Thursday, June 14, 2012

వానా వానా వల్లప్పా..వాన.. ఒకటే వాన.. దాదాపు పదినాళ్ళ నుంచీ అస్సలు ఆగనంటూ మేఘాల్లో దాగనంటూ అదే పనిగా కురుస్తున్న జడివాన!
ఆకాశం కేసి చూస్తే నల్లటి మేఘాలే కనపడవు. అలాగని తెల్లటి మబ్బులు కూడా ఉండవు. ఆకాశమంతా ఖాళీ ఖాళీగా పల్చటి తెరలా కనిపిస్తుంది. అదిగో అలా అమాయకంగా అస్సలేం కదలిక లేనట్టు మూర్తీభవించిన మౌనంలా ఉంటుందా.. కానీ మనం కాస్త తల దించి ఏ చెట్ల వైపో, నేల వైపో చూస్తే అప్పుడు కనిపిస్తుంది. అల్లిబిల్లిగా అల్లుకుపోతూ సన్నటి వెండి దారాల్లాంటి వాన తుంపర. అలా నేల రాలుతున్న ఆ చినుకుల నాట్యం చూస్తూ చూస్తూ ఎంతసేపటికైనా సరే అలుపొచ్చో ఆకలేసో మనం పక్కకి తప్పుకోవాల్సిందే తప్ప అది ఆగే వాన కాదు.

నేనిలా అంటున్నానని ఆకాశం ఉడుక్కుంది కాబోలు.. ఉన్నట్టుండి దూరంగా చర్రున చిరుకోపంగా మెరిసిందో ఎర్రటి మెరుపు. క్షణం ఆగి మెరుపు వెనకాలే ఢమఢమా అని గట్టిగా ఉరిమింది. అబ్బో.. అయితే ఈ వానకి అలక నా మీదేనా అనుకునేసరికి నవ్వొచ్చింది.
సరే.. పంతం ఎవరి మీదైతేనేం గానీ ఈ సారి బాగా గట్టి పట్టే పట్టినట్టుంది చూడబోతే.. అందుకే ఇన్ని రోజులైనా ముసురు విడవడం లేదు. ఎవరో వెనకుండి తరుముతూ హడావుడి పెడుతున్నట్టు కాసేపు జలజలా కురవడం, మళ్ళీ తన దోసిట్లో నీళ్ళన్నీ నిండుకున్నాయేమోనన్నట్టు కాసేపు నెమ్మదించడం.. మళ్ళీ విజృంభించడం, కాసేపు శాంతించడం.. ఊ.. బానే ఉన్నాయి ఈ తుంటరి వాన ఆటలు.. తీరిగ్గా దానితో పాటు కూర్చుని నా కలవరింపులు..


అసలూ.. ఇలా వర్షాన్ని చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటికి పరిగెత్తి కాళ్ళకి చెప్పులు లేకుండా వానలో నడవాలనిపిస్తోంది.
కాళ్ళ కింద తడిసిన మట్టి మెత్తగా జారుతుంటే, మరింత గట్టిగా అదిమి పట్టి అడుగులేస్తూ, మధ్య మధ్యన అరికాళ్ళలో సనసన్నగా గిలిగింతలు పెట్టే చిన్న చిన్న రాళ్ళ పలుకుల అల్లరి స్పర్శని అనుభూతిస్తూ, పచ్చటి పాదాలకి గోరింటాకు పండినట్టు ఎర్రటి గుమ్మట్టి బురద అంటుకుపోయేలా గంతులేస్తూ వాన నీళ్ళల్లో ఆడీ ఆడీ, ఇంట్లో నుంచి అమ్మ బెదిరింపుతో కూడిన పిలుపు వినపడేసరికి అయిష్టంగానే వాననొదిలి బుద్ధిగా ఇంట్లోకొచ్చి తల తుడుచుకుని తడి బట్టలు మార్చుకునీ, అప్పటి దాకా అంత వానలోనూ తెలియని చలిని అప్పుడే కొత్తగా గుర్తిస్తూ సన్నగా వణుకుతూ, రెండు కాళ్ళూ దగ్గరగా ముడుచుకుని మోకాళ్ళని గట్టిగా పొట్టలోకి లాక్కుని కాళ్ళ చుట్టూ రెండు చేతులూ వెచ్చగా చుట్టేసి, మోకాళ్ళ మీద గడ్డం పెట్టుక్కూర్చుని, వసారాలో నుంచి ఇంటిపై కప్పిన పెంకుల మీద నుంచి కిందకి జారే వాన నీటి ధారల్ని చూస్తూ, వంట గదిలో నుంచి వస్తోన్న అన్నం ఉడుకుతున్న వాసనకి అప్పటికప్పుడు ఆకలి గుర్తొచ్చి అన్నం కావాలని మారాం చేస్తూ, అప్పటి దాకా వాన నీళ్ళల్లో నానీ నానీ పాదాల మీద ఏర్పడిన చర్మపు ముడతల్ని చిత్రంగా చూసుకుంటూ చూపుడు వేలితో తడుముతూ అలా ఎందుకయ్యిందంటూ అమ్మతో ఆరాలు తీస్తూ, అప్పుడే పొయ్యి మీద నుంచి దించిన పొగలు కక్కుతున్న వేడి వేడి అన్నంలో పప్పుతో పాటు అమృతం కలిపి పెడుతున్న అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ....... ఆహహా.. స్వర్గం అంటే అచ్చంగా అదే కదూ! నిజంగా ఆ చిన్నప్పటి రోజులు ఎంతందమైనవో!


