ఇంకా చెప్పాలంటే మా ఊరి వైపు అడవుల్లో ఉన్న చిన్న చిన్న ఊర్లకి వేసే సన్నటి సింగిల్ రోడ్డు లాగా ఉంది ఆ బీచ్ కి వెళ్ళే దారి. మా సందేహాలన్నీ మాయం చేస్తూ అక్కడ కార్ పార్క్ చేసి బీచ్ లోకి వెళ్ళే దారి కనపడింది. అప్పటికే ఆకలేస్తూ ఉండటంతో మేం తెచ్చుకున్న పులిహోర తినేసి బీచ్ వైపు బయలుదేరాం. ఆ వెళ్ళే దారి చిన్నగానే ఉంది కానీ లోపలికి వెళ్ళాక అక్కడ పెద్ద పెద్ద కొండలు, బండ రాళ్ళ మధ్యన ఎగిసి పడుతున్న విశాలమైన సముద్రం ఎదురైంది. ఆ బీచ్ లో ఇసుక ఒకలాంటి పర్పుల్ రంగులో ఉంటుందని నేను ఇదివరకే విన్నాను. బీచ్ లో ఇసుక మేటల మీద పై పొర గాలికి ఎగిరిపోయి ఊదా రంగు ఇసుక గీతలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కాంతి గారికి కూడా ఆ రంగంటే చాలా ఇష్టం. నేను ముందు ఆ రంగులో ఇసుక ఉంటుందని చెప్తే అలా ఎలా ఉంటుంది అన్నారు. అక్కడ చూసినప్పుడు నాకన్నా ఎక్కువ ఎక్సైటింగా ఫీలయ్యారు. అక్కడి సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ళలో ఉండే మాంగనీస్ వల్ల కొన్ని ఇసుక రేణువులు ఆ రంగులో ఉంటాయట. ఫోటో తీయడానికి ప్రయత్నించినా బయట కనిపించినంత అందంగా నా ఫోటోలకి చిక్కలేదు ఎందుకో! వచ్చేప్పుడు ఆ ఊదా రంగు ఇసుక కొంచెం తీసుకొచ్చుకోవాలని కాంతి గారు ముచ్చటపడ్డారు కానీ అప్పుడు మా దగ్గర ఇసుక నింపడానికి ఏమీ లేక మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు తెచ్చుకుందాంలే అని వచ్చేశాం.

సముద్రపు ఒడ్డున గాలి విపరీతంగా వీస్తోంది. మనుషులు మాత్రం చాలా తక్కువ మంది ఉండి బీచ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఆగి ఆగి ఎగిసి పడుతున్న అలల శబ్దం, అక్కడక్కడా ఒడ్డు మీద ఇసుకలో తిరుగుతున్న చిన్న చిన్న పక్షులు చేస్తున్న శబ్దాలు, గాలి హోరు మినహా వేరే చప్పుళ్ళేవీ వినిపించడం లేదు. అసలు సముద్రంలో ఏదో గొప్ప ఆకర్షణ ఉందనిపిస్తుంది. ప్రకృతి రూపాలన్నీ మనిషి మనసుని ఆకర్షిస్తూనే ఉంటాయి గానీ ఆకాశం, మబ్బులు, వాన, కొండలు, లోయలు, వెన్నెల.. వీటన్నీటిని మించిన బలమైన ఆకర్షణ ఏదో ఒక్క సముద్రంలోనే ఉందనిపిస్తుంది. సముద్రం ఎదురుగా నించుని అలా కనుచూపుమేరా ఉన్న నీలి పరదా లాంటి సాగరాన్ని చూస్తుంటే ఎంతో నిశ్చలంగా, గంభీరంగా ఉన్నట్టుంటుంది. అంతటి విశాలమైన సముద్రపు నీళ్ళలో అలలు ఖచ్చితంగా ఎక్కడ పుడుతున్నాయో అర్థమైనట్టు అనిపించదు. అలా చూస్తుండగానే తీరానికి చేరువయే కొద్దీ అప్పుడప్పుడే నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపించిన అల క్షణాల్లోనే తీరం దాకా వచ్చేసరికి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఎగిరిన అల వైపు చూస్తూ రెప్ప వేసే లోపే చప్పున మాయమైపోతుంది. ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ వచ్చి తీరాన్ని తాకినా కెరటం ఎగిసిన ప్రతీసారీ ఇదే మొదటిసారన్నట్టు అదే ఉత్సాహం, అంతే పరవశం.. బహుశా సముద్రమంత ప్రేమ ఉంటే అలాగే ఉంటుందేమో! అలా సముద్రం వైపే చూస్తూ నించుంటే అలల చేతులతో తన ఒడిలోకి రమ్మని పిలుస్తున్నట్టుంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా అలా వెళ్ళిపోతే బావుండనిపించేంత పరవశంలో తేలుస్తూనే ఒక్కసారి దుడుకుగా ఓ అల వచ్చి మనల్నిముంచెత్తగానే అంతటి సముద్రాన్ని భరించడం మన వల్ల కాదని భంగపడి వెనకడుగు వేసేలా చేస్తుంది. ఎగిరి వచ్చి తడిపేసిన అల వెళుతూ వెళుతూ పాదాల కింద నుంచి సన్నగా ఇసుకని లాగేస్తూ గిలిగింతలు పెడుతూ తనలోకి లాక్కుంటున్నప్పుడు మైకంలో పడేసి మాయ చేసే మహా తుంటరిలా కనిపిస్తుంది సముద్రం. ఎగిరొచ్చే ప్రతీ అల ఏవో ఊసులు చెపుతున్నట్టు, ఆ కెరటాల సవ్వడిలో శ్రావ్యమైన సంగీతమేదో వినపడుతున్నట్టుంటుంది. ఇంకా.. సముద్రంతో నాకేదో విడదీయలేని బంధం ఉన్న భావనేదో... అరే.. ఎంతసేపైనా నా ఈ సముద్రపు మురిపెం తీరదే!

