Tuesday, August 06, 2013

My San Francisco Diary - 8



19.06.2013
​బుధవారం
నేను ఉదయం నిద్ర లేచి కిందకి దిగేసరికి అప్పటికే కాంతి గారు కిచెన్లో బిజీ బిజీగా కనిపించారు. నన్ను మెట్ల మీది నుంచి దిగుతుంటే చూస్తూనే "రాత్రి బాగా నిద్ర పట్టిందా తల్లీ.. జర్మనీ నుంచి ఫోన్లో మేలుకొలుపు సేవ అయ్యిందా?" అని అడుగుతూనే నాకు గ్రీన్ టీ కోసం కప్ లో నీళ్ళు నింపి మైక్రోవేవ్లో పెట్టేసారు. నేను బద్ధకంగా సోఫాలో కూర్చుని ఫోను విశేషాలు చెప్తుంటే కిరణ్ ప్రభ గారు మార్నింగ్ వాక్ నుంచి వచ్చేసారు. "నేనొక పావుగంట ముందు వచ్చుంటే ఈ రోజు మీతో పాటు వచ్చుండే దాన్ని. మళ్ళీ మిస్సయ్యాను" అన్నాను. "పర్లేదులేమ్మా.. గొల్లపూడి గారితో ఫోనులో మాట్లాడాను. మధుర వచ్చేసిందంటే ఈసారి నువ్వున్నప్పుడు మాట్లాడమని చెప్పారు. నిషి కూడా వస్తోంది. ఇద్దరితో ఒకేసారి మాట్లాడిస్తానని చెప్పాను" అన్నారు కిరణ్ ప్రభ గారు. "ఇంకో రెండు గంటల్లో నిషికి లంచ్ టైం అయిపోతుంది. ఆఫీస్ నుంచి బయలుదేరిపోతుంది. ఇంక ఎయిర్పోర్ట్ కి వెళ్ళి విమానం ఎక్కడమే తరువాయి. మన లంచ్ టైము కల్లా తను ఫ్లైట్లో ఉంటుంది.." అంటూ లెక్కలు వెయ్యడం మొదలు పెట్టారు కాంతి గారు. ఆ రోజంతా ఇంకో బెడ్ రూమ్ ముందు నుంచీ తిరిగినప్పుడల్లా "ఇంకొక్క పూట ఆగితే ఈ గదిలో నిషి కనిపిస్తుంది కదా.." అనుకోవడమే సరిపోయింది మాకు. పద్మవల్లి గారు ఫోన్ చేసి నిషి కోసం ఎలా ఎదురుచూస్తున్నామో కనుక్కుని కాసేపు కబుర్లు చెప్పి "నా బదులు కూడా ఎంజాయ్ చెయ్యండి" అని చెప్పారు. ఇలా ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ ఉండగానే లంచ్ టైం అయిపోయి కిరణ్ ప్రభ గారు ఆఫీసు నుంచి వచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరాలన్నీటికీ ఆ ఊరి పేరు చెప్పగానే గుర్తొచ్చే 'landmark' లాంటి చిహ్నాలు కొన్ని ఉంటాయి కదా.. Paris అనగానే Eiffel tower, Berlin అనగానే Brandenburg gate గుర్తొచ్చినట్టు San Francisco అనగానే Golden Gate Bridge గుర్తొస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీయబడిన బ్రిడ్జి బహుశా ఇదేనేమోనని ఏవో సర్వేల్లో కూడా తెలిసిందట. San Francisco వచ్చిన దగ్గరి నుంచీ మిగతావాటి సంగతెలా ఉన్నా ఎప్పుడెప్పుడు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూద్దామా అని బోల్డు ఉత్సాహంగా ఉంది. అది చూడ్డానికి ఎప్పుడు వెళదామన్న మాటలు వచ్చినప్పుడు "నాకు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పగటి వెలుగులో మాత్రమే కాకుండా చీకటి పడుతుండగా సిటీ లైట్స్ కాంతుల్లో చూడాలనుంది. ఇప్పుడు పౌర్ణమి రోజులు వస్తున్నాయి కాబట్టి ఇంకా వెన్నెల్లో కూడా చూస్తే బావుంటుంది కదా.." అన్నాను నేను. "దానికేం భాగ్యం.. అలానే చేద్దాం. నిషిని రిసీవ్ చేసుకోడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాల్సింది ఎలాగూ లేట్ నైట్ కాబట్టి ఆ రోజు సాయంత్రం మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడటానికి వెళ్తే నువ్వు అడిగిన అన్ని రకాల దృశ్యాలు చూసేయ్యొచ్చు" అన్నారు కిరణ్ ప్రభ గారు. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం "సాయంత్రం ఆరింటికల్లా ఆఫీసు నుంచి వస్తాను. మీరు రెడీగా ఉంటే బయలుదేరదాం" అని చెప్పారు.
San Francisco - Oakland Bay Bridge
అనుకున్నట్టుగానే సాయంకాలం ఆరు దాటేసరికి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరాము. కార్లోకి ఎక్కగానే "మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేప్పుడు నా పక్కన నిషీ ఉంటుందోచ్.." అని సంబరపడిపోయారు కాంతి గారు. "సాయంకాలం ఆ టైముకి శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ విధులు ముగించుకుని ఇంటి దారి పడతారు కాబట్టి సిటీ నుంచి బయటికొచ్చే దారులన్నీ బాగా బిజీగా ఉంటాయి కానీ మనం సిటీలోకి వెళతాం కాబట్టి ట్రాఫిక్ కాస్త తక్కువే ఉండొచ్చు" అన్నారు కిరణ్ ప్రభ గారు. వెళ్ళే దారిలో ఇంకొక పెద్ద వంతెన మీద నుంచి వెళ్ళాం. దాన్ని 'బే బ్రిడ్జ్' అంటారని చెప్పారు. అది కూడా బోల్డు విశాలంగా, వందల కొద్దీ కార్లతో నిండిపోయి భలే అందంగా ఉంది. కొద్దిగా ట్రాఫిక్ ఉన్నాసరే దాదాపు గంట సేపట్లో మేము సిటీలోకి ప్రవేశించాం. శాన్ ఫ్రాన్సిస్కో ఊరి వీధుల గుండా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వైపు వెళుతూ ఉంటే ఆ వీధులన్నీ ఎగుడు దిగుడుగా పైకీ కిందకీ ఎత్తు పల్లాలతో భలే ఉన్నాయి. ఆ వీధుల్లో కార్లో వెళుతూ ఉంటే అదేదో ఫన్ రైడ్స్ ఎక్కినట్టు సరదాగా అనిపించింది. కారు ఎత్తు మీద ఉన్నప్పుడు ఎదురుగా కనుచూపుమేరా ఉన్న రోడ్డుని చూస్తే చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదువుకున్న తరంగాల (waves, nodes) బొమ్మలు గుర్తొచ్చాయి. ఏదో పెయింటింగ్ లో గీసినట్టు పైకి చూస్తేనేమో నీలాకాశం, wavy road చివరన లేత నీలం రంగులో సముద్రం.. అద్భుతం అనిపించింది. కార్ ని కనుక ఇక్కడ వదిలేస్తే అలా జారుడుబండ లాంటి రోడ్డు మీద జారుతూ వెళ్ళి సముద్రంలో దూకేస్తుందా అన్న చిలిపి ఆలోచన కూడా వచ్చింది. :-)