హ్మ్మ్.. ఇప్పుడు బయటికెళ్ళి తడిచే ధైర్యం చెయ్యలేకపోతున్నా.. ఏం చెయ్యనూ.. వానతో పాటు చల్లగాలి కూడా కమ్మేస్తోంది మరి! మరీ ఇన్ని రోజులు ముసురు పట్టడం వల్లేమో వానలో అదే పనిగా తడిచిపోయి ఉన్న చెట్టూ పుట్టా కూడా చలికి వణుకుతున్నట్టు కనిపిస్తున్నాయి నా కళ్ళకి. అస్సలు గుమ్మం దాటి అడుగు బయటకి పెట్టాలనిపించట్లేదు. ఎంతసేపూ ఇలా కిటికీకి అతుక్కుపోయి అలా వానని చూస్తూ కూర్చోడమే బాగుంది.
ఇంటి ముందున్న పచ్చని చెట్టు కింద నేల కాస్త లోపలికి కుంగిపోయి చిన్న గుంటలా ఏర్పడింది. దాన్నిండా వాన నీళ్ళు నిండాయి. చెట్టు మీద చిక్కగా అలుముకున్న ఆకుపచ్చటి నక్షత్రాల్లాంటి ఆకుల మీద నుంచి వాన చినుకులు మెల్లమెల్లగా ఒక్కోటీ కిందకి జారిపడుతున్నాయి. ఒక్కో చినుకూ పడ్డప్పుడల్లా ఏదో మ్యాజిక్ చేసినట్టు ఎక్కడి నుంచో ప్రత్యక్షమైపోయి దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతున్న అలల తరంగాల వలయాలు అలా అలా మధ్యలో మొదలై క్రమంగా పెద్దవవుతూ అంచులదాకా వెళ్ళి చటుక్కున మళ్ళీ ఎక్కడికో మాయమైపోతున్నాయి. ఈ లోపు మళ్ళీ ఇంకో చినుకు.. మళ్ళీ ఇంకోటి.. భలే ఉందీ ఆట! ఈ చినుకుల ఆటకి తాళం వేస్తున్నట్టు పైన పెంకుల మీద నుంచి కిందకి పడుతోన్న వాన నీళ్ళు నేల మీదున్న గులకరాళ్ళ మీద పడి చిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి.