ఒడ్డు మీద ఒక దగ్గర కదలకుండా నించుంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అలల్లో ఎన్ని మా పాదాలని తాకి వెళతాయో అని లెక్కలు వేసుకుంటూ చాలా సేపు సముద్రపు నీళ్ళలో ఆటలాడీ ఆడీ అలసిపోయాక ఒడ్డున కూర్చుని కాంతి గారు, నేను పిచ్చుక గూళ్ళు కట్టుకున్నాం. చిన్నప్పుడు వెన్నెల్లో ఇసుకలో ఆడుకున్న దూ దూ పుల్ల ఆట ఆడుకున్నాం. అక్కడ ఒడ్డున నీళ్ళలో ఆడుకుంటున్న చిన్న పిల్లల్ని, అలల మీద సర్ఫింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని చూస్తూ సరదాపడ్డాం. ఈ ఆటల్లోనే సమయమంతా గడిచిపోయి టైము మధ్యాహ్నం మూడైపోయింది. కాంతి గారికి అస్సలు అక్కడి నుంచి కదలడం ఇష్టం లేకపోయినా ఇంకా 17 మైల్ డ్రైవ్ కి వెళ్ళాలి కదాని అక్కడి అందమైన సముద్రానికి టాటా చెప్పేసి వెనక్కి బయలుదేరిపోయాం.
బిగ్ సర్ నుంచి దాదాపు ఒక గంట సేపు డ్రైవ్ చేసాక 17 మైల్ డ్రైవ్ కి చేరుకున్నాం. దారిలో ఉండగానే వాతావరణం అంతా మారిపోయి అప్పటిదాకా తేటగా ఉన్న ఆకాశం కాస్తా పొగమంచుతో నిండిపోయి సన్నగా మంచు కురవడం మొదలైంది. అప్పటికే నాకున్న గొంతు నొప్పికి తోడు మళ్ళీ సముద్రపు గాలికి తిరిగి, చల్లటి నీళ్ళలో తడిచేసరికి క్షణాల మీద జ్వరం వచ్చేసింది. కానీ అంతదాకా వెళ్ళాం కదాని 17 మైల్స్ డ్రైవ్ లో ఉన్న రకరకాల బీచులని చూస్తూ వెళ్ళాం. ఇంట్లో నుంచి చూస్తే ఆ బీచ్ వ్యూ లు కనిపించేలా అక్కడ చాలా ఖరీదైన ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే "కోట్లు కోట్లు డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటారో" అని ఎప్పుడూ అనిపించే ప్రశ్నకి సమాధానమేదో దొరికినట్టనిపించింది. కానీ అన్నేసి మిలియన్లు పెట్టి అంతందమైన ఇళ్ళు కొనుక్కున్నవాళ్ళకి వాటిల్లో తీరిగ్గా కూర్చుని గడిపే సమయం ఉంటుందో లేదో మరి సందేహమే! మేము అక్కడికి వెళ్ళేసరికి మంచు కురవడం పెరగడం, నాకు జ్వరం ఎక్కువవడం రెండూ జరిగేసరికి పెద్దగా ఏమీ చూడకుండానే అన్నీ అలా అలా చుట్టేసి ఇంటి దారి పట్టాము. ఇంటికొస్తూనే పిజ్జా హట్ నుంచి తెచ్చుకున్న పిజ్జా తినేసి జ్వరానికి టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాను.

24.06.2013
సోమవారం
ఎంత ఘాటు ప్రేమైతే భరించడం అంత కష్టం కదా మరి.. సముద్రంతో ప్రేమలో పడ్డందుకు కానుకగా వచ్చిన జ్వరంతో పడుకోవడంతోనే రోజంతా గడిచిపోయింది. :-)

25.06.2013
మంగళవారం
ఈ రోజుకి జ్వరం కాస్త తగ్గి పర్లేదనిపించింది. పగలంతా యథావిధిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసాక సాయంత్రానికి ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు పార్టీ ప్రోగ్రాం ఉంది. అదేంటంటే మేము పాడుతా తీయగా కార్యక్రమానికి వెళ్ళిన రోజున వసంత అని ఒకమ్మాయి కిరణ్ ప్రభ గారి దగ్గరికొచ్చి పరిచయం చేసుకుని కిరణ్ ప్రభ గారికి వాళ్ళ శ్రీవారు చాలా చాలా పెద్ద అభిమాని అని, 25 వ తారీఖు తన పుట్టినరోజు సందర్భంగా కిరణ్ ప్రభ గారిని బర్త్ డే డిన్నర్ కి పిలిచి సర్ప్రైజ్ చెయ్యాలని తన కోరిక అని చెప్పిందట. మా ఇంట్లో గెస్టు ఉన్నారని చెప్తే "ఏం పర్లేదు మీ గెస్టుతో సహా వచ్చెయ్యండి" అని మరీ ఆహ్వానించిందట. ఆ సర్ప్రైజ్ బర్త్ డే పార్టీకి వెళ్ళాల్సింది ఈ రోజేనన్నమాట. మంగళవారం కాబట్టి సాయంత్రం కిరణ్ ప్రభ గారు విరిజల్లు రేడియో షో పూర్తి చేసేసరికి కాంతి గారు మా ఇంటి బ్యాక్ యార్డులోనే పూసిన పువ్వులతో అందమైన ఫ్లవర్ వేజ్ తయారు చేసారు. అప్పుడు బయలుదేరి వసంత వాళ్ళింటికి వెళ్ళాము. ఆ అమ్మాయి ఇలా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆయన ఎలా ఫీలవుతారో కదా.. అని నేనూ, కాంతి గారు రకరకాల ఊహాగానాలు చేస్తూ వెళ్ళాము. మేము వాళ్ళింటి తలుపు తట్టాక పుట్టినరోజు జరుపుకుంటున్న తిరు గారు ఎదురుగా కనిపించిన కిరణ్ ప్రభ గారిని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడే రేడియోలో మీ షో విన్నాము, ఇంతలో మీరిలా మా ఇంటికొచ్చెయ్యడం నిజంగా గొప్ప థ్రిల్లింగా ఉందని చెప్పారు. వసంత బర్త్ డే కేక్ దగ్గరి నుంచి బజ్జీలు, పులిహోర, సాంబారు, మామిడిపండు దాకా బోల్డు రకాల వంటలతో బ్రహ్మాండమైన పుట్టినరోజు విందు ఏర్పాటు చేసింది. వాళ్ళ ఆతిథ్యాన్ని ఆనందంగా స్వీకరించి కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత మేము ఇంటికొచ్చేసాం.