"Golden Gate Bridge దగ్గర సంవత్సరం పొడవునా ఎక్కువ శాతం మబ్బులు, పొగ మంచు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా, వెళ్ళి చూసేవాళ్ళు అదృష్టవంతులైతే ఆకాశం తేటగా ఉండి బ్రిడ్జి మొత్తం క్లియర్ గా కనపడుతుంది. ఈ రోజెలా ఉంటుందో చూద్దాం" అన్నారు కిరణ్ ప్రభ గారు. మేము అక్కడిదాకా వెళ్ళేసరికి అస్సలే మాత్రం మబ్బుల జాడే లేని ఆకాశం పూర్తి నీలంగా ఎండలో మెరుస్తూ ఎర్రటి వంతెనని మరింత మెరిపిస్తూ కనిపించింది. "అయితే నేను బోల్డు అదృష్టవంతురాలినని గోల్డెన్ గేట్ చెప్తోందన్నమాట" అంటే కాంతి గారు నవ్వి "ఆ మాట ఇప్పుడు కొత్తగా గోల్డెన్ గేట్ వచ్చి చెప్పాలా ఏంటీ.. నాకు ముందే తెలుసు ఈ రోజు వాతావరణం బాగుంటుందని" అన్నారు కాంతి గారు. గోల్డెన్ గేట్ బ్రిడ్జిని దూరం నుంచి చిన్నగా చూసినప్పుడు Paris వెళ్ళినప్పుడు దూరం నుంచి మొదటిసారి ఐఫిల్ టవర్ చిన్న బొమ్మలాగా కనిపించిన దృశ్యం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వెంటనే "ఇదేనా ఐఫిల్ టవర్! అస్సలేమాత్రం ప్రత్యేకత లేనట్టు అన్నీ రేడియో టవర్లలాగే ఇంత మాములుగా అనిపిస్తుందేంటి.. నేను బోల్డు గొప్పగా ఊహించుకున్నానే.." అని కాస్త నిరాశగా అనిపించింది. కానీ నేరుగా ఐఫిల్ టవర్ ముందుకెళ్ళి నించున్నప్పుడు మాత్రం అస్సలు రెప్ప వెయ్యలేదు. ఎత్తిన తల దించకుండా అలా దానికేసి చూస్తూ ఉండిపోయాను. అప్పుడెంత ఎక్సైటింగా అనిపించిందంటే "అబ్బా.. అసలు ప్రపంచంలోని అదృష్టవంతులందరూ పారిస్ లోనే ఉంటారేమో! ఎంచక్కా దీన్ని చూస్తూ ఈ చుట్టుపక్కలే ఏదోక పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతే ఎంత బావుంటుంది అనిపించింది. ఒక ప్రదేశాన్ని చూసి అంతగా మైమరచిపోయి మనసు పారేసుకోడం అదే మొదటిసారి నాకు! ఇప్పుడు కూడా ఆ లేత నీలం రంగు సముద్రాన్ని, దాని మీద ఠీవీగా ఎరుపు రంగులో వెలిగిపోతున్న గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ని చూసినప్పుడు కూడా అచ్చం అలాంటి అనుభూతే కలిగింది. :-)
మేము అక్కడికి వెళ్ళేసరికి టైము ఏడు గంటలు దాటుతున్నా కూడా వేసవి కాలం ఎండ పట్టపగలుని తలపిస్తోంది. కార్ పార్క్ చేసి బ్రిడ్జ్ పెవిలియన్ వైపు వెళ్ళగానే హోరుమని వీచే సముద్రపు గాలి హలో చెప్పింది. ఆ గాలి అలజడికి జుట్టొక్కటే కాదు మొత్తంగా మనల్నే ఎగరేసుకు వెళ్ళేంత దుడుకుగా వీస్తోంది గాలి. కాంతి గారు రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు బయట నిలబడలేక "మీరిద్దరూ వెళ్ళి తిరిగేసి రండి. నేను మాత్రం రాలేను ఇంత గాలిలో. కార్లో కూర్చుంటాను. నువ్వైనా వెళ్ళలేవేమో తల్లీ.." అన్నారు. "ఉహూ.. ఇంకా నయంలే.. సముద్రం ఎదురుగ్గా నించుని అంత ప్రేమగా పిలుస్తుంటే గాలేం ఖర్మ వానొచ్చినా ఆగే ప్రసక్తే లేదు. నేను వెళ్ళాల్సిందే" అని చెప్పి కిరణ్ ప్రభ గారితో కలిసి బయలుదేరాను. ఆ చుట్టుపక్కల ఒక్కో చోట నించుని చూస్తే ఒక్కో కొత్త కోణంలో కనిపిస్తోంది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. శాన్ ఫ్రాన్సిస్కో బే వెళ్ళి పసిఫిక్ మహా సముద్రంలో కలిసే చోటు పేరు 'గోల్డెన్ గేట్' అని, దాని మీద నిర్మించిన వంతెన కాబట్టే ఆ పేరొచ్చిందని చూసాక "బంగారు రంగులో కాకుండా ఎర్రగా మెరిసే వంతెనని పట్టుకుని గోల్డెన్ గేట్ అని ఎందుకంటున్నారబ్బా.." అన్న నా ప్రశ్నకి సమాధానం దొరికేసింది. ప్రపంచం మొత్తంలోనే మానవ నిర్మితాలైన ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటైన ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జి ఎందుకంత గొప్ప నిర్మాణమో వివరిస్తూ దానికి సంబంధించిన అన్నీ రకాల సాంకేతిక విశేషాలతో బోలెడు సమాచారాన్ని పర్యాటకుల కోసం ప్రదర్శనకి పెట్టారు. మేము అవన్నీ ఒక్కొక్కటే చూస్తూ ముందుకి వెళుతుంటే ఆకాశంలో సూర్యాస్తమయానికి సన్నాహాలు మొదలయ్యాయి.
 
