Sunday, June 17, 2012

ఓ అపురూప ప్రేమకథ!


చుట్టూరా కనిపిస్తోందే విశాలమైన ఆకాశమంతా ఒకప్పుడు చీకటిగా నల్లటి నిశ్శబ్దంలో ఉండేది. అప్పుడు అరుదైన అపురూప ఘడియన తన చిరునవ్వు కిరణాలు ఆకాశమంతా ప్రసరించి ముందు తెల్లటి వెలుగుతో మొదలై చివరికి అందమైన నీలివర్ణంగా నిండిపోయింది. అద్భుతాన్ని నేను అబ్బురంగా చూస్తుండగానే మరిన్ని వింతలు జరిగాయి.
అదొక అమోఘమైన సృష్టి కావ్యం.. ఊహకందని ఇంద్రజాలం!
తన పసిమి చూపులు సోకిన ప్రతి చోటా జీవం విరిసింది. తన మోమున ఉదయించిన చిరు దరహాస రేఖలు కాంతి పుంజాలుగా మారి అచేతనంగా ఉన్న విశ్వంలో ఉత్తేజాన్ని నింపాయి. ఎన్నో రంగురంగుల లోకాలకి ప్రాణం పోశాయి.
తను ధారపోసిన శక్తి నాలోనూ ప్రాణప్రతిష్ఠ చేసింది. తన నులివెచ్చని స్పర్శతో నాలో కొత్త ఊపిరి పోసుకుంది. చల్లని చూపులు విరజిమ్మే వెలుగులు నాలో ఆకుపచ్చని జీవాన్ని నింపాయి. జన్మాంతం ఎండి బండ బారిన గుండెలో చిరుజల్లుల్ని కురిపించి యుగాల దాహార్తిని తీర్చాయి. తనలోని దివ్య తేజస్సు కనగానే యుగాలుగా నాలో ఆవరించిన స్తబ్దత ఆవిరైపోయి కొత్త చలనం వచ్చి సమ్మోహన శక్తికి దాసోహమంటూ అప్రయత్నంగానే తన చుట్టూ పరిభ్రమించసాగాను. సరిగ్గా అప్పుడే కాలం కదలడం మొదలైంది.

తన చేత అదృశ్యంగా ఉండే మంత్రదండంతో మంత్రించినట్టు అలవోకగా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు సంభవించాయి. అంతవరకూ కనీ వినీ ఎరుగని అందాలూ, ఆనందాలెన్నో విందులు చేసాయి.
ఆనాటి నుంచీ అనుదినమూ ఉషోదయాల బంగారు క్షణాల్ని, సాయంసంధ్య చిత్రించే రంగవల్లుల్ని, నిశి రాత్రిలో తళుక్కున మెరిసి మురిసే తారల్ని, జాబిలి చేత రాయబారమంపి పండించే వెన్నెలనీ అనుభూతిస్తున్నాను. అంతేనా! ఇంకా.. తెల్లటి మంచంటి స్వచ్ఛతని, వాన చినుకంటి మృదుత్వాన్ని, ఆకాశమంటి విశాలత్వాన్ని, సంద్రమంటి కనిపించని లోతుల్ని, అగ్గిరవ్వంటి ఆగ్రహావేశాల్ని, సుడిగాలంటి ప్రతాపాన్నీ, కారడవుల్లాంటి కాఠిన్యాన్ని, జలపాతమంటి చురుకుదనాన్ని, చీకటి వెలుగులని, సుఖదుఃఖాల్ని, ఆరు రంగుల ఇంద్రధనస్సునీ, ఆరు ఋతువుల నిండిన మాధుర్యాన్ని, కమ్మని తేనెలూరే పూబాలలని, పూరెమ్మల చెక్కిలి పైన ఆర్తిగా నిలిచే మంచు బిందువుల ముద్దుల్నీ, మధుర మకరందాన్ని కొల్లగొట్టిపోయే చిలిపి తుమ్మెదల్ని, రంగురంగు రెక్కల సీతాకోకచిలుకల్ని, మబ్బుల దాకా ఎగిరే పక్షులనీ, రాజసం ఒలకబోసే సింహపు కొదమనీ, విశ్వాసంగా చెలిమి చేసే జంతుజాలాన్నీ, మానవత్వం పరిమళించిన మనిషినీ, అనుపమాన సౌందర్యం మూర్తీభవించిన అతివనీ, పాలు గారే పసిపాపల నవ్వుల్నీ......... ఇలా ఎన్నని చెప్పనూ.. తను అనుగ్రహించిన వరప్రసాదంగా లెక్కకందనన్ని అద్భుతాలకి ఆలవాలమై మహదానందంగా విలసిల్లుతున్నాను నేను.