ఎవరో పిల్లలు వీధిలో వెళ్తూ కనిపించారు. రైన్ ఈజ్ కమింగ్ అనకూడదు, ఇట్స్ రైనింగ్ అనాలని చిన్నప్పుడు బళ్ళో చెప్పిన పాఠం గుర్తొచ్చింది.
వానొచ్చినప్పుడల్లా సాయంత్రం బడి నుంచి ఇంటికొచ్చే దారిలో వానపాములతో పాటు, బోల్డన్ని వానకోకులు కనిపించేవి. మనం వానకోకు అంటాం గానీ దాని అసలు పేరు వానకోయిల తెల్సా.. అని బళ్ళో ఎవరో స్నేహితులు చెప్పిన గుర్తు. ఇంతకీ వానకోకులంటే ఒక రకం పాములు. పసుప్పచ్చగా ఉంది నల్ల చుక్కలుంటాయి. అది కరిచే పాము కాదనీ, భయపడక్కర్లేదని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. వర్షం వచ్చినప్పుడు తెగ కనిపించేవి ఈ వానకోకులు. వానకి కప్పలు కూడా బయట పడేవేమో, కొన్ని సార్లు కప్పల్ని మింగుతూనో, అప్పుడే మింగేసో కూడా కనపడేవి. అమ్మోయ్.. ఈ మాట చెప్తుంటేనే నాకు భయమేస్తోంది. కరిచేవో కరవనివో తర్వాత సంగతి గానీ అసలీ పాము అన్న పదం వింటేనే చచ్చే భయం నాకు. అనవసరంగా ఇప్పుడిది గుర్తొచ్చింది. :(
పోనీ.. ఈ భయం పోడానికి కాసేపు అర్జునా.. అర్జునా.. అనుకోనా? చిన్నప్పుడు వానొచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద ఉరుములూ, మెరుపులూ, పిడుగులూ శబ్దాలు వినిపిస్తుంటే అమ్మమ్మ చెప్పేది.. "అర్జునా అర్జునా.." అనుకుంటే అస్సలేం కాదు మనకి అని. అర్జునుడు ఏ దేవలోకంలోనో దుష్టశిక్షణ నిమిత్తం యుద్ధం చేస్తుంటే ఆ అర్జున బాణాల ధాటికి ప్రకృతి కంపించి ఇలా ఉరుములూ, పిడుగులూ వస్తాయట. అందుకని మనకి భయమేస్తోందని "అర్జునా.. ఫల్గుణా.." అని వేడుకుంటే కాస్త నెమ్మదిస్తాడన్నమాట అర్జునుడు. భలే ఉంది కదూ కథ! కథే అయినా సరే చిన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండేదో అలా అనుకోవడం. నేనూ, తమ్ముడైతే మరీనూ.. ఈ ఉరుముల శబ్దాల మధ్య మా పిలుపులు ఎక్కడో వేరే లోకంలో ఉన్న అర్జునుడికి వినిపిస్తాయో లేదోనని బాగా ఘాట్టిగా కేకలు వేసేవాళ్ళం అర్జునా అర్జునా అని. :)


హుమ్మ్.. ఇదేం పాడు వానో గానీ అటు తిరిగీ ఇటు తిరిగీ మళ్ళీ మళ్ళీ చిన్నతనంలోకే లాక్కెళుతుంది. జ్ఞాపకాల వానలోంచి కాస్త తెప్పరిల్లి ఈ లోకంలోకి వచ్చి చూస్తే ఎదురుగా కిటికీ అద్దమంతా చిందర వందరగా పరచుకున్న వాన చినుకులు..
కిటికీ అద్దం మీద పడిన చినుకుల మూలంగా అద్దం మసక మసగ్గా అయిపోయింది. ఏడుస్తున్నప్పుడు కూడా అచ్చం ఇంతే కదా.. చుట్టూ ప్రపంచం అంతా మసకబారిపోతుంది. ఏడుపుకీ వర్షానికీ చాలానే పోలికలుంటాయేమో! వాన వెలిసాక ఆకాశం తేటపడినట్టు, ఒకోసారి కళ్ళు వర్షించాక మనసు తేలికపడుతుంది. వాన గురించి ఆ మధ్యెప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తొస్తున్నాయి..

వానెంత పిచ్చిదీ..
నా వేదనని తన కన్నుల్లో కరిగిస్తోంది!
వానెంత మంచిదీ..
నన్నూ, నా కన్నీళ్ళనీ తనలో కలిపేసుకుంటోంది!


29 comments:

Narayanaswamy S. said...

మేఘాలకి, ఉరుములకి, పిడుగులకి అధిపతి ఇంద్రుడు. అర్జునుడు ఇంద్రుడి కొడుకు .. అలా కొడుకుని స్మరించడం ద్వారా తండ్రిని శాంతింపచెయ్యాలని ప్లాను.

బులుసు సుబ్రహ్మణ్యం said...

