Sunday, July 28, 2013

My San Francisco Diary - 4


​13.06.2013
గురువారం
భూగోళానికి ఓ పక్కనుంచీ ఇంకో పక్కకి ఎగిరొచ్చేసాను కదా.. అకస్మాత్తుగా స్థలకాలాల్లో వచ్చిన మార్పు, ప్రయాణం మోసుకొచ్చిన అలసట వల్ల కమ్ముకొచ్చిన మగత రెండూ కలిసిపోయిన కలత నిద్ర నన్ను ఏదో లోకాల్లోకి లాక్కెళ్ళిపోయింది. కిటికీ బయటున్న చెట్ల ఆకులు గాలికి చేసే శబ్దాలు వినిపిస్తూ, ఉదయపు కాంతో, వెన్నెల వెలుగో తేడా తెలీనట్టు, అసలు నేనెక్కడున్నానో తెలీని అయోమయంలో ఏదో కల లీలగా మెదిలి కలవరపెట్టేసరికి నిద్ర తేలిపోయి మెలకువొచ్చేసింది. లేచి టైము చూస్తే తెల్లవారుజాము నాలుగున్నర అయ్యింది. మళ్ళీ ఎంతసేపటికీ నిద్ర రాక రాత్రి కాంతి గారు ఫేస్ బుక్లో ఫొటోస్ పెట్టానని చెప్పిన విషయం జ్ఞాపకానికొచ్చి సరే అదన్నా చూద్దాం కదాని లాప్ టాప్ ముందేసుకున్నాను. నాకోసం ఎదురుచూస్తున్నానని వేసిన పోస్టుకి, ఎయిర్ పోర్ట్లో తీసిన ఫొటోస్ కి రమణి గారు, ఉమ గారు, పద్మవల్లి గారు, నిషి వాళ్ళందరూ పెట్టిన కామెంట్స్ చూసి రిప్లై రాస్తే "ఏంటీ.. నిద్రపట్టడం లేదా?" అని అడిగి నవ్వింది నిషి. కాసేపు ఫేస్బుక్లో అటూ ఇటూ దిక్కులు చూసి మళ్ళీ నిద్ర పోదామని ప్రయత్నించి కుదరక ఇంక లేచి కిందకొచ్చేసాను. కాంతి గారు అప్పటికే కిచెన్లో వంట పని మొదలుపెట్టేసారు. నన్ను మెట్ల మీద నుంచి చూసే "లేచావా తల్లీ.. ఇంకాసేపు పడుకోవాల్సిందిగా" అంటే నిద్ర పట్టట్లేదని చెప్పాను. అమ్మా వాళ్ళకి ఫోన్ చేస్తానంటే ఫోన్ తెచ్చిచ్చారు. నాన్న ఫోన్ కి చేస్తే బిజీ వచ్చింది. అప్పుడే కిరణ్ ప్రభ గారు మార్నింగ్ వాక్ నుంచి వచ్చారు. ఉదయాన్నే మనింటి పక్కనున్న పార్కులో వాకింగ్ కి వెళ్ళడం చాలా బాగుంటుంది. రేపటి నుంచీ నువ్వు కూడా వస్తావా తల్లీ" అన్నారు. కాంతి గారు నాకు చాన్స్ ఇవ్వకుండా "పిల్లని అప్పుడే వాకింగులూ అవీ అని పొద్దున్నే లేపకండి. నాలుగు రోజులు పోయాక వస్తుందిలే" అనేసారు. నేను మళ్ళీ నాన్నకి కాల్ చేద్దామనుకుంటే "ఫోన్లో రీడయల్ బటన్ ప్రెస్ చెయ్యమ్మా సరిపోతుంది" అన్నారు కాంతి గారు. అవతల ఫోన్ రింగ్ అయ్యి ఎత్తగానే నాన్న కాకుండా ఎవరో కొత్త గొంతు "హలో చెప్పండి కిరణ్ గారూ.." అన్నారు. దెబ్బకి నా నిద్ర మత్తు వదిలిపోయి వెంటనే నేను పొరపాటున రీడయల్ రెండు సార్లు నొక్కేసానేమో, రాత్రి చివరి కాల్ కిరణ్ ప్రభ గారు చంద్రబోస్ గారితో మాట్లాడారు కదా, ఇప్పుడు ఆయనకి వెళ్ళిపోయినట్టుంది కాల్ అని అర్థమయ్యి "ఒక్క నిమిషం ఉండండి.." అని చెప్పేసి పరిగెత్తుకెళ్ళి కిరణ్ ప్రభ గారికి ఫోన్ ఇచ్చేసి పొరపాటున చంద్రబోస్ గారికి చేసానని చెప్పాను. తర్వాత వాళ్ళు చాలాసేపే మాట్లాడుకున్నారు కానీ అలా నా వల్ల పొరపాటు జరిగినందుకు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. "ఈ టైంకి నేను కాల్ చేస్తానని చంద్రబోస్ గారికి చెప్పాను. ఆయన ఎలాగూ నా కాల్ కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి ఏం పర్లేదులేమ్మా.." అని సర్దిచెప్పారు కిరణ్ ప్రభ గారు. తర్వాత అమ్మా వాళ్ళతో మాట్లాడాము. "మా అమ్మాయిని