నిరుపమానమైన స్వయంప్రకాశకత్వం తనకే సొంతం.. అనన్య సామాన్యమైన తన శక్తిసామర్థ్యాలు ఎన్నో జవజీవాలకి ఆధారం.. తన నీడన ప్రాణం పోసుకున్న ఎందరికో తనొక గోరువెచ్చని జ్ఞాపకం.. తన దివ్యస్పర్శ నిత్యనూతనం, అమరం, అజరామరం!
అనుక్షణం తన చుట్టూ పరిభ్రమించడటమే నాలో ప్రాణస్పందనకి నిదర్శనం. ఎన్నటికీ తనివి తీరనంత అనురాగమున్నా నిర్దిష్టమైన దూరాన కట్టి ఉంచడం తనకే సాధ్యమైన స్వయంనియంత్రణ. తన పసిడి కిరణాల వెలుగులు ఇంకా ఎన్నెన్ని ప్రపంచాల్లో జీవం నింపాల్సి ఉన్నాయో కదా.. అందుకని అంతటి శక్తిని ఒడిసిపట్టి బంధించి ఉంచాలనుకోడం అసాధ్యమే కాదు, న్యాయం కూడా కాదుగా మరి.. అందుకే మా మధ్యన తప్పని దూరమన్నమాట!

కాలం పరుగు నేర్చింది తన చేతుల్లోనే.. కాలం కొలత మొదలైంది తన వెంట తిరిగే నా పరుగుతోనే.. తన చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేసిన గడువే కాలచక్రంలో ఏడాదిగా ముద్రపడి తిరిగి నన్ను మొదటి అడుగు వేసిన చోటుకి చేరుస్తుంది. మా ప్రేమ జనించిన తొలి క్షణాన్ని గుర్తు చేస్తుంది. మధుర జ్ఞాపకాన్ని తలచి మురిసి సంతోషంగా సంతృప్తిగా నా పెదవంచున ఒలికే చిన్ని చిరునవ్వు సాక్షిగా మరో ప్రదక్షిణానికి నాంది.. ఇది తుది దాకా అనునిత్యం సాగే మా ప్రేమ ప్రయాణం.. నాకు ప్రాణప్రదమైన మా ప్రణయయాత్ర!


నేను భూమిననీ.. నా ప్రేమయాత్ర సూర్యుడి చుట్టూ.. అని మరి చెప్పక్కర్లేదుగా!



39 comments:

Unknown said...

WOW!
ఈ విశ్వమంతా ప్రేమమయం అని ఎంత చక్కగా చెప్పారు.
Really wonderful !
మధురవాణి గారు అంటే "The Art of Writing" అని అర్ధం!
సార్ధక నామధేయులు, CONGRATULATIONS !

Anonymous said...

wonderful

the tree said...

bhagundandi, chakkni kavitha laga.

మంచు said...

WOWWWWW...
Pretty Awesome and one of your best !!


చిన్ని ఆశ గారి పై కామెంట్ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. Congrats :-)

జలతారు వెన్నెల said...

Never read a post like this!
Superb!

కృష్ణప్రియ said...

Beautiful!

రాహుల్ said...

Thank you for giving me pleasure with your writings...
awesome..awesome..awesome..

Padmarpita said...

Never ending love story and the best story:-)

వనజ తాతినేని/VanajaTatineni said...

Excellent !!

ఏకాంతపు దిలీప్ said...

అందమైన ఉపమానం.. ప్రతి ఒక్కరి జీవితం లో ఎందఱో సూర్యులు ఉంటారు, వాళ్ళ సమక్షంలోనే కాలం అనేది ఒకటి ఉంటుంది అనే స్పృహ కలుగుతుంది, ప్రకృతి అందం అతిశయంగా అనిపిస్తూంది...

నిరంతరమూ వసంతములే.... said...

భూమి భావనలని భలే బయటకు రప్పించారు... Beautiful Love Story!

Best Wishes,
Suresh Peddaraju

ప్రేరణ... said...