26.06.2013
బుధవారం
నేనొచ్చిన దగ్గర్నుంచీ దాదాపు ప్రతీ రోజూ ఏదో ఒక చోటుకి తిరుగుతూనే ఉన్నాం కదా.. పిలవని చుట్టంలా ఈ జ్వరం వచ్చి పలకరించేసరికి కాస్త తిరగడం తగ్గించేసి ఇంటి పట్టునే ఎక్కువ ఉందామనుకున్నాం. ఈ రోజు సాయంకాలం దగ్గర్లో ఉన్న San Leandro Marina Park కి విహారానికి వెళ్ళాం. వాతావరణం కూడా మరీ ఎండగా కాకుండా, మరీ చల్లగా కాకుండా హాయిగా ఉంది. అక్కడంతా పచ్చటి గడ్డితో నిండిన పార్కులో ఈవినింగ్ వాక్ కి వచ్చిన జనాలు, చిన్నపిల్లలతో సందడిగా ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న బే లో ముదురు నీలం రంగులో నిశ్చలంగా ఉన్న నీళ్ళని చూస్తూ మేము కూడా ఆ తీరం వెంబడి నడుస్తూ వెళ్ళాం. దూరంగా నీళ్ళ మీద కనిపిస్తున్న వంతెనని చూపించి "అదే మన స్వర్గ ద్వారం, San Mateo bridge" అని చెప్పారు కిరణ్ ప్రభ గారు. అక్కడ విమానాలు బాగా కింద నించే ఎగురుతూ కనిపిస్తుంటే అవన్నీ పక్కనే ఉన్న Oakland ఎయిర్పోర్ట్ కి వచ్చిపోయే విమానాలని చెప్పారు. అందమైన ఆ పరిసరాల్లో ఆ సాయంత్రం ఆహ్లాదంగా గడిచింది. కాస్త షాపింగ్ పని చూసుకుని ఇంటికొచ్చేసాక కౌముది పత్రిక కొత్త సంచిక విడుదల చేయాల్సిన సమయం దగ్గర పడుతుంది కాబట్టి కాంతి గారు, కిరణ్ ప్రభ గారు ఆ పనిలో పడిపోయారు. నేను కూడా నా 'జర్మనీయం' కాలమ్ రాసుకుంటూ, అందరం పని చేసుకుంటూనే బోల్డు సాహితీ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపేశాం ఆ పూటంతా.

27.06.2013
గురువారం
ఈ రోజు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళకుండా మనింటి చుట్టుపక్కల ఉన్న పచ్చటి పరిసరాల్లో ఈవినింగ్ వాక్ కి వెళదామన్నారు కిరణ్ ప్రభ గారు. అలా కాసేపు తిరిగాక మా ఇంటి పక్కన పార్కులో ఏర్పాటు చేసిన ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్ళాము. అది అచ్చం మా జర్మనీలో చూసే ఫ్రెష్ మార్కెట్ లానే ఉంది. ఇలాంటి మార్కెట్లలో తాజా కూరగాయలు, పండ్లు నేరుగా తోటల నుంచి తీసుకొచ్చినవి దొరుకుతాయి. అక్కడ ఒక చోట చిన్నపిల్లల 'మినీ జూ' లాంటిది ఏర్పాటు చేసారు. ఒక చిన్న కంచె లాగా కట్టి లోపల గొర్రెలు, మేకలు, బాతులు, కోళ్ళు, కుందేళ్ళు లాంటి చిన్న చిన్న జంతువులన్నీటినీ ఉంచారు. చిన్నపిల్లలందరూ లోపలకి వెళ్ళి తిరుగుతూ వాటితో ఆడుకుంటున్నారు. కాసేపు మేము కూడా వాటిని చూసి సరదాపడ్డాం. తర్వాత చల్లగాలికి కాసేపు పచ్చని చెట్ల మధ్యన కూర్చుని చీకటి పడే సమయానికి ఇంటికొచ్చేసాం. అప్పుడు మళ్ళీ ఇంటికి దగ్గర్లో ఉన్న మెక్సికన్ ఈటింగ్ ప్లేస్ Baja Fresh కి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. అప్పుడే మొదటిసారి రుచి చూసిన Veggie Tacos నాకు చాలా చాలా నచ్చేసింది. అసలు Tacos కన్నా పక్కనున్న మ్యాంగో సల్సా తినడం ఎక్కువ ఎంజాయ్ చేశాం. ఒకోసారి బాగా తినేసినప్పుడు కూడా అలుపొస్తుంది కదా.. అప్పుడలాగే అనిపించి వెంటనే ఇంటికి రాకుండా అక్కడే బయట చల్లగాలికి కూర్చుని తిన్నది కాస్త గొంతు దిగే దాకా కబుర్లు చెప్పుకుని అప్పుడు బయలుదేరాం. ఈ రోజలా మెక్సికన్ రెస్టారెంట్ పేరు మీదుగా గడిచిపోయింది.
28.06.2013
శుక్రవారం
రోజు సాయంకాలం షాపింగుకి వెళ్ళి త్వరగానే ఇంటికొచ్చేసాం. ప్రతీ నెలా ఒకటో తారీఖు దగ్గర పడుతున్న కొద్దీ కౌముది హడావుడి పెరుగుతూ వస్తుంది. వాళ్ళిద్దరూ ఆ పని చేసుకుంటుంటే నేను రెండోసారి నా కాలమ్ రాసుకోవడం మొదలుపెట్టాను. దాదాపు పూర్తయిపోయిన డ్రాఫ్ట్ ని నిన్న ఏదో ఫోనులో మాట్లాడుతూ పొరపాటున సేవ్ చెయ్యబోయి డిలీట్ చేసేసాను. అందుకని మళ్ళీ రెండోసారి రాయాల్సి వచ్చింది. టైము ఎక్కువ లేదు కదా అన్న కంగారు వల్ల అర్ధరాత్రి రెండింటి దాకా కూర్చుని అది రాయడం పూర్తి చేసి పడుకున్నాను.
29.06.2013
శనివారం
మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. అసలైతే వీకెండ్లో రోజంతా తిరగొచ్చు కానీ అప్పటికే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈ వీకెండ్ చిన్న చిన్న ట్రిప్ లు పెట్టుకుందాం అనుకున్నాం. శనివారం ఉదయం కాబట్టి టోరి రేడియోలో కిరణ్ ప్రభ గారి టాక్ షో అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది. ఈ రోజు Brentwood ఫ్రూట్ ఫార్మ్స్ వైపు వెళ్ళి ఏదన్నా ఫ్రూట్ పికింగ్ కి వెళ్ళాలని మా ప్లాన్. అక్కడే లంచ్ చెయ్యడానికి వీలుగా ఉంటుందని కాంతి గారు పులిహోర సిద్ధం చేసుంచారు. ఉదయాన్నే ప్రసాద్ గారు వాళ్ళు కాల్ చేసి ఈ రోజు ఎండ చాలా ఎక్కువుంటుందట. బయటికి వెళ్తే కష్టమేమో అని చెప్పారు గానీ మళ్ళీ మాకు టైము దొరకదు కదా అన్న ఉద్దేశ్యంతో మేము Brentwood కి బయలుదేరిపోయాం. ఇంట్లోంచి బయటపడ్డాక గానీ మాకు తెలీలేదు ఎండ ఎంత తీవ్రంగా ఉందో! Brentwood కి వెళ్ళే దారి మాత్రం one of the most scenic drives I've ever been to.. అని చెప్పాలి. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కొండల మీద బోల్డన్ని విండ్ మిల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఆ కొండ మధ్యలో నుంచి వేసిన రోడ్డు మీద వాటిని చూస్తూ ప్రయాణం చేయడం చాలా బాగుంది.