తెచ్చేసుకున్నామండీ.." అని కాంతి గారంటే అమ్మేమో "మాకేం బెంగ లేదులెండి.. జర్మనీలో కన్నా ఇక్కడుంటేనే అసలు పట్టించుకో అక్కర్లేదు. మీరుంటారు కదా అన్నీ చూస్కోడానికి" అంది. "అప్పుడు హైదరాబాదులో చూసినప్పటి కంటే రాత్రి చాలా నయమండి. బానే వచ్చింది..." అని మొదలుపెట్టి ఇంకా ఏదేదో సోది మాట్లాడుకున్నారు నా గురించి. :-) తమ్ముడేమో "నువ్వు అక్కడికెళ్ళి ఇలా మా అందరితో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతావా, మళ్ళీ జర్మనీ వచ్చేదాకా ఎక్కువ కాల్ చెయ్యకు. మీరు బాగా ఎంజాయ్ చెయ్యండి" అని వెంటనే ఫోన్ పెట్టేసాడు.
బ్రేక్ ఫాస్ట్ లో వేడి వేడి ఇడ్లీలు, నెయ్యిలో కారప్పొడి, అల్లం పచ్చడి వేసిస్తే ఆహా ఇండియా వెళ్ళిపోయినట్టుంది కదాని సంబరపడిపోతూ నేను కడుపు నిండా ఇడ్లీలు నింపేసరికి కాంతి గారు వంట పూర్తి చేసేసారు. రోజూ ఉదయాన్నే చకచకా ఓ గంటసేపట్లో రెండు మూడు కూరలు చేసేసి వంట పని ముగించేస్తారు కాంతి గారు. అందుకని తర్వాత రోజంతా తీరిగ్గా కబుర్లు చెప్పుకోడానికి మాకు బోల్డు టైముంటుంది. ఉదయం తొమ్మిదయ్యేసరికి కిరణ్ ప్రభ గారు ఆఫీసుకి వెళ్ళిపోతారు. ఇంక అప్పటినుంచీ మధ్యాహ్నం లంచ్ టైముకి ఆయనొచ్చేదాకా మాకసలు సమయం ఎలా గడిచేదో తెలిసేది కాదు. అలా అలా ఆపకుండా కబుర్ల ప్రవాహంలో అప్పుడే లంచ్ టైమయ్యిందా అనిపించేది. మా ఇద్దరి కబుర్లు కాకుండా ఫోన్ కబుర్లు కూడా ఉండేవి. అసలు నేను అమెరికా వస్తున్నాని చెప్పినప్పుడే మా మధ్యనున్న చనువు కొద్దీ "ఇప్పుడా పిల్లా చెప్పేది.." అని పోట్లాడారు పద్మవల్లి గారు. నాకేమో ఈసారికి వాళ్ళ ఊరి వైపు వెళ్ళడం కుదరదు. నాకోసం ఇంత దూరం రావాలన్నా తనకీ వీలయ్యే పని కాదని తెలుసు కాబట్టి ఈ ట్రిప్లో పద్మవల్లి గారిని కలవడం మిస్సయిపోయాను. :-( కానీ, ఒకరకంగా అసలు మిస్సయినట్టే అనిపించలేదు. ఎందుకంటే దాదాపు ప్రతిరోజూ ఉదయాన్నే పద్మవల్లి గారు కాల్ చేసేవారు. రోజు ఏమేం చేసామని చెప్పి కనీసం ఓ గంటసేపన్నా సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ రోజు కూడా పద్మవల్లి గారితో మాట్లాడాక రమణి గారికి కాల్ చేసి మాట్లాడాము. ఎప్పట్లాగే రమణి గారు నేను తిన్న ఇడ్లీలు సగం అరిగిపోయేదాకా తెగ నవ్వించేసారు. తర్వాత పద్మజ గారితో మాట్లాడాము. "కాంతి గారి ఎక్సైట్మెంట్ ని మేము కూడా షేర్ చేసుకున్నాం. మీ ఇద్దరూ బాగా ఎంజాయ్ చెయ్యండి. ఫేస్బుక్లో ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. మనందరం ఒకేసారి కలుసుకోడానికి ఎప్పుడైనా ప్లాన్ చెయ్యాలి" అని చెప్పారు రమణి గారు, పద్మజ గారు. తర్వాత నిషితో మాట్లాడాము. "వచ్చే వారం ఈ టైముకి నువ్వు వచ్చేస్తావు, మనం ముగ్గురం కలిసి ఉంటాం కదా.." అని కాసేపు దాని గురించి బోల్డు ఊహించేసుకుని ఆనందించాం. ఈ ఫోన్ కాల్స్ అన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయింది. కిరణ్ ప్రభ గారు వచ్చేసారు. ముగ్గురం కలిసి లంచ్ చేసాక "సాయంత్రం ఐదింటికల్లా బయలుదేరి బయటికి వెళదాం. నేనొచ్చేసరికి రెడీ అయ్యి ఉండండి" అని చెప్పి కిరణ్ ప్రభ గారు ఆఫీసుకి వెళ్ళిపోయారు.