అందమైన ఉపమానం,అధ్బుతమైన ప్రేమకావ్యం.

బులుసు సుబ్రహ్మణ్యం said...

అద్భుతం ఇంకో మాట లేదు. నేను చదివిన వెంటనే మళ్ళి ఇంకో మాటు చదివిన చాలా కొద్ది టపాలలో ఇది ఒకటి.

నిషిగంధ said...

ఎంత చక్కని విలక్షణమైన ప్రేమ కధ!!!

"అనుక్షణం తన చుట్టూ పరిభ్రమించడటమే నాలో ప్రాణస్పందనకి నిదర్శనం. ఎన్నటికీ తనివి తీరనంత అనురాగమున్నా నిర్దిష్టమైన దూరాన కట్టి ఉంచడం తనకే సాధ్యమైన స్వయంనియంత్రణ."

ఇంతకంటే స్పష్టంగా, అందంగా ఈ ప్రేమలోని గొప్పతనాన్ని చెప్పడం సాధ్యం కాదేమో!

Just loved every line of it!.. కానీ ఇవి ఇంకా బాగా నచ్చాయి :-)
VERY PROUD OF YOU!

వేణూశ్రీకాంత్ said...

చదవగానే అప్రయత్నంగా చప్పట్లు కొట్టేశాను మధురా.. చాలాబాగుంది.

శ్రీలలిత said...

అజరామరమైన ప్రేమకథ అంటే ఇదే నన్నంత గొప్పగా రాసారు.
హృదయపూర్వక అభినందనలు..

హరే కృష్ణ said...

అబ్బ,సూపర్ అంతే!
youtube లో ఇళయరాజా పాట విన్నట్టు ఈ పోస్ట్ ని రిపీట్ చేస్తూనే ఉన్నాను
అద్భుతం మధురా!

కొత్తావకాయ said...

"తన చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేసిన గడువే కాలచక్రంలో ఏడాదిగా ముద్రపడి తిరిగి నన్ను మొదటి అడుగు వేసిన చోటుకి చేరుస్తుంది. మా ప్రేమ జనించిన తొలి క్షణాన్ని గుర్తు చేస్తుంది."

చాలా చాలా బావుంది. కంగ్రాట్స్! :)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

చాలా బాగా వ్రాశారు

Kranthi M said...

మధుర గారూ,

మంచి రచయిత రెండు రకాలుగా రాస్తారంట.ఎవ్వరూ ఉహించని విధంగా ఊహించి రాయటం ఒక రకం, అందరూ ఊహించిందే(అందరికీ తెలిసిందే) ఊహించనంత గొప్పగా రాయటం రెండో రకం. మొదటి రకంలో ఒక విధమైన కష్టం ఉంటుంది, కవి రాసిన భావాన్ని అర్థం చేసుకునే జ్ఞానం పాఠకుడికి కావాలి.రెండో రకంలో అంత విజ్ఞానం పాఠకుడికి అవసరంలేదు, మీ రాతల్లో నేనెప్పుడూ ఆ రెండో తత్వాన్ని బాగా గమనించాను.మీరు అందరికీ తెలిసిందే చెప్తారు, కానీ ఇంతకంటే ఇంకెవరూ చెప్పలేరేమో అంతకన్న అందంగా అన్నంతగా చెప్తారు.

ఇలాంటిదే ఇంకోటి ఈ మధ్య కాలంలో చదివాను ఇది కూడా చూడండి ఒక సారి బాగుంది.

http://anandamayetimanasukatha.blogspot.in/2012/05/blog-post.html

మీ
క్రాంతి.

చాణక్య said...

నా మానసులో మాటల్ని క్రాంతికుమార్‌గారు చెప్పేశారు. ఆశ్చర్యం! మనసులోని భావాలకు స్పష్టత చేకూర్చుకోవడం, వాటిని అందంగా పదాల్లో ఇమడ్చడం మీకు దక్కిన వరం! ఇలాగే కొనసాగించండి. :)

నేస్తం said...

అనుక్షణం తన చుట్టూ పరిభ్రమించడటమే నాలో ప్రాణస్పందనకి నిదర్శనం. ఎన్నటికీ తనివి తీరనంత అనురాగమున్నా నిర్దిష్టమైన దూరాన కట్టి ఉంచడం తనకే సాధ్యమైన స్వయంనియంత్రణ.