"అలా నడుస్తూ బ్రిడ్జి పైకి వెళ్ళి, అక్కడి నుంచి కింద వైపుకి, తర్వాత బ్రిడ్జికి ఇంకో వైపు కూడా వెళ్ళి అన్నీ కోణాల్లో చూసొద్దాం పద" అని కిరణ్ ప్రభ గారు నడుస్తుంటే నేను ఆయన్ని అనుసరించాను. "సముద్రంలో ఏదో గొప్ప ఆకర్షణ ఉంటుంది కదా.. అలా చూస్తుండిపోవాలనిపించేలా.." అని నేనంటుంటే "ఇక్కడికొచ్చాక ఏమేం చూపించమంటావని నిన్ను అడిగినప్పుడు సముద్రాన్ని చూపిస్తే చాలు. ఇంకేం అక్కర్లేదు అన్నావు కదా.. ఇదిగో ఇప్పుడు నువ్వు చూసేదే పసిఫిక్ మహా సముద్రం ఫస్ట్ లుక్ " అని నవ్వారు కిరణ్ ప్రభ గారు. "నాకు చిన్నప్పటి నుంచి సముద్రాన్ని బొమ్మల్లోనూ, టీవీల్లోనూ ఎప్పుడు చూసినా చాలా నచ్చేసేది కానీ నా కళ్ళతో చూసే అవకాశం అంత తొందరగా దొరకలేదు. జర్మనీకి వచ్చాక 2008 లో నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు మొదటిసారి Rotterdam, Madurodam లలో North Sea  ని చూసాను. అప్పటికింకా చలి తగ్గకపోవడం వల్ల నీళ్ళల్లోకి వెళ్ళడం కుదర్లేదు కానీ చూసినందుకే బోల్డు సంతోషపడిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం అనుకోగానే సముద్రాన్ని చూసే ఛాన్స్ దొరుకుతుంది కదాని అప్పుడలా అన్నాను" అని నా సముద్రం పిచ్చి వెనకున్న కారణాన్ని చెప్పాను. దారిలో గాలికి రెపరెపలాడుతూ ఒక పెద్ద అమెరికన్ జెండా కనిపించింది. సరిగ్గా జెండా పైనే అప్పుడే ముస్తాబై ఆకాశంలో పైపైకి తేలి వస్తున్న తెల్లటి చందమామ. "అటు చూడండి భలే ఉంది కదా" అని కిరణ్ ప్రభ గారికి చూపిస్తూనే "అమెరికాలో ఎక్కడ చూసినా జెండాలు కనిపిస్తున్నాయేంటి.. అమెరికన్లకి దేశభక్తి చాలా ఎక్కువంటారా?" అని అడిగాను. "అమెరికన్లకి దేశభక్తి ఎక్కువే ఉంది గానీ జెండాలు ఎక్కువ కనిపించడానికి కారణం మాత్రం అది కాదు. త్వరలో 4th July అమెరికా ఇండిపెండెన్స్ డే వస్తోంది కదా..  అందుకని చాలా చోట్ల ఇలా జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట" అని చెప్పారు కిరణ్ ప్రభ గారు.

బ్రిడ్జి మీదున్న ఫుట్ పాత్ మీద అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాం. రయ్యి రయ్యిమని దూసుకుపోతున్న వందల కొద్దీ కార్లని చూస్తూ నించుంటే "మనం కూడా తర్వాత ఈ వంతెన మీద నుంచే అవతలి వైపుకి వెళ్ళి అదిగో ఆ చిన్న కొండ ఉంది కదా, దాని మీద నుంచి బ్రిడ్జిని చూస్తాం. అప్పటికి పూర్తిగా చీకటి పడిపోతుంది. నువ్వడిగినట్టు శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కూడా లైటింగ్ లో మెరిసిపోతూ కనిపిస్తుంది" అని చెప్పారు కిరణ్ ప్రభ గారు. వంతెన మీద నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బే వైపు చూస్తుంటే దూరంగా నీళ్ళ మధ్యలో ఒక దీవి కనిపించింది. "ఆ ద్వీపాన్ని Alcatraz అంటారు. అక్కడ లైట్ హౌస్ ఉంటుంది. పాతకాలంలో అక్కడ కట్టిన పెద్ద జైళ్ళలో ఖైదీలని ఉంచేవారట. అక్కడికి వెళ్ళడానికి క్రూజ్ ట్రిప్స్ ఉంటాయి. అది కూడా చాలా బాగుంటుంది, వీలు చూసుకుని మనం ఏదో ఒక రోజు వెళదాం" అని చెప్పారు. కాకపోతే ఈసారి ట్రిప్లో నేను అల్కాట్రాజ్ మిస్సయ్యాను కానీ వచ్చేసారి లిస్టులో రాసి పెట్టేశాం. :-) తర్వాత బ్రిడ్జి కింద వైపుకి వెళ్తే అక్కడ గాలి మరీ ఎక్కువగా ఉంది. ఆ గాలి ఊపుకి చేతిలో కెమెరా కూడా నిలవట్లేదు. చెవుల్లోకి చల్లగాలి వెళ్ళిపోయి తల దిమ్మెక్కేస్తోంది. అయినా సరే కళ్ళ ముందున్న సముద్రాన్ని వదిలి వెళ్ళలేక కాసేపు అక్కడే నించుని సముద్రం ఒడిలోకి మెల్లమెల్లగా జారిపోతున్న బంగారు బంతి లాంటి సూర్యుడిని, కదిలే నీటి అలల మీద నాట్యమాడుతున్న సంధ్యాకిరణాలని చూసి అప్పుడు వెనుతిరిగాము.