అసలు నాకప్పటిదాకా కాంతి గారి దగ్గరికెళ్ళాలి అన్న ఉత్సాహమే తప్ప ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన నగరాల్లో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కో కి వెళుతున్నాను అన్న స్పృహే లేదు. అందుకని ఇక్కడికొచ్చాక ఏం చూడాలి అని ప్రత్యేకంగా ఆలోచించలేదు. కానీ కాంతి గారు, కిరణ్ ప్రభ గారు మాత్రం బాగా ఆలోచించి నాకు ఈ ట్రిప్పులో ఏమేం చూపించాలి ఒక పెద్ద లిస్టు రాసి పెట్టారు. అందులో భాగంగా మొదటి రోజు వెళ్ళాలనుకున్న ప్లేస్ Livermore Hindu Temple. సాయంత్రం తీసుకెళ్తానన్నది అక్కడికే. అసలు నేను అమెరికా ప్రయాణం అనుకోగానే కాంతి గారికీ నాకూ మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే "నువ్వు ఎప్పుడు అమెరికా వస్తావో తెలీదు కానీ ఎప్పుడొచ్చినా సరే వచ్చేప్పుడు లంగా ఓణీ మాత్రం తెచ్చుకోవాలి" అని కాంతి గారి ఆజ్ఞ. అసలెలా చెప్పారంటే రాగానే సూట్కేస్ చెక్ చేసి లంగా వోణీ తెచ్చుకోకపోతే వెనక్కి పంపిస్తారేమో అన్నంత గట్టిగా చెప్పారు. మళ్ళీ వచ్చేలోపు ఓ అరడజను సార్లు గుర్తు చేసారు కూడా "లంగా వోణీ పెట్టుకున్నావా లేదా?" అని. ఇవాళ గుడికి కదా వెళ్ళేది. అందుకని మధ్యాహ్నం నుంచే ఒకటే హడావుడి తొందరగా రెడీ అయిపోదాం పద అని. మొత్తానికి నా బద్ధకం వదిలించి ఎలాగైతేనేం ఇద్దరం ఎంచక్కా నెమలి పింఛం నీలం రంగులో మ్యాచింగ్ మ్యాచింగ్ లంగా వోణీ, చీర సింగారించి, ఈ గొలుసు బాలేదు, ఆ నెక్లెస్ బాలేదు అనుకుంటూ మార్చి మార్చి మొత్తానికి ఐదింటికి అంటే ఓ అరగంట ఆలస్యంగా ఐదున్నర కల్లా రెడీ అయిపోయాం.