మేము వెళ్ళిన టైములో ఎక్కువ Apricots, Peaches, Nectarines తోటల్లో ఫ్రూట్ పికింగ్ ఉంది. మేము ఒక తోట దగ్గరికి వెళ్ళేసరికే ఎండ పెరిగీ పెరిగీ 108°F అయింది. ఎండా బాగా ఉంది అనుకుంటూనే తోటలోకి వెళ్ళి విరగ కాసిన ఆ పండ్ల చెట్లని చూసి ముచ్చట పడిపోతూ పీచ్ పళ్ళు తింటూ తీసుకెళ్ళడానికి కోసుకోవడం మొదలుపెట్టాం. ఒక అరగంట గడిచాక కాంతి గారు నావైపు చూసి "అమ్మో.. పిల్ల మొహం చూసారా ఎండ దెబ్బకి ఎలా అయిపోయిందో.. ఇంతవరకూ కోసుకున్న పళ్ళు చాల్లే ఇంక పదండి పదండి" అని వెనక్కి బయలుదేరదీసారు. అక్కడ తోటలోకి వెళ్ళేప్పుడు ఖాళీ బకెట్ తీసుకుని మనకి కావలసినన్ని పళ్ళు కోసుకుని బయటికొచ్చేప్పుడు వాటి బరువు ప్రకారం డబ్బులిచ్చేసి తెచ్చుకోవాలి. అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయి అది వాళ్ళ సొంత తోటనీ, తను చదువుకుంటూ అప్పుడప్పుడూ టైము ఉన్నప్పుడు తోటలో పని చేస్తుంటానని చెప్పింది. "ఇన్ని పళ్ళు న్నాయి కదా.. మీరు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతారా" అంటే "అదేం లేదు.. కేవలం ఫ్రూట్ పికింగ్ కి వచ్చే వాళ్ళ కోసమే మా తోట" అని చెప్పింది. Heritage Fruit Farms అని ఆ తోట పేరు చూడగానే నాకు మన దగ్గరుండే హెరిటేజ్ ఫుడ్స్ గుర్తొచ్చింది. ఇంతకీ నేనొక తింగరి పని చేసాను. ఇంట్లోంచి వచ్చే ముందు కెమెరా మెమరీ కార్డ్ లోనుంచి ఫొటోస్ కాపీ చేసి అది లాప్టాప్ లోనే మర్చిపోయి వచ్చి "అబ్బో కొండలు, తోటలు ఎంత బాగున్నాయో.." అనుకుంటూ తీసిన ఫొటోలన్నీ ఒక్కటి కూడా సేవ్ అవ్వలేదు. చివరి నిమిషంలో తోటలో ఉన్నప్పుడు ఆ సంగతి గమనించాక "ఏం పర్లేదులేమ్మా.." అని కిరణ్ ప్రభ గారు తన బ్లాక్ బెర్రీలో కొన్ని ఫొటోస్ తీసారు.
Brentwood నుంచి ఇంటికొచ్చేసరికి వడ దెబ్బ తగిలిన వాళ్ళలా అయిపోయాము. మేము తీసుకెళ్ళిన పులిహోర మళ్ళీ ఇంటికొచ్చాక తినేసి ఎండ దెబ్బ నుంచి బయటపడటానికి కాసేపు పడుకుందామనుకున్న వాళ్ళం కాస్తా సాయంత్రం దాకా మంచానికి అతుక్కుపోయాం. సాయంకాలం వెళదామనుకున్న తెలుగు నాటకం ప్రోగ్రాం సంగతి కూడా పట్టించుకోలేనంతగా అలసటగా నిద్రపోయాం. నిద్ర లేచాక తోట నుంచి కోసుకొచ్చిన పళ్ళు తీసుకుని ప్రసాద్, పద్మ గారింటికి వెళ్ళాం. "హీట్ వేవ్ ఉందని న్యూస్ లో కూడా చెప్పారు తెలుసా.. అంత ఎండలో మీరు ఫ్రూట్ పికింగ్ కి వెళ్ళారా.." అని వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఒకటే నవ్వడం.. చేసేదేం లేక మేము కూడా నవ్వేశాం. కానీ ఆ వడదెబ్బ కొట్టిన గట్టి దెబ్బకి భయపడి రేపు నాపా వ్యాలీ వెళదామనుకున్న ప్లాన్ కాన్సిల్ చేసుకున్నాం. ప్రసాద్ గారింటి నుంచి వచ్చేప్పుడు దారిలో అరగంట సేపు కష్టపడి సెలెక్ట్ చేసి ఒక సూపర్ డూపర్ OREO కేక్ కొనుక్కుని వచ్చాం. ఎందుకంటే మరి రేపు నా Happy Birthday కదా! :-)
30.06.2013
ఆదివారం