మేము కారు దగ్గరికి వెళ్ళగానే కాంతి గారు "ఏంటండీ.. అసలు చల్లగాలిలో అంతసేపు ఉన్నారేంటి? మీరు తొందరగా తీసుకోచ్చేయకుండా ఏం చేస్తున్నారు? పిల్లకి మళ్ళీ ఏ జ్వరమో వస్తుంది సముద్రపు గాలికి.." అని ఆదుర్దా పడిపోయారు. "తనంత ఆనందంగా చూస్తుంటే వెంటనే లాక్కురావాలనిపించలేదులే" అని చెప్పారు కిరణ్ ప్రభ గారు. నిజంగానే కార్లోకి వచ్చి కూర్చోగానే చాలాసేపు నా చెవులు పని చేయలేదు. తలంతా పట్టేసినట్టు అనిపించింది. మేము అక్కడి నుంచి బయలుదేరి గోల్డెన్ గేట్ బ్రిడ్జి మీదుగా వంతెనకి ఆవలి పక్కకి వెళ్ళాము. అటువైపు గాలి ఎక్కువ లేకపోయేసరికి ఈసారి కాంతి గారు కూడా ఉత్సాహంగా కారు దిగారు. అక్కడ చిన్న పిట్ట గోడలా చాలా పొడవున కట్టి ఉంది. అందరూ దాని మీద కూర్చుని బ్రిడ్జిని చూస్తున్నారు. అప్పటికే చీకటి పడిపోయింది. అంతదాకా ఎండలో ఎరుపు రంగులో హొయలు పోయిన వంతెన కాస్తా ఇప్పుడు నలుపు రంగులోకి మారిపోయి అంతలోనే వంతెన మీద వెలిగిపోతున్న విద్యుద్దీపాల వెలుగులో ఇంకోలా మెరిసిపోతూ కొత్త అందం సంతరించుకుంటోంది. అలా బ్రిడ్జి వైపు, దాని మీద హడావుడిగా పరుగులు పెట్టేస్తోన్న కార్ల వైపు చూస్తూ కూర్చున్నాం. "మధురా.. బ్రిడ్జి మీద చూసావా.. వచ్చే వాహనాలు, వెళ్ళే వాహనాలు రెండు రంగుల్లో లైట్స్ ఎలా కనిపిస్తున్నాయో.. రెడ్ లైట్ వరుసేమో అటు వెళ్ళేది, వైట్ లైట్ వరుసేమో ఇటొచ్చేది.." అని చూపించారు కిరణ్ ప్రభ గారు. "భలే ఉంది. ఏదో బుల్లి బుల్లి కార్లతో ఆడుకునే బొమ్మలాటలా ఉంది కదా" అని నేను చాలా సరదాపడ్డాను. :-) ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేనూ, కాంతి గారు అలా ముచ్చట్లలో పడిపోయి టైము సంగతి పూర్తిగా మర్చిపోతాం గానీ కిరణ్ ప్రభ గారు మాత్రం అన్నీ ప్లాన్ ప్రకారం టైముకి జరిగేలా చూసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా దీని తర్వాత నిషి కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కాబట్టి దాని ప్రకారం టైం లెక్కలు వేసి "పదండి పదండి.. మనకి టైం సరిపోదు మళ్ళీ.. కొండ మీదకి వెళ్ళి బ్రిడ్జిని చూసొద్దాం" అని ముందుకి నడిపించేశారు.


ఆ కొండ మీదకి కార్లోనే వెళ్ళి అక్కడి నుంచి ఒక ఐదు నిమిషాల పాటు నడవాలి. ఆ దారంతా చిన్న చిన్న మొక్కలు, కంపలతో మన పల్లెటూర్లలో ఉండే సన్నటి మట్టిదారిలా ఉంది. కానీ పౌర్ణమి రోజులు అవడం, అదీ గాక మూడు రోజుల్లో రాబోయే పున్నమి సూపర్ మూన్ అవడం వల్లనుకుంటా.. వెన్నెల పుచ్చపువ్వులా విరగకాస్తోంది. ఆ వెన్నెల వెలుగులో అసలు చీకటి జాడే తెలీడం లేదు. ఆ కొండ అంచుకి చేరి వంతెనని, సముద్రాన్నీ చూస్తూ నించున్నాం. తెల్లగా చల్లగా కురుస్తున్న ఆ వెన్నెలవానలో సముద్రం మీద నుంచి అలవోకగా వీస్తున్న పిల్ల గాలి గారంగా ముంగురులు సవరిస్తుంటే, కళ్ళ ముందున్న పసిఫిక్ మహా సముద్రపు గాంభీర్యాన్నీ, దూరంగా చిన్ని చిన్ని దీపాలు పెట్టిన బొమ్మరిల్లులా వెలిగిపోతున్న శాన్ ఫ్రాన్సిస్కో నగరపు సౌందర్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవనిపించింది. తెల్లవారి సూర్యోదయం అయ్యేదాకా అలా ఆ వెన్నెల్లోనే కూర్చుండిపోతే బాగుండు అనిపించింది. అదెలాగూ కుదరదులెమ్మని కాసేపు మాత్రం కూర్చున్నాం. దూరంగా వెలిగిపోతున్న మరో వంతెనని చూపించి అదే మనం సాయంత్రం వచ్చిన 'బే బ్రిడ్జ్' అని చెప్పారు కిరణ్ ప్రభ గారు.

కాసేపటికి ఆకాశంలో చందమామని చూడాలో, దూరంగా కనిపిస్తున్న సిటీని చూడాలో, వెన్నెల్లో వెలిగిపోతున్న బ్రిడ్జిని చూడాలో తెలీక నేను సతమతమైపోతుంటే కిరణ్ ప్రభ గారు "ఇలా రా.. నీకో వింత చూపిస్తా" అని పిలిచి అటుపక్కకి సముద్రం వైపు చూపించి "నువ్విప్పుడు మన ప్రపంచ పటానికి ఒక అంచులో నించున్నావు తెలుసా.." అన్నారు. అదెలా అంటే "ఇక్కడి నుంచి కనుచూపు మేరా సముద్రం కనిపిస్తోంది కదా.. ప్రపంచ పటంలో ఎడమ వైపు చివరన కనిపించే పసిఫిక్ మహా సముద్రాన్ని నువ్విప్పుడు చూస్తున్నావు. శాన్ ఫ్రాన్సిస్కో సరిగ్గా భూమి సముద్రం రెండూ కలిసే చోట ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి అవతలంతా సముద్రమే! అయితే భూమి గుండ్రంగా ఉంది కదా మరి.. కాబట్టి నువ్విప్పుడు అలా అలా ఈ సముద్రంలో ముందుకి వెళ్తూనే ఉంటే ఎప్పటికో భూగోళానికి ఆవలి పక్కకి చేరి ఏ హాంకాంగో చూస్తావు. అంతకు మించి మధ్యలో ఎక్కడా ఇంక వేరే భూభాగం అంటూ లేదు. ఉన్నందంతా సముద్రమే.." అని చెప్పారు. అలా ఆలోచించి చూస్తే నిజంగా అద్భుతం అనిపించింది నాకు. అసలు ఈ భూమి ఇంత చిత్రవిచిత్రంగా ఎలా ఏర్పడిందో కదా అని మళ్ళీ స్పేస్ పాఠాలు గుర్తొచ్చాయి కాసేపు. ఆ వెన్నెల్లోంచి అస్సలు కదలాలని లేకపోయినా ఆలోచనలు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చి "కాసేపట్లో నిషి వచ్చేస్తోంది కదా.. ఇదే మొదటిసారి మేమిద్దరం ఒకరినొకరు కళ్ళెదురుగా చూస్కోడం.." అని గుర్తొచ్చి "పదండి పదండి ఇంక ఎయిర్పోర్ట్ కి వెళదాం" అని అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెనక్కి తిరిగాము.