California Ranches
ఇంట్లోంచి బయలుదేరగానే కిరణ్ ప్రభ గారు "ఇప్పుడు నిన్నొక అందమైన దారిలో తీసుకెళతాను. నీకేమనిపిస్తుందో చూద్దాం.." అన్నారు. ఇల్లు దాటి ఒక ఐదు నిమిషాలు వెళ్ళామో లేదో రోడ్డుకి ఇరుపక్కలా ఎటు చూసినా సూర్యకాంతికి బంగారు వర్ణంలో మెరిసిపోతూ చిన్న చిన్న కొండలూ, వాటి నిండా ఎవరో శ్రద్ధగా కత్తిరించినట్టు ఒకే ఎత్తులో మెత్తగా పెరిగిన ఎండుగడ్డి పరుచుకుని ఉన్న విశాలమైన మైదానాలు... అలా చూస్తుంటే నాకు అసలు కళ్ళు ఆర్పబుద్ధి కాలేదు. అసలు బంగారు పోత పోసినట్టు, ఎవరో గొప్ప కళాత్మకంగా వేసిన వర్ణచిత్రంలాగా, అత్యంత నైపుణ్యంగా నేసిన తివాచీలాగా ఆ కొండలు ఎంత బాగున్నాయో! అక్కడక్కడా ఒంటరిగా ఒకటో రెండో పచ్చని చెట్లు, కొండల దిగువన మైదానాల్లో కొన్ని చోట్ల గుర్రాలు, కొన్ని చోట్ల ఆవులు, గొర్రెలు.. మొత్తంగా ఎటువైపు చూసినా అక్కడ దిగిపోయి అలా నడుచుకుంటూ ఆ కొండల మీదకి ఎక్కేసి ఆ లోయల్లో చిన్నప్పటిలా జారుడుబండ ఆటలా దొర్లుకుంటూ ఆడుకుంటే బావుండు.. అసలు అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టేసుకుని ఉండిపోతే బావుండు అని ఎంత అనిపించిందో! ఆ చుట్టూ పక్కల అక్కడక్కడా గుర్రపుశాలలు, పశువుల శాలలు తప్ప వేరేం లేవు. 'కంట్రీ సైడ్' అంటారు కదా.. అలాంటి గ్రామీణ వాతావరణంలో గాలి చేసే శబ్దం, ఆ సన్నటి రోడ్డు మీద తిరిగే కార్లు చేసే చప్పుడు మినహా మరింకే అలజడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గడ్డి అంతా ఎండిపోయి ఇలా ఉన్నాయి. మళ్ళీ వేసవి అయిపోయాక కొండలన్నీ ఆకుపచ్చగా మారిపోతాయి. ఇలా ఉండే ప్రదేశాలని Ranches అంటారు. ఈ మైదానాలని ఎక్కువగా గుర్రాలు, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. పాతకాలంలో ఇంకా ఎక్కువ ఉండేవి అవన్నీ. ఇప్పటికీ అక్కడక్కడా గుర్రాలూ అవీ కనిపిస్తుంటాయి చూడు" అని చెప్పారు కిరణ్ ప్రభ గారు.
Strawberry Fields
మేము వెళ్ళే దారిలో ఒక చోట ఒక పెద్ద స్ట్రాబెర్రీ తోట కనిపించింది. అక్కడ ఆగి స్టాల్ దగ్గరున్న అతనితో మాట్లాడితే 'బెర్రీ పికింగ్' లేదు కానీ కొనుక్కోవచ్చు అన్నాడు. స్ట్రాబెర్రీస్ తో పాటు ఆప్రికాట్స్, కొన్నికూరగాయలు ఉన్నాయి. బెర్రీస్, ఆప్రికాట్స్ కొనుక్కుని అక్కడినుంచి నేరుగా 'లివర్ మోర్' గుడికి వెళ్ళాము. గుడి బయటినుంచి చూడ్డానికి అచ్చం ఇండియాలో గుళ్ళలాగే ఉంది. ఈ గుడికి శంఖుస్థాపన చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పద్మశ్రీ NT రామారావు గారు అని రాసున్న శిలాఫలకం చూసి ఈ గుడి అప్పటినుంచీ ఉందా అని ఆశ్చర్యం అనిపించింది. "1984 అంటే ఇంకా నువ్వు పుట్టకముందే మొదలుపెట్టేసారు కట్టడం.." అని నవ్వి "​​ఈ ​బే ఏరియాలో ఇంకా చాలానే హిందూ గుళ్ళు ఉన్నాయి కానీ అన్నీటికన్నా ముందు కట్టిన గుడి మాత్రం ఇదేనమ్మా.." అని చెప్పారు కిరణ్ ప్రభ గారు. గుడి ప్రాంగణంలో లోపల ఒక్కో దేవుడికీ ఒక్కో చిన్న గుడి ఉంది. వినాయకుడు, మురుగన్, శివుడు, అమ్మవారు, రాముడు, కృష్ణుడు, హనుమాన్, వెంకటేశ్వరస్వామి, ఇలా అందరు దేవుళ్ళూ ఉన్నారు. కాంతి గారూ, నేనూ కలిసి అందరి దేవుళ్ళకీ దణ్ణాలు పెట్టేసుకున్నాక ఎన్నో డాలర్స్ నోటు ఇచ్చి హుండీలో వెయ్యమన్నారు. "పర్లేదులెండి మనం హుండీలో కానుక వెయ్యకపోతే దేవుడు ఏమీ అనుకోడులే.." అని నేనంటే "అలా అనకూడదు. వెయ్యి నువ్వు ముందు.." అని దగ్గరుండి హుండీలో కానుక వేయించి