ముందు రోజంతా విపరీతంగా అలసిపోయుండేసరికి అర్ధరాత్రి కేక్ కట్ చేసే ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఉదయాన్నే ఫ్రెష్ గా సెలెబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు అందరం కలిసి ఒకే చోట కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవచ్చని హాల్లో వరసగా పడుకున్నాం. రాత్రి పన్నెండింటికి ఫోను మోసుకొచ్చిన ఆనందక్షణాలని అందుకోవడంతో నా పుట్టినరోజు మొదలైపోయింది. తర్వాత ఎందుకో ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర పట్టకుండానే తెల్లారిపోయింది. మళ్ళీ ఉదయాన్నే లేచీ లేవగానే ఫోనులో బోల్డన్ని పుట్టినరోజు దీవెనలు వచ్చేసాయి. నేనొచ్చిన దగ్గర్నుంచీ కిరణ్ ప్రభ గారు ప్రతీరోజూ వాకింగ్ కి రమ్మని అడిగినా నేనిప్పటి దాకా వెళ్ళలేదు కదా.. నేను ఊరెళ్ళిపోయే లోపు కనీసం ఒక్కసారైనా మార్నింగ్ వాక్ కి వెళ్ళాలని ఈ రోజు ఉదయం ముగ్గురం కలిసి వాక్ కి బయలుదేరాము. వెళ్ళేటప్పుడు లెటర్ బాక్స్ చెక్ చేస్తే అందులో ఒక చిన్ని పేకెట్ కనిపించింది. అది చూడగానే నాకు అర్థమైపోయింది కాంతి గారికి తెలీకుండా తన కోసం నిషి పంపిన బుల్లి గిఫ్ట్ వచ్చేసిందని. అది ఓపెన్ చేసి చూసుకుంటూ, నిషికి ఫోన్ చేసి తనతో కబుర్లు చెప్తూ వాకింగ్ పూర్తి చేసాం. నిషి అప్పటికే నా పుట్టినరోజుకని గిఫ్ట్ పంపించింది. మళ్ళీ కాంతి గారితో పాటు ఇంకో బుల్లి గిఫ్ట్ పంపించింది. అది నా +1 గిఫ్ట్ అన్నమాట.