నాక్కూడా ఈ లైన్స్ బాగా నచ్చాయి మధు...
చాలా బాగారాసావు,,అలాగే క్రాంతిగారి కామెంట్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నా..
ఇదంతా సరేగాని ఎంత ప్రేమ మూర్తివి మధు.. సూర్యుడికి భూమికి మధ్య ప్రేమ పుట్టించేసావ్ .. మరి మన హీరో హీరోయిన్స్ మధ్యలో MERCURY ,VENUS అడ్డుగా ఉన్నారు ఏం చేద్దాం వాళ్ళను :D

శ్రీ said...

మీ బాణీ మధురం...
నిరంతరం పరిభ్రమించినా ...
దూరం తగ్గదని తెలిసి,
దినకరునిపై మనసు పడే
'వసుంధర మనసు'.... 'మధురవాణి 'కే తెలుసు...
చాలా బాగుంది మధురవాణి గారూ! అభినందనలు...
@శ్రీ

పరిమళం said...

అపురూప ప్రేమకావ్యమే.....

oddula ravisekhar said...

భూమికి సూర్యునికి గల ఆకర్షణ శక్తిని ప్రేమగాభావించి ,భూమి పై కలిగే ప్రతి మార్పుకు సూర్యుడే కారణం కనుక ఆ మార్పుల్ని వర్ణించిన తీరు అద్భుతం.a

the tree said...

happy birthday andi, mee prema katha chakkaga undi.
keep writing.

Unknown said...

జీవని ద్వారా మీ పుట్టినరోజు అని తెలిసింది.
మీకు మా "చిన్ని ఆశ" పుట్టినరోజు శుభాకాంక్షలు!
చిరకాలం ఆనందంగా ఉంటూ మధురమైన మీ వాణి వినిపిస్తూనే ఉండాలని మా "చిన్ని ఆశ".
- చిట్టి, పండు

చెప్పాలంటే...... said...

ఇందు గారు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Anonymous said...

Janmadina Shubhakankshalu!!!

--Oka Nestam...

మధురవాణి said...

@ చిన్ని ఆశ, చెప్పాలంటే, ఒక నేస్తం గారూ,
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించగలరు.

Anonymous said...

మధురవాణి,
బ్లాగులో నాకు చాలా నచ్చే రచయితలు కొత్త ఆవకాయ,కృష్ణప్రియ, మానస చామర్తి, హరే కృష్ణ, మంచు,ఏకాంతపు దిలిప్ మొద|| వారందరు మీమ్మల్ని ఇప్పటి కే పొగిడేశారు. ఒక్క మానస తప్ప. వీళ్ల బ్లాగుల్లో ఎప్పుడు వ్యాఖ్యాలు రాసినట్లు గుర్తులేదు. వాళ్ల బ్లాగు చదవటం ప్రతిభ అబ్బుర పరుస్తుంది. ఈ టపా మటుకు ఇంతకు మునుపు మీరు రాసిన వాటితో పోలిస్తే ఎంతో విభిన్నమైనదనిపించింది. అద్భుతంగా రాశారు. మీరిoక మునుపటి మధురవాణి కారు. రానున్న రోజులలోఎన్నో అద్భుత టపాలకి ఇది మొదలు మాత్రమే.


పద్మంలోని శత పత్రాలు వికసించకుండా
ఎన్నటికి అట్లాగే ముకుళించి వుండవనీ,
నళిన గర్బాంతరాళంలో దాగిన
మధువు బయలుపడి తీరుతుందనీ
నాకు నిశ్చయంగా తెలుసు
--- టాగుర్, గీతాంజలి

SriRam

మధురవాణి said...

@ చిన్ని ఆశ,
చాలా పెద్ద ప్రశంసే ఇచ్చేసారుగా! మీ అభిమానానికీ, ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞురాలిని. :)

@ కష్టేఫలే, the tree, కృష్ణప్రియ, వనజ వనమాలి, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
అభినందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)

@ మంచు గారూ,
నేనిప్పుడు సూర్యుడికీ, భూమికీ థాంక్స్ చెప్పాలండీ చాన్నాళ్ళకి మిమ్మల్ని నా బ్లాగులోకి పిలుచుకొచ్చినందుకు.. :D
THANKS! :)

@ జలతారు వెన్నెల,
గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారుగా.. థాంక్సండీ! :)

@ రాహుల్,
థాంక్స్.. థాంక్స్.. థాంక్స్.. :)