తీసుకొచ్చారు. తీర్థప్రసాదాలు తీసుకుని కాసేపు గుడి లోపల కూర్చున్నాం. చాలామంది భక్తులు ఉన్నారు. బుజ్జి బుజ్జి పిల్లల దగ్గరనుంచీ ముసలివాళ్ళ దాకా అన్నీ వయసుల వాళ్ళూ కనిపించారు. తర్వాత గుళ్ళో ఇంకొక పక్కన పులిహోర, దద్దోజనం, రవ్వకేసరి ప్రసాదాలు ఉంటాయని అక్కడికి వెళ్ళాం. అక్కడ పెద్ద పెద్ద గిన్నెల్లో ప్రసాదాలు పెట్టి పక్కన ప్లేట్లు. స్పూన్లు ఉన్నాయి. ఎవరికి వారు పెట్టేసుకుని తినెయ్యడమే. కమ్మటి ప్రసాదాలన్నీ కొంచెం కొంచెం పెట్టుకుని తినేసి బయటికి రాగానే అక్కడొక నిమ్మచెట్టు కనపడింది. ఆ చెట్టు చిటారు కొమ్మలకి పెద్ద పెద్ద నిమ్మకాయలు పసుపురంగులో మెరిసిపోతున్నాయి. నేను నిమ్మచెట్టు భలే పెంచారు కదా గుళ్ళో.. అని చూస్తుంటే కాంతి గారు "2012 లో రమణి గారిని తీసుకొచ్చినప్పుడు ఈ నిమ్మచెట్టు చిన్నగా ఉండేది. అయినా బోల్డు కాయలున్నాయి అప్పుడే. ఈ చెట్టు ముందు నిలబడి రమణి గారు ఫోటో తీయించుకున్నారు" అని గుర్తు చేసుకున్నారు. మేము కూడా ఆ నిమ్మచెట్టు దగ్గర ఫోటో దిగి వెళ్ళబోతుంటే అక్కడ పూజామందిరం దగ్గర నించున్న ఒక తమిళాయన మమ్మల్ని పిలిచి "మీకు ఈ గుడి చరిత్ర తెలుసా?" అని అడిగారు. తెలీదండి అంటే "మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎనభైల్లో అమెరికాలో ఉండే ఒక భక్తుడి కలలో గణేష్ కనిపించి ఇలా ఈ ప్రదేశంలో గుడి కట్టమని చెప్పారు. తర్వాత ఇక్కడ ఈ చిన్న పూజామందిరం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా కొన్నేళ్ళకి ఇంత పెద్ద గుడి కట్టారు. హిందూ దేవతల్లో అతి ముఖ్యమైనవారు అని ఎనిమిది మంది ఉంటారు. వారందరికీ ఒకే ప్రాంగణంలో గుడి కట్టడం అనేది చాలా అరుదుగా జరిగే విషయయం. అలాంటి అరుదైన గుళ్ళలో ఈ లివర్ మోర్ టెంపుల్ ఒకటి. మీరు చాలా ప్రత్యేకమైన గుడికి వచ్చారు. శుభం." అని దీవించి ప్రసాదం ఇచ్చి పంపించారు.
Livermore Hindu Temple
గుడిలోంచి బయటికి వచ్చి కార్లో ఎక్కగానే "నీకు చూపించాల్సిన వాటి లిస్టులో మొదటిది అయిపోయింది కదా.. టిక్ మార్క్ పెట్టేస్కో తల్లీ.." అని నవ్వించారు కిరణ్ ప్రభ గారు. "మనింటికి ఎవరు వచ్చినా ముందు ఈ గుడితోనే మొదలుపెడతాం అన్నీ చూపించడం" అని చెప్పారు కాంతి గారు. గుడి నుంచి కాంతి గారు వాళ్ళ బంధువులు ప్రసాద్, పద్మ గారింటికి వెళ్ళాం. వాళ్ళ పిల్లలిద్దరూ "అత్తా.. నువ్వేంటి అసలు ఇంత ఉత్సాహంగా గంతులు వేస్తున్నావు.." అని ఆటపట్టిస్తే మరి నా ఫ్రెండ్ వచ్చింది కదా అందుకని అంత సంబరం.." అని చెప్పారు కాంతి గారు. పద్మ గారు Quesadilla చేసి పెట్టారు. చాలా టేస్టీగా ఉన్నాయని బాగా తినేసి, వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పి అక్కడినుంచి ఇంటికి బయలుదేరాం. దారిలో కిరణ్ ప్రభ గారి ఆఫీసు దగ్గర ఆగి అలా అలా చుట్టూ తిరిగి ఆయన వర్క్ ప్లేస్ చూసి ఇంటికి వచ్చేసాం. అప్పుడింక ఎవరికీ మళ్ళీ ప్రత్యేకంగా డిన్నర్ తినే ఆసక్తి లేదు. ముందు రోజు నిద్ర సరిగ్గా లేక చాలా అలసిపోయినట్టుంది నాకు. కాంతి గారేమో ఇంటికి రాగానే దిష్టి తీసే ప్రోగ్రాం పూర్తి చేసి "మన నేస్తాలందరూ ఎదురు చూస్తారు కదా.. ఫేస్ బుక్లో ఫొటోస్ పెట్టి పడుకుందాం" అన్నారు. సరేనని ఆ పని చేసి 'గుడ్ నైట్' చెప్పేసుకున్నాం. అంత అలసిపోయున్నా సరే వెంటనే నిద్ర రాక అలా కిటికీలోంచి బయటికి చూస్తూ ఏవో ఆలోచనల్లో తప్పిపోతూ ఎప్పటికో నిద్రపోయాను.
14.06.2013
శుక్రవారం