అప్పటికే టైము రాత్రి పది కావొస్తోంది. గోల్డెన్ గేట్ బ్రిడ్జిని చూసే ఆనందంలో మేము డిన్నర్ సంగతి కూడా మర్చిపోయాం. అప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళుతుంటే ఆకలి సంగతి గుర్తొచ్చింది. సరిగ్గా పదిన్నరకి నిషి ఫ్లైట్ లాండ్ అవుతుంది. అంటే ఇంకా అరగంటే ఉంది. మేము సరిగ్గా తనొచ్చేసరికి అక్కడ ఉండగలమో లేదో అన్న కంగారు మొదలై మళ్ళీ తిండి సంగతి మర్చిపోయాం. నిమిషానికోసారి GPS ఇంకా ఎంతసేపని చెపుతుందో చూసుకుంటూ హడావుడిగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి ఇంకా పది నిమిషాల టైముంది. "నిషి ఫ్లైట్ లాండ్ అవ్వగానే కాల్ చేస్తానంది. ఇంకా చెయ్యలేదంటే రాలేదనే అర్థం. మనం కంగారు పడక్కర్లేదు" అన్నారు కాంతి గారు. "అవునా.. పోనీ మనమే చేసి చూద్దామా.. కిరణ్ ప్రభ గారూ మీరు చెయ్యండి" అన్నాను నేను. "అదేంటి నీ ఫోన్ ఏది? నిషి నీ ఫోనుకే చేస్తుంది కదా.." అని కాంతి గారు అనేసరికి అప్పుడు గుర్తొచ్చింది నేను హడావుడిలో ఫోను కార్లోనే మర్చిపోయి వచ్చేసానని. "పోనీలే కనీసం కెమెరా మర్చిపోలేదు. ఏవండీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని రెడీగా ఉండి నిషి, మధుర కలుసుకోగానే వాళ్ళ మొహాల్లో ఎక్సైట్మెంట్ ని కాప్చర్ చేసెయ్యండి. పోయిన సంవత్సరం నేనూ, నిషి మొదటిసారి కలుసుకున్నప్పుడు ఆ సర్ప్రైజ్ ఫీలింగ్ ని ఫోటోల్లో బంధించి ఉంటే ఎంత బాగుండేది కదాని ఎప్పుడూ అనిపిస్తుంటుంది" అని కిరణ్ ప్రభ గారి చేతికి కెమెరా ఇచ్చారు. ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసి ఇంక ఏ క్షణంలోనైనా నిషి వచ్చేస్తుంది అనుకుంటే ఉద్వేగంతో మా ఇద్దరికీ అస్సలు కాలు నిలవడం లేదు. ఆ గేట్ లోంచి వస్తున్న జనాలందరిలో నిషి కనిపిస్తుందేమోనని వెతుక్కుంటూ నించున్నాం.
అలా చూస్తుండగానే కాంతి గారు ఉన్నట్టుండి "అదిగో నిషి తల్లి వచ్చేసింది" అన్నారు. నేను "ఏదీ ఎక్కడా ఎక్కడా" అని అరిచేసరికి "అదిగో చూడు లైట్ గ్రీన్ కలర్ షర్ట్, జీన్స్ లో చూడు.. పద పద" అని కాంతి గారు ముందుకి నడుస్తుంటే ఈ లోపు నాక్కూడా నిషి కనిపించేసింది. తను కూడా మమ్మల్ని చూసి పరిగెడుతున్నంత వేగంగా గబగబా నడుస్తూ వచ్చేసింది. "హేయ్.. నిషీఈఈఈ.." అని అరుస్తూ తన దగ్గరికి వెళ్ళగానే నన్ను గట్టిగా చుట్టేసి "మధురాఆఆ.. నేనొచ్చేసా.." అని తను కూడా అరిచేసింది. మా ఇద్దర్నీ కలిపి కాంతి గారు రెండు చేతులతో దగ్గరికి తీసుకున్నారు. ఆ ఉద్వేగంలోంచి ఇంకా బయటపడక ముందే "ఏంటి కాంతి గారూ.. ఎవరీ స్కూల్ పిల్ల? ఏ హైస్కూల్ నుంచి తీసుకొచ్చారు?" అంది నిషి. అదే తను నన్ను చూసాక మాట్లాడిన మొదటి మాట. "ఓయ్.. నేనేం స్కూలు, కాలేజ్ కాదు. అసలు నువ్వే ఫోటోల్లో కన్నా బయట చిన్నగా ఉన్నావు తెలుసా.." అని నేనంటే "నేను ముందే మీ ఇద్దరికీ చెప్పానా.. మీ ఇద్దరూ ఫోటోల్లో కన్నా బయట చిన్నపిల్లలా ఉంటారని.." కాంతి గారు అనేసరికి అందరం గట్టిగా నవ్వేశాం. తర్వాత నిషి చేతుల్లో ఉన్న రెండు బ్యాగులు చెరొకటి లాగేసుసుకుని అందరం కలిసి లగేజ్ తీసుకోడానికి వెళ్ళాం.
మేమిద్దరం కలవగానే ఆ క్షణంలో మమ్మల్ని ఫోటో తీయడానికి కిరణ్ ప్రభ గారు ఎంత ప్రయత్నించినా అన్నీ కదిలిపోయి సరిగ్గా రాలేదు. ఎందుకంటే మేము అంతలా గంతులు వేసామన్నమాట అప్పుడు. లగేజ్ తీసుకున్నాక పార్కింగ్ లోకి వెళ్ళి కారు తీశాక కాంతి గారు నిషి కారెక్కబోతుంటే "ఆగాగు. నువ్వు అటువైపు కూర్చో. అప్పుడైతే ముందున్న మధుర బాగా కనిపిస్తుంది కదా.. ఇప్పటి నుంచీ నీ ప్లేస్ అదే" అని చెప్పి నాకు ఎదురుగా ఉండే వైపు నిషిని కూర్చోబెట్టారు. "కాంతి గారూ.. అబ్బా మీరెంత స్వీటో అసలూ.." అని నిషి చాలా సంబరపడిపోయింది. కార్లో ఇంటికి వెళ్ళేదారిలో San Mateo Bridge దగ్గరికి రాగానే "నిషీ.. ఇదిగో ఇదే స్వర్గలోకపు ద్వారం. ఇక్కడికి వచ్చామంటే మనం ఇంటికి వెళ్ళబోతున్నాం అన్నమాట. స్వర్గంలోకి నీకు స్వాగతం" అని చెప్తే "ఈ వంతెన నిజంగా అలానే ఉంది మధురా.. బాగా చెప్పావ్" అని మెచ్చుకుంది. అంతలో కాంతి గారు "ఇలాంటివన్నీ చెప్పినప్పుడు తెలివి గల పిల్లలానే కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడూ మాత్రం నువ్విందాక అన్నట్టు నిజంగా స్కూలు పిల్లలాగే చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం ఏమైందో తెలుసా.." అని మొదలెట్టారు కాంతి గారు. నేను మధ్యలో అడ్డం వెళ్ళి "అబ్బా.. మీరు మరీ చెప్తార్లెండి.. అసలు మీరే స్కూలు పిల్ల. నేనేం కాదు. ఇప్పుడవన్నీ ఎందుకండీ బాబూ.." అని ఆపడానికి ప్రయత్నించాను. నిషి ఏమో చెప్పండి చెప్పండి అని ఒకటే గోల. "మధ్యాహ్నం నేను కాసేపు నిద్రపోయాను. మెలకువొచ్చేసరికి ఎదురుగా బిక్కమొహం వేసుకు నించుని కాంతి గారూ, నేనొక పిచ్చి పని చేసాను. పైన గదిలో తలుపు హేండిల్ ని లాగితే అది ఊడిపోయిందండీ. ఇప్పుడెలా? అంటే కాసేపు నాకేం అర్థం కాలేదు. ఏం కాదులేమ్మా, ఆయనొచ్చాక చూస్తార్లే అంటే ఈలోపే తల వంచుకుని కూర్చుని కళ్ళలోంచి ధారలు కురిపించేసింది. ఆ తలుపు సంగతి చూడటం కన్నా ఈ తల్లి ఏడుపు ఆపి నవ్వించడానికే ఎక్కువసేపు పట్టింది" అని కాంతి గారు చెప్పాక నేను తప్ప అందరూ చాలాసేపు నవ్వారు. "మీరు కూడా ఎప్పుడో అప్పుడు ఏదోకటి పాడు చెయ్యకపోరు. అప్పుడు కొంచెమన్నా ఫీలవుతారో లేదో నేనూ చూస్తాన్లే.." అని రోషంగా అన్నానని ఇంకా ఎక్కువ నవ్వారు. అలా ఏదోకటి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి క్షణంలో వచ్చేసాం అనిపించింది.

ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. సాయంత్రం చలి గాలి దెబ్బకి మొదలైన నా తలనొప్పి ఇంటికొచ్చేసరికి బాగా ఎక్కువైపోయింది. దిష్టి తీసేస్తే సగం తలనొప్పి పోతుందని కాంతి గారు కిచెన్లోకి లాక్కెళ్ళారు. రోజూ ఇలా దిష్టి తీసుకుంటే మనింట్లో మిరపకాయలన్నీ అయిపోతాయంటే ష్ష్.. అని నోరు మూయించేసి మరీ దిష్టి తీసాక అప్పుడు అన్నం పెట్టారు. నేను వస్తున్నానని కాంతి గారు బోల్డు ప్రేమగా ఒక పెద్ద డబ్బా నిండా సున్నుండలు చుట్టి పెట్టారు. నేనేమో "అబ్బా స్వీటా, అందులోనూ సున్నుండలా.. నావల్ల కాదంటే కాదు" అనేసరికి " నీకసలు మంచి అలవాట్లే లేవు. సరేలే.. నువ్వు తినకపోయినా నిషి తల్లి ఇష్టంగా తింటుందిలే.." అన్నారు. ఆ విషయం ఇప్పుడు గుర్తు చేస్తే కాంతి గారు వెళ్ళి సున్నుండ డబ్బా మూత తీయగానే తనకి స్వీట్లంటే బాగా ఇష్టం కాబట్టి ఎగిరి గంతేసినంత పని చేసింది నిషి. భోజనాలు అయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకున్నాక కిరణ్ ప్రభ గారు మాకు గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి పడుకున్నారు. మేము ముగ్గురం మాత్రం అర్ధరాత్రి దాటినా నిద్రపోడం ఇష్టంలేక కబుర్లు చెప్పుకుంటూ అలానే కూర్చున్నాం ఇంకాసేపు. నిషీ వాళ్ళ టైము ప్రకారం ఇంకాసేపైతే తను నిద్ర లేచే వేళ కూడా అయిపోతుంది. దానికి తోడు ప్రయాణపు అలసట కూడా కలిసి తనకి బాగా నిద్రొచ్చేస్తోంది. నాకేమో తలనొప్పి.. ఇంక ఎలాగో తప్పదని రేపొద్దున్నే లేచాక ఫ్రెష్ గా ఇంకా బోల్డు మాట్లాడుకోవచ్చులెమ్మని సర్ది చెప్పుకుని అయిష్టంగానే వెళ్ళి పడుకున్నాం ఆ రోజుకి.

కిటికీలోంచి పలకరిస్తున్న వెన్నెల చంద్రుడిని చూసి నాకు మళ్ళీ సాయంత్రం చూసిన దృశ్యాలన్నీ గుర్తుకొచ్చాయి. మబ్బులు లేని తేటైన ఆకాశంలో, రాత్రి వెలుగులో గోల్డెన్ గేట్ బ్రిడ్జి చూడటం బావుంది కానీ.. ఇప్పుడే ఇంతందంగా ఉందంటే సముద్రం మీద మసక మసకగా అలుముకున్న పొగమంచులో ఇంకెంత అందంగా ఉంటుందో కదా.. ఆ కొండ అంచు మీద నించుని కొద్దిగా చలికి వణికిపోతూ పల్చటి మంచుతెరల మధ్యన తేలే వంతెనని ఎప్పటికైనా చూస్తే బావుండు.. అని ఊహించుకుంటూ నిద్రలోకో, కలల్లోకో జారిపోయాను. :-)

20 comments:

శ్రీనివాస్ పప్పు said...

"రాత్రి వెలుగులో గోల్డెన్ గేట్ బ్రిడ్జి చూడటం బావుంది కానీ.. ఇప్పుడే ఇంతందంగా ఉందంటే సముద్రం మీద మసక మసకగా అలుముకున్న పొగమంచులో ఇంకెంత అందంగా ఉంటుందో కదా"

మీరిద్దరూ మొదటిసారి ఎయిర్‌పోర్ట్ లో కలుసుకున్నప్పుడు మీ మొహాల్లో కనపడ్డ అమందానందకరం కన్నా అందంగా ఉండదని ఖచ్చితంగా చెప్పగలను మధురా

వేణూశ్రీకాంత్ said...