అన్ని కాలాల్లోనూ వానా కాలం నాకు కూడా ఇష్టం. బద్ధకంగా కుర్చీలో కూర్చుని, ఎవరైనా దయతలచి ఒక కేజీ పకోడీలు పెడితే తింటూ వానలోకి చూడడం చాలా ఆనందం గా ఉంటుంది. ఉన్నట్టుండి పెరిగిన వర్షంలో అటూ ఇటూ పరిగెత్తే జనాలని చూడడం ఇంకా ఇష్టం.

అన్నట్టు అభినందనలు. ఈ ఏడు వర్షాకాలం గురించి మీదే మొదటి పోస్ట్...........దహా.

tree said...

vana tho mee anubhavalu bhagunnai andi, kavitha poorthi cheyyalsindi.

Anonymous said...

పల్లెటూరివాళ్ళం మాత్రమే మొదటి జల్లుల సుగంధాన్ని పీల్చి, నేల తల్లి నీటిని తాగే ఆతృతను చూసే అదృష్టాన్ని కలిగిఉన్నాం. మంచి టపా.

Pantula gopala krishna rao said...

మాకిక్కడ హైదరాబాదులో ఎండలు మండి పోతుంటే మీరు ఎడతెగని వాన గురించి చెబుతుంటే మాకెలాగుంటుందనుకున్నారు? వానకోకులన్న పదం నేనెప్పుడూ విన లేదు. నేను ఉత్తరాంధ్ర వాణ్ణి. మా వైపు బరద పాములంటారు.అవి ఇవే నేమో?

సి.ఉమాదేవి said...

ఆరుబయట వానకురుస్తుంటే చూస్తూ మైమరవడం ఓ అనుభూతి.అయితే మీరు రాసిన వాన వాన వల్లప్పా వాన కబుర్లనెన్నిటినో దృశ్యీకరించి చూపింది.మనసున వెండి చినుకులు కురిసాయి.

Anonymous said...

अर्जुना फालगुना पार्था किरीटी श्वेतावाहना
भीभात्सुर्विजय सव्यसाची धनुन्जय

హరే కృష్ణ said...

వానా వానా వల్లప్పా...
చేతులు చాచు చెల్లప్పా ,
తిరుగూ తిరుగూ తిమ్మప్పా,
తిరగలేను నరసప్పా
ఈ హర్ష ఎక్కడప్పా (రాయలసీమ మాండలికం ?)


ఆకుపచ్చని నక్షత్రం -పదప్రయోగము బావుంది
ఆల్ప్స్ మీ సిటీ ని ఓదార్చిన విధానం యోహావా జీసస్ లా సూపర్ గా ఉంది.

జలతారువెన్నెల said...

:)) బాగుంది

జ్యోతిర్మయి said...

వర్షం గురించి మీ శైలిలో అందంగా రాశారు. నాకు ఫోటోలు కూడా పిచ్చిపిచ్చిగా నచ్చేశాయి. మెరుపును ఫోటో తీయడానికి మూడు గంటలు వేచిచూశాము ప్చ్..అది కరుణించలేదు.

చిన్ని said...

"ఇదేం పాడు వానో గానీ అటు తిరిగీ ఇటు తిరిగీ మళ్ళీ మళ్ళీ చిన్నతనంలోకే లాక్కెళుతుం"దిtrue.చాలా బాగుందండీ మీ వాన టపా !

కమనీయం said...

మీరెలాగూ వాన గురించి వర్ణించారు (వచనంలో)కాబట్టి ,నా కావ్యంలో ఒక కవితను ఇక్కడ ఉటంకించుతున్నాను.అంతే కాదు నిన్ననే మావూళ్ళో పెద్ద వర్షం పడింది కూడా.
వాన
------ వేసవి దినమున -వేకువ జామున
వీచినదొక శీతల పవనం
వాతాయనముల వడి వడి దాకుచు
మేల్కొని చూడగ మేఘావృతమై
మింటనొక మెరపు మెరసెను
తరులన్నియు తలల నటు నిటు నూపుచు
దయ్యములట్టుల నూగాడెను
పవనోద్ధతి పరిపరివిధముల - క్రమముగ హెచ్చాయెను.
ఉరుములు మెరుపులు ఫెళఫెళార్భటుల
మిన్ను విరిగెనేమొ యనిపించెను
తుంటరిగా నొక వానజల్లు -దూరివచ్చి తడిపె మేను
కొండపోత వలె కురిసె నిక ఘడియ
కుమిలి కుమిలి యేడ్చె వర్షామేఘం
తెరపి యిచ్చి మరల తెరలు తెరలు కురిసె (మిగతా మరొక సారి)

శ్రీ said...