అచ్చం ముందు రోజు ఉదయంలాగే అస్పష్టంగా మళ్ళీ ఏదో కల నిద్రలోంచి నాలుగున్నరకే లేపేసింది. కల గురించి ఆలోచిస్తూ ఎలాగో కాలక్షేపం చేస్తుంటే ఎప్పటికో మళ్ళీ కాస్త కన్నంటుకుంది. ఫోన్ మోగేసరికి మెలకువ వచ్చేసింది. ఈ సారి మా ఇంటబ్బాయ్. అక్కడ ఉన్నన్ని రోజులూ ప్రతి రోజూ మా ఇంటబ్బాయ్, పద్మవల్లి గారు.. వీళ్ళిద్దర్లో ఎవరో ఒకరు పొద్దున్నే కాల్ చేసి నిద్ర లేపేవారు. అలా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రమత్తు వదిలిపోయేది. తర్వాత మెల్లగా దిగి కిందకొచ్చేసరికి కిరణ్ ప్రభ గారు మార్నింగ్ వాక్ నుంచి వచ్చి "రేపు వస్తావా తల్లీ వాకింగ్ కి?" అని అడిగారు. రాత్రి పడుకునే ముందు కూడా "పొద్దున్నే వస్తావా వాక్ కి?" అని అడిగేవారు. ఎప్పుడు అడిగినా ఊ.. అనేదాన్ని కానీ ఒక్కరోజు కూడా ఆ టైముకి లేచి వచ్చేదాన్ని కాదు. అయినా సరే ప్రతీరోజూ ఉదయం, రాత్రి అడుగుతూనే ఉండేవారు. :-)
నా నిదురని దోచుకెళుతున్న కలని తీసుకెళ్ళి బ్లాగులో దాచేసి వచ్చాక బ్రేక్ ఫాస్ట్ ఇంకేం చేసుకుందామని కాంతి గారు అడిగితే నాకు ఇడ్లీ ఉంటే చాలని చెప్పాను. నేను ఇడ్లీల్లో నెయ్యి కాకుండా నెయ్యిలో ఇడ్లీలు తింటున్నానని పెద్ద సీసా నిండా నెయ్యి కరిగించి పోసి పెట్టారు. ఇంక ప్రతీ పూటా అన్నీట్లోనూ నెయ్యి గుమ్మరించుకోడమే పని.. ఇలాగైతే నేను జర్మనీకి వెళ్ళాక ఓ సంవత్సరం కష్టపడాల్సి వస్తుంది కాంతి గారూ ఇక్కడ పెరిగిన బరువు తగ్గడానికి అని రోజూ ఓ పక్క అంటూనే ఇంకో పక్క ఎంచక్కా నెయ్యి గిన్నె ఖాళీ చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ సరిగ్గా ఇడ్లీ తినేప్పుడే పద్మవల్లి గారు కాల్ చేసారు. "లంగా వోణీ బాగుంది పిల్లా.." అని చెప్దామని చేసానన్నారు. కానీ మా కబుర్లు అంత సింపుల్ గా అయిపోవు కదా.. జస్ట్ ఓ గంటసేపు మాత్రం మాట్లాడేసుకున్నాం. :-) తర్వాత నిషితో మాట్లాడాము. "నువ్వు తొందరగా అన్నీ సర్దేసుకో ప్రయాణానికి.." అని తనని కంగారు పెట్టేస్తే "అసలు మీ ఇద్దరి ఆత్రం మరీనూ.. ఇంకా చాలా టైం ఉంది కదా వీకెండ్లో సర్దుకుంటాలే.." అంది నిషి. మధ్యాహ్నం లంచ్ కి వచ్చినప్పుడు కిరణ్ ప్రభ గారు అప్పుడెప్పుడో నేను పుట్టకముందు పత్రికల్లో వచ్చిన ఆయన కవితల పేజీలు, ఇంకా పాత ఫోటో ఆల్బమ్ ఇచ్చి ఆఫీసుకి వెళ్ళారు. నేనూ, కాంతి గారు అవన్నీ చూస్తూ బోల్డు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ సాయంత్రం అయిపోతోంది, మేము బయటికెళ్ళాలి కదా.. అందుకని చకచకా తయారైపోయి కిరణ్ ప్రభ గారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం.
కార్లో కూర్చోగానే "మధురా.. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మాతా అమృతానందమయి ఆశ్రమానికి.." అని చెప్పారు. నేను "ఆశ్రమానికా.. ఏముంటుంది అక్కడ?" అని అడగ్గానే "ఆశ్రమంలో భక్తులు ఉంటారు. మనం కూడా నచ్చితే మఠంలో చేరిపోయి అక్కడే ఉండొచ్చు" అన్నారు. నేను "నిజంగానా?" అనగానే గట్టిగా నవ్వేసి "ఏంటో వీళ్ళు గుళ్ళూ, ఆశ్రమాలు తిప్పేస్తున్నారు నన్ను అని భయపడుతున్నావా? మనం వెళ్ళేది ఊరికే ఆ ప్లేస్ చూడటానికి. చుట్టూ కొండలు, లోయల మధ్యలో ఉంటుందా ఆశ్రమం. నీకు నచ్చుతుందని తీసుకువెళ్తున్నా" అన్నారు. అమ్మ ఆశ్రమం Castro