హహహ నూటికి నూరు పాళ్ళు పప్పుగారితో ఏకీభవిస్తాను మధురా :-)

కొన్ని సంధర్బాలను అక్షరాలలో చెప్పడం అసాధ్యమని ఎవరన్నారోకానీ వాళ్ళకోసారి నీ డైరీలోని ఈ పేజీలు చూపించాలి. నాకైతే మీరు ముగ్గురు అలా కళ్ళముందు కనిపించేశారు :-)

మీ డైరీలోని మరో అందమైన పేజీ చదవగలిగినందుకు సంతోషంగా ఉంది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పేజ్...

chavera said...

2007లో 'బంగారు ద్వారం' వంతెన చూసిన ,
బంగారు క్షణాలను గుర్తుకు తెచ్చినందుకు ,
చాలా చాలా ధన్యవాదాలు .
డైరీ రోజు విడవకుండా చదవడానికి ,
సాధ్యమైనoత వరకు వరం ఇవ్వు తల్లీ


తృష్ణ said...

so sweet..:)

Vasu said...

Having lived for 3 years in Bay area, reading this post made me nostalgic

ఇందు said...

Memu nee antha adrushtavantulam kaadu amma.... anduke maaku mitta madhyanam poga manchu duppati kappesukuni kanipinchidi Golden gate bridge ;) aithe bane undanukooo... neeku alaa chudali annavgaa.... ne chupistale :))

Unknown said...

బాగున్నయ్యమ్మా కబుర్లు:)) పప్పుగారి కామెంట్ బ్రమ్హాండం:))

మధురవాణి said...

@ శ్రీనివాస్ పప్పు,
అంతేనంటారా బుల్లెబ్బాయ్ గారూ.. మీరు చెప్పాక ఏమంటాం.. అవును నిజమే కదాని ఒప్పేసుకుంటాం. :-)

@ వేణూశ్రీకాంత్,
నీ కామెంట్ చూసి అలా అలా మునగచెట్లు అవీ దాటి మబ్బుల దాకా వెళ్ళొచ్చాను వేణూ.. థాంక్యూ సో సో మచ్.. :-)
నిన్న ఈ పేజీ రాస్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి అలా ఎయిర్పోర్ట్ లో నించుని నిషి కోసం ఎదురు చూస్తున్నప్పటి అనుభూతే కలిగింది. చదివిన మీక్కూడా అది తెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.

@ chavera,
నా కబుర్లు మీ జ్ఞాపకాలని తట్టి లేపినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు. వీలు చూసుకుని సాధ్యమైనంత త్వరగానే రాసే ప్రయత్నం చేస్తున్నాను. :-)

@ తృష్ణ,
థాంక్యూ.. :-)

మధురవాణి said...

​@ Vasu,
Great to hear it. Thank you.. :-)

@ ఇందు,
సూపర్ ఇందమ్మాయ్.. పొగమంచులో ​
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూసావా.. అయితే నువ్వింకా లక్కీ అని అర్థం.. తొందరగా నాక్కూడా చూపించెయ్ మరి.. :-))

@ ​సునీత ​గారూ,
థాంక్యూ సో మచ్.. :-)​

Kranthi M said...

నిషిగారూ మీకేమన్నా సైటుందా?? ఏమీలేదు మాకెవరికీ మధుర స్కూలు పిల్లలా కనపడలేదే మీకెలా కనపడిందా అని ;-P పప్పు సార్ మీరంటే పెద్దవారు కాబట్టి మీకు మేమందరం బుడ్డొల్లమే కాబట్టి మిమ్మల్ని మాత్రం దీనికి ఆన్సర్ చెప్పే లిస్ట్‌లో నించి తీసేస్తున్నా. మీరు కాకుండా ఆ రోజు కలిసిన వాళ్ళెవరైనా చెప్పొచ్చు. Just Kidding

మీరు కలిసినప్పుడు కలిగిన ఆనందం మాత్రం చదువుతున్న నాక్కుడా కలిగింది ఎందుకో :) మధురని ఇప్పటికే చాలా సార్లు పొగిడేసా కాబట్టి ఈ సారి నిషి గారి వంతు.

నిషిగారూ ఎప్పటి నించో మీ "ఊసులాడే ఒక జాబిలట" తెలుసు, పరిచయం లేక పోయినా మీరు తెలుసు, మీ బ్లాగు తెలుసు. కానీ ఎప్పుడు ఆ పుస్తకం చదవటం ఎందుకో గానీ చెయ్యలేదు. మొన్ననే మధుర బ్లాగులో ఇచ్చిన లింకులో చూసి కొంచం ఖాళీ కూడా ఉండటం వల్ల చదివాను. నాకు ఎక్కడో చదివి ఉండటం వల్ల ఇది ఇంతకు ముందే జరిగినది అని తెలుసు. కాబట్టి నాకు పాత్రలకంటే కూడా అక్కడ స్నేహంలోని స్వచ్చత, మీరు దాన్ని నడిపించిన తీరు, ఏ పాత్రా ఒక్క అక్ష్రం కూడా తన పరిది దాటి వెళ్ళకపోవటం బహు బాగ నచ్చాయి.

చివర్లో ఆ పాత్ర కలవదు అని తెలిసినప్పుడు కళ్ళలో ఒక నీటి పొర మాత్రం అలా వచ్చి వెళ్ళింది. జీవితంలో ఎప్పుడు ఏడవకూడదు అని ఒట్టు పెట్టుకున్న నాకు, అపుడెపుడో మాత్రుదేవోభవ చూసినప్పుడు మళ్ళీ ఇపుడు ఆ అనుభవం తప్పలేదు.:)

ఇక మీకు ఈ ఆతిధ్యాన్ని ఇచ్చిన కిరన్ గారు, కాంతి గారి గురించి చదువుతుంటే ఒక్క సారన్నా కలిస్తే బాగుణ్ణు అనిపించింది. ఖచ్చితంగా కుదిరితే ఎప్పుడో ఒకప్పుడు కలవకపోతామా. కాకపోతే పక్క పక్క ఇళ్ళు కాదు కాబట్టి కొంచం సమయం పట్టొచ్చు.