మధురవాణి గారూ!
చిన్నప్పటి వానాకాలాన్ని ఒక్కసారి flashback లోకి వెళ్లి తొంగి చూసినట్లుంది...
మీ ఆర్టికల్ చదివాక తొలకరిజల్లులో తడిసిన మట్టి వాసన పీలుస్తూ,
వర్షంలో తడిసినంత హాయిగా ఉందండీ!
@శ్రీ

సాయి said...

చాలా బాగుంది అండి...

sunita said...

maaku ninna saayantram ikkaDa vaanapaDindi.nuvvu ikkaDa vaana choopinchaesaavu:))

కమనీయం said...

నిన్నటి గేయం తరువాతభాగం.
---------------------
జలజల ముత్యాలు జాలువార్చె నొకపరి
జగతి ముదమొదవ జనులు పులకింప
బాలికల క్రీడలా -జవనాశ్వ ప్లుతములా
ఝరీపాత నిర్ఘోషలా -శక్రవజ్రధారలా
సాయంతనముదాక,- స్వైరవిహారము చేసె
ఇంద్రచాపము తోచె-సాంద్రజలదము తొలగె
లోకమంతయు స్నానమాడినట్లుండెను
తరులతాగ్రములు మెరసె మిలమిలగ

meraj fathima said...

vaanogaaroo, mee post chaalaa bagundi

meraj fathima said...

మధురవాణి గారు , వర్షాన్ని చాలా విదాలుగా చూపించారు . బాగుంది.

Anonymous said...

అక్కడ నా బ్లాగులో మీ వ్యాఖ్యకి జవాబిచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే మీరూ వాన కురిపించేశారుగా... :)

మాలతి said...

భలే ఉన్నాయండీ బొమ్మలు. నేనలా తియ్యడానికి ఎంత గిజగిజలాడిపోతున్నానో ... మ్. కథనం కూడా చాలా బావుంది. అభినందనలు.

శేఖర్ (Sekhar) said...

అద్బుతం గా ఉంది చడువ్ తుంటే.......సూపర్ టపా
:))

మధురవాణి said...

@ Narayanaswamy S.,
ఓహో.. అదా లాజిక్కు.. భలే ఉందే! :)

@ బులుసు సుబ్రహ్మణ్యం,
ధన్యవాదాలండీ.. నాక్కూడా వానాకాలం చాలా ఇష్టం. కానీ, మీరు చెప్పినట్టు అలా బద్ధకంగా ఇంట్లో కూర్చునే వీలున్నప్పుడే బాగుంటుంది. అదీ ఆ వానలో పది పొద్దున్నే ఆఫెసుకి పరిగెత్తాలంటే మాత్రం హబ్బా.. అని నీరసమొచ్చేస్తుంది. :(
ఓహో.. వర్షం గురించి నేనే ముందు రాసానా.. మాకు వరసగా రెండు వారాలు వర్షం పడేసరికి రాయాల్సొచ్చింది.. ;)

@ tree,
ధన్యవాదాలండీ.. అప్పుడెందుకో ఆ రెండు ముక్కలు రాసానండీ.. తర్వాత ఇంకేం రాయాలనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు వానొస్తుంటే అది గుర్తొచ్చింది ఎందుకో.. :)

@ కష్టేఫలే,
అదృష్టవంతులు శర్మ గారూ.. ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ Pantula gopala krishna rao,
ధన్యవాదాలు. అయితే నేనీ పోస్టు రాసే టైముకి మీకు వర్షాల్లేవాండీ? ఇప్పుడైనా కురుస్తున్నాయని ఆశిస్తున్నా.. :))
బురద పాములంటే మట్టిలో కూరుకుపోయి మొద్దుగా మందమతుల్లా ఉన్నవాటిని అంటారేమో కదూ! నేను చెప్పినవి మాత్రం వానాకాలంలోనే కనిపిస్తుంటాయండి. చాలా చురుగ్గా సరసరా పాకేస్తుంటాయి. మాది అటు తెలంగాణాకి, ఇటు గోదావరికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ప్రాంతపు పదమో నాకు తెలీదు మరి. మా ఊర్లో అయితే అలానే అనేవాళ్ళం. నాకింకో పేరేం తెలీదండీ.. :(