valley అనే ప్లేస్లో ఉంది. అక్కడికి వెళ్ళే దారి సీనిక్ గా చాలా బాగుంది. ఆశ్రమం పరిసరాల్లోకి వెళ్ళగానే స్వాగతం బోర్డులు కనిపించాయి. చాలా నిశబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది. గడ్డిలో తిరుగుతూ చిన్న చిన్న జింకలు, పక్షులు, బాతులు కనిపించాయి. పక్కనే దగ్గరలో ఒక నీళ్ళ కొలను, అందులో హంసలు, తామరపూలు కనిపించాయి. చుట్టూ నిన్నటి Ranches లాంటివే పెద్ద పెద్ద కొండలు, లోయలు ఉన్నాయి. ఒక కొండ పైకి చివరిదాకా వెళ్తే అక్కడ ఆశ్రమం ఉంది. ఏదో ద్యానమందిరం లాంటిది ఉంటే అక్కడికి వెళ్తే ఇద్దరు అమెరికన్స్ కనిపించారు. పది రోజుల క్రితమే అమ్మ వచ్చారని చెప్పి మాకు తెలీక అప్పుడు రాలేకపోయినందుకు చాలా చింతించారు. ఇప్పుడు అమ్మ వేరే ఏదో ఊర్లో ఉన్నారని అందరూ అక్కడికి వెళ్ళారని, అందుకే ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పారు. "రండి లోపల చూపిస్తాం" అని తీసుకెళ్ళారు. లోపల గోడలకి అమ్మ ఫోటోలు పెద్ద పెద్దవి ఉన్నాయి. అక్కడ రకరకాల విధులు నిర్వహించే వారందరూ అమ్మ భక్తులేనట. అదంతా నిర్వహించడానికి అయ్యే ఖర్చు, టైము అన్నీ అందరూ స్వచ్ఛందంగా సమర్పించేవేనట. మన సొంత నమ్మకాలు, అభిప్రాయాల సంగతి పక్కన పెడితే ఎక్కడో అమెరికాలో అంత పెద్ద ఆశ్రమాన్ని అంత శ్రద్ధగా, నిస్వార్ధంగా నడుపుతున్న భక్తులు అంతమంది ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది. ఆ ఎత్తైన కొండ మీద నించుని చుట్టూ చూస్తే భక్తి సంగతెలా ఉన్నా అంతందమైన పరిసరాల్లో ఉంటే ముక్తి మాత్రం తప్పక లభిస్తుందనిపించింది. ఆ కొండల మీద రకరకాల పండ్ల చెట్లు కూడా పెంచుతున్నారు బహుశా ఆశ్రమంలో ప్రసాదాల కోసం అనుకుంటాను. అక్కడున్నంతసేపు ప్రకృతి ఒడిలో ప్రశాంతసీమల్లో హాయిగా సేద తీరినట్టు అనిపించింది.
మాతా అమృతానందమయి ఆశ్రమం, Castro Valley
అసలు నన్ను కాలిఫోర్నియాతో ప్రేమలో పడేసినవాటిల్లో ఈ గాలి ఒకటి. ఆహా.. ఎంత హాయిగా వీస్తుందో అక్కడ గాలి! మరీ అతి చల్లదనం, అతి వేగం కాకుండా  అలా అలా సుతారంగా పక్కనుండి వీవెనతో విసిరినట్టు అలవోకగా వీస్తుంటుంది గాలి మాయాబజార్ సినిమాలో 'లాహిరి లాహిరి లాహిరిలో' పాటలో లాగా.. బయటికొస్తే చాలు.. ఆ చల్లగాలికి అలా మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికో తెలీకపోయినా వెళ్ళిపోతూ ఉంటే బావుండు అనిపిస్తుంది. ఆ గాలి మాయలో పడి నేనలా వెనక్కి తిరిగి చూడకుండా ఎటో వెళ్ళిపోతానేమోనని కాంతి గారు నేను తప్పిపోకుండా ఎప్పుడూ నా చెయ్యి గట్టిగా పట్టుకుని తిరిగేవారు. ;-)
అలా ఆ రోజు మాతా అమృతానందమయి ఆశ్రమం చూసుకుని దారిలో ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళి అవసరమైన కూరగాయలు, వస్తువులతో పాటు ఇంకా స్వీట్స్ అనీ, స్నాక్స్ అనీ ఏవేవో కళ్ళకి నచ్చిన పదార్థాలన్నీ రెండు పెద్ద సంచుల నిండా కొనేస్కుని ఇంటికొచ్చిపడేసరికి రాత్రయిపోయింది. గబగబా అన్నం తినేసి, మా దినచర్యలో భాగంగా ఈ రోజు మా విహారం గురించి నేస్తాలకి తెలియచేయడానికి ఫేస్ బుక్లో ఫొటోస్ పెట్టేసి క్షణం ఆలస్యం చెయ్యకుండా బజ్జుందాం అనుకున్నాం. మరి ఎందుకంటే తెల్లారితే శనివారం కదా.. We have a long day tomorrow.. It's time to sleep now! :-)