ఇక్కడ నేను చెప్పిన ప్రతి మాటా నిజం. సాక్ష్యం కావాలంటే మీరెక్కడైనా వెతికి చూసుకోండి నేను ఇప్పటిదాకా ఇంత పెద్ద కామెంటు ఎప్పుడూ, ఎక్కడా రాయలేదు. ;-)

ఇక పోతే నా కిష్టమైన కవితలు - కౌముదిలో కానీ, ఆ నవలలో గానీ కిరణ్ గారు రాసిన,రాసే కవితలు చాలా బాగ నచ్చాయి.ఇక ఎప్పటినించో చదువుతున్న నిషిగారి కవితలూ అంతే. ఇక వ్యాసాల్నే కవితలతో నింపినట్టుండే మధుర కబుర్లు. అందరికీ నేను అభిమానినే. కాంతిగారికి, సున్నుండలకి కూడా :)

అమ్మా మధురా... నీ టపా గురించి రాద్దామని మొదలెట్టి ఇదుగో ఇలా చిరిగి చాటంత అయ్యింది.కాకపోతే మొత్తం మీద నేను రాసిందాంట్లో ఒక అక్షరం కూడా ముఖస్తుతికో, మొహమాటానికో రాసింది కాదు. మొత్తం మీద నీ యాత్రతో నాకు తెలియని కొందరిని ఎంతో తెలుసు అనిపించేలా పరిచయం చేసావు. ఇక ఉంటాను....

నిషిగంధ said...

I totally relived those moments!! ఫ్లైట్ దిగి మీకోసం గబగబా నడుచుకెళ్ళినప్పుడనిపించిన ఎక్సైట్‌మెంట్ మళ్ళీ కలిగింది! అంత బిజీ ఎయిర్‌పోర్ట్‌లో చుట్టుపక్కల పట్టించుకోకుండా ఎలా ఎగిరామసలు!! :-)
కాంతిగారు నాకు నా సీట్ కేటాయించటం కూడా మర్చిపోలేదుగా నువ్వు!

నైట్ ఫోటోలు చాలా బావున్నాయి.

క్రాంతిగారు, మీ సుదీర్ఘ వ్యాఖ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు! అసలు మధురకి నేను బోల్డని థాంక్సులు చెప్పుకోవాలి మళ్ళీ ఊసులాడే జాబిలిని మబ్బుల చాటునించి బయటకి తెచ్చినందుకు!
బైదవే, నేను కూడా మీ కవితలకి అభిమానినేనండీ... :-)

సిరిసిరిమువ్వ said...

చాలా రోజుల తరువాత బ్లాగులకి వచ్చా! ఈ రోజు నీ శాన్ఫ్రాన్సిస్కో టపాలన్నీ ఏకధాటిగా చదివేసా! చాలా బాగా వ్రాస్తున్నావు మధురా! నీ ఓపికకి, జ్ఞాపక శక్తికి ఓ సలాం!

ఫేస్ బుక్కులో నిషీ పెట్టిన ఫోటోలు చూసి మీరిద్దరూ ఎక్కడ కలిసారా..ఎలా కలిసారా అనుకున్నా!..ఇంత కథ ఉందన్నమాట!

మధురవాణి said...

@ Kranthi Kumar Malineni,
​​
నీ ​కామెంట్ చూసాక నీ అంత బాగా సమాధానం చెప్పడం కష్టం అనిపిస్తుంది క్రాంతీ.. :-)​
Thank you so so much for sharing our happiness.. :-)

​​@ నిషిగంధ,
రాస్తున్నప్పుడు నాక్కూడా నేను ఎయిర్పోర్ట్ లో నీకోసం ఎదురుచూస్తున్నట్టు అనిపించింది తెలుసా.. :))​

​​
@ ​సిరిసిరిమువ్వ,
wow.. మీరు సూపర్ స్వీటండీ అసలూ.. ఊరి నించి రాగానే ఓపిగ్గా అన్నీ పేజీలు చదివేసి కామెంట్ కూడా పెట్టారు. బోల్డు బోల్డు థాంకులు.. వెనకా ముందూ ఉన్న కథంతా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ​Hope you like the rest of it. :-)

Thiru Kannegandla said...

Madhura garu,started reading your SFO-dairy from this week, chala baga raastunnaru. Your postings deserve a Book like BayArea travelogue..:-)

బాల said...

బాగున్నాయండి మీ డైరీ కబుర్లు. ఎంతైనా స్నేహితుల్ని కలిస్తే వచ్చే ఆనందమే వేరు...............

Unknown said...


అందమైన అనుభూతుల్ని మీ బ్లాగ్ లో మరింత అందంగా రాసి పదిలపరచుకున్నారు. మీ మాటల్తో గోల్డెన్ గేట్ బ్రిడ్జి నీ చూపెట్టేశారు. మీ ఈ ట్రిప్ మధురానుభూతుల్నిలా Diary లా రాసుకోవటం ఎంతో నచ్చింది.

ఫోటాన్ said...

ఆ ఫొటోస్ అన్నీ మీ కెమెరా, అంటే అదే నాకు చెందబోయే కెమెరా తో తీసినవా?
చాలా బాగుంది ఈ రోజు కుడా :)

మధురవాణి said...

​@ ​Thiru Kannegandla,
​Thanks for your compliments! నేనేదో నా సొంత డైరీలా రాసుకుంటున్నాను గానీ ట్రావెలాగ్ లా రాయడం లేదు కదండీ.. మీ అభిమానానికి ధన్యవాదాలు. :-)

@ బాల,
థాంక్స్.. అవునండీ friends make our lives beautiful! :-)

@ చిన్ని ఆశ,
ధన్యవాదాలండీ.. నా జ్ఞాపకాలకి శాశ్వతత్వం కల్పిద్దామనే నా ప్రయత్నం.. :-)

@ ఫోటాన్,
హహ్హహ్హా.. అవును.. ఆ కెమెరాతో నేనే తీశాను ఫొటోలన్నీ.. థాంక్స్.. :-)

రాధిక(నాని ) said...

ఫోటోలు చాలా బాగున్నాయి.భలే భలే నిషి గారోచ్చేశారు .నిషి గారు రావడం ,మీ ఎక్సైట్మెంట్ అన్నీ చదువుతుంటే మేముకూడా చుసిన అనుభూతి కలుగుతుంది .ఫేస్బుక్ లో ఫోటోలో చూసా గా మీరు నిజంగానే హైస్కూల్ నుండి వచ్చిన అమ్మాయిలానే ఉన్నారు.మీరు తిరిగిన ప్లేసెస్ గురించి కళ్ళకు కట్టినట్టు భలే రాస్తున్నారు.

మధురవాణి said...

@ ​​ రాధిక(నాని),
మాతో పాటు మీరు కూడా ప్రతీ సంఘటన గురించి చదివి ఎంజాయ్ చేస్తున్నందుకు ​చాలా సంతోషంగా ఉంది రాధిక గారూ.. ధన్యవాదాలు. ​