వాకింగ్ నుంచి ఇంటికొచ్చాక కిరణ్ ప్రభ గారు చాలా సీరియస్ గా "ఇప్పటిదాకా నీ దగ్గర ఒక పెద్ద సీక్రెట్ దాచిపెట్టాము. అదేంటంటే మాకో పాప కూడా ఉంది. తను చిన్నప్పుడు తిరనాల్లో తప్పిపోయింది. తన ఫోటో చూస్తావా.." అని చెప్పి దాదాపు నాలో సగం ఎత్తున్న పోస్టర్ ఒకటి చేతికిచ్చారు. అది తెరిచి అందులో నవ్వుతూ నించున్న నన్ను నేను చూసుకోగానే నాకసలేం అర్థం కాలేదు ఒక్క క్షణం. నా గురించి అక్కడ రాసున్న వాక్యాలు చూసి కళ్ళల్లో నీటి తెర కదలాడింది. "మాకసలు సర్ప్రైజ్ చెయ్యడం ఎప్పుడూ తెలీదు అంటూనే ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మీరిద్దరూ.." అని నేనంటే "నువ్వు ఎప్పుడూ మా పక్కనే ఉన్నావు కాబట్టి నీకు తెలీకుండా ఈ పోస్టర్ డిజైన్ చేసి ప్రింట్ చేయించి తీసుకురావడానికి నిజంగానే కొంచెం కష్టమయింది" అంటూ నవ్వారు. ఆ ఆనందంలోంచి తేరుకున్నాక అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, నేస్తాలు.. అందరితో మాట్లాడి అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకున్నాను. ఎప్పుడూ లేనిది ఈసారి మా ఇంటబ్బాయ్ కూడా అలవాటు లేని పనైనా సరే కష్టపడి మెయిల్లో హేపీ బర్త్ డే చెప్పాడు. తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని, కొత్త వాచీతో సహా దేవుడికి దణ్ణం పెట్టుకుని అప్పుడు కేక్ కట్ చేసాను. కేక్ తో పాటు లంచ్ లో మళ్ళీ మిరపకాయ బజ్జీలు, బిర్యాని తిన్నాం. నిషి ఉంటే ఈపాటికి అన్నీ టేబుల్ మీద సర్దేస్తూ ఉండేది కదా.. అప్పుడే నిషి వెళ్ళి వారం రోజులు గడిచిపోయి నేను ఊరెళ్ళే రోజు కూడా దగ్గరకొచ్చేస్తోంది కదా అనుకున్నాం.
మధ్యాహ్నం ఎండ పూట ఇంట్లోనే ఉండి సాయంకాలం కౌముది పత్రిక  సంచిక విజయవంతంగా టైముకి విడుదల చేసి బయటికి వెళ్ళాం. ముందు మొదటిరోజు వెళ్ళిన లివర్ మోర్ టెంపుల్ కి వెళ్ళాం. ఆ మొదటి రోజు గుడి మూసేసి ఉండటం వల్ల దొరకని వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రోజు దొరికినందుకు చాలా సంతోషించాం. కాంతి గారు మళ్ళీ నా చేత డాలర్లు హుండీలో వేయించాక కాసేపు ఏడుకొండల వాడితో కష్టం సుఖం చెప్పుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని గుడిలోంచి వచ్చేసాం. అక్కడినుంచి Stockton లో ఉన్న Combodian Buddhist Temple కి వెళ్ళాం. అప్పుడప్పుడే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఆ ప్రశాంత పరిసరాల్లో బుద్ధుని సన్నిధిలో గడపడం చాలా సంతోషాన్నిచ్చింది. గుడి ప్రాంగణంలో ఒక్క బుద్ధుడి బొమ్మలే కాకుండా బోలెడన్ని పెద్ద పెద్ద కంబోడియన్ దేవతల ప్రతిమలు ఉన్నాయి. ముఖ కవళికలు కాస్త వేరేగా ఉన్నా వాళ్ళ దేవతలు కూడా మన బ్రహ్మ, విష్ణు, సరస్వతి, లక్ష్మి లానే ఉన్నారనిపించింది. ఆ గుడికి ఒక కోనేరు కూడా ఉంది. కోనేరు చుట్టూ మెట్లు, కోనేట్లో తామరపూలు చూస్తుంటే అచ్చం మన గుళ్ళలానే అనిపించింది. అంతంత పెద్ద బొమ్మలని అక్కడే ఆ గుడి ఆవరణలోనే తయారు చేస్తున్నారు. ఆ బొమ్మలకి ప్రాణం పోస్తున్న శిల్పితో కూడా మాట్లాడాము. కాంబోడియా నుంచి వచ్చి అక్కడ గుళ్ళో బొమ్మల్ని తయారు చేస్తున్నారట. అమెరికాలో స్థిరపడిన ఆ దేశ పౌరులు అందించే విరాళాలతో గుడి నిర్మాణం, నిర్వహణ జరుగుతుందట. అంత అందమైన గుడి చూసాక ప్రపంచ పటంలో కంబోడియా ఎక్కడుంటుందో కూడా నాకు సరిగ్గా తెలీనందుకు సిగ్గేసింది. తర్వాత థాయిలాండ్, వియత్నాం దేశాల పక్కనే ఉంటుందని తెలుసుకున్నాను. ఓహో అందుకన్న మాట వీళ్ళ దేవుళ్ళు కూడా మన దేవుళ్ళలానే ఉన్నారు అనిపించింది.

పూర్తిగా చీకటి పడే వేళకి కంబోడియా బుద్ధుడి గుడి నుంచి వెనక్కి బయలుదేరాం. దారిలో ఆకాశంలో సంధ్యా సుందరి గీస్తున్న రంగురంగుల చిత్రాలని చూసుకుంటూ, సిరివెన్నెల గారి పాటలు వింటూ వచ్చాము. ఇంకొక రోజులో నా ప్రయాణం అన్న ఆలోచనలో ఉండటం వల్లనుకుంటా సిరివెన్నెల గారు రాసిన 'జ్ఞాపకాలే మైమరపు.. జ్ఞాపకాలే మేలుకొలుపు.. జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు..' పాట వింటుంటే ప్రతీ రోజూ మన చేతిలోంచి జారిపోయి గతంలా మారిపోయినా జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం కదా అనిపించింది. అలా అలా సిరివెన్నెల గారి పాటల గురించి మాట్లాడుకుంటూ ఉంటే "సిరివెన్నెల గారు ఇక్కడున్నప్పుడు రాసిన కవితలు, పాటల పేజీలు చాలా ఉన్నాయి మనింట్లో" అని కిరణ్ ప్రభ గారు చెప్తే ఇంటికెళ్ళగానే లోపలెక్కడో భద్రంగా దాచిన వాటన్నీటినీ బయటికి తీయించి చూసాను. పాటల కన్నా కవిత్వం రాసిన పేజీలే ఎక్కువ కనపడ్డాయి. సిరివెన్నెల గారి స్వదస్తూరిలో రాసిన ఆ కాగితాలనీ, కవిత్వాన్నీ చూడటం భలే అనిపించింది. తర్వాత రాత్రికి డిన్నర్ చేసేసాక కాంతి గారు, నేనూ కలిసి ఈ ఇరవై రోజుల నుంచీ మేము దిగిన ఫొటోలన్నీ ముందేసుకుని అందులోంచి వెతికి వెతికి 19 ఫోటోలు సెలెక్ట్ చేసి ఒక పెద్ద పోస్టర్ డిజైన్ చేసాము. ఆ పోస్టర్ మా ముగ్గురికీ మూడు కాపీలు అని ప్రింటింగ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేసి అప్పుడు పడుకున్నాం.