9 comments:

Lasya Ramakrishna said...

మీరు కామెంట్స్ కి రిప్లై ఇవ్వకపోవడం ఏమీ బాలేదు మధురవాణి గారు :(

MURALI said...

కిరణ్,కాంతిగార్ల ఆప్యాయత గురించి చదువుతుంటే చాలా ముచ్చటగా ఉంది.

మధురా, నిజంగా ఆరేంజ్‌లో తిన్నావా? పప్పుసార్ ఇంటిలో పెద్దగా తిన్నట్టు లేదే?

పప్పూసార్, ఈ విషయాన్ని మీరు ఖండించటం లేదా?

మధురవాణి said...

@ Lasya Ramakrishna ​గారూ,
​నేను కామెంట్స్ కి రిప్లై ఇవ్వకుండా మిస్ చెయ్యడం అంటూ ​​జరగదు కానీ మరీ కంగారులో ఉండి టైం లేనప్పుడు ఉన్న కొద్ది టైమూ పోస్ట్ రాయడానికి పెట్టేస్తే అందరూ చదువుతారు కదా అనిపిస్తుంది. కాస్త ఆలస్యమైనా ఓపిగ్గా చదివి వ్యాఖ్యానించే మిత్రుల కామెంట్స్ కి స్పందించకుండా అస్సలు ఉండను. కాస్త ముందూ వెనకా అంతేనండీ..

బాల said...

"నేను ఇడ్లీల్లో నెయ్యి కాకుండా నెయ్యిలో ఇడ్లీలు తింటున్నానని........."
ఎంతైనా తెలుగు వారు భోజనప్రియులు కదా!

Unknown said...

మీ పోస్ట్ చూసి ఏమేం విశేషాలు రాసారోఅని చాలా ఆత్రం గా చదువుదామంటే నెట్ చాలా విసిగించింది .హమ్మయ్య ! ఎలాగో నెట్ పని చేస్తుంది .చాలా బాగున్నాయి ఫోటోలు ,విశేషాలు .నిషి గారి కోసం మీతో పాటూ నేనూ వైట్ చేస్తున్నా :))..రాధిక (నాని)

నిషిగంధ said...

నిజంగా ఆ కొండల్ని చూస్తుంటే అక్కడనించి రాబుద్దికాదేం!
బంగారంలో కాస్త వెండి కలిపినట్టు ఎండకి మెరుస్తూ, మధ్యమధ్యలో ఎవరో చిన్నపిల్లలు పెద్ద కాన్ ఆకుపచ్చ పెయింట్ వొలకబోసినట్టుండే చెట్లు.. బ్యూటిఫుల్ అసలు!

మురళీ, నెయ్యి-ఇడ్లీ ఒకటే ఆ రేంజ్‌లో తిన్నదండీ.. మిగతావన్నీ చిలక కొరుకుళ్ళే! :))

ఇందు said...

Bagundamma Madhu... idly antha ishtama? Idly ane padardhanni ela tintarabbaaa??? ; )

మధురవాణి said...

​@ MURALI,
థాంక్స్ మురళీ.. ​
​నెయ్యి ఒక్కటే నేను ఆ రేంజ్లో తినేది. ఇంక మిగతావన్నీ మామూలు రేంజే.. ​:-)
అయినా ఆ రోజు బుల్లెబ్బాయ్ గారింట్లో మీ అందరి కబుర్లతోనే కడుపు నిండిపోయింది. ఇంక తిండికి చోటెక్కడ? :-)​​

@ బాల,
అంతేనంటారా? థాంక్స్ ఫర్ ది కామెంట్.. :-)

@ ​రాధిక (నాని),
మా కబుర్ల కోసం అంతగా ఎదురు చూస్తూ, ఓపిగ్గా చదివి ప్రతీ పోస్టుకీ స్పందిస్తున్నందుకు మీకు బోల్డు ధన్యవాదాలండీ.. ​
నేను కూడా పోస్టు వేసిన దగ్గర్నుంచీ రాధిక గారు ఇంకా చూసినట్టు లేరే అనుకుంటూ మీ కామెంటు కోసం ఎదురుచూస్తున్నానండీ.. :-)

మధురవాణి said...

​@ నిషిగంధ,
ఆహా.. భలే చెప్పావ్ గా కొండల గురించి.. ఎంతైనా కవయిత్రుల మాటల్లో ఉండే అందమే వేరు సుమీ.. ;-)

@ ఇందు,
​చిన్నప్పుడు ఇడ్లీ అంటే నేను కూడా అనుకునేదాన్ని. పెద్దయ్యేసరికి ఎందుకో మరి ఇడ్లీ నచ్చేసింది. కానీ, కారప్పొడి నెయ్యి ఉంటేనే నేను ఇడ్లీ తింటాను. లేకపోతే మళ్ళీ ఇష్టం ఉండదు. :D​