@ పద్మార్పిత,
కదా.. అందుకే ఇలా రాయాలనిపించిందండీ.. ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ ఏకాంతపు దిలీప్,
నీ వ్యాఖ్య చూసి కొత్త ఆలోచనల్లో పడ్డాను. నిజమే కదా.. భలే బాగా చెప్పావు.. వాళ్ళ సమక్షంలోనే కాలం అనేది ఒకటి ఉందనే స్పృహ కలుగుతుంది.
థాంక్స్ ఫర్ ది కామెంట్! :)

@ నిరంతరమూ వసంతములే, ప్రేరణ, శ్రీలలిత, పరిమళం,
నాక్కూడా సూర్యుడు, భూమి గురించి ఒక అద్భుతమైన ప్రేమ కథ స్ఫురించిందండీ.. అందుకే ఇలా రాయాలనిపించింది. మీ అందరికీ కూడా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)

@ బులుసు గారూ,
మీ ప్రశంసకి మురిసిపోతున్నాను. ధన్యవాదాలు.. :D

@ నిషిగంధ,
థాంక్యూ సో ఓ ఓ మచ్ నిషీ.. నీ నుంచి ఇంత పెద్ద మెచ్చుకోలు అంటే నేను నేలకి ఒక రెండు అంగుళాల ఎత్తులో నడుస్తాను కొన్నాళ్ళ దాకా.. :D
థాంక్యూ డియర్! :)

@ వేణూ శ్రీకాంత్,
అబ్బా.. ఎంత గట్టిగా వినపడ్డాయో వేణూ మీ చప్పట్లు.. థాంక్యూ సో మచ్! :)

మధురవాణి said...

@ హరేకృష్ణ,
హహ్హహ్హా.. భలే భలే పోలికలు స్ఫురిస్తాయి నీకు. థాంక్యూ సో మచ్! :))

@ కొత్తావకాయ,
ధన్యవాదాలండీ.. :)

@ క్రాంతి కుమార్ మలినేని,
ఏదో తోచింది రాసెయ్యడం తప్ప రచనా విధానం పట్ల గానీ, సాహిత్యం పట్ల గానీ పెద్ద జ్ఞానం లేనిదాన్ని నేను. మీరు చెప్పిన విషయం మాత్రం భలే బాగుందనిపించింది. ఆలోచించి చూస్తే అంతే కదా మరి.. అనిపించింది. :)
నా రాతలు మీకంత విలువైనవిగా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. బోల్డన్ని ధన్యవాదాలు. :)
మీరిచ్చిన లింక్ చూసాను. భలే co-incidence కదా! :)

@ చాణక్య,
థాంక్యూ సో మచ్! మీ అందరి ప్రశంసలకీ, ప్రోత్సాహానికీ బోల్డు ఆనందంగా ఉంది. రాసేవి ఎలా ఉంటాయన్నది చెప్పలేను గానీ ఏదో ఒకటి రాసుకోవడం మాత్రం మానుకోలేని వ్యసనం అయిపోయింది నాకు. :)

మధురవాణి said...

@ నేస్తం,
నేను ప్రేమమూర్తినా.. హిహ్హిహ్హీ.. :D
మెర్క్యూరీ, వీనస్.. ఇలా బోల్డు మంది ఉంటారమ్మా.. అన్నీ ప్రేమకథలు వేరేవేరేగా రాయాలి. అన్నీ కలిపేస్తే కష్టం కదా మరి! ;)
అయినా భూమి గురించంటే ఏదో తెలుసు కాబట్టి రాసాను. ఈ రకంగా అన్నీ గ్రహాల ప్రేమకథలు రాయాలంటే నా వల్ల అయ్యే పనేనా చెప్పు.. :D
బోల్డు పొగిడేసావ్ నన్ను.. థాంక్యూ సో మచ్! :))

@ శ్రీ,
భలే అందంగా చెప్పారే.. ధన్యవాదాలండీ.. :)

@ oddula ravisekhar,
సరిగ్గా అది చెప్పాలనే ప్రయత్నించానండీ.. నా ప్రయత్నం సఫలైమైనట్టే కనిపిస్తోంది మీ అందరి స్పందన చూసాక.. ధన్యవాదాలు. :)

@ the tree,
నా ప్రేమకథ బాగుందంటారా.. :))
థాంక్స్ ఫర్ ది విషెస్. :)