01.07.2013
సోమవారం
రోజు ఉదయం లేచిన దగ్గరి నుంచీ ఏ పని చేస్తున్నా ఇంక ఇక్కడ ఇవాళ ఒక్క రోజే కదాని గుర్తొచ్చి దిగులొచ్చేసింది. చదువుకునే రోజుల్లో ఇంటి నుంచి మళ్ళీ హాస్టల్ కి వెళ్ళేప్పుడు ఇలానే అనిపించేది. ఇప్పటికీ ఇంటికెళితే తిరిగి వచ్చేప్పుడు ఇలానే ఉంటుంది ప్రతీసారి. దిగులుగా ఉన్నాసరే నేనన్నా నవ్వుతూ బానే కనిపించాను కానీ కాంతి గారు బాగా నీరసపడిపోతున్నారు. అలానే ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ ఉదయమంతా కూర్చుని ఇద్దరం కలిసి సూట్కేసులు సర్దేశాం. ఒకటికి రెండు సార్లు బరువు సరి చూసుకుని సుమారుగా ఒక కేజీ ఎక్కువుంటే అదేం పర్లేదులే అనుకున్నాం.  దాదాపు సర్డుకోడం అంతా అయిపోయే టైముకి కాంతి గారికి గబుక్కున గుర్తొచ్చి వెళ్ళి మా ఇంటబ్బాయ్ కోసమని మినపసున్ని ప్యాక్ చేసి తెచ్చిచ్చారు. నేనింటికి వెళ్ళాక ఎలా కలపాలో చెప్తానన్నారు. మొత్తానికి ఆ రోజంతా సర్దుకోవడంలో భారంగా గడిచింది. సాయంత్రం కిరణ్ ప్రభ గారు ఆఫీసు నించి వచ్చాక Costco కి వెళ్ళి రాత్రి ఆర్డర్ చేసిన పోస్టర్ ప్రింట్స్ తీసుకుని నా ఫేవరేట్ Baja Fresh కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాం. అర్ధరాత్రి దాకా ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని తర్వాత గడియారం బెదిరింపులకి భయపడి నిద్రపోక తప్పలేదు.
ఇరవై రోజులుగా అలవాటైపోయిన ఆ గది కిటికీలోంచి కురుస్తున్న వెన్నెలనీ, చందమామనీ, గాలికి ఊగే చెట్ల ఆకులనీ చూసి నేనిక్కడికి వచ్చిన మొదటి రోజు జ్ఞాపకం వచ్చింది. ఇరవై రోజులు ఎంత వేగంగా దొర్లిపోయాయో కదా అనిపించింది. అంతలోనే సాయంత్రం జరిగిన విషయం గుర్తొచ్చింది. సాయంకాలం నేను కాంతి గారి ఒళ్ళో పడుకుని ఇద్దరం తీరిగ్గా రేపు వెళ్ళిపోయేప్పుడు ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నాం. కాంతి గారేమో "ఏంటో.. ప్రయాణం వాయిదా వేసుకుని ఎక్కువ రోజులుంటే బాగుంటుందని అనుకున్నాను కానీ ఎక్కువ రోజులు గడిచేకొద్దీ ఇంకా ఎక్కువ కష్టం అయిపోతున్నట్టుంది. నిషి వెళ్ళే రోజే అస్సలు బాలేదు. ఇంక రేపు నాకు ఏడుపు బయటికొచ్చేస్తుందేమో.." అంటుంటే నేనేమో " మిగతా అప్పుడంతా ఎలా ఉన్నా ఇలాంటి భారమైన సమయాల్లో, ముఖ్యంగా వెళ్ళిపోయేప్పుడు మాత్రం నేనస్సలు దిగులుగా ఏడుస్తూ ఉండను. ఎందుకంటే మనం వెళ్ళిపోయాక ఆ చివరి క్షణాల్లోని మన మొహమే ఎదుటివాళ్ళకి గుర్తుండిపోతుంది కదా.. అందుకని ఎంచక్కా నవ్వుతూ ఉండాలి. కాబట్టి రేపు మనిద్దరం కిరణ్ ప్రభ గారికి సెంటిమెంటు సినిమా చూపించకుండా గలగలా మాట్లాడుతూ, హాయిగా నవ్వేస్తూ సరదా సరదాగా టాటా చెప్పుకోవాలి" అన్నాను నేను. కాంతి గారు గట్టిగా నవ్వి "కానీ ఆ క్షణాల్లో ఏమనిపిస్తుందో ఇప్పుడు చెప్పలేం కదా" అంటుండగా నా ఫోన్ మోగింది. నేను ఆ కాల్ మాట్లాడేసి వచ్చి "కాంతి గారూ... మన దిగులు మూడ్ ని మార్చేసే సూపర్ హేపీ విషయం ఒకటి చెప్పనా మీకిప్పుడు" అంటే కాంతి గారు ఉత్సాహంగా "చెప్పు చెప్పు" అన్నారు. నేను ఫోన్లో తెలిసిన కొత్త సంగతి చెప్పాక ఇద్దరం అప్పటిదాకా ఉన్న దిగులు సంగతి మర్చిపోయి ఈ కొత్త కబుర్లలో పడిపోయాం. ఈ ట్రిప్ లో చివరిదైన రేపటి రోజు ఎలా గడవబోతోందో అన్న కొత్త ఆలోచనల్లో పడి నాకు తెలీకుండానే ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను.
నా శాన్ ఫ్రాన్సిస్కో డైరీలో ఆఖరు పేజీ వచ్చేసింది..!

10 comments:

బాల said...

“ప్రకృతి రూపాలన్నీ మనిషి మనసుని ఆకర్షిస్తూనే ఉంటాయి....”
నాకు కూడా ఆకాశం, సముద్రం అంటే ఎంత ఇష్టమో!!! ఆకాశాన్ని రోజూ చూసినా కొత్తగానే ఉంటుంది, సముద్రాన్ని ఎంత చూసినా తనివి తీరదు......
ఇప్పటిదాకా చూస్తున్న సినిమా ఒక్కసారిగా fast forward అయినట్లుగా ఉంది. ఒక్కసారిగా డైరీ లో పేజీలు తిప్పేశారేం???

Sudha said...

Madhura, nee birthday ani telisi vumte wish cese daanni, miss ayyaanu. I wish you all the happiness in your life. caalaa baagaa raastunnavu. Nenu date correct ceyyi (from june 1st to july 1st) ani ceppe lope nuvve correct cesesav :-). No need to post this comment.