@ సి.ఉమాదేవి,
మీ పలకరింపులు మాత్రం వేసంగి చినుకులంత ఆత్మీయంగా ఉంటాయండీ.. ధన్యవాదాలు. :)

@ అనానిమస్,
ఆర్జునుడిని ఇలా పిలవాలని చెప్తున్నారాండీ? ;)

@ హరేకృష్ణ,
థాంక్యూ.. చిన్నప్పుడు బాగా పాడుకునే వాళ్ళం ఇది.. :))
హర్ష ఎక్కడో యోగా ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉండి ఉంటాడులే.. :D
నిజంగా మా ఆఫీస్ ముందుండే ఒక చెట్టు ఆకులు ఆకుపచ్చని నక్షత్రాల్లా ఉంటాయి. చూసిన ప్రతీసారీ అనుకుంటూ ఉంటా.. లాస్ట్ లైన్ కి మాత్రం ఒక కెవ్వు.. :D

మధురవాణి said...

@ జలతారు వెన్నెల, సాయి,
ధన్యవాదాలండీ.. :)

@ జ్యోతిర్మయి, మాలతి,
ధన్యవాదాలు.. ఈ పోస్టులో వాడిన ఫోటోలు గూగుల్ నుంచి తీసుకున్నవేనండీ..
అందమైన వాన ఫోటోలు తియ్యడం కొంచెం కష్టమేననుకుంటాను. మెరుపుని పట్టుకోవడం మరీ కష్టమేమో!

@ చిన్ని,
అయితే వాన గురించి మీదీ అదే మాటా.. ధన్యవాదాలు.. :)

@ కమనీయం,
మీ వాన కవితని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. చాలా బాగుంది. అక్షరాల్లో అందమైన వర్షం కురిపించేసారు. :)

మధురవాణి said...

@ శ్రీ,
నా అక్షరాల జల్లు మీకంత చక్కటి అనుభూతి కలిగించినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు. :)

@ సునీత గారూ,
థాంక్యూ సో మచ్! :)

@ meraj fathima, శేఖర్,
ధన్యవాదాలండీ.. :)

@ puranapandaphani,
హహ్హహ్హా.. నిజమే కదూ.. వానా కాలం కదండీ.. ఎప్పుడు ఎక్కడ వాన పడుతుందో చెప్పలేం మరి! ;) ధన్యవాదాలు.

Ennela said...

Tapaa very very guddu.photolu suuparu guddu.abbabbabbaa..ippudu vaanalo thadavalani undi...pch..

Gopala krishana garu, aadaraabaadulo varsham raaledani baadhapadaddu, saanthinchandi. monna ammavari bonalu rangam roju, kaavalasinanni varshaalu padataayani chepparuta..

మధురవాణి said...

@ ఎన్నెల గారూ,
థాంక్యూ సో మచ్! టపా నచ్చినందుకు చాలా సంతోషం. ఫోటోల క్రెడిట్ మాత్రం నాది కాదు.. గూగుల్ నుంచి తీసుకున్నా.. :)
వానలో తడవాలనిపిస్తుందని అంత దిగాలుగా పెట్టారేంటి మొహం.. మీ ఊళ్ళో వానలు పడట్లేదా అసలు?

జాన్‌హైడ్ కనుమూరి said...

నేను ఈ మధ్య "వాన " సంకలనం చేద్దామని రాసినవారు పంపమని, రాయనివారు రాయమని కోరుతూ బ్లాగు టపా రాసాను

ఇంతకుముందు ఎవరైనా రాసారా అని వెదకాలనిపించి వెదకుతుంటే , మీ టపా కనిపించింది.

బాగుంది... బాగుంది

నా సంకలనంలోకి తీసుకుంటున్నాను

అభినందనలు

మధురవాణి said...

@ జాన్ హైడ్ కనుమూరి,
చాలా సంతోషమండీ.. అంత మంచి సంకలనంలో నా అక్షరాల చినుకులకి కూడా స్థానం కలిపిస్తున్నందుకు ధన్యవాదాలు. :)