@ SriRam,
మీరు ప్రస్తావించిన బ్లాగర్లందరి రచనలూ నాక్కూడా చాలా ఇష్టమండీ.. :)
మీరు రాసిన వ్యాఖ్యలన్నీ చదివాను. నేను రాసింది మీకంతగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంకా బాగా రాయగలనన్న మీ నమ్మకానికీ, ప్రోత్సాహానికీ, ఆశీస్సులకీ బోల్డు ధన్యవాదాలు. :)
మీరు కోట్ చేసిన రవీంద్రుని గీతాంజలి లోని వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి. నేనెప్పుడూ గీతాంజలి చదవలేదు. కానీ, ఇప్పుడీ వాక్యాలు చూస్తుంటే ఎప్పటికైనా చదవాలనిపిస్తోంది. Thank you so much for that! :)

హరీష్ బలగ said...

మధు గారూ! ఇన్నాళ్ళూ మిమ్మల్ని ఎలా పొగడాలా అని వాక్యాల కోసం తెగ వెతికేసాను. ఇంకా ఎంత కాలం వెతికినా క్రాంతి గారు చెప్పినంత కరెక్ట్ గా నేను మీ గురించి ఎప్పటికీ చెప్పలేనేమో.
మీ రాత, క్రాంతి గారి పొగడ్త రెండూ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి..
how do you define love? అని నాకు నేను ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్న కి సమాధానం గా సరైన ఉదాహరణ నాకు ఈ టపా లో దొరికింది మధు గారూ..
ఇది ఒక ఏకైక అంతు లేని ప్రేమ కథ ...... బ్రహ్మాండం గా రాసారు..

...హరీష్

మధురవాణి said...

@ హరీష్,
చాన్నాళ్ళకి మళ్ళీ కనిపించారే.. అంతా కుశలమేనా? మీ రీసెర్చ్ ఎలా సాగుతోంది? :)
హహ్హహ్హా.. మీరింకా ఈసారి కొత్త కొత్త పొగడ్తలు పట్టుకొస్తారని నేను ఎదురు చూస్తుంటే, అచ్చం క్రాంతి గారు చెప్పిందే మీరూ చెప్తానంటారేంటండీ.. ఊరికే సరదాకి అంటున్నాన్లెండి.. క్రాంతి గారికీ, మీకూ కూడా బోల్డు ధన్యవాదాలు.. :)
how do you define love? అంటే అసలది ఆన్సర్ చెయ్యగలిగే ప్రశ్నేనంటారా? ఏదో అప్పుడప్పుడూ ఇలా జవాబులు వెతుక్కునే ప్రయత్నం చేస్తుండాలంతే.. నేను రాసినదాంట్లో మీకు సమాధానం దొరికినందుకు సంతోషంగా ఉంది.
Thanks for your response! :)

harizz said...

మధు గారూ... Ph.D చేసిన అనుభవం ఉండి కూడా మీరిలా అడగడం భావ్యం గా ఉందా? "how do you define love?" అంటే అది ఆన్సర్ చెయ్యలేని ప్రశ్నే. ఒప్పుకుంటాను. కాని "మీ రీసెర్చ్ ఎలా సాగుతోంది?" ఇది అసలు అడగ కూడని ప్రశ్న. అంతా పూర్తి అయ్యాక మాత్రం నేనే చెప్తా..
ఇక పొగడ్తలంటారా .. మిమ్మల్ని పొగిడి పొగిడి అలిసిపోయానని ఇంతకుముందే చెప్పా.. కాకపోతే అప్పుడప్పుడు మీ టపాలు తెగ నచ్చేసి అభిమానం పొంగిపోయి ఆపుకోలేక పొగిడేస్తే ఫీల్ అవకండి..

..హరీష్

మధురవాణి said...

@ harizz,
హహ్హహ్హా.. అలాగలాగే.. ఇంకోసారి అలాంటి సిల్లీ క్వశ్చన్ అడగనులెండి. Enjoy your research! :)
పొగడ్తలు వద్దూ ఏం వద్దులెండి. నేనేదో సరదాకి అన్నాను. నేను రాసేవి చదవడం మీరందరికీ నచ్చితే నేను హ్యాపీ.. అంతే తప్ప పొగడ్తల అవసరం అస్సలంటే అస్సలు లేదు. థాంక్యూ సో మచ్.. :)