వేణూశ్రీకాంత్ said...

హ్మ్.. ఎందుకో నిన్న డైరీలో డేట్ చూసి లెక్కలు వేస్కుని బోలెడన్ని రోజులున్నాయ్ కదా ఇంకో నాలుగైదు పేజీలన్నా ఉంటాయ్ అనుకున్నాను. ఒక్క పేజీలోనే వారం దూకించేశావుగా :) కానీ మరి జ్వరం కదా ఓకేలే.
సముద్రం గురించి రాసిన లైన్స్ కి వెయ్యి లైక్స్ :-))

Praveena said...

WOW !! Baagunnayi mee diary pages.
Same pinch,we share the same birthday date :)

ఇందు said...

Wow... bhale undi ee part. konchem peddadi ayinaaa... Baja fresh my favourite too!!!! :)

Unknown said...

ఇప్పటివరకు రాసిన పార్ట్శ్ అన్ని చదివాను
నిజంగా హాట్స్ ఆఫ్ ...

అయితే నీ పుట్టిన రోజుకి ఏం కానుక ఇస్తారు అని నేను ఊహిస్తున్నా అదేంటో ఒక కధలా చదవడం మొదలు పెట్టేసరికి ఆ మూడ్ లోకి వెళ్ళిపోయాను.

ఇది కొంచం ఊహించాను ... ఇలాంటిదేదో చెప్తారు అని

"ఇప్పటిదాకా నీ దగ్గర ఒక పెద్ద సీక్రెట్ దాచిపెట్టాము. అదేంటంటే మాకో పాప కూడా ఉంది. తను చిన్నప్పుడు తిరనాల్లో తప్పిపోయింది. తన ఫోటో చూస్తావా.." అని చెప్పి దాదాపు నాలో సగం ఎత్తున్న పోస్టర్ ఒకటి చేతికిచ్చారు. అది తెరిచి అందులో నవ్వుతూ నించున్న నన్ను నేను చూసుకోగానే నాకసలేం అర్థం కాలేదు ఒక్క క్షణం.


ఏది ఇచ్చిన ఇంతకన్నా గొప్ప బహుమతి కూడా కాదు కదా అని
హమ్మయ్య నా ఊహ కరెక్టే
అయితే గిఫ్ట్ పార్ట్ ఊహించలేదు
అది నిజంగా surprise

ఈ పోస్ట్లు అన్ని చదివాక యు ఆర్ gifted అనిపించింది

1. అన్ని అంశాలు అంతా వివరంగా గుర్తుంచుకోవడం

2. ఏది ఎక్కడ అవసరమో అంతవరకూ ప్రస్తావించడం
అక్కడి ప్లేసెస్ గురించి చెప్తున్నపుడు బోర్ కొట్టించకుండా ... ఎంతవరకో అంతవరకే చెప్పడం

3. మీ మధ్య ఉన్న అత్మీయతని అందంగా వ్యక్తం చేయడం

4. ఎవరిని మిస్ అవకుండా అందరి గురించి ప్రస్తావించడం ..

5.ముఖ్యంగా ఎక్కడా విమర్శ లేకపోవడం ...

గుడ్ మధురా
పోస్ట్ లు అన్ని చాల నచ్చాయి .

మీ బంధం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటూ

మధురవాణి said...

@ బాల,
ధన్యవాదాలండీ.. ఆ వారంలో ఒంట్లో బాలేదని సగం, ఎండలకి భయపడి సగం ఎక్కడికీ వెళ్ళలేదండీ ఎక్కువ.. అందుకనే ఆ పేజీల్లో ఎక్కువ కబుర్లు లేవన్నమాట.. :-)

@ Sudha,
Thank you so much for your wishes! :-)​


@ ​వేణూశ్రీకాంత్,
మీరు భలే అర్థం చేసేసుకుంటారు వివరణలు ఏమీ ఇవ్వక్కర్లేకుండానే.. :-)
వెయ్యి లైకులకి స్పెషల్ థాంక్స్.. :-))

@ Praveena,
థాంక్సండీ.. వావ్.. మీదీ అదే పుట్టినరోజా.. భలే భలే! :-)​

మధురవాణి said...

@ ఇందు,
థాంక్యూ అండ్ సేమ్ పించ్ డియర్.. :-)

@ Kalluri Sailabala,
శైలూ.. నీ కామెంట్ చూసాక ఈ డైరీని నువ్వెంత శ్రద్ధగా, ఇష్టంగా చదివావో తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే కాకుండా ఒక రచయిత్రిగా క్రిటికల్ గా చదివి విశ్లేషించి నీ అభిప్రాయాలు తెలిపినందుకు బోల్డు ధన్యవాదాలు. Thank you so much dear.. for all the love! :-)

నిషిగంధ said...

నేను వచ్చేసినా ఇవేవీ మిస్ అయిన ఫీలింగ్ అస్సలు రావడంలేదు.. మీతో పాటే ఎగురుకుంటూ, దూక్కుంటూ, ఎండలో మాడుకుంటూ అన్నీ తిరిగినట్లుంది! :))
హమ్మ్.. జ్వరం వచ్చినప్పుడు మాత్రం కాస్త కంగారుపెట్టావ్‌గా!
నేను మిస్సైందలా ఆ ఓరియో కేక్ ఒక్కటే! ఎంత యమ్మీగా ఉందో చూడ్డానికే! :))

మధురవాణి said...

@ నిషిగంధ,
మరి నీకప్పుడు లైవ్ అప్డేట్స్ ఇచ్చాం ​కదా​..
​అందుకేనేమో! ;-)
ఆ ఓరియో కేక్ చూడ్డానికే కాదు టేస్ట్ కూడా సూపర్ గా ఉంది కానీ ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను కూడా సరిగ్గా తినలేకపోయాను. :(